ఇక ఇంటర్ ప్రకరణం తరువాత ఎంసెట్ ప్రకరణం ఉంటుంది. ఇప్పుడంటే ఇంజనీరింగ్ కాలేజీలు తామర తంపరగా రంగం మీదికొచ్చి, [ఎందుకిలా ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు పెరిగి పోయాయో క్రమానుగతంలో వివరిస్తాను] సీట్లు మిగిలిపోయేస్థితి ఉంది గానీ, అప్పటికి అంటే 2000 నాటికి ఇంజనీరింగ్ కి కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ గిరాకీగా నడుస్తుండేది. ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ లోనూ ICS [Intensive care Sections] ఉండేవి. ఆ సెక్షన్లలోకి బాగా చదివే పిల్లల్ని Promote చేస్తారు. అందుకు internal tests, week tests లో మార్కులు parameters గా చెబుతారు. ఆ సందట్లో ఇంకొందరు విద్యార్ధుల్ని కూడా ఆ సెక్షన్ల్ లోకి తోస్తారు. కొన్ని కాలేజీల్లో intensive batch లకి అదనపు ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టిన విద్యార్ధులని ఆ సెక్షన్లలో వేస్తారు. వాళ్ళకి అదనపు శిక్షణ ఇవ్వబడుతుందనీ, ప్రత్యేకశ్రద్ద చూపుతారనీ చెబుతారు. ఇవి పైకారణాలు మాత్రమే. ఆ సెక్షన్లలోని పిల్లలకి ఎక్కువమందికి మంచి ర్యాంకులు వస్తాయి. తదుపరి సంవత్సరాల్లో ఆ సెక్షన్లకి మరింత గిరాకీ ఏర్పడుతుంది. అలాంటి ప్రత్యేక సెక్షన్లలో కొందరు విద్యార్ధులు బాగా చదివే వారుంటారు. వారికి ఎటూ మంచిర్యాంకులు వస్తాయి. ఇంకొందరికి కాలేజీ యాజమాన్యాలు ర్యాంకులు కొంటాయి. ఇందులో విద్యార్ధుల ప్రమేయం గానీ, వారి తల్లితండ్రుల ప్రమేయం గానీ ఉండదు. కాలేజీ యాజమాన్యాలు, తమ స్వంత గణాంకాలు, విశ్లేషణలతో ఏయే విద్యార్ధులకి ర్యాంకులు ఇవ్వాలో నిర్ణయించుకుంటాయి. ఇక్కడ PRO ల పాత్ర గణనీయంగా ఉంటుంది. ఏయే ప్రాంతాల్లో మలిసంవత్సరం 10th ఎంతమంది వ్రాస్తారు, వారిలో ఇంటర్ కి కార్పోరేట్ కాలేజీల్లో చేరగలిగిన వారు ఎంతమంది ఉంటారు అన్న లెక్కలు ముందుగా కడతారు. ఇక ఆయా ప్రాంతాల నుండి ప్రస్తుతం తమ దగ్గర ఎందరు విద్యార్ధులు ఉన్నారు, వారిలో ఎవరెవరు ఏయే తరగతులు – అంటే Jr. Inter, Sr. Inter, Long term coaching, Intensive batch ల్లో ఉన్నారు లెక్కలు చూసుకుంటారు. అలాంటి విద్యార్ధుల్లో ఎవరెవరి తల్లితండ్రులకి ఆయా ప్రాంతాల్లో ఎంత పరపతి, పేరు ప్రఖ్యాతులు, ప్రభావం ఉన్నాయో చూసుకుంటారు. అంటే స్థూలంగా చెప్పాలంటే ఆయా ప్రాంతాల్లో ఏయే విద్యార్ధులకి ఎంసెట్ ర్యాంకులూ, ఇంటర్ లో మంచిమార్కులూ ఇప్పిస్తే, ఆ ప్రభావంతో తదుపరి సంవత్సరం తమకు ఎన్ని అడ్మిషన్లు వస్తాయి అన్న లెక్కమీదే ఇదంతా ఆధారపడుతుంది. అంటే ‘X’ అనే ప్రాంతంలో రామయ్య అనే పేరెంట్ కి పరపతి లేదా పేరుప్రఖ్యాతులు ఎక్కువగా ఉన్నాయనుకొండి. అంటే సదరు రామయ్య కొడుకుకు ర్యాంకు వస్తే, అది ఎక్కువ ప్రచారమై ఆ ప్రభావంతో తమకి ఎక్కువ అడ్మిషన్లు వస్తాయి అనుకుంటే, క్రమంగా రామయ్య కొడుకు లో డైరెక్టర్ లకి spark కన్పిస్తుంది. ‘ఫలానా విద్యార్ధి ప్రస్తుతం internal test లు బాగా వ్రాయకపోయినా, ప్రత్యేక శ్రద్దా, శిక్షణా ఇచ్చి సాన బెడితే బెస్ట్ ర్యాంకర్ అవుతాడు. మన కాలేజీకే ఓ asset అవుతాడు’ లాంటి వ్యాఖ్యలతో సదరు డైరెక్టర్లు ఆయా విద్యార్ధుల్ని IC Batch కి promote చేస్తారు. ఒకోసారి ఇందులో సహజత్వం కోసం ఆయా ప్రాంతాల్లోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్ధికి కూడా ఇలాంటి అవకాశం వస్తుంది. సహజత్వం ఎందుకంటే – తమ మోసం బయటపడకుండా ఉండేందుకు. ఎంసెట్ ఫలితాల తర్వాత ఈ ర్యాంకులు, అద్భుతాలు సాధించటం షరా మామూలే. దాంతో మరు సంవత్సరం అడ్మిషన్ల వెల్లువ వస్తుంది.

ఇక ఎంసెట్ ఫలితాలకు ముందు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు [బ్యూరోక్రాట్లు], ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు, మంత్రులు, కార్పోరేట్ కళాశాలల యాజమాన్యాల మధ్య వందల కోట్ల రూపాయలు చేతులు మారతాయి. కార్పోరేట్ కళాశాలల యాజమాన్యాలు ‘Top 10 లోపల ఎవరెన్ని ర్యాంకుల కొనుక్కోగలరు, Top 100 లో ఎన్ని, Top 1000 లో ఎన్ని, మొత్తంగా ఎన్ని ర్యాంకుల’ [అంటే Seat secured ranks అన్నమాట] అన్న డీల్స్ ని టెండరు పాడుకున్నంత స్థాయిలో కొనుక్కుంటారు. తర్వాత తాము కొనుక్కున్న Top 10 లోని ర్యాంకుల్ని, Top 100 లోని ర్యాంకుల్ని, Top 1000 లోని ర్యాంకుల్ని, PRO ల సాయంతో, తమ నెట్ వర్కు సాయంతో, తాము తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆయా విద్యార్ధులకి రప్పిస్తారు. అందుచేత ఎంసెట్ ఫలితాల్లో మనకి అద్భుతాలు, అసాధారణాలు కన్పిస్తాయి. ఒకోసారి బాగా చదవుతారని పేరున్న పిల్లలకి ర్యాంకులు రావు. ‘దురదృష్టమనో, మనమే సరిగా అంచనా వేసుకోలేక పోయామనో, విద్యార్ధి పరీక్ష పాడుచేసి ఉంటాడనో’ అనుకుంటారు విద్యార్ధులూ, వారి తల్లితండ్రులూ. ఒకోసారి బాగా చదవని విద్యార్ధులకి మంచి ర్యాంకులు వస్తాయి. ‘వాడి అదృష్టమనో, ఇది మనకు అర్ధంకాని matter అనో, మన పిల్లవాడే తన failure కప్పిపుచ్చుకోవడానికి ర్యాంకర్ గురించి, వాడు బాగా చదవడని చెబుతున్నాడమో’ అని విద్యార్ధుల తల్లితండ్రులు అనుకుంటారు. ఇవన్నీ గుడ్డివాళ్ళు ఏనుగుని తడమటం వంటిదే. అసలు ఏనుగు ఏమిటంటే మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ర్యాంక్ ఫిక్సింగ్ అన్నమాట. ఇది తెలియక కొందరు తల్లితండ్రులు ర్యాంకు తెచ్చుకోని తమ పిల్లల్ని ‘మీమీద వేలకు వేలు కుమ్మరించామనీ, చదవకుండా మమ్మల్ని మోసం చేసావని’ నిందిస్తారు. [కొందరు చదవని వాళ్ళూ ఉంటారు. నేను చదివేవాళ్ళ గురించి వ్రాస్తున్నాను] ఇవి భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధులున్నారు. నిజమేమిటంటే ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్ధుల్లో కూడా వారి ప్రతిభా ప్రమేయం కొంతశాతమే. యాజమాన్యపు స్ట్రాటజీకే అధికప్రమేయం. ఇవేవీ బయటకు రాకుండా ఉండేందుకు కార్పోరేట్ కాలేజీలు పిల్లల్ని ఊదరబెడుతూ ఉంటాయి. నిరంతరం స్టడీ పిరియడ్స్ అనీ, internal tests లనీ తెగ వత్తిడి చేస్తాయి. కనీసపాటి recreation గానీ, relaxation గానీ పిల్లలకి ఇవ్వవు. ఈ సంవత్సరం కష్టపడితే ఇక బ్రతుకంతా సుఖంగా ఉండచ్చు అంటాయి. Internal tests లో marks సరిగా లేవంటూ శిక్షలు వేస్తాయి. ఈ వత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులూ ఉన్నారు.

ఎంసెట్ పరీక్ష అనంతరం, ఫలితాల ప్రకటనకు ముందు ముఖ్యమంత్రులూ, మంత్రులూ, బ్యూరోక్రాట్లు, కాలేజీ యాజమాన్యాల మధ్య ర్యాంకు అమ్మకాల ఒప్పందాలు ఓ కొలిక్కి రాక, ఫలితాల ఆలస్యమైన సందర్భాలున్నాయి. ఈవిధంగా జరిగే ర్యాంకుల అమ్మకాల మూలంగా ఇంట్లో కూర్చొని చదువుకున్న విద్యార్ధులుగానీ, చిన్న లేదా గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులుగానీ Top 10 ల్లో లేదా Top 100 లో ర్యాంకులు పొందే అవకాశం ఉండదు. ఎందుకంటే అసలు ర్యాంకర్ల ఫలితాలలోనే కదా తమ విద్యార్ధులవి insert చేసేది! అందుచేత ఈ కార్పోరేట్ కాలేజీలు ఈ కుంభకోణం అలవోకగా చేస్తుంటారు. డబ్బు చేతులు మారుతుంది గనుక ప్రభుత్వ ఉన్నతాధికారులూ, రాజకీయనాయకులూ సహకరిస్తుంటారు.

ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. కార్పోరేట్ కాలేజీల్లో చాలా వాటిమీద ఈ విషయమై CBI కేసులున్నాయి. కాకినాడ ఆదిత్యా కాలేజీల [వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ కూడా పెట్టారు] వంటి ఉదాహరణలు కోకొల్లలు. అయితే ఏపార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఈ కేసులు మాత్రం పరిష్కరింపబడవు. దశాబ్ధాల తరబడి అలాగే ఉంటాయి. అలాగని మూత కూడా పడవు. ఎందుకంటే ఇలాంటి కేసులు ప్రభుత్వ ఉన్నతాధికారులకీ, రాజకీయ నాయకులకి ATM లాంటివి లేదా మనీ వెండింగ్ మెషన్లు వంటివి. ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు, ఒక నొక్కు నొక్కితే డబ్బు రాలుతుందన్న మాట. కాబట్టే బదిలీ మీద ఉన్నతాధికారులు మారినప్పుడల్లా, కొత్త పార్టీ అధికారంలోకి రావడమో లేక మంత్రివర్గ విస్తరణలో జరిగినప్పుడల్లా, ఆయా కాలేజీలకు అదనపు ఖర్చులు తగులు తుంటాయి. అవి పూడ్చుకునేందుకు సదరు కాలేజీలు తదుపరి సంవత్సరాల్లో మరింత అవినీతికి, మోసాలకి పాల్పడుతాయి. అలా అదో అవినీతి చక్రం, విషవలయం.

ఇలాంటి నేపధ్యంలో, ‘బి’ సెంటర్ల లోని చిన్న కాలేజీలకి ఇంటర్ పేపర్ లీకులే గాక క్రమంగా ఎంసెట్ ర్యాంకుల కుంభకోణమూ తెలిసింది. అవీ పోటీపడటం ప్రారంభించాయి. చిన్న కాలేజీల యాజమాన్యపు ధిక్కారణ ఎలా ఉండేదంటే ‘మీరేం చదువుచెప్పి ఫలితాలు సాధించడం లేదు. చేసేది dispute అయినప్పుడు అది మేమూ చెయ్యగలం’ అన్నట్లుంటుంది. కాబట్టి కార్పోరేట్ కాలేజీలకి వ్యతిరేకంగా చిన్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యపు సంఘాలు బలపడ్డాయి. దాంతో కార్పోరేట్ కాలేజీలకి, ప్రైవేట్ కాలేజీలకీ మధ్య ఘర్షణ నెలకొంది. రెండు వర్గాలూ రాజకీయనాయకుల దగ్గర, బ్యూరాక్రాట్ల దగ్గర, ఎవరి లాబీయింగ్ వాళ్ళు చేస్తున్నారు. కార్పోరేట్ కాలేజీలు పల్లెల్లో, చిన్న పట్టణాల్లో టాలెంట్ టెస్ట్ లు పెట్టడాన్ని ప్రైవేట్ కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. 2000 సంవత్సరం, మే చివరివారంలో సూర్యాపేటలో నెల్లూరు నారాయణ కాలేజీ టాలెంట్ టెస్ట్ పెట్టటం, దాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేటలోని ప్రైవేట్ కాలేజీలు, త్రివేణి కాలేజీ యాజమాన్యం, పరీక్షాకేంద్రం గోడలు దూకి ప్రశ్నపత్రాలు చించి, నారాయణ కాలేజీ సిబ్బందిని కొట్టటం, దాంతో పోలీసు కేసులు అవ్వటం జరిగింది. ఈ వివరాలన్నింటితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరసగా 20 దాకా ఫిర్యాదులు వ్రాసాను. ఫిర్యాదు చేసినందుకు త్రివేణి కాలేజీ వాళ్ళు [అప్పటికి అదే నమ్మాను] నన్ను వేధించటం, నేను ఫిర్యాదులు కొనసాగించటం జరిగింది. ఆ వివరాలు తర్వాత టపాలలో చెబుతాను. ప్రస్తుతానికి కార్పోరేట్, ‘బి’ సెంటరు కాలేజీలు చేసే ఎంసెట్ ర్యాంకుల మోసాన్ని పూర్తిగా వివరిస్తాను.

ఈవిధంగా విద్యార్ధులకీ, వారి తల్లితండ్రులకు కూడా తెలియకుండా, విద్యార్ధి తెలివితేటలు, పరిశ్రమ ప్రమేయం తక్కువా, తమ ఆర్ధిక కారణాల ప్రమేయం ఎక్కువ ఉండే "ర్యాంకు ఫిక్సింగ్ కుంభకోణం కార్పోరేట్ కాలేజీలు చేసే class dispute అయితే, ‘B’ సెంటర్లలోని ప్రైవేట్ కాలేజీలు ఇదే ర్యాంకుల కుంభకోణం లో చేసేది Mass dispute. దీని తీరుతెన్నులు మరింత దిగ్ర్భాంతికరంగా ఉంటాయి.

కార్పోరేట్ కాలేజీల్లో ఎంసెట్ ర్యాంకుల కొనుగొళ్ళు, విద్యార్ధులకీ వారి తల్లితండ్రులకే కాదు, కాలేజీ సిబ్బందికీ, లెక్చరర్లకీ కూడా తెలియనంత గుంభనంగా జరుగుతుంది. అయితే ‘B’ సెంటర్లలో ఇదే ఎంసెట్ ర్యాంకుల అమ్మకాలు తమకి బాగా తెలిసిన విద్యార్ధుల తల్లితండ్రులతో “మీరు కార్పోరేట్ కాలేజీలకి మీపిల్లల్ని పంపినా వాళ్ళేం cream sections లల్లో పడరు. IC Batch లో చేర్చినా మీకు 40,000/- రూ. ఫీజు, ఆపైన పండగ పబ్బాలకీ, సెలవులకీ పిల్లల్ని తెచ్చుకునీ, దిగవిడిచీ ఖర్చు, ఫోన్ల ఖర్చు, మెటీరియల్ ఖర్చు ఇవన్నీ కలిసి మరో 40,000/- Rs. తప్పుకుండా అవుతుంది. అట్లయ్యీ ర్యాంకు వస్తుందన్న గ్యారంటీ లేదు. అదే మాకు లక్ష రూపాయలు ఇవ్వండి. మీరు కోరుకున్న బ్రాంచీలో ఇంజనీరింగ్ సీటు వచ్చేటటు వంటి ర్యాంకు మేం ఇప్పిస్తాం. ఇప్పించేలేకపోతే 10,000/- రూ. ఖర్చులకు మినహాయించుకొని 90,000/- రూ. తిరిగి ఇచ్చేస్తాం. ఎటూ కార్పోరేట్ కాలేజీలు చేసేది కూడా ఇదే. కానీ అక్కడైతే మీరు నోరెత్తి ఏదీ అనలేరు. వాళ్ళు ర్యాంకు ఇప్పిస్తే ఇప్పించినట్లు, లేకుంటే లేదు. మీరడిగితే ‘మీ పిల్లవాడే సరిగా చదవలేదు. మేమేం చేస్తాం’ అంటారు. అదే మేమయితే గ్యారంటీగా ర్యాంకు ఇప్పిస్తాం” అంటాయి. అలాగని ‘B’ సెంటర్లలోని అన్ని కాలేజీలు ఈ dispute చేయలేవు. మహాఉంటే ఒకటో రెండో కాలేజీలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువమంది విద్యార్ధులని కలిగిఉన్న కాలేజీలు మాత్రమే ర్యాంకుల కొనుగోళ్ళ వ్యవహారంలోకి దిగగలవు.

చాలామంది మధ్యతరగతి తల్లితండ్రులు వ్యాపారం, వ్యవసాయం, ఇతర రంగాలకి చెందినవారు. వారికి తమ పిల్లలు ఇంజనీర్లయితే చాలు. ఉద్యోగాలు వాటాంతట అవే వస్తాయి అనుకుంటారు. కొందరు తల్లితండ్రులు తమ పిల్లలు డాక్టరో, ఇంజనీరింగో చేయకపోవటం పరువుకి సంబంధించిన విషయంగా పరిగణిస్తారు. కొందరు చదువుకోని తల్లితండ్రులు పదిమంది ఎటు ప్రయాణిస్తే అటు పోయేవారు. ఇలాంటి వారందరినీ ‘B’ సెంటర్లలోని ప్రైవేట్ కాలేజీలు capture చేస్తాయి. ఇది జరుగుతుందా, అలా ర్యాంకులు కొనే తల్లితండ్రులుంటారా అనుకోకండి. లేకుండానే యాజమాన్యకోటాలో సీట్లు అమ్ముడుపోవుకదా! స్వయంగా మేము, కొందరు తల్లితండ్రులతో ‘ఎంసెట్ కుంభకోణం ఇలా జరుగుతుంది’ అంటే ‘మనకేమైనా అవకాశం ఉంటుందా’ అని అడిగిన తల్లితండ్రుల్ని చూశాము.

సూర్యాపేట వంటి ‘బి’ సెంటర్లలో ఈ విధమైన ర్యాంకుల అమ్మకం విచ్చలవిడిగా జరిగింది. భారీగా తల్లితండ్రులు డబ్బు బయటకు తీయటం, కొందరు అప్పులు కూడా చేయటం చర్చనీయాంశమైంది. ఒక్క ఎంసెట్ మాత్రమే కాదు, బి.ఎడ్. ర్యాంకులూ, సీట్లు వ్యవహారంలో కూడా ఇదే తంతు. మామూలుగా డబ్బు అప్పు తీసుకొని ఎగ్గొడతారేమో గానీ, ఈ ర్యాంకుల విషయమై తీసుకున్న డబ్బు, ర్యాంకు రాకపోతే ‘నిజాయితీ’గా 10% మినహాయించుకొని, మిగిలినది వాపసు చేస్తారు. అది చూసి మేం ‘ఇక్కడ మంచిలో కన్నా చెడులోనే గుడ్ విల్ ఎక్కువ కాబోలు’ అనుకున్నాము.

ఈవిషయాలన్నీ ఒక్కొక్కటే మా పరిశీలనకి వచ్చే కొద్దీ, అన్నిటిని అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి ఫిర్యాదులు రూపేణా తీసికెళ్ళాము. మొదటి ఫిర్యాదు ఇచ్చిన మూడు నెలలు వరకూ మేం కొంత ప్రశాంతంగా ఉన్నాము. తర్వాత ఊపిరి తిప్పుకోనివ్వనంతగా సమస్యలు చుట్టుముట్టాయి. తొలి ఫిర్యాదు ఇచ్చాక కొద్ది రోజులకి నల్గొండ నుండి ఓ కాలేజీవాళ్ళు మమ్మల్ని approach అయ్యారు. రోజుకి 8 గంటలు టీచింగ్ అవర్స్ చెప్పాలని, లక్షాఏభైవేల రూపాలయదాకా ఇస్తామనీ, తక్షణమే 50,000/- రూ. అడ్వాన్సుగా ఇస్తామనీ, జాబ్ డీల్ పెట్టారు. ‘ఆలోచించి చెబుతాం’ అన్నాము మేము. ‘ఎక్కడికెళ్ళినా ఇదే పోరాటం అయినప్పుడు ఊరూరూ తిరగటం ఎందుకు? ఇదే చోట నిలబడి పోరాడదాం’ అనుకున్నాము. దాంతో వారి ప్రతిపాదనకు ‘నో’ చెప్పాము. దాంతో వారు “పోనీ మీకు రెమ్యూనరేషన్ నచ్చకపోతే ఎంతకావాలంటే అంత అడగండి” అన్నారు. అయినా తిరస్కరించాము. ఆలోచించమంటూ వారి ఫోన్ నంబరు ఇచ్చి వెళ్ళారు. మేము ఆ విషయం పట్టించుకోలేదు.

కొద్ది కాలం తర్వాత మరొక వ్యక్తి, మా ప్రక్కింటి అతనితో వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు. ‘తాను మెదక్ జిల్లా సిద్దిపేటలో గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ నని, మీరు మేనేజ్ మెంటు చూసుకుంటే చాలని. బాగా చెప్పే లెక్చరర్స్ గా పేరుంది గనుక ఆ రెప్యూటేషన్ చాలనీ, వర్కింగ్ పార్ట్ నర్ షిష్ ఇస్తామనీ, ర్యాంకులు, మార్కులూ తెచ్చుకోవటం గట్రా పైవిషయాలన్నీ తాము చూసుకుంటామనీ, మీకు ఏవిధమైన బాదర బందీగానీ, రిస్క్ గానీ ఉండదనీ, కాలేజీకి మంచి పేరుప్రఖ్యాతులు ఉండేందుకు మీరు విద్యాబోధన, క్రమశిక్షణ మొదలైన వ్యవహారాలు పర్యవేక్షిస్తే చాలనీ, ఎంతశాతం వాటా కావాలో చెబితే డీల్ కుదుర్చుకుందామనీ ’ ప్రతిపాదించాడు.

‘అవకాశం రానంతవరకూ నీతులు వల్లించి, అవకాశం రాగానే అదే అవినీతి మనమూ చేయటం పరమనీచం’ అనిపించింది మాకు. అంతేగాక ‘దేశానికి మేలు చేయకపోయిన ఫర్వాలేదు, కీడు చేయకపోతే చాలు’ అన్న మాసిద్ధాంతానికి కట్టుపడి, నిర్ధ్వంద్వంగా, ఆక్షణమే, “అలాంటివి మాకు సరిపడవు లెండి” అంటూ తిరస్కరించాము. అతడు మాకు చాలా నచ్చచెప్పబోయాడు. సున్నితంగానే అయినా ఖచ్చితంగా కుదరదని చెప్పేశాము. అంతేకాదు, ఎవరితోనైనా [అది మన బాస్ కానివ్వండి, కొలీగ్ కానివ్వండి, పొరుగు వాడు కానివ్వండి] మనకి సరిపడలేదనుకొండి. వారినుండి దూరంగా పోతాం. బాస్ నచ్చకపోతే ఉద్యోగం మారతాం, కోలీగ్స్ నచ్చకపోతే avoid చేస్తాం, పొరుగువాడు నచ్చకపోతే ఇల్లు మారతాం లేదా ముఖం తిప్పుకుంటాం. మనతో మనకి సరిపడకపోతే? ఎక్కడికి పారిపోగలం? మనకి ప్రపంచం మొత్తంతో సంఘర్షణ ఉన్నా ఫర్వాలేదు. మనతో మనకి ఘర్షణ లేకపోతే చాలు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా సంతోషంగా ఉండచ్చు. సుఖం లేకపోయినా, సంతోషం మాత్రం ఖచ్చితంగా మనతోనే ఉంటుంది. ఎందుకంటే ఆత్మతృప్తి ఉంటుంది గనుక. అలాగాక మనతో మనకి సరిపడకపోతే బ్రతుకు ‘త్రిపురనేని గోపిచంద్’ గారి ‘అసమర్ధుని జీవయాత్ర’లోని ‘సీతారామారావు’ అయిపోతుంది. అందుచేత కూడా మేం ఆ ప్రతిపాదనని పూర్తిగా తిరస్కరించాము.

మా విద్యార్ధులకి, వారి తల్లితండ్రులకీ ఒకటే చెప్పాము. “ఈ మార్కులూ, ర్యాంకులూ, సర్టిఫికెట్లు కూడా ఫీల్డ్ లోనికి ప్రవేశించటానికి అవసరమైన ఎంట్రీ టిక్కెట్ వంటివి. ఒకసారి ప్రవేశించాక ఇకవాటి ప్రాముఖ్యత, విలువ అంతవరకే. ఫీల్డులో నిలదొక్కుకోవాలన్నా రాణించాలన్నా సబ్జెక్ట్ మీద పట్టు, అవగాహన అవసరం. ఎవరైనా ర్యాంకులూ, మార్కులూ కొనుక్కోగలరేమో రేపు ఉద్యోగాలు కొనుక్కోలేరు గదా? ప్రభుత్వ ఉద్యోగాల విషయం తీసేయండి, అవి కొనుక్కోవచ్చు. కానీ ఏ పార్టీ అధికారంలో ఉండనీయండిగాక టీచర్స్, డాక్టర్స్, పోలీసు ఉద్యోగాలు తప్ప మిగిలిన ఉద్యోగాలు భర్తీచేయవు. కాంట్రాక్టు ఉద్యోగాలు తప్ప పర్మినెంటు ఉద్యోగాలు లేవు. కనుక ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు తప్ప గత్యంతరం లేదు. ప్రైవేట్ కంపెనీల్లో మీ ప్రతిభ, పనిసామర్ధ్యంలకే ప్రాధాన్యం కానీ మీ సర్టిఫికేట్లు, అందులో మార్కులకి కాదు. కాబట్టి ర్యాంకులూ, మార్కులూ కొనుక్కున్నా కూడా సబ్జెక్టు కూడా నేర్చుకొండి. లేకుంటే జీవితంలో నష్టపోతారు. ఇప్పుడు మేం పాఠాలు సరిగా చెప్పలేని అసమర్ధులమై ఉంటే, మా సర్టిఫికెట్లని ఎంత ఎన్ లార్జి చేసి ఫ్రేములు కొట్టి తగిలించినా మీరు మాకు ఫీజు కట్టి మాదగ్గర ట్యూషన్ చెప్పించుకోరు కదా! ప్రైవేటు కంపెనీలైనా అంతే. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకొండి” అని చెప్పేవాళ్ళం.

ఈ నేపధ్యంలో కొత్తగూడెంలోని ఓకాలేజీ రహదారిపై పెట్టిన పెద్ద హోర్డింగ్ చూశాము. అందులో సదరు కాలేజీ వారు తమ విద్యార్ధికి 997 మార్కులు రావడాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. జూనియర్, సీనియర్ కలిపి 12 పేపర్లు. దాదాపు అన్నింటిలో నూటికి నూరు వస్తేగానీ ప్రాక్టికల్స్ పోను వెయ్యికి 997 మార్కులు రావు. సీఫెల్ లెక్చరర్స్, సురేషన్ గారు వ్రాసినా ఇంగ్లీషు వంటి భాషా పరీక్షల్లో నూటికి నూరు శాతం మార్కులు రావు. మేమూ ఎన్నోరకాలుగా ఆలోచించాము. ‘అసలు ఇలాంటి నేపధ్యంలో ముందటి సంవత్సరంలో [1999] అక్కడి విద్యార్ధులకి 126 ర్యాంకు, ఇతర ర్యాంకులు ఎలా వచ్చాయబ్బా’ అని సందేహం కలిగింది.

ఈ మతలబు వెనుక రహస్యం ఏమిటంటే – కార్పోరేట్ కాలేజీలు Top 10, Top 100, Top 1000 ర్యాంకుల కొనుగోళ్ళు చేసేటప్పుడు ముందుగా తమ విద్యార్ధులకు సహజంగా వచ్చిన ర్యాంకుల్లో కొన్నింటిని యధాతధంగా ఉంచుతారు. అలా సహజత్వం కొంత చెడకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. అలాగే కొన్ని మారుమూల ప్రాంతాల్లోనూ, ‘B’ సెంటర్లూ, ‘C’ సెంటర్ల వంటి ప్రదేశాల్లోనూ [ఒకో సంవత్సరం ఒకో ప్రాంతంలో] సహజ ఫలితాలని కొన్నిటిని వదిలేస్తారు. అప్పుడు ఆయా చిన్న పట్టణాల్లో, తల్లిదండ్రులకి తమ కళ్ళెదుట చదువుకున్న, చిన్న కాలేజీల్లో చదువుకున్న పిల్లలకు ర్యాంకులు వస్తాయి. దాంతో ఆ ప్రాంతంలో ఎంసెట్ ఓరియంటేషన్ సృష్టింపబడుతుంది. అంటే తమ పిల్లలూ తెలివైన వాళ్ళే, తక్కువఖర్చుతో, చిన్నకాలేజీల్లో చేరినా, తమపిల్లలూ ర్యాంకులు సాధించగలిగారు అనుకోగానే, ఆ ప్రాంతంలోని మరికొందరు తల్లితండ్రులకి తమ పిల్లల భవిష్యత్తు పట్ల ఆశా, నమ్మకం కలుగుతాయి. దాంతో ఎంసెట్ ఓరియంటేషన్ క్రియేట్ అవుతుంది. క్రమంగా అక్కడి విద్యావ్యాపారం పుంజుకుంటుంది. ముందుగా ఓరియంటేషన్ సృష్టింపబడితే, తల్లితండ్రుల్లో తమ బిడ్డల భవిష్యత్తు పట్ల మొలకెత్తిన ఆశ, ఆస్థులు అమ్ముకునైనా పిల్లల్ని పెద్దకాలేజీల్లో చేర్పించేవైపుకి మరలింపబడుతుంది. అంటే క్రమంగా [effort] ప్రయత్నం పెరుగుతుంది. కాబట్టే కార్పోరేట్ కళాశాలలు ఎంసెట్ ర్యాంకు ఫిక్సింగ్ ల విషయంలో రహస్యాన్ని కాపాడటానికి, సహజత్వపు రంగులు అద్దడానికి ఎంతో ప్రయత్నిస్తాయి.

అయితే చిన్న కాలేజీలకి ఈ రహస్యం తెలిసిపోవటంతో విద్యారంగంలో కార్పోరేట్ కాలేజీలకీ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యపు సంఘాలకి తెర వెనుక సంకుల సమరం మొదలయ్యింది. 2000 తర్వాత నుండీ 2009 వచ్చేసరికి ఈ పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యింది. వివరంగా చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

విద్యా వ్యాపారం గురించి ఇంత విపులంగా చర్చిస్తున్నందుకు అభినందనలు.

మీరు ఈ టాపిక్ గురించి పూర్తి స్థాయిలో ఒక పుస్తకం రాయండి. మేడి పండు బద్దలౌతుంది.

మీ వివరణ అద్భుతం. మీ ఒపికకు అభినందనలు. ఫ్రజలలొనె అవినీతి తారాస్తాయిలొ వుంది. తప్పు ప్రజలదె కాని మరెవరిది కాదు. మోసపొయెవాడు వున్నప్పుడె మోసగించెవాడు వుంటాడు.

యన్.సీతారాంరెడ్డి గారు,

ఈ మోసం, కుంభకోణం మీకు వివరంగా అర్దమౌతుంది కదా! మనందరికీ అర్ధమౌతునే ఉంది. కానీ CBCID, అప్పటి IG[2007,MARCH], కృష్ణరాజ్ కి మాత్రం అర్ధంకాలేదు. "మీరేం వ్రాసారో నాకే అర్ధం కాలేదు. ఇక ఒక సి.ఐ.కి ఏమర్ధమౌతుంది?" అన్నాడు. వాళ్ళెవరికీ Dispute గానీ, దాని పర్యవసానాలు గానీ అర్ధంకావటం లేదు. అదీ అసలు విచిత్రం లేదా అద్భుతం!

ర్యాంకు రావాలి, ఎలా అనేది అనవసరం. డబ్బుతో ఏది అయినా సంపాదించవచ్చు

ప్రభుత్వం, అధికారులే కాదు. ఈ విషయంలో ప్రజలు అందరూ కళ్ళు తెరవాలి. చర్చను ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి.

ఇకపోతే మీరు వాడిన Dispute పదం సరిపోదేమోనని నాకు అనిపిస్తుంది.

well said

అద్భుతమండీ. ఎప్పుడో ముప్పయ్యేళ్ళ క్రితం నేను ఇంటరు చదివినప్పుడు నా క్లాసుమేటొక స్థానిక డీఎస్పీ కొడుకు. వాళ్ళనాన్న పది వేలు పెట్టి తనకి రేంకు కొన్నాడని తనే సగర్వంగా చెప్పాడు.

చూశారండి! రేట్లు ఎంతగా పెరిగిపోయాయో!

అద్దేపల్లి రామమోహన రావు గారు సంకలనం చేసిన "గీటు రాయి" రెండవ భాగంలో ఒక కవిత చదివాను. అందులో ప్రతిభ అనేది డబ్బున్న వాడినే కౌగిలించుకుంటోదని కవి ఆవేదన వ్యక్తం చేశాడు. అది ఎందుకో కొత్తపాళి గారు వ్రాసినది చదివిన తరువాత నాకు వివరంగా అర్థమయ్యింది.

96 లో ఎంసెట్ పేపర్ లీక్ అవ్వడం వలన రేండో సారి పెట్టారు పరీక్ష. అలా రెండోసారి రాసిన వాళ్ళలో నేనొకడిని. రెండేళ్ళు నిద్రాహారాలు సినిమాలు మానేసి చదివితే చివరకి అది కాస్తా లీక్ అవ్వడం వలన చాలా బాధకలిగింది. రెండోసారి అంతగా చదవలేదు.. 3200+ ర్యాంక్ వచ్చింది. అప్పట్ట్లో ఇన్ని కాలేజిలు లేవు .. మళ్ళొసారి రాద్దాం అని 97 లో తిరిగిరాసాను. ఆ ఒక్కసారి ఎంసెట్ రెండు రోజులు, వ్యాసాలతో జరిగింది. multiple choice lottery కంటే అదే ఉత్తమం అనిపించింది. వ్యాసాలు, సుధీర్ఘ జవాబులు వ్రాయడం వలన చాలామంది ఇబ్బంది పడ్డారు కాని చాలా చాలా మందికి ఆ పద్ధతే నచ్చింది (మా స్నేహితుల్లో). 97 లో 1800+ ర్యాంక్ రావడం తో హైదరాబాదు లోనే సీటు వచ్చింది. అప్పటికి నా inter + ఎంసెట్ కోచింగ్ అంతా కలిపి 30,000 అయ్యింది రెండేళ్ళకి.

మొదటి సారి అంటే 96 ఎంసెట్ కి చాలా కష్టపడి చదివాను. రెండవసారి.. అంటే మూడోసారి (97) లో ఎంసెట్ కి చాలా jolly గా చదివాను. కార్పొరేటె కళశల లో చదవలేదు. :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu