మరో స్పష్టమైన ఉదాహరణ పరిశీలించండి. పాత సినిమాల్లో [చాలా వాటిల్లో] పాత్రల సంభాషణలు గానీ, పాటలు గానీ ఎంతో సాహిత్యపు విలువలతో, భాషా సౌందర్యంతో, స్ఫూర్తిదాయకమైన అర్ధాలతో, భావయుక్తపు ప్రయోగాలతో నిండి ఉండేవి. వీటితో పాటు పాటలలో సంగీతపు రసపుష్టి కూడా ఉండేది. భావానికి తగిన రాగం ఉండేది. ’మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ శంకరం బాడి సుందరాచారి పాట, టంగుటూరి సూర్యకుమారి నోట, శ్రోతలకు రోమాంచిత మయ్యేరాగం అది. ’రుద్రమ్మ భుజకీర్తి, మల్లమ్మ పతిభక్తి, కృష్ణరాయల కీర్తి, తిమ్మరసు ధీయుక్తి’, గాయకుల గొంతు స్థాయి పెరిగే కొద్దీ గుండెలు కొట్టుకునే వేగం పెరిగే వీర రసం అది. ఒక్క టంగుటూరి సూర్యకుమారి పాడినంతనే కాదు, చిన్నప్పుడు మా స్కూల్ లో, మా సంగీతం టీచర్ ’సుశీలమ్మ’ గారు మాకు నేర్పిన రాగం కూడా అదే.

అదే పాటని ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడగా, కృష్ణంరాజు, సుహాసినిలు నటించగా, బాపూరమణలు తెరకెక్కించిన తీరు,[‘బాపూరమణలు కూడా ఇంత చెత్తగా సినిమా తీయగలరా?’ అని మనం ఆశ్చర్యంతో మూర్ఛపోవాల్సిందే. అదే గాడ్ ఫాదర్ ల గ్రిప్] బుల్లెట్ చిత్రంలో చూడండి. ఒక్కసారిగా నీరసం, నిస్సత్తువ ఆవరించికపోతే చెప్పండి.[అందులో విచిత్రం ఏమిటంటే – క్రింద కూర్చుని, బాసింపట్లు వేసుకుని, ఆ పాట ఆలపించిన హీరోకి, పాట పూర్తయ్యేసరికి, ఆత్మపరిశీలన చేసుకున్న (గతంలో అహంకారి అయిన) హీరోయిన్ పాదాక్రాంతం అయిపోతుంది.] వీర రసం పలికించాల్సిన పాటకి తద్విరుద్దమైన రాగం కడితే వచ్చే ఫలితం అది.

మరోపాట ’వీరకంకణం’ సినిమాలో ’కట్టండి వీరకంకణం’ అన్నపాట. ఆనాడు స్వాతంత్ర సమరంలో దూకేందుకు అఖిలాంధ్రమహిళలని ఉత్తేజితులని చేసిన పాట అది. అలాంటి సజీవ రాగాలు 1975 నుండి 1992 వరకూ పూర్తిగా తుడిచి పెట్టబడ్డాయి. సంగీత శాస్త్రం ప్రకారమే కాదు, ఆధునిక మానసికశాస్త్రం ప్రకారమైన సరే, కొన్ని రాగాలు, ప్రజల రక్తంలో తరతరాలుగా ఉన్న మూలాల కారణంగా ప్రజలని ఉత్తేజితులని చేస్తాయి అని చెప్పవచ్చు. ఆయా రాగాలకూ, ఆయా భావాలకూ, అలాగే ఆయా సంగీత పరికరాలకూ ఆయా జాతులకూ రక్తసంబంధం వంటి అనుబంధం ఉండటం జెనెటిక్ శాస్త్రం ప్రకారం కూడా ఆమోద యోగ్యం.

మరోపాట గమనించండి.
'కులదైవం' కోసం ఘంటసాల పాడిన పాట ఇది.

"పయనించే ఓ చిలుకా! ఎగిరిపో! పాడేపోయేను గూడు”. ఇందులో గీత రచయిత ఎంత ఆధ్యాత్మిక భావనని నింపాడో, గాయకుడు అంతగా వైరాగ్యభావనని, ఆధ్యాత్మిక చింతనని శ్రోతలో అణువణువునా ఆవహింప చేసాడు.

"మరవాలి నీ కులుకుల నడలి! మదిలో నయగారాలే”
"పుల్ల పుడకా ముక్కున కరచి గూడును కట్టితివోయి”
“ఎన్నడో తిరిగి ఇటు నీ రాక! ఎవరే తెలిసిన వారు”
“ఏరులయే కన్నీరులతో మనసారా దీవించేరే!”

అంటూ శరీరాన్ని గూడుగానూ, ఆత్మని చిలక గానూ వర్ణిస్తూ, మరణాన్ని ఉపమానిస్తూ ఉన్నపాట! విన్నవారికి మరణం సహజమైనదనీ, అనివార్యమైనదనీ గుర్తు చేస్తుంది. ధైర్యంగా మరణాన్ని ఎదుర్కోనే స్ఫూర్తిని రగిలిస్తుంది. “జాతస్వహి ధృవో మృత్యు:” అన్న గీతా శ్లోకం అప్రయత్నంగా గుర్తుకొస్తుంది. శ్లోకం రానివాళ్ళకి భావమైనా గుర్తొచ్చి తీరుతుంది.

మరోపాట పరిశీలించండి.
"కళ్ళు తెరవరా నరుడా! నిజము తెలియరా నరుడా!
కాలికి రాయి తగులుట కల్ల, కాలే రాయికి తగిలెనురా
కళ్ళు తెరవరా నరుడా”

చాలా మామూలుగా మనం ’ఎదురు రాయి తగిలి కాలికి గాయమైంది’ అంటాం. కానీ చాలా సందర్భాల్లో రాయి దొర్లుకు వచ్చి మన కాలికి తగలదు. నడుస్తూ మనమే చూసుకోకుండా, కాలితో రాయిని తన్ని గాయం చేసుకుంటాం. నింద ఎదుటి వారిపై/ఎదుటి వస్తువుపై తోసే గుణం ఇక్కడ అప్రయత్నంగా కనబడుతుంది. దాన్నే పై పాట ఎత్తి చూపిస్తుంది.

అలాగే 1980 నుండి 1990 ల లోపు వచ్చిన మరికొన్ని పాటలు చూడండి.
"పండయితే పనికి రాదు ఆవకాయకు,
పంటి కింద కరకర లాడేందుకు”

ఈ ’కరకర’ అనేటప్పుడు గాయకుడు ’కర్రకర్ర’ అంటూ ఒత్తిపలుకుతూ పాడతాడు. అదేమి సాహిత్యమో, సంగీతమో, ఆ పాటకీ, దానికి నర్తించిన హీరో హీరోయిన్ల [Sr.ఎన్టీఆర్, శ్రీదేవిల] స్టెప్టులకి ఏమిటి సంబంధమో సదరు సినిమా సృష్టికర్తలకే తెలియాలి.

ఇక ‘ఆరేసు కోబోయి పారేసుకున్న కోక పాటలు సరే సరి’.
ఇటీవల ’ఇప్పటి కింకా నా వయస్సు నిండా పదహారే.
చీటికి మాటికి చెయ్యెస్తూ చుట్టూ కుర్రాళ్ళే!’

అంటూ పబ్ లో, శరీరం మీద అరగొరగా దుస్తులు వేసుకున్న ఓ భారీ దేహం గల నృత్యకళాకారిణి[!?] డాన్సుకి పాట వ్రాసిన రచయిత [!?], సదరు పాట వెనుక గల కథని చెబుతూ వ్రాసిన వ్యాసాన్ని ప్రచురిస్తూ, మీడియా, అది గొప్ప సాహిత్యమన్న కితాబు లిచ్చేసింది. నవ్వాలో ఏడవాలో తెలీని స్థితి! తెలుగు సాహిత్యం చివరికి ఈ దశకొచ్చిందనుకోవాలి కాబోలు! ఇక ఇలాంటి పాటల నృత్య చిత్రీకరణల్లో, అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఎగజిమ్మే లావా స్థాయిలో ’అశ్లీలత’ ఎగజిమ్ముతుంది.

ఎంతగా ప్రజలకి వినోదం అవసరం అనుకున్నా, పూర్తిగా వివేకాన్ని నాశనం చేసే వినోదం అనర్ధదాయకం కాదా? జ్ఞానం సంగతి దేవుడెరుగు, ఇంగితాన్ని కూడా నాశనం చేస్తున్న అశ్లీల వినోదం అవసరమా?

కానీ సినిమారంగం మాత్రం పటిష్టంగా, ప్రణాళికా బద్దంగా, ఇంకా చెప్పాలంటే వ్యవస్థీకృతంగా ప్రజల తార్కికజ్ఞానాన్ని నాశనం చేస్తోంది. ఇతర కళలని రూపుమాపి, సినిమా రంగంలో కళాత్మకతని, నైతికతని మంటగలిపి, ఈ పనిని నిర్విఘ్నంగా కొనసాగించింది. ఇక పూర్తిగా పట్టు సాధించాక, ఈ సినిమారంగంలోని గాడ్ ఫాదర్ లు ఆయా పాత్రల గొప్పదనాన్ని, ధైర్యసాహసాలు, త్యాగనిరతి, హుందాతనం గట్రా నాయక లక్షణాన్ని, ఆయా పాత్రధారులకి ఆపాదించారు. పరమ స్వార్ధపరుణ్ణి అయినా వీరు త్యాగధనుడిగా చూపించగలిగారు. పరమ పిరికివాణ్ణి సాహసోపేతుడిగా స్టాంపు వేయగలిగారు. బుర్రలో సరుకు లేని సాదాసీదా అనుచరుణ్ణి పరమ మేధావిగా అందరిచేత పొగిడించగలిగారు.

ఇక తదుపరి, ఈ బొమ్మల్ని సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి తీసుకుపోయి, తమ గూఢచర్య నెట్ వర్క్ బలంతో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు గానూ, దేశాలకి అధ్యక్షులుగానూ చేయగలిగారు. ఆ విధంగా తమ ఏజంట్లని కీలక స్థానాల్లో కూర్చోబెడితే పకడ్బందీగా దోపిడి నిర్వహించవచ్చు, సులభతరంగా తమ వాటా తాము పొందనూవచ్చు.

ఇక ఈ చెత్తకు అనుగుణంగా మరో చెత్త ఉంది. అది అభిమాన సంఘాల రాజకీయం. సమాజంలో రాజకీయ వైషమ్యాలతోనూ, కులమత వైషమ్యాలతోనూ పోటీపడుతూ, ఈ నటీనటుల అభిమాన సంఘాల వైషమ్యాలుంటాయి. శక్తివంచన లేకుండా భావకాలుష్యాన్ని దశదిశలా వెదజల్లుతూ ఉంటాయి. ఇంకా ఈ స్థితి 1992 కు ముందరైతే మరింత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కొంచెం మోతాదు తగ్గటమే గాక, అభిమాన సంఘాలు రక్తదానాది ప్రజాహిత కార్యక్రమాలు, భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు సహాయక చర్యలూ చేపడుతున్నాయి. కొంతమంది సినీనటులు సుదూర తీర సమీప భవిష్యత్తులో తమ రాజకీయ రంగప్రదేశం కొరకు తమ అభిమాన సంఘాలను ఇందుకు పురికొల్పినా, మరికొన్ని సంఘాలు స్వచ్ఛందంగానే ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొనటం ముదావహమే! కారణం ఏదైనా, ఈపాటి ప్రజాహితం జరగటం సంతోషించదగిన పరిణామమే.

ఏమైనా ఇప్పుడు భారతదేశంలోని చాలా భాషా సినిమారంగాల్లో నటులూ, సూపర్, మెగాస్టార్ లు రాజకీయ ప్రవేశం చెయ్యాలన్న ఊగిసలాటలో ఉన్నారు. కొందరు దూకి ఈదుతున్నారు, కొందరు మునగలేక తేలలేక అవస్థలు పడుతున్నారు. సినీరంగ గాడ్ ఫాదర్ లైన నకిలీ కణిక వ్యవస్థకీ, అందులోని కీలక వ్యక్తులకీ, వారి నెం.10 వర్గానికీ ఎదురుదెబ్బలు తగలటం కూడా ఇందుకు ఒక కారణం, బలమైన కారణం.

ఇటీవలి కాలంలో, అంటే దాదాపు 17 ఏళ్ళుగా, కొన్ని తార్కిక కథాబలంగల చిత్రాలు, దేశభక్తి, నైతికత ప్రబోధించే చిత్రాలు తెరమీదకి వస్తున్నాయి. దాదాపు సినిమారంగపు అన్ని విభాగాలలో మోనోపలి కుప్పకూలింది. ప్రతిభ, నైపుణ్యాల గల వ్యక్తులు, కళాకారులు కనబడుతున్నారు. కమేడియన్ల దగ్గర నుండి, క్యారెక్టర్ నటుల దాకా, గాయకుల దగ్గర నుండి దర్శకుల దాకా…. అంతటా, అన్ని విభాగాల్లో చాలామందే ఉపాధి పొందుతున్నారు. కేవలం ఒక్కరే వెలిగిపోవటం తగ్గింది. వ్యవస్థీకృతమైన ’అదృశ్య పట్టు’, గాడ్ ఫాదర్ లు బిగింపూ, దాదాపు సడలిపోయింది.

గతంలో అయితే సినిమా పంపిణీ వ్యవస్థ ఉండేది. ఆ మాయాజాలం ఎంతటి దంటే – ఒక విజయవంతమైన మంచి సినిమా, బాగా ఆడి డబ్బులు సంపాదించినా, సదరు నిర్మాతకి మాత్రం నష్టాలు మిగిలేవి, కాసుల పంట పంపిణీదారులకి పండేది. [ఉదాహరణకి అంజలీ దేవి నిర్మించిన భక్తతుకారాం సినిమా సూపర్ హిట్ అయినా, నిర్మాతగా అంజలీ దేవికి మాత్రం లాభాలు రాలేదు.] ఒకోసారి పరమచెత్త అశ్లీల సినిమా తీసిన నిర్మాత, అతడి సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడినా, అతడి నష్టాలు మాత్రం పంపిణీదారులకు కూడా పంచబడి సదరు నిర్మాత, తృటిలో ఆర్ధిక ప్రమాదాన్ని తప్పించుకోగలిగే వాడు.

కానీ ఇప్పుడా పరిస్థితి బాగానే మారింది. నాణ్యమైన, మానవీయ విలువలు గల కథలు, తార్కికమైన కథలు, వస్తున్నాయి. కళాత్మక విలువలు, నైతిక విలువలతో ’ప్రజంటేషన్’ ఉంటున్నాయి. సమాజపరంగా దొంగలు హీరోలుగా ఉన్న కథలూ వస్తుండవచ్చు గాక! అయినా గానీ దేశభక్తి కూడా కొంత సినిమా జనాలకి గుర్తుకు వచ్చింది.

మీరు గమనించి చూడండి. 1992 తర్వాత ఒక ’ఎరా’లో, ప్రతీ సినిమాలో కనీసం ఒక జెండాపాట లేదా సీను ఉండటం సక్సెస్ ఫార్ములాగా గుర్తింపబడింది. ప్రభాస్ [రాఘవేంద్ర], మహేష్ బాబు [బాబీ], పవన కళ్యాణ్ [ఖుషి] సినిమాలు గట్రా గట్రాలన్న మాట! ఖడ్గం వంటి పాక్ పన్నాగాలు చూపిన సినిమాలు, లగాన్ లు, రంగ్ దే బసంతులు కూడా తర్వాతవే. అసలు ఏ హీరీ అయినా 1992 కు ముందర ఒక సంవత్సరం, 1 ½ సంవత్సరంల కాలయాపనతో ఒకో సినిమాని నిర్మించి, విడుదల చేయబడటాన్ని ఊహించగలిగారా? అప్పట్లో వాసి లేని రాసితో కుప్పల కొద్దీ సినిమాలు జనాల నెత్తిమీద గుమ్మరించిబడేవి.

అదే ఇప్పుడో? పేరున్న ప్రతీ కథానాయకుడూ చచ్చినట్లుగా మంచి కథ, కథనం, కళాత్మక, సాంకేతిక విలువలు గల సినిమా కోసం, వీలైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. లేకుంటే ఏముంది? ప్లాప్ రిస్కు ఎదురుగా కూర్చొంటుంది. ఎందుకంటే క్రికెట్ లోని మ్యాచ్ ఫిక్సింగుల్లాగా సినిమా సక్సెస్ లు స్టాంపు వేసే అవకాశాలు చాలా వరకూ మాసిపోయాయి గనుక. గూఢచార యుద్ధం, మెదళ్ళతో యుద్ధంలోని పరిణామ క్రమం ఇది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

ఇప్పటికీ ఉన్నారు కదండీ కథతోనూ నటనతోనూ సంబంధం లేకుండా బూతుకూతలమీదే చాలావఱకూ సినీమా నడిపించేసే నటతేజోరూపాల్లాంటివారూ అలాంటి రూపాలమీద కూడా బుఱదజల్లి మురిసిపోయే పాపాలూనూ!

రాఘవ గారు,

సమూలంగా మార్పు వచ్చిందని నేను చెప్పటం లేదండి. నెనర్లు!

పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు - ఘంటసాల . ఈ పాట కులదైవం (1960) చిత్రంలోనిది.
దర్శకత్వం: జి. కబీర్‌దాస్
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: జగ్గయ్య, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణకుమారి,చలం, గిరిజ

సిబిరావు గారు,

పొరపాటు సవరించినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu