ఇలాగే మరో నెల గడిచింది. అంతలో నన్ను సాయి స్టడీ సర్కిల్ మేనేజ్ మెంటు, ‘SR నగర్ లో కాదు, దిల్ షుక్ నగర్ బ్రాంచిలో క్లాసులు తీసుకొమ్మ’న్నారు. మెహదీపట్నంలోని నానల్ నగర్ నుండి దిల్ షుక్ నగర్….. ప్రతిరోజూ రెండు బస్సులు మారి, గంటల కొద్దీ ప్రయాణం చేసి వెళ్ళాల్సి వచ్చేది. గత్యంతరం లేక అలాగే కష్టపడ్డాను. మా తమ్ముడు అప్పటికీ మావారికి ఏ ఉద్యోగమూ చూడలేదు. ఇతరత్రా మేం చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. మరో మిత్రుడి ద్వారా ప్రయత్నించగా, బార్ అటెండెంట్ జాబ్ ఇప్పిస్తామన్నారు. మావారికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఇద్దరం గౌరవనీయమైన కుటుంబాల నుండి వచ్చాము. అలాంటి ఉద్యోగం చెయ్యటం అసాధ్యం అన్పించింది. అయినా నాకష్టం చూడలేక తను చెయ్యటానికి సిద్దపడ్డాడు. తీరా మేం సిద్దపడేసరికి, ఆ బార్ వాళ్ళమీద ఏదో కేసయ్యి బార్ మూసుకున్నారంటూ, ఆ ఉద్యోగమూ లేదని చావు కబురు చల్లగా చెప్పబడింది. నేను అలాగే దిల్ షుక్ నగర్ వెళ్ళి వస్తూ క్లాసులు తీసుకుంటున్నాను. యస్.ఆర్.నగర్ బ్రాంచిలో గానీ, దిల్ షుక్ నగర్ లోగానీ నేను నా కొలిగ్స్ తోనూ, ఇతర సిబ్బందితోనూ నా స్వవిషయాలు ఏవీ మాట్లాడేదాన్ని కాదు. పిల్లల తీరుతెన్నుల గురించి, సినిమాలు, వాతావరణం గురించి ఏదో పిచ్చాపాటి తప్ప మరేం మాట్లాడేదాన్ని కాదు. దాదాపుగా అంత తీరిక కూడా ఎప్పుడూ ఉండేది కాదు. వెళ్ళటం, ఆఫీసులో సంతకం పెట్టేసి క్లాసులు తీసుకోవటం, వచ్చేసే ముందు మరోసారి ఆఫీసులో కనబడి వచ్చేయటం… ఇంతే! నెల గడిచాక ఈ సారి జీతం నగదు ఇవ్వకుండా చెక్కు ఇచ్చారు. నాకు బ్యాంకు అకౌంటు లేదని, అంచేత నగదు ఇవ్వమని అడిగాను. మేనేజ్ మెంటు [అతడి పేరు రఘు రామ్ అనుకుంటా] ఏవో వంకలు చెప్పారే గానీ నగదు ఇవ్వలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మా పెద్దతమ్ముడి సాయంతో ఓ బ్యాంక్ ఖాతా తెరిచి చెక్కు అందులో డిపాజిట్ చేశాను. వారం తిరక్కుండా అది బౌన్స్ అయ్యింది. అదేమిటని మేనేజ్ మెంట్ ని అడిగితే “మీకు వసూలు చేసుకోవటం తెలుసు గదా! వసూలు చేసుకొండి” అన్న సమాధానం వచ్చింది. నా పరిస్థితి వాళ్ళకెలా తెలిసి, ఇంత ‘బేఫీకర్’గా జవాబిచ్చాడో అర్ధంకాలేదు. అదీగాక ఊరు[సూర్యాపేట] వదలి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇంకా ఏమిటిది? అన్న అయోమయం, అందోళనా కలిగాయి. ఆషాక్ లోనే మా తమ్ముణ్ణి ఈ విషయంలో ఏదైనా సాయం చేయమన్నాను. వాడి కస్టమర్లలో పోలీసు ఉన్నతాధికారులు, IAS అధికారులు కూడా ఉన్నారు. కానీ నా తమ్ముడు కనుక్కుంటాను అని, తరువాత చాలా మామూలుగా “మీరే వెళ్ళి కేసు పెట్టుకోవాలి.అంతే, నేనేం చెయ్యలేను” అని అన్నాడు. ఆపాటి నాకు తెలియదా? అంతకుముందు ఫ్యాక్టరీ నడుపుతున్నప్పుడు ఇలాంటి వ్యవహారాలు తెలియని దాన్నికాదు గదా! నిజానికి చెక్కు బౌన్స్ కేసు తీవ్రమైనది. అయినా ఆ నిస్సహాయస్థితిలో నేను కేసు పెట్టలేను. పెట్టినా సమస్య పరిష్కరించుకోలేను అన్పించింది. స్టేషన్ చుట్టూ తిప్పుకుంటే, ఉన్న డబ్బులన్నీ తిరగటానికే అయిపోతాయని అన్పించింది. [బౌన్స్ చెక్, బ్యాంకు నోట్ స్కాన్డ్ కాఫీ Fire Pot లో ఉంచాను.]

ఈ స్థితిలో నాకూ, నాభర్తకీ కూడా ఏ ఉద్యోగమూ లేకుండా పోయాయి. మేమున్న రేకుల షెడ్డు అద్దె కట్టలేని స్థితి. తన షాపు నెలసరి ఖర్చు లక్షరూపాయలు ఉందని చెప్పిన నా తమ్ముడు నాకు 200/- రూ. ఇవ్వడానికి చాలా ఇబ్బందులతో పంపాడు. ఆ స్థితిలో ఓసారి వరుసగా మూడురోజుల పాటు పస్తున్నాము. మాపాపకి మాత్రం రోజూ రెండుపుల్కాలు, చక్కెర వేసి పెట్టాను. మూడోరోజుకి పాపకి అది కూడా పెట్టలేకపోయాం. మూడోరోజు సాయంత్రం నా తమ్ముడు రెండువందలు పంపాడు. ఆ సాయంత్రం మెహదీపట్నం రైతుబజార్లో కేజీ 8/- రూ. లకు [అప్పటి ధర అది] మొద్దురకం బియ్యం ఓ పదికిలోలు కొని సంచిని తీసుకొని స్కూటర్ దగ్గరికి వస్తుంటే మాపాప [అప్పటికి దానికి ఆరు నిండి ఏడో సంవత్సరం వచ్చింది] మా వారి కాలికి ఎదురొచ్చి “డాడీ డాడీ ఇక మనం పస్తు ఉండక్కర్లేదు కదా?" అని అంది. ఆమాటకి నాకు కడుపులో పేగులన్నీ మెలిచుట్టుకుపోయినంత బాధ కలిగింది.

అప్పటివరకూ నాచిట్టితల్లికి తాను టోబు సైకిల్ తొక్కుతుంటేనో, వెదురు ఉయ్యాలలో ఊగుతుంటేనో అమ్మవెంటబడి కథలు చెబుతూ అన్నం తినిపించటమే తెలుసు. అటువంటిది పస్తులు, దారిద్ర్యం తనని ఎంతగా ప్రభావపరిచాయంటే “ఇక ఈ స్థితి శాశ్వతం ఏమో!” అనుకునేంతగా. అసలు పరిస్థితి మాకే అర్ధం కానిది తనకి మాత్రం ఏం అర్ధం చేయగలం? జీవితపు చేదు, ఆకలిని అంత పసితనంలోనే తను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఇక ఏమనగలం? తనని మానసికంగా బేజారవకుండా చూసుకోవలసి రావటం, మేం మానసికంగా డిప్రెషన్ కు గురవ్వకుండా చూసుకోవటం కత్తిమీద సామయ్యింది.

ఇంకా ఈ బాధలు చాలవన్నట్లు ఆ మురికి వాడ జనాలకి మేం వింతగా కనబడేవాళ్ళం. చూస్తే చదువుకున్న వాళ్ళం. స్కూటర్ ఉంది. కానీ ఒక్కసామాను లేదు. ఒక్క నగాలేదు. మా తమ్ముడు మాదపూర్ లో ఉన్నాడని చెబుతున్నాం గానీ, ఎప్పుడు మా అమ్మగానీ, నాతమ్ముడు గానీ, తెలిసిన బంధువులేవ్వరు రాలేదు. బహుశః ఏదైనా నేరం చేసి పారిపోయి వచ్చామో లేక లేచిపోయి వచ్చామో అన్నట్లు ఉండేది వారి డీల్ మాపట్ల. మా ఇంటి ఓనర్ [అది రేకుల షేడ్డు అయినా] కరెంట్ ఇచ్చేది కాదు. ఉదయం ఆరు గంటలకే మా గది స్విచ్చ్ లు ఆపేసేది. అటుప్రక్కన వేరే గది ఉండేది. వాళ్ళు ఎక్కువ సమానులు అన్నమాట. మా గది అద్దె చుట్టుప్రక్కల ఉన్న అన్నీ గదుల కంటే ఎక్కువ అన్నవిషయం తరువాత నాకు తెలిసింది. నీళ్ళు నిల్వ పెట్టుకోవటానికి మా దగ్గర టబ్బుల్లాంటి వేవీ ఉండేవి కావు. దాంతో వీధిలో ఉన్న కార్పోరేషన్ బోరింగ్ మీద ఆధారపడేవాళ్ళం. మాపాప నీళ్ళ బకేట్లకి బోరింగ్ కొట్టి నింపితే తను వెళ్ళి తెచ్చేవాడు. ఓ రోజు మా ఇంటి ఎదురువ్యక్తి ఆ బోరింగ్ కి ఇనుపగొలుసు వేసి తాళం వేసాడు; ‘నీళ్ళు కొట్టుకోవటానికి వీలు లేకుండా! అదేమిటంటే’ ’ఆ చప్పుడుకి తనకి నిద్రపట్టడం లేదట’. అందుకని తాళం వేసాడట. పైగా అంత చిన్న పిల్లతో నీళ్ళు కొట్టిస్తావా అంటూ మావారి పైకి నానాతిట్లు తిడుతూ కొట్టటానికి కొచ్చాడు. మేము పోలీసు కేసుపెడతామన్న తరువాత, అప్పటి వరకూ రాని చుట్టుప్రక్కల వాళ్ళు, హడావుడిగా వచ్చి, సర్ధి చెప్పి, గొడవను సద్దుమణిగించారు. తరువాత రోజులలో ప్రక్కవీధిలోకి ఇల్లు మారిపోయాము.

ఈ దశలో ఓరోజు మా తమ్ముడింటికీ మాదాపూర్ కి వెళ్ళాను. ఆరోజు మా పెద్దతమ్ముడు, అమ్మ ముఖం తప్పించారు. చిన్న తమ్ముడు దారుణమైన మాటలంటూ, మరోసారి ఆఇంటి గడప తొక్కవద్దన్నాడు. అప్పటికి జీవితంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. వాటిల్లో లోతుగా గాయపడిన సంఘటనల్లో ఇది ఒకటి. అప్పటికే నేను ఆక్రోశంలో ఉన్నాను. చాలా నైరాశ్యంలో ఉన్నాను. అంతకు ముందురోజు అదే అంటూ విపరీతంగా ఏడ్చాను. నా భర్తా, నాపాప ఎంతగా సంభాళించారో భగవానుడికే ఎరుక. ఆ మర్నాడు నాపుట్టింటి అవమానం. ఎంతగా అప్ సెట్ అయ్యానంటే… బాగా దుఃఖ పడ్డాను. ఈ స్థితిలో నిజంగా నాపాప, నాభర్త నాకు అండగా లేకపోతే బహుశః ఈబ్లాగు వ్రాయటానికి నేను ఉండేదాన్ని కాదేమో. కడుపులోని దుఃఖమంతా కరిగిపోయేదాకా ఏడ్చాను. ‘ఈ తమ్ముళ్ళ కోసమా 1992 కు ముందర జీవితాంతం అవివాహితగా ఉండిపోవాలనుకున్నాను?’ అనుకున్నాను.

నిజానికి మా అమ్మనాన్నలకు మేం అయిదుగురం సంతానం. నేను, నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు. నేను డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుండగా మానాన్న గారికి గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా మాకుటుంబ పరిస్థితి తల్లక్రిందులయ్యింది. అప్పటివరకూ ఉన్న పైచదువులు చదివించాలి అన్న ఆలోచన వదిలేసి మా అమ్మానాన్న మా ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళి ప్రయత్నాలు చేసారు. నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. దాంతో నా ఇద్దరు చెల్లెళ్ళకు వెంటనే పెళ్ళిళ్ళు చేసారు. అప్పటికి నా తమ్ముళ్ళిద్దరు బాగా చిన్నవాళ్ళు. 14 ఒకడికి, 15 ఏళ్ళు మరొకడికీ ఉంటాయి. అప్పటికే మా నాన్నగారు బ్యాటరీ తయారుదారుడిగా ఉండేవారు. కాకపోతే అది చాలా చిన్నషాపు. ఆ కుటుంబవ్యాపారాన్ని నేను చేతిలోకి తీసుకున్నాను. ఇంతలో హైదరాబాదులో యూసఫ్ గూడలో ఉన్న NISIT [కేంద్రప్రభుత్వ సంస్థలో] నాకు Enterpreneurship Development Promgram లో శిక్షణావకాశం వచ్చింది. Competative Test ద్వారా ఈ అవకాశం పొందాను. అందులో భాగంగా బొంబాయిలోని స్టాండర్డ్ బ్యాటరీ యూనిట్ లో శిక్షణ పొందాను. మార్కెటింగ్, బ్యాంకింగ్ సౌకర్యాల గురించి నేర్చుకున్నాను. ఆ తర్వాత మా నాన్నగారు పెట్టుకున్న ఇండియన్ బ్యాటరీ ఇండస్ట్రీస్ అన్న పేరుమీదనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లైసెన్సు తీసుకొని APSFC, Indian Bank లనుండి అప్పట్లోనే అంటే 1989 లో దాదాపు 45లక్షల రూపాయల పెట్టుబడిని [ఋణాలతో సహా] సమకూర్చి ఫ్యాక్టరీ పెట్టాను. ఈ లోపున దురదృష్టవశాత్తు నా రెండవ చెల్లి వివాహం విఫలమయ్యింది. ఆమె మా ఇంట్లోనే ఉంది. తనకే 1995 తర్వాత పునర్వివాహమై బాపట్ల దగ్గర పల్లెలో ఉంటోంది. నా పెద్ద చెల్లెల్ని మా బందువుల అబ్బాయికే ఇచ్చారు. ఆమె కూతురే చిన్నప్పుడు మా ఇంట పెరిగింది. ఆ బిడ్డంటే నాకు చాలా ముద్దు,ప్రేమ. 1992 నాటికి నేను దాదాపు వివాహ ప్రసక్తి మరిచిపోయాను. మా నాన్నగారికి గుండిపోటు వచ్చాక కుటుంబబాధ్యత నాభుజాలమీదకి తీసుకునేటప్పుడు నేను ఒకటే అనుకున్నాను. ‘ఒకవేళ నేనే కొడుకునై ఉంటే నా తమ్ముళ్ళ బాధ్యత, చెల్లెళ్ళ బాధ్యత తీసుకోనా?’ అని. కాబట్టి ఎవరూ ఇవ్వకుండానే ఆ బాధ్యత నా తల కెత్తుకున్నాను. ఇవన్నీ గుర్తుకొచ్చి బాగా వ్యధ చెందాను.

ఒకవేళ నేను ఈ కారణంతో గాక మరో కారణంతో ఫ్యాక్టరీ నష్టపోయినా, లేక ఫ్యాక్టరీ విజయవంతమైనా గానీ, నేను అవివాహితగానే ముసలిదాన్ని అయ్యాక, నా తమ్ముళ్ళు నాకు ఇదే చూపించి ఉండేవాళ్ళేమో అన్పించింది. ఫ్యాక్టరీ నడుపుతున్నప్పుడు వాళ్ళేదైనా పొరపాటు చేసినప్పుడు నేను తిట్టినవన్నీ గుర్తుచేసుకుని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నారా అన్పించింది. నేను తిట్టింది గుర్తుంది గానీ నాప్రేమ గుర్తులేక పోయిందా అన్పించింది. దుఃఖం తీరాక భగవద్గీతని ఆశ్రయించాను. అప్పుడే ‘గీత’ నాకు మరిన్ని కొత్తకోణాలలో అర్ధమయ్యింది. జీవితంలో అనుబంధాలకు పరిమితులేమిటో అర్ధమయ్యింది. ఒకసారి ఆ ఙ్ఞానం కలిగాక భగవద్గీతలోని

శ్లోకం:
అశోచ్యా నన్వశోచ స్త్వం ప్రఙ్ఞావాదాంశ్చభాషసే
గతాసూ నగతాసూంశ్చ నానుశోచన్తి పండితాః

భావం:
దుఃఖించదగని దాని గురించి దుఃఖించుట అనుచితమని పండితులు చెప్పుదురు. అత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరముల గురించి గానీ, నిత్యములూ, శాశ్వతములూ అయిన ఆత్మలు గురించిగానీ దుఃఖించరు.

ఈ శ్లోకం,భావం నన్ను బాగా ప్రభావితం చేశాయి. జీవితంలో అనివార్యమైన దాన్ని గురించి దుఃఖించటం అనవసరం అన్న భావన బాగా ఇంకింది. ఒకసారి ఇది అర్ధమయ్యాక ఇక త్వరగానే కోలుకున్నాను. అప్పటినుండి ఎన్నికష్టాల్లో ఉన్నా, ఎన్ని సమస్యల్లో ఉన్నా నవ్వడం నేర్చుకున్నాము. మా చుట్టూ అందరితో ఘర్షణ ఉన్నా, ప్రపంచం మొత్తంతో సంఘర్షిస్తున్నా, ఒక్కసారి తలుపులు ముసుకున్నామంటే మా ఇంట్లో మేం ముగ్గురం అనందంగానే ఉంటాం. జోకులేస్తూనే ఉంటాం. చివరికి మా కష్టాల మీద కూడా జోకు లేసుకుంటూనే ఉంటాం. అప్పటికే తెగిపోవలసినన్ని బంధాలు తెగిపోయాయి, అవి స్నేహ బంధాలయినా, కుటుంబబంధాలయినా! అలాగని మమ్మల్ని అసలు భావోద్రేకాలే ఆక్రమించవని అనను, ఎందుకంటే అది జీవితకాల సాధన గనుక. కానీ వాటిని బోల్డుకొంచెం బాగానే నియంత్రించుకో గలుగుతున్నామని చెప్పటమే నా ఉద్దేశం.

ఈవిధంగా దుఃఖాన్ని నిరోధించగలిగాక, మళ్ళీ మా పిరిస్థితులకి వ్యతిరేకంగా పోరాడేందుకు రీఛార్జి అయ్యాము. ఇక లాభం లేదని ఎంసెట్ ఫిర్యాదు పట్టుకుని ఈనాడుకి ఎక్కేప్రయత్నం చేశాము. ఈనాడు ఆఫీసుకి అప్రోచ్ అయ్యాము. వాళ్ళ ఎం.డి. కిరణ్ పి.ఏ. ని కాంటాక్ట్ చేశాము. అతడి పేరు రమేష్ లేదా ప్రసాద్. ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు. ఓ రెండురోజులు అప్పుడు ఫోన్ చెయ్యండి, ఇప్పుడు ఫోన్ చెయ్యండి అని తిప్పించుకొని చివరికి ‘నో’ చెప్పేసారు.

ఇక హైదరాబాదు వదిలేయటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చేసాం. మరోసారి మిగిలిపోయిన ‘పాత’ స్నేహితుల్ని కదిపాము. లాభం లేకపోయింది. అవనిగడ్డ ఎం.ఎల్.ఏ.గా ఉన్న మండలి బుద్దప్రసాద్ ని, ఎస్.ఆర్. నగర్ లోని వాళ్ళ ఇంటి అడ్రసు సంపాదించి వెళ్ళి కలిసాము. అతడు నన్ను చూసి గుర్తుపట్టాడు. “ఏమయ్యారమ్మా? ఓసారి మీ ఫ్యాక్టరీకి వెళ్తే మీరక్కడ ఉండటం లేదని చెప్పారు” అన్నారు. నేను “అవునండీ! ఫ్యాక్టరీ నష్టపోయాను. పెళ్ళిచేసుకున్నాను” అంటూ నాభర్తనీ, పాపనీ పరిచయం చేశాను. ఎంసెట్ పై నా ఫిర్యాదు, ఆపై మేం గురవుతున్న వేధింపు క్లుప్తంగా వివరించి, తమ నియోజకవర్గంలో, ఏ మారుమూల పల్లె అయినా ఫర్లేదు, ఓ చిన్న స్కూల్లో నాకూ, నాభర్తకూ చెరో వెయ్యి, పదిహేను వందలు వచ్చే టీచర్ ఉద్యోగాలు ఇప్పించమని అర్ధించాను. అతడు సాదరంగా కాఫీ ఇచ్చి ‘ఈ పరిస్థితుల్లో తానేమీ చెయ్యలేనని’ చెప్పాడు. అప్పటికి హైదరాబాదు ఇంటి నుండి బయటికి వచ్చి 2 నెలలయ్యింది. తిరిగి హైదరాబాదు ఇంటికి వెళ్ళలేకపోయాము. అందువలన అక్కడి సామాను తెచ్చుకొనే పరిస్థితికాని, అద్దె డబ్బులు గాని మాదగ్గర లేక అక్కడిసామాను అక్కడే వదిలేసుకోవలసి వచ్చింది.

ఇక ఏం చేసేందుకూ తోచలేదు. 1993 లో దాదాపు ఇదేస్థితిలో ‘దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు’ అనుకుంటూ శ్రీశైలం వెళ్ళడం గుర్తుకువచ్చింది. ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత, 2002 లో కూడా అదే స్థితి. దాంతో మళ్ళీ శ్రీశైలం వెళ్ళడమే ఉత్తమం అనుకున్నాము. మళ్ళీ ఒకసారి కొందరి మిత్రులని కదిపి, ఇక మార్గాంతరం లేక శ్రీశైలం చేరాము.

శ్రీశైలం చేరేటప్పటికి మా దగ్గర డబ్బులు ‘సున్నా’, బండిలో పెట్రోలు కూడా ‘సున్నా.’

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

"నేను తిట్టింది గుర్తుంది గానీ నాప్రేమ గుర్తులేక పోయిందా అన్పించింది. "
ఇంకా ఇలాంటి వారు ఉన్నారా అని ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం నిజమైన ప్రేమాభిమానాలు ఎప్పటికీ గుర్తింపబడవేమో

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu