అనివార్య కారణాలు కొన్ని, వ్యక్తిగత కారణాలు మరికొన్ని, అన్నిటి కంటే ముఖ్యంగా ఉపాధి వెదుక్కోవటం అనే ప్రధాన కారణంతో.... మూడు నెలల క్రితం హైదరాబాదు నగరానికి మకాం మార్చాము.

నాలుగేళ్ళలో..... శ్రీశైలపు కీకారణ్యం నుండి నిజాంపేట (కూకట్ పల్లికి దగ్గరలో) అనబడే జనారణ్యాని కొచ్చి పడ్డాం. నిజాం పేట నిజంగా కాంక్రీట్ జంగిల్ మాత్రమే కాదు, ఏకంగా ఎడారే! ఇక్కడ నీళ్ళూ లేవు, నిప్పులూ లేవు. (అంటే విద్యుత్ సరఫరా నిరంతర అంతరాయాలతో ఉంటుందన్న మాట.)

నీటి కొరత ఉందని తెలిసినా, పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని ఊహించక, ఇప్పుడు కాస్త తీవ్రంగా ఇబ్బందులెదుర్కుంటూ, మొత్తానికీ నగర జీవనపు స్థితిగతులని మరోసారి చవిచూస్తున్నాం.

సరే! ఇవన్నీ దైనందిన సమస్యలు, చాలా మామూలు సమస్యలు! ఇవి పెద్దగా లక్ష్య పెట్టాల్సినవీ కావు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పెద్ద అడ్డంకులూ కావు.

నగరాని కొచ్చి ‘అమ్మఒడి విద్యాక్షేత్రం’ పేరుతో ఓ చిన్న స్కూలు తెరిచాం. మరోసారి చిన్నపిల్లల లోకంలో విహరించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. అయితే ఇంకా అడ్మిషన్లు లేనందున ‘ద్వారము తెరిచియే ఉన్నది, విద్యార్ధులే లేరు’ అంటూ జోకు లేసుకుంటూ విద్యార్ధుల కోసం ఎదురు చూస్తున్నాం.

ఇవన్నీ ప్రక్కన బెడితే.... నేను అమ్మఒడిలో కలం కదల్చని ఈ మూడున్నర నెలల్లో..... చాలా విషయాలు జరిగిపోయాయి.
సోనియా స్వరూపం ‘అవినీతి పై అన్నా హజారే సమరం’ నేపధ్యంలో మరింతగా స్పష్టపడింది. ‘అవినీతిపై సోనియా మౌనం’ అంటూ ప్రతిపక్షాలు ముద్దుముద్దుగా విమర్శిస్తూ, మీడియా మరింత ముద్దుగా ప్రచురిస్తూ..... విశ్వ నటన ప్రదర్శిస్తున్నాయి. సోనియా వీరభక్తులకీ, గుడ్డి భక్తులకీ కూడా, కనురెప్పలు పట్టకారుతో తెరిచి మరీ కనబడేంత స్పష్టంగా నడుస్తున్న ప్రహసనం ఇది!

అన్నా హజారే, రామ్ దేవ్ బాబాలు అవినీతి పైపోరాటం ప్రారంభిస్తే, దాన్ని నీర్చుగార్చేందుకు ఎన్ని హైసర బజ్జాలు ప్రయోగించారో ప్రత్యక్షంగా అందరూ గుడ్లప్పగించి చూసిందే! విషయాన్ని ఎంతగా హైజాక్ చేయటం అంటే....

“రామ్ దేవ్ బాబా ఎన్నో ఏళ్ళుగా యోగా సాధన చేస్తున్నాడు, ఎంతో మందికి బోధిస్తున్నాడు. అలాంటి వ్యక్తి, నెల రోజులు అన్నపానీయాలు లేకపోయినా చలించ కూడదు కదా? అలాంటిది నాలుగు రోజులకే జావ గారి, జారగిల పడ్డాడేమిటి?”..... అంటూ టీవీల్లో చర్చోపచర్చలు నడిచాయి. సదరు బాబాకి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో ఆరాలు తీసి వైనవైనాలుగా పత్రికలు ప్రచురించాయి.

అదేదో సినిమా పాటలో “మంచిని సమాధి చేస్తారా? ఇది మనుష్యులు చేసే పనియేనా? మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి?” అంటూ సోనియా భక్తులు సోనియానీ, యూపీఏ ప్రభుత్వాన్నీ వెనకేసుకొస్తున్నారు.

అంతే తప్ప..... ‘అసలు అవినీతిమయమైన ప్రభుత్వాల పనితీరేమిటి? అధినేత్రి అవతారమేమిటి?’ అన్న ఊసే లేదు.
బరి తెగించిన అవినీతి ఎంత నిస్సిగ్గుగా ఉందంటే..... ఏకధాటిగా ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ వంట గ్యాసుల ధరలు పెంచుకుంటూ పోతుంటే, ఆ నెపంతో అన్ని వస్తువుల ధరలూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. సేవల ధరలు మరింత ప్రియమై కూర్చున్నాయి.

మరో ప్రక్క..... ఫ్యూన్ ని కదిపితే కోటి రూపాయల ఆస్తులు బయట పడుతున్నాయి. ఉప తాసీల్డారుని కదిపితే, బహుళ అంతస్థుల భవనాలు, వాటి పెంట్ హౌసుల్లో బారులూ కనబడుతున్నాయి.

ఎప్పటికి భారతీయుల తామసం వదిలి రజో గుణం రగులుతుందో తెలియదు కానీ, ఆ లోపున మాత్రం జనాల నడ్డి విరగటం ఖాయం!
నూట ఇరవై కోట్ల భారతీయులని ప్రభుత్వ కుర్చీ వ్యక్తిగా నడిపిస్తున్న శాల్తీ నిజ స్వరూపమే కాదు, మచ్చ లేని వాడుగా మీడియా చేత కీర్తించబడిన ప్రధానమంత్రీ, ఆర్ధిక వేత్తా, మేధావీ, ఒబామా గుగ్గురువూ అయిన మన్మోహన్ సింగ్ నిజాయితీ ఏమిటో కూడా ప్రస్ఫుటంగానే ప్రదర్శితమౌతోంది.

ఇక, గతంలో ‘అంతర్లీన పోరూ, తెరమీద సోనియమ్మ పట్ల విధేయత’గా నడిచిన సోనియా vs వై.యస్. జగన్ ల జగన్నాటకం.... కొద్ది నెలలు నడిచేటప్పటికి ‘తెర వెనుక మైత్రీ, తెర మీద పోరు’గా పరిణ మించి, మీడియా వ్యాపారం జోరుగా చేయ బడుతోంది. దాని తాలూకూ సంఘటనాత్మక నిరూపణలతో సహా సమగ్రమైన టపా తదుపరి వ్రాస్తాను.

ఇవి దేశ, రాష్ట్రాల పరంగా నడుస్తున్న వ్యవహారాలైతే, అంతర్జాతీయంగా నకిలీ కణిక వ్యవస్థకి నడ్డి విరిగే గడ్డు పరిణామాలు బాగానే ఏర్పడ్డాయి. కీలక ఏజంట్లు నిర్మూలింపబడ్డారు. బాబాల దగ్గర నుండి బిన్ లాడెన్ ల దాకా, చావు తప్పి కన్ను లొట్ట పోవటం గాక, లొట్ట పోయిన కళ్ళతో సహా చావు తప్పక పోవటం పరిశీలించ దగినవే! వాటి గురించిన వివరాలు నెమ్మదిగా వ్రాస్తాను. ప్రస్తుతం ఈ చిన్న టపాతో ముగిస్తున్నాను.


                 

బహుకాల దర్శనం!

అనివార్య కారణాలతో దాదాపు మూడు నెలలుగా `అమ్మఒడిలో టపాలు ప్రచురించలేదు. `టపాకాయలూ పేల్చలేదు. `అనగా అనగా అంటూ కథలూ చెప్పలేదు.

          ఈ మూడు నెలల్లో..... నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ కీలక ఏజంట్లు కొందరు పైకి ఠపాకట్టేసారు. రాజకీయ అవనిక మీద పైపైన చూస్తే…. రంగులు రకరకాలుగా మారిపోయాయి. లోతుగా చూస్తే…. స్థితిగతులన్నీ యథాతథంగా ఉండిపోయాయి. వాటి గురించి తర్వాత విశ్లేషిస్తాను.

          ప్రస్తుతానికి.... మీ కోసం..... ఓ చక్కని కథ.
మన కథ మనకి చక్కగా అనిపిస్తుంది కదండి. కాకి పిల్ల కాకి కి ముద్దు అన్నట్లు మన రచన మనకి ముద్దు మరి!
                                           ~~~~~~~~~~~~~

డాడీ! నా టై కనిపించటం లేదు పండుగాడు గావుకేక పెట్టాడు.

మంచమ్మీదే పెట్టాను చూడరా! పాపకి ఫ్రాకు తొడుగుతూ చెప్పాడు సుమంత్!

లేదు డాడీ! ఇందాక చిట్టి తీసినట్లుంది మరో కేక!

ఏరా చిట్టి తల్లి! అన్నయ్య టై తీసావా?

లేదు డాడీ! పండు ఆబద్దాలు టెల్లింగ్ చిట్టితల్లి సగం తెలుగు సగం ఇంగ్లీషులో ఎల్కేజీ జ్ఞానం చూపెట్టింది.

ఇంతకీ నీ బెల్ట్ ఏది? సుమంత్ మంచం పైన వెతుకుతూ అన్నాడు.

పండూ! నా బెల్ట్ ఏది? చిట్టితల్లి అరిచింది.

నా టై ఏది? పండు రిటార్టు.

ఓరేయ్! నేను అన్నీ మంచంపైనే పెట్టాను. స్కూల్ టైమ్ అవుతుంది. వ్యాన్ వస్తుంది. కానీయండర్రా! మళ్ళీ టిఫిన్ తినాలి సుమంత్ కి టెన్షన్ వచ్చేస్తోంది.

నాన్నా! పొయ్యి మీద పాలు పొంగి పోతున్నాయ్ టై వెదుక్కుని కట్టుకుంటూనే పండుగాడు అరిచాడు.
          
   ఓర్నాయనో!’ సుమంత్ వంటగది వైపు పరుగు పెడుతుండగా సెల్లు ఫోను గొల్లుమంటూ గోల పెట్టింది.
ఫోన్ ఆన్ చేసీ చెయ్యక ముందే ఆఫీసర్ ఇన్స్ స్పెక్షన్ ఉందనీ గంట ముందుగా రమ్మనీ”’ ఆర్డరేస్తున్నాడు. జవాబిస్తుండగానే బాల్కనీ లోంచి పనిమనిషి పార్వతి సారూ! గిన్నె లెయ్యండ్రి. తొరగా బోవాల! అంటోంది.

          మరో ప్రక్క కుక్కర్ కుయ్యిన విజిల్ వేసింది.

అన్నిపనుల మధ్యన ఊపిరి సలపనట్లయ్యింది సుమంత్ కి!

సంవత్సరం క్రితం

తన ఇల్లు, తన కుటుంబం. తన జీవితంఒక్కక్షణం తలపుకు రాగానే కన్నీళ్ళు తిరిగాయి.

డాడీ! త్వరగా కానీయ్! స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది అరిచాడు పండుగాడు.

కాళ్ళ తొక్కుకున్నట్లుగా కిచెన్ లోకి పరిగెత్తాడు సుమంత్! అన్నం పప్పు, ఉడికిన గుడ్డు బాక్సుల్లోకి సర్దాడు. అప్పటికే పండు బాటిల్స్ కి నీళ్ళు నింపాడు. లంచ్ బాక్సులు బుట్టల్లోకి సర్ధి, ఒక్క పరుగున వరండాలో కొచ్చి చిట్టికి బూట్లు వేసే పనిలో పడ్డాడు.

          పక్క పని మనిషి పార్వతి అరుస్తూనే ఉంది. గెన్నెలు తోమేందుకు పౌడర్ ఇమ్మనో, కొత్త స్క్రబ్బర్ ఇమ్మనో! అటెండ్ చేసేందుకు టైమ్ లేదు. స్కూల్ వ్యాన్ వెళ్ళి పోయిందంటే పిల్లల్నీ బైక్ మీద తీసికెళ్ళి స్కూల్లో దింపి రావాల్సిందే! లేదంటే ఇంట్లో ఉంచుకోవాలి. ఇంట్లో ఉంచుకోవాలంటే, తాను ఆఫీసుకి సెలవు పెట్టాల్సిందే! ఆడ దిక్కులేని ఇంట్లో, భరోసాతో పసి వాళ్ళని ఇంట్లో ఉంచి ఆఫీసుకి వెళ్ళగలడు?

          ఇప్పటికే వేసవి సెలవులొస్తేశిక్షణా శిబిరాలనీ, తొక్కనీ తోలనీ పిల్లల్ని నానా హైరానా పెట్టాల్సి వస్తోంది. పసివాళ్ళ ముఖం చూస్తే కడుపు తరుక్కుపోతోంది.

          ఆలోచిస్తూనే చిట్టితల్లికి బూట్లు వేసి రెడీ చేసాడు. ఇంతలో స్కూల్ వ్యాన్ రానే వచ్చింది. ఉరుకులూ పరుగుల మీద పండుగాడు చెల్లిల్ని లాక్కుని వెళ్తుంటే, పుస్తకాల బ్యాగులు, లంచ్ బ్యాగులూ అందించాడు సుమంత్!

          పిల్లలు బై చెప్పి వెళ్ళేదాకా ఉండి వెనుదిరిగి చూస్తే అప్పటికే పనిమనిషి పార్వతి "ఇంతాలస్యం చేస్తే ఎట్టాసారూ! అవతల నాకు మాటాచ్చేత్తది. పోతా మరి! అనేసి విసావిసా వెళ్ళిపోయింది. బిత్తర బోయాడు సుమంత్!

          ఇంట్లో కొచ్చి చూస్తేఎంగిలి గిన్నెలన్నీ బాల్కనీలో నల్లా దగ్గర పడేసి ఉన్నాయి. కనీసం సింక్ లో ఉన్నా కడుక్కోవటం కొంచెం తేలిక. పనిమనిషి వచ్చింది గదా అని బాల్కనీలోకి ఇచ్చాడు. సబ్బు పొడి అయిపోయింది. తెమ్మని చెప్పింది నిన్ననే! గుర్తుంచుకొని తెచ్చాడు గానీ, పిల్లల్ని పంపే హడావుడిలో వెంటనే ఇవ్వలేదు, వెళ్ళిపోయింది.

          ఆమెని మాత్రమేం అనగలడు? పది యిళ్ళల్లో పని చేసుకునే మనిషి. లేటయితే తను అరిచినట్లే వేరేవాళ్ళూ కేకలేస్తారు గదా!

          నిట్టూర్పు విడిచి పని మొదలు పెట్టాడు. గిన్నెలు కడిగి , గదులూడ్చేసరికేలేటవుతుందన్న టెన్షన్ ప్రక్క, చేతనయ్యీ కానీ పని ప్రక్క. చెమట, కళ్ళనీళ్ళూ కలగలిసి పోయాయి.

          ఆదరా బాదరా అయ్యిందనిపించి, స్నానం చేసి ఆఫీసుకి బయలు దేరాడు. టిఫీన్ తినే సావకాశమూ మిగల్లేదు. వారంలో నాలుగుసార్లు ఇంతే అవుతోంది. మరోప్రక్క ఇలా తినీ తినకుండా గడిపితే, నాలుగు రోజులు పోయాక తనకి ఆనారోగ్యమో కలిగితే పిల్లలకి దిక్కెవరు? అనే భయం నలిపేస్తోంది. అసలే తల్లి లేని పిల్లలు! పండు, చిట్టిల ముఖాలు కళ్ళ ముందు కదలాడాయి. గుండె చిక్కపట్టి నట్లయ్యింది సుమంత్ కి!

          సంవత్సర క్రితంతన ఇల్లు, తన కుటుంబం? ఎలా ఉండేవి! నీరజ ఇంటినెప్పుడూ అద్దంలా ఉంచేది. ఎక్కడుండాల్సిన వస్తువు అక్కడ బుద్దిగా, క్రమశిక్షణ గల సైనికుడిలా ఉండేది.

          ఉదయమే లేచి, తనకీ పిల్లలకీ అన్నీ అమర్చేది. టైమ్ కి ఆఫీసుకి వెళ్ళేవాడు తను. నవ్వుతూ వీడ్కొలిచ్చేది. పిల్లలు అప్పుడే విరిసిన గులాబీల్లా ఉండేవాళ్ళు. యాపిల్ పళ్ళలా ఎర్రని మెత్తని బుగ్గలు ఇప్పుడు వసివాడి పోయాయి. బూరి బుగ్గలు కాస్తా ప్లాట్ గా అయిపోయాయి.

          అసలు నీరజ పోయినప్పుడైతే చిట్టి నర్సరీలో ఉంది. పండుగాడు మూడు చదువుతున్నాడు. తనకే నీరజ లేని ఇల్లు, జీవితం ఏమీ అర్ధం కాని చోటపసిబిడ్డలు అమ్మలేదు అన్న విషయం ఎలా జీర్ణించుకున్నారో! చిట్టిది ప్రతిక్షణం ఏడ్చింది. అసలు బ్రతకుతుందా? అని భయపడ్డాడు తను!

          దీనంతటికీ కారణం తనే! పరితాపంగా అనుకున్నాడు.

ఏంటీ సుమంత్ అంత పరధ్యానం? కాస్త ఉంటే ఆటోకి గుద్దేసి ఉండేవాడివి కొలీగ్ నాగప్రసాద్ హెచ్చరించటంతో లోకంలోకి వచ్చాడు. అప్పటికే ఆఫీసుకి చేరి పోయినందుకు ఆశ్చర్యపోతూ... అంత పరధ్యానంగా డ్రైవ్ చేసానా? జాగ్రత్త పడాలి. తనకేమైనా అయితేఇంకేమైనా ఉందా? చిట్టీ పండు అనాధలై పోతారు తనని తాను హెచ్చరించుకున్నాడు సుమంత్!

                             ~~~~~~~~~              ~~~~~~~~~~~~

          సాయంత్రం ఆరున్నరవుతోంది. వేసవి సాయంత్రం వేడిగాలులింకా తగ్గలేదు. పార్కు పచ్చికకి కొంచెం చల్లగా అనిపిస్తోంది. పిల్లలిద్దరూ బంతితో ఆడుతున్నారు. సుమంత్ సిమెంట్ బెంచీ మీద కూర్చొని, వాళ్ళ వైపే రెప్పలార్పకుండా చూస్తున్నాడు.

          వాళ్ళకి సెలవులిచ్చారు. తనకి సెలవలు రావు. రోజంతా పిల్లల్ని ఎక్కడుంచాలి? ఇప్పుడిప్పుడే పరిస్థితులు అర్ధం చేసుకుంటున్న పండు చేతిలో చెల్లెల్ని, ఇంటినీ పెట్టి ఆఫీసుకి వెళ్ళినా ప్రాణమంతా పిల్లల దగ్గరే ఉంటుంది.

          మోసగాడైనా పిల్లలు ఒంటరిగా ఉంటారని కనిపెట్టి ఇల్లు దోచడు గదా? అంతటితో వదులుతాడా? పిల్లలకేమైనా కీడు తలపెడితే! ఆఫీసులో ఉన్నా ప్రతీక్షణం ఏవో ఆలోచనలొస్తాయి. మనస్సు స్థిమితంగా ఉండదు. అప్పటికే మధ్య మధ్యలో ఫోన్లు చేస్తూనే ఉంటాడు.

          డాడీ! డాడీ! ఐస్ క్రీం! చిట్టి పరిగెత్తుకు వచ్చింది. పిల్లలిద్దరికీ అయిస్ క్రీం కొనిచ్చాడు. వాళ్ళ వైపు చూస్తుంటే మనస్సు తరుక్కు పోయింది.

          అసలెందుకిలా జరిగింది? ఒక్క రోజు, ఒక్కక్షణం! తాను అలవాటుగా తన సహనం కోల్పోయాడు. కోపాన్ని దాటలేక పోయాడు. ఫలితం? జీవితం శూన్యమై పోయింది నిస్పృహగా అనుకున్నాడు సుమంత్! అలాగే ఆలోచనల్లోకి జారిపోయాడు.

          నీరజ! నిజంగానే నీటిలో విరిసిన కలువలా ముగ్ధంగా ఉంటుంది. తాను ఉద్యోగంలో చేరిన కొత్తలోతనూ అదే బస్టాపులో బస్సేక్కేది. డిగ్రీ తొలి ఏడాది చదువుతున్న అమ్మాయి, సుమంత్ కి నిద్రలో కూడా మరుపుకొచ్చేది కాదు. గొప్ప అందగత్తె అని కాదు గానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ సుమంత్ కి చాలా నచ్చేది.  

నమ్రతగానవ్వినప్పుడు చిరుముత్యల సవ్వడిలా! అసలామె తన కోసమే పుట్టిందా అనిపించేది. ధైర్యం చేసి మాట కలిపాడు. వివరాలు సేకరిస్తే తెలిసిందేమంటేనీరజకి పదేళ్ళున్నప్పుడే అమ్మానాన్న పోయారు. పిన్ని బాబాయిల దగ్గరే పెరిగింది. పెద్ద ఆస్తిపరులు కాకున్నా పల్లెలో నాలుగెకరాల పొలం ఉంది. అయివేజుతో నీరజని పోషించి చదివిస్తున్నాడు పినతండ్రి.

ఇదంతా తెలిసాక... నీరజ చాలా సున్నిత మనస్కురాలు అనే నా అంచనా కరెక్టే అనుకున్నాడు సుమంత్! 

నేరుగా ఆమె పిన్ని బాబాయిలను కలుసుకుని పిల్ల నివ్వమని అడిగాడు సుమంత్! తర్వాత ఇరువైపులా పెద్దలూ మాట్లాడుకుని పెళ్ళి జరిపించారు.
          
            నీరజ తన జీవితంలోకి ప్రవేశించాక సుమంత్ కి జీవితం పూల పల్లకి అనిపించింది. నీరజ తాను అనుకున్న దానికంటే కూడా సున్నిత మనస్కురాలే అనుకునే వాడు సుమంత్! చిన్న విషయాలకి నొచ్చుకునే నీరజని గాజుబొమ్మని చూసుకున్నట్లు చూసుకునే వాడు.

         తాను మొదటి నుండీ దురదృష్టవంతురాలిననే సెల్ఫ్ పిటీ ఎక్కువ నీరజకి. సుమంత్ ఆమెనెంతో ఊరడించేవాడు. ముద్దు చేసేవాడు.

          రెండేళ్ళు తిరిగేసరికి పండుగాడు ఒడి చేరాడు. అసలుకే చేసేవాళ్ళు లేరు అని నాలుగేళ్ళ ఎడం తీసుకున్నారు. చిట్టిది పుట్టింది. అప్పటికి సంసారం అలవాటైంది.

          ఏడాది క్రితం ఆఫీసులో కొత్త బాసు వచ్చాడు. దేనికో దానికి విసిగిస్తూ, రెడ్ టేపిజం చూపిస్తూ హింస పెట్టేవాడు. ఆఫీసు వత్తిళ్ళు ఇంటికి తీసికెళ్ళకూడదని ఎన్ని సార్లు విన్నా, అనుకున్నాతరచూ నీరజని విసుక్కోవడం మొదలయ్యింది. ప్రధమ కోపం తగ్గాక... గారాలు, సంజాయిషీలు చెప్పుకునేవాడు.

          నీరజ కూడా రెట్టించేది కాదు. గుడ్లనీరు కుక్కుకునేది.

          రోజు జీవితంలో రాకూడని రోజు.

ఒక్కసారి వెనుదిరిగి వస్తే తనెప్పుడూ మళ్ళీ పొరపాటు చేయని రోజు!

ఉదయమే ఆఫీసుకి రెడీ అవుతున్నాడు. బాసు ఫోను చేసి ఏదో పురమాయించాడు. నిన్నటి పనే పూర్తి కాలేదన్న టెన్షన్ లో ఉన్నాడు తను. నీరజ ఏదో అడిగింది. ఏదో కావాలని చాలా రోజుల నుండి అడుగుతోంది. రోజూ మామూలుగానే అడిగింది.
          
 అంతే! ఒక్కక్షణం ఫైర్ అయిపోయాడు తను. ఖస్సున మాటలనేసాడు. ఎందుకూ పనికిరావు. ఏదీ అర్ధం చేసుకోవు. ఎప్పుడేది మాట్లాడాలో కూడా తెలీదు అంటూ నోటికొచ్చినట్లు అనేసి ఆఫీసు కెళ్ళి పోయాడు. తిట్టాననిపించి, ఫోన్ చేద్దామనుకున్నా ఆఫీసులో కుదర లేదు.

          సాయంత్రం ఇంటికొచ్చేసరికి పిల్లలు వరండాలోనే ఉన్నారు. ఏడుస్తూ డాడీ! ఎంత పిలిచినా మమ్మీ తలుపు తీయటం లేదు అన్నారు. ఒక్కక్షణం గుండె వణికింది సుమంత్ కి! సిక్త్స్ సెన్స్ అన్నట్లు మనస్సెందుకో కీడు శంకించింది.

          తలుపు తట్టాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. జవాబు లేదు. అప్పటికే ఇరుగు పొరుగూ వచ్చారు. ఉదయం నుండీ నీరజ బయటకి రాలేదు. ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నాం అంది పక్కింటి కమల.

          బలవంతాన తలుపులు విరగ్గొడితే, లోపల

          సీలింగ్ ఫ్యాన్ కి వేళ్ళాడుతూ నీరజ! అప్పటికి ప్రాణం పోయి చాలా సేపయ్యింది.

          సుమంత్ కి స్పృహ తప్పినంత పనయ్యింది. బంధువులూ స్నేహితులూ వచ్చారు. పోలీసులూ వచ్చారు. కేసు అవ్వలేదు. స్వదస్తూరితో నీరజ సూసైడ్ నోట్ ఉంది. పోలీసులకి, తనకివిడివిడిగా! ఉత్తరం ఎన్ని సార్లు చదివాడో!

ప్రియమైన శ్రీవారికి!

          చిన్నప్పటి నుండీ నేను దురదృష్టవంతురాలినే! పదేళ్ళకే అమ్మానాన్నల్ని పోగొట్టుకున్నాను. పెళ్ళై మీ జీవితంలో కొచ్చాక మిమ్మల్నీ సుఖపెట్టలేకపోయాను. నిరంతరం నిరాశకి గురయ్యే నా మనస్తత్వంతో మీరూ బాధపడటం నాకిష్టం లేదు. సైక్రియాట్రిస్ట్ దగ్గరికి రమ్మంటారు మీరు. అది నాకిష్టం లేదు. రేపు నా పిల్లల్ని ఎవరైనా పిచ్చిదాని పిల్లలంటే! అందుకేవెళ్ళిపోతున్నాను. పిల్లలు జాగ్రత్త

          కన్నీటితో తడిసిన ఉత్తరాన్ని మరోసారి చదివి జేబులో పెట్టుకున్నాడు సుమంత్! తనని పోలీసు కేసు నుండి రక్షించడానికే, నీరజ తన మానసిక రోగినన్న ముద్ర వేసుకుంటూ సూసైడ్ నోట్ వ్రాసింది.

          సార్! ఇక్కడ కూర్చో వచ్చా! ఎవరో అడిగితే తలవూపాడు.

          తనకంటే పదేళ్ళ పెద్ద ఉంటాడతడు. బెంచీ మీద కూర్చొని సెల్ ఆన్ చేసాడు.

          శాంతమూ లేకాసౌఖ్యమూ లేదు భానుమతి గొంతులో త్యాగరాజ కృతి వస్తోంది. ఎంత నిజం! అప్రయత్నంగా అనుకున్నాడు సుమంత్!

          ఒక్కక్షణం శాంతంగా ఆలోచించి ఉంటే, తాను నీరజని రోజు తిట్టి ఉండేవాడు కాదు. ఒక్క క్షణం శాంతంగా ఆలోచించి ఉంటే, నీరజ... తనని పిల్లల్నీ దిక్కులేని వాళ్ళని చేసి పోయేది కాదు. తాను క్రోధంతో తిట్టకుండా శాంతం వహించలేక పోయాడు. నీరజ దుఃఖంతో రోష పడకుండా శాంతం వహించలేక పోయింది. ఫలితం? నీరజ అర్ధాయుష్షుతో జీవితం ముగించి వెళ్ళిపోయింది.

          తాను చావలేక బ్రతుకుతున్నాడు. తన మూలంగానే నీరజ చనిపోయిందన్న భావన తన మనస్సుని రంపపు కోత కోస్తోంది. పిల్లల్ని తల్లి లేని వాళ్ళని చేసానన్న వ్యధ కాలుస్తోంది.

          ప్రతి రోజూ ఇల్లు సవరించు కునేసరికి తలప్రాణం తోకకి వస్తోంది. తన దగ్గరుండి పిల్లల ఆలనా పాలనా చూడగల స్థితిలో తన తల్లి లేదు. ఆమె ముందే రోగిష్టిది.

          దూరంగా పిల్లలు ఆడుకుంటున్నారు. పండుచిట్టిప్రక్కన ఎవరు? పద్దెనిమిదేళ్ళుంటాయి. చేష్టలు చిట్టి కంటే కూడా చిన్నపిల్లాడిలా ఉన్నాయి.

          ఆశ్చర్యంగా ఉందా సుమంత్ గారు! పిల్లవాడు నా కొడుకు! ప్రక్కన కూర్చొన్న వ్యక్తి అన్నాడు.

          బిత్తరపోయి చూసాడు సుమంత్!

మీ పేరు నాకెలా తెలుసనా? నేను మీ వీధిలోనే ఉంటాను. నా పేరు శేఖర్!చేయి చాస్తూ అన్నాడు.

యాంత్రికంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు సుమంత్!

మనం ఒకే పడవ ప్రయాణాకులమండీ! అందుకే పాటంటే నాకు చాలా ఇష్టంమరోసారి శాంతమూ లేక…’ పాటని ట్యూన్ చేస్తూ అన్నాడు శేఖర్.

          కొంచెం కుతూహలం, కొంచెం నిర్లిప్తత కలగలిసి ఉన్నాయి సుమంత్ చూపులో!

మేం కాలనీకి వచ్చి రెండేళ్ళవుతుంది. ఏడాది క్రితం మీ భార్య సూసైడ్ కమిట్ చేసినప్పుడు, మీ అన్నయ్యతో పాటు పోలీసుల్ని కూల్ చేయడంలో నేనూ  పార్టిసిపేట్ చేసాను అన్నాడు శేఖర్!

          ఈసారి అలర్ట్ నెస్ వచ్చింది సుమంత్ లో!

మరోలా అనుకోకండి! అదిగో వాడు నా కొడుకు గౌతమ్. వాడికి పదేళ్ళున్నప్పుడు చెప్పిన మాట వినడం లేదని, క్రికెట్ ఆడవద్దంటే మానటం లేదని చాలా కోపంగా ఉండేది నాకు. ఎంతగా చిన్నపిల్లాడు అని సరిపెట్టుకున్నా ఒక్కసారి ఒళ్ళెరగని కోపం వచ్చేది. అలాంటి కోపంతో రోజు వాణ్ణి జుట్టుపీకి కొట్టాను. విసురుకి తల వెళ్ళి గోడకి తగిలింది…” డగ్గుత్తుకతో ఆగాడు శేఖర్.

          మ్రాన్పడి చూస్తున్నాడు సుమంత్!

          స్పృహ తప్పింది గౌతమ్ కి. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసికెళ్తేబ్రెయిన్ దెబ్బతిందన్నారు. ఎందరు డాక్టర్లు ఎన్ని మందులు! ఒక్క క్షణపు నా కోపం. నా చిట్టి తండ్రిని పిచ్చివాడిని చేసింది. చదువుకోకపోయినా ఫర్వాలేదు. ఏదో పని చేసుకు హాయిగా బ్రతికేవాడు.

ఇప్పుడు? ఆకలి తెలియదు, దుస్తులు వేసుకోవటం తెలియదు. పిచ్చివాడు. నా బిడ్డ పిచ్చివాడు! కేవలం నా కోపం కొద్దీ ఒక్క క్షణం నిగ్రహించుకోలేక పోయిన నా కోపం కొద్దీ.... నేనే చేసాను కళ్ళ నుండి నీళ్ళు ధారలు కడుతుండగా, వెక్కిళ్ళను కంట్రోలు చేసుకుంటూ, శేఖర్ మాట తడబడ్డాడు.
          
 అప్రయత్నంగా అతడి చేయి పట్టుకుని, భుజం చుట్టూ చేయి వేసి హత్తుకున్నాడు సుమంత్!

          శేఖర్ కొద్ది క్షణాలకి తేరుకున్నాడు.

          కాబట్టే!... రోజు మీ స్థితి అర్ధం చేసుకున్నాను. అందుకే మనం ఏక పడవ ప్రయాణీకులం అన్నాను అన్నాడు శేఖర్.

          అతడి కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతూ క్రిందికి జారుతున్నాయి.

సుమంత్ కి ఫ్యానుకి వేలాడుతున్న నీరజ నాజూకు శరీరం గుర్తుకొచ్చి దుఃఖం తన్నుకొచ్చింది.
          
 తన చేతుల్లో మెలికలు తిరిగిన పూల తీగెలాంటి శరీరం!

          నిర్ధాక్షిణ్యంగా సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ!

          సుమంత్ కళ్ళల్లోంచీ నీళ్ళ ధార కట్టాయి.

          శేఖర్ చేయెత్తి సుమంత్ కన్నీరు తుడిచాడు.

          అతడి చేతులు ఇద్దరి కన్నీటితో తడిసి ఉన్నాయి.

          దుఃఖాశృవులతో తడిసిన కళ్ళల్లో.... ఒక్కక్షణం తిరిగి వస్తే?అన్న భావన!

          ప్చ్! అది కాలం! తిరిగి రానిది!

శాంతమూ లేక సౌఖ్యమూ లేదు పాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది.

          ఆఫీసుల్లోనూ, పని చేసే చోట, బయట ఇంకెక్కడైనా సరేబాసు మీదో, పక్కవాళ్ళ మీదో కోపం వచ్చినా నిగ్రహించుకుంటాం. కోపం తెచ్చుకుంటే కుదరదన్న స్పృహతోనో, సాగదన్న భయంతోనో అనివార్యంగా శాంతం తెచ్చి పెట్టుకుంటాం. అదే కుటుంబ సభ్యుల మీదైతేచనువు కొద్దీనో, ఏం కాదన్న భరోసా కొద్దినో కోపం వెళ్ళగక్కేస్తాం.

          రాజు చేతి దెబ్బ, రైతు చేతిలో మేక తిన్నట్లు, ఎక్కడి కోపాన్నో కుటుంబ సభ్యుల మీద చూపెడతాం. ఫలితంగా కుటుంబ సౌఖ్యం కోల్పోతున్నాం.

          నిజంగా శాంతమూ లేక సౌఖ్యము లేదు అన్న త్యాగ రాజ స్వామి మాట ఎంత గొప్పది!? ఇలాంటివి ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మరిచి పోతుంటాం!

పిల్లలుగా మనం ఎన్నోసార్లు తన కోపమే తన శతృవు అంటూ సుమతీ శతకాలు వల్లించాం. పిల్లల చేత బట్టీ వేయించి అప్పగింపించుకుంటూ ఉంటాం. కానీ, కోపం వచ్చిన ఒక్క క్షణంఒక్కక్షణం ఆగి శాంతంగా ఆలోచించం. ఆలోచిస్తేఅదిగో, పండు, చిట్టి, గౌతమ్ లు అలా ఉండరు శేఖర్ నెమ్మదిగా అన్నాడు.

మంద్ర గంభీరంగా పలికిన అతడి గొంతు, సుమంత్ కి జీవిత సత్యాల్ని చెబుతున్నట్లుగా వినిపించింది.

అందునా తనకి అనుభవపూర్వకంగా అర్ధమైన సత్యం!

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం నేర్పిన సత్యం!

నిజంగానే శాంతమూ లేకసౌఖ్యం ఎక్కడుంది?
                   ~~~~~~~~~~

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu