ఇక ఇంటర్ ప్రకరణం తరువాత ఎంసెట్ ప్రకరణం ఉంటుంది. ఇప్పుడంటే ఇంజనీరింగ్ కాలేజీలు తామర తంపరగా రంగం మీదికొచ్చి, [ఎందుకిలా ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు పెరిగి పోయాయో క్రమానుగతంలో వివరిస్తాను] సీట్లు మిగిలిపోయేస్థితి ఉంది గానీ, అప్పటికి అంటే 2000 నాటికి ఇంజనీరింగ్ కి కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ గిరాకీగా నడుస్తుండేది. ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ లోనూ ICS [Intensive care Sections] ఉండేవి. ఆ సెక్షన్లలోకి బాగా చదివే పిల్లల్ని Promote చేస్తారు. అందుకు internal tests, week tests లో మార్కులు parameters గా చెబుతారు. ఆ సందట్లో ఇంకొందరు విద్యార్ధుల్ని కూడా ఆ సెక్షన్ల్ లోకి తోస్తారు. కొన్ని కాలేజీల్లో intensive batch లకి అదనపు ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టిన విద్యార్ధులని ఆ సెక్షన్లలో వేస్తారు. వాళ్ళకి అదనపు శిక్షణ ఇవ్వబడుతుందనీ, ప్రత్యేకశ్రద్ద చూపుతారనీ చెబుతారు. ఇవి పైకారణాలు మాత్రమే. ఆ సెక్షన్లలోని పిల్లలకి ఎక్కువమందికి మంచి ర్యాంకులు వస్తాయి. తదుపరి సంవత్సరాల్లో ఆ సెక్షన్లకి మరింత గిరాకీ ఏర్పడుతుంది. అలాంటి ప్రత్యేక సెక్షన్లలో కొందరు విద్యార్ధులు బాగా చదివే వారుంటారు. వారికి ఎటూ మంచిర్యాంకులు వస్తాయి. ఇంకొందరికి కాలేజీ యాజమాన్యాలు ర్యాంకులు కొంటాయి. ఇందులో విద్యార్ధుల ప్రమేయం గానీ, వారి తల్లితండ్రుల ప్రమేయం గానీ ఉండదు. కాలేజీ యాజమాన్యాలు, తమ స్వంత గణాంకాలు, విశ్లేషణలతో ఏయే విద్యార్ధులకి ర్యాంకులు ఇవ్వాలో నిర్ణయించుకుంటాయి. ఇక్కడ PRO ల పాత్ర గణనీయంగా ఉంటుంది. ఏయే ప్రాంతాల్లో మలిసంవత్సరం 10th ఎంతమంది వ్రాస్తారు, వారిలో ఇంటర్ కి కార్పోరేట్ కాలేజీల్లో చేరగలిగిన వారు ఎంతమంది ఉంటారు అన్న లెక్కలు ముందుగా కడతారు. ఇక ఆయా ప్రాంతాల నుండి ప్రస్తుతం తమ దగ్గర ఎందరు విద్యార్ధులు ఉన్నారు, వారిలో ఎవరెవరు ఏయే తరగతులు – అంటే Jr. Inter, Sr. Inter, Long term coaching, Intensive batch ల్లో ఉన్నారు లెక్కలు చూసుకుంటారు. అలాంటి విద్యార్ధుల్లో ఎవరెవరి తల్లితండ్రులకి ఆయా ప్రాంతాల్లో ఎంత పరపతి, పేరు ప్రఖ్యాతులు, ప్రభావం ఉన్నాయో చూసుకుంటారు. అంటే స్థూలంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లో ఏయే విద్యార్ధులకి ఎంసెట్ ర్యాంకులూ, ఇంటర్ లో మంచిమార్కులూ ఇప్పిస్తే, ఆ ప్రభావంతో తదుపరి సంవత్సరం తమకు ఎన్ని అడ్మిషన్లు వస్తాయి అన్న లెక్కమీదే ఇదంతా ఆధారపడుతుంది. అంటే ‘X’ అనే ప్రాంతంలో రామయ్య అనే పేరెంట్ కి పరపతి లేదా పేరుప్రఖ్యాతులు ఎక్కువగా ఉన్నాయనుకొండి. అంటే సదరు రామయ్య కొడుకుకు ర్యాంకు వస్తే, అది ఎక్కువ ప్రచారమై ఆ ప్రభావంతో తమకి ఎక్కువ అడ్మిషన్లు వస్తాయి అనుకుంటే, క్రమంగా రామయ్య కొడుకు లో డైరెక్టర్ లకి spark కన్పిస్తుంది. ‘ఫలానా విద్యార్ధి ప్రస్తుతం internal test లు బాగా వ్రాయకపోయినా, ప్రత్యేక శ్రద్దా, శిక్షణా ఇచ్చి సాన బెడితే బెస్ట్ ర్యాంకర్ అవుతాడు. మన కాలేజీకే ఓ asset అవుతాడు’ లాంటి వ్యాఖ్యలతో సదరు డైరెక్టర్లు ఆయా విద్యార్ధుల్ని IC Batch కి promote చేస్తారు. ఒకోసారి ఇందులో సహజత్వం కోసం ఆయా ప్రాంతాల్లోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్ధికి కూడా ఇలాంటి అవకాశం వస్తుంది. సహజత్వం ఎందుకంటే – తమ మోసం బయటపడకుండా ఉండేందుకు. ఎంసెట్ ఫలితాల తర్వాత ఈ ర్యాంకులు, అద్భుతాలు సాధించటం షరా మామూలే. దాంతో మరు సంవత్సరం అడ్మిషన్ల వెల్లువ వస్తుంది.

ఇక ఎంసెట్ ఫలితాలకు ముందు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు [బ్యూరోక్రాట్లు], ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు, మంత్రులు, కార్పోరేట్ కళాశాలల యాజమాన్యాల మధ్య వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయి. కార్పోరేట్ కళాశాలల యాజమాన్యాలు ‘Top 10 లోపల ఎవరెన్ని ర్యాంకుల కొనుక్కోగలరు, Top 100 లో ఎన్ని, Top 1000 లో ఎన్ని, మొత్తంగా ఎన్ని ర్యాంకుల’ [అంటే Seat secured ranks అన్నమాట] అన్న డీల్స్ ని టెండరు పాడుకున్నంత స్థాయిలో కొనుక్కుంటారు. తర్వాత తాము కొనుక్కున్న Top 10 లోని ర్యాంకుల్ని, Top 100 లోని ర్యాంకుల్ని, Top 1000 లోని ర్యాంకుల్ని, PRO ల సాయంతో, తమ నెట్ వర్కు సాయంతో, తాము తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆయా విద్యార్ధులకి రప్పిస్తారు. అందుచేత ఎంసెట్ ఫలితాల్లో మనకి అద్భుతాలు, అసాధారణాలు కన్పిస్తాయి. ఒకోసారి బాగా చదవుతారని పేరున్న పిల్లలకి ర్యాంకులు రావు. ‘దురదృష్టమనో, మనమే సరిగా అంచనా వేసుకోలేక పోయామనో, విద్యార్ధి పరీక్ష పాడుచేసి ఉంటాడనో’ అనుకుంటారు విద్యార్ధులూ, వారి తల్లితండ్రులూ. ఒకోసారి బాగా చదవని విద్యార్ధులకి మంచి ర్యాంకులు వస్తాయి. ‘వాడి అదృష్టమనో, ఇది మనకు అర్ధంకాని matter అనో, మన పిల్లవాడే తన failure కప్పిపుచ్చుకోవడానికి ర్యాంకర్ గురించి, వాడు బాగా చదవడని చెబుతున్నాడమో’ అని విద్యార్ధుల తల్లితండ్రులు అనుకుంటారు. ఇవన్నీ గుడ్డివాళ్ళు ఏనుగుని తడమటం వంటిదే. అసలు ఏనుగు ఏమిటంటే మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ర్యాంక్ ఫిక్సింగ్ అన్నమాట. ఇది తెలియక కొందరు తల్లితండ్రులు ర్యాంకు తెచ్చుకోని తమ పిల్లల్ని ‘మీమీద వేలకు వేలు కుమ్మరించామనీ, చదవకుండా మమ్మల్ని మోసం చేసావని’ నిందిస్తారు. [కొందరు చదవని వాళ్ళూ ఉంటారు. నేను చదివేవాళ్ళ గురించి వ్రాస్తున్నాను] ఇవి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధులున్నారు. నిజమేమిటంటే ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్ధుల్లో కూడా వారి ప్రతిభా ప్రమేయం కొంతశాతమే. యాజమాన్యపు స్ట్రాటజీకే అధికప్రమేయం. ఇవేవీ బయటకు రాకుండా ఉండేందుకు కార్పోరేట్ కాలేజీలు పిల్లల్ని ఊదరబెడుతూ ఉంటాయి. నిరంతరం స్టడీ పిరియడ్స్ అనీ, internal tests లనీ తెగ వత్తిడి చేస్తాయి. కనీసపాటి recreation గానీ, relaxation గానీ పిల్లలకి ఇవ్వవు. ఈ సంవత్సరం కష్టపడితే ఇక బ్రతుకంతా సుఖంగా ఉండచ్చు అంటాయి. Internal tests లో marks సరిగా లేవంటూ శిక్షలు వేస్తాయి. ఈ వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులూ ఉన్నారు.

ఎంసెట్ పరీక్ష అనంతరం, ఫలితాల ప్రకటనకు ముందు ముఖ్యమంత్రులూ, మంత్రులూ, బ్యూరోక్రాట్లు, కాలేజీ యాజమాన్యాల మధ్య ర్యాంకు అమ్మకాల ఒప్పందాలు ఓ కొలిక్కి రాక, ఫలితాల ఆలస్యమైన సందర్భాలున్నాయి. ఈవిధంగా జరిగే ర్యాంకుల అమ్మకాల మూలంగా ఇంట్లో కూర్చొని చదువుకున్న విద్యార్ధులుగానీ, చిన్న లేదా గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులుగానీ Top 10 ల్లో లేదా Top 100 లో ర్యాంకులు పొందే అవకాశం ఉండదు. ఎందుకంటే అసలు ర్యాంకర్ల ఫలితాలలోనే కదా తమ విద్యార్ధులవి insert చేసేది! అందుచేత ఈ కార్పోరేట్ కాలేజీలు ఈ కుంభకోణం అలవోకగా చేస్తుంటారు. డబ్బు చేతులు మారుతుంది గనుక ప్రభుత్వ ఉన్నతాధికారులూ, రాజకీయనాయకులూ సహకరిస్తుంటారు.

ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. కార్పోరేట్ కాలేజీల్లో చాలా వాటిమీద ఈ విషయమై CBI కేసులున్నాయి. కాకినాడ ఆదిత్యా కాలేజీల [వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెట్టారు] వంటి ఉదాహరణలు కోకొల్లలు. అయితే ఏపార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఈ కేసులు మాత్రం పరిష్కరింపబడవు. దశాబ్ధాల తరబడి అలాగే ఉంటాయి. అలాగని మూత కూడా పడవు. ఎందుకంటే ఇలాంటి కేసులు ప్రభుత్వ ఉన్నతాధికారులకీ, రాజకీయ నాయకులకి ATM లాంటివి లేదా మనీ వెండింగ్ మెషన్లు వంటివి. ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు, ఒక నొక్కు నొక్కితే డబ్బు రాలుతుందన్న మాట. కాబట్టే బదిలీ మీద ఉన్నతాధికారులు మారినప్పుడల్లా, కొత్త పార్టీ అధికారంలోకి రావడమో లేక మంత్రివర్గ విస్తరణలో జరిగినప్పుడల్లా, ఆయా కాలేజీలకు అదనపు ఖర్చులు తగులు తుంటాయి. అవి పూడ్చుకునేందుకు సదరు కాలేజీలు తదుపరి సంవత్సరాల్లో మరింత అవినీతికి, మోసాలకి పాల్పడుతాయి. అలా అదో అవినీతి చక్రం, విషవలయం.

ఇలాంటి నేపధ్యంలో, ‘బి’ సెంటర్ల లోని చిన్న కాలేజీలకి ఇంటర్ పేపర్ లీకులే గాక క్రమంగా ఎంసెట్ ర్యాంకుల కుంభకోణమూ తెలిసింది. అవీ పోటీపడటం ప్రారంభించాయి. చిన్న కాలేజీల యాజమాన్యపు ధిక్కారణ ఎలా ఉండేదంటే ‘మీరేం చదువుచెప్పి ఫలితాలు సాధించడం లేదు. చేసేది dispute అయినప్పుడు అది మేమూ చెయ్యగలం’ అన్నట్లుంటుంది. కాబట్టి కార్పోరేట్ కాలేజీలకి వ్యతిరేకంగా చిన్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యపు సంఘాలు బలపడ్డాయి. దాంతో కార్పోరేట్ కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకీ మధ్య ఘర్షణ నెలకొంది. రెండు వర్గాలూ రాజకీయనాయకుల దగ్గర, బ్యూరాక్రాట్ల దగ్గర, ఎవరి లాబీయింగ్ వాళ్ళు చేస్తున్నారు. కార్పోరేట్ కాలేజీలు పల్లెల్లో, చిన్న పట్టణాల్లో టాలెంట్ టెస్ట్ లు పెట్టడాన్ని ప్రైవేట్ కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. 2000 సంవత్సరం, మే చివరివారంలో సూర్యాపేటలో నెల్లూరు నారాయణ కాలేజీ టాలెంట్ టెస్ట్ పెట్టటం, దాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేటలోని ప్రైవేట్ కాలేజీలు, త్రివేణి కాలేజీ యాజమాన్యం, పరీక్షాకేంద్రం గోడలు దూకి ప్రశ్నపత్రాలు చించి, నారాయణ కాలేజీ సిబ్బందిని కొట్టటం, దాంతో పోలీసు కేసులు అవ్వటం జరిగింది. ఈ వివరాలన్నింటితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరసగా 20 దాకా ఫిర్యాదులు వ్రాసాను. ఫిర్యాదు చేసినందుకు త్రివేణి కాలేజీ వాళ్ళు [అప్పటికి అదే నమ్మాను] నన్ను వేధించటం, నేను ఫిర్యాదులు కొనసాగించటం జరిగింది. ఆ వివరాలు తర్వాత టపాలలో చెబుతాను. ప్రస్తుతానికి కార్పోరేట్, ‘బి’ సెంటరు కాలేజీలు చేసే ఎంసెట్ ర్యాంకుల మోసాన్ని పూర్తిగా వివరిస్తాను.

ఈవిధంగా విద్యార్ధులకీ, వారి తల్లితండ్రులకు కూడా తెలియకుండా, విద్యార్ధి తెలివితేటలు, పరిశ్రమ ప్రమేయం తక్కువా, తమ ఆర్ధిక కారణాల ప్రమేయం ఎక్కువ ఉండే "ర్యాంకు ఫిక్సింగ్ కుంభకోణం కార్పోరేట్ కాలేజీలు చేసే class dispute అయితే, ‘B’ సెంటర్లలోని ప్రైవేట్ కాలేజీలు ఇదే ర్యాంకుల కుంభకోణం లో చేసేది Mass dispute. దీని తీరుతెన్నులు మరింత దిగ్ర్భాంతికరంగా ఉంటాయి.

కార్పోరేట్ కాలేజీల్లో ఎంసెట్ ర్యాంకుల కొనుగొళ్ళు, విద్యార్ధులకీ వారి తల్లితండ్రులకే కాదు, కాలేజీ సిబ్బందికీ, లెక్చరర్లకీ కూడా తెలియనంత గుంభనంగా జరుగుతుంది. అయితే ‘B’ సెంటర్లలో ఇదే ఎంసెట్ ర్యాంకుల అమ్మకాలు తమకి బాగా తెలిసిన విద్యార్ధుల తల్లితండ్రులతో “మీరు కార్పోరేట్ కాలేజీలకి మీపిల్లల్ని పంపినా వాళ్ళేం cream sections లల్లో పడరు. IC Batch లో చేర్చినా మీకు 40,000/- రూ. ఫీజు, ఆపైన పండగ పబ్బాలకీ, సెలవులకీ పిల్లల్ని తెచ్చుకునీ, దిగవిడిచీ ఖర్చు, ఫోన్ల ఖర్చు, మెటీరియల్ ఖర్చు ఇవన్నీ కలిసి మరో 40,000/- Rs. తప్పుకుండా అవుతుంది. అట్లయ్యీ ర్యాంకు వస్తుందన్న గ్యారంటీ లేదు. అదే మాకు లక్ష రూపాయలు ఇవ్వండి. మీరు కోరుకున్న బ్రాంచీలో ఇంజనీరింగ్ సీటు వచ్చేటటు వంటి ర్యాంకు మేం ఇప్పిస్తాం. ఇప్పించేలేకపోతే 10,000/- రూ. ఖర్చులకు మినహాయించుకొని 90,000/- రూ. తిరిగి ఇచ్చేస్తాం. ఎటూ కార్పోరేట్ కాలేజీలు చేసేది కూడా ఇదే. కానీ అక్కడైతే మీరు నోరెత్తి ఏదీ అనలేరు. వాళ్ళు ర్యాంకు ఇప్పిస్తే ఇప్పించినట్లు, లేకుంటే లేదు. మీరడిగితే ‘మీ పిల్లవాడే సరిగా చదవలేదు. మేమేం చేస్తాం’ అంటారు. అదే మేమయితే గ్యారంటీగా ర్యాంకు ఇప్పిస్తాం” అంటాయి. అలాగని ‘B’ సెంటర్లలోని అన్ని కాలేజీలు ఈ dispute చేయలేవు. మహాఉంటే ఒకటో రెండో కాలేజీలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువమంది విద్యార్ధులని కలిగిఉన్న కాలేజీలు మాత్రమే ర్యాంకుల కొనుగోళ్ళ వ్యవహారంలోకి దిగగలవు.

చాలామంది మధ్యతరగతి తల్లితండ్రులు వ్యాపారం, వ్యవసాయం, ఇతర రంగాలకి చెందినవారు. వారికి తమ పిల్లలు ఇంజనీర్లయితే చాలు. ఉద్యోగాలు వాటాంతట అవే వస్తాయి అనుకుంటారు. కొందరు తల్లితండ్రులు తమ పిల్లలు డాక్టరో, ఇంజనీరింగో చేయకపోవటం పరువుకి సంబంధించిన విషయంగా పరిగణిస్తారు. కొందరు చదువుకోని తల్లితండ్రులు పదిమంది ఎటు ప్రయాణిస్తే అటు పోయేవారు. ఇలాంటి వారందరినీ ‘B’ సెంటర్లలోని ప్రైవేట్ కాలేజీలు capture చేస్తాయి. ఇది జరుగుతుందా, అలా ర్యాంకులు కొనే తల్లితండ్రులుంటారా అనుకోకండి. లేకుండానే యాజమాన్యకోటాలో సీట్లు అమ్ముడుపోవుకదా! స్వయంగా మేము, కొందరు తల్లితండ్రులతో ‘ఎంసెట్ కుంభకోణం ఇలా జరుగుతుంది’ అంటే ‘మనకేమైనా అవకాశం ఉంటుందా’ అని అడిగిన తల్లితండ్రుల్ని చూశాము.

సూర్యాపేట వంటి ‘బి’ సెంటర్లలో ఈ విధమైన ర్యాంకుల అమ్మకం విచ్చలవిడిగా జరిగింది. భారీగా తల్లితండ్రులు డబ్బు బయటకు తీయటం, కొందరు అప్పులు కూడా చేయటం చర్చనీయాంశమైంది. ఒక్క ఎంసెట్ మాత్రమే కాదు, బి.ఎడ్. ర్యాంకులూ, సీట్లు వ్యవహారంలో కూడా ఇదే తంతు. మామూలుగా డబ్బు అప్పు తీసుకొని ఎగ్గొడతారేమో గానీ, ఈ ర్యాంకుల విషయమై తీసుకున్న డబ్బు, ర్యాంకు రాకపోతే ‘నిజాయితీ’గా 10% మినహాయించుకొని, మిగిలినది వాపసు చేస్తారు. అది చూసి మేం ‘ఇక్కడ మంచిలో కన్నా చెడులోనే గుడ్ విల్ ఎక్కువ కాబోలు’ అనుకున్నాము.

ఈవిషయాలన్నీ ఒక్కొక్కటే మా పరిశీలనకి వచ్చే కొద్దీ, అన్నిటిని అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి ఫిర్యాదులు రూపేణా తీసికెళ్ళాము. మొదటి ఫిర్యాదు ఇచ్చిన మూడు నెలలు వరకూ మేం కొంత ప్రశాంతంగా ఉన్నాము. తర్వాత ఊపిరి తిప్పుకోనివ్వనంతగా సమస్యలు చుట్టుముట్టాయి. తొలి ఫిర్యాదు ఇచ్చాక కొద్ది రోజులకి నల్గొండ నుండి ఓ కాలేజీవాళ్ళు మమ్మల్ని approach అయ్యారు. రోజుకి 8 గంటలు టీచింగ్ అవర్స్ చెప్పాలని, లక్షాఏభైవేల రూపాలయదాకా ఇస్తామనీ, తక్షణమే 50,000/- రూ. అడ్వాన్సుగా ఇస్తామనీ, జాబ్ డీల్ పెట్టారు. ‘ఆలోచించి చెబుతాం’ అన్నాము మేము. ‘ఎక్కడికెళ్ళినా ఇదే పోరాటం అయినప్పుడు ఊరూరూ తిరగటం ఎందుకు? ఇదే చోట నిలబడి పోరాడదాం’ అనుకున్నాము. దాంతో వారి ప్రతిపాదనకు ‘నో’ చెప్పాము. దాంతో వారు “పోనీ మీకు రెమ్యూనరేషన్ నచ్చకపోతే ఎంతకావాలంటే అంత అడగండి” అన్నారు. అయినా తిరస్కరించాము. ఆలోచించమంటూ వారి ఫోన్ నంబరు ఇచ్చి వెళ్ళారు. మేము ఆ విషయం పట్టించుకోలేదు.

కొద్ది కాలం తర్వాత మరొక వ్యక్తి, మా ప్రక్కింటి అతనితో వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ‘తాను మెదక్ జిల్లా సిద్దిపేటలో గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ నని, మీరు మేనేజ్ మెంటు చూసుకుంటే చాలని. బాగా చెప్పే లెక్చరర్స్ గా పేరుంది గనుక ఆ రెప్యూటేషన్ చాలనీ, వర్కింగ్ పార్ట్ నర్ షిష్ ఇస్తామనీ, ర్యాంకులు, మార్కులూ తెచ్చుకోవటం గట్రా పైవిషయాలన్నీ తాము చూసుకుంటామనీ, మీకు ఏవిధమైన బాదర బందీగానీ, రిస్క్ గానీ ఉండదనీ, కాలేజీకి మంచి పేరుప్రఖ్యాతులు ఉండేందుకు మీరు విద్యాబోధన, క్రమశిక్షణ మొదలైన వ్యవహారాలు పర్యవేక్షిస్తే చాలనీ, ఎంతశాతం వాటా కావాలో చెబితే డీల్ కుదుర్చుకుందామనీ ’ ప్రతిపాదించాడు.

‘అవకాశం రానంతవరకూ నీతులు వల్లించి, అవకాశం రాగానే అదే అవినీతి మనమూ చేయటం పరమనీచం’ అనిపించింది మాకు. అంతేగాక ‘దేశానికి మేలు చేయకపోయిన ఫర్వాలేదు, కీడు చేయకపోతే చాలు’ అన్న మాసిద్ధాంతానికి కట్టుపడి, నిర్ధ్వంద్వంగా, ఆక్షణమే, “అలాంటివి మాకు సరిపడవు లెండి” అంటూ తిరస్కరించాము. అతడు మాకు చాలా నచ్చచెప్పబోయాడు. సున్నితంగానే అయినా ఖచ్చితంగా కుదరదని చెప్పేశాము. అంతేకాదు, ఎవరితోనైనా [అది మన బాస్ కానివ్వండి, కొలీగ్ కానివ్వండి, పొరుగు వాడు కానివ్వండి] మనకి సరిపడలేదనుకొండి. వారినుండి దూరంగా పోతాం. బాస్ నచ్చకపోతే ఉద్యోగం మారతాం, కోలీగ్స్ నచ్చకపోతే avoid చేస్తాం, పొరుగువాడు నచ్చకపోతే ఇల్లు మారతాం లేదా ముఖం తిప్పుకుంటాం. మనతో మనకి సరిపడకపోతే? ఎక్కడికి పారిపోగలం? మనకి ప్రపంచం మొత్తంతో సంఘర్షణ ఉన్నా ఫర్వాలేదు. మనతో మనకి ఘర్షణ లేకపోతే చాలు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా సంతోషంగా ఉండచ్చు. సుఖం లేకపోయినా, సంతోషం మాత్రం ఖచ్చితంగా మనతోనే ఉంటుంది. ఎందుకంటే ఆత్మతృప్తి ఉంటుంది గనుక. అలాగాక మనతో మనకి సరిపడకపోతే బ్రతుకు ‘త్రిపురనేని గోపిచంద్’ గారి ‘అసమర్ధుని జీవయాత్ర’లోని ‘సీతారామారావు’ అయిపోతుంది. అందుచేత కూడా మేం ఆ ప్రతిపాదనని పూర్తిగా తిరస్కరించాము.

మా విద్యార్ధులకి, వారి తల్లితండ్రులకీ ఒకటే చెప్పాము. “ఈ మార్కులూ, ర్యాంకులూ, సర్టిఫికెట్లు కూడా ఫీల్డ్ లోనికి ప్రవేశించటానికి అవసరమైన ఎంట్రీ టిక్కెట్ వంటివి. ఒకసారి ప్రవేశించాక ఇకవాటి ప్రాముఖ్యత, విలువ అంతవరకే. ఫీల్డులో నిలదొక్కుకోవాలన్నా రాణించాలన్నా సబ్జెక్ట్ మీద పట్టు, అవగాహన అవసరం. ఎవరైనా ర్యాంకులూ, మార్కులూ కొనుక్కోగలరేమో రేపు ఉద్యోగాలు కొనుక్కోలేరు గదా? ప్రభుత్వ ఉద్యోగాల విషయం తీసేయండి, అవి కొనుక్కోవచ్చు. కానీ ఏ పార్టీ అధికారంలో ఉండనీయండిగాక టీచర్స్, డాక్టర్స్, పోలీసు ఉద్యోగాలు తప్ప మిగిలిన ఉద్యోగాలు భర్తీచేయవు. కాంట్రాక్టు ఉద్యోగాలు తప్ప పర్మినెంటు ఉద్యోగాలు లేవు. కనుక ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు తప్ప గత్యంతరం లేదు. ప్రైవేట్ కంపెనీల్లో మీ ప్రతిభ, పనిసామర్ధ్యంలకే ప్రాధాన్యం కానీ మీ సర్టిఫికేట్లు, అందులో మార్కులకి కాదు. కాబట్టి ర్యాంకులూ, మార్కులూ కొనుక్కున్నా కూడా సబ్జెక్టు కూడా నేర్చుకొండి. లేకుంటే జీవితంలో నష్టపోతారు. ఇప్పుడు మేం పాఠాలు సరిగా చెప్పలేని అసమర్ధులమై ఉంటే, మా సర్టిఫికెట్లని ఎంత ఎన్ లార్జి చేసి ఫ్రేములు కొట్టి తగిలించినా మీరు మాకు ఫీజు కట్టి మాదగ్గర ట్యూషన్ చెప్పించుకోరు కదా! ప్రైవేటు కంపెనీలైనా అంతే. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకొండి” అని చెప్పేవాళ్ళం.

ఈ నేపధ్యంలో కొత్తగూడెంలోని ఓకాలేజీ రహదారిపై పెట్టిన పెద్ద హోర్డింగ్ చూశాము. అందులో సదరు కాలేజీ వారు తమ విద్యార్ధికి 997 మార్కులు రావడాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. జూనియర్, సీనియర్ కలిపి 12 పేపర్లు. దాదాపు అన్నింటిలో నూటికి నూరు వస్తేగానీ ప్రాక్టికల్స్ పోను వెయ్యికి 997 మార్కులు రావు. సీఫెల్ లెక్చరర్స్, సురేషన్ గారు వ్రాసినా ఇంగ్లీషు వంటి భాషా పరీక్షల్లో నూటికి నూరు శాతం మార్కులు రావు. మేమూ ఎన్నోరకాలుగా ఆలోచించాము. ‘అసలు ఇలాంటి నేపధ్యంలో ముందటి సంవత్సరంలో [1999] అక్కడి విద్యార్ధులకి 126 ర్యాంకు, ఇతర ర్యాంకులు ఎలా వచ్చాయబ్బా’ అని సందేహం కలిగింది.

ఈ మతలబు వెనుక రహస్యం ఏమిటంటే – కార్పోరేట్ కాలేజీలు Top 10, Top 100, Top 1000 ర్యాంకుల కొనుగోళ్ళు చేసేటప్పుడు ముందుగా తమ విద్యార్ధులకు సహజంగా వచ్చిన ర్యాంకుల్లో కొన్నింటిని యధాతధంగా ఉంచుతారు. అలా సహజత్వం కొంత చెడకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. అలాగే కొన్ని మారుమూల ప్రాంతాల్లోనూ, ‘B’ సెంటర్లూ, ‘C’ సెంటర్ల వంటి ప్రదేశాల్లోనూ [ఒకో సంవత్సరం ఒకో ప్రాంతంలో] సహజ ఫలితాలని కొన్నిటిని వదిలేస్తారు. అప్పుడు ఆయా చిన్న పట్టణాల్లో, తల్లిదండ్రులకి తమ కళ్ళెదుట చదువుకున్న, చిన్న కాలేజీల్లో చదువుకున్న పిల్లలకు ర్యాంకులు వస్తాయి. దాంతో ఆ ప్రాంతంలో ఎంసెట్ ఓరియంటేషన్ సృష్టింపబడుతుంది. అంటే తమ పిల్లలూ తెలివైన వాళ్ళే, తక్కువఖర్చుతో, చిన్నకాలేజీల్లో చేరినా, తమపిల్లలూ ర్యాంకులు సాధించగలిగారు అనుకోగానే, ఆ ప్రాంతంలోని మరికొందరు తల్లితండ్రులకి తమ పిల్లల భవిష్యత్తు పట్ల ఆశా, నమ్మకం కలుగుతాయి. దాంతో ఎంసెట్ ఓరియంటేషన్ క్రియేట్ అవుతుంది. క్రమంగా అక్కడి విద్యావ్యాపారం పుంజుకుంటుంది. ముందుగా ఓరియంటేషన్ సృష్టింపబడితే, తల్లితండ్రుల్లో తమ బిడ్డల భవిష్యత్తు పట్ల మొలకెత్తిన ఆశ, ఆస్థులు అమ్ముకునైనా పిల్లల్ని పెద్దకాలేజీల్లో చేర్పించేవైపుకి మరలింపబడుతుంది. అంటే క్రమంగా [effort] ప్రయత్నం పెరుగుతుంది. కాబట్టే కార్పోరేట్ కళాశాలలు ఎంసెట్ ర్యాంకు ఫిక్సింగ్ ల విషయంలో రహస్యాన్ని కాపాడటానికి, సహజత్వపు రంగులు అద్దడానికి ఎంతో ప్రయత్నిస్తాయి.

అయితే చిన్న కాలేజీలకి ఈ రహస్యం తెలిసిపోవటంతో విద్యారంగంలో కార్పోరేట్ కాలేజీలకీ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యపు సంఘాలకి తెర వెనుక సంకుల సమరం మొదలయ్యింది. 2000 తర్వాత నుండీ 2009 వచ్చేసరికి ఈ పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యింది. వివరంగా చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

చూస్తుండగానే ఎంసెట్ – 2000 ఫలితాలొచ్చాయి. అప్పటికే మా దగ్గర మరుసంవత్సరం ఎంసెట్ కోచింగ్ కి కొందరు విద్యార్ధులు join అయ్యారు. వాళ్ళల్లో ఎక్కువమంది నాకు పూర్వమే తెలిసిన జూనియర్ ఇంటర్ విద్యార్ధులే. అందరం ఎంతో ఆతృతగా ఫలితాలు చూశాము. మా విద్యార్ధుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా ర్యాంకు రాలేదు. మెడిసిన్ కు శిక్షణ తీసుకున్న రమాదేవి కి 5000+ ర్యాంకు వచ్చింది. మేమంతా, ఆ అమ్మాయి కనీసం 1500 లోపు ర్యాంకు సాధిస్తుందని ఆశతో ఉన్నాము. ఎంసెట్ 2000 వ్రాసి వచ్చాక ఆ పిల్ల ముఖంలో కనబడిన ఆత్మవిశ్వాసం, వెలుగు మాకు ఆ ఆశనిచ్చింది. 163+ వస్తాయని తను అనుకుంటున్నట్లు ఆ పిల్ల చెప్పింది. ఎంసెట్ కీ విడుదల తర్వాత, ముందుగా ఆ అమ్మాయి ఙ్ఞాపకశక్తితో చెప్పిన ప్రశ్నా జవాబుల్ని పోల్చి చూసుకొని కూడా 163+ జవాబులు సరిగా గుర్తించినట్లు నిర్ధారించుకున్నాము. ఇటు ఈ అమ్మాయికీ ర్యాంకు రాలేదు. అటు ఇంజనీరింగ్ పిల్లలకైతే 30,000 లోపు ర్యాంకు రాలేదు. ముందటి సంవత్సరంలో లాగా 126 ర్యాంకు ఆశించకపోయినా 5000 లకు దగ్గర ర్యాంకులు ఊహిస్తున్నాము. అప్పటికి ఇన్ని ఇంజనీరింగ్ సీట్లు లేవు. ‘30,000’ లోపే ఉండేవి. పిల్లలెంత కష్టపడ్డారు, వాళ్ళ సామర్ధ్యం ఎంత, మేమేంత కష్టపడ్డామో, దాన్ని బట్టి మేం వేసుకున్న అంచనాలన్నీ తల్లక్రిందులైనాయి.

రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి. ‘మనం అనుకున్నామేమో విద్యార్ధులు బాగా చదివారని. కానీ పోటీ పడలేకపోయారేమో’ అని కాస్సేపు అలోచించాము. కానీ మేం నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో మార్కులు, వారి పరిశ్రమ మా కళ్ళెదుటే ఉంది. ‘అన్నీ సబ్జెక్టులూ మనమే చెప్పాము. అందుకే ఇలా అయ్యిందా’ అని కాస్సేపు ఆలోచించాము. కానీ మా [విద్యార్ధులది, మాదీ కూడా] పరిశ్రమని తక్కువగా అనుకోలేక పోయాము. నాకున్న అనుభవం, అవగాహనకి కూడా జరిగింది నమ్మశక్యం కాలేదు. మరోవైపు చూస్తే రమాదేవి బాగా నిరాశా నిస్పృహలకి గురయ్యింది. “ఏ పేపర్ ఇచ్చిన చేయగలుగుతున్నప్పుడు, ఇంతకంటే కష్టపడటానికి ఇంకేముంది మేడం!” అంది. ఆ పిల్ల నిరాశ చూస్తే జాలి, బాధ కలిగాయి. ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయం కూడా వేసింది. ఆ పిల్ల తండ్రి డాక్టరు ఆంజనేయులు కూడా ఏమీ అనలేకపోయాడు. కొంత ఆక్రోశంతో ఆ అమ్మాయి, ఆమె తండ్రి, నా దగ్గర చదువుకున్న ఇతర విద్యార్ధులు “త్రివేణి కాలేజీలో పిల్లలకి కనీసం OMR ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చాయి. వాళ్ళకి రెగ్యులర్ ఇంటర్ సిలబస్ కూడా సరిగా పూర్తికాలేదు. అందునా ఎంసెట్ క్లాసులు వారంలో ఒక్క అదివారం 3 గంటలు మాత్రమే బోధించారు, మెటిరియల్ కూడా లేదు. అయినా ఎంసెట్ మెడిసిన్ ర్యాంకులూ, ఇంజనీరింగ్ ర్యాంకులూ కూడా వచ్చాయట” అన్న సందేహం వెలిబుచ్చారు. ఈ సమాచారం మాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. “అబద్ధాలు చెప్పుకుంటున్నారేమో నమ్మా!” అన్నాము పిల్లలతో. వాళ్ళు ఆవి ప్రచారం కోసం చెప్పుకుంటున్న అబద్దాలు కావనీ, నిజంగానే త్రివేణి కాలేజీలో పిల్లలకి మంచిర్యాంకులు వచ్చాయనీ చెబుతూ, మేము నమ్మకపోవడం చేత ఆయా విద్యార్ధుల హాల్ టికెట్ నంబర్లు, వాళ్ళకొచ్చిన ర్యాంకులూ వ్రాసి తెచ్చారు. మర్నాడు త్రివేణి కాలేజీ వాళ్ళు జిల్లా ఎడిషన్ పేపరులో విద్యార్ధుల ఫోటోలతో సహా వారి హాల్ టికెట్ నంబర్లూ, ర్యాంకులూ ప్రకటించుకుంటూ వాణిజ్యప్రకటన వేసారు. ఆ విద్యార్ధుల వివరాలు చూడగానే నాకు కళ్ళు తిరిగినంత పనయ్యింది. మెడిసిన్ అమ్మాయికి రిజర్వేషన్ ఉంది, ఆఅమ్మాయికి 7000+ ర్యాంకు, ఇంజనీరింగ్ లో 2000+ నుండి ౩౦ సీట్లు వచ్చేటన్ని ర్యాంకులు వచ్చాయి. వాళ్ళ స్టాండర్డ్స్ నాకు తెలుసు. వారి శ్రమించగల సత్తా, తెలివితేటలు, ప్రశ్న చదివాక ఎంతసేపటికి వాళ్ళకి అర్ధమౌతుందో కూడా [reaction time] నాకు అంచనా ఉంది. దాంతో విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాము నేనూ, నాభర్త కూడా! ప్రచారం కోసం అబద్ధాలు చెప్పుకోగలరమో ‘మా విద్యార్ధులకి చాలా ర్యాంకులు వచ్చాయని’. ధైర్యంగా పత్రికలో వాణిజ్యప్రకటన ఇచ్చుకోరు కదా! ముందటి సంవత్సరం వాళ్ళు కాలేజీకి ఒక్కటంటే ఒక్కర్యాంకూ రాలేదు.

అందుచేత గతంలో ఇంటర్ తమ కాలేజీలో చదివి, లాంగ్ టర్మ్ గుంటూరు, విజయవాడల్లో చదివి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్ధుల పేర్లతో కరపత్రాలు ప్రచురించి ప్రచారించుకున్నారు. అటువంటి నేపధ్యంలో ఈ సంవత్సరం ఇన్ని ర్యాంకులు రావటం అసాధారణంగా అన్పించింది. అప్పటికే ఇంటర్ పేపర్ లీకులు గురించి ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో, ఎంసెట్ ర్యాంకుల విషయంలోనూ ఏదో మోసం ఉందనిపించింది.

ఒకసారి అనుమానం వచ్చాక ఇక పరిశీలన మొదలు పెట్టాము. అంతకు ముందు రోజు విద్యార్ధుల పేర్లు, హాల్ టికెట్లు నంబర్లు, ర్యాంకులతో నలందా కాలేజీ వాళ్ళు రాష్ట్ర ఎడిషన్ లో పుల్ పేజీ వాణిజ్యప్రకటన ఇచ్చుకున్నారు. అందులో వందలాది విద్యార్ధుల పేర్లలో త్రివేణి విద్యార్ధుల పేర్లు ఉన్నాయి. నిజానికి త్రివేణి కాలేజీ విద్యార్ధులు నలందాలో షార్ట్ టర్మ్ కెళ్ళారు గానీ, పట్టుమని వారంరోజులు కూడా అక్కడ with stand కాలేక, వెనుదిరిగి వచ్చేసారు.

అంతేగాక, సూర్యాపేటలో స్థానికంగా త్రివేణి యాజమాన్యం గణనీయమైన మొత్తంలో డబ్బుని ఋణాలరూపేణా సేకరించిందన్న వార్తలు ఊర్లో గుప్పుమన్నాయి. ఈ వివరాలన్నీటితో మాకు ఎంసెట్ ర్యాంకుల విషయంలోనూ మోసం జరిగిందన్న అనుమానం బలపడింది. అయితే గతంలో అన్యాయల మీద ఫిర్యాదులు చేసి, జీవితంలో దెబ్బలు తిని ఉన్నాము. అందుచేత మనస్సు కొంత ముందు వెనకలాడింది. కానీ కళ్ళ ముందు, మాదగ్గర చదువుకున్న రమాదేవి, శర్మ, అజయ్, సురేష ల్లాంటి పిల్లల దీనవదనాలు కదలాడాయి. Week tests, Comprahensive test లు వ్రాసి, ఎక్కడ తప్పు చేశారో నేను కౌన్సిల్ చేయగా దిద్దుకుంటూ, నిరంతరం శ్రమిస్తూ, భవిష్యత్తు గురించి కలలు కంటూ, ఇంజనీర్లు అయితీరాలని ఆ పిల్లల పడిన కష్టం, మేం పడిన కష్టం, మమ్మల్ని నిలవనీయలేదు. రమాదేవి స్థానంలో నా కూతురే ఉంటే నేనేం చేసేదాన్ని అని ఆలోచించాను. కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగలు దోచుకుపోతే ఎంతో బాధ కలుగుతుంది. అది ద్రవ్యచౌర్యం. ఇది మేధో చౌర్యం. చదవని పిల్లలకి ర్యాంకులు వచ్చాయంటే, చదివి ఆయా ర్యాంకుల్లో ఉండవలసిన పిల్లల స్థానాలను దొంగిలించారనే కదా అర్ధం! శారీరక శ్రమతో సంపాదించిన డబ్బు దోచుకోబడటం కంటే కూడా మేధో శ్రమతో సంపాదించిన స్థానాన్ని దోచుకోవటం మరింత దారుణం. దాంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడమే సరైనపని అని నిర్ణయించుకున్నాము.

అయితే ‘పాలతో మూతి కాలిన పిల్లి, మజ్జిగ ఊది తాగుతుందని’ సామెత. అది మనిషి మనస్తత్వం కూడానేమో. అందుకే మేము ఫిర్యాదుని రమాదేవి తండ్రి పేరిట వ్రాసాము. అదీ సూర్యపేట నుండి యాదగిరి గుట్ట వెళ్ళి, నరసింహస్వామి దర్శనం చేసుకొని, ఆ తర్వాత ఫిర్యాదు పంపాము. ఫిర్యాదు నకలును Fire Pot లో, Coups on World లో చూడవచ్చు. పోస్టల్ రసీదుల వివరాలు కూడా చూడవచ్చు.

ఫిర్యాదు పంపాక మేం ఆ విషయం ముందుగా ఎవరికీ చెప్పలేదు. మామూలుగా మా ట్యూషన్ సెంటర్ నడుపుకుంటున్నాము. అప్పటికి ఐఐటి బేసిక్స్ విద్యార్ధులు, ఎంసెట్ విద్యార్ధులు కొందరు join అవ్వటంతో క్లాసులు చెబుతున్నాము. స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు కూడా తీసుకుంటున్నాము. ఈసారి ఎంసెట్ విద్యార్ధుల ఫీజు గత సంవత్సరం కంటే రెట్టింపు చేసాము. లోకల్ కాలేజీ వాళ్ళ ఫీజుతో పోల్చుకుంటే మా ఎంసెట్ ట్యూషన్ ఫీజు రెట్టింపు. అయితే ఎంసెట్ ర్యాంకుల కుంభకోణం గురించి కూడా పరిశీలనా, విశ్లేషణా ఆపకుండా కొనసాగిస్తున్నాము.

ఈ నేపధ్యంలో నాకు వికాస్ లో, ఎక్సెల్ లో 1998 నాటి ఎంసెట్ రిజల్టు లో అప్పుడు నాకు అర్ధంకాని విషయాలు స్ఫురణకు వచ్చాయి. అప్పట్లో వికాస్ లో గాయత్రి అనే విద్యార్ధిని ఉండేది. ఆమెకు 1997 జూనియర్ ఇంటర్ లో స్టేట్ 2nd ర్యాంకు వచ్చింది. అయితే ఎంసెట్ 1998 లో మెడిసిన్ లో 1200+ ర్యాంకు వచ్చింది. ఆమెకు రిజర్వేషన్ ఉండటంతో గుంటూరు మెడికల్ కాలేజీలోనే సీటు వచ్చింది. ‘బహుశ ఇంటర్ రెగ్యులర్ సిలబస్ లో ఆ అమ్మాయి ప్రతిభ చూపి ఉండచ్చు, ఎంసెట్ విషయంలో వత్తిడిపడి ఉండొచ్చు, లేక మల్టిపుల్ ఛాయిస్ కనుక సరిగా జవాబులు వ్రాయాలేక పోయి ఉండొచ్చు’ అని అప్పట్లో అనుకున్నాను. ఎక్సెల్ లో కూడా సుబ్రమణ్యం అని ఓ విద్యార్ధి ఉండేవాడు. చాలా చురుకైన, తెలివైన పిల్లవాడు. ఇంటర్ రెగ్యులర్ లో స్టేట్ ర్యాంకర్. అతనికీ ఎంసెట్ లో 700+ ర్యాంకు మాత్రమే వచ్చింది. అయితే ఎక్సెల్ లో ఓ డైరక్టర్ కి దగ్గరివాడైన రాజేష్ అనే విద్యార్ధికి స్టేట్ 10th ర్యాంకు అదీ మెడిసిన్ లో వచ్చింది. మాకు తెలిసి [అంటే లెక్చరర్స్ కి] రాజేష్ కి చురుకైన విద్యార్ధి అనో, తెలివైన విద్యార్ధి అనో గుర్తింపు లేదు. అప్పట్లో పెద్దగా పట్టించుకొని ఇలాంటి విషయాలని, 2000 – ఎంసెట్ ఫలితాల తర్వాత పత్రికల్లో ప్రచురింపబడుతున్న కార్పోరేట్ కాలేజీల వాణిజ్యప్రకటనలనీ, విద్యారంగంలో పోటీరీత్యా కార్పోరేట్ కాలేజీల మధ్య నడుస్తున్న పరస్పర ఆరోపణలనీ, విద్యారంగంలో బయటపడిన ఇతర కుంభకోణాల తాలుకూ వార్తల్ని, వేటినీ వదలకుండా పరిశీలించటం, విశ్లేషించటం చేస్తుండేవాళ్ళం నేను, నాభర్తా. ఆ నేపధ్యంలో సి.పి.యం. నాయకుడు బివి రాఘవులు విద్యారంగంలో ఇంటర్ మార్కుల కుంభకోణాల గురించి ప్రకటన చేశాడు. ఇలాంటి వాటినన్నిటినీ పరిశీలించే వాళ్ళం. స్థానికంగా మా విద్యార్ధుల తల్లితండ్రులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతరులు చెప్పే ప్రతిసమాచారాన్ని సేకరించాము.

నిజానికి కార్పోరేట్ విద్యారంగంలో అవినీతి, రాజకీయ రంగంలోని అవినీతికి మరో పార్శ్వం వంటింది. పరిమాణంలో రాజకీయ అవినీతి పెద్దది కావచ్చుగానీ, ప్రమాదంలో విద్యారంగంలోని అవినీతే పెద్దది.

విద్యారంగంలోని అవినీతి 10th , ఇంటర్ పేపర్ల లీకుల్లోనే కాదు, ఎంసెట్, బి.ఎడ్. వంటి పోటీపరీక్షల ర్యాంకుల్లోనూ కూడా రెండురకాలు. క్లాస్, మాస్ మోసాలన్న మాట. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ వంటి ‘A’ సెంటర్లలో జరిగేవి class dispute అయితే సూర్యాపేట వంటి ‘B’ సెంటర్లలో జరిగేవి Mass disputes. నాకు తెలిసి దేశవ్యాప్తంగా [ఐఐటి తప్ప] దాదాపు అన్ని పోటీపరీక్షలు లీకుల ఆరోపణలు ఎదుర్కొన్నాయి లేదా మళ్ళీ పరీక్షలు జరిగాయి.

ఈ విషయంలో కళాశాలల స్ట్రాటజీ చాలా పకడ్పందీగా ఉంటుంది. కార్పోరేట్ కాలేజీలకి దాదాపు ప్రతీ ప్రాంతంలోనూ PRO లు ఉంటారు. సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో అక్కడి గవర్నమెంట్ టీచర్లలో కొందరు కార్పోరేట్ కాలేజీలకి PRO లాగా పనిచేసేవారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఇతరులు ఉంటారు. వీరు తమ పనులు తాము చూసుకుంటూనే అదనపు ఆదాయ వనరుగా ఈ పని చేస్తారు. అందుకోసం వాళ్ళు ఆ విద్యాసంవత్సరంలో ఎంతమంది విద్యార్ధులు 10th పాస్ అయి కాలేజీలకి వస్తారు, వారిలో ఎందరు ఏ ఆర్ధికస్థాయిలో ఉన్నారు లాంటి వివరాలు సేకరిస్తారు. అంటే 10th పాసయిన విద్యార్ధుల్లో ఎందరు కార్పోరేట్ కాలేజీలకి వెళ్ళగలిగేవారు, ఎందరు ‘B’ సెంటర్లలో చదివేస్తోమత మాత్రమే కలిగి ఉన్నారు, ఎందరు స్కాలర్ షిప్పులతో చదువుకొనసాగిస్తారు, ఎందరు ఆర్ట్స్ లాంటి సబ్జెక్టులలోకి వెళ్తారు, ఇలాంటి గణాంక వివరాలు కూడా ఈ PROల దగ్గర ఉంటాయి. ఆ అంచనాల ప్రకారం తమకు అందుబాటులో ఉన్న విద్యార్ధులని ప్రోత్సహించి ఆయా ‘A’ కేంద్రాల్లో ఉన్న కార్పోరేట్ కాలేజీలకి వెళ్ళేటట్లు చూస్తారు. ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారు పిల్లల్ని తమకు అనుకూలమైన [అంటే తమకి అడ్మిషన్ కీ ఇంత అని కమీషన్ ఇచ్చే] కాలేజీలకి విద్యార్ధుల్ని పోగేసి పంపిస్తారు. ఇలా చాలా మందిని కార్పోరేట్ కాలేజీలకి పంపడానికి ఆయాస్కూళ్ళ యాజమాన్యాలు పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్ లూ, పేపర్లు దిద్దే సెంటర్లు తమకి అనుకూలంగా వేయించుకోవటం, మార్కులు అదనంగా వచ్చేటట్లు పేపర్లదిద్దే సెంటర్లని మేనేజ్ చెయ్యటాలు గట్రా గట్రాలు చాలా చేస్తారు. ఆవి స్కూళ్ళమధ్య పోటీ ఎక్కువయినప్పుడు పొక్కి బయటకు వచ్చిన సందర్భాలు చాలానే పేపర్లలో చూశాం. విద్యార్ధుల్ని సేకరించడానికే కార్పోరేట్ కళాశాలలు వేసవి సెలవుల్లోనే టాలెంట్ టెస్టులు పేరిట ‘B’ సెంటర్లలో, చిన్న పట్టణాలలో కాంపెయిన్లు నిర్వహిస్తారు. అలాంటి సమయాల్లో కార్పోరేట్ కాలేజీలు ఆ పిల్లల standard ఎంత అన్నది చూసుకోవటానికి అడ్మిషన్ల టెస్ట్ నిర్వహిస్తారు. ఆవిద్యార్ధికి 10th లో వచ్చిన మార్కుల మీద నమ్మకము లేకపోవటం, తమ స్టాండర్డ్స్ అందుకోగలడో లేడో అని తెలియటం కోసం, ఒకే స్టాండర్డ్స్ ఉన్న విద్యార్ధులని ఒకేసెక్షన్ లో వేస్తే క్లాసు స్మూత్ గా నడుస్తుందని కూడా ఈ అడ్మిషన్ల టెస్ట్ లు పెడతారు. అలాంటి సమయాల్లోనే తమ PRO లతో ఈ deals అన్నీ చూసుకుంటారన్న మాట. 10th లో 500+ మార్కులు వస్తే ఇంతశాతం ఫీజు రాయితీ ఇస్తామని లేదా ఉచిత విద్య అందిస్తామని గట్రా హామీలతో ప్రచారం చేసి టాలెంట్ టెస్టులు పెడతారు. అలాంటి వాటిలో ఉత్తీర్ణులై ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్ధులకి తర్వాత ఏదో పేరుతో ఫీజులు వడ్డించారనీ, డబ్బులు వసూలు చేసారనీ కొన్ని వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ విధంగా ఇంటర్ విద్యార్ధుల్నీ సమకూర్చుకుంటారు. ఇక తమ ఎంసెట్ లో రిజల్ట్స్ చూసి ఎగబడే జనం ఎటూ ఉంటారు కదా!

ఇక ఈప్రకరణం తర్వాత ఎంసెట్ ప్రకరణం ఉంటుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నాబ్లాగు చుట్టాలందరూ ఈ ఆదివారం నాడు అలవోకగా చదువుకునేందుకు ఓ చిన్న టపా!

‘విద్యలేని వాడు వింత పశువు’ అన్నారు పెద్దలు.

అసలు విద్యంటే ఏది? దాని పరమార్ధం ఏమిటి?

పశువు స్థాయినుండి మనిషిగా రూపాంతరం చెందించే ఆ ‘విద్య’ ఏమిటి?

ఫ్యాషన్ పేరిట కురచదుస్తులతో శరీరప్రదర్శనలూ, మత్తుపదార్ధసేవనం వల్ల తూలిన ప్రవర్తనలతో మనిషి ఏ ‘స్థాయి’కి పరిణమిస్తున్నాడు?

ఆ స్థాయికి తీసికెళ్ళెదాన్ని ‘విద్య’ అనాలా, ‘అవిద్య’ అనాలా?

ఆదిమానవుడు, ప్రకృతిలోని శీతోష్ణస్థితుల నుండి శరీరాన్ని కాపాడు కునేందుకు కవచంగా దుస్తుల్ని కనుగొని ధరించాడు. క్రమంగా శరీరాన్ని కప్పుకోవడంలో సభ్యతనీ, సంస్కారాన్ని గుర్తించగలిగాడు. కాబట్టే జంతుస్థాయినుండి వేరుపడ్డాడు. గుహల నుండి గృహ నిర్మాణాల దాకా పయనించాడు. అది పురోగమనం.

మనిషిని జంతుస్థాయి నుండి వేరు చేసింది ‘విద్య’.

అయితే నేడు?

విద్యకు పరమార్ధం ఉద్యోగం.

విద్యకు చివరి గమ్యం ఉపాధి.

చదువుకునేది డబ్బు సంపాదన కోసమే.

ఒకసారి ఉద్యోగమో, ఉపాధో సంపాదిస్తే ఇక అక్కడితో చదువుకోవటానికి, విద్యా సముపార్జనకీ పుల్ స్టాఫ్ పడుతుంది. ఇదేనా చదువంటే? ఇదేనా విద్యంటే?

ప్రతి పిల్లీ, తన కూనలకి ఎలుకలని ఎలా వేటాడాలో నేర్పుతుంది.

ప్రతి కోతీ, తన పిల్లలకి ఇళ్ళ పెరళ్ళల్లోకి చెట్లమీది జామకాయలూ, మామిడికాయలూ ఎలా తెంపుకోవాలో, ఇంటి వాళ్ళు వెంటపడి రాళ్ళు విసిరితే ఎలా తప్పించుకోవాలో నేర్పుతుంది.

అలాగే మనమూ మన పిల్లలకి [ఉద్యోగమో, ఉపాధి] జీవన భృతి సంపాదించుకునే విద్యని నేర్పుతున్నాం. అంతే!

ఒకప్పుడు కుటుంబవృత్తులుండేవి. ఓ రైతు బాలుడు తన తండ్రి, తాతల దగ్గర వ్యవసాయపు మెళకువలు నేర్చుకునేవాడు. అందుకు ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు. ఓ అమ్మాయి తన అమ్మ, అమ్మమ్మల దగ్గర హౌస్ కీపింగ్, ఛైల్డ్ కేరింగ్ నేర్చుకునేది. దానికీ ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు.

ఓ వడ్రంగి, ఓ తాపీ మేస్త్రి, ఓ మెకానిక్ ఆయా వృత్తుల్లో రాణిస్తున్న మేస్త్రిల దగ్గర శిష్యరికం చేసి ఆయా విద్యల నేర్చి పొట్టపోసుకొనేవారు. పొట్టకూటి విద్య పరమావధి అక్కడికే. జీవనోపాధి సంపాదించుకోవటంతో ఆగిపోతే పిల్లికూనకీ, మనకీ తేడా ఏమిటీ? కోతి పిల్లకీ, మన పిల్లలకీ వ్యత్యాసం ఏమిటి?

అసలు విద్య పరమార్ధం పొట్టకూడు సంపాదించటమేనా?

ఎంతమాత్రంకాదు.

వాస్తవానికి – ఏవిద్య అయితే మనిషిని చెడు ఆలోచించకుండా, చెడు చేయకుండా నిరోధిస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఏవిద్య అయితే మనిషిని అహంకారం నుండి దూరం చేస్తుందో, ఆరిషడ్వర్గాల నుండి దూరం చేస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఈ నిజాన్ని మన కళ్ళకి కట్టినట్లు చెప్పే ఓ చిన్నకథ చెబుతాను.

అవి ధారా నగరాన్ని భోజమహారాజు పరిపాలిస్తున్న రోజులు. స్వయంగా కవీ, పండితుడు అయిన భోజరాజు ఆస్థానంలో చాలామంది కవి పండితులుండేవాళ్ళు. మహాకవి కాళిదాసు వంటి గొప్ప వారుండేవారు.

అలాంటి భోజరాజు ఆస్థానంలో ఓ సంస్కృతి పండితుడు ఉండేవాడు. ఇతడు బహు కుటుంబీకుడు. అతడి దురదృష్టమేమో గాని రాజుగారి దృష్టి ఇతడి మీద అంతగా పడలేదు. రాజుని మెప్పించే అవకాశాలు అతడి కంతగా రాకపోవటం చేత, రాజ సన్మానం తక్కువుగా ఉండడం చేత అతడికి ఆర్దికంగా చాలా ఇబ్బందులుండేవి. ఈ దారిద్ర్య బాధ పడలేక ఓరోజు అతడు రాజ ప్రాసాదం నుండి ఏవైనా విలువైన వస్తువులు దొంగిలించాలనుకున్నాడు. ఓరోజు రాత్రి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటుల కనుగప్పి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటులకి రాజుగారే తనని రమ్మన్నారని నమ్మబలికి, రాజు గారి అంతఃపురాన్ని చేరాడు. వెంట ఓపెద్ద సంచీ కూడా తెచ్చుకున్నాడు, దొంగిలించిన సొమ్ము వేసుకుపోవడానికి. మొదట అతడికి ఓ మూల బల్లపై అలంకారార్ధమై పెట్టి ఉంచిన స్వర్ణప్రతిమ కనబడింది. దాన్ని ఎత్తి సంచిలో పెట్టుకోబోయాడు. అంతలో అతడికి తాను చదివిన గ్రంధాల నుండి ‘బంగారు బొమ్మని దొంగిలిస్తే నరకలోకాధిపతి యముడు 7 ఏళ్ళ సుదీర్ఘ కాలం శిక్షవేస్తాడని’ చెప్పే శ్లోకం గుర్తుకువచ్చింది. అంతే! చేతులాడలేదు. బొమ్మని యధాస్థానంలో ఉంచాడు. అంతలో పరిచారకులు రావటంతో మూలన నక్కాడు. మరికొంత సేపు గడిచింది. అంతా సద్దుమణిగాక దారిద్రపీడితడైన ఈ పండితుడు మళ్ళా వెదుకులాట ప్రారంభించాడు. ఈసారి రాజుగారు ధరించే వజ్రాల హారం కనబడింది. నిశ్శబ్ధంగా దాన్ని తీసి సంచిలో వేసుకోబోయాడు. అభరణాలు దొంగిలిస్తే నరకంలో 12 ఏళ్ళు శిక్షపడుతుందన్న శ్లోకం గుర్తుకొచ్చింది. మళ్ళీ ప్రయత్నం విరమించుకున్నాడు. ఉత్తచేతులతో ఇంటికెళ్తే, ఇంట్లో అవసరాలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ ప్రయత్నించటం, తప్పుచేస్తే భగవంతుడు దండిస్తాడని చెప్పే శ్లోకం గుర్తుకురావటం, అంతటితో ఆగిపోవటం. రాత్రంతా ఎన్ని వస్తువులపై చెయ్యి వేసాడో, అన్నిటినీ అప్పుడే యధాస్థానంలో పెట్టేస్తూ గడిపేశాడు.

వేకువయ్యింది. తొలిఝాము నగారా మ్రోగింది. పండితుడికి కాళ్ళు చేతులూ వణికాయి. భయం ముప్పిరి గొంది. ఏంచెయ్యాలో దిక్కుతోచలేదు. పట్టుబడితే రాజదండన పడుతుంది. చటుక్కున రాజుగారి మంచం క్రిందికి దూరాడు. ఇంతలో రాజు గారి అంతఃపురంలో మంగళ వాద్యాలు మ్రోగాయి. మహారాజు నిద్రలేచి, వళ్ళు విరుచుకుంటూ వెళ్ళి నిలువుటద్దం ముందు నిలుచున్నాడు. అంతలో వందిమాగధుల స్త్రోత్రపాఠాలు మొదలయ్యాయి. ఆ పొగడ్తలు వినగానే, ఆ మహారాజులో తన సంపద, సామ్రాజ్యం, గొప్పదనం పట్లా, తన అందమైన బలిష్ఠమైన రూపం పట్లా అతిశయం, అహంకారం కలిగాయి. రాజు అద్దం ముందు నిలబడిన భంగిమలో, అతడి దేహభాషలో ప్రతిఫలిస్తున్న ఈ అతిశయం, అహంకారం చూడగానే మంచం క్రింద దాక్కున్న పండితుడికి, తాను చదువుకున్న గ్రంధాల నుండి ’ఈ లోకంలో, జీవితం, అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, అన్నీ ఎంత అశాశ్వతమైనవో, చావు పుట్టుకలెంత సహజమైనవో, పోయేనాడు ఈ సంపద, సౌభాగ్యమూ, రూపలావణ్యభరితమైన శరీరమూ ఎలా వెంటరాదో ’ తెలియ చెప్పే శ్లోకం గుర్తుకు వచ్చింది. ‘ఈ ప్రపంచానికి మనం వీడ్కొలు చెప్పి వెళ్ళేముందు ఏదీ వెంటరాదనీ, చేసుకున్న మంచి చెడులే తప్ప మరేదీ శాశ్వతం కాదని’ చెప్పే శ్లోకాన్ని బిగ్గరగా, స్పష్టంగా పాడుతూ పండితుడు మంచం క్రింది నుండి బయటికొచ్చాడు.

స్వయంగా తాను పండితుడే అయినా భోజ మహారాజు మరుక్షణం ఆ శ్లోకంలోని ఆదర్శప్రాయమైన భావాన్ని గ్రహించగలిగాడు. తనలో పొడసూపిన అతిశయాన్ని, అహంకారాన్ని గుర్తించగలిగాడు. ఎప్పుడైతే గుర్తించగలిగాడో మరుక్షణం అతిశయాన్నీ, అహంకారాన్ని తననుండి పారద్రోల గలిగాడు. ఒకసారి అహంకారం అతడి మనస్సు నుండి దూరమయ్యాక, భోజరాజు ఉదయపు ఆనందాన్ని, సూర్య కిరణాల్లోని నులివెచ్చదనాన్ని, పిల్లగాలి లోని చల్లదనాన్ని, పూల పరిమళాన్ని ఆస్వాదించగలిగాడు.

అప్పుడు స్పురించిందాయనకి పండితుడి ఉనికి. అనువుకాని సమయాన, అనువుకాని చోట, అందునా తన శయన మందిరంలో, తన పడక మంచం క్రిందనుండి బయటి కొచ్చిన పండితుణ్ణి చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. విచారించగా విషయం బోధపడింది. దారిద్ర బాధ ఎంతగా ఉన్నప్పటికీ దొంగతనానికి ప్రయత్నించినందుకు పశ్చాత్తాపపడుతూ పండితుడు నిజం చెప్పేసాడు. ఈ స్థితికి మహారాజు బాధ్యత వహించాడు. విచారం, పశ్చాత్తాపం వెలిబుచ్చాడు. పండితుడి ఆర్ధికావసరాలని తాను పట్టించుకోనందుకు మన్నింపు కోరాడు. ఉదయాన్నే సత్యం చెప్పి, తన పాండిత్య ప్రతిభతో సరైన శ్లోకాన్ని గుర్తుచేసి, అహంకారం అనే సర్పంబారిన పడబోయిన తనను కాపాడినందుకు కృతఙ్ఞతలు చెప్పుకొని, పండితుడి దారిద్ర్య బాధని తొలగించాడు.

ఇదీ కథ!

ఈ కథ మనకి విద్య,[ఙ్ఞానంతో కూడిన విద్య] మనల్ని మంచిమార్గంలో నడిపిస్తుందనీ, చెడు ఆలోచనలూ, చెడు పనులూ చేయబోయినప్పుడు హెచ్చరించి మంచివైపు మళ్ళిస్తుందనీ చెబుతుంది. ఈ కధలో పండితుడికి తప్పు చేయబోయినప్పుడు చట్టం గుర్తుకు రాలేదు. రాజు గుర్తుకు రాలేదు. భగవంతుడు గుర్తుకు వచ్చాడు. దొంగతనం చేసి పట్టుబడకుండా తప్పించుకుపోగలిగితే సాక్ష్యం లేదు గనుకా, చట్టం ఏంచేయలేదు, రాజూ శిక్షించలేడు. కానీ భగవంతుడికి సాక్ష్యం అక్కర్లేదు. తప్పు చేస్తే విధి తనని శిక్షిస్తుందని పండితుడు భయపడ్డాడు. ఈవిధంగా గుణశీలాలని, నైతికతని నేర్పవలసినది విద్య.

విద్య పరమార్ధం ఇదే. అంతేగాని కేవలం డబ్బు సంపాదన విద్య లక్ష్యం కాదు. సుఖంగా, సౌఖ్యంగా బ్రతకాలని ప్రతి మనిషీ, ప్రతి ప్రాణీ కోరుకుంటాయి. నిజానికి సుఖశాంతులతో బ్రతకడం ప్రతివారి హక్కు కూడాను. ప్రతిమనిషి ‘సౌఖ్యంగా బ్రతకటం’ అన్న గమ్యం కోసమే ప్రయత్నిస్తాడు. అయితే గమ్యంతో పాటు, దాన్ని చేరే మార్గం కూడా ఉన్నతంగానే ఉండాలి కదా!

బ్రతుకు తెరువు జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు.

ఈ నేపధ్యంలో ఒకసారి ఆలోచించి చూస్తే -

మనిషిని మంచి మార్గంలో నడిపించేది విద్య.

చెడు చేయకుండా నిరోధించేది విద్య.ఈ విద్య మనం నేర్చుకున్నామా? నేర్చుకుంటున్నామా? మన పిల్లలకి నేర్పిస్తున్నామా?

బ్రతుకు తెరువు సంపాదించిపెట్టేది విద్య అయితే అది ’డుకృతి కరణే’ మాత్రమే. అలాంటి ‘డుకృతి కరణే’ మనకే కాదు సర్వ జీవులకీ వచ్చు. జింకల నెలా వేటాడాలో పులిపిల్ల నేరుస్తుంది. లేత చిగురాకుల కోసం ఎక్కడ వెదకాలో జింక పిల్లా నేర్చుకుంటుంది.

కానీ మనిషి అంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి కదా!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

అప్పటికి గత సంవత్సరంలాగే డిసెంబర్ మాసం వచ్చింది. నేను సిలబస్ పూర్తిచేసాను. ఇంకా ఒకటో రెండో ఛాప్టర్లు మిగిలి ఉన్నాయి. మా కొలీగ్ ఒకతను “మేడం! పిల్లల్ని కూడా నమ్మకండి. మేనేజ్ మెంట్ చెప్పమంటే వాళ్ళు హఠాత్తుగా మాటమారుస్తారు” అని హెచ్చరించి, వెళ్ళిపోయాడు. ఎందుకలా హెచ్చరిండాడో, దాని భావమేమిటో నాకు అర్ధం కాలేదు. ఒకటి మాత్రం అర్ధమయ్యింది. అతడు నామేలు కోరి చెప్పాడని. అతని కంఠంలోని సిన్సియారిటీ నాకలా అన్పించింది. కానీ మన విద్యార్ధుల్ని మనం నమ్మకపోవటం, అసలా సందర్భం ఏమిటో అర్ధంకాలేదు. ఈ తికమకలో నేనుండగనే, మా కాలేజీలో అటెండర్ [చిన్న కుర్రాడు] “మేడం! నిన్న ఆదివారం కృష్ణారెడ్డి సారు, శశిధర్ రెడ్డి సారు [వీళ్ళిద్దరు స్వంత అన్నదమ్ములు] , బ్రిలియంట్ మనోహర్ సారు ఇక్కడ ఆఫీసు రూంలో పార్టీ చేసుకుండ్రు. తాగి మిమ్మల్ని బూతులు తిట్టుకున్నరు” అని చెప్పాడు. ఆ పిల్లవాడి ముఖం ఎర్రగా కోపంతో కందిపోయి ఉంది. కొంచెం దూరంలో కాలేజీ మరో డైరెక్టర్ అప్పారావు నిలబడి ఉన్నాడు. అయినా ఆ కుర్రాడు జంకు లేకుండా నాకు చెప్పేసి మెస్ లోకి వెళ్ళిపోయాడు. పరిస్థితేమిటో నాకు అర్ధం కాలేదు. అయితే బ్రిలియంట్ కాలేజీ యాజమాన్యం మనోహర్ కీ [ఈ కాలేజీలోనే నేను ముందటి సంవత్సరం పనిచేసాను], త్రివేణి కాలేజీ యాజమాన్యానికి అస్సలు పడదు. అది నాకు అప్పటి వరకూ ఖరారుగా తెలుసు. ‘మరి వాళ్ళంతా కలిసి మందుకొట్టటమేమిటి? సరే. వాళ్ళ వాళ్ళ వ్యాపార అవసరాలు, వ్యక్తిగత సంబంధాలు. కొట్టుకుంటారు, కలిసిపోతారు. మధ్యలో నన్ను తిట్టుకోవటం ఏమిటి?’ అంతా గందర గోళంగా అనిపించింది. ఓ క్షణం ‘ఈ అటెండర్ కుర్రాణ్ణి మేనేజ్ మెంట్ తిట్టిందేమో. ఆ కోపం కొద్దీ వీడేమన్నా కల్పించి చెబుతున్నాడా?’ అని కూడా ఆలోచించాము. మరునాడు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళగానే, యాజమాన్యం నన్ను ఆఫీసురూం కి పిలిపించింది. నా చేతికి కాగితం ఇచ్చి “తెలుగుమీడియం విద్యార్ధులకి మీరు చెబుతున్నది అర్ధంకావడం లేదట. అలాంటప్పుడు మీ సర్వీసు ఎందుకు మాకు? పోయిన నెల జీతం మొన్ననే ఇచ్చాము కదా! రేపటి నుండి మీరు కాలేజీకి రావద్దు” అని చెప్పారు. దాదాపు గత సంవత్సరం బ్రిలియంట్ కాలేజీ వాళ్ళు చెప్పిన మాటలే. తేడా ఒక్కటే. నడిచిన నెల జీతం ఇచ్చి చెప్పటం, పిల్లల ఫిర్యాదు కాగితం మీద వ్రాయించటం. నేను వెంటనే “నేను చెబుతున్న పాఠం తెలుగు మీడియం వాళ్ళకైనా, ఇంగ్లీషు మీడియం వాళ్ళకైనా, అర్ధమౌతుందో లేదో ట్రయల్ క్లాసులప్పుడు తెలియలేదా? వీడియో కవరేజ్ చేసి ప్రచారం చేసుకున్నప్పుడు తెలియలేదా?[త్రివేణి కాలేజీ వాళ్ళు కూడా వీడియో తీసి వాణిజ్యప్రకటనలు ఇచ్చుకున్నారు.] దాదాపు సిలబస్ పూర్తయ్యాక తెలిసిందా? అదీ నేను పిల్లలకిపాఠం చెప్పాక, అర్ధమైందా అని అడిగి కాలేదంటే మళ్ళీ చెబుతాను. వాళ్ళు అర్ధమైంది అన్నాకే నోట్సు డిక్టేట్ చేస్తాను. క్లాసులో పిల్లల దగ్గరే తేల్చండి. నేను చెబుతుంది అర్ధమౌతుందో లేదో?" అని ఎదురు వాదించాను. త్రివేణి యాజమాన్యం నిర్ధ్వంద్వంగా నా వాదన తోసి పుచ్చింది. నేను, నా భర్తా మర్నాడు మధుసూదనరావు దగ్గరికి వెళ్ళాము. ఈయన గత సంవత్సరంలో బ్రిలియంట్ కాలేజీ వివాదంలో పేరెంటుగా పోలీసు స్టేషన్ లో కేసుపెట్టిన వ్యక్తి. బ్రిలియంట్ కాలేజీలో చివరి రోజుదాకా ఆయన బ్రిలియంట్ కాలేజీ మేనేజ్ మెంటు నుండి నన్ను protect చేస్తూ వచ్చాడు. తదుపరి సంవత్సరం త్రివేణిలో చేరే ముందు కూడా ఈయన దగ్గరికి సలహా కోసం వెళ్ళాము. అప్పుడాయన త్రివేణి యాజమాన్యం తనకు తెలుసుననీ, మంచివాళ్ళేననీ, చేరవచ్చుననీ సలహా ఇచ్చాడు. తన కుమారుణ్ణి గుంటూరులో చేర్పించాలా వద్దాఅని ఆలోచిస్తున్నాననీ, ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. విషయమంతా చెప్పి, పెద్దమనిషిగా వచ్చి సమస్య పరిష్కరించమని అడిగాము. ఆ సంభాషణలో “వాళ్ళు ఇంటర్ పేపర్ వారం ముందు తెస్తారు. మాస్ కాపీయింగ్ చేయిస్తారు. అవన్నీ వాళ్ళ గొడవలు అనుకొని నేనేమీ పట్టించుకోలేదు. అటువంటిది, ఇది అన్యాయం కాదా? అందునా గత సంవత్సరం ఇదే అనుభవం అని నేను వీళ్ళు మా దగ్గరికి వచ్చి జాబ్ ఆఫర్ చేసినప్పుడే భరోసా అడిగాను. ‘ఛఛ మేం అలాంటి వాళ్ళం కాదు. మీరే అనుమానాలు పెట్టుకోవద్దు’ అంటూ, మా ఇంటిచుట్టు తిరిగి మరి ఒప్పించారు. ఇప్పుడిలా చేయటమేమిటి?” అంటు నేను ఆక్రోశ పడ్డాను.

ఆ సాయంత్రం జరిగిన పంచాయితీలో ముందు తెలుగు మీడియం క్లాసుకి వెళ్ళి పిల్లల్ని బహిరంగ విచారణ చేయమని పట్టుపట్టాను. మేనేజ్ మెంటు, మధుసూధన రావు, నేనూ, నాభర్తా క్లాసుకి వెళ్ళాం. పిల్లల్ని నేను “ఏమర్రా, నేను చెప్పేపాఠం మీకు అర్ధం కావటం లేదా? మీకు అర్ధంకాకపోతే అడగండి. ఎన్నిసార్లయినా మళ్ళీ చెబుతానని మీకు చాలా సార్లు చెప్పాను కదా! మీరలా మరోసారి చెప్పమన్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చెప్పాను కాదా! ప్రతిరోజూ మీరు పాఠం అర్ధమైందని చెప్పాకే నేను నోట్సు ఇస్తాను. మరి ఇలాంటి లేఖ వ్రాసి ఎందుకు ఇచ్చారు. అసలు పాఠం అర్ధంకాకపోతే నన్నే అడిగితే పోయేదానికి ఇదంతా ఏమిటి?" అని నిలదీసాను. వాళ్ళల్లో శ్రీకాంత్ అనే విద్యార్ధి బాగా చదువుతాడు. ఆ పిల్లవాణ్ణి గుచ్చి అడిగాను. ఆ పిల్లవాడు “నాకు బాగానే అర్ధం అవుతుంది మేడం. డైరెక్టర్ సార్ సంతకం పెట్టమన్నారు. పెట్టాను” అన్నాడు. ఇదేమిటని కాలేజీ యాజమాన్యాన్ని నిలదీసాను. ‘గుంటూరులో గతిలేక సూర్యాపేట వచ్చింది’ అంటూ నాగురించి పిల్లల ముందు అగౌరవంగా మాట్లాడాడని పిల్లలు చెప్పారు. ఆ కోపం నాకు బాగా ఉండటంతో గట్టిగా నిలదీసాను. కాలేజీ డైరెక్టర్లందరూ ఒక్కసారిగా ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాకుండా గట్టిగా అరవటం మొదలుపెట్టారు. నేను అంతకంటే గట్టి గొంతుతో ‘పిల్లలతో నాగురించి గతిలేక వచ్చానని, ఇప్పటికి చెల్లించిన 70,000/- రూ. తిరిగి కట్టించుకుంటామనీ, అదనీ ఇదనీ అన్నారట. అది సరైన పద్దతేనా? నేను మాత్రం అనదల్చుకుంటే అనలేనా ‘వార్డుబాయ్ లు కాలేజీలు పెడితే ఇలాగే ఉంటుందని?’ అన్నాను. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్ధం అలుముకుంది. ఎందుకంటే ఆ కాలేజీ డైరెక్టర్లలో ఒకతను అంతంత మాత్రపు చదువుతో [10th అర్హతతో] ప్రభుత్వ ఆసుపత్రిలో NMA [Non Medical Assistance] గా పనిచేస్తున్నాడు. అది వార్డుబాయ్ స్థాయి ఉద్యోగమే. అయితే తన బదులు మరో నిరుద్యోగ యువకుణ్ణి ప్రభుత్వ డ్యూటీ కి పంపి, తాను రాజకీయ నాయకుల వెనుక తిరుగుతుంటాడు. ఈగొడవ చివరిలో మధుసూధన రావు ఇంటర్ పేపర్ లీక్ గురించి నేను అన్నమాట త్రివేణి వాళ్ళతో అన్నాడేమో, వాళ్ళు మొత్తం వివాదం వెనక్కి తీసుకుంటూ “కావాలంటే ఆ ముఫైవేలు ఇస్తాం. ఆవిడ ఇక క్లాసులు కూడా చెప్పక్కర్లేదు. వెళ్ళిపొమ్మనండి. లేదంటే ఎంతకావాలంటే అంత ఇస్తాం. అంతేగాని కేసులు గీసులూ పెట్టద్దు. కావాలంటే సంవత్సరం చివరివరకూ కంటిన్యూ అవ్వమనండి” అన్నారు. గత సంవత్సరం, గొడవ తర్వాత కాలేజీలో కంటిన్యూ అయితే వాళ్ళు పెట్టిన చీదర నాకు బాగా గుర్తుంది. అందుచేత వద్దన్నాను. అప్పటికి నేనింకా 10% సిలబస్ పూర్తి చెయ్యాల్సి ఉంది. నాకింకా 32,000/-Rs. దాకా రావాల్సి ఉంది. ఇంటర్ పేపర్ లీక్ గురించిన భయంతో ‘ఎంత కావాలో చెప్పమనండి ఇస్తాం’ అని మేనేజ్ మెంట్ అనటంతో నాకు రావలసిన 32,000/- రూ. తీసుకున్నా కూడా, వాళ్ళ తప్పును పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి తీసికున్నట్లు ఉంటుందనిపించింది. అందుచేత ఆ ప్రపోజల్ ను తిరస్కరించాను.

నాగురించి అవాకులు చెవాకులు అనకూడదన్న షరతుతో వివాదం ముగిసింది. ఆ కాలేజీలో నేను చెప్పాల్సిన సిలబస్నిా , ఉద్యోగాన్ని, వాళ్ళివాల్సి ఉన్న డబ్బుని వదిలేసుకున్నాను. అంతటితో ఆ కాంట్రాక్టు రద్దయ్యింది.

అప్పటికే ఆ వూర్లో నా కోచింగ్ సెంటర్ కి కొంత పేరొచ్చింది. ఇంజనీరింగ్కీద, మెడిసిన్కీో ఎంసెట్ విద్యార్ధులు, జూనియర్ ఇంటర్ నుండి ఎంసెట్కి సిద్దమౌతున్న విద్యార్ధులు నాదగ్గర ట్యూషన్కిద వచ్చేవారు. స్థానిక ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసు, ప్రభుత్వ డాక్టర్, ఇతర వ్యాపారుల పిల్లలు నాదగ్గర చదువుకునేవాళ్ళు. దాదాపు ప్రతీ విద్యార్ధి/ విద్యార్ధినికి ఇంజనీరింగ్ చదువుతున్న అన్న, అక్క ఉన్నారు. నేనూ, నాభర్తా ఇద్దరం పిల్లలకు శిక్షణనివ్వటం కోసం కష్టపడేవాళ్ళం. పాఠాలు చెప్పడం, వారాంతంలో ఛాప్టర్ల ప్రకారం ఒ.ఎం.ఆర్. షీట్పై్ పరీక్షలు నిర్వహించడం, అవి ఎప్పటికప్పుడు దిద్ది పిల్లల్ని కౌన్సిల్ చేయటం, వాళ్ళ బలాలు, బలహీనతలు గురించి వివరించటం చేసేవాళ్ళం. ఫిజిక్స్ లో చలపతి రావుగారి పుస్తకం, గణితంలో దీప్తి పబ్లికేషన్స్ వారి పుస్తకం, కెమిస్ట్రీకి విఙ్ఞాన్ పబ్లికేషన్స్ వాడేవాళ్ళం. నాకు పీరియాడిక్ టేబుల్ మీదా బాగా సాధికారత ఉంది. మోడర్న్ ఫిజిక్స్ కూ, ఎలక్ట్రో కెమీస్ట్రీ దగ్గరగా ఉండటంతోనూ, పరమాణు శాస్త్రం మీద నాకు సహజంగానే ఆసక్తి ఎక్కువకావటంతోనూ రసాయన శాస్త్రం డీల్ చెయ్యటం నాకు సులభంగానే ఉండేది. ఆర్గానిక్ కెమిస్ట్రీ వేరే లెక్చరర్ చేత చెప్పించాము.

గణితం చెప్పేవారికి ఫిజిక్స్ రాకపోయినా ఫర్వాలేదు గానీ, ఫిజిక్స్ చెప్పేవానికి గణితం రాకపోతే కుదరదు, అదీగాక ఐఐటి ఫిజిక్స్ కోసం కూడా నేను గణితంలో చాలా కృషి చేశాను. అదీగాక నంబూరు కమిటీ కాలేజీలో పనిచేసేటప్పుడు అక్కడివారికి గణితంలో Theory of probability చెప్పేటందుకు లెక్చరర్స్ దొరకక పోవటంతో, నేనే అక్కడి ఇంటర్ పిల్లలకు బోధించాను. శ్రీశైలంలోనూ డిగ్రీ పిల్లలకి మాధ్స్ చెప్పాను. అందుచేత పిల్లలకి దీప్తి పబ్లికేషన్స్లోి ఆంజనేయులు గారు compile చేసిన దాదాపు 12,000 లెక్కల్లో దాదాపు 10,000 దాకా సంవత్సర కాలంలో చేయించేశాను. చలపతి రావుగారి పుస్తకం నుండి ఫిజిక్స్ లో దాదాపు 7000 ప్రశ్నలు, విఙ్ఞాన్ నుండి రసాయన శాస్త్రం చేయించాను. ఇవిగాక పిల్లలు రకరకాల మెటీరియల్స్ తెచ్చేవాళ్ళు. రివిజన్లోా భాగంగా వాటన్నింటినీ ప్రాక్టీస్ చేశారు. ‘అన్ని సబ్జెక్ట్లూన ఒక లెక్చరర్ డీల్ చెయ్యటం’ అన్నది ఒక రిస్క్. అందుచేత నా విద్యార్ధులు, వారి తల్లితండ్రులూ తమకు తెలిసిన, తమ బంధువుల్లోని ఇతర ప్రాంతాల, కాలేజీల విద్యార్ధులతో పోల్చుకొని, నాదగ్గర పొందుతున్న శిక్షణని ఎప్పటికప్పుడు, బేరిజు వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఏమాత్రం సందేహం అన్పించినా వెంటనే మమ్మల్ని అడిగేవారు.

సూర్యాపేటలో సిటికేబుల్ అధినేత, స్థానిక ప్రముఖుడు ఒకాయన ఉండేవాడు. వారి అబ్బాయి విజయవాడలోని కార్పోరేట్ కాలేజీలో చదివేవాడు. ఆ పిల్లవాడు ఎలక్ట్రీసిటి, వేవ్ మోషన్లోవ poor గా ఉన్నాడని, పిల్లవాడి తండ్రి దసరా, సంక్రాంతి సెలవుల్లో ఆ బ్రాంచీలు చెప్పమని అడిగాడు. వాళ్ళతో నాకున్న terms రీత్యా ఒప్పుకున్నాను. ఆ సందర్భంలో కూడా అక్కడి కార్పోరేట్ కాలేజీల అప్పటి మెటీరియల్నీడ, పిల్లలకి ఇచ్చిన శిక్షణనీ, పూర్తయిన సిలబస్నీ , మాదగ్గర విద్యార్ధులతో పోల్చుకుని విశ్లేషించుకొని, శిక్షణ నిచ్చేపద్దతిలో మరింత జాగ్రత్త తీసుకునేవాళ్ళం.

విద్యార్ధుల్ని కౌన్సిల్ చేస్తూ నేను “EAMCET, IIT మాత్రమే కాదు, ఏపోటీ పరీక్షలకైనా సిద్దమయ్యే విద్యార్ధికి చదువులో పరిశ్రమించడం, ధారణశక్తి, ఙ్ఞాపకశక్తి వంటి శక్తిసామర్ధ్యాలతో బాటు మానసిక స్థైర్యం, తన గురించి తనకి తెలిసిఉండడం, తన Abilities ని సమర్ధంగా ఉపయోగించుకోగలగడం ఎంతో అవసరం. అప్పుడే ఉత్తమ ఫలితాన్ని సాధించగలగుతారు.

‘ఆకలితో ఉన్నవ్యక్తికి నువ్వు ఒకచేప నిచ్చినట్లయితే ఈ రోజుకి అతని ఆకలి తీరుతుంది. అదే చేపలు పట్టటం నేర్పినట్లయితే జన్మంతా అతని ఆకలి తీరుతుంది’ అన్నది సామెత. అందుకే ఫిజిక్స్ లో సమస్యలు [Problems] సాధించేటప్పుడు, విద్యార్ధికి లెక్క నేర్పడంతో సరిపోదు. లెక్కలు చేయగల ఆలోచనాసరళి, అంటే నేర్చుకున్న theory ని problem కి అప్లై చేయగల ఆలోచనా సరళి నేర్పడమే ఎంసెట్ కోచింగ్ అంటే. ఎందుకంటే విద్యార్ధి నేర్చుకున్న లెక్కరాదు. అదే మోడల్ వచ్చినా, data మారవచ్చు. లేదా కొద్ది మార్పులతో అదే మోడల్ రావచ్చు. అసలు థీయరీ మరో మోడల్లోe లెక్కరూపంలో question paper లో ప్రత్యక్షం కావచ్చు.

నిజానికి ఎంసెట్, ఐ.ఐ.టి. అంటేనే అది. నేర్చుకున్న శాస్త్రవిఙ్ఞానాన్ని ఎంతవరకు లైఫ్కిల అప్లై చేయగలమో పరీక్షించడమే ఎంసెట్ పరీక్షా విధానం. లేనట్లయితే ABCD multiple choice లల్లో ఏముందనీ? By luck Rank రాగల అవకాశం ఉందా? ఎంతమాత్రం లేదు. ర్యాంక్ రావాలంటే దాని వెనుక సబ్జెక్ట్ మీద కమాండ్, తమ మనస్సు మీద తమకి కమాండ్ ఉండాలి.

ఉదాహరణకి Physics Problem solve చేయాలి అంటే ఫిజిక్స్‍ థీయరీని Problem కి అప్లై చేసుకోవాలి. భాషలో ఉన్న థీయరీని mathematical equation గా మార్చుకోవాలి. ఏసూత్రం అప్లై అవుతుందో తేల్చుకోవాలి. అప్పుడు గాని లెక్కసాధించడం సాధ్యంకాదు. అంటే థీయరీని అప్లై చేసినట్లేగదా! Problems కి అప్లై చేయగలిగిన వ్యక్తి, రేపు లైఫ్కిన, ప్రాజెక్ట్ కి, సమాజానికి అప్లై చేయగల నిపుణుడు కాగలడనే కదా?

ఎంసెట్, ఐఐటి వ్రాసే విద్యార్ధికి సబ్జెక్ట్ పై కమాండ్ మాత్రమే కాక తన మీద తనకు అవగాహనా ఉండాలి. తెలివి, పరిశ్రమ, ఙ్ఞాపకశక్తి మాత్రమే కాక మనోబలం కూడా కావాలి. కాబట్టే ఇంటర్ లోనూ, 10th లోనూ ఎంతో తెలివైన వాడనిపించుకునే విద్యార్ధి పోటీపరీక్షకి హాజరైనపుడు కంగారులో పేపర్ పాడుచేసుకున్న సంఘటనలు మనకి కన్పిస్తుంటాయి. మామూలు చదువుల్లో సగటు విద్యార్ధి అన్పించుకున్న వాడు, అతడికి వస్తుంది అనుకున్న ర్యాంక్ కంటే కూడా ఉత్తమర్యాంకు సాధించిన సందర్భాలు కన్పిస్తుంటాయి.

కొన్ని ఉదాహరణలు చూడండి:

1]. Two bodies of masses m and 3m are drooped simultaneously from the same height. If g=10cm/s2 the ratio of their velocities at instant of touching the ground is
a] 1:3 b] 3:1 c] 1:9 d] 1:1 Ans.[d]

ఈలెక్కలో ద్రవ్యరాశి అవసరం ఎంతమాత్రం లేదు. కాని ఇచ్చారుగదా. దాన్ని relate చేసిన ఫార్ములా ఏదో ఉండి ఉండాలి అనుకొని విద్యార్ధి తప్పు ఆన్సర్ చేసిన సందర్భాలున్నాయి.

ఇది తన పరిశ్రమ[Hard work] మీద తనకిలేని నమ్మకాన్ని చూపిస్తుంది. అంటే ఆత్మవిశ్వాసలోపం. అదే ఆత్మవిశ్వాసమే ఉంటే, ఇది misleading question అని గ్రహించి ఆన్సర్ చేస్తాడు.

2]. Three Resistance of magnitudes 2,3 and 5 ohm are connected in series to a batter of 10 volts and of negligible resistance. The potential drop across the 3 ohm resistance is
a]3A b]3V c]5V d]10V Ans. [b]

ఇది లెక్క చేయగానే యూనిట్ చూసుకోకుండా తప్పు ఆన్సరు పెట్టడం జరుగుతుంది. యూనిట్స్ మార్పుతో ఒకే అంకె కన్పించగానే ఆన్సరు చేయడం.[3V జవాబు అయితే 3A అని గుర్తించటం] ఇది alertness లేకపోవడాన్ని సూచిస్తుంది.

3]. A body covers 200cm in the first 2 sec and 220 cm in the next 4 sec. under constant acceleration. Then the Velocity after body after 7 sec is
a]-15cm/s b]115 cm/s c]10cm/s d]20cm/s Ans. [c]

ఈ లెక్క ప్రారంభించేటప్పుడు 7th seconds లో ఎంతో కనుక్కోవాలని తెలుసు. కానీ తొలివేగం కనుక్కోగానే ఆన్సర్ అదే అనుకొని చేసే అవకాశం ఉంది. ఇది మధ్యలో లక్ష్యాన్ని మర్చిపోవడాన్ని సూచిస్తుంది.

4]. ఒకోసారి లెక్క అంతా చేస్తే 2ms-1 జవాబు వస్తుంది. అది ఏ ‘c’ లోనో ఉంటుంది. అంటే ఒ.ఎం.ఆర్.లో మూడోగడిని నింపాలి. కానీ విద్యార్ధి గభాలున ‘b’ ని అంటే రెండోగడిని డార్క్ చేసేఅవకాశం ఉంది. ఇక్కడ ఏకాగ్రత ఎంతో అవసరం.

5]. ఒకోసారి nth ప్రశ్నకు జవాబు తెలియదు. తర్వాత చేద్దాం అనుకొని తర్వాతి ప్రశ్నను (n+1)th చేస్తారు. జవాబులు ముందటి ప్రశ్నకు అంటే nth ప్రశ్నకు పెట్టేస్తారు. దెబ్బతో మొత్తం ఒ.ఎం.ఆర్. తప్పయి కూర్చుంటుంది.

అంతేకాక ఒక్కసారి option ని బట్టి workout చేసుకొని సమయాన్ని ఆదా చేసుకోగల సమయస్పూర్తి అవసరమౌతుంది. 1 అనుకుంటునే 2 మార్కు చేసి వచ్చే perception of brain ఉంటుంది. ఇదిగాక exam tense ఎంతో ప్రభావితం చేస్తుంది.

‘విరామ సమయంలో ఎంతో ఎక్కువ చెమట కారిస్తే యుద్దసమయంలో అంత తక్కువ రక్తం కార్చవచ్చు’ అన్నది సైనికుల సామెత. అలాగే, ముందుగా ఎంత పరిశ్రమిస్తే competitive exams లో అంత మంచి ర్యాంకు సాధించవచ్చు” అనేదాన్ని.

ఈ విధంగా పిల్లల్ని పరీక్షకి సిద్ధం చేశాము. 100 టెస్టులు పెడతామని ముందుగా వాగ్ధానం చేసాము. దాదాపు 90 వరకూ పరీక్షలు నిర్వహించాము. అదీ ఒ.ఎం.ఆర్.ని ప్రింటు చేయించి ప్రాక్టీసు చేయించాము.

సూర్యాపేటలో డాక్టర్ ఆంజనేయులు అనే ఒకాయన ఉండేవారు. ఆయన ENT Specialist గా, ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ఆయన పెద్దకుమార్తె సూర్యాపేటలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతుంది. రెండో అమ్మాయి రమాదేవి గురించి ఆయన మాదగ్గరకి వచ్చాడు. అప్పటికి 1999 ఎంసెట్లోవ బ్రిలియంట్ కాలేజీలోని నావిద్యార్ధులకి 126 ర్యాంకుతో పాటు, 2200+, 3400+ గట్రాలతో 40 మందిలో 22 మందికి మంచిర్యాంకులు వచ్చి నాలుగైదు రోజులయ్యింది. ఆయన కూతుర్ని డాక్టర్నిల చెయ్యలన్న లక్ష్యంతో ఆపిల్ల చిన్నప్పటి నుండి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడట. ఆ అమ్మాయి మీద భాష తాలూకూ వత్తిడి వద్దనుకొని 10th కు ముందే తెలుగు మీడియంలో చదివించుకొస్తున్నాడు. బొటనీ, జువాలజీనీ కుమార్తెకు తానే బోధిస్తున్నాడు. మాదగ్గరికి వచ్చి “మేడం! మా అమ్మాయిని హైదరాబాద్లోీ చదివిస్తున్నాను. ఫిజిక్స్ మీరు చెబుతానంటే టీసీ తెచ్చుకుని, ఇక్కడ ఏదో కాలేజీలో చేరుస్తాను” అని అడిగాడు. మేం సరేనన్నాం. ఆ అమ్మాయి ఎంసెట్లోట మెడిసిన్ ర్యాంకు పొందటమే లక్ష్యంగా కష్టపడి చదివేది. ఆ వయస్సు పిల్లలకుండే వ్యాపకాలు – మ్యాచింగ్ డ్రెస్సులు, సినిమాలు, టీవీ ప్రోగ్రాంలూ ఏవి పట్టేవికావు. సమయానికి బ్యాగ్ కనబడకపోతే ఓ ప్లాస్టిక్ కవర్లోి పుస్తకాలు పడేసుకొని, సైకిలు క్యారియర్ మీద పెట్టుకొని వచ్చేసేది. నిద్రలో లేపి అడిగినా ఫిజిక్స్ లో ఏప్రశ్న/ ప్రాబ్లెం అయినా చేయగలిగేటట్లు ఉండేది. ఆ అమ్మాయి ఙ్ఞాపకశక్తి కూడా అమోఘంగా ఉండేది. చాలావేగంగా, కరెక్ట్ గా ప్రశ్నాపత్రాలు సాధించేది. ఒక్క ఫిజిక్స్, కెమిస్ట్రీలే కాదు, బోటనీ, జువాలజీల్లో కూడా ఆపిల్ల పరిశ్రమ తగినంతగా ఉండేది. అలాగే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కి సిద్ధమౌతున్న పిల్లల్లో ఇంకొందరు అబ్బాయిలు బాగా చేసేవారు.

నా దగ్గరున్న – పిల్లల్లో ఆరేడు మందికి ర్యాంకులు రావచ్చు, కనీసం ఒక మెడిసిన్, రెండు/ మూడు ఇంజనీరింగ్ ర్యాంకులు తప్పకుండా వస్తాయి’ అన్న నమ్మకంతో, ఆకాంక్షతో శ్రమించాము. దాదాపు 1000 గంటలపాటు పిల్లలూ, మేము శ్రమించాము. 90 దాకా chapter wise, comprehensive test లు పెట్టాము. సదరు కాలేజీ యాజమాన్యాలు “కాలేజీలో ఇందరు లెక్చరర్స్ ఉన్నారు. ఇంతపెద్ద క్యాంపస్ ఉంది. మాదగ్గర ఫీజు కట్టమంటే వందవంకలు చెబుతారు. వాయిదాపద్దతిలో కడతారు. అదే ట్యూషన్లలో వేలకు వేలుకడతారు?” అంటూ పిల్లల మీద ఎగిరిపడేవాళ్ళు. నావిద్యార్ధులు ఇలాంటి సమాచారం చెప్పినప్పుడు నవ్వేసి ఊరుకునేదాన్ని. ఆ విద్యా సంవత్సరం ప్రారంభంలో త్రివేణి కాలేజీలో సీటుకు డిమాండ్ ఉన్న స్థితినుండి, విద్యార్ధులు ఎంసెట్ క్లాసులు జరగటం లేదన్న ఫిర్యాదుల దగ్గరికి, తల్లితండ్రులు నిలదీసే దగ్గరకి పరిస్థితి మారిపోయింది.

ఈటివీలో అప్పట్లో ‘ప్రతిభ’ పేరుతో ఇంటర్ పాఠాలు చెప్పే కార్యక్రమం వచ్చేది. [ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు] అందులో చెప్పే లెక్చరర్స్ ని పిలిపించి త్రివేణి కాలేజీ పిల్లలకి క్లాసులు చెప్పించారు. రెండువారాల కంటే నడవలేదు. ఖమ్మం నుండి, నల్గొండనుండి లెక్చరర్స్ ని తెచ్చారు. ఏవీ రెండుమూడు వారాల కంటే నడవలేదు. పిల్లలు గొడవ మానలేదు.

ఈ నేపధ్యంలో విద్యాసంవత్సరం ముగిసింది. Short termకి త్రివేణి కాలేజీ నుండి పిల్లలు నెల్లూరు నారాయణ, నలంద మరికొన్ని కార్పోరేట్ కాలేజీలకి వెళ్ళారు. అక్కడి tight schedule నీ, hard working నీ తట్టుకోలేక, ఇంగ్లీషు ఉచ్ఛారణ, సబ్జెక్ట్, విషయంలో ఆత్మన్యూనతకి గురై వెంటనే తిరిగి వచ్చేసారు. ఒకరిద్దరు తప్ప దాదాపు అందరూ వారం పదిరోజుల్లోనే తిరిగి వచ్చేసారు. నా దగ్గర చదువుతున్న విద్యార్ధులు కుతూహలం కొద్దీ ఈ వివరాలన్నీ సేకరించేవారు. మేము కుతూహలం కొద్దీ, వృత్తిలో పోటీ కొద్దీ, అన్నీ వినే వాళ్ళం. తర్వాత విశ్లేషించుకునేవాళ్ళం. ఈనేపధ్యంలో 2000, మేలో ఎంట్రన్స్ పరీక్ష ముగిసింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నాబ్లాగు చుట్టాలందరికీ విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ నాడు ప్రశాంతంగా, ప్రమోదంగా చదువుకునేందుకు ఓ చిన్న టపా.

ఆవి 8 వ శతాబ్ధి నాటి రోజులు. ఓనాడు కాశీపుర వీధుల్లో ఆది శంకరాచార్యులు, శిష్యసమేతంగా భిక్షార్ధియై వెళ్తున్నారు. ఓ ఇంటి వీధి అరుగు మీద, డెభై ఏళ్ళ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. పదేపదే గట్టిగా ’డుకృఞ్ కరణే, డుకృఞ్ కరణే’ అని వల్లిస్తున్నాడు. అది వ్యాకరణ సూత్రం. ఇతడు వృద్దుడు. కొన్ని దంతాలు ఊడిపోయి, కొన్ని వదులైపోయి మాట తొసి పోతున్నది. అసలు వ్యాకరణ సూత్రం ధ్వనిమారి, అతడి తొర్రినోట తప్పు పలుకుతున్నది. ముందుకూ వెనక్కీ ఊగుతూ, అతడు దాన్ని బట్టీ వేస్తున్నాడు. ఆ విధంగా సంపాదించిన పాండిత్యాన్ని – ఏ రాజుల ముందో, చక్రవర్తుల ముందో ప్రదర్శించి, సన్మానాలు, సంపదలూ పొందాలన్నది ఆ వృద్దుడి ఆకాంక్ష.

అది చూసి శంకరాచార్యుల వారికి ఆగ్రహం, జాలి కలిగాయి. ఎదుటి వాడు వృద్ధుడు. జీవితపు చివరిదశకు చేరినా సత్యమేమిటో ఇంకా గ్రహించలేకున్నాడు. ఇప్పటికీ సిరిసంపదలంటూ, సన్మానాలంటూ, పరుగులు పెడుతూనే ఉన్నాడు. అది చూసిన మరుక్షణం శంకరాచార్యుల వారినోట

భజగోవిందమ్ భజగోవిందమ్
గోవిందమ్ భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహిత కాలే
నహినహి రక్షతి డుకృఞ్ కరణే

అన్న శ్లోకం పలికిందట.

“ఓరి మూర్ఖుడా! అంత్యకాలం సమీపించినప్పుడు, ఈ లౌక్యపు విద్యలు, ‘ఉపాధి, సంపద’ ఇస్తాయని సాధన చేసిన ఈ కళలు నిన్ను రక్షించలేవు. ఇప్పటికైనా గోవిందుణ్ణి [భగవంతుణ్ణి] భజించు” అని దాని అర్ధం. ముక్కుముఖం తెలియని ఎదుటివాణ్ణి, వయో భేదాన్ని పట్టించుకోకుండా, ఙ్ఞాన భేదాన్ని పరిగణించి, శిష్యుణ్ణి మందలించినట్లుగా ‘మూఢమతే’ అని మందలిస్తూ, సత్యాన్ని బోధించినందుకేనేమో ఆది శంకరుల వారిని జగద్గురువని పిలుస్తారు. భజగోవింద శ్లోకాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్ర మాధుర్యంలో రంగరించి చెవులబడుతుంటే ఆత్మ విశ్వపర్యటన చేస్తున్నట్లుంటుంది.

తదుపరి శ్లోకాలలో కొన్ని జగద్గురు ఆది శంకరాచార్యుల వారి శిష్యులు పూరించారట. భజగోవింద శ్లోకాలని విన్నప్పుడు, చదివినప్పుడూ మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.

ఆ వృద్ధుడు రాజు గారి నుండి ప్రశంసలూ, సన్మానాలు, తద్వారా కానుకలు, సంపదలు పొందాలని, వయసైపోయిన తర్వాత కూడా విద్యలు వల్లిస్తున్నాడు. విద్యా ప్రదర్శనతో, ఎలాగైనా రాజప్రీతిని పొందగలిగితే ఆర్ధికలాభం. ఇదీ ఆలోచన.

నిజానికి మన విద్యాసంస్థల్లో బోధించేది, సర్టిఫికేట్లు లో సూచించేది విద్య అనుకుంటాం గానీ, అది అసలైన విద్యకాదు. అది ’డుకృఞ్ కరణే’ వంటి విద్య మాత్రమే. అసలైన విద్య ఏమిటో, దాని పరమార్ధమేమిటో, నాకు చేతనైనట్లుగా ఆదివారం నాటి టపాలో వివరిస్తాను.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1999 ఎంసెట్ రిజల్ట్ ఒక్కసారిగా సూర్యాపేటలో మారుమోగిపోయింది. త్రివేణి కాలేజికి అడ్మిషన్లు భారీగా వచ్చాయి. ఇది పూర్యపు బ్రిలియంట్ కాలేజీతో పోలిస్తే పెద్దకాలేజీ. దాదాపు వెయ్యి దాకా విద్యార్ధులుండేవాళ్ళు. పక్కా భవనాలు ఉండేవి. అప్పటికి శ్రీచైతన్య, వికాస్ లాంటి కార్పోరేట్ కాలేజిల్లో చేరిన విద్యార్ధులు కొందరు వెనక్కి వచ్చి త్రివేణిలో చేరారు. మరోవైపు ర్యాంకులున్నాగానీ బ్రిలియంట్ కాలేజీలో అడ్మిషన్లు మందగించాయట. అక్కడ స్థానిక స్కూల్స్ లో 10th పూర్తిచేసిన విద్యార్ధులకి, ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు నచ్చచెప్పి, ఫలానాఫలానా కాలేజిల్లో చేరమని పంపిస్తుంటాయి. అలా ఆయా స్కూళ్ళనుండి తమ కాలేజీకి ఎందరు విద్యార్ధులు వస్తే, సదరు కాలేజీల వాళ్ళు ఆయా స్కూళ్ళ వారికి, తలకు ఇంత అని కమీషన్ ఇస్తుంటారు. ఆ విధంగా తలకు 500/- రూ. చెల్లించి మరీ, బ్రిలియంట్ కాలేజీ వాళ్ళు విద్యార్ధుల్ని పోగు చేసుకున్నారట.

వాస్తవానికి – ఈ నియమం లోకల్ స్కూళ్ళ, కాలేజీలకి మధ్యే కాదు, చుట్టుప్రక్కల ఉన్న ప్రభుత్వకాలేజీలకీ, గుంటూరు, విజయవాడ, ప్రకాశం, హైదరాబాద్ జిల్లాలలో ఉన్న కార్పోరేట్ కాలేజీలకీ మధ్యకూడా వర్తించబడేది. సూర్యాపేట చుట్టు కనీసం 1000 పైగా గ్రామాలు, తండాలూ ఉండేవి. అక్కడి ప్రభుత్వ, ప్రైమరీ, ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగాలు చేసే ప్రభుత్వ టీచర్ల సంఖ్య ఆ ఊరిలో ఎక్కువుగానే ఉండేది. ఆ ప్రభుత్వ టీచర్లు దాదాపు కార్పోరేట్ కాలేజీలకి PRO ల లాగా పనిచేసేవాళ్ళు. వారికి చుట్టుప్రక్కల గల ఏపల్లెలో ఉద్యోగం అయినా, సూర్యాపేటలో నివాసం ఉంటూ up and down చేసేవాళ్ళు. బదిలీలు అయినా, ఆ చుట్టుప్రక్కలే musical chair అయ్యేటట్లు manipulate చేసేవాళ్ళు. వాళ్ళలో చాలామందికి సూర్యాపేటలో చక్కని, పెద్ద స్వంత భవంతులు [నివాస గృహాలు] ఉండేవి. ప్రభుత్వ టీచర్లలో కొందరికి సూర్యాపేటలో వడ్డీవ్యాపారాలు, ఇతర వ్యాపారాలు ఉండేవి. పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలలో వాటాలుండేవని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళల్లో కొందరు తమ పేరిట జాబ్ కెళ్ళి వచ్చెందుకు నిరుద్యోగుల్ని నియమించుకొని, వారంలో ఓసారి వెళ్ళి రిజస్టరులో సంతకాలు పెట్టుకొని రావటం, మిగిలిన సమయాల్లో తమ వ్యక్తిగత వ్యాపారాలు చూసుకోవటం కూడా కద్దు. అందరూ ఇలా ఉండేవారని అనను గాని, ఇలా ఉండేవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. అంతేకాదు 1998 - 2001 సంవత్సరాలలో టీచర్స్ యూనియన్లలో స్టేట్ లెవల్ లీడర్స్ ఈ జిల్లానుండే ఉండేవాళ్ళు. నేను పని చేస్తున్న త్రివేణి కాలేజీలో కూడా ఈ టీచర్స్ పిల్లలే ఎక్కువుగా ఉండేవాళ్ళు. కాలేజీ మేనేజ్ మెంట్ లోని ఒక డైరెక్టర్ నల్గొండ జిల్లా ప్రైవేట్ కాలేజీల యూనియన్ కి ప్రెసిడెంటో లేక సెక్రటరీగానో ఉండేవాడు.

అక్కడ మరో విశేషం ఏమిటంటే – స్కాలర్ షిప్పులు. విద్యార్ధుల వెంటపడి కాలేజీ యాజమాన్యం స్కాలర్ షిప్పుల అప్లికేషన్లు నింపించి, ఫైల్ చేసి, ఆ స్కాలర్ షిప్పులని తమ ఫీజుగా జమచేసుకునేవి. అసలా షరతు మీదే అడ్మిషన్లు ఎక్కువుగా జరిగేవి. అందులోని మతలబు ఏమిటో నాకు అప్పడర్ధం కాలేదు. అర్ధంచేసుకొనే ప్రయత్నం కూడా నేనేమీ చేయలేదు. ‘అవన్నీ యాజమాన్యం వారి గొడవలు. మనకెందుకు’ అనుకునేదాన్ని. అయితే రెండేళ్ళ తర్వాత 2001 -02 లో మోత్యానాయక్ కేసుతో స్కాలర్ షిప్పుల కుంభకోణం బయటపడినప్పుడు అందులో కాలేజీలకి ఉండే లాభమేమిటో అర్ధమయ్యింది. 1999 – 2000 లో త్రివేణిలో పనిచేసేటప్పుడు యాజమాన్యానికి సంబంధించిన ఏవిషయము నేను పట్టించుకునేదాన్ని కాదు, పరిశీలించేదాన్నీ కాదు. పిల్లలకి పాఠాలు చెప్పడం, స్టాప్ రూంలో కొలీగ్స్ తో ఎంతవరకూ స్నేహమో అంతవరకూ ఉండటం, ఇంట్లో ట్యూషన్లు, పాప, పని. అంతే. సమయం మిగిలితే రామకోటి వ్రాసుకునేవాళ్ళం. ఎందుకంటే ‘ఈ ప్రపంచంలో ఎన్నో మోసాలు, ఘోరాలు జరుగుతుంటాయి. వాటన్నింటికి మనం ఎదిరించలేం, మార్చనూ లేం. మన వరకూ మనం, ఇతరులకి కీడు చెయ్యకపోతే మేలు చేసినట్లే!’ అనుకునేవాళ్ళం. నేను డిగ్రీ చదివే రోజుల్లో రామాయణవిషవృక్షం చదివి, ఆ విషం తలకెక్కించుకొని ‘రాముడు హిపోక్రైట్’ అనీ వితండవాదాలు కొన్నిరోజులు చేశాను. అప్పట్లో నేను చదువుకున్న JKC కాలేజీలో కుమారస్వామి గారు అని ఓ లెక్చరర్ ఉండేవారు. ఆయన ఇంగ్లీషు లెక్చరర్. బాగా చెబుతారు. మంచి వక్త, పండితుడు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి బావమరిది. మా క్లాసుకు రారు. అయినా గానీ నన్ను నేను పరిచయం చేసుకొని, ఆయనతో వాదన పెట్టుకునేదాన్ని. ఓ ఆదివారం రోజు ఆయన ఇంటికి వెళ్ళి తర్కిస్తుండగా, ఆయన ఓపిగ్గా, నాది ఎంత వితండ వాదమో వాదంతో ఓడించి, విడమరిచి చూపించాడు. అప్పటినుండి మళ్ళీ వెనక్కి మళ్ళి, చిన్నప్పుడు చందమామలో భారత రామాయణాలు చదివిన పాజిటివ్ ఆలోచనా సరళి వైపు మళ్ళాను. విశ్వనాధ వారి వేయి పడగలు ఆ తర్వాత చదివాను. అప్పటినుండీ అనుకునేదాన్ని రామకోటి వ్రాయాలని. అయితే తీరిక దొరకలేదు. సూర్యాపేటలో త్రివేణి కాలేజీలో పనిచేస్తుండగా ఆ తీరిక దొరికింది. నేనూ, నా భర్తా కూడా రామకోటి మొదలుపెట్టాము. ఒక్కోరోజు ఆరు, ఏడు వేల వరకూ వ్రాసేవాళ్ళం. నిజానికి రామనామం వెయ్యిసార్లు వ్రాయటానికి సరిగ్గా గంట సమయం పడుతుంది. ఆ ప్రకారం, రోజుకి గంటచొప్పన, 1000 సార్లు వ్రాస్తూ, కోటి పూర్తి చెయ్యాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. ఆ లెక్క గట్టుకుని చూస్తే తమాషాగా అన్పించింది. రామకోటి వ్రాస్తూ, మనల్ని మనం పరిశీలించుకుంటుంటే మనస్సులో కలిగే భావసంచలనం ఇంకా గమ్మత్తుగా అన్పించేది. నా బ్లాగు చుట్టాల్లో కొందరు ‘ప్రతీరోజు ఇంత పొడవాటి టపాలు ఎలా వ్రాయగలుగు తున్నారు’ అని అడిగారు. ఈ ఓపిక వెనక ఉన్న రహస్యం ఏమిటంటే అప్పుడు రామ కోటి వ్రాయడమే. ఒకే పనిని గంటల కొద్ది చేసే సహనం, ఓర్పు రామకోటి నేర్పింది.

అప్పటికి ఇంటి దగ్గర ట్యూషన్ కోసం వచ్చేపిల్లలు సైకిళ్ళు పెట్టుకోవటానికి ఇబ్బంది ఎదురవ్వడంతో ఇల్లుమారాము. మా ఇంటి ఓనరు కూడా ఇంటి అద్దెను 50% పెచ్చాడు. ఇల్లు మారడానికి ఇది కూడా ఒక కారణమే. ఇది మార్కెట్టుకు దూరంగా ఉన్న విశాలమైన వీధి. ఉదయం, సాయంత్రం ఇంటి దగ్గర ట్యూషన్స్, తర్వాత కాలేజీలో క్లాసులు, రామకోటి, ప్రతి మూడు నెలలకు ఒకసారి పుణ్యక్షేత్రాల సందర్శన. ఇంకే గొడవా మాకు పట్టేదికాదు. అప్పుడే కార్గిల్ యుద్ధం సంభవించింది. సూర్యాపేటకు చెందిన ఇద్దరు, ముగ్గురు సైనికులు యుద్ధంలో మరణించారు. వారిలో ఒకరికి విపరీతమైన ప్రచారం వచ్చింది. కాలేజీలో స్టాఫ్ రూంలో తరచూ ఈవిషయాలన్నీ చర్చకు వచ్చేవి. నేనేమో అప్పట్లో వార్తలు చూసేదాన్ని కాదు, చదివేదాన్నికాదు. దాంతో కొలీగ్స్ చర్చిస్తుంటే మౌనంగా వినేదాన్ని. వాళ్ళెదైనా అంటే చిరునవ్వుతో సరిపెట్టేదాన్ని.

అంతలో సెప్టెంబరు సప్లమెంటరీ/ బెటర్ మెంట్ పరీక్షలు వచ్చాయి. ఓరోజు స్టాఫ్ రూంలో కూర్చొని ఉన్నాను. మా ఫిజిక్స్ డిపార్టుమెంటులో జూనియర్ లెక్చరర్ ఒకతను వచ్చి “మేడం ఈ లెక్కలు చేసిపెడతారా?" అంటూ ఓ లిస్ట్ ఇచ్చాడు. అందులో కొన్ని ప్రశ్నలూ, లెక్కలూ ఉన్నాయి. యధాలాపంగా వాటిని చూసి అతడు అడిగిన లెక్కలు చేసిపెట్టాను. నాలుగురోజుల తర్వాత ఫిజిక్స్ పరీక్ష జరిగింది. పరీక్ష అయ్యాక పేపర్ చూద్దును గదా, అవే ప్రశ్నలూ, లెక్కలూ. మా జూనియర్ నాకు ఇచ్చిన లిస్ట్ లోనివే. నాకు ఆశ్చర్యం వేసింది. నా ఆశ్చర్యాన్ని గమనించిన తోటి లెక్చరర్స్ నర్మగర్భంగా నవ్వారు. నాకు తెలిసిన టీచర్లని అడిగాను. వాళ్ళు “ఇదంతా ఇక్కడ మామూలే మేడం! ఒక్క సెప్టెంబర్ ఎగ్జామ్స్ పేపర్సే కాదు, మార్చివి కూడా వారం ముందే లీక్ అవుతాయి” అని చెప్పారు. “మరి సదరు మంత్రి గారు A,B,C సెట్లని లాటరీ తీయాటాలూ, పోలీసు స్టేషన్లకు సమాచారం అందించడాలూ, అప్పటివరకూ పోలీసు స్టేషన్లలో ఉంచబడిన ప్రశ్నాపత్రాలు అప్పుడు పరీక్షా కేంద్రాలకు పంపడాలు – ఇదంతా ఏమిటీ?" అని అడగబోయి మాట మింగేశాను. అడిగితే ‘మరీ ఇంత అమాయకత్వమా’ అన్నట్లు గానో లేక ‘అమాయకత్వం నటిస్తున్నావు’ అన్నట్లుగానో ఎగాదిగా చూస్తారని ఊర్కుండిపోయాను. కానీ మనస్సు, తార్కీక బుద్దీ ఊర్కోవు గదా! ఈ నేపధ్యంలో వికాస్ లో నేను చూసిన సెప్టెంబరు పరీక్షలు, ఎక్సెల్ లో చూసిన మార్చి పరీక్షలు గుర్తుకొచ్చాయి. 1996 - 1997 లో, నేను నంబూరు కమిటీ కాలేజిలో పనిచేస్తున్నప్పుడు ఇంటర్ ప్రశ్నాపత్రాలు కోల్ కతా ప్రెస్ నుండి లీక్ అయ్యాయి. రామబ్రహ్మం అన్న వ్యక్తి అందుకు బాధ్యుడిగా వెలుగులోకి వచ్చాడు. రామబ్రహ్మం కేసుగా అది పేరు పడింది. ఆ తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం [నారా చంద్రబాబునాయుడు] ప్రైవేట్ కాలేజీలకి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసి, కాలేజీలన్నింటి మీదా గ్రిప్ సంపాదించాడు. అలాగే పరీక్షా విధానం మార్చి A,B,C అనే మూడు సెట్లు ప్రచురించడం, జంబ్లింగ్ విధానం వంటివి అమలులోకి తెచ్చింది. ఇన్ని ఏర్పాట్లు మధ్య వారం ముందే సదరు మంత్రిగారు లాటరీ తీయబోయే సెట్టు ఏదో ఇక్కడి కాలేజీలకి తెలియడం చూసి అవినీతి బలం ఎంతటిదో నాకు కొంత అర్ధమయ్యింది.

వికాస్, ఎక్సెల్ లాంటి కార్పోరేట్ కాలేజీల్లో, పరీక్షకు రెండు మూడు రోజుల ముందు ‘ఇది డైరెక్టరు గారు ఇచ్చిన Guess paper. దీన్ని పిల్లలకిచ్చి ప్రిపేర్ చేయించమన్నారు’ అంటూ ట్యూటర్లు, వార్డెన్లు మాకు [లెక్చరర్స్ కి] కొన్ని ప్రశ్నల జాబితా ఇచ్చేవాళ్ళు. అందులో ఉన్న ప్రశ్నలన్నీ ఇంపార్టెంటు ప్రశ్నలు, మరికొన్ని ప్రశ్నలూ ఉండేవి. పరీక్ష అయ్యాక చూస్తే, ఆ జాబితాలోని ప్రశ్నల్లో ఓ పది, పన్నెండు తప్ప, అన్ని ప్రశ్నలూ ప్రశ్నాపత్రంలో ఉండేవి. అప్పట్లో “అబ్బా! మన డైరెక్టర్ గారికి ఎంత టాలెంట్, ఎంత ఎక్స్ పీరియన్స్ కదా! గెస్ పేపర్ చెబితే దాదాపు అందులో ప్రశ్నలే వచ్చాయి” అని మేం [లెక్చరర్స్ + విద్యార్ధులు కూడా] అబ్బురపడేవాళ్ళం. క్రీం సెక్షన్ల, ఇంటెన్సివ్ కేర్ సెక్షన్లలోని విద్యార్ధులతోనూ, ముందునుండీ ర్యాంకులు తెచ్చుకోగల విద్యార్ధులుగా పేరుపడిన వాళ్ళతోనూ, డైరెక్టర్లు ప్రత్యేక క్లాసులు, పరీక్ష రెండుమూడు రోజులు ఉందనగా తీసుకునే వాళ్ళు. ఆ క్లాసుల్లో బిట్స్ తో సహా రివిజన్ చేయబడేవి. తర్వాత అవే బిట్స్, ప్రశ్నలు పరీక్షా ప్రశ్నపత్రంలో ఉండటం, ర్యాంకులు రావటం షరా మామూలే. ఇదంతా పిల్లలు గుర్తించలేరు. లెక్చరర్స్ కూడా తెలుసుకోలేరు. అదంతా డైరెక్టర్ల ప్రతిభా, సామర్ధ్యాలు గానూ, అనుభవ సారంగానూ గుర్తించబడేది. అందులోనూ కార్పోరేట్ కాలేజీల్లో సాధారణంగా [మెరిట్ స్టూడెంట్స్] బాగా చదివే పిల్లలు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, పైస్థాయి కుటుంబాల నుండి వచ్చేవాళ్ళు. వాళ్ళ దృక్పధంరీత్యా కూడా పిల్లల్లో ఓ తపన ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎటూ బాగా చదివేవాళ్ళు. Assignment, Week test వంటి కాలేజీ internal పరీక్షలలో ఈ విద్యార్ధులు ఎటూ అన్నిప్రశ్నలు – జవాబులు బాగా నేర్చేఉంటారు.అలాంటి పిల్లలకి గెస్ పేపర్ రివిజన్ మరింత ఉపయుక్తంగా ఉండేది. దాంతో ర్యాంకర్లకి ఎక్కువ మార్కుల రికార్డులు, కాలేజీలకి ఎక్కువమంది 80%, 90% దాటిన మార్కులు తెచ్చుకున్న విద్యార్ధుల గురించిన రికార్డులు ఉంటాయి. అవి మరింత ప్రచారాస్ట్రాలుగా ఉపయోగపడతాయి. ఒకవిధంగా చెప్పాలంటే అది ‘క్లాస్ మోసం’.

ఇక సూర్యాపేట లాంటి ‘B’ సెంటర్లలో జరిగేది ‘మాస్ మోసం’ అన్న మాట. ఇక్కడ చుట్టు ప్రక్కల తండాల నుండి, గ్రామాల నుండి వచ్చిన విద్యార్ధులు, పదవ తరగతి వరకూ గ్రామాల్లో, తండాల్లో, తెలుగు మీడియంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంటర్ లో కూడా తెలుగు మీడియం విద్యార్ధులు ఎక్కువగానే ఉండేవాళ్ళు. వీళ్ళ దృక్పధం రీత్యా ‘ఇదీ డైరెక్టరు గారు ఇచ్చిన గెస్ పేపర్. ప్రిపేర్ అవ్వండి’ అంటే వాళ్ళ చెవికి ఎక్కదు. ‘ఇది లీక్ అయిన పేపర్. ప్రిపేర్ అవ్వండి’ అంటేనే స్పందిస్తారు. కాకపోతే లీక్ గురించి అందరూ బహిరంగ రహస్యం పాటిస్తారు. పరీక్ష ముందు రోజు కూడా నిర్భయంగా, స్వేచ్ఛగా క్రికెట్ ఆడుకునేవారు. ఈ స్థితిని ప్రత్యక్షంగా చూడకపోతే నేనూ నమ్మేదాన్ని కాదు. ఇదంతా చూసి నాకు కళ్ళు తిరిగినంత పనయ్యింది. కాలేజీ యాజమాన్యాలు ‘ఇంటర్ పేపర్ లీక్’ని పెద్దమొత్తంలో సొమ్ము చెల్లించి కొనుక్కునే వాళ్ళు. ఫలితంగా వచ్చిన విద్యార్ధుల మార్కుల్ని పత్రికా ప్రకటనలు, కరపత్రాల రూపంలో ప్రచారించి మళ్ళీ విద్యార్ధుల్ని పోగేసి డబ్బు సంపాదించేవాళ్ళు. అందుచేత విద్యార్ధుల సంఖ్య ఎక్కువ ఉన్న కాలేజీలకీ ఈ సదుపాయం బాగా ఉండేది. రెండు మూడు వందల మంది విద్యార్ధులతో నెట్టుకొచ్చే బ్రిలియంట్ కాలేజీ [నేను ముందు సంవత్సరం పనిచేసిన కాలేజీ] వంటి వాటికి ఆ సదుపాయం అందుబాటులో ఉండేది కాదు.

ఈ విషయంలో కొంత సమాచారం, నా దగ్గర ట్యూషన్లకి వచ్చే విద్యార్ధులు, వారి తల్లితండ్రుల [వాళ్ళు గవర్నమెంట్ టీచర్లే] నుండి సేకరించాను. నేను అప్పటికి పనిచేస్తున్న త్రివేణి కాలేజీకి చెందిన విద్యార్ధులు అంతకు రెండు మూడేళ్ళ క్రితం మాస్ కాపీయింగ్ లో పట్టుబడి, ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయారట. పరీక్షా కేంద్రంలో కాలేజీ యాజమాన్యం manipulate చేసి మాస్ కాపీయింగ్ చేయించిందట. బిట్ పేపర్ లో ఆ కేంద్రంలోని విద్యార్ధులంతా ఒకేమాదిరి జవాబులు వ్రాసారట అందరూ. ఒక బిట్ కు తప్పు జవాబు వ్రాయగా – అన్నీ సరిగ్గా వ్రాసినా, ‘ఏమో పిల్లలంతా బాగా చదివారేమో’ అనుకోవచ్చు. అందరూ ఒకే బిట్ కు తప్పు జవాబు వ్రాస్తారా?’ అన్న వాదనతో మాల్ కాపీయింగ్ నిరూపించబడి కేసయ్యిందట. విద్యార్ధులు ఒక సంవత్సరం కోల్పోయారు కూడా. అక్కడి స్థానిక రాజకీయ నాయకుడు రాంరెడ్డి దామోదర రెడ్డికి [నేటి మంత్రి] త్రివేణి యాజమాన్యం నమ్మకమైన అనుచరులు. అలాంటి పరిచయాలన్నీ ఉపయోగించుకొని కాలేజీ యాజమాన్యం కేసులు మాఫీ చేయించుకుందట. ఇవన్నీ విని ‘అబ్బో! ఈ కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఘనులే!’ అనుకున్నాము నేను, నాభర్తా. అయితే ఇదీ నేనెవ్వరితోనూ అనలేదు. ఎవరేం చెప్పినా విని ఊరుకున్నాను. మేమిద్దరమే చర్చించుకునే వాళ్ళం. ‘అందుకే కాబోలు కాలేజీ యాజమాన్యాలు రాజకీయ నాయకులతో చాలా స్నేహంగా ఉంటాయి’ అనుకున్నాం. ఎందుకంటే గతంలో వికాస్ డైరెక్టర్లలో ఒకరు ఎప్పుడూ కోడెల శివప్రసాద్ చుట్టూ తిరుగుతుంటారనీ, మరొకరు నిరంతరం రాజకీయనాయకులతో పేకాట ఆడుతూ terms పెంచుకుంటూ ఉంటారని, అక్కడి వార్డెన్లు, ట్యూటర్లు గుసగుసలు పోతుండగా, అక్కడ పనిచేసే రోజుల్లో విన్నాను. ‘ఇందుకన్నమాట’ అని నేను నాభర్తా విశ్లేషించుకున్నాము. ఇలా ‘B’ సెంటర్లలో ఈ పేపర్ లీక్ ని పచ్చిగా చూడకపోయి ఉంటే ఎప్పటికీ నమ్మేవాళ్ళం కాదేమో అనుకున్నాం.

ఈ సంఘటనకు కొద్దిరోజుల ముందు, నేను సీనియర్ ఇంటర్ క్లాసులో పాఠం చెబుతున్నాను. గాల్వానా మీటర్ గురించి పాఠం చెప్పి పిల్లల్ని సందేహాలుంటే అడగమని ప్రోత్సహించాను. ఆ క్లాసులో రాకేష్ అనే కుర్రావాడున్నాడు. అతడు గత సంవత్సరం[జూనియర్ ఇంటర్ లో] మార్కుల్లో నల్గొండ జిల్లాకో, సూర్యాపేట పట్టణానికో[Dist. first or Town first] ర్యాంకర్. క్లాసులో ఎప్పుడూ గంభీరంగా ముఖం పెట్టుకొని ‘మేధావిని నేను’ అన్నట్లు కూర్చుంటాడు. అల్లరీ చెయ్యడు. అలాగని పాఠం చెప్పినప్పుడు దాన్ని గ్రహించిన తనమూ[Grasp చేసుకున్న], అర్ధమైనప్పుడు పిల్లల ముఖంలో కన్పించే వెలుగూ అతడి ముఖంలో నాకెప్పుడూ కనబడలేదు. పిల్లవాడి తీరే అంత కాబోలు అనుకున్నాను. Internal పరీక్షల్లో మాత్రం అతడికి బాగా మార్కులు వచ్చేవి. ఎందుకంటే పిల్లవాడు బట్టీరాయుడు మరి. ఆరోజు పిల్లల్ని డౌట్స్ అడగమని ప్రోత్సహిస్తూ “రాకేష్! ఎప్పుడూ నువ్వు ఏ డౌట్స్ అడగవు. అసలు డౌట్సు ఎప్పుడూ రాలేదంటే నీకు నేను చెప్పేది మొత్తం అర్ధమై అయినా ఉండాలి. లేదా అసలేం అర్ధం కాకపోయన్నా ఉండాలి” అంటూ ఛలోక్తి వేసాను. ఒకరిద్దరు పిల్లలు చిన్న చిన్న సందేహాలు అడిగారు. నివృత్తి చేసాను. ‘నువ్వేం అడగవే?’ అన్నట్లు ఆ పిల్లవాడివైపు చూశాను. తప్పదన్నట్లు ఆ పిల్లవాడు లేచి ఏదో సందేహం అడిగాడు. తీరా చూస్తే అది బేసిక్ కాన్పెప్ట్ కీ, నిర్వచనానికి సంబంధించినది. దాంతో అసలా పిల్లవాడి తెలివితేటల మీదా, సామర్ధ్యం మీదా నాకు సందేహం వచ్చింది. ఎందుకంటే సందేహం అడిగేటప్పుడు కూడా పిల్లవాడి గొంతులో స్పష్టత గానీ, ఆత్మవిశ్వాసం గానీ లేవు. నా సబ్జెక్ట్ లోనే అలా ఉన్నాడా, లేక మిగిలిన సబ్జెక్టుల్లోనూ అంతేనా అన్న అనుమానం వచ్చి గణిత, రసాయన శాస్త్ర లెక్చరర్స్ ని రాకేష్ activeness గురించి అడిగాను. వాళ్ళు నర్మగర్భంగా చిరునవ్వు నవ్వారు. “మరి ఆ పిల్లవాడికి టౌన్ ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది?” అన్నాను. రసాయన శాస్త్ర లెక్చరర్ చిన్న గొంతుతో రహస్యం చెబుతున్నట్లు “మేడం! ఆ పిల్లవాడి పేరెంట్స్ ఇద్దరూ గవర్నమెంట్ టీచర్లు, టీచర్ల యూనియన్ లోనూ, లోకల్ గానూ పరపతి ఉన్నవాళ్ళు. మేనేజ్ మెంట్ కి బాగా దగ్గర. ఈ పిల్లవాడే కాదు, వాడి తమ్ముడు జూనియర్ ఇంటర్ లో రాజేష్ అని ఉన్నాడు. వాడూ అంతే. అయినావాడికి 10th లో టౌన్ ర్యాంకు వచ్చింది. ఇంటర్ లో ఎక్కువపర్సంటేజ్ వస్తే లాంగ్ టర్మ్ కోచింగ్ కి కార్పోరేట్ కాలేజీలు కన్సెషన్ ఇస్తారు. అదీగాక అదో ప్రిస్టేజ్. కొన్ని అలా జరిగి పోతుంటాయి. మనం పట్టించుకోకూడదు” అన్నాడు. నాకు విషయం బోధపడింది.

ఈ మార్కులు, ర్యాంకుల మాయాజాలంలో పడిన పిల్లలకు అసలు నిజంగా తమ సత్తా ఏమిటో, తమ బలాలు, బలహీనతలు ఏమిటో తెలియదు. కామమ్మ మొగుడంటే కామోసనుకున్నట్లు’ కాలేజీ/ స్కూళ్ళ యాజమాన్యాలు నీవు మేధావి అంటే వాళ్ళు తాము మేధావులం అనుకుంటారు. అలాగే కాలేజీ/ స్కూళ్ళ యాజమాన్యాలు ‘నీవు వేస్ట్ ఫేలో’ అంటే వాళ్ళు తమని తాము పనికిమాలిన వాళ్ళు అనుకుంటారు. మొత్తానికి విద్యార్ధులకి మార్కులూ, ర్యాంకులే ప్రమాణాలు తప్ప అసలు తామేమిటి అనే సత్యం ఎప్పటికీ తెలియదు.

ఇది ఎలాంటి దంటే – ఓ తాజా ఉదాహరణ చెబుతాను. నిన్నమొన్నటి దాకా అధిష్టానం, మీడియా, కేంద్రమంత్రి పురంధేశ్వరిని మేధావి అనీ, ఆవిడ వాగ్ధాటిని, ఉపన్యాస పటిమనీ ఆకాశానికి ఎత్తేసింది. అమెరికా శ్వేత సౌధపు ఆహ్వానాలూ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు సదరు మంత్రిణి అందుకుంది. తీరా ఎలక్షన్లు వచ్చాక, పార్టీ అధిష్టాన దేవత దర్శనం కూడా ఇవ్వలేదు. ‘టిక్కెట్ ఇచ్చిన చోట పోటీ చెయ్ లేకుంటే తప్పకో’ అని కర్కశంగా చెప్పబడింది. ఈ విధంగా రాజకీయరంగంలో, సినిమా రంగంలో, మీడియా ఆయా వ్యక్తుల్ని ‘నందంటే నంది, పందంటే పంది’ చెయ్యగలదు. అలాగే విద్యారంగంలో కార్పోరేట్ కాలేజీలు, స్కూళ్ళ యాజమాన్యాలు [స్థాయిని బట్టి ’బి’ సెంటర్లోని విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా] ఆయా వ్యక్తుల్ని [విద్యార్ధులనీ, లెక్చరర్లనీ] సూపర్ అంటే సూపర్, చెత్తంటే చెత్త.

ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ళు చెల్లించాలంటే సత్తురూపాయిని చెల్లించగలరు, చెల్లించకూడదను కుంటే కొత్తరూపాయిని కూడా పక్కన పడేయించగలరు. కార్పోరేట్ కాలేజీ మేనేజ్ మెంట్, బాగా చెప్పె లెక్చరర్స్ ని ఎందుకు తీసుకుంటారంటే ‘ఫలానా కాలేజీలో బాగా చెప్తారు’ అనే పేరుకోసం, అడ్మిషన్లకోసం. కాని లెక్చరర్ తన సామర్ధ్యాన్ని తెలుసుకొని డిమాండ్ చేయకుండా, మొదట నుండి నువ్వు పందివి అని మేనేజ్ మెంట్ అంటుంది, ఆ లెక్చరర్ మేనేజ్ మెంట్ గ్రిప్ లోకి వచ్చిన తరువాత నందివి అంటుంది. అదే ఇక్కడ స్ట్రాటజీ.

ఇదంతా చూసి ‘ఈ రకమైన చదువులతో, ర్యాంకులతో, మార్కులతో ఈ పిల్లలు బయటికొచ్చి తమకు తాము ఉపయోగపడేది ఏముంది, దేశానికి ఉపయోగపడేది ఏముంది?’ అనుకొని మనసంతా చేదుగా అన్పించింది. కానీ ‘సాక్షాత్తూ మంత్రే లాటరీ తీస్తాడు, ముందే ఏది లాటరీ తీస్తాడో కాలేజీలకి లీక్ అవుతుంది. ఇంతగా మంత్రుల దగ్గరనుండీ, పైస్థాయి అధికారులు వరకూ తెలిసే నడుస్తున్న అవినీతి ఇది. ఎవరేం చెయ్యగలరు?’ అన్పించింది.

ఈ ద్వైదీ భావంతో కొట్టుమిట్టాడుతుండగానే ప్రమాదం మరో వైపు నుండి ముంచుకొచ్చింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

సూర్యాపేటలో, మా కాలేజీలో మంచివిద్యార్థులు ఉండేవాళ్ళు. చురుకైన పిల్లలు శ్రమించేవాళ్ళు. పాఠం శ్రద్ధగా వినేవాళ్ళు. ఫోకాల్ట్స్ రొటేటింగ్ మిర్రర్ ఎక్స్ పెరిమెంటు లాంటిపాఠం కూడా, ఒకసారి వివరంగా చెప్పి, నోట్సు ఇచ్చి ’ఈ క్షణం assignment వ్రాస్తారా’ అంటే సిద్ధంగా ఉండేవాళ్ళు. అప్పటికి యాజమాన్యంతో గానీ, పిల్లలతో గానీ నాకు ఏ సమస్యాలేదు. మరోప్రక్క ఇంటి దగ్గరా ఆనందంగానే ఉండేది. కాలేజీకి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకున్నాము. అయిదు నిమిషాల నడక దూరం. మేం ఉండేవీధిలో ఎక్కువగా ప్రింటింగ్ ప్రెస్ లు ఉండేవి. వైశ్యులెక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా తీసుకున్నారు. మా ఇంటి యజమాని కూడా వైశ్యులే. పిన్నిగారూ, బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. కాగితాల మీద ఎంతగా కులం మతం అన్న పట్టింపులులేవని ఎందరన్నా, వాస్తవ జీవితంలో అలా ఉండదు. అక్కడి వాళ్ళు కొంచెం మొహమాట పడుతూనే “మీరే కులం?స్వస్థలం ఎక్కడ? అత్తామామ లెక్కడుంటారు?" ఇలాంటి వివరాలు అడిగేవాళ్ళు. నేను రెడ్డి పిల్లననీ, మా వారు కమ్మకులస్థులనీ, మాది కులాంతర వివాహంమనీ చెప్పేదాన్ని. మరింత లోతుగా అడిగితే మాది ప్రేమ వివాహమైనందున, అటుపెద్దలూ, ఇటు పెద్దలూ ఎవరూ రారనీ, ఇంతక్రితం ఫ్యాక్టరీ నడిపి నష్టపోయినందున విద్యాబోధనలోకి వచ్చానని చెప్పాను. ఆ వీధిలో అందరూ మా పాపని బాగా ముద్దు చేసేవాళ్ళు. కాలేజీ నుండి ఇంటికి వస్తూనే నా బిడ్డ ఏ ప్రెస్ లో ఉందా అని చూస్తూ వచ్చేదాన్ని. ఎక్కడ నవ్వులు విన్పిస్తే అక్కడ నాకూతురున్నట్లే!

అప్పటి వరకూ నాకు తెలంగాణా ప్రాంతం పెద్దగా తెలియదు. [హైదరాబాదు బాగా తెలిసినా, అక్కడి నగర సంస్కృతిలో మిశ్రమసంస్కృతే తప్ప తెలంగాణాతనం నాకు కన్పించలేదు] సూర్యపేటలో తొలిసారి దసరా పండుగకి తెలంగాణాతనం చూశాను. బతుకమ్మల్ని పేర్చటం, పండుగనాటి సాయంత్రం ఊరందరూ పాలపిట్టని చూడటానికి పోవటం, మురుకుల వంటి పిండివంటలు నాకు తెగ నచ్చేసాయి. కోస్తా జిల్లాల్లో సంక్రాంతి మాకు తగని వేడుక. నెలరోజుల పండుగ. శ్రీరామనవమి కళల జాతర. అయితే ఈ ఉత్సవాలు, నేను స్కూలు చదువు దాటి కాలేజీ చదువుల కొచ్చేసరికి మెల్లిగా కనుమరుగు అయ్యాయి. నేను బాగా చిన్నతనంలో ఉండగా, దసరా సంబరాలు కొంచెం గుర్తున్నాయి. పులివేషగాళ్ళు, పగటి వేషగాళ్ళు వచ్చేవారు. నాకు నాలుగేళ్ళుండగా మా ఇంటికి దగ్గరలోని వీధి బడిలో పెద్దబాలశిక్ష చదువుకుంటున్నాను. ఆదుర్తి సుబ్బారావు గారి ‘తోడికోడళ్ళు’ సినిమాలో చూపినట్లు అబ్బాయిలు పూలవిల్లంబుల బొమ్మలూ, అమ్మాయిలు కోతిబొమ్మలూ [పుల్లకి కోతిబొమ్మ ఉంటుంది. తాడు తాగితే పైకి క్రిందికి ఆడుతుంది] పుచ్చుకొని, బడిలోని అందరు విద్యార్ధుల ఇళ్ళకీ వరుసగా తిప్పేవారు. మాష్టారికి దక్షిణా, పిల్లలకి మరమరాలు, పప్పూ బెల్లం పంచేవాళ్ళు. తెలుగు పద్యాలు ఇంటింట చెప్పించేవాళ్ళు. మా ఇంటికీ మాష్టారు, పిల్లలూ వచ్చినప్పుడు మానాన్నగారు మా మాష్టారికి పంచెల చాపు పెట్టారట.

‘పావలా పరకైతే పట్టేది లేదు
అర్ధరూపాయి ఇస్తేను అంటేది లేదు
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు
అయ్యవారికి చాలు అయిదు వరహాలు’

అంటూ పాడిన పద్యాలు మాత్రం గుర్తున్నాయి. తర్వాత్తర్వాత దసరా పండగ అంటే క్యార్టర్లీ పరీక్షల తర్వాత వచ్చే 10 రోజుల సెలవులుగా మారిపోయాయి. అలాంటిది, సూర్యాపేటలో దసరాపండుగ మళ్ళీ చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెచ్చింది. మా ఇంటి చుట్టుప్రక్కల గృహిణిలతోకలిసి బతుకమ్మ పేర్చటం నేర్చుకున్నాను. రెల్లుపూలు, గడ్డిపూలకి రంగులద్ది, బంతీచామంతుల్లాంటి పూలు, ఆకులు కలిపి ఎంతో ఆకర్షణీయంగా బతుకమ్మల్ని పేర్చారు. మా పాపకీ చిన్నబతుకమ్మని పేర్చి గుడిదగ్గరికి అందరితో కలిసి వెళ్ళాను. చదువుకున్నవాళ్ళు, చదువుకొని వాళ్ళు అని లేకుండా అందరూ ప్రసాదాలు ఇచ్చి పుచ్చుకుంటూ ‘ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం’ అంటూ, సద్దుల బతుకమ్మ అంటూ ఆ పండగ నాకు చాలా ఇష్టంగా అన్పించింది. పండుగరోజు సాయంత్రం దాదాపు ఊరంతా నిర్మానుష్యమై పోతుంది. అందరూ వూరి చివరికి పాలపిట్టని చూడటానికి అంటూ వెళ్తారు. ఆ రోజు పాలపిట్టని చూస్తే అదృష్టం వస్తుందట. జమ్మిచెట్టు దగ్గర ఆకులు తీసుకొని జేబుల్లో, పుస్తకాల్లో పెట్టుకుంటారు. అప్పటివరకూ నాకు ఇవన్నీ తెలియదు.

వాటన్నింటికీ నేను బాగా ఆనందించాను. మరోవైపు విద్యాబోధనలో సిలబస్ పూర్తి చేసుకొచ్చాను. ‘జనవరి మొదటి తేదీకల్లా సిలబస్ పూర్తి చేసి, కనీసం రెండుసార్లు రివిజన్ చెయ్యాలి’ అన్నది నా ప్రణాళిక. పిల్లలూ చురుకైన వాళ్ళు కావటంతో, వాళ్ళని బాగా ప్రోత్సహించాను. సబ్జెక్టు మొత్తం ఒక్కచేత్తో డీల్ చేస్తున్నాను. కనుక, మంచి ఫలితం తెచ్చుకుంటే భవిష్యత్తుకి ఢోకా ఉండదన్నది నా ఊహ. అందుకోసం నేను బాగా కష్టపడుతూ, పిల్లల్ని కష్టపెడుతూ ఉన్నాను. అప్పటికి ఊళ్ళో కూడా మా కాలేజీ పేరు మారుమ్రోగుతుంది. పిల్లలు కూడా నెల్లూరు, గుంటూరులలో చదువుకుంటున్నా తమ 10 వతరగతి క్లాస్ మేట్స్ తో ఎంసెట్ సిలబస్ పోల్చుకుంటూ తమ టీచింగ్ ఎలా ఉంది, అక్కడ టీచింగ్ ఎలా ఉన్నది కనుక్కొనేవాళ్ళు.

అప్పటికి డిసెంబరు మొదటివారంలో ఉన్నాము. నేను సీనియర్, జూనియర్ ఇంటర్ పిల్లలకి దాదాపు 90% సిలబస్ పూర్తి చేశాను. [ఒక్క ఛాప్టర్ మిగిలి ఉంది.] ఇంటర్ సిలబస్, ఎంసెట్ సిలబస్ కూడా దాదాపు 90% పూర్తయ్యింది. ఊళ్ళో కాలేజీకీ, నాకు పేరుబాగుంది. యాజమాన్యానికీ, నాకూ మధ్య చెప్పుకోదగిన గొడవలంటూ ఏంలేవు. నిజానికి సూర్యాపేటలోని ఈ కాలేజీ డైరక్టరు అత్తగారి ఇల్లు, గుంటూర్లో ఎక్సల్ కాలేజీ ఉన్న ప్రాంతంలోనే ఉండేది, అశోక్ నగర్ లో. అప్పుడు మా ఇల్లు కూడా అదే కాలనీలో. అతడి అత్తగారి ఇంటిప్రక్కన గల నా స్టూడెంట్స్, నాగురించి ఇచ్చిన మంచి రిపోర్ట్ కారణంగా కూడా అతడు తన పత్రికా ప్రకటనకి వచ్చిన ఇద్దరు లెక్చరర్స్ ని కాదని నన్ను ప్రిఫర్ చేసినట్లు అంతకు ముందు రోజుల్లో చెప్పడం జరిగింది. ఏవిధంగా చూసినా కాలేజీ యాజమాన్యం నాతో వివాదం పెట్టకునే అవకాశం లేదు.

అలాంటి స్థితిలో, హఠాత్తుగా కాలేజీ యాజమాన్యం డిసెంబరునెల మొదటి వారంలో salary కూడా ఇవ్వకుండా “మీరు పిల్లలకి చెబుతున్నది వాళ్ళకి అర్థం కావడం లేదట. స్టూడెంట్స్ ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి మీ సర్వీస్ ఇక మాకు అవసరం లేదు. రేపటి నుండి మీరు కాలేజీకి రానవసరం లేదు” అని చెప్పింది. ఈ హఠాత్పరిణామానికి నేను విస్తుపోయాను. సిలబస్ దాదాపు పూర్తయ్యింది కాబట్టి రెమ్యూనరేషన్ ఎగ్గొట్టేందుకు కాలేజీ ఈ ఎత్తుగడ పన్నింది అనుకుందామన్నా, మరి తర్వాత సంవత్సరం అడ్మిషన్ల మాటేమిటి అని ఆలోచిస్తుంది కదా! అప్పుడు మహా అయితే నాకు ఓ 50 వేలు ఎగ్గొట్టగలదు. అంతకంటే నన్నుకొనసాగిస్తే వాళ్ళకొచ్చే ఆర్ధికలాభమే ఎక్కువ. అలాంటి పరిస్థితిలో ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోలేక పోయాను. మనకి అర్ధమైనా, కాకపోయినా పరిస్థితులూ, కాలమూ ఆగవు కదా!

ఊరు గాని ఊరు. ఏం చెయ్యాలో తోచలేదు. చుట్టుప్రక్కల వాళ్ళు స్నేహంగా ఉన్నంతమాత్రన ఈ విషయంలో ఏం సాయం అడగ్గలం? సూర్యాపేటకి దగ్గర్లో ఉన్న కోదాడ మండలంలో నా బాల్య మిత్రుడున్నాడు. అతడికి తండ్రి గారి నుండి వారసత్వంగా వచ్చిన సినిమా హాలు, రైసుమిల్లూ వంటి భారీ ఆస్తులున్నాయి. తన మాటల్లోనే చెప్పాలంటే కోటీశ్వరుడు. ఇతడు నాకు ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ నిర్వహించిన ఏపీదర్శన్ మిత్రుడు. అప్పట్లో నేను గుంటూరు జిల్లానుండీ ఆ కార్యక్రమానికి ఎంపిక అయితే, ఇతడు ఖమ్మం జిల్లానుండి ఎంపికయ్యాడు. స్వంతఊరు కోదాడ మండలంలోనిది. నన్ను అక్కా అని పిలిచేవాడు. అతనికి ఫోన్ చేసి, ఏంచెయ్యాలో సలహా చెప్పమనీ, వీలయితే సహాయం చెయ్యమని అడిగాను. సూర్యాపేటలో లోకల్ పంచాయితీలు చేసి తగవులు తీర్చేనాయకులు [వివిధపార్టీల వారు] ఉండేవారు. అలాంటి ఓ నాయకుడు మొరిశెట్టి సత్యనారాయణ [తెదేపా టౌన్ ప్రెసిడెంట్] కు నాగురించి చెబుతానని, వెళ్ళి కలవమని నా బాల్యమిత్రుడు చెప్పాడు. నేనూ, నాభర్తా వెళ్ళి, అతణ్ణి కలిసి విషయం వివరించాం. ఆ నెల జీతం కూడా ఇవ్వలేదని చెప్పాం. అతడు కనుక్కుంటానని చెప్పాడు. ఇంటికొచ్చేసరికి మా కాలేజీ డైరక్టరు బావమరిది, తానే అసలు డైరక్టరునంటూ, మరిద్దరు పెద్దమనుష్యుల్నీ, నా కొలిగ్స్ ఇద్దరినీ వెంటబెట్టుకొని వచ్చాడు. ఆనెల జీతం ఏడు వేలు ఇస్తామని, వెళ్ళిపొమ్మని చెప్పాడు. [అప్పటికి ఇంకా నాకు 52,000/- Rs. రావలసి ఉంది. 5 నెలల సర్వీసు ఉంది. 10% సిలబస్ పూర్తి చెయాల్సి ఉంది. రివిజన్ ఉంది.] అతడి ప్రపోజల్ ని నేను తిరస్కరించాను. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా 5 నెలలుంది. సంవత్సరం మధ్యలో ఎక్కడ మళ్ళీ జాబ్ వెదుక్కోగలను? ఆ తర్వాత మొరిశెట్టి సత్యనారాయణ, నాభర్తని పిలిపించి 10,000/-Rs. ఇప్పిస్తానని, తిరిగి మాఊరికి వెళ్ళిపోవలసిందని చెప్పాడు. నా బాల్యమిత్రుడు ఈ విషయమై ఇక ఏం చెయ్యలేనని పరోక్షంగా సూచించాడు.

ఇక మా పరిస్థితి నిస్సహాయంగా మారింది. ఆ స్థితిలో నేను స్థానిక పోలీసు స్టేషన్ ని అప్రోచ్ అయ్యాను. మొత్తం వివరాలు వ్రాసి ఇచ్చి, ఇది సెక్షన్ 420 క్రిందికి వస్తుందో రాదో నాకు తెలియదు, మేం నాన్ లోకల్. నాకు హెల్ప్ చెయ్యండి అని అక్కడి సి.ఐ.ని రిక్వెస్ట్ చేశాను. అతడు ముస్లిం. రంజాన్ ఉపవాసం పాటిస్తున్నాడు. అతడంతా విని న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే కాలేజీ డైరక్టరు రాజకీయనాయకులని ఆశ్రయించాడు. వారం గడిచింది. పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము. ఇంతలో ఓరోజు పోలీసు స్టేషన్ కు మా కాలేజీ డైరెక్టరు, మొరిశెట్టి సత్యనారాయణ, ఇతరులు కలిసి వచ్చి ‘సరే 25,000/- రూ. ఇస్తాము. వెళ్ళిపొమ్మని’ అన్నారు. మాకేం చెయ్యాలో అర్ధంకాలేదు. నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. మర్నాడు 25,000/- రూ. ఇస్తారు, కేసు వెనక్కి తీసుకోవాల్సి ఉంది. అప్పటికి ఈ గొడవ ప్రారంభమై పదిహేను రోజులయ్యింది. రోజూ పోలీసు స్టేషన్ కి వెళ్ళటం, అక్కణ్ణుంచి గుడికి వెళ్ళటం. దేవుడు తప్ప ఇంకే దిక్కు లేదు. నిరాశ, నిస్పృహలు చుట్టుముడుతున్నా, దైవం మీద భారం వేసి మర్నాడు పోలీసు స్టేషన్ కి వెళ్ళాం. అప్పటికి అక్కడ మధుసూదన్ రావు అనే వ్యక్తి, మరొకాయన ఉన్నారు. తమని తాము మా కాలేజీ విద్యార్ధుల పేరెంట్స్ గా పరిచయం చేసుకున్నారు. వాళ్ళు నామీద, కాలేజీ యాజమాన్యం మీదా కూడా కేసు పెట్టారట. ఇది విని మొదట నేను మ్రాన్పడిపోయాను. తర్వాత తెలిసిందేమిటంటే, ఈ పేరెంట్స్ ఇద్దరూ, ముఖ్యంగా మధుసూదన్ రావు వాళ్ళ అబ్బాయిని కాలేజీలో చేర్చడానికి వచ్చినప్పుడు నాతో కూడా మాట్లాడారట. [అడ్మిషన్ల సమయంలో యాజమాన్యం మా చేతకూడా పేరెంట్స్ ని కౌన్సిల్ చేయించినందున, అప్పుడు నేను చాలామంది పేరెంట్స్ తో మాట్లాడాను. కనుక ప్రత్యేకించి ఇతణ్ణి గుర్తించలేకపోయాను.] ఈ పేరెంట్స్ కాలేజీ డైరక్టర్ని “పోయిన సంవత్సరంలో లాగా మధ్యలో లెక్చరర్లు వెళ్ళిపోరుగా” అని అడిగాడట. “ఈ లెక్చరర్స్ గుంటూరు నుండి వచ్చారండి. సంవత్సరం గ్యారంటీగా ఉంటారు. Terms నచ్చితే తర్వాతి సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతారు” అని కాలేజీ డైరక్టరు చెప్పాడట. ఈ పేరెంట్స్ నన్ను కూడా అడిగితే “నేను సంవత్సరం కాంట్రాక్టు మీద వచ్చానండి. బాగా చెబుతాం. రిజర్ట్ మంచిగా వస్తే అప్పుడు మీరూ, మా డైరెక్టర్ గారు, అందరూ కంటిన్యూ చెయ్యమనే అంటారు కదా! మేం ఎక్కడైనా జాబ్ చేసుకునేదే అయినప్పుడు, ఇక్కడ బాగా ఉంటే ఇక్కడే ఉంటాం కదా. ఏమయినా సంవత్సరం మధ్యలో మాత్రం ఎట్టిపరిస్థితిల్లో వెళ్ళిపోం” అన్నానట.

అదే అతడు వ్రాతపూర్వకంగా వ్రాసి, ‘పంపించి వేస్తామనడానికి కాలేజీ డైరెక్టరు ఎవరూ, వెళ్ళి పోతామనడానికి ఈ లెక్చరర్ ఎవరు? ఇద్దరు కలిసి సంవత్సరంపాటు మా పిల్లలకి చదువుచెబుతామని మాట ఇచ్చారు. అడ్వాన్సుగా ఫీజు మొత్తం కట్టించుకున్నారు. ఇప్పుడు మధ్యలో మమ్మల్ని పుట్టి ముంచుతారా? ఇది అన్యాయం’ అంటూ కేసు పెట్టాడు. ఆ క్షణం నాకైతే దేవుడు కనబడ్డాడనిపించింది. ఒక్కదెబ్బతో పరిస్థితి మొత్తం మారిపోయింది. స్థానిక రాజకీయనాయకులు తెరవెనకకి తప్పుకున్నారు. మొరిశెట్టి సత్యనారాయణ పోలీసు స్టేషన్ కి కొచ్చి కొంతలాబియింగ్ చేయటానికి ప్రయత్నించాడు. కుదరలేదు. పేరెంట్స్ ససేమిరా అన్నారు. ‘మా పిల్లల భవిష్యత్ ఏం కావాలి?’ అని అడిగారు. పోలీసు సి.ఐ. పేరెంట్స్ ని సమర్ధించాడు. మొత్తంగా ఆనాడు పోలీసు స్టేషన్ లో నాకు పూర్తిగా న్యాయం జరిగింది. రెండురోజుల్లో విషయం మొత్తం సెటిల్ అయ్యింది. అప్పటికప్పుడు నాకు రావలసిన ఆనెల salary ఇప్పించారు. తాజాగా అగ్రిమెంట్ వ్రాయించారు. ఎంసెట్ పరీక్ష వరకూ నేను క్లాసులు తీసుకునేటట్లు, యాజమాన్యం నాకు ప్రతినెల 9 తేదీ లోపల salary ఇచ్చేటట్లు వ్రాయించారు. నేను ఆ పేరెంట్స్ కీ, పోలీసు సి.ఐ., ఎస్.ఐ., ఇతర సిబ్బందికీ కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. మళ్ళీ కాలేజీకి వెళ్ళటం మొదలు పెట్టాను. సి.ఐ. నాకు ఒక మాట చెప్పాడు “చూడండమ్మా. మీ పనే మిమ్మల్ని కాపాడుతుంది. పిల్లలకి చదువు చెప్పటంలో ఏమాత్రం ఆశ్రద్ధ చెయ్యకండి. ఈ గొడవలనీ మనస్సులో పెట్టుకోకుండా మీ పని మీరు చేయండి, ఏసమస్యలు రాకుండా వారం, పది రోజుల కొకసారి మధుసూదన్ రావు గారు మీ కాలేజీ వచ్చి వివరాలు కనుక్కుంటారు. మీ కేమయిన సమస్యలు ఉంటే ఆయనికి చెప్పండి” అని చెప్పాడు. రంజాన్ మాసంలో ఓ నిస్సహాయరాలికి న్యాయసహాయం చేసితీరాలి అన్న నిబద్దత కనబడింది నాకు అతడిలో. మనసారా కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. నాకైతే సాక్షాత్తు భగవంతుడు అతడి నోట ఆమాట చెప్పించాడేమో అన్పించింది. ఆ తరువాత నెలరోజుల వ్యవధిలోనే అతడికి ట్రాన్స్ ఫర్ వచ్చింది.


ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం నన్ను ‘ఎల్లిమీద మల్లి, మల్లి మీద పిల్లి’ వంటి సిల్లీ కారణాలతో విసిగించినా నేనవి పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో ఓరోజు మాకాలేజీ అటెండర్ ఏదో పనిమీద మా ఇంటికి వచ్చాడు. యాజమాన్యం ఏదైనా కబురు చెప్పమంటేనో, ఏదైనా పుస్తకాలు కోసమో అప్పుడప్పుడు అతడు మా ఇంటికి వస్తు ఉంటాడు. మా పాపని బాగా ముద్దు చేసేవాడు. అతడు మాఇంటికి వచ్చినప్పుడు టిఫిన్ లాంటివి ఇచ్చేదాన్ని. పండగ పబ్బాలప్పుడు చేసిన పిండివంటలు అతడి భార్యాపిల్లల కోసం ఇచ్చేదాన్ని. ఆరోజు అతడు “మేడం. నిన్న డైరక్టరు సార్ గుంటూర్లో మీరింతకు ముందు పనిచేసిన కాలేజీకి ఫోన్ చేసిండు. మీరింతకు ముందు ఎంసెట్ చెప్పారా లేదా అని అడిగాడు. ఆ ప్రక్క మీసారంటా. గంటసేపు ఫోనులో వాయించాడు. ముందు సిలబస్ అయ్యిందా లేదా అని అడిగిండింట. అయ్యిందని డైరక్టరు సార్ చెప్పిండు. ఇంక మీసార్, డైరక్టరు సారునీ, ఫోనులో గంటసేపు తిట్టిండు. సిలబస్ అంత చెప్పేదాకా తెలియలేదా ఆ అమ్మాయి ఎంసెట్ చెప్పగలగుతుందో లేదో అంటూ తెగ తిట్టిండంట. STD bill మస్తయ్యిందని సార్ గొణుక్కుంటుండు” అని అటెండరు చెప్పాడు. ఇవన్నీ సహనంగా భరించాను. ఒకే ధ్యాసగా చదువుచెప్పడంలో మునిగిపోయాను. సిలబస్ పూర్తి చేసి రెండుసార్లు రివిజన్ కూడా చేసాను. ఎంసెట్ సిలబస్ మాసార్ చలపతి రావుగారి పుస్తకంలోని దాదాపు 7000 ప్రశ్నలే గాక, రత్నం, వికాస్ వంటి ఏవేవో మెటీరియల్స్ students తెచ్చేవాళ్ళు. కాలంతో పందెం పెట్టుకొని మరీ ఫిజిక్స్ లెక్కలూ, ప్రశ్నలూ చేయించేదాన్ని. మొత్తానికి నాశక్తిమేరకూ, నాతృప్తి మేరకూ పనిచేసాము; పిల్లలూ, నేను కూడా! ఎంసెట్ పరీక్షకు ముందురోజు పిల్లలందరి నుండి విడ్కోలు తీసుకున్నాను. కాలేజీ యాజమాన్యం చివరి salary ఇస్తూ “అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు మీసంగతి మాకర్థమయ్యింది. మా సంగతి మీకు అర్థమయ్యింది. Next year continue చెయ్యండి” అన్నాడు. అప్పటికే వాళ్ళు నా సహనాన్ని పరీక్షించారు. చాలా విసిగించారు. అందుకే సున్నితంగానే అయినా నిర్మోహమాటంగా తిరస్కరించాను.

కాలేజీ యాజమాన్యం నాకు డబ్బు ఎగ్గొట్టి, పోలీసు స్టేషన్ లో గొడవ అయిన తర్వాత నేను ఇంటిదగ్గర ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. మాధ్స్ ఎంసెట్ [దీప్తి పబ్లికేషన్] చెప్పెదాన్ని. తదుపరి సంవత్సరం సూర్యాపేటలో ఉండటమా, లేక గుంటూరు వెళ్ళిపోవటమా అని ఆలోచిస్తున్నాను. ఏ నిర్ణయమూ తీసుకోలేక పోయాము. పిల్లలకి కష్టపడి చదువు చెప్పాను. ఏ ఫలితం వస్తుందో తెలియదు. ‘గత సంవత్సరం ఎక్సల్ కాలేజీలో అలాగే పనిచేసాను. అక్కడ నాకుమంచి ఫలితం రాలేదు. అయితే భగవంతుడు నాకు ఆ కర్మఫలాన్ని మరో ఊర్లో [సూర్యాపేటలో] ఇచ్చాడు. అలాగే ఇప్పుడూ కష్టపడ్డాను. నిష్కామంగా మన పని మనం చేస్తే భగవంతుడి పని భగవంతుడు చేస్తాడు. నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచడు గదా దేవుడు?’ అనుకున్నాము. సరే తిరుపతి వెళ్ళి వచ్చాక ఏవిషయమూ ఆలోచిద్దాం అనుకుని తిరుపతి వెళ్ళాము.

తిరిగి వచ్చేసరికి, అదే ఊర్లోని మరో కాలేజీ[Triveni] వాళ్ళు మాకోసం చాలా సార్లు తిరిగారని మా ఇంటి యజమాని చెప్పారు. మేం స్నానపానాలు ముగించే లోగా వాళ్ళు మళ్ళీ వచ్చారు. తమ కాలేజీలో పని చెయ్యమని ఆఫర్ చేశారు. ‘మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం. మీ terms చెప్పండి’ అన్నారు. మేం ‘ఆలోచించి చెబుతాం’ అన్నాం. వాళ్ళు విడిచిపెట్టలేదు. అప్పటికే క్రితం నేను పనిచేసిన కాలేజీ లోని ఓ విద్యార్ధినికి టాప్ 10 లోపల ర్యాంకు వస్తుందని ఆ కాలేజీ డైరెక్టరు చెప్పుకుంటున్నాడు. ‘పిల్లలు బాగా చదివారు. నేనూ బాగా చెప్పాను. మంచి రిజల్ట్ రావచ్చు’ అని మేమూ అనుకున్నాము. ఈ దశలో త్రివేణి కాలేజీ వాళ్ళు మమ్మల్ని బాగా ఒత్తిడి చెయ్యసాగారు. గత సంవత్సరం అనుభవం దృష్టిలో పెట్టుకొని “మేం ఇంటిదగ్గర ట్యూషన్లు చెప్పుకుంటాము. మీ కాలేజీలో రోజుకి 5 ఆవర్స్ తీసుకుంటాను” అంటూ సంవత్సరానికి లక్షరూపాయలు డిమాండ్ చేసాను. అంతేగాక ‘సంవత్సరం మొత్తం నాతో ఒక్క డైరెక్టరే డీల్ చెయ్యాలనీ, ఒకోసారి ఒక్కొక్కరు డైరెక్టర్ నంటూ terms మార్చకూడదని’ కండిషన్ పెట్టాను. ముందుగా 40,000/- రూ. Advance ఇవ్వాలనీ మిగిలిన 60,000/-Rs. నెలకు 5,000/-Rs. చొప్పున ఇవ్వాలనీ, అన్నీ అగ్రిమెంట్ లో వ్రాసుకొని పరస్పరం అంగీకరించాక అగ్రిమెంటు వ్రాసుకొని కాలేజీలో అడుగుపెట్టాను. ట్రయల్ క్లాసులు తీసుకుంటున్నాను.

ఇంతలో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. నా విద్యార్ధుల్లో ఒకరికి ఇంజనీరింగ్ లో 126 ర్యాంకు వచ్చింది. [1999 EAMCET] ఆ సంవత్సరం ఫిజిక్స్ లో రెండు ప్రశ్నలు డిలీట్ చేశారు. ఆ విద్యార్ధినికి 48/48 మార్కులు వచ్చాయి. ఇంకా 40 మంది ఉన్న సెక్షన్ లో, 22 మందికి మంచిర్యాంకులు వచ్చాయి. అందరికీ ఫిజిక్స్ లో ఎక్కువ మార్కులు రావడమే ర్యాంకులు తెచ్చిపెట్టింది. అప్పటికి ఇంజినీరింగ్ లో 25,000 సీట్లే ఉండేవి. ఈ రిజల్టుతో ఒక్కసారిగా ఊరు మారుమోగిపోయింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

వికాస్ లో పనిచేస్తున్న రోజుల్లో నా కుటుంబ మిత్రుల కుమార్తె మా వికాస్ లోనే చదువుతుండేది. మాటల సందర్భంలో ఫలానా ‘డైరెక్టర్’ ఎలా చెబుతారు?’ అని అడిగాను. “ఆయన పాఠం చెబుతూ తాను మహాగొప్పగా చెబుతున్నట్లు తెగ ఫీలయి పోతాడాంటీ! విషయమేమిటంటే మనకి ఒక్క ముక్కా అర్ధంకాదు” అన్నది. ఆ పిల్ల చెప్పిన తీరుకి మేం బాగా నవ్వుకున్నాం. తర్వాత పిల్లల్ని కదిపిచూస్తే దాదాపు అందరి దగ్గరా అలాంటి అభిప్రాయమే ఉంది. దాంతో నేనూ, నాభర్తా ఆయా డైరక్టర్లని చూసి “వీళ్ళకి సుడి [అదృష్టం] ఉండి సంపాదించటమే, సామర్ధ్యం ఉండి కాదు” అనుకునేవాళ్ళం. అయితే రెండేళ్ళ తర్వాత అది అదృష్టంకాదనీ, మ్యాచ్ ఫిక్సింగ్ ల్లాగా ర్యాంక్ ఫిక్సింగ్ ల కుంభకోణమనీ అర్ధమైంది. అదెలాగో వివరంగా, వరుసగా చెబుతాను.

వాస్తవానికి గుంటూరు విద్యాకేంద్రంగా పేరు పడటానికి, అక్కడ స్వాతంత్రానికి పూర్వం నుండీ స్థాపించబడిన కళాశాలలూ, పాఠశాలలూ ఒక కారణం. ఏసీ కళాశాల, హిందూ కళాశాల, స్టాల్ బాలికోన్నత పాఠశాల [నేను చదువుకున్నది అక్కడే] వంటి కొన్ని సంస్థలు బ్రిటిషు జమానా నుండి పేరొందినవి. ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు గుంటూరు ఏసి కాలేజీ, హిందూ కాలేజీల పూర్వవిద్యార్ధులే. కరుణశ్రీ వంటి కవులూ, మన్నవ గిరిధర రావు వంటి రచయితలూ గుంటూరు కళాశాలల్లోని అధ్యాపక శ్రేణిలోని వారే. ఆ తర్వాత, ఏసీ కాలేజీ నుండీ, హిందూ కాలేజీ నుండీ కొందరు లెక్చరర్లు, దాదాపు 40 ఏళ్ళ క్రితమే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ట్యూషన్ల ఒరవడి దిద్దడంతో గుంటూరు విద్యాకేంద్రంగా వాసికెక్కింది. అందులో ఆ తర్వాత రవీ కాలేజీ ప్రైవేట్ కళాశాలల విజయకేతనానికి చిరునామా అయ్యింది. రవీ కాలేజీ నుండి బయటికొచ్చిన లావు రత్తయ్య విఙ్ఞాన్ కాలేజీ స్థాపించాడు. గుంటూరు నుండి తెనాలి వెళ్ళెదారిలో, వడ్లమూడి గ్రామ పరిధిలో, సువిశాల క్షేత్రంలో భారీభవనాలతో ఉన్న విఙ్ఞాన్ విద్యాసంస్థల సముదాయాన్ని, రాష్ట్రపర్యటనలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. చూసి దిగ్ర్భాంతి చెందాడనీ, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలకి మరిన్ని ‘ఖర్చులు’ పెరిగాయనీ అప్పట్లో మా ప్రాంతంలో చెప్పుకున్నారు.

విఙ్ఞాన్ కళాశాల ప్రాభవం వెలుగుతుండగా రవికాలేజీ మెల్లిగా మరుగున పడిపోయింది. తర్వాత విఙ్ఞాన్ నుండి గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష, జంతు శాస్త్రాల లెక్చరర్స్ అయిదుగురు కలిసి ఒక గ్రూప్ గా బయటికి వచ్చి ‘వికాస్’ కళాశాలను స్థాపించారు. తదుపరి సంవత్సరాల్లో మరో గ్రూప్ [ 5 గురు లెక్చరర్లు] విఙ్ఞాన్ నుండి బయటకు వచ్చి ‘విద్వాన్’ కళాశాలని స్థాపించారు. వికాస్ నుండి విజ్ డం కళాశాల …… ఇలా ప్రైవేట్ కళాశాలలు తామర తంపరగా ఉండేవి. ప్రతీ సంవత్సరం వేసవి సెలవుల్లో, తెలంగాణా, ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంతాల్లోని పల్లెపల్లెకూ తిరిగి, విద్యార్ధుల్ని తెచ్చుకోవటం ఇక్కడ ఆచరణలో ఉండేది. [ఇప్పటికీ అంతేననుకొండి] విజయవంతమైన వ్యాపారంలోనూ, విద్యాసంస్థల్లోనూ, అనుభవం సంపాదించిన తర్వాత అందులో పనిచేసే ఉద్యోగులూ, లెక్చరర్లూ బయటికొచ్చి స్వంతంగా వ్యాపారాలూ, విద్యాసంస్థలూ పెట్టటం మామూలే కదా అనుకున్నాము. అయితే అది మామూలుగా నడిచే వ్యాపారం కాదనీ, వ్యాపారానుభవమో, యాజమాన్య పద్దతుల్లో అనుభవమో సంపాదించుకొని, ఆయా లెక్చరర్లు బయటికొచ్చి కాలేజీలు పెట్టలేదనీ, మ్యాచ్ ఫిక్సింగ్ ల వంటి ర్యాంకు ఫిక్సింగ్ ల అనుపానులు తెలుసుకున్నాక, బయటికొచ్చి, ఆ కిటుకుతో కొత్తకళాశాలలు ప్రారంభించి, విజయం సాధించారని 2000 సంవత్సరం తర్వాత నాకు స్పష్టపడింది.

ఇప్పుడంత అవకాశం శ్రీచైతన్య వంటి అతిపెద్ద కార్పోరేట్ కళాశాలలు, చిన్న, ప్రైవేట్ కళాశాలలకి ఇవ్వడం లేదులెండి. విద్వాన్, సురేష కోచింగ్ సెంటర్, విజ్ డమ్ గట్రా చాలా కాలేజీలని over take చేసి దాదాపు monopoly స్థితివైపు లాక్కెళ్ళి పోతున్నాయి. దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఒకటి రెండో పెద్ద కార్పోరేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. ‘B’ కేంద్రాల్లోని చిన్న ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యజమానులు సంఘాలు పెట్టుకొని రాజకీయనాయకులతో, మంత్రులతో ప్రత్యేకంగా బేరసారాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ అతిపెద్ద కార్పోరేట్ విద్యాసంస్థలు ఎల్.కె.జి. నుండీ టెక్నో శిక్షణ అంటూ ఫ్రాంఛైజ్ స్కూల్స్, కాన్పెప్ట్ స్కూల్స్ తెరుస్తున్నాయి. అది వేరే కథ.


ఇలా లెక్చరర్లు, కొంతకాలం యాజమాన్యం దగ్గర నమ్మకంగా పనిచేసాక, ’కిటుకు’ తెలుసుకొని బయటికెళ్ళి కొత్త కళాశాలలలో పోటీ ఇస్తోన్నారన్న సమస్య కొంచెం పెద్దది కాగానే, ముందునుండీ పాతుకుపోయిన పెద్దకళాశాలలు, కొత్తగా ఫీల్డులోనికి అడుగుపెట్టిన లెక్చరర్స్ తో ముందు జాగ్రత్త తీసుకోవటం మొదలుపెట్టారు.

అప్పట్లో కార్పోరేట్ కాలేజిల్లో లెక్చరర్లకి సబ్జెక్టుకు ఇంత అన్న కాంట్రాక్టు పద్దతిలో రెమ్యూనరేషన్ ఉండేది. లేదా రోజుకి గంట చొప్పున నెలకు ఇంత అన్న పద్దతి ఉండేది.

ఆయా సబ్జెక్టులలో లెక్చరర్లకి కొన్ని బ్రాంచీలు కేటాయిస్తారు. కొన్ని సంవత్సరాలకి ఆ లెక్చరర్లకి concern branches తప్ప మిగిలిన branches of science లో [command] సాధికారత తగ్గుతుంది. అప్పుడు మేనేజ్ మెంట్ ఆట మొదలుపెడుతుంది. క్రమంగా లెక్చరర్స్ లో insecurity create చేస్తుంది. ఏకారణంగానైనా లెక్చరర్ బయటికి వెళ్ళిపోవలసి వచ్చి, మరోకాలేజీని approach అయితే అక్కడి యాజమాన్యం మొదటిప్రశ్న “మీరు ఏ branch teach చేసేవాళ్ళు?" లెక్చరర్ ’ఫలానా బ్రాంచ్’ లు చెప్పగానే ’ఆ బ్రాంచిలో మాకు బ్రహ్మాండమైన లెక్చరర్స్ ఉన్నారు. మీరు so and so branch deal చెప్పగలరా? ఎక్కువ టచ్ లేదు కదా. కాబట్టి ఇంతే రెమ్యూనరేషన్ ఇస్తాను’తో ఆట మొదలౌతుంది. నిజానికి లెక్చరర్ talented అయితే, కొద్దిపాటి రివిజన్ తో ఏ బ్రాంచ్ అయినా డీల్ చెయ్యగలడు. కానీ దాన్ని మేనేజ్ మెంట్ ఒప్పుకోదు. ఇక నిరంతర నిఘా, తోటివాళ్ళ మధ్య రాజకీయాలు, యజమాన్యానికి చాడీలు మోయటం ఇవన్నీ ఏ ఫీల్డులోనైనా ఉండే సదా మామూలే. ఈ నేపధ్యంలో నేను వికాస్ కళాశాలలోనూ, వీనస్ లోనూ, అరోరా లోనూ క్లాసులూ సంపాదించాను. వికాస్ లో నా కొలీగ్ ఒకరు “ఎక్సల్ కాలేజీ వారికి ప్రస్తుతం లెక్చరర్ల కొరత బాగా ఉంది. మీరక్కడ ప్రయత్నిస్తే కెరీర్ బాగుంటుంది. చూడండి. అక్కడైతే ఎంసెట్ క్లాసులు పొందవచ్చు” అని సలహా ఇచ్చారు. నేను వివరాలు సేకరించాను. ఎక్సల్ కాలేజీలో ఫీజిక్సు డిపార్ట్ మెంట్ డైరక్టరు చలపతి రావుగారు. నేనాయన శిష్యురాలిని. అప్పటికి 55 సంవత్సరాల టీచింగ్ అనుభవం గల, వయస్సు పైబడిన వ్యక్తి. అపార అనుభవశాలి. ఎంసెట్ ఫిజిక్స్ గ్రంధ రచయిత. ఆయనంటే నాకు చెప్పలేనంతగౌరవం. అసలు నేను ఫిజిక్సు మీద మక్కువ పెంచుకున్నదే ఆయన దగ్గర ట్యూషన్ లో చేరాక. దాంతో ఎగిరి గంతేసినట్లు ఎక్సల్ ని అప్రోచ్ అయ్యాను. మా సార్ చలపతిరావు గారిని కలిసి నన్ను నేను గుర్తుచేసుకున్నాను. డెమాన్ స్ట్రేషన్ క్లాసు తీసుకోమన్నారు. అప్పట్లో మన సర్టిఫీకేట్లు ఎవరికీ పట్టేవి కావు. సత్తాతో పాఠం చెప్పగలమా లేదా అన్నదే ప్రామాణికం. డెమో క్లాసు తర్వాత మా సార్ ‘It is Excellent’ అంటూ అప్పటికప్పుడే నాకు జాబ్ ఇచ్చేసాడు. ఆయన దగ్గర టీచింగ్ లో ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాను. ఆయనకీ భగవద్గీత అంటే చాలా ఇష్టం. దాంతో తీరిక సమాయల్లో ఆధ్యాత్మికత గురించి చర్చలు చేసేవాళ్ళం. ‘అమ్మాయ్! Thought provoking గా ఏదైనా మాట్లాడు’ అనేవాడాయన. ఎదుటి వాళ్ళు ఏదీ మాట్లాడినా అందులోంచి ఎంసెట్ ప్రశ్ననీ సృష్టించేవాడు. రైల్లో, బస్సుల్లో ప్రయాణిస్తునో, వర్షం పడుతుంటేనూ ఎన్నో ప్రశ్నల్నీ కనిపెట్టి compile చేసిన ఆయన పుస్తకంలో దాదాపు 7000 ప్రశ్నలు, లెక్కలూ ఉండేవి. అదో అద్భుత ప్రపంచం. ఎప్పుడు చూసినా పెన్ను, చిన్న పుస్తకం జేబులో సిద్ధంగా పెట్టుకొని ఎప్పుటికప్పుడు కొత్తప్రశ్నలు కనిపెడుతూ ఉంటారు.

ఒకరోజు మాసార్, సంభాషణలో ‘అమ్మాయ్, భగవద్గీత ప్రాక్టీస్ చేస్తానన్నావు కదా! నీకిష్టమైన శ్లోకం చెప్పు’ అన్నారు. నేను

శ్లోకం:
ధ్యాయతో విషయా పుంస స్సంగస్తేఘాప జాయతే
సంగా త్సంజాయతే కామః కామా త్ర్కోధో భిజాయతే

క్రోధా దృవతి సమ్మోహఃసమ్మోహా త్స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశా ద్భుద్ధినాశో బుద్ధినాశా త్ర్పణశ్యతి

భావం:
విషయవాంఛలను సదా మననము చేయుటవలన వాటియందు అనురాగము పుట్టును. అది కామముగా మారి చివరికి క్రోధమగును. క్రోధము వలన అవివేకము, అవివేకము వలన స్మృతిభ్రంశము కలుగును. దాని వలన మనుజుడు బుద్దిని కోల్పోయి చివరికి అధోగతి చెందును.

చెప్పాను. ఎందుకంటే అప్పటికి మేము ఆశ్లోకాన్నే తరచూ గుర్తు చేసుకుంటూ ఆచరించే ప్రయత్నం చేస్తున్నాము. నంబూరు నుండి గుంటూరు చేరిన 9 నెలల్లో మూడిళ్ళు మారవలసి వచ్చింది. అప్పటికి లారీ కి పట్టేటంత ఫర్నిచర్ ఉండేది. గతవైభవ చిహ్నాలుగా మిగిలిపోయిన సోఫా సెట్లు, కార్పెట్లు గట్రా. అద్దెఇల్లు వెదుక్కోవటం, ఫర్నిచర్ రవాణా, సర్ధుకోవటం అన్నవి, ఇంటి అద్దెకు అదనంగా ఉన్న సమస్యలు. అయినా సరే, ‘జీవితంలో ఏ అసాధారణతనీ గుర్తించవద్దు. అప్పటికి పైకి కన్పిస్తున్న కారణాన్నే నమ్మాలి’ అన్నది – ఫ్యాక్టరీ ఖాళీ చేస్తూనే నేనూ నాభర్తా చేసుకున్న నిర్ణయం. ‘1992 ని పూర్తిగా మరిచి పోదాం’ అని ఒకసారి అనుకున్నాక ఇక దాని గురించి మనసులో కూడా గుర్తు తెచ్చుకోలేదు. ఏదిజరిగినా, అప్పుడు పైకి కన్పిస్తున్న కారణాన్నే పట్టించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాం. అందునా అసాధారణతని గుర్తిస్తే మరిన్ని సమస్యలు రావడం 1995 లో ఫ్యాక్టరీ ఖాళీ చేయడానికి ముందు వరకూ గమనించాం. అంతకంటే ‘ఏది జరిగినా అది విధివ్రాత అనీ, దాదాపు అందరికీ ఇలాంటి సమస్యలు రావడం మామూలేననీ అనుకుంటే’ ఎంతోకొంత నయంగా ఉండటమూ గమనించాం. అందుచేత ‘1992 ని, మన ఫిర్యాదునీ మరిచిపోదాం’ అని ఎంత గట్టిగా నిర్ణయించుకున్నామంటే ఆ తర్వాత దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ ఏం జరుగుతుందో మేం పట్టించుకోలేదు. వార్తలు చూడలేదు. 1995 తర్వాత రాజకీయరంగంలోగానీ, వివిధ విషయాల్లో గానీ ఏంజరిగిందో, మేమేదీ పట్టించుకోలేదు. 2005 తర్వాతే తిరిగి పాత న్యూస్ తిరగేసాము. అప్పటికి అంటే 1997 లో మేమేదీ పట్టించుకోలేదు. వార్తా పత్రికల్లో సైతం కళాశాలల వాణిజ్యప్రకటనలూ, డైలీ సీరియల్స్ [అప్పట్లో వచ్చేవి], సినిమా పేజీలూ చూసేదాన్ని. టివీ లో వార్తలు ఎప్పుడొస్తాయో కూడా పట్టించుకునేవాళ్ళం కాదు. మేమూ, మా కెరీర్, మాపాప. ఇంతే. తీరిక దొరికితే మా పాపకి కథలు చెప్పుకునేదాన్ని. భారత భాగవత రామాయణాలతో పాటు తనకి కనీసం పదివేల కథలు చెప్పిఉంటాను. [ఇప్పుడు తనే బ్లాగులోకంలో చదివీ, పుస్తకాల్లో చదివీ నాకు చెబుతుందనుకొండి.]

అందుచేత మా సార్ అడిగినప్పుడు నేను భగవద్గీతలోని ఆ శ్లోకమే చెప్పాను. నాకు కళాశాలలో మంచిపేరు వచ్చింది. అయితే ఎక్కువ క్లాసులు మాత్రం ఇంకా ఇవ్వలేదు. అప్పుడు నేను గుంటూర్లో రాయపాటి శ్రీనివాసరావుని అప్రోచ్ అయ్యి, ఎక్సల్ కాలేజీలో మరో డైరక్టర్ కి నాకు మరికొన్ని క్లాసులు ఇచ్చేటట్లు రికమెండ్ చేయమని అడిగాను. అతడు “ఏమయిపోయారు ఇన్నిరోజులు?" అని అడిగాడు. నేను “ఫ్యాక్టరీ నష్టపోయాక పెళ్ళి చేసుకున్నానండి. ఇదిగో మా పాప” అంటూ మాపాపని చూపాను. అంతకు మించి అతడూ ఏ వివరం అడగలేదు. నేనూ చెప్పలేదు. తర్వాత నాకు రెండు క్లాసులు ఎక్స్ ట్రా ఇచ్చారు.

బాగా చెప్పే లెక్చరర్ గా రెప్యూటేషన్ తెచ్చుకున్నాను. ఎక్సల్ కళాశాలలో మరో డైరక్టరు [తర్వాత ఈయన గుంటూరు నగర మేయర్ అయ్యాడు], "ఇంకా ఎక్కడైనా అవర్స్ చెబుతున్నారా” అని అడిగాడు. అప్పటికి నాకు అరోరా కాలేజీలో క్లాసులున్నాయి. అదే చెప్పాను. “Next year ఏ కాలేజీకీ కమీట్ కాకండి. అన్ని అవర్స్ ఇక్కడే తీసుకుందురుగాని” అని చెప్పాడు. నేనెంతో సంతోషపడ్డాను. ఆపైన మంచి రిజల్ట్ కోసం బాగా కష్టపడ్డాను.

అప్పట్లో నేను వెళ్ళే క్లాసులో వంశీకృష్ణ అనే MPC విద్యార్ధి ఉండేవాడు. సుబ్రమణ్యం అని మరో బై.పి.సి. విద్యార్ధి ఉండేవాడు. ఆ పిల్లలు ఎంత షార్ప్ అంటే – మనం problem చదివి బోర్డు మీద డాటా వ్రాసి ఏ ఫార్ములా ఆప్లై చెయ్యాలో వివరించే లోపు, వాళ్ళు లెక్కచేసి జవాబు చెప్పేవాళ్ళు. వాళ్ళల్లో సుబ్రమణ్యంకి జూనియర్ ఇంటర్ రెగ్యులర్ సిలబస్ లో స్టేట్ ర్యాంక్ [10 లోపు] ఉంది. అప్పటికి ఇంటర్ లోనూ మార్కుల్ని బట్టి ర్యాంకులు ఇచ్చేవాళ్ళు. సుబ్రమణ్యంకీ, వంశీకృష్ణకీ తప్పకుండా ఎంసెట్ లో మంచి ర్యాంకులు [స్టేట్ ర్యాంకులు] వస్తాయని లెక్చరర్స్ అందరం అనుకునేవాళ్ళం. అలాగే వికాస్ లో గాయత్రి అనే విద్యార్ధిని ఉండేది. ఆమె జూనియర్ సిలబస్ లో స్టేట్ సెకండ్ ర్యాంకు పొందింది.

అయితే ఎంసెట్ ఫలితాల తర్వాత చూస్తే ఇంజనీరింగ్ లో వంశీకృష్ణాకి 16th ర్యాంకు వచ్చింది. మెడిసిన్ లో సుబ్రమణ్యంకి 700 పైన, గాయత్రికి 1200 పైన ర్యాంకులు వచ్చాయి. ఆ పిల్లలు రెగ్యులర్ సిలబస్ లో చూపినంత ప్రతిభ, ఎంసెట్ లో మల్టీపుల్ ఛాయిస్ లో చూపించలేదేమో లేక ఎంసెట్ పరీక్షలో టెన్షన్ తోనో, మరోకారణంతోనో బాగా వ్రాయలేదేమో అనుకున్నాను. అయితే ఎక్సల్ కాలేజిలోని రాజేష్ అనే కుర్రవాడికి మెడిసిన్ లో 10 ర్యాంకు వచ్చింది. [ఆపిల్లవాడు ఎక్సల్ కాలేజీ లోని ఒక డైరక్టర్ కి దగ్గరివాడని తర్వాత తెలిసింది] రాజేష్ కి ర్యాంకు రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ పిల్లవాడి ఉనికి కూడా క్లాసులో తెలిసేది కాదు. నేనే కాదు, తోటి లెక్చరర్స్ గానీ, మిగిలిన సబ్జెక్ట్ లెక్చరర్స్ గానీ ’రాజేష్’ గురించి ఎప్పుడూ రిఫర్ చేయగా వినలేదు. ఆ పిల్లవాడిలో జీల్ నో, నాలెడ్జి నో, internal tests లో ఎప్పుడూ గుర్తించలేదు. ఇది చాలా వింతగా అన్పించినా పెద్దగా పట్టించుకోలేదు.

ఎందుకంటే అప్పటికి నా జాబ్ గొడవల్లో పడింది గనుక. ఎక్సల్ లో ‘నెక్ట్స్ ఇయర్ ఇంకే కాలేజీలో అవర్స్ గురించి కమిట్ కాకండి. మొత్తం ఇక్కడే తీసుకొందురు’ అంటూ నాకు assurance ఇచ్చిన డైరక్టరే తర్వాతి సంవత్సరం నేను కంటిన్యూ కావడానికి వీల్లేదని మా సార్ చలపతి రావుకి చెప్పాడట. కారణమేమిటో నాకు తెలియదు. ప్రత్యేకంగా చెప్పుకోదగిన సంఘటనలైతే ఏవీ లేవు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, నేనెప్పుడూ ఎవరితోనూ ఏవ్యాఖ్యలు చేసేదాన్నికాదు. కాబట్టి ఏకారణంగానైనా ఆ డైరక్టరుకి నామీద కోపం వచ్చే అవకాశం [నాకు తెలిసీ] లేదు. బహుశః ఎవరైనా నామీద అతడికి చాడీలు చెప్పి ఉండవచ్చు. ఈర్ష్యాసూయలు సహజమే కదా అనుకున్నాను. సాధారణంగా ఏ సబ్జెక్ట్ [డిపార్ట్ మెంట్] కి చెందిన వ్యవహారాలు ఆ సబ్జెక్టు కు చెందిన డైరక్టరే చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే నావిషయంలో మాత్రం ఈ సాధారణ నియమం వర్తించలేదు. మా సార్ తానే ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ అయి ఉండి కూడా, నన్ను పిలిచి “అమ్మాయ్! నేనెంత చెప్పినా ఏసు రత్నం ఒప్పుకోవట్లేదమ్మా. నిన్ను తరువాతి సంవత్సరం కంటిన్యూ చెయ్యటం ససేమిరా కుదరదంటున్నాడు. సారీ తల్లీ!” అని చెప్పారు. నేను “సర్! నేను గీత ప్రాక్టీసు చేస్తాను. ఇది నాపని అనుకునీ, మంచి ఫలితం రావాలనీ కష్టపడ్డాను. అయితే పని చేయటమే మనచేతిలో ఉంటుంది గానీ ఫలితం కాదు గదా! మంచి ఫలితం రావాలని పనిచేసాను. ఈ ఫలితం వచ్చింది. ఇదే భగవంతుడిచ్చిన ఫలితం అనుకుంటాను. వస్తాను సార్” అన్నాను. నీళ్ళ నిండిన కళ్ళతో ‘God bless you my child’ అంటూ వీడ్కొలిచ్చాడాయన. ఫలితం చేదుగా ఉన్నా, మాసార్ ఇచ్చిన వీడ్కొలు నాకు ఊరట నిచ్చింది. అయినా అంతటితో ప్రయత్నం వదలకుండా మిగిలిన డైరెక్టర్స్ ని అప్రోచ్ అయ్యానూ, అయినా ఉపయోగం లేకపోయింది. ఇతర కాలేజీల్లో ప్రయత్నించాను. పరిస్థితి ఆశాజనకంగా కన్పించలేదు.

ఇంతలో సూర్యాపేటలోని ఓ చిన్న కాలేజీ, ఫిజిక్స్ లెక్చరర్స్ కోసం ఇచ్చిన పత్రికాప్రకటన నా కళ్ళబడింది. సరే ‘B’ సెంటర్లలోని చిన్న కాలేజీ అయితే మొత్తంగా ఫిజిక్స్ సబ్జెక్టంతా ఒక్కరే డీల్ చెయ్యవచ్చు. సబ్జెక్ట్, టీచింగ్ ఎబిలిటీ improve అవుతుంది అని సీనియర్లు ఇచ్చిన సలహాలు నన్ను ఆలోచింపచేశాయి. ఇంటర్యూకి అటెండ్ అయ్యాను. డెమో క్లాసు తర్వాత డీల్ మాట్లాడు కున్నాము. అది చిన్న కాలేజి. ఆ డైరక్టరు స్యయంగా కెమిస్ట్రీ చెప్పుకుంటాడు. గణితం కోసం గుంటూరు సిద్ధార్ధ కాలేజీ [ఈ కాలేజీ 1997 లో రామబ్రహ్మం కేసులో ఇంటర్ పేపర్ లీక్ విషయం వెలుగుచూడక ముందు వెలిగిపోయింది. రామబ్రహ్మం వెల్లడించిన పేర్లలో ఈ కాలేజీ యాజమాన్యం పేరు కూడా ఉండటంతో తర్వాత ప్రాభవం కోల్పోయింది. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం చేతులు మారింది. రామబ్రహ్మం కేసు బయటపడ్డప్పుడు రాత్రికి రాత్రి కార్పోరేట్ కాలేజీలు కోట్లకొద్దీ డబ్బులు బయటికి తీసి ఉన్నతాధికారులకి ముడుపులిచ్చిందని తదనంతర కాలంలో విన్నాను.] నుండి ఓ లెక్చరర్ ని తెచ్చారు. దాదాపు 300 మంది విద్యార్ధులు ఉండేవాళ్ళు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలు రెండూ ఉండేవి. నాకు తెలుగులో ఫిజిక్స్ చెప్పడం కొత్త. అయినా పెద్దగా ఇబ్బంది పడలేదు.

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి గుంటూరు నుండి సూర్యపేటకు మకాం మార్చాము. రోజుకి ఎనిమిది అవర్స్ తీసుకునేదాన్ని. ఇంటర్ రెగ్యులర్ సిలబస్ లో ఒక చాప్టర్ పూర్తికాగానే, దానిమీద ఎంసెట్ సిలబస్ కూడా సమాంతరంగా చెప్పాలన్నది డైరెక్టర్ ప్రణాళిక. అలాగే చెప్పెవాళ్ళం. దాంతో పిల్లలు బాగా రిసీవ్ చేసుకున్నారు. కాలేజీ వాళ్ళుగుంటూరు లెక్చరర్స్ ని తెచ్చామంటూ భారీగా వాణిజ్యప్రకటనలు వార్తా పత్రికల్లోనూ, స్థానిక టివీలోనూ ఇచ్చుకున్నారు. అంతేగాక లెక్చరర్స్ పాఠం చెబుతుండగా వీడియో తీసి స్థానిక టీవిల్లో ప్రసారం చేసుకున్నారు. అక్కడి సిటికేబుల్ లో ఆ సౌకర్యం ఉండింది. గుంటూరు లెక్చరర్స్ పట్ల ఉన్న క్రేజ్ కారణంగా, వీడియోలో కన్పిస్తూన్న ఇంగ్లీషు ఉచ్చారణ కారణంగానూ నేను పనిచేస్తున్న కాలేజీకి ఒక్కసారిగా అడ్మిషన్లు పెరిగాయి. అక్కడ సీటుకి ఇంత అని స్కూల్ వాళ్ళకి ఇస్తేగాని రాని అడ్మిషన్లు, స్కూల్ ప్రమేయంలేకుండా విద్యార్ధులే వచ్చి చేరటం అన్నది విశేషం.

గణితం, ఫిజిక్స్ రెండు సబ్జెక్ట్ లకి గుంటూరు నుండి లెక్చరర్స్ రావటం అన్నది ఆ కాలేజికి బాగా రెప్యూటేషన్ తెచ్చి పెట్టింది. పిల్లల తల్లితండ్రులు అడ్మిషన్ల కోసం వచ్చినప్పుడు యాజమాన్యం మమ్మల్ని కూడా పిలిచి, మాట్లాడమనేది. తల్లితండ్రులు తమకున్న సందేహాలు అడిగితే మేంకూడా కౌన్సిల్ చేసాం. అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు ప్రారంభమయ్యేసరికి దాదాపు నెలరోజులు పట్టింది. అప్పటికి అక్కడున్న సీనియర్ విద్యార్ధులు కొందరు గత సంవత్సరంలో విద్యాభోధన, లెక్చరర్లు బాలేరని వెళ్ళిపోయారట. యాజమాన్యం ఆ పిల్లల ఇళ్ళకి కబురు పెట్టి పిలిచి, ట్రయల్ క్లాసులు చూడమనీ, అప్పటికీ నచ్చకపోతే అప్పుడు టీసీ ఇచ్చేస్తాననీ నచ్చచెప్పింది. ట్రయల్ క్లాసుల తర్వాత దాదాపు అందరూ క్లాసులకి రావటం మెదలు పెట్టారు. ఇంకా కొత్త సూడెంట్సు కూడా వచ్చిచేరారు. జూనియర్ ఇంటర్లో కూడా అడ్మిషన్లు బాగా వచ్చాయి. అన్ని కాలేజిలు 2000/-Rs., 2500/- Rs. తీసుకుంటుంటే, అది స్కాలర్ షిప్ లో కట్ చేసుకునేటట్లు అనే నియమంతో ఉంటే, నేను పనిచేస్తున్న కాలేజీ యాజమాన్యం 6,000/-Rs. రూపాయలు అడ్వాన్సు తీసుకొని మరీ అడ్మిషన్లు ఇచ్చింది. యాజమాన్యం చాలా సంతోష పడింది. సహజంగా మేము [అంటే లెక్చరర్స్] కూడా సంతోషపడ్డాము.

చలపతి రావు గారి స్టూడెంట్ గా చదువుకుని, ఆయన దగ్గర సబార్డినేట్ గా పనిచేసి, సబ్జెక్ట్ లో ఆయన కృషి అంటే నాకు చాలా ఆరాధనగా ఉండేది. ఆయనలాగే నేనూ భౌతిక శాస్త్రంలో పుస్తకం వ్రాయాలని కోరుకునేదాన్ని. అందుచేత పిల్లలకి పాఠం చేప్పెటప్పుడు, ఎంసెట్ క్లాసులు తీసుకునేటప్పుడు ప్రతి అంశాన్ని పరిశీలించేదాన్ని. విద్యార్ధులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఎలా చెబితే బాగా గ్రహిస్తారు, ఇలాంటి అంశాలన్నీ నోట్స్ వ్రాసుకునేదాన్ని. ఫిజిక్స్ ఫార్మాలాలన్నీ చాప్టర్లవారీగా వ్రాసి, ఇంప్రూవ్ చెయ్యటం మొదలుపెట్టాను. రోజులు వేగంగానూ, పని ఒత్తిడితోనూ గడుస్తున్నాయి. అప్పట్లో నేనూ, నా విద్యార్ధులు కూడా క్లాసుని బాగా ఆనందించే వాళ్ళం. నేను యాజమాన్యంతో ఒక సంవత్సరం పాటు డీల్ మాట్లాడుకున్నాను. లక్షా పదివేల రూ. రెమ్యూనరేషన్ తో ప్రారంభం. ఇప్పటి ఐ.టి. వాళ్ళకి ఇది తక్కువ మొత్తమేమో గానీ 1998 లో టిచింగ్ ఫీల్డ్ లో ఇది తక్కువేం కాదు. అప్పటికి సీనియర్ లెక్చరర్లకి 4 ½ లక్షలు సంవత్సరానికి ఇస్తున్నారన్న వార్తలు బయటి ప్రపంచంలో ఉన్నప్పటికీ వాస్తవంలో అయితే 2 ½ కంటే ఎక్కువ లేదు. అందుచేత ‘కార్పోరేట్ కాలేజీల రంగంలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే మంచి పేరు తెచ్చుకున్నాను, స్థితిలోకి వచ్చాను. ఫర్వాలేదు. కష్టపడి మంచిఫలితాలు తెచ్చుకుంటే ఇక జీవితంలో స్థిరపడినట్లే’ అనుకున్నాను.

పూర్తిగా విద్యాబోధనలో మునిగి పోయాను. ఓప్రక్క ఇల్లూ, సంసారం, మాపాప. మరోప్రక్క విద్యార్ధులూ క్లాసులు. అప్పటికి మా పాప చిన్నది కావటంతోనూ, ఇక పెద్దవాళ్ళంటూ మరెవ్వరూ లేకపోవటంతోనూ, పాపకి సంవత్సరం నిండేవరకూ నేను దాదాపు ఖాళీగా ఉంటూ, నంబూరులో ఇంట్లోనే ట్యూషన్లు చెప్పాను. నాభర్త యాడ్ ఏజన్సీలో రెప్ గా చేశారు. నేను కాలేజిల్లో ప్రవేశించి బిజీగా ఉన్నప్పుడు నా భర్త మా పాప సంరక్షణ చూశాడు. పాప కొంచెం పెద్దదై స్కూల్లో చేరేవరకూ ఇద్దరిలో ఎవరో ఒకరం కెరీర్ మానుకొని పాపని చూసుకున్నాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu