’ధర్మో రక్షతి రక్షితః’ అంటారు పెద్దలు. ’ధర్మాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది’ అని దాని అర్ధం.
అయితే…. ‘ధర్మం, నీతి, న్యాయం, ఇలాంటి మాటలు బ్రతక చేతగాని వాడు చెబుతాడనీ’, ‘నీతి ధర్మం గట్రా మాటలు వినడానికి మాత్రమే బాగుంటాయి. అవి ఆచరించిన వాడు మట్టిగొట్టుకుపోతాడని’…. ఇలాంటి భావాలు సినిమాలు, మీడియా చెప్పగా….. యదార్ధంలో కూడా నీతి, ధర్మం అన్నవాడు ’పాపం మంచి వాడు’ అని అందరి చేత జాలిగా అన్పించుకుని, ఆర్ధికంగా అణగారిపోయాడు. నీతి ధర్మం మరచినవాడు బ్రతకనేర్చినవాడై డబ్బు సంపాదించగలిగాడు. ఇప్పుడు ఈ స్థితి Extreme అంటే ఉగ్ర స్థితికి వచ్చింది. [ఇప్పటికి ఇదే ఉగ్రస్థితి అనుకుంటున్నాను] ఇదలా ఉంచండి.

గణిత శాస్త్రంలో ప్రవచనాలు [Statements] లో చెప్పినట్లు ‘ధర్మాన్ని రక్షించు అది నిన్ను రక్షిస్తుంది’ కి విపర్యయం [Negation Statement] చెబితే ‘ధర్మాన్ని రక్షించకపోతే అది నిన్ను రక్షించదు’.

ఇప్పుడు మన సమాజంలో ఉన్న స్థితి ఇదే! వరదలొచ్చినప్పుడు గానీ, కరువొచ్చినప్పుడుగానీ, వంతెనలు కూలినప్పుడు గానీ…. మరే సందర్భంలో గానీ….70 MM లో కనిపిస్తోంది ఇదే! మచ్చుకి రెండోది.

మొన్న కర్నూలు నగరాన్ని వరద ముంచెత్తింది. వరదలో చిక్కుకుపోయిన జనాన్ని కాపాడటానికి ప్రభుత్వశాఖలు [రెవిన్యూ, పోలీసు ఇత్యాది] అవసరమైనంత ముందుకు రాకపోయినా, డింగీలు, తెప్పలూ, ట్యూబులూ పట్టుకుని కొందరు ’ప్రైవేట్ వ్యక్తులు’ వచ్చారు. సురక్షిత ప్రాంతానికి తరలించటానికి కుటుంబానికి పదివేలు, వ్యక్తికి ఇన్ని వేలు అంటూ వసూలు చేశారు. ’ఎంత ఘోరకలి?’ – అంటూ బాధితులు ఆక్రోశిస్తున్నారు. మీడియా కూడా అంగలారుస్తోంది.

ఇక్కడో విషయం గమనించాలి. బాధితులలో ఎగువ లేదా మధ్యతరగతి వారూ ఉన్నారు. పేదలూ ఉన్నారు. ధనికులూ ఉన్నారు. అయితే ధనికులవి బహుళ అంతస్థులున్న భవనాలు గనుక అంతగా బాధలేదు. ఇక పేదలుకూ ఇలాంటి కడగండ్లు అలవాటే గనుక ఈదుకుంటూనో, ఏడ్చుకుంటూనో పోయారు. మిగిలిన ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి బాధితులు…. బుట్టిలతో, డింగీలతో, తెప్పలతో లేదా వరదనీటిలో ఈదుతూ, ప్రాణాలు కాపాడగలిగిన వారి చేతుల్లో Exploit అయ్యారు. అయితే ఈ బుట్టీలూ, డింగీలు, తెప్పలూ తీసుకుని, బరిలో దిగిన వారు కార్పోరేట్ కంపెనీల వారు కారు. [భవిష్యత్తులో ఇలాంటి వరదలు మరిన్ని సంభవించి, డబ్బులు బాగా వస్తాయంటే, అప్పుడు అతివేగంగా కార్పోరేట్ కంపెనీలు వచ్చొస్తాయిలెండి. అప్పుడు భీమా కంపెనీల దగ్గర నుండీ అన్నీ ఇబ్బడిముబ్బడి! ఇప్పటికి అభివృద్ధి చెందిన దేశాల్లో చూసిందే గదా ఇది?] బుట్టీల, డింగీ, తెప్పల నిర్వాహకులు పేదవాళ్ళే! ‘Every dog will get its own day ’ అని ఆధునికులు చెప్పుకున్న సామెత ప్రకారం, ప్రతీకుక్కకీ ఓ రోజు వస్తుంది కదా! అలాగే ఈ ’బుట్టితో చేపలు పట్టుకు బ్రతికే పేదవాడికీ’ ఈ రోజు వచ్చింది.

ఇప్పటి వరకూ వారికి, తమున్న నిస్సహాయస్థితిలో తాము Exploit అవటం బాగానే తెలుసు!
రోగం వచ్చి వైద్యుడి దగ్గరికెళ్తే [ఆరోగ్యశ్రీలు కొందరికే ఉన్నాయి. అదీ కొన్ని రోగాలకే వర్తిస్తుంది.] సూది మందుకో, మందుబిళ్ళకో తగ్గేదానికి వందలూ వేలూ ఊడతాయి. ఒకోసారి వ్యవహారం ఆపరేషన్ల దాకా పోతుంది.

ఏదైనా గలాటానో, గొడవో జరిగి, పోలీసు స్టేషన్ కెళ్తే, కేసు పెట్టిన వాడికీ, పెట్టించుకున్న వాడికీ కూడా బాగా డబ్బు వదులు తుంది. ఆపైన లాయర్ దాకా వెళ్ళాల్సి వస్తే ఇక చెప్పనక్కర లేదు.

తమ లాగే తమ పిల్లలూ ఇదే బ్రతుకు బ్రతకకూడదని, బాగా చదివించుకుందామన్న ఆశకొద్దీ, మంచి బడిదాకా వెళ్తే, ఫీజులూ, పుస్తకాలు, యూనిఫారాలూ, బూట్లూ…. తొక్కాతోలు అంటూ వేలూ, పదుల వేలూ అవుతాయి. ’బాబూ! పేదవాణ్ణి. కాస్త చూడండి!’ అంటే ’అలాంటప్పుడు నీకు తగిన స్కూలు కెళ్ళాల్సింది. ఇక్కడి దాకా ఎందుకొచ్చావ్?’ అన్న తిరస్కారాలే తెలుసు వాళ్ళకి.

పట్టిన చేపలనో, పెంచుకున్న మేకనో, గొర్రెనో అమ్మబోతే, దళారులూ దగా చేసేదే! అంతా కలిసి కట్టుగా మరీ దోచేస్తారు. అచ్చం మార్కెట్టు యార్డులో మార్కెటింగ్ శాఖ అధికారులూ, వ్యాపారులు, కమీషన్ ఏజంట్లూ కలగలసి, కుమ్మక్కుగా రైతుని దోచినట్లే!

పప్పు, బియ్యం, చింతపండు కొందామని కొట్టుకెళ్ళినా ఇదే స్థితి. ’ఇంతకంటే తక్కువ ధరా కావాలంటే నెం.2 సరుకు కొనుక్కో. దుడ్డుబియ్యం కొనుక్కో. అయినా ప్రభుత్వం మీద రెండ్రూపాయలకే కిలో బియ్యం ఇస్తోందిగా. మళ్ళీ సన్నబియ్యం షోకులెందుకు? సన్నబియ్యం కావాలంటే ఇంతే రేటుమరి’ అన్న దబాయింపులే తెలుసు!

రోగానికో, పెళ్ళికో, చావుకో, అవసరమై అప్పుకోసం వెళ్ళినా….. లేక రిక్షానో, డింగీనో కొనుక్కోవటానికి అప్పుకోసం వెళ్ళినా, రిటైర్డ్ ఉద్యోగి దగ్గరి నుండీ చిన్న వ్యాపారి దాకా, రోజువారీ వడ్డికి అప్పులిస్తారు. ఈ పేదవాడు దీర్ఘకాలం కష్టపడినా, వడ్డీ తీరుతుంది గానీ అసలుతీరదు. బ్యాంకుకి వెళ్ళినా అంతగా ప్రయోజనం ఉండదు. వెరసి వడ్డీల వలలో గిలగిలా తన్నుకునే చేపలే తెలుసు.

కుల, నివాస, జనన లేదా మరణ ధృవీకరణ పత్రమో, తెల్లకార్డో మరొకటో అవసరమై, తసీల్ధారు ఆఫీసుకో, మరో ప్రభుత్వ కార్యాలయానికో వెళ్తే, డబ్బు బయటికు తీయనిదే తమకు అవసరమైన పని కాదు.

వెరసి వాళ్ళకి ఎటుపోయినా, ’ఎదుటివారి అవసరాన్ని Exploit చేయవచ్చన్నదే’ తెలిసింది. ఎలా సంపాదిస్తేనేం, సంపాదించిన వాడు ఈరోజు మేడల్లోనూ, అపార్ట్ మెంట్లలోనూ ఉన్నాడు. వాళ్ళే శ్రేష్టులుగా సమాజంలో గుర్తింపబడుతున్నారు. ఉన్నతోద్యోగులే కాదు, చిరుద్యోగులైనా, ప్రభుతోద్యోగులైతే సంపాదనకు ఢోకా లేదు. కార్పోరేటు వ్యాపారులే కాదు, సామాన్య వ్యాపారులూ తమకంటే చాలా చాలా మెరుగు. ఇక రాజకీయ నాయకులతో అయితే ఈ జన్మకి కాదు కదా, మరో జన్మలోనూ పోల్చుకోలేరు.

కాబట్టి ఈ డింగీ, బుట్టి, తెప్పల నిర్వాహకుల, ఈతగాళ్ళ దృష్టిలో, తమకంటే డబ్బున్న వాళ్ళంతా శ్రేష్టులే. కాబట్టి ఆ శ్రేష్టులంతా ఆచరించే దాన్నే వాళ్ళూ ఆచరించారు.

కాబట్టి ప్రాణాలు కాపాడటానికి తలకు ఇన్ని వేలు అని ముక్కుపిండి వసూలు చేసుకున్నారు. అవసరాల మీద వ్యాపారాలు చేయటం, ఎవరికి అవకాశం దొరికిన చోట వాళ్ళు డబ్బు దండుకోవటం, ఎందరో చేస్తే తప్పులేదు గానీ, ఇప్పుడు ఈ ’తెప్ప నిర్వాహకులు’ చేస్తే మాత్రం ’దారుణం, అమానుషం, మృత్యువ్యాపారం’ అయిపోయిందా? లేక మృత్యువ్యాపారం చేయటానికి పేటంటు, కేవలం రాజకీయనాయకులకీ, కార్పోరేటు ఆసుపత్రులకీ, కార్పోరేటు కంపెనీలకి, బడా కాంట్రాక్టర్లకీ వడ్డీ వ్యాపారం చేసే వారికీ, మీడియాకీ మాత్రమే ఉందా?

“అయ్యో వీడు పేదవాడు. వీడి మీద concern చూపదాం” అని ఎవరూ అనటం లేదు. “వీడు మనతోటివాడు. అవసరంలో ఉన్నాడు. ఆదుకుందాం” అని ఎవరూ తమప్రక్క వాడి గురించి అనుకోవటం లేదు. కనీసం ప్రక్కవాడికి సాయం చేయకపోయినా, తమ విధిని తాము సరిగా నిజాయితీగా చేసిన చాలు!

నేను పేదవాళ్ళంతా మంచికీ, నిజాయితీకి నిలువెత్తు రూపాలని అనటం లేదు. అలాగే [వరద] బాధితులంతా చెడ్డవారనీ, అవినీతి పరులనీ అనటం లేదు. సామాజికంగా, ఆర్ధికంగా, ఏ స్థాయిలోని వారైనా, అవకాశం వస్తే, డబ్బుకి తప్ప మానవీయ విలువలకి విలువనివ్వకపోవటమే అత్యధికుల్లో ఉందనీ, ఆ కోణంలో దర్శిస్తే నేటి సమాజం ప్రమాదపుటంచునా, పతనపు పాకుడు మెట్ల మీదా ఉందని చెప్పటమే నా ఉద్దేశం. ముంచెత్తే వరదల కంటే, కరువు కాటకాల కంటే నిజమైన ప్రమాదం ఇది!

నిజం చెప్పాలంటే – ప్రతీ మనిషిలోనూ, మంచీ చెడూ, రెండు గుణాలూ ఉంటాయి. గీతలోని దైవాసుర సంపద్విభాగ యోగం మనకి ఇదే చెబుతోంది. ప్రతీ మనిషి, సాధనతో, తనలోని అసుర లక్షణాలని అతిక్రమించి, దైవీ గుణాలని అభివృద్ది చేసుకుని, ఆత్మోన్నతి సాధించాలని భగవద్గీత, ఉపనిషత్తులు, భారతీయ ఇతిహాసాలు చెబుతాయి. అదంతా ట్రాష్ అనీ, పుక్కుట పురాణాలనీ వాటిని గాలికి వదిలేసి, దమ్మిడీల వెంట, అవధుల్లేని పరుగులు తీస్తే, పరిస్థితి ఇక్కడికే వస్తుంది.

చివరగా ఒకమాట. ఎం.బి.ఏ. లో తొలిపాఠం చెప్పేటప్పుడు ’పిల్లవాడు తన ఏడుపును అమ్ముకుని తల్లిపాలనీ కొనుక్కుంటాడు ’ అని, మానవసంబంధాలను కూడా వ్యాపారంలోకి తర్జుమా చేసి చెప్తున్నారు. ఇదే సరైనదని అంతర్జాతీయంగా అందరూ ఒప్పుకుని, ఆ వ్యాపారవిధానాన్నే ప్రోత్సహిస్తున్నారు. అది సరైనదే అయినప్పుడు, ఈ మృత్యువ్యాపారం కూడా సరైనదే అని మనం ఒప్పుకోవాలి. ఇది పేదవాడు చేసాడు కాబట్టి దారుణం, అమానుషం, కార్పోరేట్లు చేస్తే వ్యాపారనైపుణ్యమా?

ఈ విధంగా సమాజంలో, మనిషిగా మన ధర్మాన్ని మనం రక్షించలేదు. అందుకే అది మనల్ని రక్షించటం లేదు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

10 comments:

బాగా వ్రాశారు.

నిజ౦ చెప్పారు.

మన సమాజ౦ ప్రమాదపు అ౦చునే వు౦ది.
ప్రాచీన భారతీయ మానవత్వపు విలువలను ధ్వ౦స౦ చేసి సరికొత్త వ్యాపార(స్వార్థ) సామ్రాజ్యాన్ని స్థాపి౦చి వారు విజయ౦ సాధి౦చారు. ఇప్పుడు అ౦దరూ ఆ తాను ముక్కలే. సమూహ ప్రయోజన౦ క౦టే వ్యక్తిగత ఆకా౦క్షలకే ప్రాధాన్య౦ పెరిగిన ప్రస్తుత పరిస్థితిని ఆస్వాది౦చవలసి౦దే.

బాగా చెప్పారు.

బాగా చెప్పారు.తెప్ప నిర్వాహకులు చేస్తే పరవాలేదు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారు డబ్బు డిమాండ్ చేయడమే బాగాలేదు.

అవున కదా
మనకు ఎదుటివాని లోని తప్పులెన్నటం తప్ప మన తప్పు తెలుసుకునే గుణం పోయినదని పిస్తున్నది . మరలా వేమన శతకం నుంచి చదువుకోవాలేమో . బాగా చెప్పారు

చావా కిరణ్ గారు, తాడేపల్లి గారు, అజ్ఞాత గారు, దుర్గేశ్వర గారు,

వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు
***
చిలమకూరి విజయమోహన్ గారు,

ప్రభుత్వ ఉద్యోగుల గురించి మరోసారి చర్చిద్దామండి!నెనర్లు!

స్వయంకృతాపరాధమంటే ఇదేనండీ!

ఐనా జిల్లాల కలెక్టర్ల వంటి పై అధికారులు ఈ ప్రభుత్వోద్యోగుల అవినీతిని అఱికట్టడానికి ఏమీ చెయ్యలేరాండీ? లేదా చెయ్యగలిగీ ఊరకుంటారా? ఊరకుండవలసివస్తుందా? ఏమిటో?! అంతా విష్ణుమాయ!!!

రాఘవ గారు,

విష్ణుమాయ కాదండి. అవినీతి మాయ!

చాలా బాగా చెప్పేరు... అవును పేదవాడు చేస్తే అంటారు ఎందుకంటే వాళ్ళు దానిని అందమైన రంగు రంగు వులిపిరి కాయితాల ప్యాకేజ్ లో ఇవ్వటం లేదు కదా.. నాకైతే చాలా సార్లు అస్సలు చైనా లో కమ్యునిజం లా రావాలి అనిపిస్తుంది ఈ గోల అంతా చూస్తే... కాని నా చైనా స్నేహితురాలు వద్దు కలలో కూడా అలాంటి జీవితం కోరుకోకు.. సామాన్యుడి జీవితం ఒక పీడ కల అక్కడ అంటుంది.. అదీ నిజమేనేమో లే అందుకే నాకు రాజకీయ స్పృహ లేదని అన్నా ఇంతకు ముందు కామెంట్ లో.. నిజమే గమనిస్తే అర్ధం అవుతుంది అయ్యి ఏమి చేస్తాము మళ్ళీ నా మాట, నా వోటు, నా తెలివి అంతా నా కులానికో, ధనానికో మతానికో అమ్ముడు పోతుంటే..... మనమంతా స్వార్ధపరులము చిన్నమ్మ మన కు ఇంకా ఇంకా కావాలి చంద్రహారముంటే ఇంకో కాసులపేరు 10 ఎకరాలుంటే వాటిని తవ్వి చేపల చెరువేసి కోటీశ్వరుడినైపోవాలి.. త్రుప్తి లేదు ఎక్కడా, కాని నా ఇంట్లో పని చేసే అమ్మయి కి మాత్రం ఇంకో 100rs ఇవ్వలంటే అమ్మో దోపిడీ తనం గుర్తొస్తుంది మనం మాత్రం కళాంజలి కి వెళ్ళి చీర కొనుక్కోక పోతే ఎలా ధనికులతో సమాన స్తాయి లో వుండము గా..

భావన గారు,

చైనా గురించి మీ స్నేహితురాలు చెప్పింది నిజమే నండి! అవినీతి, నేతల స్వార్ధం విషయంలో చైనా మనకంటే చాలాముందుంది.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu