ఆరోజు ఫిబ్రవరి 6 వతేది. మధ్యాహ్నం మూడు గంటలయ్యింది. నేను పిల్లలకి హోంవర్కులివ్వడం వంటి పనుల్లో బిజీగా ఉన్నాను. ఫోన్ మోగింది. మా వారు తీసుకున్నారు. అటునుండి CBCID, IG, Mr. కృష్ణరాజ్! మావారు ఫోన్ నాకు ఇచ్చారు. నేను “చెప్పండి సార్!” అన్నాను. “మీపేరు ఆదిలక్ష్మేనా! మీరు President of India కీ, Prime minister of India కీ, Sonia Gandhi కి కంప్లైంటు పెట్టారట గదా! అవి మాకు forward అయ్యాయి. ఎంక్వయిరీ చేద్దామని ఫోన్ చేసాను” అన్నాడు. నేను “అవును సార్! నాపేరు ఆదిలక్ష్మి. President of India కీ, Prime minister of India కీ, Sonia Gandhi కి కంప్లైంట్స్ పెట్టాను. ఇంతకీ మీరెవరు సార్!” అన్నాను. అటునుండి దర్పంగా “IG, CID కృష్ణరాజ్” అని వినబడింది. నేను “నమస్తే సర్! చెప్పండి. What can I do for you" అన్నాను. అతడొక్కసారిగా ఇరిటేట్ అయ్యి “అసలేముంది ఈ కంప్లైంటులో?" అన్నాడు. నాకర్ధంగాక “pardon me Sir!” అన్నాను. అతడు కోపపు స్వరంతో అదే రెట్టించాడు. రెండుమూడు సార్లు అలా రెట్టించాక నేను “I think you can read it Sir ” అన్నాను. ఈసారి అతడు “ఏమిటీ?" అన్నాడు. నేను మళ్ళీ రిపీట్ చేసాను. అతడుఒక్కసారిగా తగ్గి “Okay, అమ్మా!Thank you” అంటూ ఫోన్ పెట్టేసాడు. అప్పటికే పిల్లలంతా నావైపే చూస్తున్నారు. ఎందుకంటే సి.ఐ.డి. అన్నమాట వాళ్ళకి చాలా కుతూహలం రేపింది. మావారు, మాపాప కూడా నావైపు ఏమిటన్నట్లుగా చూసారు. నేను నిజంగా ఆఫోన్ సి.ఐ.డి. ఐ.జీ. నుండి వచ్చిందని అనుకోలేదు. సి.ఐ.డి. ఐ.జీ ఒక కంప్లైంటు గురించి కనుక్కోవాలంటే, వాళ్ళకే [వాళ్ళు ఫిర్యాదులో ఇచ్చిన ఫోన్ నెంబరుకే] ఫోన్ చేసి మీరే ఫలానానా అని అడగుతారని నేను అనుకులేదు. నాకు తెలిసి ఇలా ఎంక్వయిరీ చెయ్యటం తెలియదు. ఎప్పుడు కూడా వినలేదు. కాబట్టి ఒక IG, CBCID, ఏవిషయమైనా కనుక్కోవాలంటే ఫిర్యాదుదారుకే ఫోన్ చేసి, అవునా కాదా అని అడుగుతాడని అనుకోలేదు. అలా అడిగితే ఆ కంప్లైంటీ అవుననే అంటారు గదా! అతడు నిజంగా విషయమే కనుక్కోవాలంటే, స్థానిక పోలీస్ స్టేషన్ ని ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే చాలు కదా! మొత్తం పుట్టుపుర్వోత్తరాలు బయటపడతాయి కదా! అందునా శ్రీశైలం పోలీసు స్టేషన్ కి ఇంటర్ నెట్ సౌకర్యం కూడా ఉంది. మా విద్యార్ధుల తండ్రే [ASI] స్వయంగా ఈవిధి నిర్వహిస్తూ ఉంటాడు. శ్రీశైలంలో ఓ ఎ.ఇ. ఉన్నాడు. అతడి తండ్రి టెంపుల్ పి.ఏ.గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అంచేత అతడికి రికమెండేషన్ [VIP] ఫోన్ కాల్స్ ఎలా ఉంటాయో తెలుసు. అతడు తను మంత్రుల పి.ఏ. నంటూ దొంగఫోనులు చేసి తనకు కావలసిన పనులు చేయించుకునేవాడు. ఒకసారి పట్టుబడి పోలీసు కేసు కూడా అయ్యింది. ఇలాంటి సంఘటనలు కూడా విని ఉన్నాను. అందుచేత ఆ ఫోన్, ఎవరో రామోజీరావు అనుయాయూలు చేసి ఉంటారు అనుకున్నాను. `CBCID పేరు చెబితే బెదురుతానేమో’ అని చేయించి ఉంటారు అనుకున్నాను. అంచేత పెద్దగా పట్టించుకోలేదు.

ఈలోపున అక్కడ మరో విషయం మరుగుతుంది. అప్పటికి రెండేళ్ళుగా మాదగ్గర ఆయమ్మగా ఓవృద్దురాలు పనిచేస్తోంది. చాలా సహానం ఉన్నమనిషి. కొంచెం వయస్సు తాలూకూ చాదస్తం గానీ, పిల్లలు శివరాత్రి, ఉగాది పండుగల సందర్భల్లో నీటి కాలుష్యానికి గురై వాంతులు అవి చేసుకున్నా కూడా, విసుక్కోకుండా, అసహ్యించుకోకుండా శుభ్రం చేసేది. మేమూ ఆమెని బాగా చూసుకునేవాళ్ళం. అలాగే ఆ ముసలావిడ కూడా మాపట్ల గౌరవంగా, కృతఙ్ఞతగా ఉండేది. శ్రీశైలం గుడికి వెనుక వైపు ప్రాంతంలో గుడిసెలో ఉండేది. ఆమె గుడిసెలో ఓ సాధువు [బిచ్చగత్తె] ఉంటుంది. ఏదో విషయమై మా అయమ్మతో ఆ సాధమ్మ కావాలని తగదా పెట్టుకుందిట. [ఆ తగవులో తప్పులెవరివో నాకు తెలియదు. మా ఆయమ్మ చెప్పిన విషయాలే ఇక్కడ నేను ఉంటంకిస్తున్నాను.] ఆ తగవు వంకపెట్టుకుని ఆ సాధమ్మ మా ఆయమ్మని కర్రతోనూ, చీపురుతోనూ కొట్టింది. వళ్ళంతా వాచిపోయి, మా ఆయమ్మ ఓరోజు స్కూలుకు రాలేదు. మర్నాడు వచ్చినప్పుడు కదుములు చూపించి ఏడ్చింది. నాకు మనసంతా బాధగా అన్పించింది. కానీ నేను అందులో కల్పించుకోలేదు. మనసెందుకో కీడు శంకించింది. 1995 లో నాగరత్నమ్మ అనే సాధు మహిళ విషయంలో ఇలాగే మేము స్పందించాము. కళ్ళ ఎదుట అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవటం సరైనదా లేక దాన్ని నిరోధించే ప్రయత్నం చెయ్యటం సరైనదా అన్న విషయంలో మాకు సందేహం లేదు. మనకెందుకు అని ఊరు కోలేము కూడా!. అయితే ఆయమ్మ విషయంలో, నాకు స్ట్రాటజీ అర్ధమైంది. ఒకవేళ మేం కలగజేసుకుంటే, సమస్య పరిష్కరింపబడక పోగా, మరింత జటిలం అవుతుంది. తర్వాత అది మన మెడకు చుట్టుకుంటుంది. లేదా చూస్తే అప్పుడు ఆయమ్మ తప్పలు బయటకు రావచ్చు. అప్పుడు అందరూ కలిసి “ఇలా అందరి వ్యవహారాల్లో వేలు పెడతారు. అ కారణంగానే మీరు ఎక్కడా సుఖంగా ఉండలేకపోతున్నారు” అంటూ క్లాసు పీకటం ఖాయం. తర్వాత అదే నెపంగా చూపెట్టి మా రూం క్యాన్సిల్ చేయడం కూడా ఖాయం. ఇది మాకు అర్ధం అయ్యింది. ఒకసారి రామోజీరావు ఉనికి అర్ధమయ్యాక, చచ్చినట్లు గూఢచర్యమూ అర్ధమౌతుంది. నదిలో పడ్డవాడు చచ్చినట్లు ఈత నేర్చుకోవడం వంటిదే ఇది కూడా! ఈత నేర్చికపోతే ఏముంది? మునిగి, మురిగి ఛస్తాడు మరి!

అంచేత ఆయమ్మ విషయంలో, మేము ప్రత్యక్షంగా కల్పించుకోలేదు. ఒకటి రెండురోజులు మా ఇంట్లోనే స్నానపానాలు చేసుకోమన్నాను. తెలిసిన వారి ఇంట కొన్నిరోజులు రాత్రిళ్ళు ఉంది. గొడవచల్లారింది అనుకున్నాక మళ్ళీ తన గుడిసెకు వెళ్ళింది. అంతే! మళ్ళీ ఆ సాధమ్మ, ఈ ముసలావిడ మీదకు వచ్చి, పిడిగుద్దులు గుద్ది, మర్మాంగంపై కొట్టింది. మా అయమ్మ బక్కగా ఉంటుంది. ఆ బిచ్చగత్తె మహాలావుగా బలంగా ఉంటుంది. ఎంతగా బాదిందంటే మర్మాంగం వాచిపోయేటంతగా! నేను ఆయమ్మని “మన పిల్లల తండ్రులు పోలీసులున్నారు గదా! అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పు” అని పంపించాను. ఒక్కరూ ఆవిడకు సాయం చేయలేదు. ఒకరోజు ఎ.ఎస్.ఐ. తమ పిల్లల ప్రవర్తన గురించి ఏదో అడగటానికి స్కూలుకు వచ్చాడు. మేము “ఏమండీ! మమ్మల్ని ఇంత సర్వీసు అడుగుతున్నారు. పాపం మా ఆయమ్మ, వయస్సులో పెద్దది. మీ పిల్లలకే సర్వీసు చేస్తుంది. ఆమెనెవరో ఓ బిచ్చగత్తె రోజూ కొడుతుందట. వారం రోజులుగా మీ కానిస్టేబుళ్ళ అందరిళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఒక్కరూ హెల్పు చెయ్యడం లేదు. ఇదేమైనా న్యాయంగా ఉందా?" అని నిలదీసాము. దాంతో అతడు తర్వాత స్కూలుకి రావటం మానేసాడు, పిల్లల్ని తీసుకెళ్ళటానికి అతడి భార్యబదులుగా, అతడి మామగారు రావటం మొదలుపెట్టారు. ఆయమ్మని స్టేషన్ కి వెళ్ళి ఎస్.ఐ. గారిని చెప్పుకోమని చెప్పాము. ఆ ముసలావిడ వినలేదు. ఆవిడ ఆగుడిసెని వదిలేసి, వేరేచోట గుడిసె వేసుకుందామని, ఎవరికో రెండువేలరూపాయలు ఇచ్చింది. కట్టెలూ, గడ్డి తెచ్చి గుడిసె వేసేందుకు వాడు డబ్బు తీసుకుని, ఇంతే సంగతులు అన్నాడు. ఇటు గుడిసె వేసి పెట్టడు. అటు ఆమె డబ్బులూ తిరిగి ఇవ్వడు. దాదాపు రెండుమూడు నెలలు నడిచిందీ వ్యవహారం. మేం మాస్కూలు విద్యార్ధుల తండ్రులైన పోలీసుకానిస్టేబుళ్ళకీ, వారి భార్యలకీ ఎప్పుడు కన్పిస్తే అప్పుడు మా ఆయమ్మకి సాయం చెయ్యమని చెప్పటం, ఒకోసారి దెప్పటం చేసేవాళ్ళం. చివరికి ఒక కానిస్టేబుల్ వెళ్ళి, అవతలి వాణ్ణి బెదిరించి ఆమె డబ్బు ఆమెకి ఇప్పించాడు.

నిజానికి కళ్ళముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించటం, ఎదిరించటం కన్నా కష్టం అన్న విషయం అప్పుడు మాకు బాగా అర్ధమయ్యింది.

ఇంతలో 2007 మార్చి వచ్చింది. మేము నాల్గవ యూనిట్ టెస్ట్ కి పిల్లల్ని తయారు చెయ్యటం, రివిజన్, ప్రశ్నాపత్రాల తయారీ పనులతో తలమునకలై ఉన్నాము. మార్చి 8 తేదిన కానిస్టేబుల్ సుధాకర్ వచ్చి “మేడమ్! మీరు ఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి ఏవో కంప్లైంట్లు పెట్టారట కదా! అవి కర్నూలు ఎస్.పి.గారి దగ్గరి నుండి సి.ఐ.గారి దగ్గరికి వచ్చాయి. సార్ మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నాడు. ఏవో స్టేట్ మెంట్లు ఇవ్వాలట” అని చెప్పాడు. ఆరోజు వర్కింగ్ డే. దాంతో మావారు రెండు క్లాసులు చూసుకుంటుండగా, నేను మాపాపను తోడుగా తీసుకుని, ఉదయం 10 గంటలకి పోలీసు స్టేషన్ కి వెళ్ళాను. సి.ఐ.కరుణాకర్, యస్.ఐ.నాగేశ్వర రావులు నన్ను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. ‘మీరు కంప్లైంట్స్ ఇచ్చారట గదా’ వంటి ఫార్మల్ ప్రశ్నలు వేసారు. అంతకు ముందే, సి.ఎం. పేరిట వ్రాసిన ఫిర్యాదు forward చెయ్యమని ఆగస్టు, 2006 లో కలిసినప్పుడే, అన్ని వివరాలు చెప్పి ఉన్నందున ఇక దాని గురించి పెద్ద సంభాషణ లేకుండా తెల్లకాగితం తీసుకుని స్టేట్ మెంట్ వ్రాయటానికి కూర్చున్నారు.

అందులో భాగంగా సి.ఐ. కరుణాకర్ “అదికాదమ్మా! అసలు మీరు రామోజీరావు మీదే ఎందుకు కంప్లైంట్ చేసారు?" అన్నాడు. అతడి ప్రశ్న, ప్రశ్నించిన తీరు కూడా నాకు అర్ధంకాలేదు. అతడు మళ్ళీ రెట్టిస్తూ “అతడి మీదే ఎందుకు, ఎందుకు కంప్లైంట్ చేశారు?" అన్నాడు. నేను ఠపీమని “తప్పా?" అన్నాను. అతడు అంతకంటే స్థాయి పెంచుతూ అదేప్రశ్న వేసాడు. నేనూ అదేస్థాయిలో “తప్పా?" "తప్పా?" అన్నాను. దాదాపు స్టేషన్ మొత్తం మా గొంతులు మార్ర్మోగాయి. ఇంతలో యస్.ఐ. నాగేశ్వరరావు కల్పించుకుని, పరిస్థితిని చల్లబరుస్తూ “అది కాదమ్మా! అతడి మీద మీరు కంప్లైంటు చేశారంటే అతడికీ మీకూ, ఏమైనా వ్యక్తిగతమైన స్పర్ధలు గానీ, కక్షలు గానీ ఉన్నాయా అని మా సి.ఐ.గారి ఉద్దేశం” అన్నాడు . నేను “సర్! అతడికీ నాకూ మధ్య వ్యక్తిగత స్పర్ధలో, కక్షలో, కారణాలో ఉండటానికి అతడి లెవల్ నాది కాదు, నా లెవెల్ అతడిది కాదు. అతడి స్థానంలో ఇంకెవరున్నా నేనిలాగే స్పందిస్తాను. ఇలాగే కంప్లైంట్ ఇస్తాను. ఒకనేరం జరిగిందని, మనకు తెలిసినప్పుడు, ఓ హత్యకు కారకుడెవరో మనకు తెలిసినప్పుడు, పోలీసులకి చెప్పాలని మీరే చెబుతారు గదా! అటువంటిది మన దేశానికి వ్యతిరేకంగా ఇన్ని చేస్తున్నాడని, సాక్షాత్తూ మాజీ ప్రధానినే హత్య చేయించాడని తెలిసినప్పుడు, పైకి ఫిర్యాదు చేయడం తప్పా?" అన్నాను.

అతడు “అయ్యో! అది తప్పని మేం అనటం లేదమ్మా! జస్ట్, అది మా ఎంక్వయిరీ పద్దతి [?] అంతే!” అన్నాడు.

స్టేట్ మెంట్ వ్రాయటానికి ఒక కానిస్టేబుల్ ని పిలిచారు. సి.ఐ. డిక్టేట్ చేస్తుండగా కానిస్టేబుల్ తెలుగులో వ్రాసాడు. మధ్యమధ్యలో నన్నువివరాలు అడుగుతూ దాదాపు రెండుపేజీల రిపోర్టు/స్టేట్ మెంట్ వ్రాసారు. వ్రాస్తున్నప్పుడు రామోజీరావుని గురించి ‘ఆయన’ అంటూ బహువచనం వ్రాయబోయారు. నేను అభ్యంతరం చెబుతూ “రామోజీరావుని నేను బహువచనంలో ఎప్పటికీ గౌరవించనండి. అతడు అని వ్రాయండి” అని చెప్పాను. స్టేట్ మెంట్ వ్రాయటం పూర్తిచేసి నన్ను సంతకం పెట్టమన్నారు. ఆ కాగితం నా చేతిలోకి తీసుకుని ఒకటికి రెండుసార్లు చదివాను. తర్వాత “అసలీ స్టేట్ మెంట్ అవసరం ఏమిటి సార్? ఎందుకు ఇదంతా వ్రాయించుకుంటున్నారు? ఈ ప్రాసెస్ అంతా ఏమిటి?" అని అడిగాను. సి.ఐ. “మీరు ఈ కంప్లైంటు, 2005 లో ప్రధానమంత్రికి పెట్టారమ్మ. తర్వాత రాష్ట్రపతికీ, సోనియాగాంధీకి కూడా పెట్టారు. అప్పుడేదో మీరు ఆవేశంలో కంప్లైంట్ పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు ఆలోచించుకుని ఉపసంహరించుకోవచ్చు. ఇప్పటికీ మీరు ఆ ఫిర్యాదుకి కట్టుబడి ఉంటారా లేదా అన్న నిర్ధారణ కోసం ఇలా స్టేట్ మెంట్ వ్రాయించుకుంటాము. ఇది మా అడ్మినిస్టేషన్ పద్దతి” అన్నాడు, తన టేబుల్ పై నాచేతి వ్రాతలో ఉన్న కంప్లైంట్స్ తాలూకూ జిరాక్స్ కాపీలు సెట్ ని చూపిస్తూ.

నేను “ఖచ్చితంగా నేను ఆ కంప్లైంట్ కే కట్టుబడి ఉన్నానండి. అదే మరోసారి స్పష్టంగా వ్రాయించండి ఈస్టేట్ మెంట్ లో. అంతేకాదు, 1992 లో నేను చేసిన పనికి [అంటే రామోజీరావు మీద పీవీకి ఫిర్యాదు చెయ్యటం] ఇప్పటికీ నేను పశ్చాత్తాపపడటం లేదు. ఒకవేళ మళ్ళీ అవకాశం వస్తే, మరో వందసార్లు ఇదే చెయ్యటానికి కూడా వెనుకాడను నేను” అని తెగేసి చెప్పాను. స్టేట్ మెంట్లో తుదిమెరుగులు దిద్దించిన తర్వాత, సంతకం పెట్టి ఇచ్చాను. సి.ఐ. “మీభర్తా, మీ పాప కూడా ఢిల్లీకి పంపిన ఫిర్యాదుల్లో సంతకాలు చేశారమ్మా. అందుచేత వాళ్ళ నుండి కూడా స్టేట్ మెంట్లు తీసుకోవాలి. సాయంత్రం రండి” అన్నాడు. సాయంత్రం వెళ్తే అతడు లేకపోవటంతో, ఆ కార్యక్రమం మర్నాడు ఉదయం [మే 9th , 2007] ముగిసింది. చివరిగా సెలవు తీసుకొనేటప్పుడు నేను “సార్! స్టేట్ మెంట్లు తీసుకుని పైకి పంపుతారు కదా? తర్వాత ఏమవుతుంది?" అని అడిగాను.

"ఏమోనమ్మా! ఆ రామోజీరావు మీద ఆరెస్ట్ వారెంట్ ఇక్కడ ఇష్యూ చేయిస్తారో? లేక హైదరాబాదు లెవెల్లో అతణ్ణి అరెస్టు చేస్తారో, చూడాలి! అయినా మీరు క్రింది నుండి పైకి వెళ్ళాల్సింది. బదులు మీ ఫిర్యాదు పైనుండి క్రింది కొచ్చింది?" అన్నాడు. మేము అతడి దగ్గర సెలవు తీసుకుని వచ్చేసాము.

ఇది జరిగిన నాలుగో రోజు సాయంత్రం 8 గంటలకి ట్యూషన్ అయిపోయి, అప్పుడే విశ్రాంతిగా కూర్చున్నాము. దేవస్థానం కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీను వచ్చాడు. “మేడమ్! మీకు నోటిసు” అంటూ ఓ కాగితం నాచేతికిచ్చాడు. అతడి కాపీ మీద రిసీవిడ్ సంతకం పెట్టి తీసుకున్నాను. ఆ నోటీసులో తమ staff representation dt. 10/03/07 ని రిఫర్ చేస్తూ ఈ.వో. మా రూమ్ i.e. accommodation కాన్సిల్ చేస్తూ పంపిన ఆర్డర్ అది. 15 రోజుల్లో గది ఖాళీ చేసి దేవస్థానానికి అప్పగించాల్సిందిగా ఉంది. కేవలం మా ఒక్కరికే పంపిన నోటిసు అది. [దాని Copy, Coups on World లో ఉంచాను.] సి.ఐ. కరుణాకర్ మార్చి 9 వ తేదిన చెప్పిన ప్రకారం, రామోజీరావు ఆరెస్టు అయిపోతాడని మేమేమీ ఉర్రూతలూగిపోవటం లేదు. ఏం జరుగుతుందో నని జాగ్రత్తగా పరిశీలన మాత్రమే చేస్తున్నాం. అందుచేత ఈ నోటిసుకి మేమేమి షాకై పోలేదు. నోటిసు తెచ్చిన శ్రీనుతో “ఇంకా ఇలాంటివేం రాలేదా? అని ఎదురుచూస్తున్నానయ్యా! నువ్వొచ్చావు” అన్నాను నవ్వుతూ. పాపం ఆ పిల్లవాడు! అతడు భయంగా “నాదేముంది మేడం? కృష్ణయ్యసార్ ఇచ్చిరమ్మన్నాడు. వచ్చాను” అన్నాడు. “అయ్యో! ఫర్లేదు నాయనా! నేను నిన్నేమీ అనటం లేదు” అని అతణ్ణి పంపించేసాను. తర్వాత సమాచార సేకరణ ప్రారంభించాము. మా విద్యార్ధుల తండ్రి, దేవస్థాన ఉద్యోగి అయిన వెంకటేశ్వర రావుకి ఫోన్ చేసి, దేవస్థానం ఆఫీసులో ఏంజరిగిందని అడిగాము. అతడు “ఇదంతా కృష్ణయ్య చేస్తున్నాడు మేడం! మీరేదో కంప్లైంట్ పోలీసు స్టేషన్ లో పెట్టారట. దాంతో సి.ఐ. గారు మీ సత్రంలో క్రింద ఉన్న వాళ్ళని ఆడాళ్ళనీ, మగాళ్ళనీ కూడా పిలిపించి స్టేట్ మెంట్లేవో వ్రాయించుకున్నారట. దాంతో కృష్ణయ్య అటెండర్ ఉన్నాడు చూడండి, రమణయ్య! అతడు, ఇంకా మిగిలిన వాళ్ళు ఈ.వో. గారిని కలిసి ‘ఆదిలక్ష్మి అన్న ఆవిడ మమ్మల్ని రోజూ, పొద్దున లేచింది మొదలు తిడుతుంది సార్! ‘నేను రామోజీరావు మీద కంప్లైంట్ పెట్టాను. చంద్రబాబు నాయుడి మీద కంప్లైంట్ మీద పెట్టాను. మీలాంటి వాళ్ళను అసలు లెక్కే చెయ్యను’ అంటూ తిడుతుంది. ఆవిడ రూమ్ కాన్సిల్ చెయ్యండి’ అని రిక్వెస్ట్ పెట్టుకున్నారట. ఈ.వో. [ఇతడు పేరు హరి జవహర్ లాల్. రెవిన్యూ డిపార్ట్ మెంట్ నుండి డిప్యూటిటేషన్ మీద శ్రీశైలం ఈ.వో.గా వచ్చి కొన్నినెలలైంది. ఇతడు వచ్చాకే శ్రీశైలంలో ప్రైవేటు వ్యక్తులందరికీ రూములు కాన్సిల్ చేస్తూ జనవరి, 2007 లో నోటిసు జారీ చేసాడు.] డిప్యూటి ఈ.వో. కృష్ణయ్యకి మార్క్ చేసాడట. కృష్ణయ్య మీ సత్రంలో ఎంక్వయిరీ చేశాట్ట. ‘అవును. ఆవిడ అలాంటి మనిషే. అందరితో తగాదాలు పెట్టుకుంటుంది. కాబట్టి room accommodation cancel చేయవచ్చు” అని రిపోర్ట్ వ్రాసాడట. దాంతో మీకు రూం కాన్సిల్ చేస్తూ నోటిసు పంపారు’ అంటూ వివరాలు చెప్పాడు.

నిజానికి మేము ఉదయం ‍6 గంటల నుండి రాత్రి 7.30 గంటల దాకా స్కూల్లో క్లాసులూ, స్టడీ పీరియడ్లూ నడుపుతాము. క్షణం తీరికా ఉండదు, ఎవరితో ఏవీ మాట్లాడే ఓపికా ఉండదు. ఏదో దైనందిన పలకరింపులు, సెలవురోజుల్లో కాస్తంత మాటమంతీ తప్పితే పెద్దగా ఏం ఉండదు. అందునా రామోజీరావు గురించైతే మేము అసలు ఫ్లోరు మీద నోరేవిప్పము. 2005 లో ఢిల్లీ వెళ్ళి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసి వచ్చాక కూడా, నార్త్ టూర్ వెళ్ళామనే చెప్పాము. 2006, ఆగస్టులో పోలీసు స్టేషన్ లో సి.ఐ.తో చెప్పి, సి.ఎం.కి వ్రాసిన ఫిర్యాదు నకలు అందచేసాక కూడా, మేము ఇంటి చుట్టూప్రక్కల వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు. అటువంటిది ‘నేను రామోజీరావు మీదా, చంద్రబాబునాయుడి మీద కంప్లైంట్ చేసాను. మిమ్మల్ని లెక్క చెయ్యను’ అంటూ ప్రతీరోజూ పొద్దున్నుండీ సాయంత్రం దాకా వాళ్ళని తిడుతూ ఉండటమా? అంత తీరికా కూడానా? అందునా క్రింది అంతస్థువాళ్ళు మమ్మల్ని తరచుగా బూతులు తిట్టటం అక్కడ అందరికీ తెలిసిన విషయమే, మా పిల్లల తల్లిదండ్రులకీ, మా అంతస్థులోని వారికీ, మా ఎదురు వీధివారికీ. [అక్కడే ఉన్న పోలీసు వారితో సహా] ఇంత అడ్డగోలు ఆరోపణతో, మాకు సమస్య తీవ్రత అర్ధమైపోయింది. అయినా సహనంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేశాం. అసలు ఈనేపధ్యంలో సి.ఐ.పాత్ర ఏమిటో, స్టేట్ మెంట్లు డ్రామా ఏమిటో మాత్రం అర్ధం కాలేదు. నాలుగురోజుల్లో ఉగాది సెలవులు వచ్చాయి. శ్రీశైలంలో ఉగాదికి కన్నడ భక్తులు లక్షలుగా వస్తారు. అంచేత వారం రోజులు ప్రత్యేక సెలవులు తప్పనిసరి.

ఉగాది సెలవుల్లో హైదరాబాదు వెళ్ళాము. వెళ్ళాక, మనస్సుండబట్టుకోలేక మావారికీ, మా తమ్ముడికీ గల ఉమ్మడి స్నేహితులని విచారించి, మా తమ్ముడి కొత్త ఫోన్ నెంబరు సేకరించి ఫోన్ చేశాము. అంతకు క్రితం సంవత్సరాల్లో, మేం శ్రీశైలంలో కాస్త నిలదొక్కుకున్నాక, మా చెల్లికి ఫోన్ చేస్తే ఆ నెంబరు కాల్ ఎవరో కొత్తవారు అందుకున్నారు. మా చెల్లి వాళ్ళు పల్లెలో తమ పొలం, రైసుమిల్లు గట్రా అమ్మేసి హైదరాబాదు మకాం మార్చారనీ, పాత ల్యాండ్ లైన్ ని తమకి బదిలీ చేసారనీ చెప్పారు. మా తమ్ముడు లైన్ లోకి వచ్చాక, క్షేమసమాచారాలు అడిగాను, మాచెల్లి గురించి అడిగితే చనిపోయిందని చెప్పాడు. ‘ఒక్కసారి వచ్చిపోకూడదా?’ అన్న మా తమ్ముడి పిలుపు మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పటికి మా అమ్మకూడా అక్కడే ఉంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర తమ షాపుని రోడ్ ఎక్స్ టెన్షన్ లో కొట్టేసారని, కొత్త షాపు పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాననీ మా పెద్దతమ్ముడు చెప్పాడు. చిన్న తమ్ముడు వేరుగా ఉంటున్నాడనీ, చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడనీ చెప్పాడు. మాచెల్లి వాళ్ళు కొండాపూర్ లో ఉంటున్నారనీ, అక్కడే ఇల్లుకూడా కొనుకున్నారనీ, కిరాణా షాపు పెట్టుకున్నారనీ చెప్పాడు. మూడు నెలల క్రితం, అంటే 2006, డిసెంబరులో మా చెల్లి చనిపోయిందని చెప్పాడు. హత్యో, ఆత్మహత్యో తెలియదు. శరీరం కిటికీ ఊచలకి చీర కొంగుతో ఉరిపెట్టుకున్నట్లుగా ఉంది. ఆ ఫోటో చూసి నాకు చాలా దుఃఖం కలిగింది. కానీపూర్తిగా నిబ్బరించుకున్నాను. మాచెల్లి కొడుకునీ, తమ్ముళ్ళ పిల్లలనీ చూసి, కాస్సేపు వాళ్ళతో గడిపి వచ్చేసాము. మా చెల్లి మరణం గురించి మా అమ్మవాళ్ళు చెప్పిన కారణాలు [భార్యభర్తల మధ్య తగవులు] నాకంతగా నమ్మశక్యం అన్పించలేదు. ఏం జరిగిందో తెలియదు. అల్పాయుష్కురాలిగా నా చిన్నచెల్లెలు ఈ లోకం నుండి నిష్ర్కమించింది. అంతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!
************

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu