చూస్తుండగానే ఎంసెట్ – 2000 ఫలితాలొచ్చాయి. అప్పటికే మా దగ్గర మరుసంవత్సరం ఎంసెట్ కోచింగ్ కి కొందరు విద్యార్ధులు join అయ్యారు. వాళ్ళల్లో ఎక్కువమంది నాకు పూర్వమే తెలిసిన జూనియర్ ఇంటర్ విద్యార్ధులే. అందరం ఎంతో ఆతృతగా ఫలితాలు చూశాము. మా విద్యార్ధుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా ర్యాంకు రాలేదు. మెడిసిన్ కు శిక్షణ తీసుకున్న రమాదేవి కి 5000+ ర్యాంకు వచ్చింది. మేమంతా, ఆ అమ్మాయి కనీసం 1500 లోపు ర్యాంకు సాధిస్తుందని ఆశతో ఉన్నాము. ఎంసెట్ 2000 వ్రాసి వచ్చాక ఆ పిల్ల ముఖంలో కనబడిన ఆత్మవిశ్వాసం, వెలుగు మాకు ఆ ఆశనిచ్చింది. 163+ వస్తాయని తను అనుకుంటున్నట్లు ఆ పిల్ల చెప్పింది. ఎంసెట్ కీ విడుదల తర్వాత, ముందుగా ఆ అమ్మాయి ఙ్ఞాపకశక్తితో చెప్పిన ప్రశ్నా జవాబుల్ని పోల్చి చూసుకొని కూడా 163+ జవాబులు సరిగా గుర్తించినట్లు నిర్ధారించుకున్నాము. ఇటు ఈ అమ్మాయికీ ర్యాంకు రాలేదు. అటు ఇంజనీరింగ్ పిల్లలకైతే 30,000 లోపు ర్యాంకు రాలేదు. ముందటి సంవత్సరంలో లాగా 126 ర్యాంకు ఆశించకపోయినా 5000 లకు దగ్గర ర్యాంకులు ఊహిస్తున్నాము. అప్పటికి ఇన్ని ఇంజనీరింగ్ సీట్లు లేవు. ‘30,000’ లోపే ఉండేవి. పిల్లలెంత కష్టపడ్డారు, వాళ్ళ సామర్ధ్యం ఎంత, మేమేంత కష్టపడ్డామో, దాన్ని బట్టి మేం వేసుకున్న అంచనాలన్నీ తల్లక్రిందులైనాయి.

రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి. ‘మనం అనుకున్నామేమో విద్యార్ధులు బాగా చదివారని. కానీ పోటీ పడలేకపోయారేమో’ అని కాస్సేపు అలోచించాము. కానీ మేం నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో మార్కులు, వారి పరిశ్రమ మా కళ్ళెదుటే ఉంది. ‘అన్నీ సబ్జెక్టులూ మనమే చెప్పాము. అందుకే ఇలా అయ్యిందా’ అని కాస్సేపు ఆలోచించాము. కానీ మా [విద్యార్ధులది, మాదీ కూడా] పరిశ్రమని తక్కువగా అనుకోలేక పోయాము. నాకున్న అనుభవం, అవగాహనకి కూడా జరిగింది నమ్మశక్యం కాలేదు. మరోవైపు చూస్తే రమాదేవి బాగా నిరాశా నిస్పృహలకి గురయ్యింది. “ఏ పేపర్ ఇచ్చిన చేయగలుగుతున్నప్పుడు, ఇంతకంటే కష్టపడటానికి ఇంకేముంది మేడం!” అంది. ఆ పిల్ల నిరాశ చూస్తే జాలి, బాధ కలిగాయి. ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయం కూడా వేసింది. ఆ పిల్ల తండ్రి డాక్టరు ఆంజనేయులు కూడా ఏమీ అనలేకపోయాడు. కొంత ఆక్రోశంతో ఆ అమ్మాయి, ఆమె తండ్రి, నా దగ్గర చదువుకున్న ఇతర విద్యార్ధులు “త్రివేణి కాలేజీలో పిల్లలకి కనీసం OMR ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చాయి. వాళ్ళకి రెగ్యులర్ ఇంటర్ సిలబస్ కూడా సరిగా పూర్తికాలేదు. అందునా ఎంసెట్ క్లాసులు వారంలో ఒక్క అదివారం 3 గంటలు మాత్రమే బోధించారు, మెటిరియల్ కూడా లేదు. అయినా ఎంసెట్ మెడిసిన్ ర్యాంకులూ, ఇంజనీరింగ్ ర్యాంకులూ కూడా వచ్చాయట” అన్న సందేహం వెలిబుచ్చారు. ఈ సమాచారం మాకు కొంత ఆశ్చర్యం కలిగించింది. “అబద్ధాలు చెప్పుకుంటున్నారేమో నమ్మా!” అన్నాము పిల్లలతో. వాళ్ళు ఆవి ప్రచారం కోసం చెప్పుకుంటున్న అబద్దాలు కావనీ, నిజంగానే త్రివేణి కాలేజీలో పిల్లలకి మంచిర్యాంకులు వచ్చాయనీ చెబుతూ, మేము నమ్మకపోవడం చేత ఆయా విద్యార్ధుల హాల్ టికెట్ నంబర్లు, వాళ్ళకొచ్చిన ర్యాంకులూ వ్రాసి తెచ్చారు. మర్నాడు త్రివేణి కాలేజీ వాళ్ళు జిల్లా ఎడిషన్ పేపరులో విద్యార్ధుల ఫోటోలతో సహా వారి హాల్ టికెట్ నంబర్లూ, ర్యాంకులూ ప్రకటించుకుంటూ వాణిజ్యప్రకటన వేసారు. ఆ విద్యార్ధుల వివరాలు చూడగానే నాకు కళ్ళు తిరిగినంత పనయ్యింది. మెడిసిన్ అమ్మాయికి రిజర్వేషన్ ఉంది, ఆఅమ్మాయికి 7000+ ర్యాంకు, ఇంజనీరింగ్ లో 2000+ నుండి ౩౦ సీట్లు వచ్చేటన్ని ర్యాంకులు వచ్చాయి. వాళ్ళ స్టాండర్డ్స్ నాకు తెలుసు. వారి శ్రమించగల సత్తా, తెలివితేటలు, ప్రశ్న చదివాక ఎంతసేపటికి వాళ్ళకి అర్ధమౌతుందో కూడా [reaction time] నాకు అంచనా ఉంది. దాంతో విపరీతమైన ఆశ్చర్యానికి గురయ్యాము నేనూ, నాభర్త కూడా! ప్రచారం కోసం అబద్ధాలు చెప్పుకోగలరమో ‘మా విద్యార్ధులకి చాలా ర్యాంకులు వచ్చాయని’. ధైర్యంగా పత్రికలో వాణిజ్యప్రకటన ఇచ్చుకోరు కదా! ముందటి సంవత్సరం వాళ్ళు కాలేజీకి ఒక్కటంటే ఒక్కర్యాంకూ రాలేదు.

అందుచేత గతంలో ఇంటర్ తమ కాలేజీలో చదివి, లాంగ్ టర్మ్ గుంటూరు, విజయవాడల్లో చదివి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్ధుల పేర్లతో కరపత్రాలు ప్రచురించి ప్రచారించుకున్నారు. అటువంటి నేపధ్యంలో ఈ సంవత్సరం ఇన్ని ర్యాంకులు రావటం అసాధారణంగా అన్పించింది. అప్పటికే ఇంటర్ పేపర్ లీకులు గురించి ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో, ఎంసెట్ ర్యాంకుల విషయంలోనూ ఏదో మోసం ఉందనిపించింది.

ఒకసారి అనుమానం వచ్చాక ఇక పరిశీలన మొదలు పెట్టాము. అంతకు ముందు రోజు విద్యార్ధుల పేర్లు, హాల్ టికెట్లు నంబర్లు, ర్యాంకులతో నలందా కాలేజీ వాళ్ళు రాష్ట్ర ఎడిషన్ లో పుల్ పేజీ వాణిజ్యప్రకటన ఇచ్చుకున్నారు. అందులో వందలాది విద్యార్ధుల పేర్లలో త్రివేణి విద్యార్ధుల పేర్లు ఉన్నాయి. నిజానికి త్రివేణి కాలేజీ విద్యార్ధులు నలందాలో షార్ట్ టర్మ్ కెళ్ళారు గానీ, పట్టుమని వారంరోజులు కూడా అక్కడ with stand కాలేక, వెనుదిరిగి వచ్చేసారు.

అంతేగాక, సూర్యాపేటలో స్థానికంగా త్రివేణి యాజమాన్యం గణనీయమైన మొత్తంలో డబ్బుని ఋణాలరూపేణా సేకరించిందన్న వార్తలు ఊర్లో గుప్పుమన్నాయి. ఈ వివరాలన్నీటితో మాకు ఎంసెట్ ర్యాంకుల విషయంలోనూ మోసం జరిగిందన్న అనుమానం బలపడింది. అయితే గతంలో అన్యాయల మీద ఫిర్యాదులు చేసి, జీవితంలో దెబ్బలు తిని ఉన్నాము. అందుచేత మనస్సు కొంత ముందు వెనకలాడింది. కానీ కళ్ళ ముందు, మాదగ్గర చదువుకున్న రమాదేవి, శర్మ, అజయ్, సురేష ల్లాంటి పిల్లల దీనవదనాలు కదలాడాయి. Week tests, Comprahensive test లు వ్రాసి, ఎక్కడ తప్పు చేశారో నేను కౌన్సిల్ చేయగా దిద్దుకుంటూ, నిరంతరం శ్రమిస్తూ, భవిష్యత్తు గురించి కలలు కంటూ, ఇంజనీర్లు అయితీరాలని ఆ పిల్లల పడిన కష్టం, మేం పడిన కష్టం, మమ్మల్ని నిలవనీయలేదు. రమాదేవి స్థానంలో నా కూతురే ఉంటే నేనేం చేసేదాన్ని అని ఆలోచించాను. కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగలు దోచుకుపోతే ఎంతో బాధ కలుగుతుంది. అది ద్రవ్యచౌర్యం. ఇది మేధో చౌర్యం. చదవని పిల్లలకి ర్యాంకులు వచ్చాయంటే, చదివి ఆయా ర్యాంకుల్లో ఉండవలసిన పిల్లల స్థానాలను దొంగిలించారనే కదా అర్ధం! శారీరక శ్రమతో సంపాదించిన డబ్బు దోచుకోబడటం కంటే కూడా మేధో శ్రమతో సంపాదించిన స్థానాన్ని దోచుకోవటం మరింత దారుణం. దాంతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడమే సరైనపని అని నిర్ణయించుకున్నాము.

అయితే ‘పాలతో మూతి కాలిన పిల్లి, మజ్జిగ ఊది తాగుతుందని’ సామెత. అది మనిషి మనస్తత్వం కూడానేమో. అందుకే మేము ఫిర్యాదుని రమాదేవి తండ్రి పేరిట వ్రాసాము. అదీ సూర్యపేట నుండి యాదగిరి గుట్ట వెళ్ళి, నరసింహస్వామి దర్శనం చేసుకొని, ఆ తర్వాత ఫిర్యాదు పంపాము. ఫిర్యాదు నకలును Fire Pot లో, Coups on World లో చూడవచ్చు. పోస్టల్ రసీదుల వివరాలు కూడా చూడవచ్చు.

ఫిర్యాదు పంపాక మేం ఆ విషయం ముందుగా ఎవరికీ చెప్పలేదు. మామూలుగా మా ట్యూషన్ సెంటర్ నడుపుకుంటున్నాము. అప్పటికి ఐఐటి బేసిక్స్ విద్యార్ధులు, ఎంసెట్ విద్యార్ధులు కొందరు join అవ్వటంతో క్లాసులు చెబుతున్నాము. స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు కూడా తీసుకుంటున్నాము. ఈసారి ఎంసెట్ విద్యార్ధుల ఫీజు గత సంవత్సరం కంటే రెట్టింపు చేసాము. లోకల్ కాలేజీ వాళ్ళ ఫీజుతో పోల్చుకుంటే మా ఎంసెట్ ట్యూషన్ ఫీజు రెట్టింపు. అయితే ఎంసెట్ ర్యాంకుల కుంభకోణం గురించి కూడా పరిశీలనా, విశ్లేషణా ఆపకుండా కొనసాగిస్తున్నాము.

ఈ నేపధ్యంలో నాకు వికాస్ లో, ఎక్సెల్ లో 1998 నాటి ఎంసెట్ రిజల్టు లో అప్పుడు నాకు అర్ధంకాని విషయాలు స్ఫురణకు వచ్చాయి. అప్పట్లో వికాస్ లో గాయత్రి అనే విద్యార్ధిని ఉండేది. ఆమెకు 1997 జూనియర్ ఇంటర్ లో స్టేట్ 2nd ర్యాంకు వచ్చింది. అయితే ఎంసెట్ 1998 లో మెడిసిన్ లో 1200+ ర్యాంకు వచ్చింది. ఆమెకు రిజర్వేషన్ ఉండటంతో గుంటూరు మెడికల్ కాలేజీలోనే సీటు వచ్చింది. ‘బహుశ ఇంటర్ రెగ్యులర్ సిలబస్ లో ఆ అమ్మాయి ప్రతిభ చూపి ఉండచ్చు, ఎంసెట్ విషయంలో వత్తిడిపడి ఉండొచ్చు, లేక మల్టిపుల్ ఛాయిస్ కనుక సరిగా జవాబులు వ్రాయాలేక పోయి ఉండొచ్చు’ అని అప్పట్లో అనుకున్నాను. ఎక్సెల్ లో కూడా సుబ్రమణ్యం అని ఓ విద్యార్ధి ఉండేవాడు. చాలా చురుకైన, తెలివైన పిల్లవాడు. ఇంటర్ రెగ్యులర్ లో స్టేట్ ర్యాంకర్. అతనికీ ఎంసెట్ లో 700+ ర్యాంకు మాత్రమే వచ్చింది. అయితే ఎక్సెల్ లో ఓ డైరక్టర్ కి దగ్గరివాడైన రాజేష్ అనే విద్యార్ధికి స్టేట్ 10th ర్యాంకు అదీ మెడిసిన్ లో వచ్చింది. మాకు తెలిసి [అంటే లెక్చరర్స్ కి] రాజేష్ కి చురుకైన విద్యార్ధి అనో, తెలివైన విద్యార్ధి అనో గుర్తింపు లేదు. అప్పట్లో పెద్దగా పట్టించుకొని ఇలాంటి విషయాలని, 2000 – ఎంసెట్ ఫలితాల తర్వాత పత్రికల్లో ప్రచురింపబడుతున్న కార్పోరేట్ కాలేజీల వాణిజ్యప్రకటనలనీ, విద్యారంగంలో పోటీరీత్యా కార్పోరేట్ కాలేజీల మధ్య నడుస్తున్న పరస్పర ఆరోపణలనీ, విద్యారంగంలో బయటపడిన ఇతర కుంభకోణాల తాలుకూ వార్తల్ని, వేటినీ వదలకుండా పరిశీలించటం, విశ్లేషించటం చేస్తుండేవాళ్ళం నేను, నాభర్తా. ఆ నేపధ్యంలో సి.పి.యం. నాయకుడు బివి రాఘవులు విద్యారంగంలో ఇంటర్ మార్కుల కుంభకోణాల గురించి ప్రకటన చేశాడు. ఇలాంటి వాటినన్నిటినీ పరిశీలించే వాళ్ళం. స్థానికంగా మా విద్యార్ధుల తల్లితండ్రులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతరులు చెప్పే ప్రతిసమాచారాన్ని సేకరించాము.

నిజానికి కార్పోరేట్ విద్యారంగంలో అవినీతి, రాజకీయ రంగంలోని అవినీతికి మరో పార్శ్వం వంటింది. పరిమాణంలో రాజకీయ అవినీతి పెద్దది కావచ్చుగానీ, ప్రమాదంలో విద్యారంగంలోని అవినీతే పెద్దది.

విద్యారంగంలోని అవినీతి 10th , ఇంటర్ పేపర్ల లీకుల్లోనే కాదు, ఎంసెట్, బి.ఎడ్. వంటి పోటీపరీక్షల ర్యాంకుల్లోనూ కూడా రెండురకాలు. క్లాస్, మాస్ మోసాలన్న మాట. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ వంటి ‘A’ సెంటర్లలో జరిగేవి class dispute అయితే సూర్యాపేట వంటి ‘B’ సెంటర్లలో జరిగేవి Mass disputes. నాకు తెలిసి దేశవ్యాప్తంగా [ఐఐటి తప్ప] దాదాపు అన్ని పోటీపరీక్షలు లీకుల ఆరోపణలు ఎదుర్కొన్నాయి లేదా మళ్ళీ పరీక్షలు జరిగాయి.

ఈ విషయంలో కళాశాలల స్ట్రాటజీ చాలా పకడ్పందీగా ఉంటుంది. కార్పోరేట్ కాలేజీలకి దాదాపు ప్రతీ ప్రాంతంలోనూ PRO లు ఉంటారు. సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో అక్కడి గవర్నమెంట్ టీచర్లలో కొందరు కార్పోరేట్ కాలేజీలకి PRO లాగా పనిచేసేవారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఇతరులు ఉంటారు. వీరు తమ పనులు తాము చూసుకుంటూనే అదనపు ఆదాయ వనరుగా ఈ పని చేస్తారు. అందుకోసం వాళ్ళు ఆ విద్యాసంవత్సరంలో ఎంతమంది విద్యార్ధులు 10th పాస్ అయి కాలేజీలకి వస్తారు, వారిలో ఎందరు ఏ ఆర్ధికస్థాయిలో ఉన్నారు లాంటి వివరాలు సేకరిస్తారు. అంటే 10th పాసయిన విద్యార్ధుల్లో ఎందరు కార్పోరేట్ కాలేజీలకి వెళ్ళగలిగేవారు, ఎందరు ‘B’ సెంటర్లలో చదివేస్తోమత మాత్రమే కలిగి ఉన్నారు, ఎందరు స్కాలర్ షిప్పులతో చదువుకొనసాగిస్తారు, ఎందరు ఆర్ట్స్ లాంటి సబ్జెక్టులలోకి వెళ్తారు, ఇలాంటి గణాంక వివరాలు కూడా ఈ PROల దగ్గర ఉంటాయి. ఆ అంచనాల ప్రకారం తమకు అందుబాటులో ఉన్న విద్యార్ధులని ప్రోత్సహించి ఆయా ‘A’ కేంద్రాల్లో ఉన్న కార్పోరేట్ కాలేజీలకి వెళ్ళేటట్లు చూస్తారు. ఎవరి ప్రయత్నాన్ని బట్టి వారు పిల్లల్ని తమకు అనుకూలమైన [అంటే తమకి అడ్మిషన్ కీ ఇంత అని కమీషన్ ఇచ్చే] కాలేజీలకి విద్యార్ధుల్ని పోగేసి పంపిస్తారు. ఇలా చాలా మందిని కార్పోరేట్ కాలేజీలకి పంపడానికి ఆయాస్కూళ్ళ యాజమాన్యాలు పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్ లూ, పేపర్లు దిద్దే సెంటర్లు తమకి అనుకూలంగా వేయించుకోవటం, మార్కులు అదనంగా వచ్చేటట్లు పేపర్లదిద్దే సెంటర్లని మేనేజ్ చెయ్యటాలు గట్రా గట్రాలు చాలా చేస్తారు. ఆవి స్కూళ్ళమధ్య పోటీ ఎక్కువయినప్పుడు పొక్కి బయటకు వచ్చిన సందర్భాలు చాలానే పేపర్లలో చూశాం. విద్యార్ధుల్ని సేకరించడానికే కార్పోరేట్ కళాశాలలు వేసవి సెలవుల్లోనే టాలెంట్ టెస్టులు పేరిట ‘B’ సెంటర్లలో, చిన్న పట్టణాలలో కాంపెయిన్లు నిర్వహిస్తారు. అలాంటి సమయాల్లో కార్పోరేట్ కాలేజీలు ఆ పిల్లల standard ఎంత అన్నది చూసుకోవటానికి అడ్మిషన్ల టెస్ట్ నిర్వహిస్తారు. ఆవిద్యార్ధికి 10th లో వచ్చిన మార్కుల మీద నమ్మకము లేకపోవటం, తమ స్టాండర్డ్స్ అందుకోగలడో లేడో అని తెలియటం కోసం, ఒకే స్టాండర్డ్స్ ఉన్న విద్యార్ధులని ఒకేసెక్షన్ లో వేస్తే క్లాసు స్మూత్ గా నడుస్తుందని కూడా ఈ అడ్మిషన్ల టెస్ట్ లు పెడతారు. అలాంటి సమయాల్లోనే తమ PRO లతో ఈ deals అన్నీ చూసుకుంటారన్న మాట. 10th లో 500+ మార్కులు వస్తే ఇంతశాతం ఫీజు రాయితీ ఇస్తామని లేదా ఉచిత విద్య అందిస్తామని గట్రా హామీలతో ప్రచారం చేసి టాలెంట్ టెస్టులు పెడతారు. అలాంటి వాటిలో ఉత్తీర్ణులై ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్ధులకి తర్వాత ఏదో పేరుతో ఫీజులు వడ్డించారనీ, డబ్బులు వసూలు చేసారనీ కొన్ని వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఆ విధంగా ఇంటర్ విద్యార్ధుల్నీ సమకూర్చుకుంటారు. ఇక తమ ఎంసెట్ లో రిజల్ట్స్ చూసి ఎగబడే జనం ఎటూ ఉంటారు కదా!

ఇక ఈప్రకరణం తర్వాత ఎంసెట్ ప్రకరణం ఉంటుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

5 comments:

lakshmi garu mee prathi post chala vivaranga explain chesthunnru..annni kastalanu edurkoni nilabaddaru ante chala great andi..chinna doubt andi ee m-cet exam lo ippatiki ilage jaruguthunnaya andi emina change ainda andi..aruna

మీరడిగిన సందేహాలకు సమాధానాలు తదుపరి టపాలలో వివరిస్తాను.

well explained!

రెగ్యులర్ బ్లాగర్ ని కాకపోవటం వల్ల అమ్మ ఒడి అంటే ఏదో మాతృత్వానికి సంబందించిన బ్లాగ్ అనుకునే వాడిని. కానీ ఈ రోజు మీ బ్లాగ్ చూసాకే అర్ధం అయ్యింది. ఇన్ని రోజులూ చూసిన బ్లాగ్ ఒక ఎత్తు ఇది ఒక్కటి ఒకెత్తు అని.

మీ జీవిత అనుభవాల్ని రంగరించి రాస్తున్న ఈ బ్లాగ్ ఎంత మందికో మార్గదర్శి లా ఉంది. ఇంకా మీ అన్ని పోస్ట్ లూ చదవలేదు. అన్ని బ్లాగ్స్ లా హడావిడిగా చదివేసి మరచిపోయేది కాదు ఇది. మీ పోస్ట్ లు అన్నీ చదివి నా కామెంట్స్ వివరం గా పంపటానికి ట్రై చేస్తాను.

విద్యారంగం లో ఎన్నో అవక తవకలు ఉన్నాయని చదవటమే కానీ వాటికీ బలి అయిన ప్రత్యక్ష సాక్షిని మీ రూపం లో ఇక్కడే చూసాను. దీని తరువాత రాబోయే పోస్ట్ లో ఇంకెన్ని అనుభవాలు వివరించారో చూడాలి.

మీవి అనుమాలే కాదు, అవి నిజాలు కూడా, EAMCET పేపర్ అవుట్ చేయడం (limit గా, selected students కు), వాళ్లకు ర్యాంక్ లు తెప్పించటం ఎంతో కాలం నుండి (నాకు తెలిసి కనీసం 1980 ల నుండి) జరుగుతుందే. దాని సాక్ష్యం 10th class, Intermediate లలో 2n class వచ్చి EMACET ranks సాధించిన చాలా మంది (ముక్యం గా వాళ్లు Doctors లేక కొంచం connections వున్న వాళ్ల పిల్లలు అయ్యి ఉంటారు) నాకు తెలుసు. మా కుటుంబం కూడా కొంత కాలం residential colleges నడపింది కాబట్టి internal విషయాలు బాగా తెలుసు. చీరాల ప్రాంతం (ఇది ఒక ఉదాహరణే) వాళ్లు ఎవ్వరయినా వుంటే, ఒక్క సారి చీరాల మొదటి generations Doctors పిల్లలు అందరూ EAMCET ranks తెచ్చుకొని 10th, IntermediatelalO average or below average students ఎలా Doctors అయ్యరో ఒక్కసారి అలోచించండి. మీకు తెలిసిన వాళ్లు ఎవరయినా వాళ్ల పిల్లల క్లాస్మేట్స్ ఉంటే ఒక్కసారి వాళు EAMCET RANK లో తప్ప మిగతా అన్ని exams లలో ఎలాంటి ranks తెచ్చుకొన్నరో కనుక్కోండి.

ఇందులో అందరూ దొంగలే, vignaan రత్తయ్య గారి దగ్గరనుండి, నారయణ వరకూ. కాకపోతే దీని గురుంచి ఎవ్వరూ ముఖ్యంగా inner circle మాట్లాడరు. exam ముందు revision అంటూ కొద్ది గంటలు పెట్టే, claases దీనికి కీలకం. వాటిలో, తాము select చేసుకొన్న students కు special గా పెట్టే క్లాసెస్ మరీ కీలకం. అర్ధం చేసుకొన్న వారికి అర్ధం చేసుకొన్నంత లోతు ఉంది దీనిలో.

ఏది అయినా, చాలా మందికి తెలిసినా ముఖ్యం గా lectures లో, ఎవ్వరూ బయటకు మాట్లాడని విషయం గురించి వ్రాస్తున్న మీకు నా ధన్యవాదాలు. కాకపోతే దీనిని ఎవ్వరూ మార్చలేరని మాత్రం నేను చెప్పగలను, చాలా దగ్గరనుండి చూసినవాడిగా.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu