మా స్కూలు అనుభవాల్లో మమ్మల్ని అత్యంత విస్మయపరిచిందీ, విషాద పరిచిందీ అయిన ఒక సంఘటన చెబుతాను. మా స్కూలులో 1 వ తరగతి చదివే 6 ఏళ్ళు బుడ్డోడు, 2 వతరగతి చదివే 7 ఏళ్ళ బుడ్డోడు ఉన్నారు. ఇద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ నర్సరీ నుండి మాదగ్గరే చదివేవారు. వారి తండ్రి శ్రీశైలంలో ఓ కులసత్రంలో మేనేజరుగా పనిచేసేవాడు. బి.జె.పి.పార్టీలో ఏదో పదవి కూడా ఉండేది. తల్లి దేవస్థాన ఉద్యోగిని. వారి కుటుంబంతో మాకు స్నేహం ఉండేది. వారి ఇల్లు కూడా మా సత్రానికి ఎదురు లైన్ లోనే ఉండేది.

ఓ రోజు హఠాత్తుగా ఆ బిడ్డల తండ్రి మరణించాడు. చిన్నవయస్సు వ్యక్తే. మా స్కూలు శ్రీశైలం చెక్ పోస్ట్ దాటగానే ఘాట్ రోడ్డుమీదే ఉండేది. రోడ్డు ఎత్తునుండి పల్లంగా ఉండటంతో, స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవటంతో బస్సులూ, జీపులూ వేగంగా వస్తాయి. అందుచేత స్కూలు విడిచిపెట్టినప్పుడు, పిల్లలంతా వెళ్ళేదాకా పోర్టీకోలో నిలబడి పర్యవేక్షించేవాళ్ళం. అలా పర్యవేక్షిస్తున్నప్పుడు, ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కూడా, అతడు మాకు విష్ చేసి ఇంటి నుండి డ్యూటీకి వెళ్ళాడు. రాత్రి 8PM సమయంలో స్పృహ తప్పి పడిపోయాడు. సున్నిపెంట ఆసుపత్రికి, అక్కడి నుండి హైదరాబాదు తీసికెళ్ళినా బ్రతకలేదు. ఈ సంఘటన ఒక్కసారిగా అందరికీ షాకింగ్ గా అన్పించింది. పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు. వాళ్ళ బంధువులు చాలామందే శ్రీశైలంలో ఉన్నా, వాళ్ళిద్దరు ఎవరి దగ్గరకీ వెళ్ళలేదు. చిన్నవాడికైతే అసలేం తెలియలేదు. తండ్రి శరీరం అక్కడ ఉంటే, ఎదురుగా కూర్చొని వాడు ఆడుకుంటున్నాడు. పెద్దవాడికి కొంచెం అర్ధమౌతుంది. తండ్రి కదలక పోవటం, మాట్లాడకపోవటం, తల్లి, అమ్మమ్మ అందరూ ఏడవటం వాడికి తెలుస్తున్నాయి. రెండురోజులపాటు ఆ పిల్లలని నా చేతుల్లోనే ఉంచుకున్నాను. తండ్రి అంతిమ యాత్ర ప్రారంభమయ్యేటప్పటికి పెద్దవాడు బెదిరిపోయాడు.

అందరూ ఒక్కసారిగా బిగ్గరగా ఏడవటంతో వీడు బెదిరిపోయి, ఏడుస్తూ పరిగెత్తి పోబోయాడు. గభాలున నేను వాడిని ఎత్తుకుని నాదగ్గరే ఉంచుకున్నాను. చివరికి తండ్రి భౌతిక కాయానికి పెద్దకొడుకుగా వాడు నిర్వహించాల్సిన క్రతువుకు కూడా వాడు సహకరించటం లేదు. వాళ్ళ బంధువులు “ఏంచెయ్యాలి” అంటూ ఆందోళన పడసాగాడు. నేను ఆ పిల్ల వాణ్ణి నా ఒడిలో కూర్చోబెట్టుకొని “చూడు నాన్నా! మన స్కూల్లో వర్కు ముందుగా పూర్తిచేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. చెయ్యని వాళ్ళు తరువాత కూడా కూర్చొని చేస్తారు గదా! ఇప్పుడు నీకు ఇక్కడ ఇల్లుంది. అక్కడ స్కూలు ఉంది. అలాగే మనందరికీ మల్లయ్య స్వామి దగ్గర ఇంకో ఇల్లు ఉంటుంది. ఈ ఊరు, ఈ ఇల్లు ఇవన్నీ మన స్కూలు లాంటివే. అసలు మన ఇల్లు మల్లయ్యస్వామి దగ్గర ఉంటుంది. అందరం పుట్టామంటే స్కూలుకి వచ్చినట్లే. వర్కు ముందు పూర్తి అయిపోయిన వాళ్ళు ముందుగా వెళ్ళిపోతారు. అంటే మన వర్కు ఇంకా అయిపోక ఇక్కడే స్కూలులో ఉన్నట్లన్న మాట. కానీ మీ డాడికి వర్కు పూర్తి అయిపోయింది. అందుకే వెళ్ళిపోయారు. తెల్సిందా” అంటూ పదేపదే ఆ పసి హృదయానికి అర్ధమయ్యేవరకూ చెప్పాను. నిజానికి నాకూ ఓ ప్రక్క దుఃఖం వస్తూనేఉంది. ఆ పసిబిడ్డల కష్టం చూసి, వాళ్ళ తల్లి దుఃఖంచూసి కూడా చాలా బాధగా ఉంది. అయినా ఓపికగా ఆ చిన్నివాణ్ణి సముదాయించి, మెల్లిగా పాలు త్రాగించాను. అంతలో శ్మశానం నుండి మరోసారి పిలుపు వచ్చింది. పిల్లవాడికి మరోసారి చెప్పి, "డాడీ మీద పువ్వులు చల్లిరావాలి. వెళ్ళివస్తావుగా” అంటూ పంపాను. వారి [లింగాయతుల] ఆచారం ప్రకారం వారు భౌతికకాయాన్ని ఖననం చేసారు.

ఆ పిల్లవాడికి నేను చెప్పింది ఎంతగా నాటుకు పోయిందంటే – తర్వాత రోజుల్లో వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే ఆ చిన్నితండ్రి – “ఎందుకు అంతగా ఏడుస్తావు? నువ్వు ఏడ్చినా డాడీ తిరిగి వస్తారా? ఆయన వర్కు అయిపోయింది. వెళ్ళిపోయాడు. మన వర్కు అవ్వలేదు. అంతే” అని చెప్పేవాడు. ఇది చూసినపుడు నిజంగా మేం అప్రవిభులం అయిపోయామనీ చెప్పాలి. ఒక టీచరు ప్రభావం పిల్లల మీద ఉంటుందని మాకు తెలుసు. మాటీచర్స్ ప్రభావం నామీద ఎంత ఉందో నాకు తెలుసు. మా పాపసైతం, స్వయంగా నేను లెక్చరర్ ని అయినా, వాళ్ళ క్లాసు టీచర్ చెప్పిందే లోకం అనేది సూర్యాపేటలో తన స్కూలుకి వెళ్తున్న రోజుల్లో. ఎంతోమంది పిల్లల్నీ చూశాను. కానీ ఇంతగా జీవితపు సమస్యల్ని, అంత చిన్నవయస్సులో ఎదుర్కొనేందుకు, టీచర్ చెప్పిన మాటలు ప్రభావితం చేస్తాయని ఇంత దగ్గరగా చూడటంతో మాకు చాలా విస్మయం కలిగింది. నిజానికి ఆ పిల్లలకి తండ్రితో చాలా అనుబంధం ఉండేది. ప్రతీరోజు తండ్రి డ్యూటీ నుండి వచ్చేదాక, రాత్రి ఆలస్యమైనా ఎదురు చూసేవాళ్ళు. అలాంటి పిల్లలకి అంతటి కష్టం!

ఇలా…… ఎన్నో అనుభవాలతో మాకు ఓ విషయం స్పష్టంగా అర్ధం అయ్యింది. విద్యార్ధులకి చదువు చెప్పటం అంటే లిటరసీ [చదవటం, వ్రాయటం] నేర్పటం కాదు, గుణశీలాలని నేర్పాలన్న విషయం బాగా స్పష్టపడింది. అప్పటివరకూ సిద్దాంతంగా, నేను చదివిన స్కూలు [స్టాల్ గాళ్స్ హైస్కూలు] ద్వారా తెలిసిన విషయం, మా స్కూలు అనుభవాలతో మాకు పూర్తిగా నిరూపితం అయ్యింది.

సరిగ్గా ఈ అంశం దగ్గరే ఇప్పటి మన విద్యావ్యవస్థ ఎంత దారుణమైన విపర్యయంతో ఉందో ఆలోచిస్తే మతిపోయినట్లనిపించింది. నిజానికి మేం మా స్కూల్ లో అంత కష్టపడి, ప్రతీ విద్యార్ధినీ పరిశీలించి, ప్రతీవారి మీద ప్రత్యేక శ్రద్ద తీసుకున్నామంటే, మేం ఇద్దరం ఉన్నాం. విద్యార్ధులు 60 మంది. ఉపాధ్యాయ – విద్యార్ధి నిష్పత్తి 1:30 ఉంది. అంతేగాక ఇది మా స్కూలు అన్న భావం మాదగ్గర ఉంది. ఎందుకంటే ఆ స్కూలు మా ఆర్ధికావసరాలన్ని తీర్చేంతగా, శ్రమకి తగిన ఆదాయవనరుగా ఉంది.

అదే ఇప్పటి ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థల్లో టీచర్లకు బయటికి చెబుతున్నంత జీత భత్యాలు లేవు. [వాంటెడ్ కాలమ్ లో కావాలని ఎక్కువ ఆఫర్ చేస్తారు. ఇది ఒకరకం ప్రచారం అన్నమాట. ఇబ్బడిముబ్బడి పిల్లలు వచ్చారని, అందుకని అర్జంటుగా టీచర్స్ కావాలని ప్రకటిస్తారు. లేదా తాము చాలా ఎక్కువ జీతభత్యాలు ఇస్తున్నారుకాబట్టి తమదగ్గర అంకిత భావంగల సిబ్బంది ఉన్నారని ప్రచారం కోసం కూడా అలా ప్రకటన ఇస్తారు.] వారిలో చాలామంది శ్రమదోపిడికి గురవుతున్నారు. చాలా స్కూల్స్ లో ఉపాధ్యాయ, విద్యార్ధి నిష్పత్తి 1:30 అనో 1:40 అనో చెబుతారు. వ్యాపారప్రకటనల్లో కరపత్రాల్లో ఊదరబెడతారు. అయినా ఎందుకు మరి సరైన ఫలితం, పిల్లల్లో మనోవికాసంతో కూడిన మార్పు, వ్యక్తిత్వ నిర్మాణం, గుణ సౌశీల్యాభివృద్ధి కనబడటం లేదు? ఖచ్చితంగా చెప్పాలంటే కార్పోరేట్ మరియు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రుల నుండు భారీగానే ఫీజులు వసూలు చేస్తాయి. అందులో కొంత తమ buildings కీ, Infrastructure కీ, establishment కీ ఖర్చుచేస్తాయి. ఎందుకంటే అవి తమ assets, పెట్టుబడులు. తదుపరి వాటినే చూపి మరింతగా ఫీజులు వసూలు చేయటానికి అవసరమైన పెట్టుబడులు. మిగిలినదంతా ఫలితాలను కొనడానికి [స్టేట్ ర్యాంకులు, అత్యధికమార్కులు], లాబీయింగ్ కీ, మీడియాల్లో ప్రకటనలకీ, రాజకీయ పార్టీల, నాయకుల అండదండల కోసం ఖర్చుచేస్తాయి. ఏ స్కూలు / సంస్థ అయినా, ఈ ఒరవడికి ఎదురీది, ఈ లాబీయింగ్ కి పెట్టే ఖర్చు సిబ్బంది మీద పెట్టి, [అంటే టీచర్లకీ, లెక్చరర్లకీ వారి శ్రమకి తగినంతగా, తృప్తికరంగా చెల్లించి] ఫలితాలు సాధించాలన్నా కుదరదు. అప్పుడు పరుగులో మిగిలిన సంస్థలు వీటిని తొక్కేస్తాయి. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ కార్పోరేట్ విద్యావ్వవస్థ ఈ విధంగా ఓ ఉధృతిని సృష్టించి, అందులో విద్యార్ధులనీ, తల్లిదండ్రుల్నీ, నిరుద్యోగుల్నీ[నిరుద్యోగులే కదా వీరిదగ్గర ఉద్యోగార్దులై వస్తారు?] పడేసి లాక్కుపోతోంది. ఇందుకు ఇప్పటి ప్రభుత్వాలు మరింత వెన్నుదన్నుగా నిలబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అన్న విషయం దాదాపు మరుగున పడిపోయింది. ఇప్పడక్కడికి దాదాపు ఆర్ధికంగా తక్కువస్థాయి వారి పిల్లలే వెళ్తున్నారు. అక్కడ నాణ్యమైన చదువూ, క్రమశిక్షణా, అంకితభావం గల బోధనా సిబ్బంది దాదాపు మృగ్యమైపోయాయి.

ఇది కార్పోరేట్/ ప్రైవేటు విద్యాసంస్థల పాపం అని ఒక్కమాటలో అనలేం. ఇందులో ప్రస్తుత ప్రభుత్వాలకి [ఏపార్టీ అయినా ఒకటే] ప్రధానవాటా ఉండటం వెనుక గల కారణం కుట్రే. ఈ విషయం లో తల్లిదండ్రుల పాత్రకూడా చాలానే ఉంది. ఈ మాట మీకు కటువుగా తోచవచ్చు. కానీ ఇది నిజం. మీకు ఓ వాస్తవ ఉదాహరణ చెబుతాను. ఇటీవల నంద్యాలలో ఓ కార్పోరేట్ స్థాయి స్కూలు దివాళా తీసింది. [కొన్ని క్యాంపస్ లకీ, బిల్డింగ్ లకీ తాళాలు పడ్డాయి. కొన్ని వేరే యాజమాన్యాలు take over చేసాయి]. ఆ స్కూల్ కి శ్రీశైలం నుండి అప్పట్లోనే, అంటే 2003 నుండి 207 లోపల, దాదాపు 20, 30 మంది విద్యార్ధులు ఉండేవారు. స్కూలుఫీజులో ఒక స్కీమ్ ఏమిటంటే – తల్లిదండ్రులు తమ పిల్లవాణ్ణి ఆ స్కూల్ లో చేర్చాలంటే లక్షరూపాయలు కట్టాలి. బదులుగా తమపిల్లవాడిక్ 10th వరకూ చదువు[హాస్టల్ వసతితో సహా] చెబుతారు. 10th తర్వాత తమ లక్ష తమకి తిరిగి ఇస్తారు. ఇదీ స్కీము. అంటే ’లక్షరూపాయలు మీద వచ్చే వడ్డీతో తమ పిల్లలకి స్కూలు వారు చదువు, హాస్టల్ తో సహా ఇస్తున్నారన్నమాట’ అన్నది తల్లిదండ్రుల అభిప్రాయం. లెక్క సరిగానే ఉంది. కానీ వాస్తవంలో ఈ స్కీములో లొసుగులు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొత్తగా చేరే విద్యార్ధులు తలకు లక్ష కడతారు. అలాగే 10th అయిపోయి వెళ్ళే విద్యార్ధులకి స్కూలు యాజమాన్యం తలకు లక్ష తిరిగి ఇవ్వాలి కదా? క్లాసు Promote అయ్యే విద్యార్ధి వార్షిక ఫీజు కట్టడు కదా? ఎందుకంటే ఒకేసారి లక్ష డిపాజిట్ చేసాడు కదా? మేం ఈ స్కీం గురించి విన్నప్పుడు మాలో మేం చర్చించుకుంటూ, ఈ స్కీంలో నడిచే స్కూలు కొన్నేళ్ళ తరువాత కుప్పకూలటం ఖాయం అనుకున్నాము. 2008 ప్రారంభంలో అదేజరిగింది. స్థానికంగా ఎన్నో గొడవలు జరిగాయి. పోలీసుల బలప్రయోగం కూడా జరిగింది. మాకు తెలిసిన శ్రీశైలం విద్యార్ధుల తల్లిదండ్రులే చాలామంది తమ ’లక్ష’ కోల్పోయారు. [ఏదో ప్రయత్నాలు ఎవరికి వాళ్ళు చేస్తున్నారు గానీ తిరిగి వచ్చేవరకూ నమ్మకాల్లేవని వాళ్ళే అంటున్నారు.]

ఈ విధంగా తల్లిదండ్రుల్లో కూడా కొంతమంది తెలిసే ప్రలోభాలకు లొంగటం, కొంతమంది సరైన శ్రద్ధ తీసుకోక పోవటం…… ఇలా. కొన్ని చిన్న స్కూల్స్ లో చదివించుకునే తల్లిదండ్రులకి అక్కడి టీచర్లకీ ఆరేడు వందలరూపాయల జీతాలు మాత్రమే ఇవ్వబడతాయని తెలుసు. కొన్ని స్కూల్స్ లో యాజమాన్యాలు తమ ముక్కుపిండి ఫీజులు వసూలు చేసుకుంటారు గానీ, నాణ్యమైన, క్రమశిక్షణాయుతమైన చదువు చెప్పటం లేదని తెలిసినా నిలదీయరు. ఇక మరో వైపు చూస్తే విద్యారంగంలో అనైతికత ఎంత ఎత్తుపెరిగి పోయిందో! ఫలితాల కుంభకోణాల మాత్రమే కాదు. దాన్ని మించిన వ్యవహారాలు ఉన్నాయి. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతాయి. ఓ స్కూల్లో మాష్టారు ఓ 14 ఏళ్ళ పిల్లని తీసుకుపోయి పెళ్ళి[?] చేసుకున్నాడు. విషయం ఏమిటంటే అతడకి ఆ పిల్ల వయస్సున్న కూతురుంది. అంతకంటే దారుణం ఏమిటంటే ఆ విషయం తెలిసే ఆ పిల్ల అతడితో వెళ్ళింది. [సుందరకాండ ల్లాంటి సినిమాలు చూసిందేమో!] విద్యాసంస్థల డైరక్టర్లతో కొందరు బోధనా సిబ్బందికి అక్రమ సంబంధాలుండటం కూడా ఉంది. దాన్ని గురించిన చర్చోపచర్చలు ఆ సంస్థలో వ్యాపించి ఉంటాయి. ఇలాంటి పరిసరాల్లో పెరిగే, చదివే పిల్లలు నైతికత గురించి ఏం తెలుసుకుంటారు? ఏ గుణశీలాలని నేర్చుకుంటారు? [ఇక్కడ శీలం అంటే నా ఉద్దేశం మంచిలక్షణాలని మాత్రమే] అసలు టీచర్ కే తప్పగా కన్పించనప్పుడు, పిల్లలకి ఏం నేర్పుతాడు, దిద్దుతాడు? పిల్లలలో తప్పలు దిద్దబడనప్పుడు వారిలో ఆత్మశక్తి ఎలా పెంపొందుతుంది? ఆత్మశక్తి పెరగనది వాళ్ళు జీవితంలో దేనినయినా ఎలా సాధిస్తారు?

మరో సంఘటన – ఓ ప్రైవేటు స్కూలు మాష్టారు ఓ పిల్ల వాడితో బాగా స్నేహం చేసాడు. పిల్లవాడికి రకరకాల మజాలు రుచి చూపెట్టి మచ్చిక చేసుకున్నాడు. తర్వాత ఇంట్లో నుండి నగలూ, డబ్బూ పట్టుకురమ్మన్నాడు. ఆ పిల్లవాడు అలాగే తెచ్చాడు. సదరు మాష్టారు పిల్లవాడితో సహా ఉడాయించి, మధ్యదారిలో పిల్లవాణ్ణి రోడ్డు ప్రక్కన వదిలేసి పారిపోయాడు. పోలీసు కేసయ్యి, వివరాలు వార్తాపత్రికలో వచ్చాయి. పంతులమ్మలకి ప్రేమ లేఖలు వ్రాసే విద్యార్ధులు గురించిన వార్తలు తరచూ వినబడుతూనే ఉన్నాయి. గురువు, గురుపత్ని తండ్రి తల్లితో సమానమనీ, గురు పుత్రిక సోదరీ సమానురాలనీ, పుత్రుడు సోదర సమానుడనీ – గట్రా నీతులన్నీ పాతచింతకాయ పచ్చడి అయిపోయాయి. మారిన కాలంలో కొన్ని నైతిక సూత్రాలు పరిణామం చెందాయి అని సరిపెట్టుకుందామన్నా, ఆ పరిణామక్రమం అవధులన్నిటినీ అతిక్రమించింది. ఇందులో సినిమాలు, మీడియా ఇతోధికంగా సాయం చేసాయి.

లంచంపెట్టి టీచర్ ఉద్యోగం సంపాదించేవాడు తరువాత ఏమాత్రం నీతిని బోధించగలడు? సర్వీసు రికార్డులు పుట్టించి మరీ ఉద్యోగంలో చేరుతున్న ప్రబుద్ధులు, దొంగ సర్టిఫికెట్టులు పెట్టి చేరుతున్న టీచర్లు, డబ్బులు తీసుకొని మార్కులు వేస్తున్న టీచర్లు, స్టూడెంట్స్ తో పాటు కలిసి మందు తాగుతున్న టీచర్లు…. ఇలా…. నైతికత లేని టీచర్ల దగ్గర చదువుకున్న విద్యార్ధులు ఏమాత్రం నీతి, నిజాయితీ నేర్చుకుంటారు? ఏమాత్రం భవిష్య భారతదేశానికి నీతివంతమైన పరిపాలన, సేవలు అందించగలరు? ఇది attitude కు సంబంధించిన విషయం. చిన్న వయస్సులో ఆ దృక్పధం నాటబడాలి. కొన్ని సంవత్సరాలపాటు [సుమారుగా 10 నుండి 12] అలవాట్లు, బోధనలతో ‘నాడి’ గట్టిపడితే ఆ అలోచన సరళితో ప్రవర్తిస్తారు. దృక్పధం[attitude] మంచిదయితే మంచిగానూ, చెడ్డదైతే చెడ్డగానూ వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. పిల్లల్లో దృక్పధాన్ని నాటే పాఠశాల విద్యని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్య పరుస్తుంది. అంతేకాదు, అమెరికా వంటి దేశాలలో ‘తల్లిదండ్రులు కొడితే పిల్లలు కేసులు పెట్టవచ్చు’ అన్న చట్టాల వలన ఎన్ని దుష్పరిమాణాలు వచ్చాయో తెలిసాక కూడా, ఇక్కడ అలాంటి చట్టసవరణలకు అనుమతించటం మన భవిష్యత్తు తరాలను నాశనం చెయ్యటానికి కాకపోతే మరెందుకు?

నిజానికి ఒక జాతిని నిర్వీర్యం చెయ్యాలంటే విద్య, వైద్యం, వ్వవసాయం – ఈ మూడు రంగాలని ధ్వంసం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మిగిలిన రంగాలకంటే ఇవే ప్రధానమైనవి కాబట్టి. అందులో విద్యారంగం మరింత ముఖ్యమైనది. భావితరాన్ని తయారు చేసేది విద్యారంగమే కదా! ‘నిజం చెప్పాటానికి ధైర్యం కావాలి; పిరికివాడే అబద్ధాలు చెబుతాడు’ – ఇది అందరూ ఒప్పుకునే సత్యం. సత్యం ఎంత శక్తివంతమైనదో, నైతికత కూడా అంతే. ధైర్యం లేని వాడు ఏం చేసినా, ఎలా దోపిడి చేసినా పడుంటారు, ఎదురు తిరగడు, తిరగలేడు కదా? అందుకు విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు.

సరిగ్గా ఇక్కడే కుట్ర విశ్వరూపం చూపిస్తోంది. అందుకే మీడియా పనిగట్టుకుని ‘ఈ రోజుల్లో నీతి, ధర్మం అంటే రోజులు నడవవు. ఇవాళ్ళ రేపు ‘పక్కలు’ వేసేవాడికే అన్నీ నడుస్తాయి. ఈ రోజు అవినీతి పరులే హాయిగా ఉన్నారు’ ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తుంది. అంతేకాదు అవినీతి పరులకీ, అనైతికతలోంచి ఉద్భవించిన వాళ్ళకే ’సీన్’ ఇస్తుంది.

విపులంగా చెప్పాలంటే విద్యారంగంలో ఇప్పుడు జరుగుతున్నది ‘అవినీతి’ అనుకోవటం అమాయకత్వం. అది జాతి మీద జరుగుతున్న కుట్ర. ఆత్మస్థైర్యం, మానసికదార్ఢ్యత లేని విద్యార్ధులు పెరిగి పెద్దవారైనా సాధించగలిగింది ఏముంది? ఒక దేశం మీద మరో దేశం, కొన్ని దశాబ్ధాల పాటు ఇలాంటి కుట్ర జరిపితే చాలు. తర్వాత చాలా సులభంగా శతృదేశాన్ని నామ రూపల్లేకుండా చేసి భూమిని ఆక్రమించేయవచ్చు.

అందుకే ఒకప్పుడు పాఠ్య పుస్తకాల్లో గొప్పవారి [చారిత్రక పురుషుల, పురాణ పురుషుల] జీవిత సంఘటనలు, స్పూర్తి దాయకంగా వ్రాయబడేవి. ఇప్పుడు వారి జీవితం గురించిన గణాంక వివరాలు మాత్రమే ఉంటాయి. ఎప్పుడు, ఎక్కడ పుట్టారు, ఏం చదివారు, ఏం చేసారు, ఎప్పుడు మరణించారు – గట్రా . ఒకప్పుడు పిల్లలకి ఆంజనేయస్వామి, భీముడు ’ఐడియల్ హీ’ లు. వాళ్ళలా ఎంతో బలంగా, ధృఢంగా ఉండాలని మోజు పడేవాళ్ళు. అన్నం తినకపోతే ‘అయితే నీకు భీముడి కున్నంత బలం వద్దా?’ అంటే ఆఁమ్మని తినేసేవాళ్ళు.[ఇది నాకు బాగా తెలిసిన అనుభవం] ఇప్పుడు పత్రికల్లో పిల్లలు పళ్ళు తినకపోతే తేనే వేసి పెట్టండి లేదా ఫలానా వారి జాంవేసి పెట్టండి అని వ్యాసాలు, నజరానాలు, చిట్కాలు చెప్పబడుతున్నాయి.

ఏమైనా, విద్యా వ్యవస్థని అన్నివిధాలుగా నాశనం చెయ్యటం ద్వారా CIA, ISI లు, అనువంశిక నకిలీ కణికుడు మన మీద కుట్ర అమలు చేస్తున్నారు. వారికి UPA, NDA లు [మరో XYZ లూ] అన్నివిధాలుగా సహకరిస్తున్నాయి. కాబట్టే ఇంత విచ్చలవిడిగా, విద్యాసంస్థలు పోటీపడి కరపత్రాలు ముద్రించి మరీ ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకుంటున్నా, సామాన్యులకి సైతం ఇది 70MM లో కన్పిస్తున్నా, గొప్పవిద్యావేత్తలుగా మీడియా చేత నీరాజనాలు అందుకుంటున్న వారికి గానీ, మంత్రులకీ గానీ, ప్రభుత్వాలకి గానీ, పత్రికలకి గానీ, అసలేమీ కన్పించటం లేదు. అంతా మామూలుగానే ఉంది. ఇక CB CID,IG లాంటి వారికి, ఐ.బి. అధికారులకి అసలు ఏ అవినీతీ కన్పించటం లేదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

నేను మేతో పూర్తిగా ఒప్పుకుంటాను.
ఒక జాతిని నిర్వీర్యం చెయ్యాలన్నా, దేశాన్ని జయించాలన్నా యుధ్ధాలు చేయడం , రక్తపాతం సృష్టించడం అనే పధ్ధతి అవసరం లేదు.
కొద్దికొద్దిగా పధకం ప్రకారం ఆలోచనల మీద దాడి చేస్తే చాలు.
ఇప్పుడు మన కళ్ళ ముందు గత కొన్ని సంవత్సరాలలో దిగుమతి అయిన పండగలు కానీ, బొమ్మలు కానీ , వేషభాషలు కానీ గమనించితే భోధపడుతుంది.
మన పాత కధలలో కానీ, పురాణాలలో కాని రాజు లేదా పెద్ద అనేవాడిని ఊహిస్తే బంగారపు కిరీటాలు గుర్తొస్తాయ్ తప్ప ఆకులు తలకు చుట్టుకున్న "సీజర్" లాంటి వ్యక్తి గుర్థుకు రాడు. అందుకనే ఈ సంపద కోసం అన్ని దేశాల వాళ్ళు ఇక్కడికి దాడి చేసారు అని నా అభిప్రాయం.
ధనం, అందం, వనరులు ఇంతకన్నా ఏమి కావాలి ఎవరికి అయినా దాడి చేసి అనుభవించటానికి

ఉపాధ్యాయుల ప్రభావం పిల్లలమీద కచ్చితంగా ఉంటుంది. కాబట్టి మఱి వారి వద్ద చదువుకోవడానికి పంపించే ముందు ఆ ఉపాధ్యాయులు ఎలాంటి వారో తెలుసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. చూడబోతే చాల ప్రభుత్వ పాఠశాలలలో బోధనా ప్రమాణాలు కొఱవడడంచేత ప్రభుత్వేతర పాఠశాలలే గతి అయ్యేలా ఉంది నేటి పరిస్థితి. దాదాపుగా తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదిస్తే తప్ప పాఠశాలలలో చేర్పించలేని పరిస్థితి. ఎలాగూ ఱెక్కలు ముక్కలు చేసికొని సంపాదిస్తున్నాము కదా, కాస్త మంచి పేరున్న పాఠశాలలో చేర్పిద్దామన్న ఆత్రముండటం అలాంటి తల్లిదండ్రులకి సహజం. ఇందులో ఉన్న చిక్కల్లా చక్కటి ఉపాధ్యాయుల గుఱించి ఆలోచించకుండా పేరున్న పాఠశాల గుఱించి ఆలోచించడంలోనే. పేరు రావాలంటే మంచి ఉపాధ్యాయులూ యాజమాన్యమూ ఉండాలి కదా అని ప్రాఙ్నిర్ణయాలు తీసేసుకోవడం యొక్క పరిణామం ఇది. పోనీ ఇంటి వద్ద తల్లిదండ్రులు శ్రద్ధ తీసికొని వారే చదివించుకోవచ్చు కదా అంటే ఇలా రాత్రింబవళ్లూ కష్టపడేవారికి పిల్లలతో గడిపే వీలెక్కడిది? ఏ పిల్లలకోసమైతే కష్టపడుతున్నారో ఆ పిల్లలతోనే గడిపే తీరిక లేకపోవడం విచారనీయం. ఏమిటో! అంతా పెద్ద విషవలయంలా ఉంది.

నాకు తాడేపల్లివారి నిరుద్యోగం పురుషలక్షణం గుర్తొస్తోందండీ. మంచి, ఆలోచింపజేసే టపా అండీ ఆదిలక్ష్మిగారూ.

నాలో నేను గారు,
రాఘవ గారు,

మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు కృతఙ్ఞతలు. తాడేపల్లివారి నిరుద్యోగం పురుషలక్షణం నేనూ చదివాను. అది చాలా సునిశితమైన పరిశీలన. విద్యావ్యవస్థ మీద జరుగుతున్న కుట్ర గురించి పూర్తి వివరణకు ఈ క్రింది లింక్ చూడండి.
http://motherindia369.blogspot.com/2008/12/01-coup-on-education.html

"నిజానికి ఒక జాతిని నిర్వీర్యం చెయ్యాలంటే విద్య, వైద్యం, వ్వవసాయం – ఈ మూడు రంగాలని ధ్వంసం చేస్తే సరిపోతుంది."అవును.... నిజం...!!

వీకెండ్ బద్దకం వల్ల ఈ టపా ఆలస్యంగా చదవడం జరిగింది. మంచికే జరిగింది. విఙ్ఞుల అభిప్రాయాలు కూడా చూసే అవకాశం కలిగింది. అనైతికతకి లౌక్యం అని పేరు పెట్టి చేస్తున్న ప్రయత్నాన్ని అర్ధం అయ్యేలా చేస్తున్న మీకు ధన్యవాదాలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu