అశోకుడు తన రాజ్యాన్ని 60 సంవత్సరాలు పాటు పరిపాలించాడు. శాంతిపూర్ణమైన, బలమైన రాజ్యపరిపాలనా వ్యవస్థని నెలకొల్పాడు. ఆయన్ని అశోకా ది గ్రేట్ అనవచ్చు. [కానీ మన మీడియా అనదను కొండి నిజానికి అశోకా ది గ్రేట్ అన్న పేరుకన్నా ధర్మాశోకుడన్నదే గొప్పపేరు కూడాను.]


అయితే దీనికి విపర్యయంగా క్రీ.పూ. 326 లో భారత్ మీద దాడి చేసిన అలెగ్జాండర్ ని ది గ్రేట్ అంటుంది మీడియా. ఎప్పుడు అతడి ప్రసక్తి వచ్చినా మీడియా అలెగ్జాండర్ ది గ్రేట్ అని తప్ప పొరపాటున కూడా మరోమాట వాడదు. అతడి గొప్పదనం ఏమిటో మీడియాకే తెలియాలి. మాసిడోనియా దేశాన్ని [అది చాలా చిన్న దేశం]కి రాజు. బాల్కన్ దేశాల రాజు ఫిలిప్హత్య చేయబడ్డాక క్రీ.పూ. 334 లో అలెగ్జాండర్ రాజ్యానికొచ్చాడు. ఇండియాపై దాడికి వచ్చి, అర్ధాంతరంగా వెనుదిరిగి తన మాతృభూమికి వెళుతూ దారిలో బాబిలోనియాలో క్రీ.పూ. 323 లో మరణించాడు. రాజయ్యాక 11 సంవత్సరాల్లోనే అతడి జీవితం ముగిసిపోయింది. ఈ 11 ఏళ్ళ కాలంలో అతడి దేశప్రజలకి కాని, మరొక జాతి ప్రజలకి గాని అతడేం మంచి చేసాడని మీడియా అతణ్ణి ఎప్పుడు ఎక్కడ రిఫర్ చేసినా అలెగ్జాండర్ ది గ్రేట్అంటుందో మీడియాకే తెలియాలి. [ఈ మధ్య వచ్చిన హాలివుడ్ సినిమాలోనే పేరుతో సహా అలెగ్జాండర్ అంటూ, ది గ్రేట్ ని తొలగించి చెప్పబడింది.] రాజుగా తన 11 ఏళ్ళ జీవితంలో అతడు తన రాజ్యాన్ని రాజధానిలో ఉండి, పరిపాలించుకొన్నదీ లేదు, పాలనా వ్యవస్థని నడిపిందీ లేదు, తన దేశ ప్రజలకి గాని, తాను గెలిచిన మరో దేశప్రజలకి గానీ ఇసుమంతైనా మంచి చేసిందీ లేదు. కేవలం డబ్బు సంపాదిస్తే చాలు గొప్పవాడన్నట్లు తప్పితే మీడియా అతణ్ణి ఎందుకు ది గ్రేట్ గా స్టాంపు వేసినట్లు? [తొలిరోజుల్లో డబ్బు సంపాదిస్తే గొప్ప అన్నారు, తర్వాతర్వాత ఎట్లా సంపాదిస్తేనేం, డబ్బు సంపాదించాడు కదా, కాబట్టి గొప్ప అన్నారు. ఇలాంటి ఒరవడిని సృష్టించే మీడియా, సమాజాన్ని నేటికి ఈ స్థితికి దిగజార్చింది.]


పోనీ దండయాత్రల్లోనన్నా అతడు నిరుపమానమైన లేదా శాశ్వతమైన విజయాన్ని సాధించాడా అంటే అదీ లేదు. భారతదేశ మ్మీద దాడి చేసాడే గానీ, ఎక్కువ భాగాన్ని ఆక్రమించలేకపోయాడు. పశ్చిమోత్తర భారతంలోని కొంత భాగాన్ని మాత్రమే ఆక్రమించగలిగాడు. దక్షిణాపధానికి రావాలని అభిలషించాడు. కానీ అతడి సైనికులు దాన్ని ఇష్టపడలేదు, దానితో అతడికి సహకరించలేదు. వాళ్ళని ఆఙ్ఞాపించి అదుపు చేయలేకపోయాడు. ఉత్తేజపరచి యుద్ధోన్ముఖుల్ని చేయలేకపోయాడు. ఫలితంగా వెనుదిరిగి మాతృదేశపు దారిపట్టాడు. పర్షియన్ రాజు డరియాస్ నీ, ఈజిప్టుని జయించాక ఇండియా పైకి వచ్చాడు. కానీ అవీ తాత్కాలిక విజయాలే. అయితే ఇండియాలో అతడు అసలైన యుద్దాన్ని చవిచూశాడు. పురుషోత్తముడి ధైర్యసాహసాలకి, పోరాటస్ఫూర్తికి అచ్చెరుచెందాడు. అసూయ చెందకుండా మెచ్చుకొన్నాడు. బౌద్ధ మతం విని ప్రభావితుడైనాడు. నిరుత్సాహపడిన సైనికుల్ని వెంటబెట్టుకొని వెనుదిరిగాడు. వ్యక్తిగా అలెగ్జాండరులో కొన్ని మంచి లక్షణాలూ ఉన్నాయి, కొన్ని లోపాలూ ఉన్నాయి. [ఏమనిషికైనా అది సహజం కదా! అన్నీ మంచి లక్షణాలే ఉండటానికి మనిషి దేవుడు కాడుగా. ఎక్కువ మంచి లక్షణాలుంటే మంచివాడనీ, ఎక్కువ చెడ్డలక్షణాలుంటే చెడ్డవాడనీ అంటారంతే.]


కానీ అతడి కున్నా మంచీ చెడూ ఏ లక్షణాలతో అయినా అతడు ప్రజలకి ఒరగ బెట్టింది ఏమీ లేదు. దండయాత్రలూ అదీ క్రీ.పూ. రోజుల్లో! ఎంత వ్యయాప్రయాస! అలాంటప్పుడు గొప్పేకదా అనేటట్లయితే. అంతే వ్యయ ప్రయాస ప్రజలకి మేలు చేసేందుకు పడిన వాళ్ళు మరింత గొప్పకావాలి కదా!


మరి ఎందుకు మీడియా [ఈ రోజుల్లో ఈ ముసుగు వెనుక ఉంది నకిలీ కణికుడి వంశీయులే] అలెగ్జాండర్ ది గ్రేట్ అంటూ ఊదరబెట్టిందో? నిజానికి ఇదే స్ట్రాటజీ పదేపదే అదేప్రచారం అనే మాయాజాలం మీడియా మరికొందరు వ్యక్తులకి కూడా వర్తింపచేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఓ CBI Officer ఉండేవాడు; మాధవన్ అని. ఈయనే బోఫోర్సు కేసు విచారించింది. ఈయన గురించి ఎప్పుడు రిఫర్ చేసినా అప్పట్లో మీడియా ముఖ్యంగా ఈనాడు అతడి పేరుకు ముందు ఓ టాగ్ తగిలించేది; ’నిజాయితీ నిజరూపం మాధవన్అంటూ. అలాగే 80 దశకాల్లో ఓ రాజకీయ నాయకుడుకి కూడా ఇదే ప్రచారపు ఇమేజ్, నిజాయితీ నిలువెత్తు రూపం ముద్రగడ పద్మనాభం అంటూ. అప్పట్లో అతడు మీడియాకి ముఖ్యంగా ఈనాడుకి ఓడమల్లయ్య, తర్వాత బోడి మల్లయ్య అయ్యాడేమో. ఇక అడ్రస్సు లేడు.


ఈ ఇమేజ్ కవరేజ్ ఇంకా సినీ తారలకీ, క్రికెట్ తారలకీ మరిన్ని ఎక్కువ డెసిబెల్స్ లో ఉంటుంది. ముషారఫ్ మెచ్చిన జులపాలున్న[ఒకప్పుడు లెండి], దాదాలు, సంచలనాలు వగైరా వగైరాలు. ఒకసారి మీడియా ఓ ట్రెండు వేసి ప్రచారించిన తర్వాత ఎవరైనా కాదనే సాహసం చేయరు. చేసిన వాణ్ణి అప్పటికే ఈ మీడియా ప్రచార మాయాజాలం తలకెక్కి పోయిన వీరాభిమానులు పగవాణ్ణి చూసినట్లు చూస్తారు. ఖతమ్! మరొకడెవరూ మీడియా అన్నదాన్ని, స్టాంపు చేసిన దాన్ని కాదనే సాహసం చేయడు. ఆ విధంగా మీడియా సమాజాన్ని నియంత్రిస్తుంది. ఎవరికీ వారికి అందరూ మీడియా అన్నదాన్ని అవునంటున్నారు. నీవొక్కడివే ఉలిపి కట్టెలా ఉన్నావుఅంటూ నల్లమేక నలుగురు దొంగలు చూపిస్తుంది. ఇక ఈ మాయంతా దాటాలంటే భగవంతుడి దయ ఉండాల్సిందే.


ఇలా తమకి కావలసిన వారికి, వాటికి స్టాంపు వేసుకోవటమే ఇక్కడ మీడియా స్ట్రాటజీ. ఇదే స్ట్రాటజీని అలెగ్జాండర్ ది గ్రేట్ అన్న ప్రచారంలోనూ ఉపయోగించారు. ఈ ప్రచారంతో కుట్రదారులు అంటే రామోజీ రావు,నకిలీ కణికుడు వంశీయులు, సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., ఇంకా వారి మద్దతు దారులైన కొన్ని కార్పోరేటు కంపెనీలు, కొందరు రచయితలూ, భారత దేశాన్ని, భారతీయుల్నీ కించపరచటానికి శతధా ప్రయత్నించారు, ప్రయత్నిస్తున్నారు. భారతీయుల్లో, ముఖ్యంగా హిందువుల్లో, ఓ ఆత్మన్యూనతా భావం [ఇన్ ఫ్లీరియారిటీ], ఆత్మగ్లాని, తమని తాము నిందుంచుకోవటం, నెగిటివ్ ఆలోచనా ధోరిణి[భారతీయత పట్ల నెగిటివ్ ఆలోచనధోరిణి, పాశ్చత్యత పట్ల పాజిటివ్ ఆలోచనధోరణి] కలిగేలా పకబ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, సుదీర్ఘంగా అమలు చేయబడుతుంది.


ఇలా ఆత్మన్యూనతస్థితి నూరేళ్ళ క్రితమే భారతీయులకి ఇంకించబడింది. కాబట్టే 1893, సెప్టెంబరు11, చికాగో మత మహాసభలో ప్రారంభించి భారతీయుల ఆత్మని మేల్కోపిన స్వామి వివేకానంద మీరు పుట్టుకతో సింహాలు. గొర్రెల్లా ప్రవర్తించకండి అని ప్రభోదించారు. ఈ సందర్భంలో ఆయన చెప్పిన చిన్న కథ నిజంగా మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన కథ.


ఇదీ ఆ కథ: సింహాలు మీరు


నిండు గర్భిణి అయిన ఒక సింహాం, ఆహారం కోసం తిరుగుతూ, ఒక గొర్రెలమందను చూచి, దాన్లోకి దుమికింది. కానీ ఆ శ్రమకు ఓర్వజాలక, ఈని, అది వెంటనే మరణించింది. దాని బిడ్డ, గొర్రెల పోషణ క్రిందనే పెరిగి, వాటితోపాటు గడ్డిమేస్తూ, వాటిలాగానే గొర్రె అరపు అరుస్తూండినది. పెద్దదైన తర్వాత కూడ, తాను గొర్రె అనే దాని తలపు. మరొక సింహాం ఒకనాడు, ఆ ప్రాంతానికి ఆహారార్ధం వచ్చి, ఆ మందలో సింహాం ఉండడం, గొర్రెలలాగా అదీ పారిపోవడమూ చూసి అశ్చర్యపోయింది. దాని దగ్గరకు వెళ్లి, అది గొర్రెకాదనీ, సింహామనీ తెలుపడానికి ప్రయత్నించింది కాని, అది అందకుండా పారిపోసాగింది. సమయం కోసం వేచి ఉండి, ఒకరోజు ఆ గొర్రెసింహం నిద్రిస్తూండగా, దగ్గరకు వెళ్ళి, “నువ్వు సింహనివి అని దానికి చెప్పింది. కాదు, నేను గొర్రెనే అంటూ అది గొర్రెఅరుపు అరిచింది. అంతట ఈ సింహం దాన్ని ఒక చెరువు దగ్గరికి లాక్కునిపోయి, తమ ఉభయుల ప్రతిబింబాల్ని చెరువు నీటిలో చూపిస్తూ, "బాగా చూడు, నువ్వు ఎవరివో యిప్పటికైనా తెలుసుకో అన్నది సింహం.


అంతట, గొర్రె సింహం నీళ్లలో కనిపించే తన ప్రతిబింబాన్ని, ఆ సింహాన్ని పోల్చిచూసుకొన్నది. క్షణమాత్రంలో తాను సింహామనే సత్యం దానికి స్ఫురించింది. వెంటనే దాని గొర్రె అరుపు మాయమై, సింహగర్జనం వెలువడింది.


మనం అపరిశుద్ధులం అని ఎన్నడూ అనకండి. పరిశుద్దులమనే అనండి. మనం స్వల్పులమనీ, జన్మిస్తామనీ, మరణిస్తామనీ గాఢభ్రాంతిని ఒక దాన్ని కల్పించుకొని ఉన్నాం. అందువల్ల మనల్ని ఎప్పుడూ అకారణ భీతి వెన్నాడుతోంది. సింహాలు మీరు! నిత్యం పరిశుద్ధం, పరిపూర్ణం అయిన అత్మయే మీరు. విశ్వశక్తి మీలో అణగి ఉంది.


మిత్రమా! ఏడుస్తున్నా వెందుకు? నీకు జననమరణాలు లేవు, వ్యాధి దుఃఖాలు లేవు. అనంతమైన అకాశం వంటివాడివి నువ్వు. రంగు రంగుల మబ్బులు దాని నావరించి, ఒక క్షణ మాత్రం క్రీడించి మాయమౌతూ ఉంటవి. కానీ, అకాశ మెప్పుడూ, నిత్యవినీల కాంతిమయమే. దుర్జనత్వం మనకేల కనిపిస్తోంది?’


నేను ఆత్మను. విశ్వంలో ఏదీ నన్ను చంపలేదుఅని మానవుడికి వ్యక్తపరిచే ధైర్యాన్ని అలవరుచుకోండి. అప్పుడు మీరు ముక్తులవుతారు.


[వివేకానంద చెప్పిన కథలు నుండి దీనిని తీసుకొన్నాను.]


స్వాతంత్రసమరం నాటికే భారతీయుల్లో ఆత్మన్యూనతా భావం ఉంది. అప్పడాప్రచారపు పని బ్రిటిషువాళ్ళు చేశారు. భారతజాతిని జాగృత పరిచే పని దేశభక్తులు చేశారు. అందుకు పత్రికల్ని పెట్టి సాధించారు. దానితో బ్రిటిషుప్రభుత్వం జెండా దించుకొని ఇంటికి పోవాల్సివచ్చింది. యూరపు చరిత్రలోని కాంగ్రెస్ ఆఫ్ వియన్నా లాగానే అప్పటికి తాత్కాలికంగా తెరమరుగు అయిపోయిన కుట్రదారులు తర్వాత ఎక్కడఓటమి పాలయ్యారో అక్కడి నుండే మళ్ళీ కుట్రని సాగించారు. ఇది గూఢచర్యంలో ఒక వ్యూహం.... దానితో ఈ కుట్రదారులు [వంశపారంపర్యులు కూడా] ఈ సారి మీడియా అవతారం ఎత్తారు. ఈ వివరాలు Coups On World లోనూ, అమ్మ ఒడి పాత టపాల్లోనూ చర్చించాను.


ఈ సందర్భంలో ఒక సందేహం అనుకోండి, ఊహాగానం అనుకొండి…. [ఏది అనుకున్న ఇది మాత్రం ఫ్యాక్ట్ అంటే జరిగిన సంఘటనకు ముడిపడి ఉంది.] ఒక విషయం పరిశీలిద్దాం. అదేమిటంటే......


మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిజాం సంస్థానపు ఆరాచకం, రజాకర్ల కౄరత్వం మనందరికీ తెలిసిన సత్యం. ఆ రోజుల్లో ఒకటి నుండి మూడవ సాలార్ జంగ్ వరకూ బ్రిసావీలే. అంటే బ్రిటిషు సామ్రాజ్య విధేయులే. [తెలంగాణ పోరాటంలో బ్రిటిషు సామ్రాజ్య విధేయు [ బ్రిసావీ]లని వాళ్ళు అలాగే పిలిచుకొనేవారు. కావాలంటే పి.వి.నరసింహరావు ఇన్ సైడర్ లో రిఫర్ చేయగలరు.] అలాగే పాకిస్థాన్ లో కలిసి పోవాలని లేదా తూర్పుపశ్చిమ పాకిస్థాన్ లలాగా మధ్య పాకిస్థాన్ గా నిలిచిపోవాలని కలలుగన్నాడు [1947]స్వాతంత్రం నాటి నిజాం. అది కుదరక అలాగే పాకిస్థాన్ కి పారిపోయాడు. అలాగే పాకిస్థానీలకి గానీ, ముస్లింలకి గానీ అనే అక్షరం పరమ పవిత్రం. మన భారత రత్నలాగా వాళ్ళ దేశపు అత్యున్నత పురస్కారం నిషానీపాకిస్థానీ ’. అక్బర్ స్థాపించిన మతం దీన్ఇలాహి ’. అసలు ఇస్లాం మతస్థులకే పరమ ప్రియమైనది అన్న అక్షరం.


అదే రామోజీ రావుకీ ప్రియమైనది. రామోజీ రావు ఎట్లాగూ నాస్తికుడే. నాడు, ’టీ.వి. వారి బట్టలషాపులు కూడా బ్రిసాలే. ఏదో భాషలో మరో అర్ధమేదో ఉండవచ్చుగాక. మరోభాషలోని మనకి తెలీని అర్ధమేదో పరిగణనలోకి తీసికోవచ్చుగానీ మన భాషలోని, ఒకప్పుడు తెలంగాణపోరాటంలో అందరిలో పాచుర్యం పొందిన బ్రిసా[అంటే బ్రిటీషు సామ్రాజ్యం] అర్ధం మాత్రం పరిగణనలోకి తీసుకోకూడదా? అసలలాంటి ప్రత్యేకమైన పేర్లు [అంటే ఈ, బ్రిసా, రామదాసు కథలోని గూఢచర్య మర్మపు కల లోని రామోజీ] మీద అంత మమకారం ఏమిటో?


సరే! ఇది ఫ్యాక్ట్కావచ్చు గానీ దాని వెనుక కారణాన్ని సందేహించగలం గానీ నిరూపించలేం. అంచేత ఇప్పటికీ వదిలేసి మళ్ళీ చరిత్రలోకి వద్దాం.


అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి ప్రచారపు ట్రిక్కులతో కానివ్వండి, పురాణాలని హిందూమత ఆచార వ్యవహారాల్ని కానివ్వండి హీనపరుస్తూ, ఎగతాళి చేస్తూ చేసిన ప్రచారం ఎంతదూరం వెళ్ళిందంటే హిందువులు తమ దేవుడికి దణ్ణం పెట్టుకోవడానికి కూడా దొంగల్లాగా అటూఇటూ చూసి, ఎవ్వరూ తమని గమనించడం లేదన్నప్పుడు గబుక్కున దండం పెట్టుకొని అయ్యిందనిపిస్తారనిజోకు లేసేంతదాకా.


ఘంటసాల భక్తిగీతం ఏడుకొండల సామీ! ఎక్కుడున్నావయ్యాలో


ఆకాశమంటు ఈ కొండశిఖరమ్ముపై

మనుష్యులకూ దూరంగా మసలు తున్నావా?’

అంటూ పాడితే దేవుడి క్కూడా మనష్యులంటే భయం. అందుకే అలా ఆకాశమంటి కొండశిఖరమ్మీద మనుష్యులకు దూరంగా ఉన్నాడుఅంటూ జోకులు పేలాయి.


ఆ ఒరవడి లో కొట్టుకుపోయే పూచిక పుల్లల్లా ఎందరో,

ఎదుర్కొనే ఉషశ్రీల్లా, విశ్వనాధ సత్యనారాయణల్లా కొందరూ,

మరికొంత వితండవాదాలతో పురెక్కించిన వెక్కిరింతల రచయితలు రంగనాయకమ్మల్లా మరికొందరూ!


ఇదంతా మన కళ్ళముందు కదలిపోయిన కాలమే.


ఇక్కడో విశేషం ఏమిటంటే......


మన భగవద్గీత, సనాతన ధర్మం మనకి అహంని నీనుండి తరిమేయమని చెబుతాయి.


కుట్రదారులు [అంటే నకిలీ కణికుడి వంశీయులు,రామోజీరావు, సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ.] ఇంకా వారి మద్దతుదారులు ఎప్పుడు తమ స్ట్రాటజీని అహం ని రెచ్చగొట్టడం లేదా అహం ని తృప్తిపరచడం ఇలా కేవలం అహంఅన్న ఆధారం పైనే స్ట్రాటజీ నిర్మించారు, నియంత్రిస్తున్నారు.


కాకపోతే కొన్ని వర్గాల్లో అహాన్ని రెచ్చగొడతారు. కొన్ని వర్గాల్లో అణగ్గొడతారు. అలాగే వ్యక్తుల్ని వాడుకొనేందుకు కూడా ఒక్కోసారి అహాన్ని రెచ్చగొట్టడం, ఒకోసారి అహాన్ని తృప్తిపరచడం చేస్తారు.


ఈ పధకంలో భాగంగానే హిందువుల్లోనూ, భారతీయుల్లోనూ, అహాన్ని అణగొట్టారు.


పరనిందా, ఆత్మస్తుతీ అహంకార నిదర్శనం.


అయితే పరదాస్యం, ఆత్మనిందా ఆత్మహత్యా సదృశ్యం.


ఇంతకు ముందు టపాల్లో నల్లమేక నలుగురు దొంగల గురించి చర్చిస్తూ మనం చెప్పుకున్నట్లుగా ముసలి వాడి చేతిలో నుండి మేకని దొంగలు లాక్కుంటే అది నేరం. ముసలివాడే వదిలేసేట్లు పధకం పన్నితే అది లౌక్యం.

తామే చంపితే అది హత్య. మనంతట మనమే చచ్చేలా చేస్తే అది ఆత్మహత్య.


ఆత్మగ్లాని, ఆత్మనింద ఆత్మహత్య కంటే నీచమైనవి.


మీరు గమనించి చూడండి. మన చుట్టు చాలామంది ఇవాళా రేపు మన దేశంలో న్యాయం ఎక్కడుందడీ అంటారు. అదేదో మిగిలిన దేశాలు బాగున్నట్లు, విదేశీయులు ఉత్తమోత్తములు అయినట్లు. దూరపు కొండలు నునుపు తప్పితే అక్కడా ఏం లేదు. ఎందుకంటే కుట్రదారులు ప్రపంచాన్ని ఒక్క అంగుళం కూడా విడిచిపెట్టలేదు కాబట్టి. ఎక్కడి కక్కడ విభజించి ప్రచారించు అన్న సూత్రంతో ఈ మాయను సృష్టించారు, అంతే.


మన దేశాన్నే తీసికొంటే………


ధర్మాన్ని ఆచరించటం, ప్రజలకు మంచి చేయటం కోసం కష్టపడటం ఇది గ్రేట్ కాదు. వ్యయప్రయాసల కోర్చి జగజ్జేత అన్పించుకోవటం కోసం ప్రపంచమ్మీద పడి దండయాత్రలు చేయటం గ్రేట్’. కాబట్టి అశోకా ది గ్రేట్ కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్.


సరే! ఒప్పుకుందాం.


మరి అలాంటప్పుడు…… మన బప్పారావెల్ ఈ మీడియా కంటికి ఎందుకు కనబడలేదు? బప్పారావెల్ భారతీయ సామ్రాజ్యాన్ని ఆఫ్గానిస్థాన్ లోని హిందూ కుష్ పర్వతాల వరకూ విస్తరింప చేశాడని ఎంతమందికి తెలుసు? [తెలపడానికి మీడియా తెలియజేస్తే కదా?] అతడి కారణంగానే ఆ పొడవాటి పర్వత శ్రేణులు హిందూ కుష్ పర్వతాలని పిలవబడ్డాయని గానీ, ఆనాడు చెక్కబడిన ఆ గుహాల్లోని బుద్ధ విగ్రహాలనే బుమియాన్ బుద్ధుడంటారని గాని, ఎందరికి తెలుసు? ఆ విగ్రహాలనే 2000, 2001 ల్లో తాలిబాన్లు ప్రపంచదేశాలన్నీ వద్దని నిస్సహాయంగావిలపిస్తుండగా తుత్తునియలు చేశారు.


ఇదొక్కటే కాదు. ఎన్నో పెద్ద ఆలయాలు, తటాకాలు నిర్మించిన ఎందరో గొప్పరాజులు పాండ్య, చేర, చోళు, చాణక్య, గుప్తులు, శాలివాహనులు కాలంలో ఉన్నారు. దేశాన్ని సుభిక్షంగా, సమర్థంగా పాలించిన వారున్నారు. అంగళ్ళలో రతనాలు రాశులు పోసి అమ్మిన రాయల వారి కాలం అనగానే రాయలు వారు తిమ్మరుసు కళ్ళను పీకించాడంటారు. అది నిజమో చారిత్రక ప్రక్షిప్తమో ఎవరికీ తెలీదు. ఇదే తిమ్మరుసు మంత్రి సమర్ధమైన బలమైన రాజ్యవ్యవస్థని నిర్మించటానికి 16 సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయులని భూగృహంలో ఉంచి తర్ఫీదు నిచ్చాడని గానీ, రోజూ వీసేడు ఆముదం ఒంటికి పట్టించుకొని జిడ్డుమొత్తం చెమటకి కరిగి పోయెలా రెండు ఘఢియలు గుర్రపుస్వారి చేయటం, కత్తి సాము గరిడిలతో, శాస్త్ర మధనాలతో భూగృహాం నుండి అడవిలోకి తెరుచుకొన్న సొరంగ మార్గంలో శ్రీకృష్ణదేవరాయలు శిక్షణ పొందాడని గానీ ఎందరికి తెలుసు?


తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.


సర్వేజనా సుఖినోభవంతు!


**************


ఓ చిన్న గమనిక: చారిత్రకాంశాల మీద [స్థల కాలాల మీద] నాకంతగా సాధికారత లేదు. అవసరమైన చోట నాకు అందుబాటులో ఉన్న పుస్తకాల మీద ఆధారపడ్డాను. ఆయా గొప్పవారి జన్మస్థలాల గురించో, కాలాల గురించో, ఏదైనా సంఘటనల గురించో ఏవైనా పొరబాట్లుంటే మన్నించగలరు.


ఈ టపాల్లో నా ఉద్దేశం రాజకీయ రంగం మీద కుట్ర కోణాన్ని వివరించడం. అందులో క్రమ పరిణామాన్ని చెప్పేముందు, చారిత్రక స్ఫూర్తిని చెప్పే ప్రయత్నం చేశాను.]


***********

11 comments:

excellent

వివేకానందుడు చెప్పినవి అక్షర సత్యాలు. మనల్ని మనమే కించపరుచుకుంటాం. కానీ విశ్వనాధ వారన్నట్లు , " నా జాతి పూర్తిగా నాశనమైనట్టు కనపడవచ్చు కానీ ఎప్పటికైనా పునరుజ్జీవనం చెందుతుంది.చిట్టచివరి వేరు మిగిలినా మళ్ళీ సజీవంగా, నిరుపమానంగా వర్ధిల్లుతుంది. మహావృక్షంగా ఎదుగుతుంది.

Really Really... Excellent..

Keep going !!!

Good one but a little bit lengthy :-)

చాల విషయాలు తెలుసుకున్నాము. మీ పాయింట్ అఫ్ వ్యూ నచ్చింది.

భారతీయ సంస్కృతి మీద మీరు అందిస్తున్న విశేషాలు అద్భుతంగా వున్నాయి. నేను కూడా వివేకానందుడి భావాల పట్ల ఇష్టం గల వాడినే. మీ టపాల ద్వారా లోకానికి తెలియని మరిన్ని విశేషాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను.

రామోజీరావు తుమ్మినా కుట్రే అనేటట్లున్నారు. మీకాయనతో వైరమేంటో గానీ .. మధ్యలోకి అలెగ్జాండర్ పేరెందుకు లాగటం? చారిత్రకాంశాల మీద సాధికారత లేనప్పుడు, అది సాధించి తర్వాత ప్రశ్నలు లేవనెత్తితే బాగుంటుంది.

మీ సంతోషం కోసం ఓ ముక్క - మీడియా వాళ్ల సంగతేమో కానీ, చారిత్రకులు (పాశ్చాత్య & భారతీయ) అశోకుడ్ని 'అశోకా ది గ్రేట్' అనే పిలుస్తారు.

ఇక అలెగ్జాండర్ దగ్గరికొద్దాం. అతడ్ని 'ది గ్రేట్' ఎందుకనాలి, అతడు పట్టుమని పది రోజులన్నా సొంత రాజ్యంలో ఉన్నాడా, ప్రజల్ని ఏలాడా, ఏమన్నా ఒరగబెట్టాడా అని ప్రశ్నలేశారు మీరు. గొప్పదనం ఆపాదించటానికి ఎన్నాళ్లు రాజ్యమేలారన్నది ముఖ్యం కాదు. అది రాజ్యాలేలిన వాళ్లకి మాత్రమే వర్తించే విషయమా? చరిత్రకారులు అలెగ్జాండర్ని రాజుగా కన్నా, ఓ సైన్యాధిపతిగా గుర్తిస్తారు. ఈ కోణంలోనుండి చూస్తే - అలెగ్జాండర్ చేసిందల్లా తన వృత్తి ధర్మాన్ని నెరవేర్చటమే. అతి పిన్న వయసులో నలభై వేలమంది సైనికులతో బయలుదేరి అప్పటికి తెలిసిన ప్రపంచంలో అధిక భాగాన్ని జయించగలిగిన అతని పాటవానికీ, యుద్ధ కౌశలానికీ ఇచ్చిన గుర్తింపే ఆ 'ది గ్రేట్' విశ్లేషణం. అది, ఓ విజయవంతమైన సైన్యాధిపతికి ఇవ్వబడిన గౌరవం మాత్రమే.

అలెగ్జాండర్ యుద్ధాలు లేకుంటే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేది. తూర్పు-పశ్చిమ దేశాల మధ్య తర్వాతి కాలంలో ఏర్పడ్డ సాంస్కృతిక, వాణిజ్య, ఆధ్యాత్మిక రహదారులకు నాటి అలెగ్జాండర్ దండయాత్రలే కారణం. అలెగ్జాండర్‌తో పాటు మన దేశమ్మీద యుద్ధానికొచ్చి ఇక్కడే స్థిరపడిపోయిన గ్రీకు సైనికుల సంతతి ప్రస్తుతం కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తన ఉనికిని చాటుకుంటుంది. ఈజిప్టులో ఫారోల చేతినుండి అధికారం టోలెమీల చేతికొచ్చింది. అలెగ్జాండర్ మరణానంతరమూ అతని 'లెగసీ' శతాబ్దాలుగా కొనసాగటమే కాక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మిశ్రమ సంస్కృతులేర్పడటానికి దారితీసింది. తను దాడి చేసిన అన్ని దేశాల్లోనూ వేలాది ఏళ్ల తర్వాత కూడా అతను మిగిల్చిన ముద్రలివి. భారతదేశం గురించి పాశ్చాత్యులకు అసలు సిసలు పరిచయం కల్పించింది అలెగ్జాండర్. భారతీయులకి పాశ్చాత్య కళలనూ, భాషా వ్యవహారాలనూ, శాస్త్ర విజ్ఞానాన్నీ పరిచయం చేసిందీ అలెగ్జాండరే.

మరి హిట్లరూ గొప్పవాడేనా? రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచున్నట్లైతే అతన్నీ 'ది గ్రేట్' అని ఉండే వాళ్లేనా? కాకపోవచ్చు. అప్పుడు చరిత్ర అతడ్ని 'హిట్లర్ ది టెర్రిబుల్' గా గుర్తుంచుకునేది. యుద్ధాలు గెలిచినంత మాత్రాన అందరూ గొప్పోళ్లైపోరనటానికి ఉదాహరణలూ చరిత్రలో బోలెడున్నాయి. అది వేరే పెద్ద చర్చ.

మీరు చెప్పే రాజకీయాంశాలమధ్య ఎందుకు అవాస్తవాలని చొప్పించాలని ప్రయత్నిస్తారో నాకు అర్థం కావడంలేదు. "ఇ" అన్న అక్షరం ముస్లింలకు పవిత్రమైనదని ఎవరు చెప్పారు? పర్షియన్ (అరబిక్ లో కూడా) భాషలో "ఇ" అంటే తెలుగులో "యొక్క" అని అర్థం, ఇంగ్లీషు "ఆఫ్" లాగా. 'నిషాన్-ఇ-పాకిస్తాన్' అంటే పాకిస్తాన్ యొక్క లాంఛనం అని అర్థం (Icon of Pakistan).అంతకు మించి ఆ అక్షరానికి ఏ విధమైన ప్రత్యేకతా లేదు. ఇలాంటి తప్పుల వలన మీరు చెప్పే విషయం మొత్తం విశ్వసనీయత కోల్పోయే ప్రమాదం ఉంది. మీకు సాధికారత లేని అంశాలను అప్రస్తుతంగా ప్రస్తావించక పోవడమే మంచిది కదా! ఆపై మీ యిష్టం!

అభినందనలు.

హిందూకుష్ పర్వతప్రాంతాలకు ఆ పేరు వచ్చిన కరణం అది కాదు. 800AD కి ముందు ఇక్కడకు దురాక్రమణకు వచ్చిన ముస్లిము రాజులు ఒక్కరోజులో 50,000 అక్షరాలా యాభైవేలమంది హిందువులను చంపాడు. అందుకే ఈ పర్వతాలకు ఆ పేరు వచ్చింది. ఈ పర్వతాలు పాకిస్తాను మరియు ఆఫ్గనిస్తాను సరిహద్దు దేశాలలో ఉంటాయి.
ఆ పేరు రావడానికి మరో కారణం కూడా ఉంది. ఇక్కడ చలికాలంలో విపరీతమైన చల్లగా ఉంటుంది. మనదేశానికి దందయాత్రలు చేయడానికి వచ్చిన ముస్లిములు మనభారతీయులను బానిసలుగా తమ దేశాలకు తరలించేటప్పుడు ఇక్కడ పర్వతాలలోకి వచ్చినప్పుడు ఈ చలికి తట్టుకోలేక మనవాళ్ళు అధికసంఖ్యలో చనిపోయేవాళ్ళు. అందుకే ఈ పర్వతాలకు ఆ పేరు వచ్చింది.
కాని మనకు ఈ మీడియా అలా చెప్పదు. నేను వ్రాసినదానికి ఖచ్చితంగా ఒకళ్ళు నేను వ్రాసినది తప్పు అని చెబుతారు. ఇలా మనలో మనం కొట్టుకొని నిజాన్ని మరుగున పరుస్తాము. అది ఈ మీడియా చేసేది.

చంద్రమోహన్ గారూ,

’ఇ’ అన్న అక్షరం గురించి మీరిచ్చిన వివరణ నిజమేనండి. అదేవిధంగా ’ఇ’ అన్న అక్షరం ఇస్లాం ఆచరించే వారికి పవిత్రతా, ప్రాముఖ్యమూ ఉన్నదన్న విషయం కూడా నేను చదివాను. అందుచేతనే ముస్లింలు ఇమాం, ఇబ్రహిం, ఇర్ఫాన్ మొదలైన పేర్లు పెట్టుకొంటారని విన్నాను.

నాకు చరిత్రలోని ఆయా వ్యక్తుల జనన స్థలకాలాల మీద సాధికారత లేదన్నాను. ఎందుకంటే చరిత్ర విషయంలో [’ఇస్లాం – కొన్ని నిజాలు’ గారు తమ వ్యాఖ్యలో అన్నట్లు] ఎన్నో వివాదాలున్నాయన్నది నిర్వివాదాంశం గనుక.


మీరు సూచించినట్లు అవాస్తవాలు వ్రాస్తే విశ్వసనీయత దెబ్బతింటుందన్న విషయం నేనూ అంగీకరిస్తాను [ అసత్యంతో సత్యాన్ని ఆవిష్కరించలేం కదా!] అందుచేత నేనూ వ్రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటూనే ఉన్నాను. ఏదైనా వివరణలూ, సవరణలూ అవసరమైనప్పుడు మీరిలాగే వ్యాఖ్యనిస్తే నేను చాలా సంతోషంగా స్వాగతిస్తాను. కృతఙ్ఞతలు.

ఇస్లాం - కొన్ని నిజాలు గారూ,

హిందుకుష్ పర్వతాల గురించి మీరు చెప్పిన వివరాలు నిజమే కావచ్చు. అలాగే బప్పారావెల్, బుమియాన్ బుద్ధుల గురించి కూడా నేనూ చదివి వ్రాసిందే. మొత్తంగా చరిత్ర విషయంలో వివాదాలు రేగి అసలు నిజం మరుగున పడాలన్నదే మీడియా ఉద్దేశం. ఆ కుట్రనే మనం చూడవలసింది. అది చూపించే ప్రయత్నమే నేనూ చేస్తున్నాను. ఇలాంటి చర్చలతోనూ, వ్యాఖ్యలతోనూ మరింత లోతుగా మనం విషయాన్ని పరిశీలించే అవకాశం కలుగుతుంది. అలాంటి అవకాశాన్ని మీరు నాబ్లాగులో కలిగించినందుకు మీకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu