వారంరోజులుగా నా పొడవాటి టపాలని చదివి, వ్యాఖ్యలు వ్రాసి, నా పొరపాట్లేమైనా ఉంటే సరిదిద్ది, నన్ను ప్రోత్సాహిస్తోన్న నాబ్లాగు చుట్టాలందరికి కృతఙ్ఞతలు. ఈ ఆదివారం చదువుకునేందుకు సరదాగా చిన్న టపా.

ఎంతటి క్లిష్టమైన విషయానైనా సరళంగా అర్ధంచేసుకునేందుకు, సులభంగా గుర్తుంచు కొనేందుకు మనపెద్దలు కొన్ని సామెతలుగా చెబుతారు. అలాంటి వాటిలో ఒకటి ‘తాను చేస్తే లౌక్యం, ఎదుటివాడు చేస్తే మోసం అన్నాడట’ అన్న సామెత.

నిజంగానే మన మనస్సు చేసే మాయాజాలం ఎలా ఉంటుందంటే – ఏదైనా పని మనం చేస్తే, దేన్ని గురించైనా మనం మాట్లాడితే దానికి పాజిటివ్ పేరు తగిలిస్తాం. మనకి ఎదురుగా ఉన్నవారు అదే చేస్తే, మోహమాటంతోనైనా సెమీ పాజిటివ్ పేరు తగిలిస్తాం. అదే మనకు దూరంగా ఉన్న మూడవ వ్యక్తి అదే చేస్తే నిర్మొహమాటంగా నెగిటివ్ పేరు తగిలిస్తాం. అంటే పనులకూ, భావనలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ పురుషాల్ని బట్టి వ్యాఖ్యానాలు మారిపోతాయన్న మాట.

సరదాగా అలాంటివి కొన్ని పరిశీలిద్దాం.

1]. ఉదాహరణకి – భోజనం [తిండి] విషయంలో

నేను [ప్రధమ పురుష] : నేను రుచిని అస్వాదిస్తాను.
నువ్వు [ద్వితీయ పురుష] : నీవు భోజన ప్రియుడవు.
అతడు [తృతీయ పురుష] : వాడుత్త తిండిపోతు.

2]. భయపడిన సందర్భంలో

నేను : నేను ఏవిషయంలోనైనా ముందు జాగ్రత్త తీసుకుంటాను.
నువ్వు: నువ్వు భయపడుతున్నావు.
అతడు: వాడుత్త పిరిగ్గొడ్డు.

3]. నిర్ణయం మార్చుకున్న సందర్భంలో

నేను : నేను పునరాలోచించాను.
నువ్వు : నువ్వు మనస్సు మార్చుకున్నావు.
అతడు : వాడుత్త వెధవ. ఒక మాట మీద నిలబడడు.

4]. ఏపనైనా నెమ్మదిగా చేసిన సందర్భంలో

నేను : నేను ఏపనైనా ఆచితూచి చేస్తాను.
నువ్వు: నువ్వు ఏపనీ వేగంగా చెయ్యవు.
అతడు: వాడుత్త సోమరిపోతు. ఏపనీ త్వరగా చెయ్యడు.

5]. సరిగ్గా మాట్లాడని సందర్భంలో

నేను : నేనెక్కువ మాట్లాడను. మాటల కంటే చేతలు మేలు కదా!
నువ్వు: నీకు మాటతీరులో నైపుణ్యం లేదు.
అతడు: వాడుత్త పనికిమాలిన వాడు. సరిగ్గా మాట్లాడ్డం కూడా రాదు.

6]. పని సామర్ధ్యం విషయంలో

నేను : నేను బాగా పనిచేసాను. పరిస్థితులు కలిసిరాలేదు.
నువ్వు: నువ్వు సరిగ్గా పనిచెయ్యలేదు.
అతడు: వాడుత్త అసమర్ధుడు. ఏపనీ చేతకాదు.

7]. కబుర్లూ కాలక్షేపం విషయంలో

నేను : నేను నలుగురిలో మంచి అన్పించుకునే ప్రయత్నం చేసాను. సమయం సద్వినియోగం చేసుకున్నాను.
నువ్వు: నువ్వు సమయం వృధా చేస్తున్నావు.
అతడు: వాడుత్త సోది మనిషి. సొల్లువాగుతూ గడుపుతుంటాడు.

8]. ఒత్తిడి, హడావుడి విషయంలో

నేను : నేను ఫలానా పనిని వేగంగా చెయ్యాలని ప్రయత్నించాను.
నువ్వు: నువ్వు హడావుడి పడుతున్నావు.
అతడు: వాడు వత్తిడి పడుతున్నాడు.

9]. ఎవరితోనైనా ప్రవర్తన విషయమై గొడవ పడినప్పుడు

నేను : నేను ఫలానా వారితో వాదించాను.
నువ్వు: నువ్వు ఫలానా వాళ్ళతో గొడవ పడ్డావు.
అతడు: వాడు ఫలానా వాళ్ళని నానా మాటలూ అన్నాడు.

10]. ఎదుటి వాని మీద కోపం వచ్చినప్పుడు

నేను : నాకు ఫలానా వారు చేసింది నచ్చలేదు. అదే చెప్పాను.
నువ్వు: నువ్వు ఫలానా వారిమీద అసహనం చూపించావు.
అతడు: వాడు ఫలానా వారిమీద కోపంతో ఎగిరిపడ్డాడు.

ఇలాగన్న మాట. ఆంధ్రప్రభలోనో, ఎక్కడో చాలా కాలం క్రితం చదివాను. ఆదివారం ఆనందిస్తారని వ్రాసాను.

ఒక విషయాన్ని మనమైతే ఒకలా, అవతల వారైతే మరోలా తీసుకోకుండా ఉండేటందుకేనేమో మన పెద్దలు ’తాను చేస్తే లౌక్యం నువ్వు చేస్తే మోసం’ లాంటి సామెతలు చెప్పారు.

ఇదేవిషయాన్ని భగవద్గీత మరింత స్పష్టంగా చెబుతుంది.
శ్లోకం:
సర్వభూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని
ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః

భావం:
యోగయుక్తుడైనవాడు సర్వప్రాణులయందునా సమదృష్టి కలిగి – అన్ని జీవాలయందునా తననూ, తనయందు సర్వభూతాలనూ దర్శిస్తాడు.

సర్వప్రాణుల్లో తననీ, తనలో సర్వప్రాణుల్నీ చూడగలగటం – ఎంత గొప్ప భావన!

అలాగైతేనే – ఎదుటివారిలో ఆకలిని మన ఆకలిగా గుర్తించగలం. ఆకలితో బాధపడుతున్న వ్యక్తిని చూసి, మనమే ఆస్థితిలో ఉంటే అని ఒక్క క్షణం ఊహించుకుంటే – అప్పుడెవరూ ఎవర్నీ మోసగించరేమో, దోపిడి చేయరేమో.

గోకులు ఛాట్ లోనో, ముంబాయి దాడుల్లోనో ఆత్మీయుల్నీ కోల్పోయి దుఃఖిస్తున్న వాళ్ళని చూసి, మనమే ఆస్థితిలో ఉంటే అనుకుంటే – ప్రపంచంలో ఎన్ని ఘోరాలు ఆగిపోతాయో కదా!


మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

ఇక్కడేదో సాంఘిక శాస్త్రం బోధిస్తారని వస్తే తెలుగు చెబుతున్నారేంటి :)

Visit http://www.well.com/user/jct/

ఇందులో మళ్ళీ ఇంకొక పార్శ్వం ఉందండోయ్!
అది హోదా. ద్వితీయ కానివ్వండి, తృతీయ కానివ్వండి, డబ్బు , పలుకుబడి ఉన్నవాడి గురించి మాత్రం మాట్లాడే టప్పుడు ఎదుటి వాడు నమ్మదగ్గవాడా కాదా అని చూసి మరీ మాట్లాడతాం.

మంగమ్మ పాత్ర గుర్తుందా మీకు,(వేయిపడగలు లో) డబ్బుతో తిరిగొచ్చి అదే ఊళ్ళో రాణిలా బతుకుతుంది.

కన్నాగారు,

సాంఘిక శాస్త్రమో, తెలుగో, లెక్కలో, ఫిజిక్సో [నా సబ్జెక్టు ఇదేలెండి] చెబుతానని నేనెప్పుడూ చెప్పలేదు కదూ! నాకు తెలిసిన నిజాలు చెబుతానని మాత్రమే చెప్పాను. ఓ సారి మళ్ళీ నా టపాలు తిరగేసి చూడండి! వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.
******

మనోహర్ గారు,

మీరు చెప్పింది నిజమే సుమా!

లేదండీ నేను కేవలం సరదాగా అన్నవే! ఎంతో ఆత్రుతతో పొద్దున్నే వచ్చి(ఒకప్పుడు ఈనాడులో ఆదివారం అనుబంధం కోసం ఇంటి ముందు మెట్ల మీద ఇంతటి ఆత్రంతో ఎదురు చూసేవాడిని, ముందు నేనే చదవాలని) చూస్తే రోజు ఉండేదానికి భిన్నంగా ఉంటే ఓ విసురు విసిరానంతే, అన్యధా భావించకండి.

కన్నాగారు,

సీరియస్ ఏమీ లేదండి. నేనూ సరదాగానే అన్నాను.

నిన్నటి నుంచి మీ బ్లోగ్ చదువుతూనే ఉన్నాను , గంట గంట కి నేను ఉహించినడానికన్నా మీరు చాలా మేధావులు అని అర్తమవుతుంది, అసలు విషయం మొత్తం పూర్తిగా చదివిన తరువాత మీకు మైల్ రాస్తను. మొన్న మా ఫ్రెండ్ అన్నాడు , ఎంత మేధావులయితే అంత ఇబ్బంది పడతారని (నా గురించి అన్నాడు, నేను తెలివిగలావాదిని కాకపోయినా..), ఆది మీకు వర్తించింది అనిపిస్తుంది. మళ్లీ కాలుద్దాం..

శ్రీకాంత్ గారు,

మీ ఉద్వేగం నాకు అర్ధమవుతోంది. నేనూ మీలాంటి సగటు మనిషినే. మీ అభిమానానికి నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu