పాఠశాల విద్యనీ, గురువుల్నీ పరిశీలిస్తే……

మీరెప్పుడైనా ఒకటి నుండి పదో తరగతి వరకూ విద్యార్ధుల సిలబస్ ఎలా ఉందో గమనించారా? ఇప్పటికి చాలాసార్లు, ప్రభుత్వం, ఈ సిలబస్ ని సంపూర్ణంగా మార్చటం, మార్పుచేర్పులు చేయటం జరిగింది. అవన్నీ ఏ ప్రాతిపదికన చేస్తారో గానీ….. పిల్లలు చదువుకునే పాఠాలు మాత్రం రసహీనమైన, స్ఫూర్తిహీనమైన చెత్త మాత్రమే! రసం పిండేసిన చెరకు పిప్పీ, అంతే!

మూడవ తరగతి పిల్లలకి, ఒక్కపాఠంలో మొత్తం రామాయణం, మరో పాఠంలో మహాభారతం[English Medium, Social Studies, A.P.Govt. Printed Text Book] ఉంటుంది. మూడు పేజీల్లో, ఓ బొమ్మతో, నలుపు తెలుపు ముద్రణలో ఉన్న రామాయణ భారత గాధలు, ఆపైన కొన్ని Short Answer Questions, మరికొన్ని Long Answer Questions! ఏం చెప్పాలి పిల్లలకి?

ఇక నాలుగు అయిదు తరగతి పిల్లల సోషల్ టెక్ట్సు పుస్తకాలలో, స్వాతంత్ర సమరయోధుల గురించి, సంఘ సంస్కర్తల గురించి ఒకే పేజీలతో కూడిన పాఠాలుంటాయి. ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎప్పుడు ఎక్కడ ఏ చదువులు చదివారు, దరిమిలా ఉద్యోగాలు చేస్తే ఎప్పుడు ఎక్కడ చేశారు, ఎప్పుడు మరణించారు! అందరికీ కలిపి ఓ టాబ్యులర్ ఫామ్ తయారు చేయవచ్చు. మచ్చుకి కూడా ఎవ్వరి జీవితాల నుండీ, ఏ రకమైన స్ఫూర్తిదాయకమైన సంఘటనా వివరింపబడదు.

ఇక చిన్న పిల్లలకి…… పరిసరాల గురించి, రోడ్లు, పొలాలు, ఇళ్ళరకాలు, కుటుంబాల్లో వావి వరసల గురించి పాఠాలూ, ప్రశ్న జవాబులూ ఉంటాయి. అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల ఒడుల్లో ఉయ్యాల లూగుతూనూ, చిన్నమ్మ చిన్నాన్నల పక్కల్లో పడుకుని కబుర్లు చెప్పుతూనూ, నేర్చుకోవలసిన విషయాలని, పాలబుగ్గల పసివాళ్ళు, సీరియస్ గా పుస్తకం ఒళ్ళో పెట్టుకుని, “Mother’s father, and father’s father is grand father” అనీ, “Mother’s brother and father’s brother is an uncle” అనీ, బట్టి చేస్తుంటే చూసినప్పుడు నాకు చాలా బాధగా అన్పించేది, నవ్వూ వచ్చేది. తమ చుట్టు పరిసరాలు, ఇళ్ళు, రోడ్లస్వరూప స్వభావాలు, వాళ్ళు ఆడుతూ పాడుతూ పరిశీలించగలరు, తెలుసుకోగలరు. అది కేవలం వాస్తవజ్ఞానానికి [Commen Sense] సంబంధించిన విషయం.

ఈ Commen sense నీ, ఇంగిత జ్ఞానాన్ని కూడా, పసితనం నుండీ బట్టీవేసి నేర్పుతోంది నేటి మన విద్యావ్యవస్థ! పిల్లలకి జ్ఞానం సరఫరా చేయబడటం లేదు. కథలు శూన్యం. కేవలం ముద్రణ [Print]లో ఉన్న పాఠాలు, ఆపైన గైడుల్లోని ప్రశ్నలు – జవాబులు , మార్కులూ, ర్యాంకులూ, గ్రేడులూ, అంతే!

ఈ గందరగోళంలో పడి, సహజంగానే, పిల్లలు ’చదువు అంటే, జ్ఞానం కాదు. చదువు అంటే బట్టీ వేసి, పరీక్షల్లో వ్రాసి, మార్కులు తెచ్చుకుని, పరీక్షలైపోయిన మర్నాడే మరిచి పోదగిన ప్రశ్నలు – జవాబులు’ అన్న స్థితికి వచ్చేసారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో చదువు అంటే మార్కులు, ర్యాంకులే! దాన్ని బట్టి వేయటానికి, కేవలం తాత్కాలికంగా జ్ఞాపకం [Short memory] పెట్టుకుంటున్నారు. పరీక్షలైపోగానే మరిచిపోతున్నారు. వేసవి సెలవలు రాగానే, ఏ బుడ్డీనైనా అడగండి, తము ముందు చదివిన తరగతి పాఠాల్లోంచి చిన్న పద్యం కాదు గదా, చిన్న ప్రశ్న – జవాబు కూడా చెప్పలేరు. “పోమ్మా! ఎవరికి గుర్తుంటాయి?" అంటూ మూతి సున్నా చుట్టి మరీ ఎదురు మిమ్మల్నే ప్రశ్నిస్తారు.

7 నుండి 10 వ తరగతి చదువుతున్న పిల్లలెవర్నైనా తాము సైన్సూ, సోషల్ లో చదివిన ఏ పాఠాన్నైనా….. ఉదాహరణకి ఏ దేశపు ఎగుమతి దిగుమతిలో అడగండి. అంతకు ముందు బట్టీ వేసి నేర్పిన ఒక్కముక్క గుర్తుండదు. వాళ్ళకే కాదు, నిజానికి ఎవరికీ గుర్తుండదు. ఎందుకంటే జీవితంలో వాటి ఉపయోగం లేని కారణంగా, అనువర్తన ఉండని కారణంగా! నిజానికి ఏ ఎగుమతి దిగుమతి రంగంలోనో ఉపాధి పొందే వారికీ, ఉద్యోగం చేసే వారికి కూడా, అవి చిన్నప్పుడు చదువుకున్న రీత్యా గుర్తుండదు. తర్వాత ఆ రంగంలో పనిచేస్తున్న రీత్యా గుర్తుంటాయి. ఇప్పుడైతే ఆ అవసరమూ లేదు. గుర్తు ఉంచుకునే పనిలో కంప్యూటర్లు ఎంతో సాయం చేస్తున్నాయి కదా?

పరిసరాల గురించిన, ప్రపంచాన్ని గురించిన, కనీస జ్ఞానం ఉండకూడదని నేను అనటం లేదు. కానీ దాన్ని నేర్పే విధానం అది కాదంటున్నాను. అంతేగాక, పిల్లలకి నాలుగు నుండి పధ్నాలు గేళ్ళ వయస్సులో కావలసింది ప్రపంచదేశాల ఎగుమతి దిగుమతి గురించిన జ్ఞానం, రసాయన బంధాల గురించిన జ్ఞానం కాదు. బట్టీ పద్దతిలో వాళ్ళ బుర్రల్లోకి దూర్చవలసిన జ్ఞానం అంతకంటే కాదు. ఇతరుల భావాన్ని సరిగ్గా గ్రహించగల, తమ భావాన్ని సరిగ్గా వ్యక్తీకరించగలిగేలా, వ్యక్తిత్వం అలవడేలా, వారి విద్య ఉండాలి. కథల ద్వారా వాళ్ళ ఆత్మకి చైతన్యం కలిగించాలి. కథల ద్వారా నీతిని, కర్తవ్య నిర్వహణనీ, ప్రవర్తనా సరళినీ, మంచీ మర్యాదలనీ, నేర్పవచ్చు. చెడు నుండి మనస్సుని ఎలా నిగ్రహించాలో నేర్పవచ్చు. తాము విన్న, చదివిన విషయాలని, తమ ఊహలోకి ఎలా తెచ్చుకోవాలో నేర్పవచ్చు.

ఇక్కడ ఓ ఉదాహరణ పరిశీలించండి.

పిల్లలకి ఒంటి కొమ్ము రాక్షసుడి గురించో, ఒంటి కంటి రాక్షసుడి గురించో ఉన్న జానపథ కథలని చెబుతూ, ‘తాటి చెట్టంత ఎత్తుంటాడు’ అని చెప్పామను కోండి, బూరి బుగ్గల బుడ్డీగాడు, కళ్ళింత చేసుకుని ’అంత ఎత్తున రాక్షసుడు ఉంటే ఎలా ఉంటుంది?’ అని ఊహించ ప్రయత్నిస్తాడు. ఆ ఊహ చేసేటప్పుడు, ఆ చిన్నారి ముఖంలో వింత వెలుగు, కళ్ళల్లో మెరుపూ ఉంటాయి. ఊహించగలిగిన ఆ చిన్నిముఖంలో, బ్రహ్మ తేజస్సులో తిలాంశమన్నా కన్పిస్తుంది. అలాంటి ఊహశక్తిని సంతరించుకున్న పిల్లలకి, బోర్స్ పరమాణు నమూనాని చెప్పినా, s,p,d,f orbitals గురించి చెబుతూ డంబెల్ షేప్ లో ఉంటాయన్నా, NH3, PCl5 గురించి చెబుతూ పిరమిడల్, బై పిరమిడల్ అని చెప్పినా, వాళ్ళకి అర్ధం అవుతుంది.

అవేవీ లేని వాళ్ళకి, బట్టి తప్ప శరణ్యం ఉండదు. ఇది నేను నా పాపమీద, నా విద్యార్ధుల మీద ప్రయోగాలు చేసి మరీ చెబుతున్నాను. నా పాపకి తన చిన్నప్పుడు, కనీసం పదివేల కథలు చెప్పి ఉంటాను. తిరుమల కొండ మెట్లు ఎక్కెలోగా, మొత్తం దశావతారాల కథలు పూర్తి కావలసిందే! తెలుగులోనే చెప్పాను. కానీ ఇప్పుడు ఇంగ్లీషు అలవోకగా మాట్లాడుతుంది. ఇంగ్లీషు నవలలు చదువుతుంది. పైన చెప్పిన పాఠాలూ, ఇబ్బంది పడకుండానే అర్ధం చేసుకుంటుంది. మా పోరాటం కారణంగా ఆమె నా దగ్గరే, ఇంటి బడిలో[Home Schooling] చదివింది. ఆమె పైనే కాదు, నా విద్యార్ధుల పైన కూడా ఇలాంటి ప్రయోగాలు, వీలుకుదిరినంతగా చేశాను. పుస్తకాల చదవటం అలవాటు ఉన్న పిల్లలనీ గమనించాను.

మాతృభాష మీద పట్టు లేనివాళ్ళు అసలే భాషనూ నేర్వలేరు. ఎందుకంటే, భాష భావం నుండి వేరు కాదు. మాతృభాషలో భావప్రకటన వస్తేనే మరెన్ని భాషలైనా నేర్వగలిగేది! సరే, ఇక ఈ విషయం ప్రక్కన పెట్టి మళ్ళీ మొదటికొస్తాను.

ఎన్ని వ్యాకరణ తరగతులు చెప్పినా అలవడని లక్షణం – ’వాక్చాతుర్యం, అర్ధవంతంగా మాట్లాడటం!’ అదే కథలు ద్వారా ప్రయత్నించి చూడండి. పిల్లల్లో హాస్య చతురత సైతం అలవడుతుంది. అయితే ఆ కథలు సినిమా కథలో, టీవీ సీరియల్సో కాకూడదు సుమా! చందమామలంత గొప్ప ఉపకరణాలు మరి లేవు. భట్టి విక్రమార్క కథలంత అద్భుత రసపూరిత కథలు పిల్లల్లో సాహస స్వభావాన్ని, ధైర్యాన్ని, త్యాగనిరతిని నేర్పుతాయి.


మా పాపకీ, మా స్కూలు బుజ్జీలకి భట్టి విక్రమార్క కథలంటే ఎంత ఇష్టమో! మా పాప అయితే 365 కథలున్న ఆ లావుపాటి పుస్తకాన్ని చదువుతున్నన్ని రోజులూ, ఏమన్నా సరే ’మా విక్రమార్కుడు’ అనేది. కథలు చివరికి వచ్చిన రోజున, విక్రమార్కుని మరణం చదివి, గమ్మున దిగాలు ముఖం పెట్టుకు తిరిగింది. ’ఏమిటమ్మా!’ అని బుజ్జగిస్తే ఒక్కసారిగా బోరుమంది. అరివీర విక్రమార్కుడి మరణం, అంత మామూలుగా, శాలివాహనుడి చేతిలో ఓడి ఉండటం, పాపం, తనకి జీర్ణం కాలేదు.

"ఎవ్వరైనా అంతేనమ్మా! కాలం తీరాక వెళ్ళిపోవల్సిందే!” అంటూ చాలా రకాలుగా ఓదార్చ వలసి వచ్చింది. ఇక ఛంఘీజ్ ఖాన్ చదివాక ’నేనొక టేమూజిన్’ ని అంటూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ‘పిల్లల బాల్యం నుండి కథలని మైనస్ చేస్తే మిగిలేది శూన్యం’ అని చెప్పటానికి.

కథలు వినడం, చదవటం, వాళ్ళల్లో శ్రద్దనీ, ఏకాగ్రతనీ పెంచుతాయి. ముఖ్యంగా ఊహాశక్తినీ పెంచుతాయి. ఒక పనిని ఏకధాటిగా గంటల కొద్దీ చేయటం, ప్రారంభించిన పనిని మధ్యలో వదలకుండా చివరికంటూ పూర్తి చేయటం అలవడుతుంది. ఆ విధంగా వ్యక్తిత్వం ఏర్పడుతుంది. వెన్నుగట్టిపడుతుంది. మన ఇతిహాసాలు, చందమామ లాంటి కథలు, చదవటం వలన భావవాదం బాగా బలపడుతుంది. తమదైన అభిప్రాయాలు, తమవైన లక్షణాలు అలవడతాయి. ఆ తర్వాత – వాళ్ళకి ఎన్ని విద్యలైనా, ఎన్ని భాషలైనా నేర్పవచ్చు. ముందు వ్యక్తిత్వం [శ్రమించే తత్త్వం, వినయం, జ్ఞాన పిపాస వంటి లక్షణాలు] నేర్పాలి.

విద్య పేరిట వాళ్ళకు జీవిత సత్యాలు నేర్పాలి. ఒక పనిని నిర్వహించే సత్తా నేర్పాలి. ఏ పని చేయటానికైనా స్ఫూర్తి, ఉత్సాహం కలిగి ఉండటాన్ని నేర్పాలి. ఒక పనిని అవాంతరాలొచ్చినా వెనుకాడ కుండా ఎలా చేయాలో నేర్పాలి. జీవిత లక్ష్యాలు ఎలా ఏర్పరచుకోవాలో నేర్పాలి. దేని మీదైనా తమదైన ముద్ర వేయగలిగేలా వారు తయారు కావాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే విద్య, విద్యార్ధిని ఒక ఖచ్చితమైన వ్యక్తిత్వం గలవారిగా, సంపూర్ణమైన స్వభావలక్షణాలు గలవారిగా తయారు చేయాలి. ఆ చిన్ని బిడ్డ, పెరిగి పెద్దయ్యాక, సత్యాన్ని గ్రహించగల మేధావిగానూ, సత్యం కొరకు పోరాడ గల ధీరునిగానూ, సత్యాన్ని అర్ధం చేసుకోగల అంగీకరించగల మనోదార్ధ్యత గల వాడిగానూ, ఏ సాహసానికైనా వెనుదీయని ధైర్యవంతులు గానూ, నిత్యోత్సాహి గానూ తయారు కావాలి. సరైన విద్యావిధానం ఉంటే ఇది ఎంతమాత్రం కష్టసాధ్యం కాదని ఘంటాపథంగా చెప్పగలను.

అయితే ఇప్పుడు మనం అలాంటి వ్యక్తుల్ని మన విద్యావిధానం నుండి పొందగలుగుతున్నామా? మన చిన్నారులు ప్రకృతిని ప్రేమించగలిగే విధంగా తయారౌతున్నారా? అసలు పరిశీలించే తీరికే వారికి ఉండటం లేదు, ఇక ప్రేమించగలిగేది ఎక్కడ? నీతి, ధర్మం పాటించగలుగుతున్నారా? అసలు అలాంటి మాట కూడా వారికి పరిచయం చేయబడటం లేదు. జీవిత లక్ష్యాలు తెలుసుకోగలిగే విధంగా, అందుకోగలిగే విధంగా తయారౌతున్నారా? ‘సాఫ్ట్ వేర్ ఇంజినీరు కావాలి, లేదా డాక్టరు కావాలి, ఐ.ఏ.ఎస్. కావాలి, ఐ.పి.ఎస్. కావాలి’…. ఈ విధమైనవి జీవిత లక్ష్యాలు అవుతాయా? అవి జీవినోపాధులు మాత్రమే! కానీ పిల్లల్ని నీ ’గోల్’ ఏమిటి నాన్నా?’ అంటే తము చేయబోయే ఉద్యోగం గురించే మాట్లాడటం నేను చాలామంది విద్యార్ధుల దగ్గర గమనించిన విషయం. ఇది ఒకటి నుండి ఐదవ తరగతి పిల్లల్లో మాత్రమే గమనించి చెప్పటం లేదు. ఇంటర్ దాకా చూసి చెబుతున్నాను.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చైనాలో ఒక విద్యార్ధిని, “పెద్దయ్యాక నువ్వు ఏమౌతావు?” అని అడగగా “నేను పెద్దయ్యాక లంచగొండిని అవుతాను” అని ఠక్కున సమాధానం చెప్పిందని, ఈమధ్యకాలంలో వార్తాపత్రికలో చదివాను. ఇంకా మన పిల్లలు అంత అభివృద్ది సాధించలేదు, అంత వరకూ నయం!

నూటికి నూరుశాతం పిల్లలంతా ఇలాగే ఉన్నారనటం లేదు. కానీ అత్యధికులు ఇలాగే ఉన్నారు. ఆలోచనా రహితంగా, క్షణం తీరిక లేకుండా, మహోధృత ప్రవాహంలో పడికొట్టుకుపోతున్న గడ్డిపోచల్లా! ‘పిల్లలు ఏం సాధించారు?’ అంటే – మార్కులూ, ర్యాంకులూ, ఉద్యోగాలు, జీతపు దమ్మిడీలు, కట్టిన ఇళ్ళు, కొన్నకార్లు మాత్రమే కాదు కదా! నిజానికి ఈ పదార్ధ విజయం కూడా తగినంత నిష్పత్తిలో లేదు. అంటే లక్షల్లో పరీక్షలు వ్రాసి, సర్టిఫీకేట్లు పొందిన వారిలో కూడా, దమ్మిడీల పరంగా విజేతలు నిష్పత్తి తక్కువే.

ఇక వ్యక్తిత్వ పరంగా విజేతల నిష్పత్తి గురించి ఏం మాట్లాడగలం?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా Sep.05, 2007 న ప్రముఖ విద్యావేత్త, డా. EV సుబ్బారావు గారు ఓ వ్యాసం వ్రాసారు. అందులో ఆయన , ఒకప్పటి విద్యావిధానాన్నీ, నేడు పాఠశాలల పరిస్థితినీ సమీక్షించారు.

‘ప్రాచీన కాలంలో గురుకులాలుగా పిలువబడే విద్యాసంస్థలు ఆయా గురువుల పేరిట ప్రసిద్దమయ్యేవి. ప్రజలు వాటిని ’ఫలానా గురువు నడిపే గురుకులం’ అనే రిఫర్ చేసేవారు. ఫలానా గురువు క్రమశిక్షణ నేర్పుతాడనీ, జ్ఞాని, సమర్ధుడూ – ఇలా ఆయా గురువుల నైతికత, ధార్మికతలని బట్టి తల్లిదండ్రులు తమ పిల్లలని సదరు గురుకులాలలో వదిలిపెట్టేవారు. అదే ఇప్పుడైతే, ఒక పాఠశాల, గత సంవత్సరాల్లో సాధించిన మార్కులు, ర్యాంకుల వంటి ఫలితాలని చూసి, పాఠశాలకి ఉన్న బ్రాండునీ, ఇమేజ్ ని చూసి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలని ఆయా పాఠశాలలకి పంపుతున్నారు. తరగతి గదిలోకి గురువు/టీచర్ అడుగుపెట్టే వరకూ కూడా, మనపిల్లలకి ఎవరు చదువు నేర్పబోతున్నారో మనకి తెలియదు. టీచర్/గురువుల పేర్లేమిటో కూడా తెలియదు. అంతేకాదు, సంవత్సర ప్రారంభంలో కనబడిన గురువులే/టీచర్లే, సంవత్సర చివరి వరకూ మనపిల్లలకి చదువు చెబుతారో లేదో కూడా మనకి తెలియదు. ఏం విద్యావిధానం ఇది?’ – అన్నారాయన . ఇదెంత నిజం!

మా చిన్నప్పుడు గుంటూరులో సైతం ’వీధిబడి’గా పిలువబడినా సరే, మాష్టారి పేరిటే బడి పేరు ఉండేది. మాకు ఊహ తెలిసేటప్పటికే ప్రభుత్వ పాఠశాలగా మారిపోయినా, మా గుంటూరు వారితోట లోని ప్రభుత్వపాఠశాలని ’పానయ్య బడి’గానే అందరూ పిలిచే వాళ్ళు. ఇప్పటికి, ఆ బడి లో పనిచేసిన ‘పానయ్య మాష్టారు’ స్వర్గస్తుడైనా సార్ధక నామం మాత్రం మిగిలిపోయింది. అక్కడ పిల్లల్ని లెక్కల రాకపోతే కొడతారనీ పేరు కూడా ఉండేది. కానీ బాగా చదువు చెబుతారు. అప్పటికి కాన్వెంట్ల సంస్కృతి అంతగా లేదు.

నిజానికి – బోధనార్హత [అంటే నా ఉద్దేశంలో డిగ్రీలో, బీయెడ్లో, డీఎస్సీలో కాదు] లేని వ్యక్తి, పిల్లలకి ఏం నేర్పగలడు?
వ్యక్తిగా తనలో బలమైన వ్యక్తిత్వం లేని గురువు,
ధృడ చిత్తం లేని గురువు,
స్థిరచిత్తం లేని గురువు,
సామర్ధ్యం లేని గురువు,
విలువలు లేని గురువు,
నిజం చెప్పే అలవాటు లేని గురువు,
అబద్దాలు అలవోకగా ఆడే గురువు,
యాజమాన్యపు దయా దాక్షిణ్యాలు కోసం పితూరీలు చెప్పడం దగ్గర నుండీ, కాకాలు పట్టడం వరకూ చేస్తూ [ఇంకేవో కూడా చేస్తుండటమూ కద్దు] ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలు మరిచిపోయిన గురువు,
ఏవిధంగా సత్పవర్తననీ, సద్గుణాలనీ పిల్లలకి బోధించగలడూ?

ఇదేదీ పరిశీలించాల్సిన అవసరంగానీ, అసలు తమ పిల్లలకి ఎవరు చదువులు చెబుతున్నారో, అసలా చదువులేమిటో, వాటివల్ల ఉపయోగం ఏమిటో పరిశీలించాల్సిన అవసరం గానీ, చాలామంది తల్లిదండ్రులకి లేదు. కనీసం ఆ ఆలోచన కూడా లేదు. “పిల్లలకి చదువు చెప్పే గురువుకి సద్గుణాలో, విలువలో ఉండాల్సిన అవసరం ఏమిటి? సైన్సు, సోషలూ, లెక్కలూ,.... ఇలా సబ్జెక్టులు చెబితే చాలదా?" అనే తల్లిదండ్రులూ ఉన్నారు.

వెలగని దీపం ఏవిధంగా మరో దీపాన్ని వెలిగించలేదో, అదే విధంగా తనలో లేనిదాన్ని ఏ గురువూ ఏవిద్యార్ధికీ బోధించలేడు, నేర్పించలేడు. అది సబ్జెక్టయినా సరే, వ్యక్తిత్వ లక్షణాలైనా సరే!

చాలామంది ఉద్దేశంలో, చదువంటే కేవలం తరగతి పాఠ్యపుస్తకాల్లో ప్రచురింపబడిన పాఠాలే! చదువంటే అక్షరాలే నన్నట్లు ఉంటుంది వాళ్ళ ధోరణి. అక్షరాస్యత జ్ఞానం ఎప్పటికీ కాదు. అనుభూతించగలిగిన భావం జ్ఞానం! దాన్ని అందుకునే సాధనం అక్షరం! సునిశితమైన ఈ అంశం, ఈ రోజు చాలామందికి అర్ధం కాని స్థితిలోకి మన సమాజం తిరోగమనం చేసింది.

ఇక్కడ మీకు ఓ చిన్న ఉదాహరణ చెబుతాను.

నర్సరీలో చేరిన బుడ్డోడికి కూడా ఈరోజు సంఖ్యలు నేర్పడం మొదలు పెడతారు. 1 నుండి 100 దాకా! నిజానికి ‘ఒకటి’ అంటే ఏమిటి? మా పిల్లల్ని[10 వ తరగతి, ఆ పైన పిల్లల్ని సుమా] అంటే విద్యార్ధులని, నేను పరిచయ క్లాసుల్లో ఈ ప్రశ్న వేస్తుంటాను. ఒక్కొక్కరు “One Mam” అంటారు.
“ఇంగ్లీషులో చెప్పావు, అంతే! సరే, One అంటే ఏమిటి?" అంటాను.
మరొకరు వ్రాసి చూపిస్తారు.
“నువ్వు వ్రాసావు, అంతే! దీన్ని నేను నిలువ గీత అంటాను. నువ్వు ఒకటి అని ఇలా [1] వ్రాసావు. ఏ రోమన్ వాసినో అడిగితే ‘i’ అని ఇలా వ్రాసి చూపెడతాడు. తెలుగులో వ్రాయమంటే ‘౧’ ఇలా వ్రాస్తాడు. ఇది ఓ వంకర అక్షరం లేదా సంజ్ఞ. అది కేవలం ఒక గుర్తు మాత్రమే! మళ్ళీ అడుగుతున్నాను. ‘ఒకటి’ అంటే ఏమిటి?" అంటాను.

పాపం మా బుడ్డీలు [ఇంటర్ వాళ్ళయినా నాదృష్టిలో బుడ్డిలే] బిక్కముఖం పెట్టేస్తారు. నవ్వులూ పూయిస్తారు.

దాంతో మరొకరు ఒక వేలు ఎత్తి చూపుతారు. “అది నీ వేలు, అంతే! ఒకటి ఎలా అవుతుంది?" అంటూ ఉంటాను.

ఇక చూస్కోండి, మా వాళ్ళకి తెగ ఉత్సాహం వచ్చేస్తుంది. ఆపైన చర్చ ఆసక్తికరంగా నడుస్తుంది.

చివరికి “ఒకటి అన్నది ఓ భావం. దాన్ని సుచించటానికి వేలు చూపిస్తాం. లేదా ‘1’ అనీ, ‘i’ అనీ, ‘౧’ అనీ వ్రాస్తాం, అంతే! ’అలాంటి వస్తువు అది మాత్రమే ఉంది’ అన్న భావాన్ని ‘ఒకటి’ అన్న పదంతో, ఇంగ్లీషులో ‘One’ అన్న పదంతో, హిందీలో ‘ఏక్’ అనే పదంతో, మరో భాషలో మరో పదంతో సూచిస్తాం. ఇక ‘రెండు’ అన్న భావాన్నీ, ఇలాగే మరో పదంతో, మరో గుర్తుతో సూచిస్తాం! ’అలాంటి వస్తువు అది మాత్రమే గాక, మరొకటి కూడా ఉంది’ అన్న భావాన్ని ‘రెండు’ అంటాం. తొలిమెట్టు తర్వాత తర్వాత మెట్టు ఎక్కినట్లుగా, ‘ఒకటి’ అన్న భావన మీద ఆధారపడి ‘రెండు’ అన్న భావాన్ని[ఒకటికి ఒకటి కలిపితే రెండు అంటూ] నేర్చుకుంటాం” అని చెప్పి, అక్కడ నుండి మా పిల్లల్ని, పైధాగరస్ ఫిలాసఫి, “జగమంతా అంకెల మయం” దగ్గరకీ, అక్కడి నుండి Atomic Number దగ్గరకీ తీసుకు వెళ్తుంటాను. సాధారణంగా నా ఫిజిక్స్ క్లాసు ఇలా ఉంటుంది.

ఇక్కడ మరో ఉదాహరణ చూడండి.

ఈశావాస్యోపనిషత్తుని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను.

>>>ఉపనిషత్తుల యధార్ధమైన అర్ధాన్ని కేవలం పాండిత్యం [పఠించటం, బట్టి వేసి ఉటంకించడం] తో అవగతం చేసుకోలేం. వినయంతోనూ, ఆరాధానాభావంతోనూ పఠించినప్పుడు మాత్రమే వాటిని అర్ధం చేసుకోగలం. అలాంటి వైఖరిని మనస్సులో పాదుగొల్పుకొని ఈ మంత్రాలను ముందుగా పారాయణం చేయాలి. ఈశావాస్య ఉపనిషత్తు శాంతి మత్రం ఇది.

ఓంపూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతేI
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతేII
ఓంశాంతిః శాంతిః శాంతిఃII

భావం:
భగవంతుడు పరిపూర్ణుడు. ఈలోకం పరిపూర్ణమైనది. పరిపూర్ణుడయిన భగవంతుని నుండే పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణతను తీసివేసిన తరువాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

ఒక ప్రహేళిక మూలంగా లోకాన్ని వివరించడానికి ఈ మంత్రం ప్రయత్నిస్తున్నది. భగవంతుడు పరిపూర్ణుడుగా, సంపూర్ణుడుగా ఉంటున్నాడు. ఆయన నుండి పరిపూర్ణమైన ఈ లోకం ఉద్భవించింది. అయినప్పటికీ తన పరిపూర్ణతకు లోటులేక ఆయన పరిపూర్ణుడుగానే ఉంటున్నాడు. దీనిని మూడువిధాలుగా అర్ధం చేసుకోవచ్చు.

౧. ఒక దీపం నుండి అనేక దీపాలను వెలిగించవచ్చు. ఇందువలన మొదటి దీపపు పరిపూర్ణతకు ఎలాంటి లోటూ రాదు. దాని నుండి వెలిగింపబడిన దీపాలు కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రకాశాన్ని ఇచ్చేవిగా ఉంటాయి.

౨. మనం ఎందరినో ప్రేమిస్తాం. వారిపట్ల సంపూర్ణంగ ప్రేమను వర్షిస్తాం. ఆ కారణంగా మన వద్ద ఉన్న ప్రేమ తగ్గిపోయిందని చెప్పలేం. మన ప్రేమ సంపూర్ణంగా ఉంటూనే మనం ఎందరికో ప్రేమను సంపూర్ణంగా పంచి పెట్టవచ్చు.

౩. ఒక చెట్టుకు అనేక పుష్పాలు పూస్తాయి. ప్రతి పుష్పమూ సంపూర్ణంగా ఉంటుంది. ఇలా పరిపూర్ణమైన పుష్పాలను కోకొల్లలుగా ఇస్తున్నప్పటికీ ఆ చెట్టు పరిపూర్ణత కించిత్తు కూడా తగ్గదు. ఎందుకంటే చెట్టు పరిపూర్ణత వేరు, పుష్పం పరిపూర్ణత వేరు.

అదే విధంగా భగవంతుని నుండి ఎన్నెన్నో పరిపూర్ణమైన లోకాలూ, పిండాండ బ్రహ్మాండాలూ ఉద్భవించవచ్చు. అందువలన ఆయన పరిపూర్ణతకు ఏవిధమైన లోటురాదు.

భగవంతుని పరిపూర్ణత లోకాల ఉద్భవం వల్లనో, విలీనం వల్లనో ప్రభావపడదు. భగవంతుని నుండి ఉద్భవించడం వల్ల ఈ లోకం కూడా భగవదంశ సంభూతమైనదని శాంతి మంత్రం భావం. ఈ సత్యాన్ని గ్రహించి జీవిస్తే సామాన్య జీవితమే మనలను భగవన్మార్గంలో తీసుకొని వెళ్ళే శక్తి గలదై ఉంటుంది. ఈ భావాన్నే ఈ ఉపనిషత్తు ద్వారా శాంతి మంత్రం వ్యక్తం చేస్తున్నది.

వేదమంత్రాలన్నీ చివరకు ఓం శాంతిః శాంతిః అంటూ ముగుస్తాయి. శాంతిః అంటే ప్రశాంతత అని అర్ధం. మూడు విధాలయిన ఆటంకాల నుండి మనం బయడపడడానికి మూడుసార్లు ఉచ్ఛరించాలి. ఆ మూడు విధాల ఆటంకాల ఏవంటే.

౧. ఆధ్యాత్మికం:- మన వలన వాటిల్లే ఆటంకాలు, శారీరక రుగ్మత, మానసిక రుగ్మత లాంటివి.

౨. ఆధిభౌతికం :- ఇతర జీవరాసుల వలన వాటిల్లే ఆటంకాలు.

౩. ఆధిదైవికం :- ప్రకృతి శక్తుల వలన ఏర్పడే ఆటంకాలు: వర్షం, పిడుగు, అగ్నిలాంటి వాటి వలన సంభవించేవి.

మూడుసార్లు ’శాంతిః’ అని ఉచ్ఛరించడం వలన, మూడు రకాల ఆటంకాల నుండి విడివడి ఈ ఉపనిషత్తును ఆధ్యయనం చేసే మన ప్రయత్నం విజయవంతమవాలని ప్రార్ధిద్దాం.
[పై శ్లోకాన్ని, భావాన్ని ఈశావాస్యోపనిషత్తుకు స్వామి జ్ఞానదానంద (రామకృష్ణమఠం వారి ప్రచురణ) వ్యాఖ్యానం నుండి యధాతధంగా సంగ్రహించాను.]

పరిశీలించి చూడండి. గణిత పరిభాషలో చెప్పాలంటే ఈ ఈశావాస్యోపనిషత్తులోని ఈ శాంతి మత్రం శూన్యం అంటే ’సున్న’ భావాన్ని [Concept] ని వివరిస్తోంది. సున్నాని పూర్ణం అని మన పెద్దలు ఉటంకించటం అందరికీ తెలిసిందే. సున్నలో నుండి సున్న తీసివేస్తే వచ్చేది సున్నానే. సున్నాకు సున్న కలిపినా వచ్చేది సున్నానే.
0 – 0 = 0; 0 + 0 = 0.

ఈ నేపధ్యంలో గమనించాల్సింది ఏమిటంటే – గణితంలో సున్నాని ప్రాచీన భారతీయ జ్ఞాని ఆర్యాభట్ట ప్రతిపాదించాడని అంటారు. గతంలో అంటే క్రీస్తు పూర్వం, గ్రీకులు ఎవరెన్ని ఎక్కువ సంఖ్యల సంకేతాలని గుర్తు ఉంచుకోగలిగితే వాళ్ళని అంత మేధావులుగా గుర్తుంచేవాళ్ళట. అంటే I,II,III,IV,…..IX,X,XI….. ఇలాగన్న మాట. “నీకెన్ని సంఖ్యల గుర్తుంటాయి?” అని ఒకరినొకరు ప్రశ్నించుకోవటం, అక్కడ కుశల ప్రశ్నలంత సాధారణమై ఉండేదట. అలాంటి చోట, సున్న భావం [Concpet] గణితాన్ని ఎంత సులభతరం చేసిందో కదా? ఇలాంటి ఈ ‘సున్నా Concept’ ని భారతీయులు కనిపెట్టగా, అరబ్బీ దేశీయులు ప్రాచుర్యంలోకి తెచ్చారట. కాబట్టి దీన్ని ‘ఇండో ఆరబిక్’ పద్దతిగా పిలుస్తారని 5వ తరగతి పిల్లలకి గణిత పాఠంలో ఉంటుంది. దీని వెనుక మర్మం ఇప్పుడు బాగానే అర్ధమౌతుందనుకుంటాను.

ఇక ఈ టపాల మాలికలోని ఈ టపా ముగించే ముందు… సరదాగా ఓ ప్రశ్న.

1/1 = 1 , 2/2 = 1, 100/100 = 1 అలాగే x/x =1

మరి 0/0 =1 లేదా 0/0 = 0. ఏది సరైనది?

వందపళ్ళను వందమందికి పంచితే ఒక్కొక్కరికీ ఒకపండు వస్తుంది. కాబట్టి 100/100 =1

మరి సున్న పళ్ళను సున్న మందికి పంచితే, ఒకొక్కరికి ఎన్ని పళ్ళు వస్తాయి. ఒక పండు రాదు కదా? ‘సున్నమందికి’ అంటే ఎవరూ లేరు. ఎవరూ లేని వారికి ఏ పండూరాదు. అంటే ఫలితం సున్న కావాలి. 0/0 = 0 అన్నమాట. కానీ ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ‘1’ రావాలి అన్న సూత్రం ప్రకారం 0/0 =1 కావాలి.

కాబట్టి, దీన్నీ undefined…. నిర్వచించబడనిది….. అని చెబుతాం!

దీన్నే ఈశావాస్యోపనిషత్తులోని శాంతి మత్రం సాయంతో చూస్తే…. పరిపూర్ణుడైన పరమాత్మని, పరిపూర్ణుడైన ఆత్మకు పంచితే, అందుకోగలిగే భావం పరమభావం లేదా బ్రహ్మభావం. దీనినే మోక్షం లేదా జన్మరాహిత్యం అంటాం. అది అనుభవించి, అనుభూతించి తెలుసుకోవలసిందే! అది పరిపూర్ణమైనది, అదే సమయంలో శూన్యమయినది.

ఎంత సాధనతో, ఎన్ని జన్మల సాధనతో అది అందాలో కదా? దీనిని మరో విధంగా కూడా ఈశావాస్యోపనిషత్తు వివరిస్తుంది. దానిని మరోసారి చర్చిద్దాం.

తరచి చూస్తే సున్నా భావం [Concept], భగవంతుడు లేదా పరమాత్మ [లేదా శాశ్వత మైన ఆత్మ]కు మరోరూపమే అన్పిస్తుంది. ఎందుకంటే సున్నాని శూన్యమనీ అంటారు. పూర్ణం అని కూడా అంటారు. పూర్ణం అంటే అన్నీ ఉన్నది. శూన్యమంటే ఏమీ లేనిది. భగవంతుడూ అంతే! నమ్మిన వాళ్ళకు అన్నీ భగవంతుడే! నమ్మని వాళ్ళకు అసలు భగవంతుడే లేడు.

అంతేకాదు పరబ్రహ్మ భావాన్ని[అంటే భగతద్భావాన్ని] సాధనతో [అంటే ఆచరణతో] మాత్రమే తెలుసుకోగలం. ఇదే విషయాన్ని గీత ఎంత స్పష్టంగా చెబుతుందో చూడండి.

శ్లోకం:
అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్
వినాశ మవ్యయస్యాస్య న కశ్చి త్కర్తు మర్హతి

భావం:
ఏదైతే యీ జగత్తంతా పరివ్యాప్తమైవుందో అది [అత్మ] నాశనం లేనిదనీ, అవ్యయమైన ఆ ఆత్మను నశింపజేసేది కూడా యేదీ లేదనీ తెలుసుకో.

శ్లోకం:
ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చిదేన
మాశ్చర్యవ ద్వదతి తథైవ చాస్యః
ఆశ్చర్యవ చ్చైన మన్య శ్శ్పణోతి
శ్రుత్వా ప్యేనం వేద నచైవ కశ్చిత్

భావం:
ఒకానొకడీ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మరొకడు ఆశ్చర్యంగా పలుకుతున్నాడు. ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కాని – చూడటం వలన, చెప్పటం చేత, వినటం చేత – ఆత్మను గురించి తెలుసుకోలేరు.

కాబట్టి – సాధనతో మాత్రమే, అనుభవంలోకి, అనుభూతిలోకి తెచ్చుకోగలిగిన భావం జ్ఞానం. జ్ఞానమే భగవంతుడు. దానినే ఒకప్పటి భాషలో విద్య అనే వాళ్ళు.

అటువంటి చదువు చెప్పేవాడు గురువు.

‘తనకు భగవంతుడూ, గురువూ ఒకేసారి కన్పిస్తే, తాను ముందుగా గురువుకే నమస్కరిస్తాననీ, ఎందుకంటే తనకి భగవంతుణ్ణి చూపింది గురువే కాబట్టి’ – అంటాడు భక్త కబీరు.

అందుకేనేమో మనవాళ్ళు…..

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

అంటారు.

అలాంటి గురువు, ఈరోజు పరువు మాసి పోయారు. చాలామంది తల్లిదండ్రులకి తమ పిల్లలకు చదువు చెప్పే గురువు ఎవరో, అతడి గుణగణాలు ఎటువంటివో – ఏదీ పట్టటం లేదు. ఆయా విద్యాసంస్థలకి ఉన్న Result record, Career record తప్ప, మరేదీ పట్టటం లేదు. దాదాపు పాఠశాల యొక్క బ్రాండూ, ఇమేజ్, [అంటే కార్పోరేటిజం] మాత్రమే పడుతోందన్న మాట.

నిజానికి చదువు అర్ధం కూడా మారిపోయింది. ఈరోజు వృత్తి విద్యలు చదువు కాకుండా పోయాయి. కులవృత్తి విద్యలూ, యుద్దకళలూ, యుద్దవిద్యలూ, లలితకళలూ కూడా చదువు కాకుండా పోయాయి. ఇంకా చెప్పాలంటే మనకున్న 64 కళలూ కూడా చదువు కాకుండాపోయాయి. కేవలం ప్రభుత్వ శాఖల్లో, కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించగలదీ, పొట్టకూడు పెట్టగలదీ మాత్రమే చదువుగా పరిగణింపబడుతోంది. కేవలం తిండి తినటం, బ్రతక గలగటం మాత్రమే జీవితానికి పరమార్ధమా? అది జంతువులకి సహజలక్షణం కదా? మానవ జన్మ అంతకంటే ఉన్నతమైనది కదా? మరి మానవ జీవిత పరమార్ధమూ ఉన్నతంగా ఉండాలి కదా? చదువు పొట్ట నింపటమే కాదు, మనస్సునీ నింపాలి.

అదంతా మరిచిపోయి దమ్మిడీల పరుగులో మునిగిపోవటం వల్లా, దమ్మిడీల వరదలో కొట్టుకుపోయే దృక్పధం వలన ఏర్పడిన ఉత్పాదం ఇది.

ఇక పాఠశాల గురువుల దగ్గరికి తిరిగి వద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

దానగుణం గురించి భగవద్గీతలోని శ్రద్దాత్రయ విభాగ యోగంలోని క్రింది శ్లోకాలు చూడండి.

శ్లోకం:
దాతవ్య మితి యద్దానం దీయతే2నుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్

భావం:
పుణ్యస్థలాలలో ‘దానం చేయుట కర్తవ్య’మని భావించి, దేశకాల పాత్రలను గుర్తించి, తమకు యే రకంగానూ ఉపకరించలేని వారికి చేసే దానం సాత్త్వికం.

శ్లోకం:
యత్తు ప్రత్యుపకారార్ధం ఫలముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్

భావం:
ప్రత్యుపకారంగా గాని, ప్రతిఫలం కోరిగాని, కష్టపడుతూనైనా సరే చేసేదానాన్ని రాజస దానమంటారు.

శ్లోకం:
అదేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే
అసత్కృత మవజ్ఞాతం తత్తామన ముదాహృతమ్

భావం:
దేశకాల పాత్రలను గుర్తించకుండా అగౌరవ భావంతో చేసే దానమే తామస దానం.

త్రిగుణాల ప్రమేయాన్ని బట్టి, దానాలు మూడు రకాలుగా చెప్పబడుతుంది. అన్నిదానాల్లో అన్నదానం గొప్పది అంటారు పెద్దలు. ఎందుకంటే – దాత ఏ వస్తువు దానం చేసినా, గ్రహీతకు తృప్తి కలిగి ’ఇక చాలు’ అనకపోవచ్చు. అయితే అన్నదానంలో మాత్రం, కడుపు నిండిన క్షణం ఎంతటి వాడైనా, ఎంత రుచికరమైన ఆహారం వడ్డించినా ’ఇక చాలు’ అని తీరతాడు కాబట్టి.

ఆకలికి, ఆరిషడ్వార్గాల నియంత్రణకి ’అన్నం’ పరమౌషధమైన నేపధ్యంలో, ’ఈ గడ్డమీద ఒక కుక్క అయినా ఆకలికి అలమటించకూడదు’ అన్నది సనాతన ధర్మం. కాబట్టే అన్నార్తులకి అన్నం పెట్టటమే వ్రతంగా ఆచరించిన వారు, సామాన్య ప్రజల దగ్గర నుండి రాజ్యాలు పరిపాలించిన రాజుల దాకా ఉండేవారు. డొక్కా సీతమ్మలూ, విజయ రాఘవ నాయకుడు ఈ కోవకి చెందిన వారే! ’అన్న దానం చేయటం అంటే సోమరులని తయారు చేయటమే’ అనే ఆధునిక వాదనలు, ఆదరణలోకి వచ్చాయో లేదో గానీ ప్రచారంలోకి మాత్రం వచ్చాయి.

వెరసి ’ప్రక్కవాడి ఆకలి సామాన్యం’ అయిపోయింది. ఒకప్పుడు ’ఆకలితో ఉన్నాడు’ అంటే పిడికెడు అన్నం పుట్టేది. ఇప్పుడు ఎదుటి వాడు ఆకలితో ఉన్నాడన్నా, మనస్సు ‘పాపం’ అన్న జాలితో నిండిపోయి సాయం చేద్దామని అన్పించినా, అందుకు తగినంత వెసులుబాటు కూడా తక్కువే అయిపోయింది. ఎందుకంటే శ్రమదోపిడి, పదార్ధ దోపిడి ఎంత పకడ్బందీగా జరుగుతోందందంటే – ఓ ప్రక్క అన్నార్తుల సంఖ్య పెరుగుతుంటే, మరో ప్రక్క భార్యలకి లేదా ప్రియురాళ్ళకి వందల కోట్ల ఖరీదైన విలాసవంత విమానాలని, నౌకలనీ, వజ్రాలు ఆభరణాలని కానుకగా ఇచ్చే ముఖేష్ అంబానీలు, అనిల్ అంబానీలు, సల్మాన్ ఖాన్ లూ అతిశయించిన సంపదతో అలరారు తున్నామంటున్నారు.

ఇక ఇటీవల[Aug.24,2009] పత్రికలలో వచ్చిన ఈ వార్త చూడండి.మొన్నామధ్య అఫ్గానిస్థాన్ లో, భార్యలు గనుక భర్తతో శృంగారానికి ఒప్పుకోకపోతే తిండిపెట్టకుండా మాడ్చేహక్కుని భర్తల కిస్తూ షరియత్ చట్టం చెయ్యబడుతోందన్న వార్త నేపధ్యంలో, నేను వ్రాసిన టపాకు స్పందిస్తూ తాడేపల్లి గారు ఓ మాట అన్నారు. ’అసలు భార్యభర్తల మధ్య అంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటే, వాళ్ళమధ్య సంబంధాలు ఎంతగా దిగజారి ఉంటాయి?’ అని!

అదే దృష్టితో…. పైవార్తని పరిశీలించినప్పుడు – నిజమే. దాతలు, సహృదయులూ, ఎంతోకొంత వితరణా, దానగుణమూ కలిగి ఉండే వారు, విరాళాలు ఇస్తే, ఇక విరాళాల సేకరణకి మాజీ సైనికుల భార్యలు తమ నగ్నదేహ ఫోటోల ప్రదర్శనకీ ఎందుకు సిద్దపడతారు? వారేమీ మొమైత్ ఖాన్ లూ, ప్రియాంకా కొఠారీలు, రాఖీ సావంత్ లూ కాదు. గౌరవనీయ కుటుంబాల నుండి వచ్చిన వారు. తమ దేశరక్షణ కోసమో, మాతృదేశ ప్రభుత్వ అదేశాల కారణంగానో, యుద్దరంగంలో పనిచేసే సైనికుల భార్యలు. దేశానికి దూరంగా పనిచేస్తున్న తమ భర్తల నుండి క్షేమ సమాచారం కోసం ఎదురు చూస్తూ తాము పడే నరకం తమకి మాత్రమే తెలుసని, ఆ కారణంగా క్షతగాత్రులైన సైనికుల కుటుంబాల వెతలు తాము అర్ధం చేసుకోగలమనీ వారు అన్నారు. అందుకోసమే ఇంత సాహసం చేశామనీ అంటున్నారు. [మనదేశంలోనే కాదు ఏదేశంలోనైనా మాజీ సైనికుల, సైనికుల పరిస్థితి ఒకటే అన్నమాట.]

అంటే, ఎంత మంచి పనికైనా దానం చేసే సహృదయం, మానవత్వం బాగాతగ్గిపోయాయన్న మాట. లేదా మృగ్యమై పోయాయన్నమాట. అన్నమాటేమిటి, అది ఉన్నమాటే! ఒకప్పుడు విరాళాలు అడిగితే ఇచ్చేవాళ్ళు. తర్వాత్తర్వాత విరాళాల కోసం ’బెనిఫిట్ షో’లు నిర్వహించటం మొదలయ్యింది. క్రికెట్, మ్యాజిక్, మ్యూజికల నైట్, నృత్యప్రదర్శన గట్రా గట్రా నిర్వహించి, ఆ వచ్చిన సొమ్ముని విరాళంగా అందించటం అనే సాంప్రదాయం మొదలైంది. సహృదయులైన నాయకులు, నృత్యకళాకారులూ, క్రీడాకారులూ, ఇతర నిపుణులూ, తాము పారితోషికం తీసుకోకుండా, మరికొందరు ఖర్చులు భరించి ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించి, టిక్కెట్లు అమ్మగా వచ్చిన సొమ్ము ఆర్తులను ఆదుకోవటానికి విరాళాలుగా ఇచ్చేవారు.

నిజానికి ‘ఓవైపు ఆర్తులూ, బాధితులూ దైన్యస్థితిలో ఉండగా, వాళ్ళకి సహాయం చేయడం కోసమైనా సరే, మరోవైపు ఆ వంకన ఆనందించటం ఏమంత సబబు?’ అన్న విమర్శలు తొలినాళ్ళలో చెలరేగినా ’ఏదో లెమ్మని, గుడ్డి కంటే మెల్లనయమని’ తరత్తర్వాత్త సరిపెట్టుకోవటం అలవాటయి పోయింది. మరికొంత కాలం గడిచే సరికి అదీ కరువైనట్లుంది. ఇక విరాళాల కోసం నగ్మప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తోందన్నమాట.

దీనికి కారణాన్ని విశ్లేషిస్తే, ఒళ్ళు గగుర్పొడిచే నిజం వెలికి వస్తోంది. అదేమిటంటే – క్రమంగా మానవుల్లో దానవ గుణం పెరగటం, దానగుణం తరగటం! అదెలాగంటే – డబ్బు లేని పేదవాళ్ళ దగ్గరా, బొటాబొటి సంపాదనలతో సంసారం ఈడ్చే సామాన్య మధ్యతరగతి, ఎగువమధ్యతరగతి వర్గాల దగ్గరా, ఇతర బాధితుల పట్ల సానుభూతి, దయ ఉన్నాయి. వారికి సాయం చేయాలన్న తపన ఉంది. [ఇక్కడ ఎక్కువశాతం మంది అని గమనించగలరు]. అయితే దానం చేయగలిగేంత, సహాయం చేయగలిగేంత, వనరుల్లేవు. అదీగాక, ఇంకా ఇలాంటి మానవీయ విలువలు, కోణాలు ఉన్నాయి కాబట్టే ఇలాంటి మనుష్యులు పేద, సామాన్య వర్గాల్లోకి నెట్టివేయబడుతున్నారు.

దీనికి ఉదాహరణ: అనంతపురం జిల్లా గుత్తి పోలీసు స్టేషన్ కు చెందిన గోరంట్ల మాధవ్, S.I. తన పరిధిలోని, చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రజలను చైతన్యపరిచాడు. ఆ గ్రామస్తులకు పంటలు అంతంత మాత్రం పండుతాయి. అయినా గానీ, దాదాపు 17 వ్యానులకు నిండుగా ఆహరపదార్ధాలు, పాత బట్టలు, కూరగాయలు మొదలైనవి ఇచ్చారు. ఆ గ్రామాలలో ఉన్న వెయ్యిమంది ప్రజలను కూడా తీసుకుని, ఆ ఎస్.ఐ., 17 వరద బాధిత గ్రామాలలో, ఆయా వస్తువులని పంచారు. అంతేకాదు, పంటలు సరిగాపండని అనంతపురం ప్రజలు వరదబాధితల కోసం చాలా సహాయం చేసారు.

ఇక డబ్బున్న వాళ్ళు, దానం చేయగలిగేంత, సహాయం చేయగలిగేంత వనరులున్న వాళ్ళు. అయితే వారి దగ్గర ఇతరుల బాధలకి స్పందించే మానవత్వం [ఎక్కువశాతం మంది వద్ద] లేదు. “మరి సి.ఎం. నిధికి చాలామంది ధనవంతులు డబ్బులిస్తున్నారు కదా?” అనవచ్చు. వాళ్ళలో చాలామంది వెనక తట్టున సి.ఎం.పేషి నుండి అదేశాలు అందుకున్నవారు లేదా ప్రభుత్వంతో తమ అవసరాల దృష్టితో ఇవ్వటం లాంటివి ఉన్నాయన్న మాట. అంతేకాదు, చిరంజీవి శుక్రవారం వైజాగ్ లో వందమంది ప్రముఖులకి పార్టీ ఇచ్చాడట. స్థానిక నాయకులు “ప్రతిఒక్కరి దగ్గర నుండి కనీసం 25 వేల రూపాయల దాకా చందా వసూలు చేయటం లక్ష్యమని” చెప్పారు. ఇక్కడ కూడా తమ దాతృత్వ గుణం కంటే చిరంజీవితో భవిష్యత్తు అవసరాల దృష్టితో ఇవ్వటమే ఎవరైనా!

ఈ విధంగా, తమకు ‘ఆనందం, లాభం కలిగితేనే డబ్బు చెల్లించాలి’ అనే దృక్పధం దగ్గరున్నారు. ఫలితమే ఈ విపరిణామాలు. చివరికి వితరణ కోసమో, విరాళాల కోసమో, లేదా క్షతగాత్రులైన మాజీ సైనికుల కోసమో, మరో పీడితుల కోసమో మ్యూజికల్ నైట్ ల స్థానే నగ్న ఫోటో కాలెండర్లు, నగ్న ప్రదర్ననలూ చోటు చేసుకుంటే – మానవులలో దానవత్వం పెరిగి దానగుణం తరిగిపోయిందనే చెప్పాలి కదా!


కాబట్టే మానవత్వం మీదే కుట్రజరుగుతోందని అన్నాను. మనుష్యులలో వితరణ, దానగుణం లాంటి లక్షణాలు నాశనం చేయబడటం అంటే, మానవత్వాన్ని నశింపజేయటమే గదా?

నిజానికి ‘మనుష్యులలో మానవత్వాన్ని హత్య చేయటం’ అన్న ఈ ప్రక్రియని, నకిలీ కణిక వ్యవస్థ అంత తేలిగ్గా ఏమీ సాధించలేదు. దీర్ఘకాలం, చాప క్రింద నీరులా పనిచేసి మరీ సాధించింది. సినిమాలు ద్వారా గానీ, సాహిత్యం ద్వారా గానీ, కొన్నిదశాబ్దాల పాటు, మానవత్వం మీద, మంచితనం మీద నమ్మకం పోయేటటువంటి కథలనీ, సంఘటనలనీ ప్రజల్లోకి చొప్పించింది. ఈ స్థితి 1992 కు ముందర మరింత ఎక్కువగా ఉండేది.

గమనించి చూడండి: స్నేహితులని నమ్మి ఆస్థులు పోగొట్టుకుని, కష్టాలపాలైన హీరోయిన్ తండ్రి లేదా హీరో తండ్రి కథలు/పాత్రలు తప్పనిసరిగా అప్పటి సినిమాలో ఉండేవి. ఎక్కువగా గుమ్మడి వెంకటేశ్వర రావు అలాంటి పాత్రలు ధరించేవాడు. వార్తాపత్రికలో సైతం, వర్షానికి వరండాలో తలదాచుకోవచ్చిన కుటుంబాన్ని, ’ఆశ్రితులు’ హత్య చేసి దోపిడి చేసిన సంఘటనలనీ, మంచినీళ్ళు అడిగి ఇవ్వబోయిన గృహిణి గొంతుపిసికి నగలు దోచుకున్న మోసాగాళ్ళ గురించిన సంఘటనలనీ ప్రచారించినట్లుగా, స్నేహం కోసం ప్రాణాలిచ్చిన వారి గురించో, సాటివారికి మేలు చేసిన వారి గురించో వ్రాసేవి కావు.

ఈ ఉదాహరణ పరిశీలించండి. 1986 – 87 ల్లో అనుకుంటా ఆంధ్రభూమి వారపత్రిక సికరాజు సంపాదకీయంలో చాలా సంచనాలు రేపింది. రేపిందని సదరు పత్రిక తనకు తాను చెప్పుకునేది కూడాను. లేఖా రచయిత్రులని సైతం అందలా లెక్కించామని, బూతు సాహిత్యాన్ని విమర్శిస్తున్నామన్న పేరుతో ప్రచారిస్తూ మరీ… తమ గొప్ప తాము చెప్పుకునేది. అలాంటి వార పత్రికలో ఇంటింట గ్రంధాలయం కోసం ఓ బుల్లి నవల [నవల సైజులో] ప్రచురింపబడేది. ఓ సారి అందులో…..

ఓ అందమైన హీరో హీరోయిన్ల జంట విశాఖ పట్నంలో ఉంటారు. ఓ వెన్నెల రాత్రి, సాగర సౌందర్యం చూడాలని బైక్ మీద భీమిలీ వెళతారు. బీచ్ లో ఉండగా హీరోని విషపు పాము కాటు వేస్తుంది. హీరోయిన్, నురగలు గ్రక్కుతున్న హీరోని భుజానికి ఆన్చుకుని, ఈడ్చుకుంటూ రోడ్డుదాకా తెస్తుంది. రాత్రి సమయం! తాను బైక్ నడపలేదు. లిప్ట్ కోసం ప్రయత్నిస్తున్నా, ఫలించదు. కాస్సేపటికి ఓ కారు ఆగుతుంది. ఈమె ప్రమాదాన్ని వివరించి లిఫ్ట్ అడుగుతుంది.

ఆ కారుని ధనికుడైన ఓ యువకుడు నిండా తాగి డ్రైవ్ చేస్తుంటాడు. అతడు ఆమెకి సాయం చేయటానికి ఓ షరతు పెడతాడు. తనని శృంగారంతో అలరించమని! హీరోయిన్ అతణ్ణి ప్రాధేయపడినా, ఆ మత్తులో ఉన్న యువకుడు వినడు. హీరోయిన్, హీరో ప్రాణాల కోసం మనసు చంపుకుని అంగీకరిస్తుంది. స్పృహ కోల్పోయి, మరణానికి చేరువ అవుతున్న హీరోని కారు ముందు సీటులో ఉంచి, ఆ ధనిక యువకుడు, కారు వెనక సీటులో హీరోయిన్ తో ఆనందిస్తాడు.

పదినిముషాల తర్వాత కారు శరవేగంతో ఆసుపత్రి చేరుతుంది. హీరోని పరిక్షించిన డాక్టర్లు “ఒక్క పదినిముషాలు ముందుగా వచ్చి ఉంటే ప్రాణాలు దక్కేవని” చెబుతారు. అది విన్న హీరోయిన్ శిలా విగ్రహంలా నిలబడి పోతుంది. ఆపైన ధనిక యువకుడేం చేసాడో సదరు నవల రచయిత/రచయిత్రి చెప్పలేదు.

అప్పట్లో ఇది చదివినప్పుడు అసహ్యంతో, కోపంతో ఆ పుస్తకం విసిరి కొట్టాను. “ఓ వైపు సాటి మనిషి చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, నురగలు గక్కుకుంటూ, కారు ముందు సీట్లో ఉండగా, వెనక సీట్లో ఈ సుఖలాలసనా? అలా అసలు మనుషులుంటారా? ఏం మనో వికారాలివి?" అనుకొని ఆక్రోశ పడ్డాను. ఇలాంటి పాఠకుల ఆక్రోశాలతో నిమిత్తం లేకుండా వారపత్రికలూ, వార్తపత్రికలూ, తమ ప్రణాళిక ప్రకారం, తమ ప్రచారం తాము కొనసాగించుకుంటూ పోయాయి.

పదేపదే అలాంటివీ ప్రచురించీ, ప్రచారిస్తే… “ఇదిగో, ఇలాగే, ఎదుటి వ్యక్తి చావుబ్రతుకుల్లో ఉన్నా, మరెంత దయనీయ స్థితిలో ఉన్నా, తమకి లాభము లేదా ప్రయోజనమూ ఉంటే మాత్రమే, తాము డబ్బు ఖర్చు పెట్టటం [అంటే సహాయం చేయటం] వంటివి చేసే స్థితికి మనుష్యులు ప్రయాణం చేస్తారనీ, చేసారనీ ఇప్పుడు తెలుస్తోంది.

ఫలితంగా ఇప్పుడు ఛారిటీ కోసం అంటూ…. తమ ’ముద్దుని వేలం’ వేసిన హాలీవుడ్ అందాల నటీమణులు తయారయ్యారు. సదరు శృంగార నటి తన ముద్దుని వేలం వేయవచ్చుగాక! వ్యధార్తుల కష్టం తీర్చడం కోసం ఈ తార ముద్దుని ఆస్వాదిస్తానంటూ ముందు కొచ్చే వాడిని/వారిని ఏమని పిలవాలి? రసికులనా? దాతలనా? ఆ దానాన్ని ఎటువంటి దానంగా అభివర్ణించాలి. మనకి తెలిసిన సాత్త్విక, రాజస, తామస దానాలలో కూడా లేదిది. తామస దానం కంటే నీచమైనది. ఇది కాముకత్వం తప్పితే దానగుణం లాగా అన్పించడం లేదు.

తరచి చూస్తే మానవత్వం నశిస్తూ ఉన్నట్లే ఉంది కదూ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నెం.10 వర్గం ఒక్కటే, ప్రపంచాన్ని ఏకఛత్రాధి పత్యంగా ఏలిన రోజుల్లో, అన్నీ తమకి అనుకూలంగానే నడుపుకున్నారు. ఇప్పుడా నెట్ వర్క్ దెబ్బతినటమే దీనికి కారణం. అందులో భాగంగానే సిడి టెక్నాలజీ, సిడి ప్లేయర్ లు చౌకగా ప్రజలకి ఆందుబాటులోకి రావటం జరిగింది. పైరసీ భూతం సినిమా రంగపు భుజాలు వంచింది.

ఇది సినిమావాళ్ళు సృష్టించిన ’చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం, తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం’ అన్న ద్వంద్వాన్ని బద్దలు కొట్టింది. సిడిల లభ్యత, డివిడిల అందుబాటు ప్రజలని చాలావరకూ సినిమా ధియేటర్ల దాకా వెళ్ళకుండా నివారించింది. కొత్త సినిమా కానివ్వండి, పాత సినిమా కానివ్వండి జనాలు ఎక్కువగా సిడిలని ఆదరించటం మొదలు పెట్టారు. విసీఆర్ లకంటే ఎక్కువగా విసిడి ప్లేయర్లు, డివిడి ప్లేయర్లు మార్కెట్ లోకి వచ్చాయి. దాంతో ధియేటర్ కి ప్రేక్షకుణ్ణి రప్పించాలంటే నాణ్యమైన కథతోపాటు, అద్భుతమైన సాంకేతిక విలువల్ని తెరమీద ఆవిష్కరించాల్సి వస్తోంది. అది ఖర్చుతో కూడుకున్న పనికావటంతో రిస్క్ పెరిగింది. అందునా పైరసీ భూతం ప్రక్కనే ఉందయ్యె!

ఒకప్పుడు ఇదే సాంకేతిక అడ్వాంటేజ్ తో ఇతర కళారూపాలని నామరూపాల్లేకుండా చేసిన సినిమా రంగం తాను అదే ’కర్మ’ఫలాన్ని అనుభవిస్తోంది అన్నట్లు అదే సాంకేతిక అడ్వాంటేజ్ [సిడిల లభ్యత] చేతిలో కుదేలవుతున్నది. ఏది ఏమైనా సాంకేతిక అభివృద్ధి వల్ల కొన్ని అడ్వాంటేజ్ లూ, కొన్ని డిస్ అడ్వాంటేజ్ లూ ఉంటాయన్నది నిజం. సిడి సాంకేతికత బోరు కొట్టించే, మూసధోరణితో జవసత్వాలని హరించే, అశ్లీల, నాసి సినిమాల నుండి జనాలకి విముక్తి కలిగించింది. అనివార్యమైన పోటీ వల్ల సినిమారంగం, తప్పనిసరై, కథా, విలువలు, నాణ్యత విషయంలో సమతుల్యత తెచ్చుకోవలసి వస్తోంది. [ఈ స్థితి పూర్తిగా రాకపోయినా, ఆ దారిలో ఉండటం మాత్రం నిజం!]

అయినా గానీ ఒళ్ళు ప్రదర్శించే మొమైత్ ఖాన్ లూ, ప్రియాంక కొఠారీలూ ఉన్నారు. వారి నగ్నప్రదర్శన ఎంతగా డబ్బులు కురిపిస్తుందో వారికీ, ఆయా సినిమా నిర్మాతలకే తెలియాలి. అంతేకాదు ఆడనటులైనా మగనటులైనా దుస్తులు విప్పేసిన వారికే వరుస అవకాశాలూ రావటం చూస్తునే ఉన్నాం.

ఈ నేపధ్యంలో ఓ విషయం పరిశీలించవచ్చు. 1992 తరువాత హిందీ చిత్రసీమలో మిధున్ చక్రవర్తి అనబడే హీరో దాదాపు 23+ సినిమాలు వరసగా ఫ్లాపులయ్యాక గానీ విషయం ఇంకించుకుని ఇంటికి పోలేదు. మిగిలిన భాషల్లో కూడా ఇలాంటి వారున్నారు. పైరసీ [సిడి] తాలూకూ పోటీ ఇంతగా ఉన్నాకూడా ఇన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. అంటే సినిమా రంగంలో అంత పెట్టుబడులు పెట్టగల నిల్వలున్నాయన్నమాట. అటువంటప్పుడు 1992 కు ముందర కేవలం సినిమాలే ప్రత్యామ్నాయమై [ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు లేనప్పుడు]ఉన్నప్పుడు, ఎంత డబ్బు సినిమారంగంలోకి ప్రవహించి ఉండాలి? అది ఎక్కడ పోగుపడి ఉండాలి? అందులో ప్రధాన వాటా గాడ్ ఫాదర్లదే కదా!

ఇక్కడ మరో వాస్తవం పరిశీలించండి. ఈ మధ్య నటి స్నేహ [ఈవిడ దుబాయ్ నుండి దిగుమతి అయ్యింది. మమతా మోహన్ దాస్ అనే మరో హీరోయిన్ కమ్ గాయని కూడా అరబ్బు దేశాల నుండి వచ్చిన భారతీయురాలు. కత్రినా కైఫ్ లండన్ నుండి వచ్చినట్లన్నమాట.] చెప్పులేసుకుని గుడిలో ప్రదక్షణ చేయటం అన్న వివాదంతో బయటికొచ్చింది. దాని తాలుకూ వీడియో కూడా వెలుగు లోకి వచ్చింది. అలా వీడియో వచ్చిందంటే అర్ధం, అది పొరపాటు కాదనీ, ప్రయత్నపూర్వకంగా చేసిన పనేనని. ఎందుకలా?

ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే…… మరికొన్ని వాస్తవాలు పరిశీలించాల్సిందే. మొన్నామధ్య నటి, మాజీ హీరోయిన్ [ఇప్పుడు వయసై పోయింది, లావూ అయిపోయింది] అయిన ఖుష్భు దేవుడి పటాల వైపుకు చెప్పులతో కాళ్ళు చూపెట్టి [సినిమాల్లో కాదండి] వివాదాల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆవిడకి చెన్నైలోని ప్రముఖ నగల షోరూం లనుండి వాణిజ్య ప్రకటనలలో నటించే అవకాశాలు వచ్చాయి. తద్వారా సినిమాలలో అవకాశాలు తగ్గిపోయిన సదరు లావుపాటి నటికి కొన్ని ఆదాయ వనరులు సమకూరాయి.

దాదాపు ఇలాంటి వివాదాలే క్రీడాకారిణి, మీడియా ఇచ్చిన బిరుదు ప్రకారం ‘భారత్ టెన్నిస్ సంచలనం’ సానియా మీర్జా కూడా ఎదుర్కొంది. కాకపోతే ఈమె జాతీయ జెండా విషయమై వివాదంలో చిక్కుకుంది. తదనంతర కాలంలో మ్యాచుల్లో గెలిచినా ఓడినా నిరంతరాయంగా మీడియా ఇమేజ్ కవరేజ్, వివిధ కార్పోరేట్ కంపెనీల నుండి బ్రాండ్ అంబాసిడర్ గా కాంట్రాక్టులూ వచ్చాయి.

ఇప్పుడు నడుస్తున్న విజయ సంకేతం, సక్సెస్ ఫార్ములా ఇదే. నటి స్నేహకు అంతకు క్రితం, అంటే ‘శ్రీరామదాసు’ లాంటి భక్తి సినిమాలో నటించక ముందు, కెరీర్ గ్రాఫ్ బాగానే ఉంది. ‘బాపు బొమ్మ’ అన్పించుకునేంతగా! ఆ తర్వాత ‘పాండురంగడు’లాంటి మరికొన్ని సినిమాలు చేసింది. ‘నిజాం’ల కథ ‘శ్రీరామదాసు’ చేసినందుకో [తొలితరం నకిలీ కణికుడి గూఢచర్య ప్రయాణం, ‘శ్రీరామదాసు కథ’తో ప్రారంభం కావడం గురించి గత టపాలలో వివరించాను.], మరింకో కారణమో గానీ….. స్నేహ అంటే ’శుద్దంగా చీరకట్టుకుని నటించే పాత్రలకి పరిమితం’ అన్న ముద్ర పడిందన్న పైకారణంతో[over leaf reason] ఆవిడకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. తర్వాత అడపాదడపా మీడియాలో ఇంటర్యూలు వచ్చాయి గానీ సినిమాలు మాత్రం రాలేదు. పైగా నటి శ్రియకు తల్లివేషం వెయ్యవలసిందిగా అడిగారనీ, ఈమె తిరస్కరించిందన్న వార్తలూ, ఇంటర్యూలూ వచ్చాయి. ఇప్పుడు ఈవిడ నటించిన ఏదో హీరోయిన్ ఓరియంటడ్ యాక్షన్ సినిమా విడుదలకు సిద్దమౌతుంది.

వాస్తవానికి శ్రీరామదాసు చేశాక ఆ సినిమా దర్శకుడు కె.రాఘవేంద్రరావు కెరీర్ గ్రాఫ్ కూడా ఆగిపోయింది. శ్రీరామదాసు తర్వాత పాండురంగడు [భక్తి ముసుగు వేసుకున్న శృంగార చిత్రంగా పేరుతెచ్చుకుంది. ప్లాప్ అన్నమాటకు సమాంతరంగా హిట్ హిట్ అంటూ ఎన్టీఆర్ సంతానం పదేపదే ప్రకటించుకున్న సినిమా] చేసాడు. తర్వాత ఇంకే చిత్రం గురించీ వినలేదు. ఇక ఆ చిత్ర నాయకుడు నాగార్జునకు కూడా హిట్ లేదు.

ఇక ఇలాంటి నేపధ్యంలోనే, సినిమానటి స్నేహ, ప్రయత్నపూర్వకంగా గుడిలో చెప్పులతో ప్రదక్షిణ చేసి, దాని తాలూకూ వీడియోని వ్యూహాత్మకంగా వెలుగులోకి పంపి, తనకు కెరియర్ ఇవ్వవలసిందిగా సంకేతాలు ఇస్తోంది. ఇవి ఫలించలేదనిపిస్తే రేపెప్పుడో జాతీయ జెండాని అవమానించిందన్న వివాదంలో ఇరుక్కున్నా మనం ఆశ్చర్యపోనక్కర లేదు.

1992 తర్వాత దాదాపు 2000 ప్రాంతంలో సినిమాల్లో ఒక జెండా సీను, దేశభక్తి సీను ఉండటం సక్సెస్ ఫార్ములాగా ఉండింది. ఇప్పుడు నటీనటులకి సక్సెస్ గ్రాఫ్ పొందేందుకు ఇవి చిట్కాలన్నమాట.

ఇక ఈ సినిమారంగంలో మెల్లిమెల్లిగా ఆక్రమిస్తున్న సువర్ణముఖి గురించి చెప్పకపోతే సినిమారంగాన్ని గురించిన ఈ టపాల మాలికని అసంపూర్తిగా ముగించినట్లే! అన్నీ విషయాలని, అందరు నటీనటులని వివరించకపోయినా మచ్చుకి ఒకటి చెబుతాను. పరిశీలించి చూస్తే కొకొల్లలుగా – తార్కాణాలు మీకూ కనిపిస్తాయి.

సినీ నటుడు చిరంజీవి విషయమే ఉదహరిస్తాను. చాలా కష్టపడి పైకొచ్చాడంటూ ఇప్పుడు మీడియా తెగ ప్రస్తుతించిన చిరంజీవి, నిజంగానే కెరియర్ తొలిరోజుల్లో కష్టపడిన మాట వాస్తవమే. ఇతనూ, నటుడు నారాయణ రావూ…….. మొదలైన వారంతా ఒకేసారి సినిమారంగప్రవేశం చేసిన సహచరులే. అయితే అల్లురామలింగయ్య కుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత చిరంజీవికి లాబీయింగ్ కలిసివచ్చింది. ఈ వివాహ లాబీయింగ్ లు అప్పట్లో అంతగా బహిరంగం కాదు కానీ ఇప్పుడు అర్ధమయ్యే స్థితిలోనే ఉన్నాయి.

చిరంజీవి పెద్దకుమార్తెకు అప్పటి వర్ధమాన నటుడు ఉదయ్ కిరణ్ తో నిశ్చితార్ధం జరిగి, తర్వాత రద్దు చేయబడింది గానీ, అలాగ్గాక ఉదయ్ కిరణ్ చిరంజీవికి అల్లుడు అయి ఉంటే [ఇలా వ్రాయడం రీత్యా చిరంజీవి కుమార్తెను, ఆమె ఆత్మాభిమానాన్ని కించపరిచే ఉద్దేశం నాకేమాత్రం లేదని గ్రహించాలి] ఈ పాటికి ఉదయ్ కిరణ్ కూడా మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా ముద్రవేయించుకోగలిగి ఉండేవాడు.

ఇదొక్కటే కాదు, హిందీ సినీరంగంలోనూ ఇలాంటివి కోకొల్లలు. ఐశ్వర్యారాయ్ కి నడుస్తున్న లాబీయింగ్ కోసం, ఆవిడని వివాహం చేసుకోవాలన్న కాంక్షనీ, ఒత్తిడినీ సల్మాన్ ఖాన్ మొదలు, వివేక్ ఒబరాయ్ ల దాకా చాలామందే చేశారు. ఆ వరుసలో అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ లు, తమకు అప్పటికే ఉన్న లాబీయింగ్ తో, కోడలుగా ఐశ్వర్యారాయ్ ని, తమ ఇంటికి తెచ్చుకోగలిగారు. అమితాబ్ కూడా జయబచ్చన్ ను చేసుకున్న తర్వాతనే సూపర్ డూపర్ హిట్ అయ్యాడు. జయబచ్చన్ తో వివాహం జరిగేటప్పటికి అమితాబ్ కంటే జయబచ్చన్ కే ఎక్కువ లాబీయింగ్ నడుస్తుండేది. కెరీయర్ కోసం, లాబీయింగ్ కోసం నటీనటుల, సినీరంగంలో ఇతర ప్రముఖ వృత్తి నిపుణుల వ్యక్తిగత జీవితాలు నియంత్రించబడటం ఇప్పుడు చాలా మామూలైపోయింది. సరే! ఇక ఈ విషయం వదిలేసి మళ్ళీ చిరంజీవి విషయం దగ్గరకు వద్దాం.

వివాహం తర్వాత అల్లురామలింగయ్య లాబీయింగ్ చిరంజీవిని సక్సెస్ బాటలో నడిపింది. అంతగా రూపం, నటనా లేని అల్లుకుమారుడు అరవింద్ కి అల్లులాబీయింగ్ నిర్మాత కెరీయర్ ని ఇచ్చింది. అదీ తక్కువదేం కాదుగదా? ఇక గాడ్ ఫాదర్ దయా, ఆశీస్సులతో కూడిన ఈ లాబీయింగ్ తో, ఇతర నటీనటులు అణిచివేయబడ్డారు. పోటీ లేకుండా పోయింది. అయితే ప్రచారంతో మాత్రం తీవ్రపోటీ ఉన్నాగానీ చిరంజీవి కష్టపడి విజయం సాధించినట్లుగా చెప్పబడింది. నృత్యాల దగ్గర నుండీ అన్నిటా ’మేలిమి’ చిరంజీవికి సమకూర్చబడింది. మిగిలిన వాళ్ళకి ఆ అవకాశాలు ఉండక అణగారిపోయారు. తొక్కివేయబడ్డారు. గాడ్ ఫాదర్ ల అండాదండా ఇవన్నీ సమకూర్చి పెట్టింది.

అయితే రాజకీయరంగంలోకి దించబడి, ఇప్పుడు చిరంజీవి ’తొక్కి వేయబడుతుంటే’ ఎంత బాధ కలుగుతుందో స్వానుభవంతో తెలుసుకుంటున్నాడు. తాను ఇతరుల్ని తొక్కేసినప్పుడు తనకి బాధ ఎందుకు కలుగుతుంది? తిరిగి అది తాను అనుభవిస్తున్నప్పుడు కదా తెలుస్తుంది!? చెత్త, అశీల్ల సినిమాలు చేసి, అధిక కమీషన్లు గాడ్ ఫాదర్ లకి సమర్పించి, వెనకేసిన సొమ్ము, ఇప్పుడు రాజకీయరంగంలో ఖర్చుపెట్టాల్సి వస్తుంటే నొప్పేస్తోంది.

ఏమైనా సినిమా రంగంలో తాను గాడ్ ఫాదర్ ల అండదండలతో ఇతరులకి చేసింది, ఇప్పుడు గాడ్ ఫాదర్ లకే పరిస్థితులు తిరగబడిన నేపధ్యంలో, రాజకీయరంగంలో అనుభవించవలసి రావటమే ఇక్కడ సువర్ణముఖి. పరిశీలిస్తే లోతు మీకే తెలుస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

మరో స్పష్టమైన ఉదాహరణ పరిశీలించండి. పాత సినిమాల్లో [చాలా వాటిల్లో] పాత్రల సంభాషణలు గానీ, పాటలు గానీ ఎంతో సాహిత్యపు విలువలతో, భాషా సౌందర్యంతో, స్ఫూర్తిదాయకమైన అర్ధాలతో, భావయుక్తపు ప్రయోగాలతో నిండి ఉండేవి. వీటితో పాటు పాటలలో సంగీతపు రసపుష్టి కూడా ఉండేది. భావానికి తగిన రాగం ఉండేది. ’మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ శంకరం బాడి సుందరాచారి పాట, టంగుటూరి సూర్యకుమారి నోట, శ్రోతలకు రోమాంచిత మయ్యేరాగం అది. ’రుద్రమ్మ భుజకీర్తి, మల్లమ్మ పతిభక్తి, కృష్ణరాయల కీర్తి, తిమ్మరసు ధీయుక్తి’, గాయకుల గొంతు స్థాయి పెరిగే కొద్దీ గుండెలు కొట్టుకునే వేగం పెరిగే వీర రసం అది. ఒక్క టంగుటూరి సూర్యకుమారి పాడినంతనే కాదు, చిన్నప్పుడు మా స్కూల్ లో, మా సంగీతం టీచర్ ’సుశీలమ్మ’ గారు మాకు నేర్పిన రాగం కూడా అదే.

అదే పాటని ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడగా, కృష్ణంరాజు, సుహాసినిలు నటించగా, బాపూరమణలు తెరకెక్కించిన తీరు,[‘బాపూరమణలు కూడా ఇంత చెత్తగా సినిమా తీయగలరా?’ అని మనం ఆశ్చర్యంతో మూర్ఛపోవాల్సిందే. అదే గాడ్ ఫాదర్ ల గ్రిప్] బుల్లెట్ చిత్రంలో చూడండి. ఒక్కసారిగా నీరసం, నిస్సత్తువ ఆవరించికపోతే చెప్పండి.[అందులో విచిత్రం ఏమిటంటే – క్రింద కూర్చుని, బాసింపట్లు వేసుకుని, ఆ పాట ఆలపించిన హీరోకి, పాట పూర్తయ్యేసరికి, ఆత్మపరిశీలన చేసుకున్న (గతంలో అహంకారి అయిన) హీరోయిన్ పాదాక్రాంతం అయిపోతుంది.] వీర రసం పలికించాల్సిన పాటకి తద్విరుద్దమైన రాగం కడితే వచ్చే ఫలితం అది.

మరోపాట ’వీరకంకణం’ సినిమాలో ’కట్టండి వీరకంకణం’ అన్నపాట. ఆనాడు స్వాతంత్ర సమరంలో దూకేందుకు అఖిలాంధ్రమహిళలని ఉత్తేజితులని చేసిన పాట అది. అలాంటి సజీవ రాగాలు 1975 నుండి 1992 వరకూ పూర్తిగా తుడిచి పెట్టబడ్డాయి. సంగీత శాస్త్రం ప్రకారమే కాదు, ఆధునిక మానసికశాస్త్రం ప్రకారమైన సరే, కొన్ని రాగాలు, ప్రజల రక్తంలో తరతరాలుగా ఉన్న మూలాల కారణంగా ప్రజలని ఉత్తేజితులని చేస్తాయి అని చెప్పవచ్చు. ఆయా రాగాలకూ, ఆయా భావాలకూ, అలాగే ఆయా సంగీత పరికరాలకూ ఆయా జాతులకూ రక్తసంబంధం వంటి అనుబంధం ఉండటం జెనెటిక్ శాస్త్రం ప్రకారం కూడా ఆమోద యోగ్యం.

మరోపాట గమనించండి.
'కులదైవం' కోసం ఘంటసాల పాడిన పాట ఇది.

"పయనించే ఓ చిలుకా! ఎగిరిపో! పాడేపోయేను గూడు”. ఇందులో గీత రచయిత ఎంత ఆధ్యాత్మిక భావనని నింపాడో, గాయకుడు అంతగా వైరాగ్యభావనని, ఆధ్యాత్మిక చింతనని శ్రోతలో అణువణువునా ఆవహింప చేసాడు.

"మరవాలి నీ కులుకుల నడలి! మదిలో నయగారాలే”
"పుల్ల పుడకా ముక్కున కరచి గూడును కట్టితివోయి”
“ఎన్నడో తిరిగి ఇటు నీ రాక! ఎవరే తెలిసిన వారు”
“ఏరులయే కన్నీరులతో మనసారా దీవించేరే!”

అంటూ శరీరాన్ని గూడుగానూ, ఆత్మని చిలక గానూ వర్ణిస్తూ, మరణాన్ని ఉపమానిస్తూ ఉన్నపాట! విన్నవారికి మరణం సహజమైనదనీ, అనివార్యమైనదనీ గుర్తు చేస్తుంది. ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోనే స్ఫూర్తిని రగిలిస్తుంది. “జాతస్వహి ధృవో మృత్యు:” అన్న గీతా శ్లోకం అప్రయత్నంగా గుర్తుకొస్తుంది. శ్లోకం రానివాళ్ళకి భావమైనా గుర్తొచ్చి తీరుతుంది.

మరోపాట పరిశీలించండి.
"కళ్ళు తెరవరా నరుడా! నిజము తెలియరా నరుడా!
కాలికి రాయి తగులుట కల్ల, కాలే రాయికి తగిలెనురా
కళ్ళు తెరవరా నరుడా”

చాలా మామూలుగా మనం ’ఎదురు రాయి తగిలి కాలికి గాయమైంది’ అంటాం. కానీ చాలా సందర్భాల్లో రాయి దొర్లుకు వచ్చి మన కాలికి తగలదు. నడుస్తూ మనమే చూసుకోకుండా, కాలితో రాయిని తన్ని గాయం చేసుకుంటాం. నింద ఎదుటి వారిపై/ఎదుటి వస్తువుపై తోసే గుణం ఇక్కడ అప్రయత్నంగా కనబడుతుంది. దాన్నే పై పాట ఎత్తి చూపిస్తుంది.

అలాగే 1980 నుండి 1990 ల లోపు వచ్చిన మరికొన్ని పాటలు చూడండి.
"పండయితే పనికి రాదు ఆవకాయకు,
పంటి కింద కరకర లాడేందుకు”

ఈ ’కరకర’ అనేటప్పుడు గాయకుడు ’కర్రకర్ర’ అంటూ ఒత్తిపలుకుతూ పాడతాడు. అదేమి సాహిత్యమో, సంగీతమో, ఆ పాటకీ, దానికి నర్తించిన హీరో హీరోయిన్ల [Sr.ఎన్టీఆర్, శ్రీదేవిల] స్టెప్టులకి ఏమిటి సంబంధమో సదరు సినిమా సృష్టికర్తలకే తెలియాలి.

ఇక ‘ఆరేసు కోబోయి పారేసుకున్న కోక పాటలు సరే సరి’.
ఇటీవల ’ఇప్పటి కింకా నా వయస్సు నిండా పదహారే.
చీటికి మాటికి చెయ్యెస్తూ చుట్టూ కుర్రాళ్ళే!’

అంటూ పబ్ లో, శరీరం మీద అరగొరగా దుస్తులు వేసుకున్న ఓ భారీ దేహం గల నృత్యకళాకారిణి[!?] డాన్సుకి పాట వ్రాసిన రచయిత [!?], సదరు పాట వెనుక గల కథని చెబుతూ వ్రాసిన వ్యాసాన్ని ప్రచురిస్తూ, మీడియా, అది గొప్ప సాహిత్యమన్న కితాబు లిచ్చేసింది. నవ్వాలో ఏడవాలో తెలీని స్థితి! తెలుగు సాహిత్యం చివరికి ఈ దశకొచ్చిందనుకోవాలి కాబోలు! ఇక ఇలాంటి పాటల నృత్య చిత్రీకరణల్లో, అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఎగజిమ్మే లావా స్థాయిలో ’అశ్లీలత’ ఎగజిమ్ముతుంది.

ఎంతగా ప్రజలకి వినోదం అవసరం అనుకున్నా, పూర్తిగా వివేకాన్ని నాశనం చేసే వినోదం అనర్ధదాయకం కాదా? జ్ఞానం సంగతి దేవుడెరుగు, ఇంగితాన్ని కూడా నాశనం చేస్తున్న అశ్లీల వినోదం అవసరమా?

కానీ సినిమారంగం మాత్రం పటిష్టంగా, ప్రణాళికా బద్దంగా, ఇంకా చెప్పాలంటే వ్యవస్థీకృతంగా ప్రజల తార్కికజ్ఞానాన్ని నాశనం చేస్తోంది. ఇతర కళలని రూపుమాపి, సినిమా రంగంలో కళాత్మకతని, నైతికతని మంటగలిపి, ఈ పనిని నిర్విఘ్నంగా కొనసాగించింది. ఇక పూర్తిగా పట్టు సాధించాక, ఈ సినిమారంగంలోని గాడ్ ఫాదర్ లు ఆయా పాత్రల గొప్పదనాన్ని, ధైర్యసాహసాలు, త్యాగనిరతి, హుందాతనం గట్రా నాయక లక్షణాన్ని, ఆయా పాత్రధారులకి ఆపాదించారు. పరమ స్వార్ధపరుణ్ణి అయినా వీరు త్యాగధనుడిగా చూపించగలిగారు. పరమ పిరికివాణ్ణి సాహసోపేతుడిగా స్టాంపు వేయగలిగారు. బుర్రలో సరుకు లేని సాదాసీదా అనుచరుణ్ణి పరమ మేధావిగా అందరిచేత పొగిడించగలిగారు.

ఇక తదుపరి, ఈ బొమ్మల్ని సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి తీసుకుపోయి, తమ గూఢచర్య నెట్ వర్క్ బలంతో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు గానూ, దేశాలకి అధ్యక్షులుగానూ చేయగలిగారు. ఆ విధంగా తమ ఏజంట్లని కీలక స్థానాల్లో కూర్చోబెడితే పకడ్బందీగా దోపిడి నిర్వహించవచ్చు, సులభతరంగా తమ వాటా తాము పొందనూవచ్చు.

ఇక ఈ చెత్తకు అనుగుణంగా మరో చెత్త ఉంది. అది అభిమాన సంఘాల రాజకీయం. సమాజంలో రాజకీయ వైషమ్యాలతోనూ, కులమత వైషమ్యాలతోనూ పోటీపడుతూ, ఈ నటీనటుల అభిమాన సంఘాల వైషమ్యాలుంటాయి. శక్తివంచన లేకుండా భావకాలుష్యాన్ని దశదిశలా వెదజల్లుతూ ఉంటాయి. ఇంకా ఈ స్థితి 1992 కు ముందరైతే మరింత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కొంచెం మోతాదు తగ్గటమే గాక, అభిమాన సంఘాలు రక్తదానాది ప్రజాహిత కార్యక్రమాలు, భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు సహాయక చర్యలూ చేపడుతున్నాయి. కొంతమంది సినీనటులు సుదూర తీర సమీప భవిష్యత్తులో తమ రాజకీయ రంగప్రదేశం కొరకు తమ అభిమాన సంఘాలను ఇందుకు పురికొల్పినా, మరికొన్ని సంఘాలు స్వచ్ఛందంగానే ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొనటం ముదావహమే! కారణం ఏదైనా, ఈపాటి ప్రజాహితం జరగటం సంతోషించదగిన పరిణామమే.

ఏమైనా ఇప్పుడు భారతదేశంలోని చాలా భాషా సినిమారంగాల్లో నటులూ, సూపర్, మెగాస్టార్ లు రాజకీయ ప్రవేశం చెయ్యాలన్న ఊగిసలాటలో ఉన్నారు. కొందరు దూకి ఈదుతున్నారు, కొందరు మునగలేక తేలలేక అవస్థలు పడుతున్నారు. సినీరంగ గాడ్ ఫాదర్ లైన నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ, వారి నెం.10 వర్గానికీ ఎదురుదెబ్బలు తగలటం కూడా ఇందుకు ఒక కారణం, బలమైన కారణం.

ఇటీవలి కాలంలో, అంటే దాదాపు 17 ఏళ్ళుగా, కొన్ని తార్కిక కథాబలంగల చిత్రాలు, దేశభక్తి, నైతికత ప్రబోధించే చిత్రాలు తెరమీదకి వస్తున్నాయి. దాదాపు సినిమారంగపు అన్ని విభాగాలలో మోనోపలి కుప్పకూలింది. ప్రతిభ, నైపుణ్యాల గల వ్యక్తులు, కళాకారులు కనబడుతున్నారు. కమేడియన్ల దగ్గర నుండి, క్యారెక్టర్ నటుల దాకా, గాయకుల దగ్గర నుండి దర్శకుల దాకా…. అంతటా, అన్ని విభాగాల్లో చాలామందే ఉపాధి పొందుతున్నారు. కేవలం ఒక్కరే వెలిగిపోవటం తగ్గింది. వ్యవస్థీకృతమైన ’అదృశ్య పట్టు’, గాడ్ ఫాదర్ లు బిగింపూ, దాదాపు సడలిపోయింది.

గతంలో అయితే సినిమా పంపిణీ వ్యవస్థ ఉండేది. ఆ మాయాజాలం ఎంతటి దంటే – ఒక విజయవంతమైన మంచి సినిమా, బాగా ఆడి డబ్బులు సంపాదించినా, సదరు నిర్మాతకి మాత్రం నష్టాలు మిగిలేవి, కాసుల పంట పంపిణీదారులకి పండేది. [ఉదాహరణకి అంజలీ దేవి నిర్మించిన భక్తతుకారాం సినిమా సూపర్ హిట్ అయినా, నిర్మాతగా అంజలీ దేవికి మాత్రం లాభాలు రాలేదు.] ఒకోసారి పరమచెత్త అశ్లీల సినిమా తీసిన నిర్మాత, అతడి సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడినా, అతడి నష్టాలు మాత్రం పంపిణీదారులకు కూడా పంచబడి సదరు నిర్మాత, తృటిలో ఆర్ధిక ప్రమాదాన్ని తప్పించుకోగలిగే వాడు.

కానీ ఇప్పుడా పరిస్థితి బాగానే మారింది. నాణ్యమైన, మానవీయ విలువలు గల కథలు, తార్కికమైన కథలు, వస్తున్నాయి. కళాత్మక విలువలు, నైతిక విలువలతో ’ప్రజంటేషన్’ ఉంటున్నాయి. సమాజపరంగా దొంగలు హీరోలుగా ఉన్న కథలూ వస్తుండవచ్చు గాక! అయినా గానీ దేశభక్తి కూడా కొంత సినిమా జనాలకి గుర్తుకు వచ్చింది.

మీరు గమనించి చూడండి. 1992 తర్వాత ఒక ’ఎరా’లో, ప్రతీ సినిమాలో కనీసం ఒక జెండాపాట లేదా సీను ఉండటం సక్సెస్ ఫార్ములాగా గుర్తింపబడింది. ప్రభాస్ [రాఘవేంద్ర], మహేష్ బాబు [బాబీ], పవన కళ్యాణ్ [ఖుషి] సినిమాలు గట్రా గట్రాలన్న మాట! ఖడ్గం వంటి పాక్ పన్నాగాలు చూపిన సినిమాలు, లగాన్ లు, రంగ్ దే బసంతులు కూడా తర్వాతవే. అసలు ఏ హీరీ అయినా 1992 కు ముందర ఒక సంవత్సరం, 1 ½ సంవత్సరంల కాలయాపనతో ఒకో సినిమాని నిర్మించి, విడుదల చేయబడటాన్ని ఊహించగలిగారా? అప్పట్లో వాసి లేని రాసితో కుప్పల కొద్దీ సినిమాలు జనాల నెత్తిమీద గుమ్మరించిబడేవి.

అదే ఇప్పుడో? పేరున్న ప్రతీ కథానాయకుడూ చచ్చినట్లుగా మంచి కథ, కథనం, కళాత్మక, సాంకేతిక విలువలు గల సినిమా కోసం, వీలైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. లేకుంటే ఏముంది? ప్లాప్ రిస్కు ఎదురుగా కూర్చొంటుంది. ఎందుకంటే క్రికెట్ లోని మ్యాచ్ ఫిక్సింగుల్లాగా సినిమా సక్సెస్ లు స్టాంపు వేసే అవకాశాలు చాలా వరకూ మాసిపోయాయి గనుక. గూఢచార యుద్ధం, మెదళ్ళతో యుద్ధంలోని పరిణామ క్రమం ఇది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇక తమకి దాసోహం అనే కళాకారుల [దర్శకులు, నటీనటుల, నృత్యదర్శక గాయకులూ గట్రాగట్రా] కు మీడియా ఎంతగా ఇమేజ్ ఇస్తుందో అందరికీ తెలిసిన విషయమే. మామూలుగా చూస్తే దడుచుకునే సుందరీ సుందరులని, కెమెరా మేకప్ మాన్ ల నైపుణ్యంతో, మహాసౌందర్యవంతులుగా చూపుతారు. అంతగా నటనా సామర్ధ్యం లేని ఓ నటి లేదా నటుడు, కోపాన్ని చూపెట్టాల్సి వుందనుకోండి. సీన్ అంతగా పండదు. అప్పుడు దర్శకుడేం చేస్తాడంటే – సదరు నటి లేదా నటుడి ముఖాన్ని, క్లోజప్ లో ఓవైపు నుండి మరో వైపుకి తిప్పడాన్ని, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నేపధ్యంలో, కెమెరాతో, మళ్ళీమళ్ళీ షూట్ చేస్తాడు. లేదా పలుకోణాల్లో ఆ ముఖాన్ని Focus చేస్తాడు. క్రికెట్ ఆటలో బంతి క్యాచ్ పట్టుకోబడి ఆటగాడు అవుటయి నప్పుడు, ఆ బంతి క్యాచ్ పట్టుబడటం లేదా స్టంప్ కి తగలటం, స్లోమోషన్ లో, పలుకోణాలలో, వివిధ కెమెరాలలో చిత్రీకరిస్తూ, ప్రత్యక్ష ప్రసారాలలో చూపిస్తుంటారు చూడండి, అలాగన్న మాట!

ఇంత హంగూ ఆర్భాటమూ చేశాక, ప్రేక్షకుడు ఆయా నటీనటులు కోపాన్ని అభినయించారనే అనుకుంటారు. వాళ్ళకి కోపం వచ్చింది అన్న విషయం, ఆయా నటీనటుల అభినయం చెప్పకపోయినా, సంగీత పరికరాల విన్యాసాలతోనూ, కెమెరా పనిమంతులు, దర్శకుడు చెప్పారు కదా! నకిలీ కణికుడి కుట్రలో ఎన్టీఆర్ తోడ్పాటు గురించి వ్రాసిన టపాలో ఈ విషయమై మరింత విపులంగా వ్రాసాను.

మరో ఉదాహరణ పరిశీలించాలంటే – సినీ నటుడు చిరంజీవి! పిల్లనిచ్చిన మామ, అల్లు రామలింగయ్య లాబీయింగ్ తోడయ్యాక, అప్పటివరకూ అలా అలా కొనసాగుతున్న చిరంజీవి కెరీర్ మంచి ఊపందుకుంది. తదనంతర పరిణామాల్లో అగ్రస్థాయికి చేరి మెగాస్టార్ అయిపోయాడు.

తోడికోడళ్ళు సినిమా కోసం ఆత్రేయ ఓపాట వ్రాసాడు. ఘంటసాల పాడగా అక్కినేని నాగేశ్వరరావు నటించాడు. అందులో “కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడీదానా! నీదు బుగ్గల గులాబీరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలెందరో మండుఎండలో మాడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో ” అంటారు.

ఈ స్థితిని మరోరకంగా చెప్పాలంటే ’ఏ చెట్టూ లేనిచోట ఆముదపు చెట్టు మహావృక్షమౌతుందనీ’ అంటారు. చిరంజీవి విషయంలో, సినీ గాడ్ ఫాదర్ల ముసుగు వేసుకున్న నకిలీ కణిక వ్యవస్థా, అందులోని కీలకవ్యక్తి రామోజీరావు అనుసరించింది ఇటువంటి స్ట్రాటజీనే. ఆనాటి సినిమాలు ఓసారి గుర్తు తెచ్చుకుంటే – అప్పటి మాస్ ని ఉర్రూతలూగించగల పాటల ట్యూన్లు, కథలు, డాన్స్ స్టెప్పులు కేవలం చిరంజీవికి మాత్రమే సమకూర్చబడేవి. మరింకే నటులకీ అటువంటి డాన్స్ స్టెప్పులు డాన్స్ డైరెక్టర్లు గానీ, చిత్రదర్శకులు గానీ ఇచ్చేవారు కాదు. దాంతో మెగాస్టార్ డాన్స్ సూపర్ డాన్స్ అనిపించుకుంది.


1992 తర్వాత, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా తెరవెనుక నుండి తెరమీదకి వచ్చి, జంటిల్ మెన్, కాదలన్ [తెలుగులో ప్రేమికుడు చిత్రం] విడుదల కావటంతో, ఈ విషయం స్పష్టంగా బహిర్గత మయ్యింది. అదే 1992 కు ముందు నాకు గుర్తుండి ’హృదయం’సినిమాలో ప్రభుదేవా పాట [ఏప్రిల్,మే లలో పాపలు లేరురా, బోర్! బోర్!రా!] లో నటించాడు. ఆ పాటలో పెద్ద స్టెప్పులు లేవు. అంతా సైకిల్ మీద తిరుగుతూ నటించాడు. అదే 1992 తర్వాత ఒక పాటలో నటించిన సినిమా ’జంటిల్ మెన్.’ ఈ పాటలో డాన్స్ స్టెప్పులతో పేరు బాగా సంపాదించాడు.

ఆ తర్వాత, క్రమంగా సినీరంగంలో చిరంజీవి ప్రభ తగ్గింది. ఏ సినిమా అయినా హిట్ అన్పించుకోవడానికి నానా ఫీట్లూ చెయ్యాల్సివచ్చింది. 1992 తర్వాతే ఇతర నటులకి కూడా మంచి సంగీతం, డాన్స్ స్టెప్పులూ అందుబాటులోకి వచ్చాయి. ఆ కోణంలో క్రమంగా మోనోపలి బద్దలయ్యింది. నిజానికి ఈ ‘ఆముదపు చెట్టు స్ట్రాటజీ’లో నకిలీ కణిక వ్యవస్థకి ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సినీరంగంలో కళాత్మకతని నాసిగా ఉంచటం. దాంతో ప్రజలలోని ఉత్సాహ చైతన్యాలని హరించవచ్చు. కణికనీతి లో ఇది తొలి వాక్యం. రెండో ప్రయోజనం మోనోపలిలో డబ్బు దండుకోవటం. ప్రత్యామ్నాయం లేనప్పుడు ప్రజలు అవే చూడకా, డబ్బు చెల్లించకా ఛస్తారా?

మరో విషయం ఏమిటంటే – చిరంజీవికి, కొంతమంది హీరోలకి, కెమెరా మెన్ ల సాయంతో ఇచ్చే ఇమేజ్! స్లోమోషన్ లో నడకలు, రిపీటెడ్ షాట్ లూ, క్లోజప్ లూ, ఫైటింగ్ షాట్లతో సూపర్ ఇమేజ్ ఇచ్చేవాళ్ళు. 1992 తర్వాత, ప్రతీ హిట్ సినిమాకి, మరో సినిమాలో కామెడీ ట్రాక్ గా పేరడీలు రావటం, ఆయా హీరోలకి ఇచ్చిన స్లోమోషన్, క్లోజప్ లూ, ఫైటింగ్ షాట్సు, పంచ్ డైలాగులూ కమీడియన్లు చేయటం జరిగింది. దాంతో హీరోల ఆరాధన దెబ్బతింది. ఉదాహరణ కావాలంటే, తమిళ అనువాద సూపర్ హిట్, కార్తీక్, ప్రభుల సినిమా ‘ఘర్షణ’ని సుధాకర్, బాబూమోహన్ లతో మరో సినిమాలో కామెడీ ట్రాక్ తీసారు. వేణు మాధవ్ వంటి కమేడియన్లు, విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’, రజనీకాంత్ ‘చంద్రముఖి’ల వంటి కామెడీ ట్రాక్ లు చేసారు. సునిల్,ధర్మవరపు సుబ్రమణ్యం వంటి కమేడియన్లు కూడా ఇటువంటివి చాలానే చేశారు.

దానదీనా, హీరో వర్షిప్ అన్నది ప్రజల దృష్టిలో పల్చబడింది. హాస్యరసం కారణంగా, నవ్వుతూ అయినా, తర్వాత ‘హీరో చేసింది కమేడియన్లు చేశారు. కెమెరా మెన్, మ్యూజిక్ కలిస్తే గొప్పగా హీరోయిజం అన్పించింది. కమేడియన్ చేస్తే నవ్వొచ్చింది. అంతే!’ అనుకునే స్థితికి, ప్రేక్షకులు వచ్చారు. ఇంత స్ట్రాటజీ నడుస్తుంది ప్రతీ అంశంలోనూ. అంతే కాదు, ఒకప్పుడు హీరో అంటే ఇలాగే ఉంటాడు అనే హీరో ఫీచర్స్ ఉండేవి. అదే ఇప్పుడయితే, పబ్లిక్ లో ఉండే రకరకాల వ్యక్తుల ముఖకవళికలు గల వారిని తీసుకుని, వారినే హీరోలుగా, హీరోయిన్లుగా నటింపజేస్తున్నారు. ప్రతీ ఒక్క సినిమా హీరోకి, హీరోయిన్ కి కనీసం ఒక హిట్ అయిన ఉంటున్నది. దాంతో ఆ ముఖకవళికలు గల వారు, తామని తాము ఆ హీరోలా ఉన్నామనుకుంటూ, తనకు తానూ హీరోగా ఊహించుకుంటున్నాడు. ఆ విధంగా కూడా సూపర్ హీరో ఇమేజ్ అన్న దానిని బద్ధలుకొట్టారు.

ఇక రచయితలకూ, దర్శకులకూ ఘోస్ట్ లు ఉండటం కద్దు. తమకి దాసోహం అన్న వారికి, మీడియా ఎటూ ఇమేజ్ ఇస్తుందయ్యె! విజయాల్ని కూడా కట్టబెడుతుందయ్యె! అందుకోసం మరికొన్ని స్ట్రాటజీలు కూడా నకిలీ కణిక వ్యవస్థ అమలు జరిపింది. తమకు అనుకూలురైన నటీనటులకి, ఇతర కళాకారులకి ఇమేజ్ ఇచ్చేటందుకు, ఇతరుల చేత పొగిడించటం ఓ పద్దతి. ఆయా నటీనటులు ఏ సినిమాలో చేసినా, ప్రక్కపాత్రల ద్వారా సహనటీనటులు, సదరు నటీనటుల పాత్రల్ని పొగిడేవారు, వాళ్ళనీ పొగిడేవారు. పదే పదే అదే ప్రచారం. క్రమంగా ఓ ఆరాధన, బలమైన ప్రభావం ముద్రలేసేస్తారు.

ఓ ఉదాహరణ చూడండి. ’అల్లుడొచ్చాడు’ అంటూ ఓ గొప్ప సినిమా వచ్చింది. నలుపు తెలుపు సినిమా. రామకృష్ణ, రాజబాబు హీరోలు, జయసుధ, ప్రభ హీరోయిన్లు. జయసుధ కెరియర్ ప్రారంభచిత్రాల్లో ఇదీ ఒకటి. అందులో హీరో గాయకుడు. తెరవెనుక గాయకుడు ఎస్.పి.బాల సుబ్రమణ్యం. హీరో, ఆకాశ వాణిలో “లేత కొబ్బరి నీళ్ళల్లే, పూత మామిడి పిందెల్లే, చెప్పకుండా వస్తుంది చిలిపి వయస్సు. నిప్పుమీద నీళ్ళవుతుంది లేతమనస్సు. మనస్సు…..” అంటూ ఓ పాట పాడతాడు. ఆ పాటని, ఆబాలగోపాలమూ, పండిత పామరజనమూ, ఊరూరా ఉర్రూతలూగుతూ వింటున్నారని చూపెట్టడానికి దర్శకుడు నానాఫీట్లు చేసాడు. ఆ ఎరా[era]లో, సినిమా గురించి ప్రచార ప్రస్తావనల్లో, “ సినిమాలోనే కాదు, నిజంగా కూడా ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాటలకు ప్రజాస్పందన అలాగే ఉంది” అంటూ చిత్రసీమలో పేరెన్నిక గన్న వారందరూ, పదేపదే చెప్పి మరీ పొగిడారు. తదుపరి రోజుల్లో బాలసుబ్రమణ్యాన్ని సక్సెస్ చేయటానికే అటువంటి చిత్రాలు నిర్మించబడటమే ఇక్కడి అసలు స్ట్రాటజీ!

ఆ విధంగా ప్రత్యక్ష ప్రచారం ఒక్కటే గాకుండా, ఇలాంటి పరోక్ష ప్రచార స్ట్రాటజీలతో కూడా, తమకు అనుకూలురైన వ్యక్తుల్ని, నకిలీ కణిక వ్యవస్థ, గాడ్ ఫాదర్ ల ముసుగులో పైకి తెచ్చుకుంది. ఈ విధమైన రకరకాల స్ట్రాటజీలతో ఆయా విభాగాల్లో, రంగాల్లో మోనోపలి సృష్టించుకోవటంలో నకిలీ కణిక వ్యవస్థకి, అందులోని కీలక వ్యక్తులకి రెండు సౌలభ్యాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి డబ్బు. రెండోది ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటం. నిజానికి ఇదే వారి ప్రధాన లక్ష్యం కూడాను.

ఓ సామెత ఉంది. ’కుక్కని చంపాలను కుంటే, ముందు దాన్ని పిచ్చికుక్కగా ముద్రవెయ్యి’ అని! అప్పుడు దాన్ని సులభంగా చంపొచ్చు. సరిగ్గా ఇదే తంత్రం ’ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటం’ అన్న స్ట్రాటజీ వెనుక ఉంది. అందుకోసమే, చాలా పకడ్బందీగా, పద్దతి ప్రకారం, వ్యూహాత్మకంగా, ప్రజాదృక్పధాన్ని – సినిమాలు, మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రభావపరచటం జరుగుతోంది. ఇది గూఢచర్యంతో కూడిన కుట్ర. తార్కిక జ్ఞానాన్ని, తార్కిక ఆలోచనా సరళిని, పౌరుషపూరితమైన భావోద్వేగాల్ని, సాహసోపేత వ్యవహార సరళిని, సృజానాత్మకతనీ, ఇతర నైపుణ్యాలని నాశనం చేయటం ద్వారా, ఓ జాతిని, ఓ దేశాన్ని చాలా సులభంగా నాశనం చేయవచ్చు.

ఎందుకంటే దేశమంటే మట్టికాదు, మనుష్యులు కదా! కళ్ళెదుట – పనికి మాలిన వారు కాకాలు కొట్టటం, ప్రక్కదారులు తొక్కటం వంటి పనులతో, ప్రముఖ కళాకారులుగా, వ్యక్తులుగా వెలుగొందుతున్నప్పుడు, నిజంగా సత్తా ఉన్న కళాకారులకు, వ్యక్తులకీ ఏమనిపిస్తుంది? సమాజంలో నెగిటివ్ ధోరణిలే పెరిగిపోతాయి. ఈ స్థితి రాకూడదనే హెచ్చరిక, విదురనీతి, నారదనీతి, వ్యాస నీతి చెబుతాయి. ఈ సందర్భంలో విదురుడూ, వ్యాసుడూ మహారాజు అయిన ధృతరాష్ట్రునితో సంభాషణ, మహాభారతంలో చెప్పిన విషయాలు, మరోసారి గుర్తుచేసుకోవచ్చు.

వ్యాసమహర్షి ఓసారి ధృతరాష్ట్రుని సభకి వచ్చిన సందర్భంలోనిది ఈ చర్చ. అప్పుడు వ్యాసమహర్షి, ధృతరాష్ట్రుని కుశలం అడుగుతూ మహారాజుని “నీ దేశంలో, ఉద్యోగులు తమ అర్హతలకి తగిన పదవుల్లో నియమితులౌతున్నారా లేదా?” అని అడుగుతాడు. “కవులూ, పండితులూ, ఇతర కళాకారులూ వారివారి ప్రతిభ సామర్ధ్యాలకు తగిన విధంగా ఆదాయాల్ని, రాజాదరణనీ, కీర్తి ప్రతిష్టల్నీ పొందుతున్నారా, లేదా?” అని ప్రశ్నిస్తారు. ఒక వేళ అసమర్ధులు గనుక ఉన్నతస్థానాల్లోనూ, సమర్ధలు నిమ్నస్థానాల్లోనో ప్రయోగింపబడితే మనోవికారాలు, చెడు భావనలు, మానసిక అనారోగ్య ధోరణులు సమాజంలో విస్తరిస్తాయని హెచ్చరిస్తారు.

అలాంటి పెడధోరణులు సమాజానికి కీడు చేస్తాయనీ, ప్రజలలోనూ అసంతృప్తి పెరిగిపోతుందనీ చెబుతారు. సమర్ధులూ, ప్రతిభావంతులూ గనక, వారికి తగిన స్థానాల్లో ప్రయోగింపబడకపోతే, వారికి తగిన ఆదాయాన్ని, కీర్తి ప్రతిష్టుల్ని పొందకపోతే సమాజంలో అలజడులు రేగుతాయంటారు. అసమర్ధుడు, నైపుణ్యం లేని వాడు పైస్థానాల్లో ఉంటే, అలాంటివాళ్ళు తమ క్రింది వారిపై, అనవసరపు అజమాయిషీని చూపిస్తూ, తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ, తమ అపరిణితిని చాటుకుంటారనీ, అలాగే సమర్ధులూ, ప్రతిభసంపన్నులూ, వారికి తగని తక్కువ స్థానాల్లో నియోగింపబడితే, వారిలోని తేజస్సు, స్ఫూర్తి నాశనమౌతాయనీ, దాంతో అసంతృప్తి, ఆత్మన్యూనత భావాలు చెలరేగి, ఆయా మనోవికారాల కారణంగా, సమాజంలో కొన్ని వైషమ్యాలు పుట్టుకొస్తాయనీ, ఒక ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితులు నెలకొంటాయనీ, సమాజంలో ప్రజా ఐక్యత దెబ్బతింటూందనీ చెబుతారు.

కాబట్టి, రాజైన వాడు, ఈ విషయాల్లో సర్వశ్రద్ధలూ పాటించాలని హెచ్చరిస్తారు. అదే ఇప్పుడైతే, ప్రభుత్వాలు మహాభారతంలో చెప్పబడిన ఈ విదుర, వ్యాస బోధనలకు సరిగ్గా విపర్యయాన్ని అమలు చేస్తున్నారు. ఏ పేరుతో ప్రకటించనీయండి, అసలు చడీచప్పుడూ కాకుండా అమలు పరచనీయండి, చేస్తోన్నది మాత్రం, ఈ విదుర, వ్యాస, నారద నీతులకు 100% విపర్యయాన్ని అమలుచేయటమే. లంచగొండితనం, బంధుప్రీతి, కులమత ప్రాతిపదికన రిజర్వేషన్లు, గాడ్ ఫాదర్ల అండదండలూ, లేదా వాళ్ళ నెట్ వర్కు, ఏ పేరైతేనేం [Over leaf reasons అంతే] ప్రతీరంగంలోనూ, ప్రతీ అంశంలోనూ ఇదే స్థితి!

ఇంతటి కుట్ర జరుగుతున్నా, నేటి ప్రభుత్వాల్లో కనీసం అలాంటి గుర్తింపు సైతం ఉండదు. ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వాలు నకిలీ కణిక వ్యవస్థకి అనుచరగణంలోనివి కాబట్టి! ఒకప్పటి ప్రభుత్వాలు ఆ పోరాటంలోనే అల్లాడి, అలిసిపోయాయి. మీడియా బలంతో ఇందిరాగాంధీ వంటి నాయకత్వాల్ని, ప్రభుత్వాలని, నకిలీ కణిక వ్యవస్థ నానా అగచాట్లు పెట్టింది. చెబితే అర్ధం చేసుకునే ప్రతిభ, ప్రజల్లో లేకుండా చేసెందుకే ’ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటం’ అన్న స్ట్రాటజీ నడుస్తుందయ్యె! ఇప్పటికైనా, ప్రజలు ఈపాటి స్ట్రాటజీలని తెలుసుకోగలుగుతున్నారు, అర్ధం చేసుకోగలుగుతున్నారు, అంటే – ‘మీడియా విశ్వసనీయత పోవటం’ వంటి పరిణామాలే కారణం. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గపు, ఓటమి బాటలోని పరిణామాల్లో ఇదీ ఒకటి.

ఇక ఈ కుట్రమీద నుండి అందరి దృష్టీ మళ్ళించడానికి, సినిమా రంగంలో కొన్ని ద్వంద్వాలు సృష్టించబడ్డాయి. నిజానికి ఇలాంటి ద్వంద్వాలు కేవలం పైకారణాలు [Over leaf reasons] మాత్రమే. అంతేకాదు, దాదాపు అన్నీరంగాల్లోనూ, తదనుగుణమైన ద్వంద్వాలని సృష్టించి, కుట్ర జరుగుతోందన్న పరిశీలన కూడా చేయలేనంతగా ప్రజలదృష్టిని హైజాక్ చేసి, దేశంపట్ల నిబద్దత గల నాటి ప్రభుత్వాలని ఏకాకిగానూ, నిస్సహాయంగానూ చేయగలిగింది నకిలీ కణిక వ్యవస్థ.

ఇక సినిమారంగంలోని ద్వంద్వం ఏమిటంటే – ’తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం, చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం’ అన్నది. మీడియా ఉద్ఘాటన ప్రకారం – ప్రజలు, “సినీనిర్మాతలు అశ్లీల లేదా చెత్త సినిమాలు తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం” అన్నారట. [అలా అంటున్నారని అప్పట్లో అంటే దాదాపు 1975 నుండి 1992 దాకా తెగ ఊదర పెట్టింది మీడియా] అలాగే నిర్మాతలూ దర్శకులూ, “ప్రజలు చూస్తున్నారు కాబట్టి అలాంటి సినిమాలు తీస్తున్నా” మన్నారు.

నిజానికి, ఇదమిద్దంగా ఏ నిర్మాత దర్శకులూ అలా అన్నారో తెలియదు. ప్రజల్లో ఎవరన్నారో నిశ్చయంగా తెలీదు. ప్రజల తరుపునా, నిర్మాతాదర్శకుల తరుపునా మీడియానే స్వయం వకాల్తా పుచ్చుకుని అనేసింది. ఖచ్చితంగా చెప్పాలంటే ’అలా అంటున్నారు మీరు’ అంటూ ముద్ర [స్టాంపు] వేసింది.

ఇక సినిమా రంగంలో మరో యదార్ధం ఏమిటంటే – కథ, కథనం, కథను ప్రేక్షకులకు చూపించే విధానం [Presentation], స్ర్కీన్ ప్లే, వంటి ప్రతీ అంశం – 1975 నుండి 1992 వరకూ, ఖచ్చితంగా చెప్పాలంటే 1980 నుండి 1992 వరకూ, దాదాపు రెండే అంశాల మీద ఉండేవి. ఒకటి పగ ప్రతీకారం. హీరో చిన్నప్పుడు ఓ విలన్ హీరో కుటుంబాన్ని నాశనం చేస్తాడు. తల్లిదండ్రుల్ని చంపేయటం గట్రాలన్నమాట. హీరో పెద్దయ్యాక పగతీర్చుకుంటాడు. [ఇక్కడ మరో గమ్మత్తుంది. ఇలాంటి సినిమాలలో ఎక్కువగా, మంచివాడైన ఒక ముస్లిం పాత్ర ఉంటుంది. జంజీర్, తెలుగులో నిప్పులాంటి మనిషిలో ‘స్నేహమేరా జీవితం’ అని పాడే సత్యనారాయణ పాత్రలాంటివి అన్నమాట.] ఇదేమూస కథతో దాదాపు దశాబ్ధం గడిచింది.

దీనికి ముందో వెనుకో, మరో దశాబ్ధం, ప్రేమ సాగుడు కథలతో నడిచింది. ఇద్దరు హీరోయిన్లు, ఓ హీరో ముక్కోణపు ప్రేమకథ. చివర్లో ఓ హీరోయిన్ త్యాగం చేసి తేగల కట్ట అయిపోతుంది. వాకిట్లోకి, ఆ తర్వాత చీకట్లోకి కలిసిపోతుంది. లేదా తన ప్రియుడికి మరో హీరోయిన్ తో పెళ్ళి జరిపించి శ్రీవారి ముచ్చట్లు చెప్పించుకుంటూ ’మానసిక తృప్తి’ పొందుతుంది. ఈ సోది కథలతో ఓ దశాబ్దం నడిచింది. ఎంతో చౌకబారు హాస్యం, నస సంభాషణలు, వైవిధ్యంలేని కథ, నీరస నిస్సత్తువల్ని నింపే సంగీతం! ఈ పరిణామానికి ముందు, మెలోడ్రామాతో ఉమ్మడి కుటుంబపు కథలు, మానవసంబంధాల మీద సాగుడు ప్రక్రియతో సెంటిమెంటల్ హేమరింగ్ అన్న పేరు పెట్టబడి ప్రేక్షకుల్ని చిత్రవిచిత్రపు బాధలకి గురిచేసిన సినిమాలు ఉన్నాయి. అక్కినేని నాగేశ్వర రావు, జగ్గయ్యలతో ‘ఏదో బాబు’ సినిమా, కన్నాంబ, సావిత్రి, ఎన్టీఆర్ లతో ‘ఆత్మబంధం’ వంటి సినిమాలు ఈ కోవలోవే.

కొన్ని సినిమాలలో సోదిని పాటలతో కప్పి పుచ్చినా, మెల్లిగా ‘మెలోడ్రామా, కుటుంబ కథాచిత్రాలు, సెంటిమెంట్ అంటే ప్రజలకి వెగటు పుడుతుంది’ అన్న వాదనకి బలం చేకూర్చేలాగా సినిమాలు వచ్చాయి. పై వాదన బలపడ్డాక, ఎంచక్కా నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ, తమ కుట్ర అమలుకు మార్గం మరింత సుగమం అయ్యింది. సినిమాకథల మూసతనం ఒకో దశాబ్ధంలో ఒకో విధంగా ఉండటం [వెరసి 10 ఏళ్ళపాటు ఒకేరకమైన కథలతో సినిమాలు రావటం] గురించి ప్రముఖరచయిత, క్యారెక్టర్ నటుడూ తనికెళ్ళ భరణి చాలాచక్కని వ్యాసం వ్రాసాడు కూడా!

ఇక కథ ఏవిధంగా అయినా ఉండనీయండి, అందులో తప్పనిసరిగా ఉండే మిర్చిమసాలా మరికొంత ఉంది. అది నటీనటుల వేషధారణలోనూ, సంభాషణల్లోనూ, పాటల్లోనూ, నృత్యాల్లోనూ నిండి ఉన్న అశ్లీలత! సినిమాల్లో నాణ్యత తరగటం, 1975 మొదలై తర్వాత 1980 నుండి 1992 లోపల విపరీత వేగంతో పెరిగిపోయింది. సమాజంలోని ఇతర కళారూపాలన్నిటినీ రూపుమాపేసి, సినిమా ఏకైక అవకాశంగా ప్రజల ముందు నిలబడటంతో, వినోదార్ధం మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. [అప్పటికి టీవీలు ఇంతగా వ్యాప్తి చెందలేదు]

ఆ విధంగా ప్రజలలో ప్రేరణనీ, స్ఫూర్తినీ నింపగల సంగీతం, సాహిత్యం, తరం నుండి తరానికి సంక్రమించిన రకరకాల యుద్ధకళలు, కోలాటాది గ్రామీణ జానపద కళలూ, అన్నీ అంతరించిపోయి, సంస్కృతీ సాంప్రదాయాలంటే ఏమిటో తెలియని స్థితికి సమాజం ప్రయాణం మొదలుపెట్టింది. సాంప్రదాయ కళలన్నిటి స్థానే సినిమా ఏకైక సాధనమై నిలబడింది.

దాంతో విజయవంతంగా ప్రజాబాహుళ్యంలోని, ప్రజాదృక్పధంలోని సంస్కృతీ సాంప్రదాయపు విలువల్నీ, నమ్మకాలని, ప్రవర్తనా సరళులని, మాటతీరుని, సభ్యత సంస్కారాలని, మంచి మర్యాదా మన్ననలని, ఆరోగ్యకరమైన పలకరింపు దగ్గరి నుండి ఆత్మీయతా పూర్వక పిలుపుల దాకా, అన్నిటినీ – సినిమా, ప్రభావ పరచటం మొదలై, మార్చిపారేయటంలో సఫలీకృతమైంది. ఇంత జరుగుతున్నా, “ సినిమా కేవలం ప్రజల్ని వినోదపరుస్తుంది. అంతే తప్ప, సినిమాల ప్రభావం ప్రజల మీద ఏమాత్రం ఉండదు” అంటూ సినీపండితులు, నకిలీ కణికవ్యవస్థలోని కీలక వ్యక్తులిచ్చిన Assignments ప్రకారం చిలకపలుకులు పలుకుతూనే ఉంటారు.

ఈ నేపధ్యంలో మరో ప్రత్యామ్నాయం లేక కొంతమందీ, అప్పటికే సినిమాలు చూడటం అన్నది వ్యసనం అనేంత స్థాయిలో ఉండి కొంతమంది, ఏ సినిమాలు అందుబాటులో ఉంటే అవి చూసేవాళ్ళు. అప్పటికీ కొన్ని సినిమాలని ‘పరమ చెత్త సినిమాలు’గా ప్రజలు తిరస్కరించినా, ఆశ్చర్యకరంగా ఆ సినిమాలకీ సక్సెస్ ముద్రపడేది. అవార్డులు వచ్చేవి. 100 రోజుల ఉత్సవాలూ నడిచేవి.

నల్లమేక నలుగురు దొంగల కథలాగా ’నాకొక్కడికే నచ్చలేదేమో! అందరికీ నచ్చినట్లుంది. ఉలిపి కట్టెలాగా నేనే ఉన్నట్లున్నాను’ అని ప్రతివాళ్ళు అనుకోవాల్సి వచ్చేదన్నమాట. ఇప్పుడంటే 100 రోజులూ, 50 రోజుల పండుగలు, క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగుల వంటివని ప్రజలకి తెలిసిపోయింది గానీ, అప్పటికింత అవగాహన ఉండేది కాదు.

అదీగాక డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అనే మాయాజాలం ఒకటి ఉండేది. జిల్లాల వారిగా సినిమాల పంపిణి వ్యవస్థ చేతుల్లో, నిర్మాతలు గిలగిల్లాడాల్సి వచ్చేది. మొత్తంగా చిత్రనిర్మాణం దగ్గరి నుండి చిత్రవిజయాల వరకూ అదృశ్యహస్తాల్లో వ్యవస్థీకృతంగా నడిపింపబడేది. ఆ అదృశ్య హస్తపు విన్యాసమే కుట్ర. ఆ హస్తమే నకిలీ కణికవ్యవస్థ. దీనంతటికీ – నకిలీ కణిక వ్యవస్థా, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావులూ, సంస్థలు ఐ.ఎస్.ఐ., సి.ఐ.ఏ.లు పెట్టిన పేరు ’తీస్తున్నారు కాబట్టి చూస్తున్నాం – చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం’ అనబడే ద్వంద్వం.

ఈ విధమైన ద్వంద్వపు సృష్టితో భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న కుట్రదారులు i.e. నకిలీ కణికవ్యవస్థా, అందులోని కీలకవ్యక్తులూ, సంస్థలూ, సినిమారంగంలోని నైతిక విలువల్ని, కళాత్మక విలువల్ని, మానవీయ విలువల్ని, నాణ్యతని సర్వనాశనం చేయగలిగారు. మొత్తంగా కథ దగ్గరి నుండి అన్ని అంశాల్లో, సినిమాల్లోని సాహిత్యాన్ని, సంగీతాన్ని రసం పిండేసిన చెరకుపిప్పిలాగా ఇంకా చెప్పాలంటే నిర్జీవ కళేబరేల్లాగా చేయగలిగారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇటీవల [సెప్టెంబరు 15, 2009] సాక్షిలో ప్రచురించబడిన ఈ క్రింది వార్త చూడండి.

>>>ముస్సోలినీ బ్రిటన్‌ గూఢచారి!
లండన్‌:

ఫాసిజం వ్యవస్థాపకునిగా, ఇటలీ నియంతగా ప్రసిద్ధి చెందిన బెనిటో ముస్సోలినీ, తన రాజకీయ జీవితాన్ని బ్రిటన్‌ గూఢచారిగా ప్రారంభించారు! ముస్సోలినీ మర ణించాక అరవై నాలుగేళ్ల తరువాత, ఇటీవలే ఆ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌ గూఢచారి సంస్థ ఎమ్‌ఐ5, 1917లో వారానికి వంద పౌండ్ల (నేటి ఆరువేల పౌండ్లు) వేతనానికి ముస్సోలినీని తన ఏజెంటుగా నియమించింది. ముస్సోలినీ అప్పట్లో 'ఇల్‌ పపొలో డి ఇటాలియా' అనే వార్తా పత్రికను నడిపేవాడు. ఆ పత్రిక ద్వారా, యుద్ధంలో గట్టిగా నిలిచి పోరాడేలా ఇటాలియన్లను ప్రేరేపించాలని ఎమ్‌ఐ5 కోరింది.

పారిశ్రామిక కార్మికులలో ప్రబలిన అసంతృప్తిని చల్లార్చి, వారు బోల్షివిక్కుల ప్రభావంలోకి పోకుండా కాపాడాలని కూడా ఆశించింది. అప్పట్లో ఎమ్‌ఐ5 అధికారిగా ఇటలీలో ఉన్న సర్‌ సామ్యూల్‌ హోరె,ముస్సోలినీకి ఆ పని అప్పగించారు. పీటర్‌ మార్ట్‌ల్యాండ్‌ నేతృత్వంలోని కేంబ్రిడ్జ్‌ చరిత్రకారులు ఎమ్‌ఐ5 డాక్యుమెంట్లను పరిశోధించి ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ముస్సోలినీ శిక్షణ పొందిన గూఢచారి కాకపోయినా ఎమ్‌ఐ5 అతనికి భారీగానే ముట్టచెప్పింది. స్త్రీలోలునిగా బాగా పేరున్న ముస్సోలినీ ఆ డబ్బులో అధిక భాగం ఆ వ్యసనానికే వెచ్చించి ఉండవచ్చని మార్ట్‌ల్యాండ్‌ అభిప్రాయపడ్డారు.

యుద్ధానంతరం ముస్సోలినీ క్రూర ఫాసిస్టు నియంతగా మారాడు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి హోదాలో హోరె, 1935లో తిరిగి ముస్సోలినీని కలుసుకున్నారు. ఒకప్పుడు తన దగ్గర వారం జీతానికి పనిచేసిన ఆ ఫాసిస్టు నియం..."
~~~~

ఇటలీ నియంత ముస్సోలినీ బ్రిటన్ గూఢచారి అన్న విషయం దాదాపు ముస్సోలినీ మరణించిన 65 సంవత్సరాల తరువాత బయటికొచ్చింది. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ, మీడియా, ఈ విషయాన్ని అంతగా ప్రచారం కాకుండా చూసేందుకు శతధా ప్రయత్నిస్తుందనుకోండి!

ఏది ఏమైనా, రెండవప్రపంచయుద్దానికి బలీయ దోహదకారులుగా పేరుపడ్డ ఇద్దరిలో, జర్మనీ నియంత హిట్లర్ ఒకరు కాగా, ఇటలీ నియంత ముస్సోలినీ మరొకడు. ఇతోధికంగా అప్పటి మీడియా ప్రచారం, [నాజీల గురించీ, జాత్యహంకారాల గురించీ] కూడా రెండవ ప్రపంచయుద్దానికి దారి తీసిన కారణాలలో ఒకటనే వాదం చరిత్రలో చదువుకున్నాం. [ఇప్పటికీ 10 వ తరగతి పాఠ్యాంశాంలో ఇదే ఉంటుంది.] ఈ విషయాల గురించిన మరింత వివరణ, 166. నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు [Assumptions] – 9[హిట్లర్ – నానాజాతి సమితి వైఫల్యం] [May 26, 2009] లో చూడగలరు.

65 సంవత్సరాల క్రితమైతే, ఇటలీలో ఈ నియంత ముస్సోలినీని, వారికి విదేశమైన బ్రిటన్ ఏజంటుగా ఎవరూ అనుమానించి ఉండరు కదా! ఒకవేళ ఎవరైనా గుర్తించి, ఎవరు ఎవరికి చెప్పినా, ఎవరూ నమ్మి ఉండరు కదా? మరి ఇప్పుడో......? అప్పట్లో అయితే ఆ ఇటలీ అధినేతకు అప్పటి మీడియా జేజేలు కొట్టి ఉంటుంది. బాకాలు ఊది ఉంటుంది. అతడి నుండి ప్రయోజనాలు పొందిన వారు, పొందాలనుకునే ఆశావహులూ, అమితభక్తులూ వారిదైన పద్దతులలో గౌరవాభివందనాలు చూపి ఉంటారు కదా! అధినేత నిర్ణయమే శిరోధార్యం అని కూడా ఉంటారు.

ఇక్కడ ఓ దృష్టాంతం పరిశీలించడం సమయోచితంగా ఉంటుంది. 1991 లో శ్రీ పెరంబుదూర్ లో రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డాడు. అతడితో పాటుగా మరో 18 మంది చనిపోయారు. హంతక ముఠాలో సభ్యురాలైన నళినికి పడిన ఉరిశిక్షను, అప్పటికి ఆమె గర్భవతైనందున, ఆమె కడుపులో బిడ్దని దృష్టిలో ఉంచుకుని ’పరమ కరుణామయి’ అయిన సోనియాగాంధీ, నళినీ ఉరిశిక్షని యావజ్జీవ కారాగారా శిక్షగా మార్చాల్సిందిగా కోర్టుకు విన్నవించింది. ఆపైన ఇంకేం ప్రయత్నాలు జరిగాయో గానీ, మొత్తానికీ నళినీ ఉరిశిక్ష కాస్తా యావజ్జీవ కారాగార శిక్ష అయ్యింది. [హంతక ముఠాలో సభ్యురాలైన నళిని, విచారణ సమయంలోనే అదే ముఠాలో సభ్యుణ్ణి పెళ్ళాడి గర్భవతైంది. ఆ పైకారణంతో(over leaf reason) ఉరిశిక్ష కాస్తా యావజ్జీవ శిక్షగా మార్చబడింది.] ఇప్పుడావిడ తానిప్పటికే 18 ఏళ్ళు జైల్లో ఉన్నందున తనని విడుదల చెయ్యమనీ, విడుదల తన హక్కన్నంత స్థాయిలో జైల్లో ఆందోళన చేస్తోంది లెండి. అయితే రాజీవ్ గాంధీతో పాటు మరణించిన మిగిలిన 18 మంది తాలుకూ కుటుంబసభ్యులు కూడా, సదరు నళినిని, క్షమించారో లేదో మనకి తెలియదు. ఈ విషయం గురించి విశ్లేషిస్తూ ప్రముఖ సినీ రచయిత, నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు, తన బ్లాగులో ’శ్రీ పెరంబుదూర్ లో రాజీవ్ గాంధీతో పాటు చనిపోయిన ఒకతని తల్లి వంటలపని చేసుకుంటు ఉండవచ్చు, ఒకవేళ అతడి తండ్రిగానీ బ్రతికి ఉంటే అతడు డాక్టర్ అయి ఉండేవాడేమో? ఎవరికి తెలుసు?’ అన్నారు.

నిజమే కదా! ఒక పిల్లవాడికి తండ్రి బ్రతికి ఉంటే అతడి జీవితం మరోలా ఉండి ఉండేదేమో! అలాగే రాజీవ్ గాంధీ బ్రతికి ఉంటే అతడి సంతానం ప్రియాంకా వాద్రా, రాహుల్ గాంధీల జీవితాలూ, ఆలోచనా సరళీ మరోలా ఉండి ఉండేవేమో?

వ్యక్తి జీవితమైనా దేశ చరిత్ర అయినా ఒకటే! ఉదాహరణకి బాపూ లేకపోతే భారతదేశ చరిత్ర మరోలా ఉండేది కదా! హిట్లర్ లేకపోతే జర్మనీ చరిత్రా, ప్రపంచచరిత్రా మరోలా ఉండేవి కదా? అంతేకాదు సైనిక నియంతల వలన పాక్ బ్రతుకు మన కంటి ముందు కనిపిస్తున్న నిజం! ఒకవ్యక్తి మంచివాడా, చెడ్డవాడా అన్నది వేరే విషయం. ’ఒక వ్యక్తి కూడా, దేశ చరిత్రనీ, ప్రపంచ చరిత్రనీ మార్చగలడు’ అన్నదే ఇక్కడ ముఖ్యవిషయం.

ముస్సోలినీ మరణించిన తరువాత 65 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఇటలీ ముస్సోలినీ బ్రిటన్ గూఢచారి అన్న విషయం వెలుగులోకి వస్తోంది. అతడి స్థానే ఇటలీ పట్ల నిబద్దత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉండి ఉంటే, ఇటలీ చరిత్ర మరోలా ఉండేది కదా! అతడి హయాంలో ఎందరు తమ దేశంపట్ల నిబద్దతా, భక్తీ ఉన్న ఇటాలియనులు నాశనమై ఉంటారో, ఎందరు స్వార్ధపరులు బలపడి ఉంటారో ఎవరు చెప్పగలరు?

ఇప్పుడంటే గూఢచార తంత్రాలు బయటపడటం, Expose కావటమే స్ట్రాటజీగా, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గానికీ, నెం.5 వర్గానికీ మధ్య గూఢచార యుద్ధం నడుస్తున్న కారణంగా, ఇలాంటి విషయాలు బయటికొస్తున్నాయి గానీ….. గతంలో, రెండు దశాబ్ధాల క్రితంలో అయితే ఇవేవీ బయటికొచ్చేవి కావు. సాక్షాత్తూ బ్రిటనే ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టటం, ఏ స్ట్రాటజీలో భాగమైనా కానివ్వండి లేదా ఆత్మహత్యా సదృశ్య assignments లో భాగమైనా కానివ్వండి, మొత్తానికీ బ్రిటనే ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.

అప్పుడే కాదు, ఇప్పుడూ బ్రిటన్, ఇలాంటి ముస్సోలినీలకే అండదండలందిస్తుంటుంది. ఖలిస్తాన్ పేరిట మనదేశంలో టెర్రరిజం నడుస్తున్నప్పుడు, ఆ టెర్రరిజానికి అండదండలు, దాని నేతలందరు బ్రిటన్ నుండే నడిపారు. దీనిని స్వేచ్ఛావాదం పేరిట బ్రిటన్ నడవనిచ్చింది. ఇప్పుడు ఆల్ ఖైదాకు అండదండలు అందిస్తున్న వారు బ్రిటన్ లోనే ఉన్నారన్న విషయాలు బయటికొస్తున్నాయి. ఇవే కావు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెర్రరిస్టు సంస్థలకు సంబంధించిన అండదండలు బ్రిటన్ లో నుండే ఉంటాయి.

ప్రక్కదేశాలలో తమ ఏజంట్లని అధినేతలుగా ఇన్ స్టాల్ చేసే బ్రిటన్, ఎంత ధర్మపన్నాలు చెబుతుందో అందరికీ తెలిసిందే! ఇప్పుడే కాదు, 18, 19 వ శతాబ్ధాలలో సైతం, ఓప్రక్క పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగంగా తమ కార్ఖానాలలో 8,9 ఏళ్ళ పిల్లల చేత కూడా రోజుకి 15 – 16 గంటలు పనిచేయిస్తూ….. అలిసిపోయి పని ’నిదానిస్తే’, ఆ పిల్లలని కొరడాలతో బాదుతూ ఊడిగం చేయించుకుంటూ….. మరో ప్రక్క – ’మిత్రమా! నీ చేతి కర్ర ఊపుకునే స్వేచ్ఛ నీకుంది. అయితే నా ముక్కు ఎక్కడ ప్రారంభం అవుతుందో, అక్కడ నీ స్వేచ్ఛ అంతమవుతుంది’ అంటూ స్వేచ్ఛకు కుహనా నిర్వచనాలు చేప్పేది. అప్పట్లో బ్రిటిషు వారి స్వేచ్ఛా భావనలు, ఎంతగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయో, అప్పటి చరిత్ర పుస్తకాలు గానీ, ఆనాటి ప్రముఖుల జీవిత చరిత్రలు గానీ, చదివిన వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అంతగా ఆచరణ శూన్యమైన కుహనా భావ వాదాన్ని[Psudeo Idealism] ఎలుగెత్తి ప్రచారించింది.

ఇంతగా కుహనా భావవాదపు ముసుగులేసుకుని గూఢచర్య తంత్రాలు నడిపిన బ్రిటన్, తన కుయుక్తులు బయటపడి పట్టుబడిపోయినప్పుడు ఎంచక్కా క్షమాపణలు చెప్పెస్తుంటుంది. తనంత గొప్పదేశం క్షమాపణలు చెప్పటం కంటే ఉద్దరణ ఎదుటివాడికి ఇంకేం కావాలన్నట్లు! తము చేసిన ముస్సోలినీలు వంటి వ్యవహారాలలో ఎందరి జీవితాలు ఎంతగా నలిగి పోయినా, ఇప్పుడు తము చెప్పే ఒక్క క్షమాపణలో ‘అన్నీ చెల్లు’ అన్నరీతిలో ఉంటుంది ఆ వ్యవహార సరళి! అక్కడా అహంకారమే! ’నా అంతటి గొప్పవాళ్ళు క్షమాపణ చెప్పటం కంటే ఇంకేమిటి కావాలి నీకు?’ అన్నట్లు! ఒక్కమాటలో చెప్పాలంటే, ఇది మాత్రం జాత్యహంకారం కాదా? అలాగయ్యి…. మళ్ళీ…. ఇంత బుర్రా బ్రిటిషుకి ఉండి కూడా కాదు. ఇంతకు ముందు ఇదే లేబుల్ లోని ఇతర టపాలలో చెప్పినట్లు బ్రిటన్ వెనుక నకిలీ కణిక అనువంశీకులు ఉండబట్టి, బ్రిటన్ ఒకప్పుడు ’మంచి రూపాయిగా చెల్లింది. లేకపోతే ’సత్తురూపాయే!’

ఇక – ఈ నాడు, ఇటలీ నియంత ముస్సోలినీ గుట్టుబయటికొస్తోంది.
ఇలా ఎన్ని దేశాల్లో….. ఎందరు దేశాధినేతలు….. ఆయాదేశాల శతృదేశాలకు ఏజంట్లో….. ఎవరికీ తెలుసు?
ఈ నాడు ఇటలీ ముస్సోలినీ?
రేపు ఎవరో?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నిన్నటి టపా: ఈ బ్లాగులోని అన్ని టపాలనీ ఒకేసారి చూడాలంటే –


దీపావళి, పిల్లల కిష్టమైన పండుగ! ఈ పండుగ రోజున పిల్లలకిష్టమైన తియ్యని అప్పచ్చులతో పాటు, ఓ తియ్యని కథ! ఈ కథని మీ ఇంటిలోని చిన్నారులకి చెప్పటమో, వారి చేత చదివించటమో చెయ్యకపోతే, మీ ఇంటి టపాకాయలన్నీ తుస్సుతుస్సుమనుగాక! [శాపానికి భయపడి అయినా బుజ్జాయిలందరికీ ఈ కథ చెబుతారు గదా?]

అనగ అనగా…..

ఓ ఊళ్ళో ఓ పేదరాలు ఉండేది. ఆమెకి ఒక కొడుకున్నాడు. పేరు చిన్నోడు. వాడి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అసలే ’ఒక్కగా నొక్క కొడుకు, అందునా తండ్రిలేని పిల్లాడు’ అంటూ ఆ పేదరాలు, మన ’చిన్నోణ్ణి’ అమిత గారాబంగా పెంచింది. దాంతో చిన్నోడు ఆటపాటలు బాగా మరిగాడు. స్వతహాగా తెలివైన వాడు, ధైర్యసాహసాలున్న వాడు. కానీ తల్లి గారాబంతో చదువుసంధ్యలు నేర్వకుండా, తిని తిరగటం నేర్చుకున్నాడు.

ఎన్నిసార్లు తల్లి మందలించినా లక్ష్య పెట్టేవాడు కాదు. పేదరాలు దీనికెంతో బాధపడుతుండేది. తానే ఏవో తంటాలు పడుతూ, కొడుకునీ పోషిస్తుంది.

ఓరోజు పేదరాలు “ఒరే చిన్నోడా! మన ఆవు పాలు ఇవ్వటం లేదు. మేత దండుగ. దాన్ని సంతకి తోలుకెళ్ళి అమ్మి, నాలుగు మూటలు జొన్నలు పట్టుకురా!” అని చెప్పింది.

ఏ కళ నున్నాడో గాని చిన్నోడు “సరేనమ్మ! రేప్పొద్దున్నే బయలుదేరుతాను” అన్నాడు.

పేదరాలు దానికే ఎంతో సంతోషపడిపోయింది. మర్నాటి ఉదయమే ఇంత పెరుగన్నం మూట కట్టి ఇచ్చింది. చిన్నోడు ఆవుని తోలుకుని సంతకు బయలుదేరాడు. ఎండ బాగా ఉంది. కాలిబాటన నడుస్తున్నాడు. ఇంతలో మేకని తోలుకెళ్తున్న ఓ రైతు తారసబడ్డాడు.

"ఎక్కడికబ్బాయ్!” అన్నాడు ఆ రైతు.

"సంతకి” అన్నాడు చిన్నోడు.

"దేనికి?”

"ఈ ఆవుని అమ్మటానికి”

"నేనూ సంతకే పోతున్నా! ఈ మేకని అమ్మి ఆవుని కొందామని! ఇంత ఎండలో అక్కడిదాకా ఏంపోతాం? నీ ఆవుని నాకిచ్చి ఈ మేకని మారకం తీసుకో! ఎంచక్కా ఇద్దరం ఇంటికెళ్ళి పోవచ్చు” అన్నాడు రైతు.

ఈ మారు బేరం బాగానే ఉందనిపించింది చిన్నోడికి.

సరేనంటూ ఆవునిచ్చి మేకని తీసుకున్నాడు.

తల్లిజొన్నలు తెమ్మంది కదాని సంత కేసి నడవసాగాడు.

మరికొంత దూరం పోయేసరికి, ఈసారి కోడిపుంజుని మోసుకొస్తున్న రైతు ఒకడు కన్పించాడు.

చిన్నోడి వివరాలు విని మేకని కోడికి మారకం వేయమన్నాడు.

చిన్నోడు సరేనని మేకనిచ్చి కోడిపుంజుని తీసుకున్నాడు.

మరికొంత దూరం పోయేసరికి మరొక రైతు ఎదురయ్యాడు.

"ఏమిటబ్బాయ్?" అంటూ విషయం అడిగాడు.

చిన్నోడు చెప్పిందంతా విని కోణ్ణి తనకిస్తే చిక్కుడుగింజలు ఇస్తానన్నాడు. చిన్నోడు అవి తీసుకొని కోణ్ణి ఇచ్చేసాడు.

సంతకెళ్ళాక గానీ గుప్పెడు చిక్కుడు గింజలకు జొన్నలెవ్వరూ ఇవ్వరన్న విషయం వాడికి స్ఫురించలేదు. గమ్మున వెనక్కి తిరిగి వచ్చి తల్లికంతా చెప్పాడు. జేబులోంచి గుప్పెడు చిక్కుడు గింజలు తీసిచ్చాడు.

పేదరాలికి ఒళ్ళుమండిపోయింది. కొడుకుని తిట్టిపోసింది. కోపంతో, దుఃఖంతో చిక్కుడు గింజలని కిటికీలోంచి పెరట్లోకి విసిరేసింది.

"ఇంత వయస్సు వచ్చినా నీకు బాధ్యత తెలియలేదు కదా? అంత ఆవునిచ్చి గుప్పెడు చిక్కుడు గింజలు తెస్తావా? నాలుగు మూటల జొన్నలొస్తాయని కూడా చెప్పాను కదరా నాయనా? అయినా నీకు బుద్దిలేక పోయింది. నా ఖర్మ!” అంటూ నెత్తిబాదుకుంది.

చిన్నోడికి రోషం వచ్చింది. దుఃఖమూ వచ్చింది. తన మీద తనకే కోపం వచ్చింది. తల్లీకొడుకులిద్దరూ, ఎవరి ఏడుపు వారు ఏడ్చుకుంటూ ముడుచుకు పడుకున్నారు.

తెల్లారింది. చిన్నోడు నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ పెరట్లోకి వచ్చాడు.

ఆశ్చర్యం!
పెరట్లో చిక్కుడు మొక్క అడుగెత్తు పెరిగి ఉంది. వాడు ఆశ్చర్యంగా దానివైపే చూడసాగాడు. వాడు చూస్తుండగా చిక్కుడు తీగ క్షణానికొక అడుగు పెరగసాగింది. అంతకంతకూ పెరిగి పోతున్న దాన్ని చూస్తూ, ఆశ్చర్యంగా వాడు పెద్దగా కేకపెట్టాడు. అది విన్న పేదరాలు ఉలిక్కిపడి లేచి, ఆదరాబాదరా పెరట్లోకి వచ్చింది. చిక్కుడు తీగ కాస్తా చిక్కుడు చెట్టులాగా పైపైకి పెరగటం చూసి ఆమె కూడా నోరెళ్ళపెట్టింది.

అప్పటికే చిక్కుడు చెట్టు తాటి చెట్టంత ఎత్తు పెరిగి పోయింది. వాళ్ళలా చూస్తుండగానే చిక్కుడు చెట్టు పైభాగం మబ్బుల్లోకి పోయింది. చిన్నోడు ఉత్సాహంగా “అమ్మా! ఈ చెట్టు ఎక్కి పైన ఏముందో చూసి వస్తాను” అంటూ గభాలున చెట్టెక్కడం మొదలుపెట్టాడు. తల్లి వారిస్తున్నా వినలేదు.

గబ గబా పైకెక్కసాగాడు. పైకి పోయే కొద్దీ తమ ఇల్లు, ఊరు చిన్నగా కన్పించసాగింది. చిన్నోడికి భలే హుషారుగా అన్పించింది. ఇంకొంచెం పైకి పోయేసరికి దూదిపింజల్లా మబ్బులు. చేతికి అందుతున్న ఆకాశం అన్నట్లు చల్లదనం. ఇంకా వేగంగా పైకి ఎక్కసాగాడు. అలా పైకి పైకి….. పైపైకి. అద్భుతం!

ఆ చిక్కుడు చెట్టు అంచున ఓ పేద్దమేడ! చెక్కమెట్లు ఎక్కి పైకెక్కాడు. కిటికీలోంచి తొంగి చూశాడు. లోపల ఓ చక్కని అమ్మాయి! వీణ వాయిస్తోంది. పాపం, ఏడుస్తోంది కూడా!

చిన్నోడికి జాలి వేసింది.

"ఎందుకు ఏడుస్తున్నావు?" అనడిగాడు.

ఒక్కసారిగా వినబడిన స్వరానికి ఆ అమ్మాయి ఉలిక్కిపడింది.

కిటికీ దగ్గర చిన్నోడిని చూసి బిత్తర పోయింది.

"ఎవరు నువ్వు?" అంది ఆశ్చర్యంగా!

"నువ్వెవరు?" అన్నాడు చిన్నోడు.

"లోపలికి రా!” అంది అమ్మాయి.

చిన్నోడు లోపలికి వెళ్ళాడు. బల్లపై పంచభక్ష్య పరమాన్నాలున్నాయి. పళ్ళు మిఠాయిలూ ఉన్నాయి.

వాటిని చూడగానే చిన్నోడికి ఆకలి గుర్తుకొచ్చింది.

"తింటావా?" అడిగింది అమ్మాయి.

"ఊఁ” అన్నాడు చిన్నోడు.

"తిను!” అంది.

అంతే! మనవాడు తాపీగా భోజనం చెయ్యటం ప్రారంభించాడు.

ఆ పిల్ల, చిన్నోడికి తన కథంతా చెప్పింది. ఆ ఇల్లు ఓ రాక్షసుడిది. ఆ అమ్మాయి ఓ రాజకుమారి. ఆ పిల్లని రాక్షసుడు చిన్నప్పుడే ఎత్తుకొచ్చాడు. అన్ని కళలూ నేర్పించాడు. పగలంతా ఎక్కడెక్కడికో పోతాడు. రాత్రికి తిరిగివస్తాడు. ఇప్పటికైతే ఆ పిల్లకి ఏలోటూ లేకుండా చూసుకుంటున్నాడు గానీ, పెద్దయ్యాక ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడట!

ఇదంతా చెప్పి ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తనతో ఆడుకోవటానికి గానీ, మాట్లాడటానికి గానీ ఎవరూ లేనందుకు బోలెడు దిగులుగా ఉంటుందని చెప్పింది.

"ఇక నుండీ రోజూ రా! ఆడుకుందాం!” అంది.

ఈ మాట చిన్నోడికి భలే నచ్చేసింది. ఇద్దరూ చాలాసేపూ ఆడుకున్నారు.

అంతలో ఆ అమ్మాయి “చిన్నోడా! ఇక రాక్షసుడు వచ్చే సమయమైంది. ఇంటికెళ్ళి మళ్ళీ రేపురా! ఎంచక్కా ఆడుకుందాం” అంది.

చిన్నోడు “మా అమ్మకి కూడా భోజనం కావాలి మరి!” అన్నాడు.

ఆ అమ్మాయి అన్నీ మూటకట్టి ఇచ్చింది. ఇంకా బంగారు నాణెలూ, వజ్రాలు, వైడూర్యాలూ కూడా మూటకట్టి ఇచ్చింది.

చిన్నోడు సంతోషంగా ఆమెకు వీడ్కొలు చెప్పి చిక్కుడు చెట్టు దిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే పేదరాలు చిన్నోడు ఏమయిపోయేడోనని ఏడుస్తూ కూర్చుని ఉంది.

చిన్నోడు ఆనందంగా “అమ్మా! అమ్మా!” అంటూ ఆరుస్తూ రాగానే, ఒక్క ఉదుటున వాణ్ణి కౌగలించుకుని ఏడ్చేసింది.

చిన్నోడు తల్లికి అన్ని వివరంగా చెబుతూ తల్లికి పంచభక్షపరమాన్నాలతో అన్నం తినిపించాడు. పేదరాలు ఎంతో సంతోషపడింది. వాడు తెచ్చిన బంగారం, వజ్రాలూ అన్ని దాచిపెట్టింది. వాటితో తము పెద్ద ఇల్లు కట్టుకొని, పొలం కొనుక్కుని సుఖంగా ఉండొచ్చు అనుకున్నారు.

మర్నాడు మళ్ళీ చిన్నోడు చిక్కుడు చెట్టు ఎక్కి పైకి వెళ్ళాడు. రాకుమారితో ఆడుకుని రాక్షసుడు వచ్చే సమయానికి తిరిగి వచ్చేసాడు. వచ్చేటప్పుడు రాకుమారి వాడికి నిన్నటి లాగానే మంచి భోజనం, బంగారమూ ఇచ్చింది.

కొన్నిరోజులు గడిచాయి. రాకుమారి వాడికి చదువూ, కళలు కూడా నేర్పుతోంది. ఓ రోజు చిన్నోడు, రాకుమారి ఎంచక్కా తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్నారు. అంతలో ఉరుములేని పిడుగులా రాక్షసుడు ఇంటికొచ్చాడు. వారికీరోజు తలనొప్పిగా అన్పించి తొందరగా ఇంటికొచ్చాడన్న మాట. చూస్తే ఏముంది? రాకుమారితో ఆడుకుంటూ ఎవరో ఓ అబ్బాయి! రాక్షసుడికి కోపం ముంచుకొచ్చింది. గట్టిగా ఆరుస్తూ చిన్నోడి వెంటపడ్డాడు. రాకుమారి భయంతో కెవ్వున కేక వేసింది. చిన్నోడు ఒక్క ఉదుటున రాకుమారి చెయ్యిపట్టుకుని క్రిందికి పరిగెత్తాడు. ఇద్దరూ వేగంగా చిక్కుడు చెట్టు దిగసాగారు. వెనకే పెద్దగా అరుస్తూ రాక్షసుడు వెంటబడ్డాడు.

కేకలు విని పేదరాలు హడావుడీగా పెరట్లోకి వచ్చింది. తలపైకెత్తి చూడసాగింది. పైనుండి దిగుతూనే చిన్నోడు “అమ్మా! గొడ్డలి తే” అంటూ గట్టిగా అరిచాడు. పేదరాలు పరుగున పోయి గొడ్డలి తెచ్చింది. క్రిందికి దూకిన చిన్నోడు, ఒక్క ఉదుటున గొడ్డలి పుచ్చుకుని చిక్కుడు చెట్టుని మొదలంటా కొట్టేసాడు.

చిన్నోడంటే చురుగ్గా చెట్టు దిగేసాడు. తనతోపాటు రాకుమారినీ లాక్కొచ్చేసాడు. పాపం! రాక్షసుడు లావుగా ఉన్నాడు. అందునా కోపంతో రొప్పుతున్నాడు. దాంతో వేగంగా దిగలేక పోయాడు. అప్పటికి సగం చెట్టు దిగాడంతే!

మనవాడు చెట్టు కొట్టేయటంతో, పెద్దగా అరుస్తూ చెట్టుతో సహా క్రిందపడ్డాడు. చెట్టు మీద ఇల్లు క్రిందపడింది. రాక్షసుడు పెద్దగా అరిచి చచ్చిపోయాడు. ఊరి వాళ్ళంతా ఆశ్చర్యంతో పేదరాలి ఇంటి చుట్టూ మూగారు. రాక్షసుడి ఇంట్లో ఇంకా బోలెడంత బంగారం, వజ్రాలూ, గట్రా ఉన్నాయి. చిన్నోడు, రాకుమారి ఆ బంగారాన్ని ఊరందరికీ పంచిపెట్టారు.

అతడు మంచి ఇల్లు కట్టుకుని, పొలం కొనుక్కుని హాయిగా ఉన్నారు. పెద్దయ్యాక, పేదరాలు చిన్నోడికి రాకుమారికి ఇచ్చి పెళ్ళి చేసింది. అందరూ హాయిగా ఉన్నారు.

కథ కంచికి మనం పటాసులు కాల్చుకోవడానికి!

~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~ ~~~~

[ఈ కథలో – చిక్కుడు చెట్టు ఊళ్ళో మిగిలిన వాళ్ళకి కనబడలేదా? రాకుమారిని వాళ్ళ నాన్నగారైన రాజుగారు తీసికెళ్ళిపోలేదా? అసలు చిక్కుడు చెట్టు అంతలా ఎలా పెరిగి పోయింది? పోయి పోయి రాక్షసుడిఇంటిదాకానే ఎందుకు పెరిగింది? రాక్షసుడికి తలనొప్పి వస్తుందా? మబ్బుల్లో ఉండీ రాక్షసుడు చెట్టు మీద నుండి పడిపోయి చచ్చిపోతాడా? – ఇలాంటి సందేహాలు బుడ్డీలకి రావు. వచ్చాయంటే ‘వాళ్ళు పెద్దయ్యారు’ అనే అర్ధం. అప్పుడు వాళ్ళకి ‘పటాసులు కొనకపోయిన ఫర్వాలేదు’ అంటే చాలు! అప్పుడు ఏ సందేహాలు పిల్లలకి రావు మరి!]

అంరికీ దీపాళి శుభాకాంక్షలు


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~~~

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu