"మా ఇంటి ఓనర్ మమ్మల్ని బూతులు తిడుతున్నది సార్. ఆవిడకి మరో నాలుగునెలలు ఆగమని చెప్పండి. ఈ సంవత్సరం అయిపోతే, పరీక్షలు కాగానే మేం మా ఊరు వెళ్ళిపోతాం. మా పిల్లలకి ఎంసెట్ పరీక్ష వరకూ చెబుతామని మాట ఇచ్చి ఉన్నాము. ఆవిడ మమ్మల్ని ప్రతీరోజూ బూతులు తిడుతుంది” అని కోటగిరి రాధాకృష్ణ కి చెప్పాను. అతడు “పోనీ మీరూ తిట్టండి” అన్నాడు. ఒక్కక్షణం విస్తుపోయాను. తర్వాత “అప్పుడు మేమూ ఆవిడ స్థాయికి పడిపోయినట్లే కదండి. పెంటమీద రాయి వేస్తే చింది మొహన పడుతుంది కదా!” అన్నాము. అతడు సంభాషణని దొర్లించాడు. ఇతడు తిప్పుకుంటున్నాడు గాని వ్యవహారం సెటిల్ అవ్వటం లేదు కదా అని, అధికార పార్టీ, సూర్యాపేట పట్టణ తెదేపా అధ్యక్షుడు గునగంటి రాములు ఇంటికి వెళ్ళాము. అతడి ఇల్లు మా ఇంటికి అవతలి వీధిలోనే ఉండేది. అతడూ, అతడి భార్య మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. మేము వివరాలన్నీ చెప్పాము. అతడూ, "ఈ రోజుల్లో మనం దేనికీ ఎదురు తిరగకూడదమ్మా! అన్నిటికీ తలవంచుకుని పోవాలి” అన్నాడు. నేను “సార్! మేము ఎవరి జోలికీ వెళ్ళము. చివరికి మా ప్రక్కింటి వారి పేరు కూడా తెలియదు మాకు. మా క్లాసులు, మా విద్యార్ధులు ఈ గొడవతోనే తెల్లారి పోతుంది మాకు. ఎంసెట్ ర్యాంకుల మీద కంప్లైంట్ అనుకొండి. అది అన్యాయం కదా? అందుకే కంప్లైంట్ చేసాము” అన్నాము.

అతడి భార్య “మీకర్ధం కావటం లేదు. మనం ఎందులోనూ తల దూర్చకూడదు. అప్పుడే హాయిగా ఉంటాం” అంది. నేను “మనం ఎందులోనూ తలదూర్చకుండా, ఇంట్లో కూర్చున్నా, వచ్చి మరీ పీక పిసుగుతుంటే కంప్లైంట్ ఇవ్వక ఏం చేస్తామండి” అన్నాను. “చంపయ్య చంపు” అనాలి అంది. ఆవిడ వితండవాదానికి నాకు విసుగొచ్చింది. ‘అదే ఆవిడే మా స్థితిలో ఉంటే అలాగే ఛస్తుంది కాబోలు’ అని మనస్సులో అనుకున్నాను. పైకి ఏదో అనబోయేంతలో గునగంటి రాములు కల్పించుకొని “నేను కనుక్కుంటానమ్మా!” అన్నాడు. మేము అతడిని రెండు favors అడిగాము. ఒకటి – విషయం మొత్తం పార్టీ తరుపున సి.ఎం. చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్ళమని, అలాగే వాళ్ళునడుపుతున్న ఫైనాన్స్ కంపెనీలో, క్రితంలో తీసుకున్న స్కూటర్ మీద లోన్ మళ్ళీ రిఫైనాన్స్ ఇప్పించమని అడిగాము. తీసుకున్న ఋణంలో వాయిదాలు క్రమం తప్పకుండా కట్టాము. తిరిగి మళ్ళీ ఋణం ఇప్పించమని అడిగాము. “రేపు ఏ విషయం చెబుతాను కలవండి” అన్నాడు. రేపు, మాపు అంటూ తిప్పించుకున్నాడు. చివరికి ఫైనాన్స్ కంపెనీలో భాగస్వాములు ఇప్పుడు ఎవరికి ఋణం ఇవ్వటం లేదని, అందుచేత ఇప్పించలేనని చెప్పాడు. విషయం సి.ఎం. దృష్టికి తీసుకెళ్ళటం గురించి తనకు వీలుపడటం లేదని, తమ ఎం.పి. అకారపు సుదర్శన్ వచ్చిన తరువాత ఆలోచించి తానే కబురు చేస్తానని మమ్మల్ని వదిలించుకున్నాడు. తరువాత వారం పదిరోజులలో నల్గొండజిల్లా జూనియర్ ఛాంబర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు జరిగాయి. అందులో గునగంటి రాములు కుమారుడిని అధ్యక్షుడిగానూ, వాళ్ళ ఫైనాన్స్ కంపెనీలోని పార్టనర్ ఆశోక్ ను ట్రెజరర్ గానూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారి ప్రమాణాస్వీకారానికి మీలా సత్యనారాయణ, లోకల్ ఎం.ఎల్.ఏ., మరి ఇద్దరు కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ.లు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. అట్టహాసంగా జరిగిన ఆ కార్యక్రమం గురించి నల్గొండ జిల్లా ఎడిషన్ వార్తాపత్రికలలో ఫుల్ పేజీ వాణిజ్య ప్రకటనలు వచ్చాయి. గునగంటి రాములుని డీల్ చేస్తున్నప్పుడు కూడా సమాంతరంగా మీలా సత్యనారాయణ అల్లుడు కోటగిరి రాధాకృష్ణని డీల్ చేస్తూనే ఉన్నాము. గునగంటి రాములని కలిసిన విషయం ఎప్పటికప్పుడు పారదర్శకంగా కోటగిరి రాధాకృష్ణకి చెప్పాం. జనవరి నెల అద్దె మా ఇంటి ఓనర్ తీసుకోవటం లేదు. అదే విషయం కోటగిరి రాధాకృష్ణకి చెబితే “పోనీ బ్యాంకులో డి.డి. తీసి ఇవ్వండి” అన్నాడు. ఆ సలహా బాగుందనిపించి వారి బ్యాంకులోనే [సుధా బ్యాంకు] 2100/- రూ.లకు Feb.22, 2001 న డి.డి. తీసి రిజిస్టర్ పోస్టులో పంపాను. అది ఆవిడకి ఫిబ్రవరి 26 న చేరింది. నేను మేడపైనుండి చూస్తూనే ఉన్నాను. Post Man రిజిస్టర్ పోస్ట్ అందిస్తే ఆవిడ అది తీసుకోవటానికి తిరస్కరించింది. పోస్ట్ మ్యాన్ అదేవ్రాసి, ఆ కవర్ ని మళ్ళీ మాకు redirect చెయ్యటంతో మర్నాడు అది మాకు అందింది. Coups on World /Documentary evidence లో ఆ కాపీ స్కాన్ చేసి ఉంచాను. Fire Pot లో దాని కాపీ చూడగలరు.

మేము [Feb.20, 2001] సాయంత్రం బయటికి వెళ్ళి 8:30 గంటలకు ఇంటికి వస్తే ఇంటి ఓనర్స్ బయటతలుపులకు తాళం పెట్టి రానివ్వలేదు. అప్పటికప్పుడు డి.యస్.పి. గారికివిషయం వివరించి చెప్పగా ఆయన టౌన్ ఏ.యస్.ఐ. పాషా కి ఫోన్ చేసి తాళాలు పగలుకొట్టి అయినా ఈరాత్రికి ఇంట్లో Accommodate చేయమని, వాళ్ళు రేపు ఉదయం కంప్లైంట్ ఇస్తారు, దాని మీద తగు చర్యలు తీసుకోమని, కరెంట్ కనెక్షన్ ఇప్పించమని చెప్పారు. మేము టౌన్ పోలీసు స్టేషన్ కు వెళ్ళగా యస్.ఐ. రాములు నాయక్ ఉన్నారు. ఆయన ఇంటి ఓనర్ ను పిలుచుకు రమ్మని నా భర్తను, ఒక పి.సి.ని పంపించారు. ఇంటి ఓనర్ రేపు వస్తానని, పోలీసు కానిస్టేబుల్ అడగగా,అడగగా పది నిమిషాలకు వస్తానని అన్నాడు. అప్పటికి సమయం దాదాపుగా 9:30 PM. 10గంటల ప్రాంతంలో యస్.ఐ. ఇంటి ఓనర్ రాలేదని రేపు మాట్లాడి సెటిల్ చేస్తానని చెప్పి మమ్మల్ని వెళ్ళమన్నాడు. మేము రాత్రంతా బయట ఉండాలా అంటే, యస్.ఐ. సమాధానం “అయితే మిమ్మల్ని ఎ.సి.రూములలో ఉంచాలా” అన్నాడు. ‘సరే అయితే కంప్లైంట్ తీసుకొని రిసీట్ ఇవ్వమని’ అడిగి, Receipt తీసుకొని [Receipt No.24] బయటికి వస్తుంటే, మళ్ళీ వెనక్కి పిలిచి ఒక ఎ.యస్.ఐ., ముగ్గురు పి.సి.లను ఇచ్చి పంపాడు. వాళ్ళు ఇంటి వాళ్ళతో గంట సేపు మా తరుపున గొడవ పడగా 11:20PM లకు ఇంట్లో Accommodate అయ్యాము. రేపు 10 గంటలకు పోలీసు స్టేషన్ కు రమ్మని ఇద్దరికి చెప్పారు. మేము మర్నాడు ఉదయం 10 గంటలకు వెళ్ళగా 10:45 AM లకు యస్.ఐ. ఇంటి ఓనర్స్ ను పిలిపించాడు.[ఇదే యస్.ఐ. నేను పిలిచిన వెంటనే రాలేదని నీవేమయినా PM of India అనుకుంటున్నావా అన్నాడు. మరి అతడి దృష్టిలో మా ఇంటి ఓనర్ PM of India కాబోలు.] ఇంతచేసి మా ఇంటి ఓనర్ మాత్రం రాలేదు. సి.ఐ.గారు వస్తారు ఉండండి అని చెప్పి, వాళ్ళు వెళ్ళిపోయారు. 11:30AM గం. లకు యస్.ఐ.కూడా వెళ్ళిపోగా మేము నరేంద్రరెడ్డి అనే పి.సి.ని సి.ఐ.గారు ఎప్పుడు వస్తారు అని అడిగాము. ఆయన వేరే వాళ్ళను అడగగా సి.ఐ.గారు రేపు సాయంత్రం ఉంటారు. లీవ్ మీద సి.ఐ.గారు హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు. ఇలా వీలయినంతగా వేధించారు.

ఆ రోజుల్లో మా ఇంటి ఓనర్ కి ఎంత ’హవా’ నడిచిందంటే ఓరోజు – యస్.ఐ.నో లేక సి.ఐ.నో మా ఇంటి ఓనర్ రత్నంని పిలుచుకురమ్మని కానిస్టేబుల్ ని పంపారు. మమ్మల్ని వేచి ఉండమని గంటనుండి కూర్చోబెట్టారు. ఓ పావు గంట తర్వాత ఆ కానిస్టేబుల్ వచ్చి “ఇప్పుడు పనుంది. తర్వాత వస్తానని చెప్పమన్నాడు సార్” అని చెప్పాడు. మరో పదినిముషాలు ఆగి మళ్ళీ కానిస్టేబుల్ ని పంపాడు సదరు పోలీసు అధికారి. ఈసారి కానిస్టేబుల్ తిరిగి వచ్చి “వస్తున్నాను, నువ్వెళ్ళు అన్నాడు సార్” అని చెప్పాడు. ఆ తర్వాత మరో కానిస్టేబుల్/ ఎ.యస్.ఐ. ద్విచక్ర వాహనం మీద అతణ్ణి వెనక ఎక్కించుకొని వచ్చాడు. అంతగా అతడికి పరపతి నడిచింది. అదంతా చూసి రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళు మీద కాదు, ఏకంగా ఒంటి కాలిమీదే నడుస్తుంది కాబోలు అనుకున్నాను. ఓప్రక్క కోపం, రోషం, నిస్సహాయత, అవమానం బాధిస్తున్నా మనస్సు ఆలోచించటం, పరిశీలించటం మానదు కదా! ఈ వేధింపుల గురించిన ప్రతి ఫిర్యాదు [మొత్తం 24 ఫిర్యాదులు] Coups on World లోRef. No. 1 లో ఉన్నాయి. అవన్నీ చేతివ్రాతలోనివి. కొన్ని తెలుగులో వ్రాసినవి. పాఠకుల సౌలభ్యం కోసం ఆంగ్లంలో టైపు చేసాము. అందుచేత అవసరమైన వాటిని స్కాన్ చేసి బ్లాగు Fire pot లో ఉంచాము.

ఫిబ్రవరి 20 వ తేదిన మొదటిసారి మా ఇంటిఓనర్ ఇంటికి తాళం వేసింది. రాత్రి 8:30 గంటల నుండి సాగిన నాటకీయత అర్ధరాత్రి 11:30 గంటలకి ఇంట్లోకి వెళ్ళగలిగాము. ఈ విషయమై కోటగిరి రాధాకృష్ణ సలహా మేరకు ఇంటి అద్దె డి.డి. పంపగా ఇంటి ఓనర్ తిరస్కరించింది. ఆవిడికి డి.డి. తీసుకోవటం భయమట. పోనీ బ్యాంకు ఎకౌంట్ నెం. చెప్పమని, జమ చేస్తామనీ అంటే చెప్పదట. ఎవరి మాటా వినదట. అప్పటికప్పుడు ఆమె మీద మేం పెట్టిన కేసు విత్ డ్రా చేసుకొని, ఇల్లుఖాళీ చేసి పోవాలట. పోలీసులంతా ఆమెకి అండదండగా ఉండగా ఇక మేము పెట్టిన కేసు ఆమెని ఏమి బాధిస్తోందో కూడా మాకు అర్ధంకాలేదు. తర్వాత మూడు రోజులకి అంటే ఫిబ్రవరి 23 వ తేదిన సి.ఐ.ఖాన్ మమ్మల్ని పిలిపించాడు. “మీరు ఎందుకు ఇల్లు ఖాళీ చేయటం లేదు? మూడు నెలల్లోగా ఖాళీ చేస్తానని వ్రాసిచ్చారు గదా?" అని అడిగాడు. నేను “మేం పెట్టిన వేధింపు కేసులో ఇది భాగం కదా? మీలా సత్యనారాయణ గారి అల్లుడు కోటగిరి రాధాకృష్ణ, రాజీ చేద్దామని త్రివేణి కాలేజీ వాళ్ళని పిలిపిస్తే ’ఆవిడింకా ఈ ఊర్లోనే ఉందా? మాకు తెలియదే?’ అన్నారట త్రివేణి వాళ్ళు. మరి మీరు చేసిన ఎంక్వయిరీ ఏమిటి?" అని నిలదీసాను. అతడు దానికి సమాధానం చెప్పకుండా “అయితే ఇప్పుడేం చెయ్యదలుచుకున్నారు?" అనడిగాడు. “మీ ఎ.యస్.పి. శివానందరెడ్డి గారు చెప్పారు ‘ఇంటి ఓనర్ ని కోర్టుకి వెళ్ళమని లేదా మమ్మల్ని కోర్టుకి వెళ్ళమని’. నేను అదే అనుకుంటున్నాను” అన్నాను. అతడు “కోర్టుకి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా?" అన్నాడు. నేను “I have trust in law and order, and in our constitution. If not, I can face my fate” అన్నాను. అతడు మా ఇంటిఓనర్ వైపు చూసి “వాళ్ళు కోర్టుకి వెళ్తారట. ఇక మీ ఇష్టం” అనేసి మమ్మల్ని వెళ్ళమన్నాడు.

రెండో రోజు అంటే ఫిబ్రవరి 25, 2001 వ తేది ఉదయం 9 గంటలప్పుడు మా ఇంటి ఓనర్ మళ్ళీ మా ఇంటికి కరెంట్ బోర్డు మీది fuse తీసేసింది. మాకు దిక్కు దరీ తోచలేదు. డి.యస్.పి. కి కంప్లైంట్ చేద్దామని ఆఫీసుకు వెళ్ళగా, డి.యస్.పి. కోదాడ వెళ్ళాడు. మళ్ళీ ఇంటికి తిరిగి రాగా మా ఇంటి ఓనర్ మళ్ళీ మా ఇంటికి తాళం వేసారు. మళ్ళీ డి.యస్.పి. ఆఫీసుకు వెళ్ళగా సాయంత్రం వరకూ రాడని తెలిసింది. నల్గొండ యస్.పి.ని దాదాపు సాయంత్రం 7 గం. ప్రాంతాంలో కలువగా యస్.పి. విషయం మొత్తం విని డి.యస్.పి.గారికి నోట్ వ్రాసారు. “C.No. 60/CC Cell/ Nalgonda, DSP, SRPT/Take n/a speak immedi. They allege that there is herrosment by local police.Pl. Check up.” అని వ్రాసారు. [Scanned Copy is in Fire Pot] అక్కడ నుండి సూర్యాపేట డి.యస్.పి. ఆఫీసుకు దాదాపు రాత్రి 10:30 గంటలకు రాగా, డి.యస్.పి. ఇంటర్ కమ్ లో మాట్లాడి లోకల్ పోలీసు స్టేషన్ కు వెళ్ళండి అన్నాడు. “వాళ్ళ మీద కంప్లైంట్ తో వేళ్తే వాళ్ళు ఎలా చేస్తారు” అని నేను అంటే, “అయితే నేను వచ్చి చేయాలా” అని డి.యస్.పి. అన్నాడు. “మరి నేనేమీ చేయాలి” అంటే “నిన్ను పోలీసు స్టేషన్ కు వెళ్ళమన్నాను” అని దురుసుగా సమాధానం చెప్పాడు. టౌన్ పోలీసు స్టేషన్ కు వెళ్ళగా ఎ.యస్.ఐ. పాషా కంప్లైంట్ తీసుకొని “పోలీసుల మీద కంప్లైంట్ చేస్తే ఎలా? రేపు వచ్చి సి.ఐ.గారిని కలవండి”. [Complaint No.25, dt.25/02/2001; 11:45PM] అన్నాడు. అంతేగాక ‘మేమేమీ మీ పాలెగాళ్ళం కాదు’ అనీ, ‘ఈ రసీదులు నాలుకగీచుకొనేందుకు కూడా పనికి రావనీ’ అన్నాడు.

ఈ విషయాలన్నీ సి.ఎం. చంద్రబాబు నాయుడుకు ’తెలుగు’లో కూడా వ్రాసాము. [ఎందుకు ‘తెలుగు’ అన్న పదాన్ని నొక్కి వ్రాసానంటే – ఈ మధ్య నా బ్లాగులో ఎనానిమస్ ల పేరిట కొందరు వ్యక్తులు నాకు స్కీజోఫినియా అనీ, డాక్టరుకు చూపించుకోవలసిందనీ, sickening అనీ వ్రాస్తూ, నా ఫిర్యాదులలో గ్రామర్ తప్పులున్నాయనీ, అందుచేత సి.ఎం.లకీ, పై అధికారులకీ, యు.పి.ఏ. కుర్చీవ్యక్తి సోనియాగాంధీ, గట్రాగట్రా లందరికీ అర్ధం కాకపోయి ఉండచ్చని వాదిస్తున్నారు. అందుచేత నేను ఫిర్యాదులని ఇంగ్లీషులోనే గాక తెలుగులోనూ వ్రాసాననీ, వ్యక్తిగతంగా కలిసి ముఖాముఖి వివరించానని అఙ్ఞాతలు గమనించగలరు. అంతేకాదు 1992 కు ముందు ఫ్యాక్టరీ నడిపేటప్పుడు పి.ఎం., సి.ఎం.లకు, కె.జె.రెడ్డి బ్యాంకింగ్ సెక్రటరీ గా ఉన్నప్పుడు అతడికి కూడా ఈ ఇంగ్లీషులోనే వ్రాసాననీ, అలాగే ఎందరో ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.లతో కూడా ఈ ‘ఇంగ్లీషు’తోనే deal చేసానని గమనించగలరు.]

ఇలా రెండోసారి ఇంటికి తాళం వేసినప్పుడు మాకు దిక్కుదరీ తోచలేదు. స్థానిక నాయకులు సాయం చెయ్యటం లేదు. పోలీసులూ వేధిస్తున్నారు. ఆ అర్ధరాత్రి, దాదాపు ఒంటిగంట సమయంలో కర్పూరపు నిరంజన్ గారి ఇంటి తలుపు తట్టాము. ఈయన సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ గా పోటీ చేసి ఓడిపోయారని గత టపాలో చెప్పి ఉన్నాను. ఈ నిరంజన్ గారే మమ్మల్ని మీలా సత్యనారాయణ గారికి పరిచయం చేయమంటే పరిచయం చేసారు. ఆ రాత్రి వారి ఇంట ఆశ్రయం పొందాము. నిజానికీ సూర్యాపేటలో చాలామంది తెలుసు. పలకరింపుల వరకే మా పరిచయం. అంతకు మించి ఎక్కువ పరిచయం లేదు. అప్పటికే, మున్సిపల్ ఎన్నికల్లో ఆర్.కె.ఎల్.కె. అధినేత ఓడిపోవటంతో ఎం.ఎల్.ఏ. దోసపాటి గోపాల్, మీలా సత్యనారాయణతో ధిక్కారధోరణి మానుకొని రాజీకి వచ్చాడని మేం విని ఉన్నాం. ఆ ఊర్లోని పెద్దమనుష్యులంతా ఒకటేనని గునగంటి రాములు కుమారుడు పదవీ ప్రమాణ స్వీకారోత్సవాలలో చూసి ఉన్నాం. దాన్నే నిర్ధారిస్తూ నిరంజన్ గారు “రాధాకృష్ణ గారిని కలిసి జరిగిందంతా చెప్పండి. మనం డబ్బులేని వాళ్ళం. మాట మీద నిలబడతాం. వాళ్ళు డబ్బున్న వాళ్ళు. ఏమంటారో చూద్దాం” అన్నారు. అప్పుడు మేమున్న స్థితిలో చేతిలో డబ్బుకూడా లేదు. మేం అడగకుండానే ఆయనే కొంచెం డబ్బు సర్ధాడు. మేం రాధాకృష్ణగారిని కలిసాం. ఆయన నాటకీయంగా మాకు చేతులెత్తి నమస్కరిస్తూ “బాబోయ్! మీ ఫైట్? మేమెవ్వరం ఏం చెయ్యలేమండి” అన్నాడు. అలా ఇతను మమ్మల్ని వదిలించుకున్నాడు. నడిరోడ్డు మీద నిస్సహాయంగా నిలబడి ఉన్నాము. డాక్టర్ నిరంజన్ గారు ప్రెస్ మీట్ ఇచ్చి చూడండి. ఏం జరుగుతుందో చూద్దాం అని సలహా చెప్పారు. సూర్యాపేటలో రామలింగారెడ్డి అని ఒక లాయర్ ఉన్నాడు. పెద్దవయస్సువ్యక్తి. అతడి కుటుంబం నాకు ఫ్యాక్టరీ ఉన్నరోజుల్లోనే పరిచయం. నా స్నేహితురాలి ద్వారా వాళ్ళ పరిచయం. అయితే ‘ఫ్యాక్టరీ పోగోట్టుకున్నాక స్నేహితులే చేదు చూపించారు, ఇక పరిచయస్థుల దగ్గరికి వెళ్ళి పనిమాలా అవమానాలెందుకు పొందాలి’ అనుకుని మేం ఎప్పుడూ ఆ లాయర్ ని గానీ, వారి కుటుంబసభ్యుల్ని గానీ కలిసే ప్రయత్నం చెయ్యలేదు. ఇక ఈ కేసు విషయమై న్యాయ సహాయం పొందటం అనివార్యమని పించి వాళ్ళింటికి వెళ్ళాము. నన్నునేను పరిచయం చేసుకునే లోపలే రామలింగారెడ్డి, అతని భార్య నన్ను గుర్తు పట్టారు. వాళ్ళ అబ్బాయి నన్ను గుర్తు పట్టాడు. ఎంతో అదరణతో ఆరోజు వాళ్ళింట్లో భోజనం పెట్టారు. మేము కేసు గురించి చెబుతుండేలోగానే వాళ్ళబ్బాయి హరి [20 years] వెళ్ళి ఇంటావిడతో మాట్లాడి తాళం తెరిపించి, current fuse వేయించాడు. ఇదంతా మేం ఎంతో ఆశ్చర్యంతో చూస్తుండేలోగానే చావు కబురు చల్లగా చెప్పాడు. మా తరుపున వాళ్ళే, మేం వారం, పది రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తామని కమిట్ అయ్యారట. “అదేమిటి? నేనలా అనలేదు కదా?" అంటే. ఆ లాయర్ “ఈ లోపుల ఇల్లు వెదుకుదాం, ఈసారి మేం వెదుకుతాం కదా తప్పకుండా దొరుకుతుంది” అని విషయాన్ని ప్రక్కదారి పట్టించాడు. తరువాత కాలంలో ఇల్లు వెదకలేదు. ఆ లాయర్ “లోకా అదాలత్ లో కేసు వేద్దామంటే జడ్జి ఊళ్ళో లేడమ్మా. 15 రోజులు సెలవు పెట్టిపోయాడు”అంటూ ఏదేదో అతీకీ అతకనీ సమాధానాలు చెప్పాడు. ఆ తర్వాత 100/- రూ. ఫీజు కట్టి ప్రెస్ మీట్ పెట్టి కేసు వివరాలన్నీ ‘తెలుగు’లో వ్రాసి జిరాక్స్ కాపీలు ప్రతీ విలేఖరికి అందించి, చెప్పాము. ఒక్క పేపరంటే ఒక్క పేపరూ ప్రచురించలేదు. అవే కాపీలను హైదరాబాద్ ఈనాడుకు ఫాక్స్ చేసాము. తరువాత నా స్నేహితురాలు ఈనాడు సబ్ ఎడిటర్ కి ఫోన్ చేసి, మొత్తం విషయం క్లుప్తంగా చెప్పి, ఫాక్స్ పంపిన విషయం చెప్పాను. తను దానిని వెదికి చూస్తానని చెప్పింది. ఆ తదుపరి రోజుల్లో మా ఇంటిఓనరు మాకు OH Tank నుండి నీళ్ళు వచ్చే పైపు కోయిపించి, సీజ్ చేసేసింది. కరెంటు fuse తీసుకుపోయింది. పాల వాణ్ణి రానివ్వటం లేదు. విద్యార్ధుల్ని గానీ, మమ్మల్ని కలవటానికి ఎవరికి గానీ దారినివ్వటం లేదు. మరోప్రక్క ఈ లాయర్ రామలింగారెడ్డి “మీ తరుపున నేను మాట ఇచ్చాను. మీరు ఇల్లు ఖాళీ చేస్తారని, ఇంకా మూడురోజులే టై ముందని” అంటూ ఒత్తిడి చేస్తున్నాడు. నీళ్ళులేవని వాళ్ళింటికి స్నానం చెయ్యటానికి వెళితే, ఆ పూటకి వాళ్ళింట్లో స్నానం చెయ్యనిచ్చి, ‘మున్సిపల్ ట్యాంకు దగ్గర తెచ్చుకోవటం మంచిది లక్ష్మీ!’ అని చెప్పారు. మొదటిరోజు మా పాపని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడించిన లాయర్ గారి భార్య [ఆవిడని నేను ఆంటీ అని పిలిచేదాన్ని] తనను తాను అమ్మమ్మగా మాపాపకు పరిచయం చేసుకుని ముద్దు చేసిన ఆవిడ మూడునాలుగు రోజులు తిరిగేసరికి మాపాపని గదిలోంచి బయటికి పంపితలుపు వేసుకుందిట.మేము ఆఫీసు రూంలో అతడితో మాట్లాడుతున్నాము. మా పాప చిన్నబుచ్చుకున్న ముఖంతో, దుఃఖంతో వచ్చి చెప్పింది. నేను ఓదార్చి “అలాగయితే నువ్వు వెళ్ళొద్దులే. నా దగ్గరే ఉండు” అని అనునయించాను. మా దగ్గర ఉన్న అన్నీ కంప్లైంట్స్ తీసుకొని దానిని స్టడీ చేస్తున్నానని రోజు తిప్పించుకున్నాడు. ఇవన్నీ చూసిన తరువాత ‘స్నేహం పేరుతో గొంతు కోయటంలో ఇదో విన్యాసం’ అని మాకు అర్ధమయ్యింది. ఆ లాయర్ మా ఇంటి ఓనర్ కేవియట్ కోసం ఆ ఊర్లో ఉన్న మరో లాయర్ దగ్గరికి వెళ్ళిందనీ, వాళ్ళతో పెట్టుకోవటం ప్రమాదహేతువనీ అన్నాడు. అప్పటికి మాతో ఈమాటే అంటూ కోటగిరి రాధాకృష్ణ “వాళ్ళు [త్రివేణి కాలేజీ వాళ్ళని ఉద్దేశించి] ఆస్థులు అమ్ముకుని అయినా ఎదుటి వాళ్ళని ఆర్పుతారు” అన్నాడు. దానికి మావారు “మొండికొస్తే నేను పరమ మూర్ఖుణ్ణే అనుకొండి, జగమొండినే అనుకొండి. వాళ్ళు ఎవరినైనా ఆర్పడానికి ఆస్థులమ్ముకుంటారేమో. నేనుపోరాటానికీ ఆస్థులమ్ముకుంటాను. ప్రాణాలొడ్డిఅయినా పోరాడతాను” అన్నాడు. ఇదే సంఘటన గురించి చెప్పి, ఇదే విషయాన్ని రామలింగారెడ్డికి సైతం స్పష్టం చేసి లేచి వచ్చేసాము. ఈ వేధింపు ఇలా తీవ్రతరంగా నడుస్తున్నా రోజుల్లోనే ఓరోజు మా విద్యార్ధులలో అనురాధా అనే అమ్మాయి తండ్రి [ఈ అమ్మాయి ఐఐటి హాల్ టిక్కెట్ తపాలా తస్కరణకి గురైంది.] గోవిందస్వామి అని FCI [Food Corporation of India] లో మానేజర్ గా ఉండేవాడు. వీళ్ళ కుటుంబంతో నాకు బాగా పరిచయమే. అంతక్రితం గుడిలో కలిసినప్పుడు ఇతడి భార్య ‘తమ కూతురుకీ, తమ కొడుక్కీ ఇంజనీరింగ్ సీట్లు వచ్చాక ఏ ఎంసెట్ కుంభకోణాలు బయటపడినా పడనివ్వండి. తమ వాళ్ళిద్దరూ గట్టెక్కి పోతేచాలు’ అన్నది. నేను నవ్వేసి ఊరుకున్నాను. అయితే ఆరోజు రావటం రావటమే, అతడు మహారౌద్రంగా వచ్చి, ఎంసెట్ క్లాసులు సరిగా జరగటం లేదని, [అప్పటికి నేను గరిష్టంగా సిలబస్ పూర్తిచేసాను. అటు పిల్లలకీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక నేను క్లాసులు చెప్పినా వాళ్ళు హాజరు కాలేరు] ఇంకా ఆర్గానిక్ క్రెమిస్టీ చెప్పించలేదని, కాబట్టి కట్టినఫీజు వాపసు ఇవ్వాలనీ గొడవ చెయ్యటం ప్రారంభించాడు. మేం చెప్పేది కూడా విన్పించుకోకుండా గట్టిగా ఆరుస్తూ “గడ్డివామి దగ్గర కుక్కలా చేస్తే వచ్చేది మన్నే. సమాజానికి ఎదురీద లేరు మీరు” అంటూ మమ్మల్ని తీవ్రస్వరంతో హెచ్చరించాడు. అప్పటి గొడవకీ, ఈ మాటకీ పొంతన లేకపోవటం తో మేం అవాక్కుయి పోయాం. మేం ఆ షాక్ లో ఉండగానే అతడు ఇంటావిడతో కలిసి మమ్మల్ని తిట్టటం ప్రారంభించాడు. ఓ పది నిమిషాలు ఈ తిట్ల కార్యక్రమం సాగించి అతడు వెళ్ళిపోయాడు. ఆ క్రమంలో మా ఇంటి ఓనర్ కొనసాగిస్తూ “నీకు చదువుంది గానీ అస్సలు తెలివి లేదు. అలాక్కాదు ఇలా అని మాట్లాడుకుంటారు గాని కేసులుపెట్టుకుంటారా?” అన్నది. మా కిదంతా అయోమయంగా ఉంది. ఎందుకంటే అప్పటికే మేం సామరస్యంగా విషయం పరిష్కరించుకునేందుకు ఊళ్ళో ఉన్న అందరూ పెద్దమనుష్యులనీ [ప్రతిపక్ష, అధికార పక్షపార్టీలైన కాంగ్రెస్, తెదేపాలని కూడా] కలిసి ఉన్నాము. అందరూ కలిసి కూడా ఒక్క చికెన్ కొట్టు ఓనర్ కీ, అదీ, గతంలో టైలర్ గానూ, పనిమనిషిగానూ పనిచేసిన కెరీర్ కలిగిన, చదువురాని స్త్రీకీ, ఆమె భర్తకీ నచ్చచెప్పలేకపోయారు. కనీసం ఒక్కమాట కూడా చెప్పలేకపోయారు. కానీ అంతటి నిరక్షరాస్యురాలికీ కేవియట్ చట్టం క్రింద ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించటం తెలుసు. వాళ్ళు చదువుకోలేదు గనుక అమాయకులు, మేం చదువుకున్నాం కాబట్టి, కుంభకోణాల మీద ఫిర్యాదు చేసాం కాబట్టి నేరస్తులం – ఇదే పోలీసుల డీల్. ఆ ఊళ్ళో రాజకీయంగా రెండుమూడు వర్గాలున్నాయి. ఒకరికి ఒకరికి పడదు. అలాంటప్పుడైనా, ‘శతృకో శతృ మిత్రహోతా హై’ అన్న సూత్రం ప్రకారమైనా, ఎవరో ఒకరు మమ్మల్ని తమ వర్గీయులుగా స్వీకరించాలి కదా! అలాగ్గాక అందరికీ మాఇంటి ఓనర్ ఆదరణీయరాలిగా, మేం పగవారిలాగానో లేక అంటరాని వారిలాగానో ఎందుకు కనిపించాము? ఈ ప్రశ్నలన్నింటినీ సంధిస్తూ, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలుగులో, ఇంగ్లీషులో ఫిర్యాదులు వ్రాసాము.

ఇంతలోనే మార్చి 19 వ తేది ఉదయం పదిగంటలకు మేం బయటికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ మా ఇంటిఓనర్ ఇంటికి తాళం వేసింది. స్కూటర్ టైరుకు గాలి తీసేసింది. చేతిలో డబ్బుగానీ, కేసుకి సంబంధించిన అన్నీ పత్రాలు గానీ లేవు. దుస్తులు లేవు. చాకలి దగ్గర ఇస్త్రీ కిచ్చిన దుస్తులు కొన్ని ఉంటే అవి స్కూటర్ డిక్కీలో వేసుకొని, లాయర్ దగ్గర ఇచ్చిన పత్రాలు తీసుకుని హైదరాబాద్ బయలుదేరాము.

అప్పటికే నా బంగారు మంగళసూత్రం గొలుసుని సూర్యాపేటబ్యాంకులో తనఖా పెడితే ప్రత్యుర్ధులకి తెలిసిపోతుందనీ, దాంతో మరింత వేధిస్తారని అనుమానించి మునగాల బ్యాంకు శాఖలో తనఖా పెట్టాను. [అది సూర్యాపేటకు 20 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరం.] ఆ శాఖ మేనేజర్ మా పూర్వవిద్యార్ధి తండ్రీ. సూర్యాపేటలో ఉండగా వారి అమ్మాయి మా దగ్గర చదివింది. మా రెండు కుటుంబాల మధ్యా సత్ సంబంధాలుండేవి. అతడికీ, అతడి భార్యకీ కొంత సాహిత్యాభిలాష ఉండటంతో, మా మధ్య కొంచెం సుహృద్భావవాతవరణమే ఉండేది. ఎంసెట్ నేపధ్యంలో ఎన్నో సలహాలు కూడా తీసుకునే వారు. ఆ స్నేహాన్ని పురస్కరించుకొని మేం “బ్యాంకులో తనఖా పెట్టిన నగ విడిపించుకొనేంత సొమ్ము ఇప్పుడు మా దగ్గర లేదు. మీకు బ్యాంకుకు బంగారం ఎస్టిమేటర్ వస్తారు గదా, లేదా తెలిసిన వాళ్ళకు చెప్పి బంగారం నగ విడిపించి, అమ్మేయిస్తే మీ బ్యాంకు అప్పు పోనూ కనీసం నాకు ఎంతో కొంత డబ్బులు మిగులుతాయి. ఈ సాయం చెయ్యగలరా” అని అడిగాము. “మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే ముందు తనఖా విడిపించి తర్వాత నగ అమ్ముకొండి” అని సున్నితంగానే అయినా ఖండితంగా చెప్పేసాడు. దాంతో నగని కూడా వదిలేసుకున్నాము.

ఇంటికి తాళం వేయబడటంతో, చేసేది లేక మెడలో ఉన్న మంగళ సూత్రాలు, మాపాపవీ, నావీ కాలిపట్టీలు అమ్మేసి హైదరాబాదు బయలుదేరాము. మార్చినెల మూడోవారం కావటంతో అప్పటికే ఎండలు మండుతున్నాయి. స్కూటర్ మీద మా ఇద్దరికీ మధ్యలో పాపని కూర్చోపెట్టుకుని ప్రయాణం ప్రారంభించాము. రెండుమూడు రోజులలో తిరిగి ఇల్లు చేరగలమని అనుకున్నాం. అయితే అదే సూర్యాపేటనుండి నిష్క్రమణ అవుతుందని ఊహించలేకపోయాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

నా బ్లాగుచుట్టాలందరికీ,

ఈ మధ్య నాబ్లాగులో నా ప్రమేయం ఏమీలేకుండానే ఫాలోయర్ల లిస్ట్ లో నరసింహా[వేదుల బాలకృష్ణమూర్తి]గారి పేరు మాయమైపోయింది. వారి బ్లాగులో Blogs I follow లో ‘అమ్మఒడి’ అలాగే ఉంది. ఇలా అవ్వటానికి సాంకేతిక కారణాలేమైనా ఉంటాయా? మీకు తెలిస్తే చెప్పగలరు. నిజానికి మా పాప ’ఆహా!ఓహో!’ బ్లాగులోని followers list మొత్తం రెండు నెలల క్రితమే ఎగిరిపోయింది. వారి బ్లాగుల్లో Blogs I follow లో ‘ఆహా!ఓహో!’ అలాగే ఉంది. కారణం ఏమై ఉంటుంది?

ఏమో అండి నాది సేం ప్రోబ్లెం మరి :)

అమ్మా, నేస్తం - ఇది known issue. ఆ followers gadget ఇంకా development phase లొనే ఉంది. గూగుల్ వాళ్ళు దానికి ఇంకా కొన్ని ఫీచర్స్ పెడుతున్నారు.. అందువలన కొద్ది రోజులు (అంటే నెలలు కూడా అవ్వచ్చు) ఈ సంఖ్య అటు ఇటు ఔతుంది అట. అన్ని అయ్యక మళ్ళ సంఖ్య original కి వెల్తుంది అట.

దీనికి సంబంధించిన ఇంకొంచం విషయం:
I found the following on the Known Issues for Blogger blog:

"We are in the process of integrating with Google Friend Connect, which may temporarily affect the Following feature for some users. Specifically, users who already use Following and Friend Connect may notice missing blogs in their profile, as well as a decrease in the number of public Followers on their blogs.

This is because we have set these users to "anonymous" to avoid linking the profiles of Blogger and Friend Connect users without their permission. They are still following privately and will able to make themselves public again.

After the official launch of the Friend Connect integration, we will communicate with the affected users and instruct them how to reset their relationship to public. To reiterate: the number of Followers has not changed, and we believe that the launch will improve the visibility of your blog and community. We will post more details on Blogger Buzz as the launch approaches."

So, I guess we just need to wait until they contact us. Or, I have found that I can go to my blog dashboard and click on Manage under Blogs I'm Following and change each one separately from anonymous to public, but I really don't want to do that.

http://fbbootcamp.blogspot.com/2009/02/bloggers-followers-widget-now.html

Thank you Shashank garu.

నా బ్లాగులలో కొత్త ఫాలోయర్లు ఇద్దరో ముగ్గురో చేరేరు ఈ మధ్యనే. వాళ్ళు ఎవరో వివరాలు తెలుసుకుందామంటే వీలు కావటం తేదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu