మా జీవితాల్లో గూఢచర్యపు ప్రమేయం, నెం.5, నెం.10 వర్గాల ప్రభావము మేం గుర్తించుకోక ముందూ, గుర్తించుకున్నాక కూడా కొనసాగాయి, కొనసాగుతునాయి. కొన్ని వేల సంఘటనలని[అతిశయోక్తి కాదండి. నిజంగానే వేల సంఘటనలు] పరిశీలించుకున్న తర్వాత ఈ నిర్దారణకి వచ్చాము. జీవితంలో వేధింపులే కాదు మధుర జ్ఞాపకాలు కూడా కనపడ్డాయి.
ఓ సారి.... 1995 లో మేం శ్రీశైలంలో పాతాళగంగ మెట్ల దారిలో గుడిసెలో ఉండేవాళ్ళం. అప్పటికి నేను నిండు గర్భిణిని. అప్పటి వరకూ మాతో కాస్త బాగానే ఉండే ఇరుగుపొరుగు గుడిసెల వాళ్ళు కూడా, హఠాత్తుగా మొహం తిప్పుకోవటం మొదలు పెట్టారు. చెప్పుకునేంత కారణాలు కూడా ఏం లేవు. అయినా ముభావంగా, అంటీ ముట్టనట్లుగా ఉండటం మొదలు పెట్టారు. బహుశః త్వరలో మాకు తమ అవసరం వస్తుంది ఎందుకొచ్చింది? అనుకున్నారేమో!
అప్పటికి గ్రామసేవిక.... నాకు, గర్భస్త శిశువుకి, ఇవ్వాల్సిన ఇంజక్షన్లు ఇస్తూ ఉండేది. ఆమె, ఇంకా వారానికి గాని కాన్పు రాదన్నది. అప్పట్లో ప్రతిరోజూ గుడికి వెళ్ళేవాళ్ళం. రాత్రి 9.30 గంటల తర్వాత మల్లయ్య స్వామి ఉచిత దర్శనం చేసుకునేవాళ్ళం. నిజానికి స్థానికులని ఎవరూ ఆపరు. కాని ఆపుతారేమోనని భయం కొద్దీ టిక్కెట్టు దర్శన వేళలో వెళ్ళేవాళ్ళం కాదు. [ఇప్పుడు ఏ వేళయినా ఉచితదర్శనమే!] ప్రతీరోజూ రత్నగర్భ గణపతి ముందు "నాకు పాపే కావాలి స్వామి. విద్యల ఒజ్జవు, సద్బుద్ది గల చక్కని పాపనివ్వు" అని మొక్కుకునే దాన్ని.
అప్పటికి కాన్పు సమయానికి ’ఎవ్వరు సాయం రాబోము’ అన్న సంకేతాలిస్తున్నారని అర్ధమైపోయింది. అందుకు మానసికంగా వారంక్రితమే సిద్దపడి పోయాము. మా దగ్గర స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకున్న [ఆర్.ఎం.పి. డాక్టరు] మా విద్యార్ధి ఒకరి దగ్గరి నుండి ’Where there is no Doctor' అనే పుస్తకం తెచ్చుకుని చదువుకున్నాము.
మా ఇంట్లో నా చిన్నప్పటి నుండి ఆవులూ, గేదేలూ ఉండేవి. నేను ఆవుపాలతో పెరిగాను. మా నల్లమ్మ[ఆవు] మా ఇంట 21 ఈతలు ఈని పాతికేళ్ళపాటు మమ్మల్ని సాకింది. ఆమె [అలా అనటమే అలవాటు], ఆమె దూడలు ఈనినప్పుడల్లా.... మా నాన్న, పుట్టిన బుజ్జాయికి, తల్లి ఆవుకి సపర్యలు చేసేవాడు. అప్పుడు మా నాన్నకు నేను, కావలసిన వస్తువులు అందిస్తూ సహాయం చేసేదాన్ని. ఆ అనుభవంతో మా వారికి కాన్పు ఎలా జరుగుతుందో, బొడ్డు కోయటం ప్రక్రియల గురించి వివరణ ఇచ్చాను. ఆ పైన ’డాక్టరు లేని చోట’ అన్నపుస్తకం చదివి మరింత అవగాహన తెచ్చుకున్నాము. కొత్త బ్లేడు ఒకటి కొని తెచ్చుకున్నాము. శ్రీశైలానికి ప్రక్కనే 9 కిలోమీటర్ల దూరంలో సున్నిపెంటలో ప్రాజెక్ట్ ఆసుపత్రి ఉంది. కానీ ఆసుపత్రికి వెళ్ళెందుకు మా దగ్గర డబ్బుల్లేవు.
మా గుడిసెకు ఎదురుగా, టీకొట్టు నడిపే ఆమె మంత్రసాని పని కూడా చేసేది. మా ప్రక్క గుడిసెలో ఉండే మహిళకి అంతకు అయిదారు నెలల క్రితమే పురుడు కూడా పోసింది. అయితే నాకు కాన్పు సమయం దగ్గర పడే సరికి, సదరు మంత్రసాని కూడా, అప్పటి వరకూ మాతో కాస్త బాగానే మాట్లాడేది కూడా ముభావంగా ఉండేది. ఇక మేము మల్లయ్య, భ్రమరాంబల మీదే భారం వేసాము. ఆ రోజు రాత్రి కూడా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము.
అర్ధరాత్రి ఒంటిగంట దాటాక నాకు ప్రసవ నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామ సేవిక, కాన్పుకి ఇంకా వారం సమయం ఉంటుందన్నది గనుక నేను వాటిని కాన్పు నొప్పులుగా అనుకోలేదు. కాస్సేపటికి ఓర్చుకోలేక, మా వారిని ఎదురు గుడిసెలోని మంత్రసానిని లేపమని చెప్పాను. వెళ్ళి లేపితే ఆమె వచ్చి నన్ను Assist చేసింది. ఎలాగో తెల్లవారింది. అప్పటికి ఉన్న పరిస్థితులన్నీ హఠాత్తుగా మారిపోయాయి. సాయం చెయ్యడానికి చాలామంది ముందుకొచ్చారు. మా పూర్వవిద్యార్ధి వెళ్ళి జీపు తెచ్చాడు. చుట్టుప్రక్కల వాళ్ళ పరిస్థితులలో పెద్ద తేడా లేదు కాని ఒకరు మాత్రం సాయం చేసారు. ఆసుపత్రికి వెళ్తే అక్కడ డాక్టరు, నర్సులూ అందరూ ఎంతో ఆదరంగా చూశారు.
మేము ఆసుపత్రికి వెళ్ళే సమయానికి, మా వారి జేబులో 12/- రూ. ఉన్నాయి. మా పాప పుట్టిన గంటకి తన జేబులో 1200/- రూపాయలున్నాయి. మా విద్యార్ధుల తల్లిదండ్రుల్లో కొందరు, ఎదురింటి మంత్రసాని.... ఇలా, మా వారి జేబులో "ఉంచండి సార్!" అంటూ డబ్బు పెట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట నుండి ప్రసవ వేదన భరించిన నేను, మర్నాటి మధ్యాహ్నం 2 గంటల తర్వాత, నా కళ్ళ ముందుకొచ్చిన నా పసిపాపని చూసుకుని అన్నీ మరిచిపోయాను. అది ఎప్పటికీ నా జీవితంలో మరిచిపోలేని రోజు! నా సంతోషాన్ని, సంతృప్తిని మాటల్లో చెప్పలేను కూడా!
తలపై నల్లని టోపీ పెట్టినట్లు ఒత్తైన జుట్టుతో, తెరచిన గుప్పిళ్ళతో మా కోసం అంతులేని ఆనందాన్ని తెచ్చిందా అన్నట్లు పువ్వులాంటి నా పాప! అసలుకే పాపే కావాలి అని దేవుణ్ణి పదే పదే కోరుకున్నాను. రకరకాల బొట్లు, కాటుక దిద్దుకొని, రకరకాల జడలల్లుకుని అలంకరించుకోవచ్చునని నాకు పాపలంటే ఇష్టం! "అబ్బాయేముంది! ఎంత అల్లరి బుడుగులాంటి భడవైనా, ఇంత పౌడర్ ముఖాన వేసి, ప్రక్కపాపటితో క్రాపు దువ్వి, ఓ చొక్కా లాగు తగిలించి ’ఇక పోరా’ అంటే పోతాడు. పాపలకైతే అలాకాదు గదా?" అనుకునేదాన్ని. నాకు పాపలంటే ఇష్టమని నా శిష్యురాలొకామె, కొత్త సంవత్సరానికి, ముద్దుగా బొద్దుగా ఉన్న పాపాయి ఫోటోతో ఉన్న గ్రీటింగ్ కార్డు ఇచ్చింది. అది చూసుకుంటూ పాపే కావాలి అని కలలు కనేదాన్ని.
మా పాప పుట్టిన రోజు నాడైతే.... నర్సుని "సిస్టర్! పాపా బాబా?" అని అడిగాను. "బాబు" అంది. ఒక్క క్షణం నిరాశ అన్పించింది. నర్సు నవ్వుతూ "కాదమ్మా పాపే!" అంది. నా కంటే ముందుగా మా పాపని మా వారే చూశారు, ఎత్తుకున్నారు.
ఆసుపత్రిలో మాకు ఎవరూ లేరని, డాక్టర్లు నర్సులూ సిబ్బంది చాలా ఆదరంగా చూశారు. అక్కడి ఆయా పాపని ఎలా ఎత్తుకోవాలో, స్నానం ఎలా చేయించాలో డెమో చూపించి నేర్పించింది. మమ్మల్ని డబ్బులు ఇమ్మని కూడా ఎవరూ అడగలేదు, ఒకామె తప్ప! కాన్పుల వార్డులో సాధారణంగా మగ వారిని allow చేయరు. అలాంటిది నాకు Assist చేయడానికి మా వారిని అనుమతించారు. ఆ సమయంలో మా వారే నాకు అన్నీ అమ్మలాగా చేశారు. మా పాప తెల్లగా పువ్వులా ముద్దుగా ఉండటాన్ని మేము చాలా ఆనందించాము.
మేము ఆసుపత్రిలో ఉండగా పరిచయమైన కుటుంబం ఖాసిం కుటుంబం. మేము ఆసుపత్రిలో ఉండగానే మా గురించి ఎవరో చెప్పారని, అటవీశాఖలో Non Government Organisation క్రింద పనిచేసే వనసంరక్షణ సమితిలో మా ఇద్దరికీ ఉద్యోగం వచ్చింది. జీతంతో పాటు వసతి సౌకర్యం కూడా ఉంది. ఆసుపత్రిలో ఉండగానే ఉద్యోగం రావటంతో, అప్పటి దాకా ఎన్నో సమస్యలతో ఉన్న మేము చాలా ఆనందించాము. జీతంలో సగం అడ్వాన్సు కూడా ఇవ్వబడింది. దాంతో ఏ ఇబ్బందీ లేకుండా మా పాప పుట్టిన 21 వ రోజు బారసాల జరుపు కున్నాము. మా గుడిసె వెనక వెదురుతో గుండ్రని పర్ణకుటీరం లా ఉండేది. ఎత్తుగా మట్టిపోసి మా వారు సిద్దం చేశారు. మా పాప పుట్టే నాటికి సిద్దం కావాలని, అడవిలో లోతట్టుకెళ్ళి లేత వెదురు బొంగులు తెచ్చి కట్టుకున్నాము. దానికి పైకప్పు ఉండేది కాదు. నేరేడు చెట్టు గుబురు కప్పులాగా నిండి ఉండేది.
మేం చీర ఊయలకి సెటిల్ అయ్యాము. కాని మా విద్యార్ధుల తల్లిదండ్రులు, తమకి తెలిసిన వాళ్ళ దగ్గర స్టాండ్ ఊయల ఉందని చెప్పి, మా విద్యార్ధి ద్వారా మా ఇంటికి పంపారు. దాన్ని అలంకరించి, అందులో మా పాప బారసాల నిర్వహించుకున్నాము. ఆమె పుట్టడానికి ముందే ’ఫణి గీతా ప్రియదర్శిని’ అన్నపేరు నిర్ణయించుకున్నాము. ఆ పేరే పెట్టుకున్నాము. అప్పటికే, మా గుడిసె గోడకి బయటవైపు ఉన్న కన్నంలో పెద్దపాము ఉండేది. దాదాపు ఆరడుల పాము. చాలా భయం వేసేది. చంపుదామా అంటే అందరూ ’అదెప్పుడో మేమక్కడికి రాకముందు నుండీ ఉండేదని, మధ్యలో ఎక్కడికో పోయి మళ్ళీ వచ్చి చేరిందనీ’ అన్నారు. నేను బట్టలు ఉతికి ఆరవేస్తుంటే అది కన్నంలోంచి తలబయటికి పెట్టి చూస్తూ ఉండేది. భయం భయంగా తిరిగే దాన్ని. మెల్లిగా అలవాటు పడిపోయాము. అందుకని మా పాప పేరులో నాగేంద్రుడి పేరు రావాలనుకున్నాము.
అంతేగాక, ఆమె నా బొజ్జలో ఉన్నప్పుడు - ఓ బుల్లి ఉడత పిల్లను పెంచుకునే దాన్ని. ఈదురుగాలికి గూట్లో నుండి పడిపోయిన చిన్నిది. పిల్లలకి దొరికితే నేను తీసుకుని పెంచుకున్నాను. అది మాకు దొరికినప్పుడు ఎంత చిన్నదంటే... చూపుడు వేలంత కూడా ఉండేది కాదు. కప్పుతో పాలు తాగడం వచ్చేది కాదు. దూదిని తల్లిరొమ్ములా చేసి, పాలతో తడిపి, చెంచా చివరన పెట్టి, చెంచాతో పాలు చుక్కల్లాగా పడేటట్లు చేసి, దాని నోట్లో పెట్టేదాన్ని. క్రమంగా కప్పులో పాలు తాగేంత పెద్దదయ్యింది. చిన్న వెదురు బుట్టలో పెట్టుకుని గుడికి వెళ్తున్నా తీసుకెళ్ళేదాన్ని. ’పప్పు’ అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళం.
మా పాప పుట్టడానికి నెలన్నర ముందు.... ఓ రోజు వేసవి కావటంతో మా గుడిసె ముందు ఆరుబయట నిద్రపోయాము. రాత్రి నిద్రలో ఉండగా, నా జుట్టులో ఏదో కదులుతున్నట్లనిపించి మెలకువ వచ్చింది. నా ఉడుత పెల్లేమో అనుకొని "అరే పప్పు!" అంటూ చేత్తో తీసాను. చూద్దును గదా! నా చేతుల్లో మూరెడు పొడవున్న పాము! గభాలున దూరం విసిరి మా వారిని లేపాను. మేమున్నదే అడవి. పాములు రాక ఏముంటుంది? అనుకొని మళ్ళీ పడుకున్నాము.
ఈ రెండు అనుభవాలతో మా పాపకి నాగేంద్ర స్వామి పేరు పెట్టుకోవాలని మొక్కుకున్నాము. గీత మా ఊపిరి అయినందున ’గీత’ అన్న నామధేయం తప్పని సరి! నాకు ఇందిరాగాంధీ అంటే అభిమానం. నా పాప ఆమె అంతటి గొప్ప వ్యక్తి కావాలి అనుకొని, మొత్తంగా ’ఫణి గీతా ప్రియదర్శిని’ అన్న పేరు నిర్థారించుకున్నాము.
బారసాలకి శ్రీశైలంలో మా విద్యార్ధులనీ, వారి తల్లిదండ్రులని పిలుచుకొని, ఓ 50 మంది Gathering తో ఎంతో సంతోషంగా జరుపుకున్నాము. అందరూ మమ్మల్ని ఎంతో ప్రేమగా, అభిమానంగా ఆదరించారు. నిజానికి ఇప్పటికీ మాకు శ్రీశైలంలోనే పరిచయస్థులు గానీ, మిత్రులు గానీ, ఆత్మీయులు గానీ ఎక్కువ. ఇంతగా మాకు ఎక్కడా ఎవరితోనూ పెద్దగా terms ఉండవు.
మా పాప బారసాల అయిపోయాక, నెల తిరిగే లోపలే ఎలా వచ్చిన ఉద్యోగం అలాగే ఊడింది. ఈ లోపున మాత్రం మన్ననూరు, బైర్లూటి వంటి ప్రాంతాలలో లోతుగా గిరిజనుల జీవన సరళి, ఆలోచనా సరళిని పరిశీలించాము. అటవీ శాఖలో అవినీతినీ, వాళ్ళ మీటింగులోనూ, చెక్ పోస్టుల్లోనూ, ఉద్యోగుల అంతర్గత సంభాషణల్లోనూ పరిశీలించి ఖంగు తిన్నాము; అది వేరే సంగతి. దీని గురించి గతటపాలలోనూ వ్రాసాను.
ఒక్క మా పాప బారసాలే కాదు, 2005 ప్రారంభంలో, మా పాపకు ఓణీలు వేసే ఉత్సవం సందర్భంలోనూ శ్రీశైలంలో స్కూలు నడుపుతున్నాము. నా ఆకాంక్షలకు అనుగుణంగా ఆమె ఫంక్షను గొప్పగా నిర్వహించుకున్నాము. మా విద్యార్ధుల తల్లిదండ్రులని[ఓ 200 మంది] పిలిచి, విస్తరేసి అన్నం పప్పూ, నాలుగు కూరలు నెయ్యి గట్రాలతో తెలుగు వారి భోజనం పెట్టాలనుకున్నాము. బఫేలంటూ నిలబడి ఆదరాబాదరా తినటం, తినమనటం మాకు నచ్చదు. అడిగి వడ్డిస్తూ, అందరినీ పలకరిస్తూ ఇష్టంగా ఆ పండగ జరుపుకున్నాము. ఒకరిద్దరు తప్ప మేము పిలిచిన వాళ్లంతా వచ్చారు. వాళ్ళిచ్చిన కానుకల కంటే, అందరూ వచ్చి, తాముగా అన్నీపనుల్లో పాలుపంచుకొనటం! అదంతా మేమెంతో ఆనందించాము. ఒక్క శ్రీశైలంలో తప్ప మేము అలా ఎక్కడా నిర్వహించుకోలేమేమో!
అప్పుడే కాదు, మా పాప పుట్టాక కూడా.... 1995 లో మా పాప పుట్టాక మేము మళ్ళీ గుంటూరు వెళ్ళి పోయాము. అక్కడ ఫ్యాక్టరీ APSFC కి అప్పగించి, ఖాళీ చేసి, నంబూరులో, గుంటూరులో, ఉన్నప్పుడు.... దాదాపు మా పాపకి స్కూలు కెళ్ళే వయసు వచ్చే వరకూ, మా ఇద్దరిలో ఎవరో ఒకరం ఆమెని దగ్గరుండి చూసుకున్నాము. తన శైశవాన్ని తొలి రెండు మూడేళ్ళు నేను చాలా ఆస్వాదించాను. మాతృత్వం లోని మాధుర్యం నేను తనవి తీరా ఆనందించాను.
అప్పట్లో నంబూరులోని కమిటీ కాలేజీలో ఓ రెండుగంటలు, అదీ ఇంగ్లీషు చెప్పేదాన్ని. నా సబ్జెక్ట్ ఫిజిక్స్ అయినా వాళ్ళకి ఇంగ్లీషు లెక్చరర్ లేనందున నన్ను ఇంగ్లీషు చెప్పమన్నారు. ఉదయం సాయంత్రం ఇంట్లో ట్యూషన్లు చెప్పేదాన్ని. నాకు ఆదాయమే కాదు, నా బుడ్డి దానికి పిల్లలు ఇంటి నుండి బ్యాగుల్లో సున్నండలు, కారప్పూస లాంటివి తెచ్చి దానికి తినిపించేవాళ్ళు. ఆ విధంగా ఆమె పిల్లలతో కలిసి ఆడటమే గాక, వాళ్ళ ప్రేమని కూడా చవిచూసింది. అందుకే నేను ట్యూషన్లు చెప్పేదాన్ని. ఆ విధంగా తనకి ఎప్పుడూ ’ఒంటరిని’ అన్న పీలింగ్ రాలేదు/ రానివ్వలేదు.
మా వారు ప్రైవేటు కంపెనీలలో.... వాణిజ్యప్రకటనలకు రెప్ గా పనిచేసేవారు. నేనైతే మధ్యాహ్నం రెండుగంటలు కాలేజీకి వెళ్ళి వచ్చేంత సేపు తప్ప, రోజంతా మా పాపతో గడిపేదాన్ని. సాయంత్రం ఓ గంట జోలపాటల గానా బజానా! దోబూచి, దాక్కునే ఆట, కథలు! ఆమెతో రోజంతా ఆటలే! తనకి రెండున్నరేళ్ళ దాకా తల్లి పాలే పట్టాను. ఆమె బాల్యంలోని ప్రతి మూమెంట్ నీ, మధురమైన జ్ఞాపకంగా మిగిల్చుకున్నాము. చెబితే అదేపెద్ద గ్రంధం అయ్యేంతగా! ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డ అపురూపమే కదా!
ఇలా.... మా జీవితాలలో చేదుతో పాటుగా ఉన్న ఈ మాధుర్యాన్నంతా, 2005 ఆగస్టు, సెప్టెంబరులలో, రామోజీరావు ఉనికిని మా జీవితాలలో గుర్తించుకున్నాక, పునః పరిశీలించుకుని, పునరాలోచించుకున్నాము. 2005 అక్టోబరులో - ’1992 లో మేము పీవీజీకి, రామోజీరావు కార్యకలాపాల మీద ఇచ్చిన ఫిర్యాదు గురించీ, తదుపరి మాపై నడుస్తున్న వ్యవస్థీకృత వేధింపు గురించీ’ ప్రధాని మనోహన్ సింగ్ కి ఫిర్యాదు ఇచ్చాక అతడి స్పందన కోసం ఎదురుచూశాము. అలాంటి వేవీ రాకపోగా.... మా మీద ఒత్తిడి పెరగటం, నీళ్ళూ కరెంటు వేధింపులు పెరగటం గమనించాము. అప్పుడే శ్రీశైల దేవస్థానపు D.E.O ఫోనులో మమ్మల్ని హెచ్చరించాడు. అతడి వంటవాడే ఆ పేరుతో మమ్మల్ని బెదిరిస్తున్నాడనుకొని మేము పోలీసు కంప్లైంట్ ఇచ్చాము. ఆ వివరాలన్నీ మీరు మా కథలో చదివి ఉన్నారు.
ఇవన్నీ పరిశీలించుకు ఆలోచిస్తున్నప్పుడు మాకంతా అయోమయంగా అన్పించేది. మేము రామోజీరావు మీద 1992లో ఫిర్యాదు ఇచ్చినప్పటి నుండి మొదలైన విచిత్రాలు, మా జీవితాల్లో ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇచ్చిన నెలరోజుల లోపల, అప్పటికీ ఢిల్లీలోనే ఉన్న నన్ను కలవకుండా, ఫ్యాక్టరీకి వెళ్ళి నా తల్లిదండ్రులని ఐబీ అధికారులు కలవటంతో ప్రారంభమైన విచిత్రాలూ, వింతలూ! సాక్షాత్తూ ఫిర్యాదు ఇచ్చిన నేను, 2 KM ల దూరంలో ఉంటే, 2000 KM ల దూరంలో ఉన్న మా అమ్మానాన్నల దగ్గరికి ఎందుకు?
అప్పుడు ప్రారంభమైన ’ఆలోచన - పరిశోధన’.... అన్నీకోల్పోయి, అయిన వాళ్ళనీ కోల్పోయి.... ఒంటరినై.... తోడుగా నిలిచిన లెనిన్ ని వివాహం చేసుకుని జంటగా కష్టాలు ఎదుర్కొని.... చివరికి అన్నీ మరిచిపోదామని గట్టి నిర్ణయానికి వచ్చి.... 1995 నుండి అసలేమీ ఆలోచించకుండా గడిపి వేశాము. దేశంలో కాదు గదా చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకునే వాళ్ళం కాదు. మా బ్రతుకు - మా పాప -, మా కెరీర్ - భక్తి. అంతే! అదీ ఎంతగా దైవభక్తి అంటే.... చివరికి మా పాపకి చెప్పేవన్నీ దేవుడి కథలే! తన చిన్నప్పుడే రామాయణ భారత భాగవతాలన్నీ చెప్పేసాను. భట్టి విక్రమార్క కథలు... పంచతంత్రం కథలు .... మహాభక్తుల కథలు.... నాకు తెలిసిన అన్నీ! తిరుపతి కొండమెట్లు ఎక్కేలోపల దశావతారాల కథలూ పూర్తి చేసేదాన్ని. కనీసం పదివేల కథలు చెప్పి ఉంటాను తనకి.
తన చిన్నప్పుడు తనకి అమ్మమ్మ, తాతయ్య, మామయ్య ఎలా ఉంటారో తెలియదు కదా! అందుచేత అన్నం తినిపించేటప్పుడు "ఇది మల్లయ్య స్వామి ముద్ద. ఇది భ్రమరాంబ తల్లి ముద్ద. ఇది గోవిందుడి ముద్ద. రామయ్య తండ్రి.... సీతమ్మ తల్లి ముద్ద" ఇలా తినిపించేదాన్ని. పేచీ లేకుండా తినేసేది. ఇంకా నేను మరిచిపోతానేమోనని తనే " మీసాల సామి ముద్దా, రెక్కల సామి ముద్దా" అని అడిగి నోట పెట్టించుకునేది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆమె భాషలో మీసాల సామి. తిరుపతి మెట్ల దారి ప్రారంభంలోని గరుత్మతుని భారీ విగ్రహం తనకి చాలా ఇష్టం. అంచేత రెక్కల సామి ముద్ద ఇష్టమన్న మాట! ఎప్పుడైనా ఓ ముద్ద తక్కువ తింటే - "నీకు ఆంజనేయస్వామికీ, భీముడికీ ఉన్నంత బలం వద్దా?" అంటే చాలు, "ఆ ఆ" అంటూ నోరు తెరిచేది.
అంతగా భగవంతుడితో అనుబంధామూ, భక్తీ పెంచుకున్నాము. అందునా చుట్టపక్కాలూ లేరు. చుట్టుప్రక్కలా సాధారణ సంబంధాలే! దానితో అన్నీ దేవుడే!
పాప పెంపకం తాలూకూ ఏమయినా సమస్యలు వస్తే, ఈనాడు ’వసుంధర’లో పిల్లల పెంపకం తాలూకూ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు వచ్చేవి. సింగిల్ చైల్డ్ తాలూకూ సమస్యల గురించి హెచ్చరిస్తూ పరిష్కారాలు వస్తూండేవి. 2005 లో ఇవన్నీ ఆలోచిస్తూ, మేము గమనించి చూస్తే చాలా మంది సింగిల్ చైల్డ్ తాలూకూ సమస్యలతో బాధలు పడుతూ కనిపించారు/కనిపిస్తున్నారు. మరి అప్పుడు మమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
ఇవన్నీ తలచుకు ఆలోచిస్తున్నప్పుడు మాకు చాలా విషయాలు అర్ధమయ్యాయి. దానితో పాటు మరెన్నో సందేహాలూ తలెత్తాయి. ఒక విషయం ఆలోచించి అవగాహన చేసుకునే కొద్దీ మరిన్నీ సందేహాలు తలెత్తేవి. ఒక తలుపు తెరిస్తే తెరవాల్సిన తలుపులు మరో పది కనబడినట్లు! అప్పట్లో [2005] రోజంతా స్కూలులో పిల్లలకి చదువు చెప్పేవాళ్ళం! ఉదయం ఆరుగంటలకి మొదలయ్యే స్కూలు దినచర్య రాత్రి 7.30 కి పూర్తయ్యేది. ఇక అప్పటి నుండి అర్ధరాత్రి 12 గంటల దాకా ఒకటే ఆలోచన! తర్క వితర్కాలు చేసుకునేవాళ్ళం!
అప్పటి నుండి సంవత్సరాల గడిచే కొద్దీ, మెల్లిగా, మాకు మా జీవితాల్లో గూఢచర్యపు ప్రమేయం అర్ధమైంది. రామోజీరావు వర్గమే గాక, అతడి ప్రత్యర్ధి వర్గపూ ఉనికీ అనుభవానికి వచ్చింది. ఇద్దరు, గూఢచర్యం అనే చదరంగపు ఆటగాళ్ళ చేతిలోని ఆట కూడా అర్ధమైంది. ఆ రెండు వర్గాలకీ నెం.10, నెం.5 వర్గాలని పిలిచాము. వెనుదిరిగి చూస్తే మా జీవితాల్లో మేం ఎదుర్కున్న ప్రతి అనుభవానికి శృతి, లయ కనిపించాయి. అలాగే రాష్ట్ర, దేశ, ప్రపంచంలోని ఏ సమస్యకైనా ఒకే శృతి, లయ, ఒకేరకమైన స్ట్రాటజీలు కనిపించాయి. ఇప్పుడంటే, ఈనాడు పత్రిక, మరీ రాష్ట్రానికి కుదించుకుపోయింది గాని, ఆ రోజుల్లో ప్రపంచవార్తలు బాగానే వ్రాసేది.
మమ్మల్ని వేధిస్తూ వెంటబడుతున్న వర్గం మా ప్రాణాలెందుకు తీయటం లేదో, మా ప్రాణాలు తీయనీయకుండా అడ్డుకుంటున్న వర్గం మమ్మల్ని వేధింపు నుండి ఎందుకు రక్షించడం లేదో ఆర్ధమయ్యేది కాదు. వేధించటం కన్నా ప్రాణాలు తీయటం సులభం. తమ మీద ఫిర్యాదు ఇచ్చామనే దుగ్ధ వేధింపుకు కారణం అయితే, ఆ పగకి ’పీక కోయటం’తో ప్రతీకారం తీర్చుకోవచ్చు. అది వదిలేసి.... ఇంత సమయం, ఖర్చు, ఓపికతో కూడుకొని వేధించటం ఎందుకు?
ఎవరికి ఫిర్యాదు చేసినా, వాళ్ళు న్యాయం చేయకపోగా, ఫిర్యాదులో నేను ఏ సమస్యనయితే చెప్పానో ఆ సమస్య మరింత ఎక్కువ అయ్యేది. ’ప్రతి పావు నాదే అంటూ ఎవరూ నిన్ను రక్షించరు’ అని మాకు ఇంకించటానికి ప్రయత్నించేవాళ్ళని తర్వాత అర్ధమయ్యింది. ఆ విధంగా రామోజీరావు పరిధి ఎంతో.... బాగా అర్ధమయ్యింది. ఆయా వ్యక్తుల మధ్య, సంఘటనల మధ్య కార్యకారణ సంబంధాలు బాగా అర్ధమయ్యాయి.
అలాగని ఫిర్యాదు చేసిన ప్రతిసారీ, ’ఎందుకు ఫిర్యాదు చేస్తారు, ఫిర్యాదుతో సమస్యలు పరిష్కారం అవుతాయా’ అంటూ ఓ ఏడుపు వినిపింపబడేది. అదీ మాకు అర్ధమయ్యేది కాదు. అన్నీ చోట్ల తామే అడ్డుకుంటున్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈ ఏడుపు! - ఇదీ మా ముందున్న ప్రశ్న , పరిశోధన. [ఇలా వరసగా ఎప్పటికప్పుడు ఫిర్యాదులు పెట్టుకుంటూ పోతే, 17 సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగి చూస్తే.... రామోజీరావు off/on లతో, నిరూపింపబడ్డాడు.]
దీనితో రుడ్ యార్డ్ క్లిపింగ్ పద్యం,
I have six friends.
They taught me all I knew
They are What and Why
And When and Where and Which and Who.
మరింత అనుభవానికి కొచ్చింది.
దాంతో... ప్రతి దాన్ని పరిశీలించటం, పూర్వ జ్ఞాపకాలన్నీ తిరగతోడి ఆలోచించటం! కొన్ని వేల గంటలు అదో తపస్సులా చేశాము. గీత సాధన తో ప్రతీదీ పరిశీలించాము. ఈనాడు వ్రాతల్నీ పరిశీలించాము. ఎందుకంటే - 1992 లో నా ఈనాడు మిత్రురాలు చెప్పిన ’ఈనాడు వ్రాతల్లోని మతలబు’ లతోనే గదా నా పరిశీలిన ప్రారంభమైంది? ఆ విధంగా నిర్ధారించుకున్నాకే నేను పీవీజీకి రామోజీరావు గురించి ఫిర్యాదు చేసాను.
అందుచేత ఈనాడు అక్షరక్షరాన్ని పరిశీలించటం ప్రారంభించాము. మధ్యరోజుల్లో [అంటే 1995 లో ఫ్యాక్టరీ పోగొట్టుకున్నప్పటి నుండీ 2005 వరకూ] వార్తాల్ని యధాలాపంగా చదివాము, చూశాము.
ఇక మళ్ళీ ’ఆచరణ - పరిశీలన’ అన్న ’కీ’తో ఈనాడు వ్రాతల్ని అర్ధం చేసుకోవటం ప్రారంభించాము. దాంతో, ఈనాడు రామోజీరావు మాతో మాట్లాడే భాష మాకు అర్ధమయ్యింది. ఈనాడు అంటే నెం.10 వర్గానికి, నెం.5 వర్గానికి మధ్య నడిచే భాష కూడా అర్ధమైంది.
ఆచరణ - పరిశీలన అన్నదే వాటన్నిటి ’కీ’. పరిశీలిన లేని ఆచరణ, ఆచరించని పరిశీలన వృధాయే!
వివరంగా చెప్పాలంటే -
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
3 comments:
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
మరో సారి జ్ఞాపకాల తడి ఊరిందండి. Thank you :)
డాక్టర్ చక్రవర్తి లో "మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము" అనే పాట మీ ఆలుమగలకి చక్కగా సరి పోతుంది.
Post a Comment