ఈ శివరాత్రి పర్వదినాన మీ ఇంటిలోని చిన్నారి చిట్టితల్లులు, బుడుగుల్లాంటి పిడుగుల కోసమూ ఓ చిన్న కథ.

అనగా అనగా...

ఓ ఊరు! ఊరి ప్రక్కన చిన్న ఏరు. ఏటి గట్టున చెట్టు. చెట్టు క్రింద పుట్ట. చెట్టు మీద చిన్నిపిట్ట, నీటిలో ఓ బుల్లి చేప. పుట్టలో ఓ పేద్ద పామూ ఉండేవి.

పాము ఎప్పుడు చూసినా రుసరుసలాడుతూ కస్సుబుస్సుమంటుండేది. పిట్ట కిలకిల్ల్లాడుతూ, చేప కలకల్లాడుతూ ఉండేవి. వానొచ్చినా ఎండొచ్చినా, మంచు కురిసినా మబ్బులొచ్చినా పిట్ట కువకువలాడేది. చేప రెపరెపలాడేది.

గాలి తెమ్మెర వీస్తే... చెట్టు మీది ఆకులూ, ఏటిలోని అలలూ గలగల లాడేవి. పాముపైకి చూస్తే... పిట్ట రివ్వున గాల్లోకి ఎగిరి గిరికీలు కొట్టేది. ఆ కొమ్మ మీంచి ఈ కొమ్మ మీదికీ గెంతేది. ఆ గుబురుకీ ఈ గుబురుకీ కబురులు చెబుతున్నట్లుగా గుసగుస లాడేది. పక్కకి చూస్తే... చేప పిల్ల సర్రున నీళ్ళల్లోంచి గాల్లోకి ఎగిరి మళ్ళీ మునకలు వేసేది. నీటిలోకి పైకీ గింగరాలు తిరిగేది. ఈ మూల నుండి ఆ మూలకి మెరుపులా ఈదేది.

అదంతా చూసి పాముకి అసూయగా ఉండేది.

ఓ రోజు ఎప్పట్లాగే పిట్ట ఆనందంగా పాడుతోంది. చేప సంతోషంగా ఈదుతోంది. పాము కదంతా చూసి ముందు కోపం ఆపైన ఏడుపూ వచ్చాయి. ’అవెందుకంత ఆనందంగా ఉన్నాయి? తానెందుకు సంతోషంగా లేదు?’ అన్న సంగతి దానికి అంతుబట్టటం లేదు. ఇంతలో అక్కడికి ఇద్దరు కుర్రాళ్ళొచ్చారు. ఒకడి చేతిలో ఉండేలుంది. మరొకడి చేతిలో గాలం ఉంది. అంతే! పిట్ట గాల్లోకి, చేప నీళ్ళల్లోకి తుర్రుమన్నాయి. పాము పుట్టలోంచి తలబయటికి పెట్టి బుస్సుమంది. ఆ కుర్రాళ్ళిద్దరూ భయంతో అక్కడి నుండి పరుగుతీసారు.

"చేపకీ పిట్టకీ తనని చూస్తే భయం. మనుష్యుల్నిచూసీ భయం. అలాంటిది మనుష్యులకి తనని చూసి భయం!" గొప్పగా అనుకుంది పాము. అంతలోనే సందేహం! "అయినా అవి సంతోషంగా ఉన్నాయి. తనెప్పుడూ అలా లేదు. ఎందుకనీ?" ఎంత ఆలోచించినా పాముకి సందేహం తీరేది కాదు.

ఇంతలో నాగుల చవితి పండగొచ్చింది. ఊళ్ళోని మహిళలంతా పూలసజ్జలూ, పాలూపళ్ళు తీసుకుని పుట్ట దగ్గరికి చేరారు. పళ్ళు పప్పులు మరమరాలు పుట్టమీద, పాలు పుట్టలోనూ పోసి పూజలు చేసారు. పిట్టకీ, చేపకీ భలే హుషారు వచ్చింది. గాలికొచ్చి నీళ్ళల్లో పడిన మరమరాలని తింటూ చేప, పప్పులేరుకు తింటూ పిట్ట తెగ ఆనందించ సాగాయి.

పుట్టలోని పాముకి మీద పడుతున్న పాలతో లోపలంతా తడి తడిగా అయ్యింది. చిరాగ్గా ఉంది. బయటికి వద్దామంటే బయట కోలాహలంగా ఉంది. చివరికి భరించలేక మెల్లిగా బయటికొచ్చి, చరాలున పొదల్లోకి పాకింది. ఇంతలో మనుషులు చూడనే చూశారు. కెవ్వుమంటూ వెనక్కి పరిగెత్తారు కొందరు. పొలాల్లో పని చేసుకుంటున్న కొందరు రైతు కూలీలు కర్రలతో పరుగెత్తుకు వచ్చారు. "ఎక్కడ పాము?" అంటూ కొట్టి చంపేందుకు సిద్దపడ్డారు. "మామూలు రోజుల్లో సరేగానీ, ఈ రోజు నాగుల చవితి. అంత పని చేయకండి" అని కొందరనటంతో వెనక్కి తగ్గారు.

ఏదో పూజ అయ్యిందనిపించి అంతా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అంతసేపూ పాముకి పైప్రాణాలు పైనే పోయాయి. ఆరోజు గడిచి పోయింది. ఇదంతా పాము మరిచిపోలేక పోయింది. "తనని చూసి భయపడే మనుష్యులు, తనకి పూజలు చేసే మనుష్యులు, తననే చంప ప్రయత్నిస్తారు. ఎప్పుడెవరి కంట బడితే చావగొడతారో అన్నట్లు, ఎప్పుడూ నక్కి నక్కి బ్రతకాల్సిందే తను! చేప, పిట్ట ఎంత హాయిగా ఉన్నాయి?" అనుకుంది.

ఇక లాభం లేదని, ఓ రోజు చేపని పిట్టని పేరుపెట్టి పిలిచింది. చేప ఒడ్డు దగ్గరికీ, పిట్ట క్రింది కొమ్మమీదికీ వచ్చి "ఏమిటి?" అన్నాయి.

పాము "మీరు మనుష్యుల్ని చూసి భయపడతారు. అదే మనుషులు నన్ను చూసి భయపడతారు. అయినా మీరు హాయిగా ఉన్నారు. నేను సంతోషంగా ఉండలేక పోతున్నాను. తేడా ఎక్కడుంది?" అని అడిగింది.

దానికి పిట్ట రెక్కలల్లార్చుతూ "నువ్వు ఖస్సుబుస్సుమంటూ ఉంటావు. చరచరా పాకుతావు. నీ చర్మం తళతళా మెరుస్తుంది. మనుషులు నీకు పూజలు చేస్తారు. నువ్వు మాత్రం వాళ్ళని భయపెడతావు. ఒకోసారి కాటువేసి చంపుతావు. అదే గొప్పదనం అనుకుంటావు. అదే మేమయితే... చేప నీటిలో ఈదుతుంది. నేను గాలిలో ఎగురుతాను. మా వలన ఎవరికీ హాని లేదు. నేను నీలా బుస్సుమనలేను, చేపలా ఈదలేను. కానీ గాల్లో ఎగర గలను. నా గొప్పనాది. మీ గొప్పలు మీవి. ’మీలా నేనెందుకు లేను?’ అనుకుని, నేను ఎవ్వరినీ చూసి ఈర్ష్య పడను. దేవుడు నాకిచ్చిన వాటిని ఆనందిస్తూ గడిపేస్తాను. ’నాకు ఇన్నిటినిచ్చిన దేవుడు కడుపునింపుకునేందుకు కొన్ని గింజలు కూడా ఇస్తాడు’ అనుకుంటే నాకు సంతోషంతో సంగీతం వచ్చేస్తుంది" అన్నది.

పాము చేప వైపు తలతిప్పి చూసింది. చేప తోక ఊపుతూ వయ్యారంగా కదిలి "పిట్ట చెప్పిందే నా జవాబు కూడా" అనేసింది.

కిలకిల్లాడుతూ పిట్ట గాల్లోకి, చేప నీట్లోకి నింపాదిగా వెళ్ళి పోయాయి. పాముకి ఉసూరు మన్పించింది. విషయమూ బోధపడింది. తన్ను గురించిన జ్ఞానం తనకి కలిగింది. ఆచరణే మిగిలింది.

ఇదండీ కథ!

ఈ శివరాత్రి పర్వదినాన ఆ మల్లయ్య స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుతూ...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

ఎంతో బాగుందండీ మీ చిన్ని కథ ! ముఖ్యంగా మీ కథనం ఎంతో హాయిగా సాగింది. చక్కని శైలి. అందమయిన కధను ఈ పర్వదిన సందర్భంగా అందించినందుకు ధన్యవాదాలు.

ఆదిలక్ష్మి గారూ !
పండుగ పూట మంచి నీతికథ చెప్పారు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.

కధ బావుందండీ...మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు!

మీకు,మీ కుటుంబానికి శివరాత్రి శుభాకాంక్షలు.

పంతుల జోగా రావు గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలండి. కథ మీకు నచ్చినందుకు చాలా సంతోషంమండి.

SRRao గారు: కృతజ్ఞతలండి.

పరిమళం గారు : సువాసనల నెనర్లండి.

చిలమకూరు విజయమోహన్ గారు : ధన్యవాదాలండి.

మీకూ మీ కుటుంబానికీ శ్రీమహాశివరాత్రి శుభాకాంక్షలండీ. శమస్తు.

అమ్మ ఒడిగారు ,
కథ చాలా బాగుందండి . మంచి నీతి వుంది .
మహా శివరాత్రి శుభాకాంక్షలు .

అమ్మ, మహాశివరాత్రి శుభాకాంక్షలు.

రాఘవ గారు: నెనర్లండి.

మాలా కుమార్ గారు: కథ నచ్చినందుకు ధన్యవాదాలండి.

అజ్ఞాత గారు: నెనర్లండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu