అంతకు ముందు నేను డిగ్రీ విద్యార్దులకీ, ఇంటర్, ఎంసెట్ విద్యార్ధులకీ చదువు చెప్పాను. అప్పటి కంటే ఈ చిన్న పిల్లలకు చెబుతున్నప్పుడు మేం జీవితాన్ని చాలా ఆస్వాదించాము, ఆనందించాము. ఈ చిన్నారులకి చదువు చెబుతూ, వాళ్ళకి మేం నేర్పిన దానికంటే ఎన్నో రెట్లు మేం వాళ్ళ నుండి నేర్చుకున్నాము. ఎన్నో జీవితసత్యాలు, మానవీయ కోణాలు తెలుసుకున్నాము.

మనిషిని నడిపించేవి, కర్తవ్యోన్ముఖుల్ని చేసేవి ప్రధానంగా రెండు, ఒకటి భయం. రెండోది ఆశ. ఏదో ఒకటి చెయ్యకపోతే కష్టం అన్న భయం, పనిచేస్తే ఫలితం వస్తుందన్న ఆశతోనే మనిషి పని చేస్తాడు. అందుకే మన పెద్దలు పాపభీతి ఉండాలనే వారేమో! ‘భయం భక్తీ లేవుట్రా’ అంటూ పెద్దలు చిన్నవాళ్ళని గద్దించటం కూడా కద్దు.

అందుచేత మేము మా చిన్నారి విద్యార్ధుల చేత పనిచేయించేందుకు భయం బదులుగా ఆశని ఎంచుకున్నాము. టీచర్ శిక్షిస్తుందన్న భయం కంటే, వ్రాసేస్తే, చదివేస్తే incentive వస్తుందన్న ఆశ పెట్టటం ద్వారా ఎక్కువ ఫలితం సాధించవచ్చని మా ఆలోచన. అంచేత ఎంతో అవసరమైతే తప్ప దెబ్బవేయకూడదన్న పద్దతిలో మా స్కూలు నడిపే వాళ్ళం. కొంతమంది ముదుర్లు ఉంటారు లెండి, వారికి గురువు, బెత్తం మాత్రమే.

ఉదయం 6:00 గంటలకి బ్యాగ్స్ తెచ్చి స్కూల్లో పడేస్తే మళ్ళా రాత్రికి తీసుకెళ్ళేవాళ్ళు. అంతేగాక వీపు మీద మోతబరువు కూడా తక్కువ ఉండేలా చూసేవాళ్ళం. ఉదయం 7:30 కి ఇంటికి వెళ్ళి 9:15 కి స్కూలు అయినా 8:30 కల్లా వచ్చేసేవాళ్ళు. 9:15 గంటలకి ప్రార్ధన ఉండేది. ప్రతీరోజూ ప్రార్ధనలో కథలూ, చారిత్రిక కథలు….. ఎన్నో చెప్పేదాన్ని. దాదాపు ప్రతీరోజూ ఓ కొత్త కథ చెప్పేదాన్ని. దాంతో పిల్లలెవ్వరూ ఆలస్యంగా వచ్చేవాళ్ళు కాదు. ఆలస్యమైతే కథ మిస్సవుతారు కదా! ఆ కథల ప్రభావం వాళ్ళమీద ఎంత ఉండేదంటే……

ఓ సారి ప్రహ్లాదుడి కథ వారంపాటు రోజుకి కొంచెంగా చెప్పాను. మర్నాడు క్లాసులోకి వచ్చేసరికి పెద్దక్లాసు [అంటే 5వ తరగతి] పిల్లలు “మేడమ్! శశి గాణ్ణి చూడండి” అన్నారు. ‘ ఏమిట్రా’ అంటే వాళ్ళు శశి అనే నర్సరీ బుడ్డోణ్ణి పిలిచి, వాడి వీపు మీద ఒక్కటి[చిన్నదెబ్బే] కొట్టారు. వాడు ‘ఓం నమశ్శివాయః’ అన్నాడు. వీళ్ళు కొట్టటం వాడు మాటి మాటికి స్థాయి పెంచుతూ ‘ఓం నమశ్శివాయ’ అనటం. అదీ భక్తీగా కళ్ళు మూసుకొని, చేతులు జోడించి, ఎంతో సీరియస్ ముఖం పెట్టుకొని. ఆ భంగిమని, వాడి అనుకరణని చూసి అందరం పడిపడీ నవ్వాము. నేను వాణ్ణి ఎత్తి ముద్దులాడితే వాడికెంత పరవశమో! మూడేళ్ళ ఆ కుర్రవాణ్ణి ప్రహ్లాదుడి కథ అంతగా ప్రభావితం చేయటం చూసి అందరం ఆశ్చర్యపోయాము. అంతేకాదు, కథల ప్రభావం పిల్లలమీద ఎంత ఉంటుందంటే – ఓ రోజు మేం శ్రీశైలం ప్రక్కనున్న సున్నిపెంటకి వెళ్ళి వస్తున్నాము. అప్పటికి చిరుతపులి ఒకటి ఘాట్ రోడ్ లో తిరుగుతుందని, ఒంటరిగా ద్విచక్రవాహనాల మీద ప్రయాణించ వద్దనీ హెచ్చరికలు జారీ అయ్యాయి. మేం ఓ బస్సు వెనకాల ప్రయాణిస్తూ వస్తున్నాము. అంతలో నేను సరదాగా “ఇప్పుడు పులొచ్చి మన ఎదురుగా నిలబడి గాండ్రుమందనుకో” అన్నాను. మా వారేదో అనేలోగా మా పాప “ఏం ఫర్వాలేదు మమ్మీ. నేను గట్టిగా దేవుడి పాట పాడతాను. అది కన్నీళ్ళు కారుస్తూ మనవెంటే వస్తుంది” అంది. విషయం ఏమిటంటే అంతకు కొన్ని రోజుల ముందు తనకి నేను మధురభక్తి ప్రబోధించిన చైతన్య మహాప్రభు గురించి చెప్పాను. ఆయన పూరి క్షేత్రానికి, అడవి దారిలో వెళ్తూ మధుర భక్తితో కృష్ణ భక్తిగీతాలు పాడుకుంటూ వెళ్తుంటే అడవి మృగాలన్నీ, జింకా పులులతో సహా, జాతివైరం మరచి పోయి కన్నీళ్ళు కారుస్తూ ఆయన వెంట నడవటాన్ని బొమ్మ చూపించి మరీ కథ చెప్పాను. ఆ ప్రభావం అన్నమాట. ఏడేళ్ళ ఆ పసిది నిజంగా పులివస్తే తాను భక్తిపాటలు పాడితే ఏడుస్తూ తన వెంట వస్తుందని గట్టిగా నమ్మింది. అది చూసి మాకు చాలా ఆశ్చర్యం వేసింది.

మా స్కూలులో పిల్లలు క్రమశిక్షణారాహిత్యం చూపిస్తే, అయితే రేపు కథ రద్దు అంటే చాలు వెంటనే నియంత్రణ అయ్యేవాళ్ళు. మా ప్లోరు మీద మిగిలిన గృహిణులు, ఇతరులూ కూడా పని అయిపోయాక వరండాలో కూర్చొని మాస్కూలు, క్లాసు వ్వవహారాలు ఆనందిస్తుండేవాళ్ళు. స్కూలుకు సెలవు వస్తే అందరికీ బోరే. వేసవి సెలవులో, దసరా, సంక్రాంతి సెలవులో వస్తే పిల్లలు బెంగగా మా సత్రం భవనం వైపు చూస్తుండేవాళ్ళు. మధ్యమధ్యలో వచ్చి “బోర్ కొడుతొంది సార్!” అనేవాళ్ళు.

చాలామంది పిల్లలు స్కూలుకు వెళ్ళమంటే ఏడుస్తారు. మా స్కూలులో మాత్రం “ఇలా అల్లరి చేసావంటే ఈ రోజు స్కూలుకు పంపను” అనగానే ఓ నర్సరీ బుడ్డీగాడు బావురుమన్నాడట. వాడితల్లి ఎంతో ఆశ్చర్యంగానూ, మురిపెంగానూ చెప్పింది.

ఇలా కథలే గాక ఇంకా చాలా ఆకర్షణలుండేవి వాళ్ళకి. వాళ్ళు హోం వర్కు సాయంత్రం స్టడీ పీరియడ్స్ లో పూర్తి చెయ్యాలి. ఇక ఇంటి కెళ్ళాక తల్లిదండ్రులతో గడిపి, నిద్రపోవటమే. 5:30 నుండి 7 గంటల లోపు పూర్తయ్యెంత వర్కుమాత్రమే ఇచ్చేవాళ్ళం. ఎవరైనా చెయ్యకపోతే కార్టూన్ చూడటానికి అనుమతి రాదు. అందుకని వేగంగా చేసేసేవాళ్ళు. వర్క్ చక్కగా చేసిన వాళ్ళకి ఒక చాక్లెట్ బహుమతిగా ఇచ్చేవాళ్ళం. వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి రోజూ ఫైవ్ స్టార్ చాక్ లెట్లు వంటివి కొనిస్తారు. మేం ఇచ్చేది పావలా ఆశా చాక్లెట్. అయినా సరే అది తను కష్టపడి చదివి సంపాదించుకున్న చాక్లెట్, తమకి స్కూలు ఇచ్చిన చాక్లెట్. అది వాళ్ళకి ఎంతో అపురూపం. కొందరు చాక్లెట్లని అలాగే దాచేస్తే కొందరు వాటి ర్యాపర్స్ దాచుకునేవారు. నాకు ఇన్ని చాక్లెట్లు వచ్చాయంటే నాకు ఇన్ని అని పోటీలు పడి చదవటం, వ్రాయటం నేర్చేవారు.

నర్సరీ పిల్లలకైతే అక్షరం ఒకటి నేర్చుకుంటే ఒక్కచాక్లెట్ ఇచ్చేవాళ్ళం. కొంతమంది 26 అక్షరాలకు 26 చాక్లెట్స్ సంపాదించుకునేవాళ్ళు. కొంతమంది ఇంకా చాలా తక్కువవ్యవధిలో నేర్చుకునేవాళ్ళు. అలాగే అంకెలు నేర్చుకున్నా, అంకెకు ఒకటి చొప్పున చాక్లెట్ వచ్చేది. ఓ సారి ఓ నర్సరీ బుజ్జిగాడికి ఎలర్జీ ఉందనీ, చాక్లెట్లు ఇవ్వవద్దని వాళ్ళ అమ్మ చెప్పింది. సరేనని మేమూ వాడు కొత్త అక్షరం నేర్చుకున్నా incentive ఇవ్వలేదు. ఓ వారం రోజులు పోయేసరికి వాడు, వాళ్ళ అమ్మతీసుకెళ్ళడానికి వస్తే గోడకి అతుక్కుపోయి “రేపట్నుండి నేను స్కూలుకి రానే! నేను బాగా రాసినా సారు నాకు చాక్లెట్టు ఇవ్వటం లేదు” అని కంప్లయింట్ చేశాడు. వాడి భంగిమ, ఆ బుంగమూతి, చెప్పిన తీరుకి అందరం బాగా నవ్వాము. ‘తన శ్రమకి గుర్తింపు లేనప్పుడు ఎందుకు స్కూలుకి రావాలి?’ అన్న రోషం వాడిది. ఎంత ముచ్చట వేసిందో! వాడికి మూడేళ్ళు ఉంటాయంతే. ప్రార్ధన సమయంలోనూ అంతే. వందేమాతరం పాడేముందు, కావాలని నేను నా కళ్ళద్దాలు తీసి ముందువరసలో నిలబడిన నర్సరీ పిల్లవాడి జేబులో పెడతాను. అంతే! వాడి ఛాతీ దాదాపు రెండు అంగుళాలు పొంగుతుంది. తన జేబులో గనుక మేడమ్ కళ్ళద్దాలు పెట్టారు. ‘How lucky I am’ అన్నట్లు అందరి వైపు సగర్వంగా ఓ చూపు విసురుతాడు. మిగిలిన జీరోక్లాసు పిల్లల్లో వాడి పట్ల ఓ చిన్న అసూయ, ఓ గొప్పదనపు ఫీలింగ్. వాళ్ళ ప్రాణాలకి మేడమ్, సార్, గొప్పవాళ్ళు మరి. ఇక గీతక్క అయితే ‘ఐడియల్ షీ’ అన్నమాట. ఓసారి ఓ చిన్నారి పాప తల్లి “మాపాపకి మీ గీత అంటే చాలా ఇష్టంసార్. ఇంటికొచ్చింది మొదలు గీత గురించే చెబుతుంది” అంది. మావారు సరదగా ఆ పాపని ముద్దుచేస్తూ “ఏం బుడ్డీ. మీ మమ్మీతో గీతక్క గురించి ఏం చెప్పావ్?" అన్నారు. అంతే. అది బిక్క ముఖం పెట్టి “నేను ఏమీ చెప్పలేదు సార్! గీతక్క మంచిది. కాసెత్తులు పెడుతుంది అని చెప్పాను” అంది. అప్పటికి శ్రీశైలంలో కార్టూన్ ఛానెల్ వచ్చేది కాదు. కాబట్టి టామ్ & జెర్రీ సి.డి.లు వేసే గీతక్క, బాగా చదివేస్తే బొమ్మలు, బిల్డింగ్ బ్లాక్సు ఇచ్చే గీతక్క అంటే వారికి చాలా ఇష్టం. పిల్లల్ని అక్షరాలు దిద్దంచటానికి దగ్గరికి పిలిస్తే ఇలా వచ్చి ఒడిలో ఒదిగి పోయేవారు. మాకు మాపాప ఒక్కత్తే. అప్పటికి తనకి ఎనిమిదేళ్ళు వచ్చేసాయి. దాంతో వాళ్ళ ప్రేమని, అభిమానాన్నిబాగా ఆనందించేవాళ్ళం. చిరుచెమటతో తడితడిగా ఉండే అరచేతులతో అక్షరాలు నేరుస్తూ, [అందుకోసం పాపం వాళ్ళ కష్టం వాళ్ళకి ఉండేది.] నేర్చుకునేందుకు వాళ్ళు కష్టపడేతీరు, అప్పడు మనస్సు చూపే తమాషాలు – మేం బాగా పరిశీలిస్తుండేవాళ్ళం. పసిపిల్లల పరిశీలనాసక్తి కూడా మాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా వాళ్ళకి ఒక అక్షరమో, పదమో పట్టుబడేది కాదు. అప్పుడు తామసం కొద్ది వాళ్ళకి నిద్రవచ్చేది. అలాంటప్పుడు వాళ్ళ మూడ్ కాస్సేపు డైవర్ట్ చేస్తే మళ్ళీ ఉత్సాహపడేవాళ్ళు.

మేం రోజూ ఉదయం క్లాసుల మధ్య పావుగంట బ్రేక్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు ప్రకృతి అవసరం తీర్చుకున్నాక, చిన్న పిల్లలకి తినడానికి పండో, బిస్కట్టో [తల్లిదండ్రులు పంపినవి] ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత క్లాసులో కూర్చునేవాళ్ళు. పెద్ద పిల్లలు ఆ సమయంలో జి.కె. వల్లించేవారు. రోజూ ఓ పదినిముషాలు ఓరల్ డ్రిల్లు నడిచేది. రాష్ట్రాలూ, రాజధానులూ, దేశ రాజధానులు వల్లించేవారు. ఒకటి రెండు నెలలు అలా గడిచాక, ఓ రోజు పిల్లల్ని బ్రేక్ కి వదిలినప్పుడు నేను పోర్టీకోలో నుండి పరిశీలిస్తున్నాను. మెట్లమీద చిన్నపిల్లలు పరుగెడుతూనో, తోసుకుంటూనో క్రిందపడతారని చాలా జాగ్రత్త తీసుకునేవాళ్ళం. అలా పరిశీలిస్తుండగా ఇంతలో ఓ ఎల్.కె.జి. చిన్నోణ్ణి మరొకడు దేశం పేరు అడుగుతున్నాడు, రెండో వాడు ఠపీమని రాజధాని పేరు చెబుతున్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. తర్వాత చూద్దుం గదా జీరో క్లాసుల్లోని అందరు చిన్నారులూ మొత్తం రాష్ట్ర, దేశ రాజధానులు టకటక చెప్పేసారు. అప్పటి వరకూ టీవిల్లో చూసింది అసాధారణ ప్రఙ్ఞేమీ కాదని, క్రమం తప్పకుండా వల్లెవేస్తే అది చాలా సులభమనీ అర్ధమయ్యింది.

నర్సరీ వాళ్ళకి రెండు పేజీల వర్కు ఇస్తాము. అదీ వాళ్ళ ప్రాణాలకి ఎక్కువే. పూర్తి చెయ్యగానే ఆడుకునేందుకు బొమ్మలు ఇస్తాం. మా దగ్గర చాలా బొమ్మలు, బిల్డింగ్ బ్లాక్సులు, సాప్ట్ టాయ్స్, ఇంకా చాలా రకాల బొమ్మలు ఉండేవి. పిల్లలు ఎక్కి కూర్చొ గలిగినంత పెద్ద ఏనుగు బొమ్మ ఉండేది. దాని పేరు అప్పు. బాగా వ్రాసి incentive తెచ్చుకున్న పిల్లలు దాని మీద ఎక్కవచ్చు అన్నమాట. అప్పుడు మిగిలిన పిల్లలు చిన్న రైమ్ పాడుతూ వాళ్ళ చుట్టూ గుండ్రంగా తిరుగుతూ చప్పట్లు కొడతారు. అప్పుడు చూడాలి ఏనుగెక్కిన వాడి సంబరం! దాదాపు తిరుపతి వెంకటి కవులు చెప్పినట్లు ‘ఏనుగుకెక్కగా నిక్కినాము’ అన్నంత సగర్వంగా ఉంటుంది. ఇన్ని ఆకర్షణల మధ్య వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకునేవాళ్ళు.

అంతేగాక ఎవరైనా బద్దకం కొద్దీనో, అనాసక్తి కొద్దినో కొత్తవి నేర్చుకోకపోయినా, ఇచ్చిన పేజీల వర్కు పూర్తి చెయ్యకపోయినా ఈ incentives అన్నీ [బొమ్మలు, చాక్లెట్స్, కార్టూన్లు] రద్దవుతాయి. మిగిలిన వారు అవి ఆనందిస్తుండగా వీళ్ళు మూలన కూర్చొని వ్రాయవలసి వచ్చేది. అప్పటి వరకూ ఎంత చెప్పినా తలకెక్కని చిన్నారి బిడ్డకి ఒకసారి ఆ శిక్ష పడి, అందరూ లోపలి గదిలో కార్టూన్ చూస్తుండగా తాను వరండాలో కూర్చొని ఇంకా వ్రాయవలసి వచ్చినప్పుడు వెక్కివెక్కి ఏడుపొచ్చేది. అప్పుడు మేం చెప్పేవాళ్ళం, "నువ్వు ఏడిస్తే మీ మమ్మీ డాడీ అయితే, అయ్యో పాపం. మనబ్బాయి ఏడిస్తున్నాడు అనుకుని నువ్వడిగింది ఇస్తారు, చేస్తారు. మరి మేము మీ మమ్మీనో, డాడినో కాదు కదా! మేం నీకు మేడమ్, సార్ కదా! మాకు నువ్వు చదివితేనే ప్రేమ. లేకపోతే లేదు. నువ్వు వర్కు పూర్తిచేస్తే వాళ్ళలాగే వెళ్ళి కార్టూన్ చూసేవాడివి, ఆడుకునేవాడివి కదా? మరి ఎందుకు వ్రాయలేదు?” అని వాడికి అర్ధమయ్యేభాషలో అర్ధమయ్యే వరకూ చెప్పేవాళ్ళం. ఒకటి రెండుసార్లకే పిల్లలు సరయ్యి పోయేవాళ్ళు.

ఓ సారి ఓ నర్సరీ బుడ్డీకి చదువెందుకో అర్ధం కాలేదు. ‘ఎంచక్కా ఎప్పుడూ ఆడుకొనివ్వచ్చు గదా!’ అన్నది దాని సందేహం. మా వారు దాన్ని ఒడిలో కూర్చొబెట్టుకుని “చూడు కన్నా! మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఒంగోలు వెళ్తారు కదా! అప్పుడు తిరిగి వచ్చేటప్పుడు బస్టాండ్ లో చాలా బస్సులు ఉంటాయి కదా! వాటిలో శ్రీశైలం బస్సు ఏదో ఎలా తెలుస్తుంది? మీ మమ్మీ బస్సు మీద పేరు చదివి ఇది శ్రీశైలంబస్సు అని దాంట్లోకి ఎక్కిస్తుంది. అదే మీమమ్మీ కి చదువు రాకపోతే, ఏబస్సు పడితే ఆ బస్సులో ఎక్కితే, అప్పుడు మీరు ఏదో ఊరు వెళ్ళిపోరు? అప్పుడు మీనాన్నమ్మ, డాడీ, మీ బాబాయి వాళ్ళదగ్గరికి కాకుండా ఎక్కడికో వెళ్ళిపోతారు కదా!. కాబట్టి బస్సు పేరు తెలుసుకోవటానికి మీ మమ్మీ చదువుకున్నట్లు, నువ్వు కూడా చదువుకోవాలి. తెలుసింది కదా” అని అంటే చారడేసి కళ్ళు మరింత వెడల్పు చేసి అర్ధం చేసుకునే ప్రయత్నం చేసింది. “అవునా కాదా? చెప్పు” అంటే దాని చిన్నిబుర్రతో ఆలోచించి అవునంది. పాపం. ఆ బుడ్డిది ఒక్కసారి ఊహించుకుందో ఏమో గానీ, అమ్మో డాడీ దగ్గరికి కాకుండా ఇంకో ఊరు వెళ్ళిపోతే అని భయపడిపోయింది. అంతే! మర్నాటి నుండి అది చకచకా అన్ని నేర్చేసింది.

ఇలా పిల్లల్ని జాగ్రత్తగా పరిశీలించి, వాళ్ళు ఎలా అయితే చదువు మీద, ఙ్ఞాన సంగ్రహణ మీద దృష్టి పెడతారో అలా ట్యూన్ చేసేవాళ్ళం. మేం ఇలా ట్యూన్ చేసి పెడితే ఇక తల్లిదండ్రులకి మరింత ఆశ పుట్టేది. ఎటూ పిల్లలు నేర్చుకుంటున్నారు కదా అని, ఇంటి దగ్గర వాళ్ళు జీరో క్లాసుపిల్లలకి ఎక్కాలు గట్రా ఏదేదో నేర్పేబోయి పిల్లల్ని నానా హైరానా పెట్టి, తాముపడి, మమ్మల్ని గొడవపెట్టేవాళ్ళు. మేం ఓపిగ్గా పిల్లలకి చెప్పినట్లే తల్లిదండ్రులకీ అన్నీ వివరించి చెప్పేవాళ్ళం. అందుకోసం ప్రత్యేకంగా యూనిట్ టెస్ట్ లూ, క్యార్టర్లీ, అర్ధ వార్షిక, వార్షిక పరీక్షల తర్వాత ‘రిజల్ట్ డే’ నిర్వహించేవాళ్ళం. ఆ రోజున తల్లిదండ్రులకి పిల్లల పరీక్షా ఫలితాలు, ప్రోగ్రెస్ రిపోర్టు, జవాబు పత్రాలతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం. ఒకసారి “మేం మీ పిల్లలని మీరు టివీని ట్యూన్ చేసినట్లు ట్యూన్ చేస్తాం. చక్కగా ట్యూన్ చేస్తే మనకి టివీలో ఆ ఛానెల్ స్పష్టంగా వస్తుంది. పిల్లల బుర్రలూ అంతే. అలాగని మేం ట్యూన్ చేసాక నేర్చుకుంటున్నారు కదా అని లోడ్ ఎక్కువ చేస్తే అసలికే మోసం వస్తుంది. మేం నేర్పుతున్నాం కదా! మీరు మా మీద నమ్మకం ఉంచండి. మేం అడిగినప్పుడు మీరు చదివించండి. ఈ లోపున మీకు మీ పిల్లలకి ఇంకా ఏమైనా నేర్పాలని అన్పిస్తే కథలు చెప్పండి. ప్రక్కన కూర్చోబెట్టుకుని చందమామా, Magic Pot లాంటి పిల్లల పత్రికలని చదివి, బొమ్మలు చూపెడుతూ చెప్పండి. చాలు” అనేవాళ్ళం. కొంచెం పెద్దపిల్లల తల్లిదండ్రులకైతే వార్తాపత్రికలు చదివించమని సలహా ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే ఆ పిల్లలకి ఇంగ్లీషు పదాల spellings బట్టీ వేయటం గనుక నేర్చేవాళ్ళు. అది చిన్నప్పటి నుండీ అలవాటు అవుతుందయ్యె.

అదే తెలుగు పదాలు గుణింతాలు గుణించుకుని చదవాలంటే మొదట్లో నొప్పిగా ఉంటుంది. తమ పాఠ్యపుస్తకాల్లో తెలుగు పదాలైతే ప్రింట్ చూడగానే టీచర్ చెప్పిఉంటుంది గనుక చప్పన గుర్తుపట్టి చదివేస్తారు. అందుచేత వాళ్ళకి readability అలవాటు చెయ్యాలంటే వార్తాపత్రిక పఠనం, ఇతర కథాపుస్తక పఠనం తప్పనిసరి. ఈ అనుభవం మాకు మాపాపతో తెలుసు. అందుచేత అదేసలహా ఇచ్చేవాళ్ళం. కొందరు పాటించేవాళ్ళు. కొందరు విని ఊరుకునేవాళ్ళు. అందుచేత మేమే ప్రతీరోజూ ఓపావుగంట వార్తాపత్రిక పఠనం చేయించేవాళ్ళం. అది ఎంతగా ఫలితాన్ని ఇచ్చిందో చూసి ఆ పిల్లల తల్లిదండ్రులంతా చాలా ఆశ్చర్యపోయారు.

అలాగే, మేము రిజల్ట్ డే రోజు, పిల్లలకి A+ grade [85% మార్కులకు పైన] తెచ్చుకుంటే చిన్న erasers, చక్కని బొమ్మల ఆకృతి లోనివి బహుమతిగా ఇచ్చేవాళ్ళం. అవి ఆ పిల్లలకి ఎంత అపురూపమో. అసలు రిజల్ట్ డే అంటే అది వారికో పండుగలా ఉండేది. ఆరోజు తల్లిదండ్రులు స్కూలు కొచ్చి ప్రొగ్రెస్ రిపోర్ట్ తీసికెళతారు. తాము మధ్యాహ్నం దాకా బిల్డింగ్ బ్లాక్స్ తో అడుకుంటారు. ఎప్పుడూ రిజల్ట్ డే శనివారం వచ్చేలా పెట్టుకునేవాళ్ళం. దాంతో ఇక తర్వాత 1 ½ రోజులు సెలవే. అందునా పరీక్షలయ్యాక గనుక ఇక బాదరబందీ ఉండని స్వేచ్ఛ. అదే పరీక్ష సరిగా వ్రాయకపోతే ఆ సెలవు కాస్త సమ్మర్ స్కూల్ అయిపోతుంది. అంటే అందరికీ సెలవు వస్తుంది. తమకీ మాత్రం స్కూలు ఉంటుంది. చదివినా చదవక పోయినా స్కూలు కొచ్చి పుస్తకాలు ముందేసుకొని వ్రాయాలి. అదీ శిక్ష. అందుచేత పరీక్షల ముందే, బాగా కష్టపడి చదివి బాగా వ్రాసేవారు. గంటల కొద్దీ ఒకేపనిని ఓపికగా సహనంగా చెయ్యటం నేర్పేవాళ్ళం. అదినేర్చుకునే లోపల వాళ్ళలో నుండి ఎన్ని మనోవికారాలు బయటి కొచ్చేవో! ముందు అసహనం, కోపం, దుఃఖం..…… అన్నీ. అప్పుడు వాళ్ళకి వాళ్ళనే ఉదహరణగా చూపిస్తూ, మనల్ని భావోద్రేకాలు ఎలా ఆక్రమిస్తాయో, ఎలా నియంత్రించుకోవాలో వాళ్ళకర్ధమయ్యేరీతిలో చెప్పేవాళ్ళం. ఏదయినా పాఠం రాకపోతేనో, ఏదైనా చెయ్యలేకపోతేనో, లేక మరెందుకైనా వాళ్ళు ఏడిస్తే మేం ఒకటే చెప్పేవాళ్ళం – “ఒరే బుడ్డీ! టామ్ & జెర్రీ రోజూ చూస్తావు కదా! అందులో జెర్రీగాడు ఎప్పుడైనా ఏడుస్తాడా? టామ్ గాడు వాడి వెంటబడి చంపబోయినా, పారిపోతాడు. వీలుదొరక బుచ్చుకొని టామ్ గాణ్ణి విరగతంతాడు కానీ ఏడుస్తాడా? టామ్ గాడికి దొరికితే జర్రీగాడికి ఇంకేమైనా ఉందా? దెబ్బకి చచ్చిపోతాడు కదా! అయినా ఏడుస్తాడా? మరి after all ఈ చిన్న సమస్య తీరలేదని, ఇది రాలేదని ఏడుస్తావా? షేమ్ కదూ! ఎప్పుడైనా జెర్రీగాడిలా ఉండాలి. దేనికీ ఏడవకూడదు. ఫైట్ చెయ్యాలి. తెలిసిందా?’ అని చెప్పేవాళ్ళం. అంతే! మా బుడ్డి రాస్కెల్స్ కన్నీళ్ళు తుడుచుకొని మళ్ళీ ప్రయత్నించడానికే సిద్దపడేవాళ్ళు. మేం ఎప్పుడూ క్లాసులో ర్యాంకులు వేసే వాళ్ళం కాదు. పిల్లల్ని ఒకరితో ఒకరిని పోల్చవద్దని తల్లిదండ్రులకి కూడా చెప్పేవాళ్ళం. పిల్లల్ని తమతో తమనే పోల్చేవాళ్ళం. ‘ఈసారి 85% తెచ్చుకుంటే తర్వాత 90% మార్కులు తెచ్చుకోవాలి తెలిసిందా’ అని చెప్పే వాళ్ళం. ఒక్క మార్కులే కాక, క్లాసులో వాళ్ళప్రవర్తన కూడా పరిగణించేవాళ్ళం. ఒకసారి మనం పాఠం చెప్పి, వాళ్ళకి వర్కు అప్పజెప్పాక, వాళ్ళు అది చేసే తీరు పరిశీలించేవాళ్ళం. మనం టీచర్ డ్యూటీ చేస్తేచాలా, లేక పిల్లల పట్ల పోలీసు డ్యూటీ చెయ్యలా అని. అంటే వాళ్ళు చేస్తున్నారా లేరా అని పర్యవేక్షించవలసి రావటం అన్నమాట. అదే చెప్పేవాళ్ళం. ‘మేం మీకు టీచర్స్ మీ మాత్రమే. పోలీసులం కాదు’ అని. ఆవిధంగా సెల్ఫ్ రెస్సాన్సిబిలిటి నేర్పేవాళ్ళం.

మాటవినని పిల్లలకి వింతవింత శిక్షలు వేసేవాళ్ళం. జీరో క్లాసు పిల్లలకి మేమే పెన్సిల్, రబ్బరూ, ఇచ్చి తీసుకునేవాళ్ళం. ఒకటో తరగతి నుండి పైతరగతి పిల్లలు తామే తెచ్చుకునేవాళ్ళు. ఎవరైనా ఎప్పుడైనా మర్చిపోయి వస్తే “అమ్మా, బాబూ! ఓ పెన్సిల్ దానం చెయ్యండి. బాబూ! బిచ్చం!’ అని గట్టిగా అరువు అప్పుడు ఇప్పిస్తాను అని చెప్పెదాన్ని. వాళ్ళు గట్టిగా అలా అడిగిన తర్వాత గానీ ఎవరినీ పెన్సిల్ ఇవ్వనిచ్చేదాన్ని కాదు. దాంతో అందరు నవ్వేవారు. దెబ్బతో వాడు మళ్ళీ పెన్సిల్ మర్చిపోయి క్లాసుకి రాడు. ఒకోసారి “తుపాకి మరిచిపోయి యుద్దానికి పోయే సైనికుడట రా వీడు” అనిజోకులు వేసేవాళ్ళం. అలా సిగ్గిల్ల చెయ్యడంతో ఇంకెప్పడూ వాడు కంపాస్ మరిచిపోయి వచ్చేవాడు కాదు.

ఓసారి ఓ పిల్లవాడు వాళ్ళ ఇంటివీధిలో రాళ్ళు రువ్వుతూ ఆడాడట. ఓరాయి వాడి అన్న కంటికి పైన తగిలింది. కొంచెంలో కన్ను పోవలసింది. అన్నతమ్ములిద్దరూ మా స్కూలే. వాళ్ళ తండ్రి వచ్చి ఫిర్యాదు చేసాడు. మేము ఆ తర్వాత వారంరోజుల పాటు మిగిలిన పిల్లలందరికీ వర్కు పూర్తి చేసినప్పుడు బొమ్మలిచ్చి ఆడుకోమన్నాం. వీడికి మాత్రం కొన్ని లావుపాటి రాళ్ళు ఇచ్చాం. వాడు ఒకటే ఏడుపు. “సారీ మేమ్! ఇంకెప్పుడూ చెయ్యను మేమ్!” అంటూ బ్రతిమాలాక శిక్షరద్దు చేశాము. దెబ్బతో స్కూల్లో ఇంకెవ్వరూ అలాంటి ఆటలు ఆడలేదు. ఒకరికొకరు తోసుకోవటం, కొట్టుకోవటం, గిల్లు కోవటం అసలు జరగదు. ఆ ఊర్లో పిల్లలు ఎవర్నీ మర్యాదగా పిలిచేవాళ్ళు కాదు. తమకంటే పెద్ద వయస్సు పిల్లల్ని కూడా పేరుపెట్టి, ఏరా అని పిలిచేవాళ్ళు. రాయలసీమలో పెద్దలందరూ అన్నా, అక్కా అని పిలుచుకున్నా, అక్కడి పిల్లలు మాత్రం అంతే. మా స్కూలులో ఎవ్వరూ అలా పిలవకూడదని కట్టడి చేశాము. అందరూ అన్నా, అక్కా అని చక్కగా పిలుచుకునేవారు. ఒకరి కొకరు బాగా సాయం చేసుకుంటూ స్నేహంగా ఉండేవాళ్ళు.

ఓసారి ఓ మూడో తరగతి బుడ్డోడు ప్రక్కవాడితో తన పెన్సిల్ పెద్దదో, వాడి పెన్సిల్ పెద్దదో కొలతలు వేస్తున్నాడు. Assignment వ్రాయరా అంటే అదీ వాడి నిర్వాకం. పెన్సిల్ పొడవు పిచ్చితో రోజూ తల్లిదండ్రుల్ని విసిగించి కొత్త పెన్సిళ్ళు తెస్తూ ఉండటం కూడా పిల్లల్లో ఉన్న ఓ దురలవాటు. ఆ రోజు మేం వాణ్ణి డస్ట్ బిన్ ప్రక్కన కూర్చోబెట్టి స్కూల్లో మిగిలిన అందరు పిల్లలూ ఒక్కొక్కరు వాడిదగ్గరికి వెళ్ళటం, వాడు ‘నేను ఎత్తుగా ఉన్నానా డస్ట్ బిన్ ఎత్తుగా ఉందా’ అని అడగటం చెయ్యమన్నాం. అదీ శిక్ష. పిల్లలందరికీ నవ్వు. వాడికి ఏడుపొక్కటే తక్కువ. మరోసారి అలాంటి పిచ్చివేషాలేస్తే ఒట్టు. పిల్లలు కొందరు చదువుకుంటూ పెన్సిల్/ పెన్ను వెనకవైపు నోట్లో పెట్టుకుని నములుతూ ఉంటారు. ఎంత చెప్పినా ఆ దురలవాటు మానడం లేదు. వారికి వేపపుల్ల విరిచి తెప్పించి “ఉదయం బ్రష్ చేయలేదేమోరా నువ్వు. అందుకే పెన్సిల్/పెన్నుని బ్రష్ లా నోట్లో పెట్టుకుంటున్నావు. కాబట్టి వేపపుల్ల పెట్టుకో” అని ఇచ్చేవాళ్ళం. దెబ్బతో ఆ అలవాటు మానేసారు.

ఎప్పుడైనా పిల్లలు “ఎందుకు ఈ తప్పు చేసావురా?" అని కోప్పడితే ‘తన తప్పేమీ లేదని. ప్రక్కవాడు చెయ్యమన్నాడని’ చెప్పేవాడు. “వాడు గడ్డితినమంటాడు తింటావా? నీబుద్ది ఏమయ్యింది? తెప్పించమంటావా గడ్డి? చెప్పు. వాడు తినమంటాడు. తిందువు గాని” అని గట్టిగా మందలించేవాళ్ళం. ఇలా వాళ్ళ ప్రతీ అలవాటునీ, ప్రవర్తననీ సరి చేసేవాళ్ళం. మొదట అది బాగా కష్టంగా ఉండింది గాని, రానురాను అదో సాంప్రదాయమై పోయి, పెద్ద తరగతి పిల్లలు చిన్నవాళ్ళకి నేర్పేసే వాళ్ళు. పిల్లలు మాదగ్గర ఉదయం 6 నుండి రాత్రి 7.30 దాకా మాదగ్గరే ఉంటారు. వాళ్ళని మేమే తీర్చిదిద్దాలి కదా అని మా అభిప్రాయం. తిండికి, నిద్రకి మాత్రమే వాళ్ళు ఇంటికి వెళ్ళేది. తల్లిదండ్రుల పాత్ర ఫీజు కట్టి, పిల్లలకి కావలసినవి చూడటమే అక్కడ జరిగేది. అందరు వాళ్ళ వాళ్ళ పనులలో బిజీగా ఉంటారు కదా! అన్నం, చదువు అమ్ముకోకూడదని అంటారు. కలియుగం, ఏంచేస్తాం, చదువు అమ్ముకోవటం తప్పని సరి అయిపోయింది. కనీసం దాంట్లో సిన్సియారిటీ ఉండాలి కదా అన్నదే మా ఉద్దేశం.

ఓ రోజు ఓ పిల్లవాడు ఎన్నిసార్లు చెప్పినా మురికి మురికిగా వ్రాస్తున్నాడు. వాడు వ్రాసేలోగా పేజీ చెత్తగా అయిపోతుంది. అప్పటికి రెండుసార్లు రిపీట్ వ్రాసాను. అయినా అంతే. నాకు చాలా కోపం వచ్చింది. కొట్టానో, గట్టిగా కొట్టేస్తానేమో! కోపం నియంత్రించుకునేందుకు నాక్లాసులో నుండి గట్టిగా మావారికి “ఏమండి. వీడు చూడండి. నన్ను భయపెడుతున్నాడు” అని అరిచాను. తను అక్కడి నుండే “రేయ్! ఎవర్రా అది, మేడం నే భయపెడుతుంది?” అని అరిచాడు. అంతే పిల్లలంతా ఘోల్లున నవ్వులు. వాడికి చచ్చేంత సిగ్గూ, నవ్వు వచ్చాయి. తర్వాత శుభ్రంగా వ్రాసుకొచ్చాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

:)
:-)
:--)
:---)
:----)

Roju evening office nunchi vochaaka tappani sari gaa mee blog open chestaa.. edo Manjula naidu Ruthu Raagalu serial laa miss avakunda continue chestunnaa..
Mee opika vundi choosaroo? Ad goppadi.. meeru raase prathi mukka kosam endaramo eduru choostunna,.. mee, mee kutumbam kadupu challagaa.. :-) Sree

బాగున్నాయి మీ అనుభవాలు. అందరికీ వాళ్ళ చిన్నతనం గుర్తొస్తుండచ్చు

prahladudu omnamashivvaya annadani cheppi parikshallo pillaki sariga markulu ravatam ledu pakka school valla kutra ante yelagandy?prahladudu chesindy narayana mantram , mi schoollo pilladu debbalu kodutunte namashivvaya annadante ?

అయ్యా అఙ్ఞాత గారూ,

నేను చెప్పేటప్పుడు ప్రహ్లాదుడు ’ఓం నమోనారాయణ’ అని జపించాడు అనే చెప్పాను. అది శ్రీశైలం. అక్కడ నిరంతరం ’ఓం నమశ్శివాయా’ వినిపిస్తుంది. మూడేళ్ళ మా నర్సరీ బుడ్డోడు దాన్ని తనకి అప్లై చేసుకొని ’ఓం నమశ్శివాయ’ అన్నాడు. అంతగా పిల్లలకి అప్లికేషన్ పవర్ ఉంటుంది. అది మీకు లేకపోవడం దురదృష్టం.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu