వారం రోజులుగా నా పొడవాటి టపాలు చదివిన, ఓపికగా వ్యాఖ్యల వ్రాసిన నాబ్లాగు చుట్టాలందరికీ కృతఙ్ఞతలు. చాంతాడంత పొడవైన టపాలు వ్రాస్తాను గానీ వ్యాఖ్యలూ, వ్యాఖ్యా ప్రతిస్పందనలూ వ్రాయాలంటే మాటలు కోసం తడుముకుంటూ ఉంటాను. కారణమేమిటో నాకూ తెలీదు. అందుచేత వేరువేరుగా నా బ్లాగు వ్యాఖ్యాతలకు కృతఙ్ఞతలు చెప్పకపోయినందుకు మన్నించాలి. ఇదిగో, ఈ ఆదివారం కాస్సేపు మన తెలుగు గురించి కబుర్లు చెప్పుకుందామని ఇది వ్రాస్తున్నాను.

అమ్మ, అత్త, అన్న, అక్క అంటూ ఒక్కొక్కటీ వత్తిపలుకుతూ అమ్మఒడిలో కూర్చొని నేర్చుకున్న మాటలు, ముత్యాల కోటలు ముద్దుల మూటలు.

మనం మన చిన్నిపాపాయిల్ని ’అమ్మాయి’, ’అబ్బాయి’ అని పిలుస్తాం. ఆ మాటల్లోనే ఎంతో అర్ధం ఉంది. అమ్మాయి అంటే ‘చిన్ని దానివైన ఓ తల్లీ’ అనీ, అబ్బాయి అంటే ‘చిన్నవాడవైన ఓ తండ్రీ’ అనీ అర్ధం. ఆయి అంటే ’చిన్న’ అనిట. ఎక్కడో చదివాను. ఎంత చక్కని పిలుపు కదా అన్పించింది. లడకా, లడకీ కన్నా, బోయ్, గాళ్ కన్నా తియ్యగా అన్పించింది.

అలాంటి తెలుగుని ఈరోజు కాపాడు కోవలసి వచ్చేస్థితిలో ఉండటమంటే నిజంగా ఎంత దారుణం? ఏం చెయ్యాలి మన తెలుగుని మనం కాపాడుకోవాలంటే? ఇంగ్లీషు మీడియం చదువులు మానెయ్యలా? టివీ యాంకర్ల నోర్లు కుట్టేయాలా? ఇంగ్లీషు సంభాషణలతో నిండి ఉన్న సినిమాలకి ధియేటర్ కి వెళ్ళి చూడకుండా పైరసీ సీడిల్లో చూసేసి కసి తీర్చుకోవాలా? అసలు ఎందుకు తెలుగు భాషా ప్రాభవం తగ్గిపోయింది?

స్వాతంత్ర సమరం రోజుల్లో గ్రాంధికం ఎక్కువగా వాడుకలో ఉంది. జాతీయతా భావాలు, స్వేచ్ఛా భావనలు ప్రజలకి కొత్త. అందుచేత గ్రాంధిక భాషలో ఆ భావాలు ప్రజల్లో లోతుదాకా వెళ్ళడం లేదని నాటి నాయకులు గుర్తించారు. అందుచేత వ్యవహార భాషా ఉద్యమం చేపట్టారు. గిడుగు వారు, గుఱజాడ వారు ఎందరో ఇందుకు కృషి చేశారు. అది ఆనాటికి అవసరం.

ఎందులో నుండైనా [disadvantage] దుష్పరిణామాన్నే వెలికి తీసే కుట్రదారులు స్వాతంత్రానంతరం ఈ వ్యవహార భాషా ప్రయోగంలో ఇతర భాషా ప్రయోగాలు కలిపేసి మన మాతృభాషనీ, సంస్కృతినీ మరుగుపరిచే ప్రక్రియని కొనసాగించారు. పర్యవసానమే ఇప్పుడు మనం ’మన తెలుగుని కాపాడుకుందాం, వ్యాప్తి చేసుకుందాం’ అనుకోవలసి రావడం.


నిజానికి తెలుగుభాష, ఇప్పటికీ, ఇలాగైనా ఉందంటే కారణం గ్రామీణులే. వారిలో ఇప్పటికీ నిలచి ఉన్న తెలుగు పద్యమే. ఒకప్పుడు చదవడం వ్రాయడం రాకపోయినా పోతన పద్యాలో, తిరుపతి వెంకట కవుల పద్యాలో నోటికి రాని తెలుగువారు ఉండేవారు కాదు. ఇప్పుడో ‘Baa Baa Black Sheep’ తప్ప చేత వెన్నముద్ద చెంగల్వపూదండ ఏది? నల్లని వాడు, పద్మనయనమ్ముల వాడు ఎక్కడ?

మొన్న మహానంది శివరాత్రి ఉత్సవాలకి వెళ్ళాము. అక్కడొకాయన పద్యం పాడుతున్నాడు. ఇది ఏ సందర్భంలోని దబ్బా అని నేనింకా ఆలోచిస్తూనే ఉన్నాను, నాప్రక్క నున్న పల్లెటూరి నడివయస్సు వ్యక్తి తన ప్రక్కనున్న మరో గ్రామీణుడితో “ఆశ్వత్ధామ పద్యం తప్పు పాడుతున్నాడు” అనేసాడు. ఇప్పుడు చెప్పండి తెలుగు ఎక్కడ బ్రతికి ఉంది, గ్రామీణుల్లోనా, నగర వాసుల్లోనా?

పెద్దన వారి మనుచరిత్ర, పింగళి వారి కళాపూర్ణోదయాలు ఓప్రక్క బి.ఎస్సీ. చదువుకుంటూ, పద్యకావ్యాలు చదివేయ్యాలని ఆరాటంతో చదివేసాను. ‘ఆ వయస్సుకి ఎంత వరకూ అర్ధమయ్యయో’ అంటే ఇప్పుడు అనుమానమే. ఇప్పటికీ జీవితంలో కష్టమెదురైతే ‘లావొక్కింతయూ లేదు’ అంటూ పద్యం మొత్తం గొణుక్కోవటం అలవాటే. మా పాపకీ ఈ పద్యం నేర్పేసాను. శ్రీ కృష్ణ రాయబారం,కురుక్షేత్రం, శ్రీకృష్ణతులాభారం, శ్రీరామాంజనేయ యుద్దం లాంటి పద్యనాటకాల్లో చాలా ఘట్టాలు కంఠస్థం వచ్చేటంతగా వినేసాను. ఇంగ్లీషు నవలలు చదివాను.

స్వానుభవంతో, పాఠశాల నడిపిన అనుభవంతో నేను తెలుసుకుందేమిటంటే పిల్లలకి తెలుగు పద్యాలు, తెలుగు పిల్లల పాటలు అంటే చాలా ఇష్టం. తెలుగు కథలంటే కూడా చాలా ఇష్టం. ఇంగ్లీషు మీడియం చదువుల వలన నష్టాలు ఏమిటంటే పిల్లలకి భావవ్యక్తీకరణలు [ఫీలింగ్స్] తెలియకుండా పోతాయి. అప్పుడు పిల్లలు సినిమా, టివీసీరియళ్ళలోని అతిభావప్రకటనలు [Extreme Expressions] ను అనుకరిస్తారు. అది చాలా ప్రమాదకరం. తెలుగు [మాతృభాష]ద్వారా మాత్రమే పిల్లలకి అనుభూతులని పరిచయం చేయగలము. కాబట్టి స్వానుభవంతో నేను తెలుసుకుందేమిటంటే తెలుగు భాష – తెలుగు పద్యాన్ని, తెలుగు కథలని విడిచిపెట్టి మనలేదని. మీ పాపాయిలకి ఒక్కసారి కరుణశ్రీ పుష్పవిలాసాన్ని ఘంటసాల వారి గొంతులో వినిపించి, అర్ధాన్ని విడమరిచి చెప్పండి. తెలుగు కథలని చెప్పండి, మీ పిల్లలు తెలుగు నేర్పమని మీ వెంటపడ్తారు.

తెలుగు భాష తీపి గురించి వ్రాయాలంటే ఇప్పటి వరకూ వ్రాసిన రాజకీయ వ్యాసాలన్నింటి కంటే పొడవాఆఆఆఆఆ……టి టపాలు ఎంచక్కా వ్రాసుకొని ఆనందించవచ్చు. కాకపోతే ఈ ఆదివారపు టపా నిడివి ఎక్కువుగా ఉండకూడదని ఇంతటితో ఆపేస్తున్నాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

1 comments:

"నల్లని వాడు , పద్మ నయనమ్ములవాడు" ఇది ఎప్పుడు విన్నా చదివినా, నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంది. కృష్ణమనాయుడు, గోపన్న, ధర్మరావు కలిసి కూర్చోవడం, ధర్మరావు ఈ పద్యంతో మొదలుపెట్టడం, గోపన్న మన వేణుగోపాలస్వామి అచ్చం ఇలాగే ఉంటాడు కదా అనడం, ముగ్గురూ నవ్వుకోవడం, రంగారావు ముసలిగుంపు అనుకోవడం, ధర్మరావును వయసులో ఉన్న ముసలివాడుగా అనుకోవడం. ---- ఇవన్నీ.

ఎక్కడిదీ ఈ సన్నివేశం అంటారా , మళ్ళీ "వేయిపడగలు" లోనిదే.
గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. భావ వ్యక్తీకరణ మాతృభాషలో జరగడం వల్ల ఒనగూరే ప్రయోజనాలు విష్ణుశర్మ చేత విశ్వనాధ చాలా బాగా చెప్పించారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu