ఏదైనా గుప్పిలి మూసి ఉన్నంత వరకే రహస్యం. అందుకేనేమో ‘పెదవి దాటితే పృధివి దాటుతుంది’ అంటారు పెద్దలు. ఈవిధంగా ‘ఇంటర్ మార్కులు, ఎంసెట్ ర్యాంకుల మోసాలు ఎలా చేయాలి’ అన్న రహస్యం క్రమంగా బట్టబయలు కావటంతో ప్రైవేటు చిన్న కాలేజీలు, కార్పోరేట్ కాలేజీల మధ్య తెరవెనుక యుద్ధం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల నుండి, నగరాల్లోని కార్పోరేట్ కాలేజీలకి వెళ్ళె విద్యార్ధుల్ని, గణనీయమైన సంఖ్యలోనే, ప్రైవేటు కాలేజీల [అంటే చిన్న కాలేజీలన్న మాట] వాళ్ళు ఆపగలగటం, ఆకర్షించి తమ కాలేజీల్లోనే చేర్చుకోగలగటం ఎక్కువైంది. సహజంగానే కార్పోరేట్ కాలేజీల్తో పోలిస్తే ఫీజులు తక్కువగనుక, అందుబాటులోనూ, దగ్గరలోనూ ఉన్నాయి గనుకా, ఫలితాలూ బాగానే కన్పిస్తున్నాయి గనుకా గ్రామీణ విద్యార్ధులూ, వారి తల్లితండ్రులూ ప్రైవేట్ చిన్నకాలేజీల వైపే మొగ్గు చూపసాగారు. ఈ దశలో అప్పటి ప్రభుత్వాలు [కేంద్ర, రాష్ట్ర] ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య, సీట్ల సంఖ్య బాగా పెంచాయి. దరిమిలా కొన్ని కార్పోరేట్ కాలేజీల వారు ఇంజనీరింగ్ కాలేజీలూ తెరిచారు. [విఙ్ఞాన్, నారాయణ, ఆదిత్యా వంటివి ఇందుకు ఉదాహరణలు] ప్రభుత్వానికీ అది అదాయవనరు గనుకా, మారుతున్న ప్రపంచీకరణ నేపధ్యంలో అవసరంగనుకా, అవసరమన్న పైకారణమూ బాగుంది గనుకా, ప్రభుత్వాలు కూడా యధేచ్ఛగా ఇంజనీరింగ్ కాలేజీలకి అనుమతులు ఇచ్చేసాయి. [ఇక్కడ వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అన్న వార్తలు అందరం పేపర్లలో చదివిందే.] ఇది మొదట కార్పోరేట్ కాలేజీలకీ, ప్రైవేటు చిన్న కాలేజీలకి కూడా కొంత వెసులు బాటు నిచ్చింది. అయితే సీట్ల లభ్యత ఎక్కువుగా ఉండటంతో ఇంజనీరింగ్ కి లాంగ్ టర్మ్ గిరాకీ తగ్గింది. ఇంటర్ తోనే డైరెక్టుగా ఇంజనీరింగ్ ర్యాంకులు అన్న స్లోగన్ ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఈ మొత్తం వ్యవహారంలో గమనించండి. ర్యాంకులూ, మార్కుల గురించిన హోరే గానీ, విద్యానాణ్యత, బోధనా సిబ్బంది సామర్ధ్యమూ, క్రమశిక్షణ, వసతి సౌకర్యాలు – ఇవన్నీ నామ మాత్రమే. వారి వాణిజ్య ప్రకటనల్లో అవి షరామామూలు వాక్యాలు. ప్రాధాన్యమంతా ర్యాంకులూ మార్కుల రికార్డుల గురించే. మొదట గణితంలో దీప్తి పబ్లికేషన్స్, ఫిజిక్స్ లో చలపతిరావుగారి పుస్తకం వంటి క్లిష్టమైన మెటీరియల్స్ చెప్పలేక కార్పోరేట్ కాలేజీలు తమ స్వంత మెటీరియల్స్ అంటూ ఇవ్వటం మొదలుపెట్టాయి. అయినా గానీ చాలామంది మంది పిల్లలు తమ స్వంతగా దిప్తీ పబ్లికేషన్స్, చలపతిరావు గారి పుస్తకాలు ప్రాక్టీస్ చేస్తు ఉండేవారు. ఈకార్పోరేట్ కాలేజీలు, తమ విద్యార్ధులకు ఆ మెటీరియల్స్ వాడవద్దని ఎంతగా చెప్పిన విద్యార్ధులు మాత్రం ఆ మెటీరియల్స్ నే స్టాండర్డ్ గా తీసుకొని ప్రాక్టీసు చేసేవారు. క్లిష్టమైన మెటీరియల్స్ చెప్పేందుకు తగినంత మంది లెక్చరర్స్ ని సమకూర్చుకోలేక, పిల్లలందరి చేత పరిశ్రమ చేయించలేక క్రమంగా కార్పోరేట్ కాలేజీల యాజమాన్యాలు లాబీయింగ్ చేసి ఎంసెట్ స్టాండర్డ్స్ పడేసాయి. దాదాపుగా దీప్తి పబ్లికేషన్స్, చలపతి రావుగారి పుస్తకం వంటి క్లిష్టమైన మెటీరియల్స్ కనుమరుగైపోయాయి. అకాడమీ మెటీరియల్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులోనుండే ప్రశ్నలు వస్తాయి అని ప్రచారం మొదలైంది. అదిదాటి ప్రశ్నలు అడగకూడదని ఖరారయ్యింది. అందులోనూ అకాడమీ మెటీరియల్ లో సిద్దాంతపరమైన ప్రశ్నలు [Theory based] ఎక్కువుగా ఉంటాయి. వాటికి జవాబిచ్చేందుకు బట్టివేయటం, ఙ్ఞాపకం ఉంచుకోవటం వంటి పద్దతులు అనుసరిస్తే చాలు. ఆలోచించనక్కరలేదు, నేర్చుకున్న సిద్దాంతాలనీ, శాస్త్రవిషయాలనీ అనువర్తించనక్కరలేదు. కాబట్టే ఫిజిక్స్ వంటి సబ్జెక్టులలో గణించవలసిన లెక్క రూప ప్రశ్నలు తగ్గిపోయాయి. 2000 నాటికి ఎంసెట్ లో 200 ప్రశ్నలకు 180 నిమిషాలలో జవాబివ్వవలసిఉంది. విద్యార్ధి సగటున 54 సెకన్లలోఒకో జవాబు చొప్పున చేయవలసి ఉండేది. అంతకొద్ది వ్యవధిలో ప్రశ్న చదవాలి, అర్ధం చేసుకోవాలి, గణితరూప ప్రశ్న అయితే లెక్క చేసి జవాబు ఏ ఐచ్చికంలో [choice లో] ఉందో చూసుకొని OMR లో ఆ గడిని పెన్సిల్ తో డార్క్ చేయాలి. ఇంత ప్రక్రియ ఉంటుంది. అందుకు విద్యార్ధికి వేగంగానూ, సరిగ్గానూ జవాబులు రాబట్టగల, గుర్తించగల నైపుణ్యం కావాల్సి ఉండేది. 2000 తర్వాత 3 గంటలు అంటే 180 నిముషాల్లో 160 ప్రశ్నలకు జవాబులు వ్రాసేట్లు ఎంసెట్ ప్రశ్నాపత్రం కుదించబడింది. విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించటానికి అన్న పైకారణం [over leaf reason] చెప్పబడింది.

ఆవిధంగా విజయవంతంగా విద్యాప్రమాణాలు పడవేయటం జరిగింది. ఇది దశాబ్ధాలుగా జరుగుతున్న కుట్రే. డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేసి, హాజరు ఆధారంగా పైతరగతికి విద్యార్ధుల్ని అనుమతించే విధానాన్ని ప్రవేశపెట్టి, ఆనాటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మనందరెడ్డి దీనికి నాంది పలికాడు. తరువాత స్టాండర్డ్స్ పెంచారు, టీచర్లకి శిక్షణ నివ్వలేదు. ఆ సమయంలో లిబరల్ గా ఎగ్జామ్ పేపర్స్ దిద్దమని టీచర్లకీ సంకేతాలిచ్చారు. నాటి నుండి అనుశృతంగా ఇది అన్ని కోణాల్లో, అన్ని తరగతుల్లో జరుగుతూనే పోతుంది. ఇది ఒక్క AP లోనే కాదు ఇండియా అంతా ఇంతే.

గమనించి చూడండి. ఇప్పటికి కనీసం 25 సంవత్సరాలుగా ఆయా సంవత్సరాల్లో స్టేట్ ర్యాంకర్లుగా పత్రికల్లో పతాక శీర్షికల నలంకరించిన విద్యార్ధులూ, ఆయా కాలేజీల ప్రచారాస్త్రాలుగా ఉపయోగింపబడ్డ విద్యార్ధులు ఇప్పటికి ఏవో వృత్తుల్లో, ఉద్యోగాల్లో స్థిరపడి ఉండాలిగా! వారు అదే స్థాయిలో ప్రతిభ చూపి పేరుప్రఖ్యాతులు పొందాలిగా? ఏదీ వారి చిరునామా? ఇంకా ఎంసెట్ లో మామూలు ర్యాంకులూ, ఇంటర్ లో సాధారణ మార్కులు సంపాదించుకున్న విద్యార్ధులే ఎక్కువగా ఈరోజు మంచి ఇంజనీర్లుగా, నిపుణులుగా తమతమ రంగాల్లో నిలదొక్కుకుంటున్నారు. ఎందుకంటే ఆయా వ్యక్తుల సామర్ధ్యం వారి పనితీరులో ఉంటుంది గానీ, సర్టిఫికేట్లలోని ర్యాంకుల్లోనూ మార్కుల్లోనూ ఉండదు గనుక.

వాస్తవానికి విద్యారంగంలోని ఈ కుంభకోణాన్ని కేవలం అవినీతిగా గుర్తించటం చాలా పొరపాటు. ఎందుకంటే ఈవిధమైన అవినీతి, కుంభకోణాలతో కూడిన నాసి విద్యతో కొన్నేళ్ళకి విద్యాప్రమాణాలు పూర్తిగా దిగజారిపోతాయి. ఇప్పటికే దిగజారి పోయాయి. కొన్ని దశాబ్ధాల తర్వాత విద్యాసంస్థలలో బాగా చెప్పగల సిబ్బందికీ కరువు ఏర్పడుతుంది. చదవగల విద్యార్ధులకీ కరువు వస్తుంది. శ్రమించగల ఉపాధ్యాయులూ/ అధ్యాపకులూ ఉండరు, విద్యార్ధులూ ఉండరు. ఇలా బయటకి వచ్చిన విద్యార్ధులే రేపు వివిధ వృత్తుల్లోకి వస్తారు. పెరిగి పెద్దై, పౌరులుగా అవుతారు. అయితే ప్రయోజకులూ, సమర్ధులుగా అవుతారా? సహజంగా తెలివైన వాళ్ళు, సమర్ధులూ ఈ ర్యాంకుల, మార్కుల అవినీతిలో వడపోయబడి ఓటమి చెందుతారు. సమాజంలో క్రింది స్థాయిలో ఉండిపోతారు. సమర్ధుతకూ, నైపుణ్యాలకు సరైన గుర్తింపు రాక వక్రమార్గాలు పడతారు. లేదా నిరాశా నిస్పృహలతో కృశించి నశిస్తారు. లేదా మనోవికారాలకు గురవుతారు. వ్యసనపరులుగానో, మరోరకంగానో మారతారు. చివరికి జీవితంలోనూ ఓడిపోతారు. ఎందుకంటే వ్యక్తి కంటే వ్యవస్థ బలమైనది గనుక. అసలు ప్రమాదాన్నే సరిగ్గా గుర్తించలేకపోతున్నారు గనుక.

అలాగే మార్కులూ, ర్యాంకులూ, సర్టిఫికేట్లతో పైస్థాయికి వచ్చిన వారిలో సత్తా ఉండదు. ఇది సరిగ్గా రామాయణంలో శ్రీరాముడు భరతుడికి బోధించిన ప్రభుత్వ Administration విధానానికీ, భారతంలో నారదుడు ధర్మరాజుకి బోధించిన ప్రభుత్వ administration విధానానికీ వ్యతిరేకము, విపర్యయము. ఈ స్థితి ఇలాగే కొనసాగితే మన సమాజంలో కొన్నేళ్ళ తర్వాత ఏరంగంలోనైనా సమర్ధులూ, పనిచేయగల సత్తా ఉన్నవాళ్ళు తక్కువుగా ఉంటారు. చివరికి సైన్యంలో కూడా. ఎందుకంటే బాల్యం నుండీ మన విద్యావిధానం విఙ్ఞానాన్ని, వ్యక్తిత్వాన్ని, పని సామర్ధ్యాన్ని నేర్పడం లేదు కదా! ఆ స్థితే వస్తే ఇక మనకి సందీప్ ఉన్నికృష్ణన్ లు ఉండరు. విజయ్ సలాస్కర్ లు ఉండరు. రాజ్ కిరణ్ రాధోడ్ లూ ఉండరు. అప్పుడు 1966 లోనో, 1972 లోనో వచ్చినట్లు, ఏ పాకిస్తాన్ తోనో యుద్ధం వస్తే, అప్పట్లాగే ప్రపంచదేశాలేవీ సాయం చెయ్యకపోయినా గెలిచే స్థితి ఉంటుందా? స్వదేశీ పరిఙ్ఞానంతో ఆయుధాలని తయారుచేయగల, ప్రయోగించగల సత్తా ఉంటుందా? అతిశయోక్తి చెబుతున్నాను అనుకోకండి. ప్రమాదం చాప క్రింద నీరులా మన జీవితాన్ని కమ్మి వేసిందని చెబుతున్నాను. ఈరోజు ఐ.టి. టెక్నాలజీని మన వాళ్ళు అందిపుచ్చుకున్నారంటే, అది నిన్న ఉన్న Quality Education system వలన. ఇప్పటి తరంలో లాజికల్ ధికింగ్ ఉన్నందువలన ప్రపంచవ్యాప్తంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాము. ఇప్పుడు ఇంగ్లీషు మీడియం చదువులు గమనించి చూడండి. లాజికల్ గా ఆలోచించే అవకాశం లేని, బట్టి మాత్రమే ఉన్న Education system ఇప్పుడు అమలులో ఉన్నది. భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోగలమా?

ఈవిధంగా ఒకదేశాన్ని, ఒక జాతిని నిర్వీర్వం చేసే అవకాశం లేదా? ఇలా ఒకదేశం తన శతృ దేశం మీద కుట్ర పన్నకూడదా! అమలు చేయకూడదా? కాబట్టే విద్యారంగంలోని కుంభకోణాలని, కేవలం ‘అవినీతి’ అనుకోవటం పొరపాటని అన్నాను. సామాన్యప్రజలు విద్యారంగంలోని అవినీతి నంతా చూసి ’మనమేం చేయగలం?’ అనుకొని నిట్టూర్పు విడిచి వూరుకోవచ్చు. ‘ఇవాళ్ళా రేపు అన్నిచోట్లా ఇలాగే జరుగుతుంది’ అనుకొని బాధపడి మరచిపోవచ్చు. కాని దేశప్రధానులు, ముఖ్యమంత్రులూ అలాగే అనుకోవచ్చా? ఇదే విషయమై, ఇదేవాదనని, ఇదే ప్రశ్ననీ ఈ దేశపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని 2007, June 9 వ్రాసిన ఫిర్యాదులో అడిగాము. మౌనమే సమాధానం. ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుణ్ణి, నేటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిని అడిగాము. అందరకీ కలిపి వరుసగా 99 ఫిర్యాదులు వ్రాసాము. వాటిల్లో విద్యారంగంలోని అవినీతి తాలుకూ వివరాలు, నిరూపణలతో పాటు, ఫిర్యాదు చేసినందుకు గాను మేం అనుభవిస్తున్న వేధింపు వివరాలు కూడా పొందుపరిచాము. స్పందన శూన్యం. కనీసపాటిగా స్పందించినది మాజీ రాష్ట్రపతి APJ Abdul Kalam మాత్రమే.

ఇక్కడ మరో దిగ్ర్భాంతికరమైన నిజం ఒకటి చెప్పాలి. 2001, మార్చిలో ఈ కుంభకోణం వివరాలతోనూ, ఫిర్యాదు చేసినందుకుగానూ మమ్మల్ని వేధిస్తున్న వారి వివరాలతోనూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సెక్రటేరియట్ లోని అతడి కార్యాలయం ‘సమత’లో వ్యక్తిగతంగా కలిసి వివరించాను. అతడేమన్నాడో, పర్యవసానం ఏమిటో తర్వాత వివరిస్తాను. ఇప్పుడు మీడియా ప్రవర్తనని వివరిస్తాను. ఆ రోజు 2001, March 20. సాయంత్రం సమయంలో సందర్శకులలో నాతోపాటు మీడియా ప్రతినిధులు చాలామంది ముఖ్యమంత్రి పిలుపుకోసం వేచి చూస్తున్నారు. విజటర్స్ log book లో వివరాలు వ్రాసుకుంటున్న సిబ్బంది ‘ఏంపనిమీద సి.ఎం.ని కలవాలి?’ అని నన్ను అడిగారు. క్లుప్తంగా వివరించాను. అప్పటివరకూ కాస్త గొడవగా ఏదో మాట్లాడుకుంటున్న అందరూ ఒక్కసారిగా, నిశ్శబ్ధమై పోయారు. మీడియా ప్రతినిధులతో సహా! తర్వాత మీడియా వారు నన్ను ‘విషయమేమిటమ్మా!’ అని అడిగారు. చెప్పాను. ‘ సీ.ఎం.కి చెప్పండి’ అనేసి, అంతలో సీ.ఎం. ప్రెస్ మీట్ కి రమ్మన్నారన్న కబురుతో కెమెరాలు మోసుకుంటూ పరుగెత్తి పోయారు. అప్పటికే ఒకసారి, సూర్యాపేటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు చెప్పి ఉన్నాను. ఒక్కరంటే ఒక్కరూ పత్రికలో వ్రాయలేదు. ఏ పత్రికలో కూడా! మీడియా ప్రతిస్పందనకు సంబంధించిన అనుభవం ఈ రెండు సార్లే కాదు, 2001లో ఈనాడు కిరణ్ ని కలిసేందుకు సోమాజీగూడ వెళ్ళి ప్రయత్నించాను. రెండురోజులు తిప్పించుకొని, విషయం కూడా వినకుండానే ‘No’ చెప్పారు. [అప్పటి కింకా స్థానిక కాలేజీలు నన్ను వేధిస్తున్నాయనుకున్నాను]. 2004, మే 22 న ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిని గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌస్ లో వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేసిన సందర్భంలోనూ ఇదే సంఘటన పునరావృతమయ్యింది. మీడియా ప్రతినిధులు చక్కగా విని మౌనంగా ఊరుకున్నారు. TV9, Meet Mr.Ravi Prakash Programme ని approach అయ్యాను. ఫలితం శూన్యం.

మళ్ళీ 2007 జనవరిలో, విజయవాడ ఆంధ్రజ్యోతికి వెళ్ళి ఎడిటర్ ని కలిసాను. అంతా విన్నాక ఆయన “The strength and the mode of the weapon can be determined by your enemy, but not by yourself. I think, మీరిక్కడ fail అవుతున్నారనుకుంటాను” అన్నాడు. నాకు అర్ధం గాక ఆమాటని ఒకటికి రెండుసార్లు చెప్పించుకొని, ‘ఇంతకు నాకేసు ప్రచురించగలరా లేదా?’ అని అడిగాను. ‘తమకి అంత స్వాధికారం లేదని, హైదరాబాద్ లోని తమ హెడ్డాఫీసుకి అప్రోచ్ అవ్వమనీ’ చెప్పారు. “పోనీ మీరే పంపకూడదా? జిరాక్స్ కాపీ ఇస్తాను” అన్నాను. “లేదు మీరే హైదరాబాద్ వెళ్ళి కలవండి” అని చెప్పారు. చేసేది లేక వెనుదిరిగాను. మళ్ళీ 2007, మార్చిలో హైదరాబాద్ వెళ్ళి ఆంధ్రజ్యోతి ఎడిటర్ ని కలిసే ప్రయత్నం చేశాను. కుదర లేదు. ‘వార్త’ ఆఫీసుకి వెళ్ళాను. అక్కడ సబ్ ఎడిటర్ ని కలిసాను. ఆయన ఓ గంట పాటు నా కేసంతా విని “మీరిదే దారిలో వెళ్తూ మీ జీవితమే గాక మీ పాప జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. కావాలంటే శ్రీశైలంలో చుట్టుప్రక్కల గిరిజన తండాలకు మీరు వెళ్ళి సేవ చేయండి. మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను, మీరు వ్రాసి పంపండి. మేం పేపర్లో వేస్తాం. నేను 18 ఏళ్ళు ఈనాడులో పనిచేసాను. ఎల్.టి.టి.ఇ. సానుభూతిపరుణ్ణంటూ లంకలో పనిచేస్తుండగా జైల్లో కూడా పెట్టారు. ఇప్పుడు ‘వార్త’లో పని చేస్తున్నాను. మేం పేపరులో వేస్తే ఓ రెండురోజులు మీకేసు పాపులర్ అవుతుంది. అంతే! తర్వాత అందరూ మర్చిపోతారు. తర్వాత మీజీవితం మరింత అధ్వాన్నం అవుతుంది” అని సలహా ఇచ్చాడు. “అయినా అందుకు నేను సిద్దమే. పేపరులో ప్రచురించండి” అన్నాను.

“ఆ నిర్ణయం తన చేతుల్లో లేదని, యాజమాన్యం చేతుల్లో ఉందనీ, యాజమాన్యం కూడా వారి పరిమితికి లోబడే వార్తలు ప్రచురిస్తారనీ, ఎండోమెంట్ కమీషనర్ తనకు తెలుసునని, కావాలంటే ఆయనకి రికమెండ్ చేసి శ్రీశైలంలో మా రూం కాన్సిల్ ని, రికాల్ చేసేటట్లు చేస్తానని” చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అప్పుడే ‘పోటీ పత్రికలకి కూడా వారి వ్యాపారపరిమితులు వారి కుంటాయన్నమాట’ అనుకొని చేసేది లేక వెనుదిరిగాను.

ఈ విధంగా అన్నిసార్లూ ప్రెస్ నుండి వ్యూహాత్మక మౌనమే జవాబుగా పొందాను. ఈ అనుభవాలతో ‘మీడియా వారికి సంచలనవార్తలు కావాలి’ అన్నది కూడా ఓ ప్రచారం మాత్రమే. నిజంకాదు!’అని తెలుసుకున్నాను. మీడియా అధిపతులకి ఏ విషయాన్నైనా సంచలనంగా ప్రచారించటం అవసరమైనప్పుడు మాత్రమే ఆయా విషయాలు సంచలన వార్తలు అవుతాయి. ఆయా విలేఖరులు Investegative reporters అవుతారు. అంతే. [హఠాత్తుగా వై.ఎస్. assigned భూములు విషయం గుర్తుకు వచ్చినట్లు అన్నమాట.] ఇటువంటి మీడియా ఏదో ఉద్దరిస్తుందని, అవినీతిని ఎండగడుతుందని అనుకోవటం ఎంత భ్రమో కదా!

ఈ నేపధ్యంలో శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టరూ, లండన్ రిటర్న్ డాక్టర్ బి.యస్.రావుకి ఈనాడు అధినేత రామోజీరావు ఇచ్చేప్రోత్సాహం గమనార్హం. ప్రతియేడాది శ్రీచైతన్య ర్యాంకర్లకి మెడల్స్, బహుమతులూ గట్రా ఇస్తూ RFC లో ఫోటోలు ఈనాడులోనూ ప్రచురింపబడతాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రచారాస్త్రాలుగానూ ఉంటాయి. మనందరికీ, మనలాంటి సామాన్యులందరికీ, ఇంతగా కళ్ళకు కట్టినట్లుగా, కన్పిస్తున్న ఈ అవినీతి భాగోతం, ర్యాంకుల కుంభకోణం మీడియా అధినేతకు కనబడటం లేదా? ఉప్పు కూడా అందటం లేదా? ఇలాంటి కార్పోరేట్ కాలేజీల దొంగలందరికీ ఈ మీడియా అధిపతే నాయకుడు అయితే తప్ప, ఇంత అమాయకత్వం, అలసత్వం మీడియాకి ఉంటుందా? రాజకీయనాయకులకి ఇంత గుడ్డితనం ఉంటుందా? కేవలం కోట్లాది రూపాయలు మాత్రమే ఈ అవినీతిని కాచి కాపాడి, పెంచి పోషించటం లేదు. అంతకు మించిన గూఢచర్య కుట్ర, ఈ కుంభకోణంలో పాత్రధారులైన, కార్పోరేట్ విద్యావేత్తలనీ, బ్యూరాక్రాట్లానీ, రాజకీయ నాయకులనీ, మీడియా ప్రతినిధులనీ శాసిస్తోంది, ఆడిస్తోంది. అందుకే, వ్యక్తులు ఇందులో శలాభాల్లా మాడిపోతున్నా, సమాజం సమిధలా మసైపోతున్నా, ఈ కుంభకోణాలని నిరోధించగల స్థానాల్లో, పదవుల్లో ఉన్నావారు కూడా ప్రేక్షకత్వం వహిస్తున్నారు.

ఇందులో కొసమెరుపు ఏమిటంటే – 2006, అక్టోబరులో గుంటూరులోని ఐ.బి.ఆఫీసుకి వెళ్ళి [1992 లో మా ఫ్యాక్టరీకి వచ్చిన ఐ.బి.అధికారులు ఇచ్చిన చిరునామాతో ఐ.బి.ఆఫీసుని మేము trace out చెయగలిగాము.] అక్కడి అధికారులని కలిసి, ఈ వివరాలన్నీ చెప్పినప్పుడు అక్కడి అధికారి ’ఇవాళ రేపు, ఎంసెట్ కుంభకోణల్లాంటివి అన్నిచోట్ల జరుగుతున్నాయి’ అన్నాడు, అదేమంత పెద్దవిషయం కాదన్నట్లు! “రామోజీరావుని claim చేస్తున్నారే మీరు? అసలేమనుకుంటున్నారు అతడంటే? అతడు మచ్చలేని వాణిజ్య వేత్త తెలుసా?" అన్నాడు, అదేదో తానే రామోజీరావుకు స్యయంగా డిఫెన్స్ న్యాయవాది అన్నట్లు! విధివిచిత్రమేమిటంటే అతడలా అన్న వారం పదిరోజులకే మార్గదర్శిలో ఏవో అవకతవకలు జరిగాయనీ, unclaimed disputes ఉన్నాయనీ గొడవ బయటికొచ్చింది. ఎవరూ తమది అని చెప్పుకోని డబ్బు ఎందుకు మార్గదర్శి ఖాతాల్లో ఉందో ఎవరూ పరిశోధన చేయలేదు. ఈ విషయం ముందుగా బయటిపెట్టిన ఉండవల్లి అరుణ్ కుమార్, "వారం రోజుల్లో రామోజీరావుని దేశద్రోహిగా నిరూపిస్తాను” అని సవాలు విసిరాడు. వారం ఇప్పటికీ పూర్తికాలేదో లేక మరేవైనా terms and conditions మారిపోయాయో ఇప్పటికీ మౌనంగా ఉన్నాడు. మరోవిషయం ఏమిటంటే ఈ మార్గదర్శి వ్యవహారంలో CBCID, అప్పటి IG కృష్ణరాజ్ చాలా ఖండితంగా, కఠినంగా వ్యవహారించి సంచలనాలు రేపాడు.

ఇక్కడ చర్చించాల్సిన ముఖ్యవిషయం మరొకటుంది. అదేమిటంటే – ప్రజా జీవితంలో అవినీతి. మీడియా దర్శకులూ, రాజకీయనాయకులూ, ఉన్నతాధికారులూ కార్పోరేట్ సంస్థల అధిపతులూ అయిన నటీనటులు ఇంత అవినీతి చిత్రాలు చేయగలుగుతున్నారంటే ప్రజలనబడే ప్రేక్షకులలో చాలామంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించబట్టే. ‘సమస్య మనదాకా రాలేదు కదా మనకెందుకు?’ అనుకుంటూ కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. నిజానికి అవినీతి సమస్య అంతర్లీనంగా తెరచాటున అందరి జీవితాలనీ కబళిస్తూనే ఉంది. దాన్ని గుర్తించడంలోనే అలసత్వం ఉంది. ప్రత్యక్ష ప్రభావం తమదాకా రాలేదు కదా అనుకోవటం అమాయకత్వం లేదా అఙ్ఞానం.

మరికొందరు ‘ఎవరేం చెయ్యగలరు? ప్రజల్లో చైతన్యం రావాలి’ అంటారు. ప్రజల్లో తాము భాగమే అని మరచిపోతారు.

తల్లితండ్రుల్లో కొందరు విద్యారంగంలోని ఈ అవినీతికి ఎరువు పెడుతున్నారు. వీరిలో చాలామంది, తమ పిల్లలకి అడిగిన వల్లా ఇవ్వటమే ప్రేమ అనుకుంటారు. కష్టపడి పనిచెయ్యమనటం అవమానకరం అనుకుంటారు. కొంతమంది తల్లులు ‘మా పిల్లలు అటు పుల్లతీసి ఇటు పెట్టరు’ అని గొప్పగా మురిసిపోతూ చెప్పటం చూశాము. ‘మా పాపకి వంటరాదు. అసలు ఇంటిపని చెయ్యటమే రాదు. చదువుకునే పిల్లలయ్యెను! ఇక పనేం నేర్చుకుంటారు’ అంటూ సమర్ధించుకుంటారు. అసలు పని నేర్పే ప్రయత్నమే చెయ్యరు. అలాగని ఇలాంటి వారి పిల్లల్లో చదువులో శ్రమించటం కనిపించదు. ఇక్కడా సినిమా టిక్ గారాబమే. నిజానికి పనులు, [అన్నిరకాల పనులు, ఇంటిపనులతో సహా] చేసే పిల్లలలోనే వారి మేధస్సు యొక్క ధారణ, ఙ్ఞాపకశక్తి ఎక్కువ ఉండటం నాకు ప్రత్యక్ష అనుభవం, పరిశీలన కూడా! తమ పాఠ్యపుస్తకాలే కాక, ఇతర పుస్తకాలు చదివే readability ఎక్కువ ఉన్న పిల్లల్లోనూ, తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసే పిల్లల్లోనూ [అమ్మాయిలైనా, అబ్బాయిలైనా] abilities ఎక్కువుగా ఉండటం నిజం. కావాలంటే మీరు ప్రయోగం చేసి నిజం తేల్చుకోవచ్చు.

అయితే ఈ నిజాన్ని చాలామంది తల్లితండ్రులు గుర్తించరు. పిల్లలకి పని నేర్పటం [అది చదువుకి సంబంధించన పని, ఇంటిపని కావచ్చు, షాపింగ్ పని కావచ్చు] అవమానకరం అనుకునే కుహనా పరువుల దగ్గర ఉండేవారికి అవినీతితోనూ, వక్రమార్గాల ద్వారానూ మార్కులూ, ర్యాంకులు తెచ్చి తమ పిల్లలకి కట్టబెట్టటం ఆస్థులు కట్టబెట్టటం వంటిదే. ఈ విధంగా అవినీతికి మహారాజ పోషకుల వంటి తల్లితండ్రులు కూడా ఉండటం వల్లే ఈ విద్యాసంస్థలు ఇంత చేయగలుగుతున్నాయి, ఈ రాజకీయ నాయకులూ, బ్యూరాక్రాట్లు ఇంతగా దోచుకొని దాచుకోగలుగుతున్నారు.

సరే, ఇక ఈ విషయం ఇక్కడికి ఆపి మళ్ళీ కార్పోరేట్ కాలేజీలు, చిన్న ప్రైవేటు కాలేజీల వ్యవహారం దగ్గరికి తిరిగి వద్దాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

ఇంత ఓపికగా మీ స్వీయానుభవాలని కళ్లకుకట్టినట్టుగా చెప్తున్న్ందుకు ధన్యవాదాలు. మధ్య మధ్యలో ఆ అనుభవాలనుంచి, మీరు నేర్చుకున్న జీవితపాఠాల సారాంశాన్ని చక్కగా పాఠకులకి అందిస్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు అంతమంది తప్పకుండా చదవవలసిన టపాలు.

>> అకాడమీ మెటీరియల్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులోనుండే ప్రశ్నలు వస్తాయి అని ప్రచారం మొదలైంది. అదిదాటి ప్రశ్నలు అడగకూడదని ఖరారయ్యింది.

ఇది నిజమా? ఇంతలా మారి పోయిందా EAMCET ?

This comment has been removed by the author.

అవును, మా చైతన్యలో కూడా అంతే .ఐతే చైతన్య మెటీరియల్, లేకుంటే అకాడమీ అంతే, కాకపోతే దీప్తి రైటర్ మాకు మాధ్స్ చెప్పేవారు అందుకని అది చెప్పేవారు. ఇక ఫిజిక్స్ ఐతే చైతన్యే బెస్ట్ అనేవారు..

Vinay Chakravarthi.Gogineni గారు,

ముందుగా మీరు చూపించిన అభిమానానికి కృతఙ్ఞతలు. నేను చేసిన ప్రయత్నాలు ఇప్పటికి నాలుగో వంతు కూడా చెప్పలేదు. ముందు మొత్తం చెప్పనివ్వండి. పూర్తయ్యాక ఏంచెయ్యాలో ఆలోచిద్దాం.

This comment has been removed by the author.

ఆదిలక్ష్మిగారు,
ఒక్క విషయంలో నేను ఏకీభవించలేను. నేను 2001 లొ ఎమ్ సెట్ రాసాను. అప్పుడు నేను 200 ప్రశ్నలకు సమాధానం రాసాను. మీరు చెప్పిన 180 ప్రశ్నల మార్పు 2002 ఎమ్ సెట్ నుంచి జరిగిందని నాకు గుర్తు.

ప్రదీప్,

మార్పు జరిగింది 2002 లోనో, 2003 లోనో నాకు తెలియదు. అందుచేత 2000 తరువాత అని వ్రాసాను. 180 ప్రశ్నల మార్పు కాదు, 160 ప్రశ్నల మార్పు.

160 prasnala maarpu jarigindi 2003 lo... maa batch nuchee adi modalayyindi

adi 2003 daggarinundi jarigindi not 2002

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu