నేను 1992, ఆగస్టు 9 నో, 13 నో నెం.10, జనపధ్ కువెళ్ళి సోనియాగాంధీని కలవాలని ప్రయత్నించి, ఆమె పి.ఏ. మాధవన్ తో మాట్లాడి వచ్చేసాను. ఈ సంఘటన తర్వాత, ఆగస్టు 20 లోపు ఫ్యాక్టరీలోని మాఅమ్మ నాన్నల దగ్గరికి [ఫ్యాక్టరీలోనే మాఇల్లుకూడా ఉన్నది.] ఓ వ్యక్తి కారులో వచ్చాడట. తనని తాను రాయపాటి సాంబశివరావు డ్రైవర్ గా పరిచయం చేసుకొని, మా అమ్మనాన్నలకి “మా సార్ చెప్పాడు. మీ అమ్మాయిగారు సోనియాగాంధీకి ఏదో విషయం చెప్పారట. అందుకని మా సార్ నన్ను పంపించాడు. మీ అమ్మాయితో మాసార్ మాట్లాడాలట” అని చెప్పాడట. అయితే అప్పటికీ నేనింకా గుంటూరు చేరలేదు ఢిల్లీ రోడ్లమీద ఉన్నాను. PMR ముందు మొండికేసి కూర్చొని ఉన్నాను. తర్వాతి పరిణామంలోనే నన్ను పోలీసులు పార్లెమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ కి తీసికెళ్ళింది! మా అమ్మావాళ్ళకింకా ఇదంతా తెలియదు. వాళ్ళు నేను ఢిల్లీలో సౌకర్యంగానే ఉన్నానని అనుకుంటున్నారు. [నేను ఇల్లు చేరాక అంతా వివరించాను లెండి] దాంతో మాఅమ్మగారు నేను లేనని, ఇంకా ఢిల్లీ నుండి రాలేదనీ అతడికి చెప్పారట. అతడు నేను గుంటూరు రాగానే రాయపాటి సాంబశివరావుని కలవవలసిందిగా చెప్పివెళ్ళిపోయాడట.

ఆగస్టు 20 న నేను ఇల్లు చేరాక మా అమ్మ, చెల్లి నాకిదంతా చెప్పారు. అంతకు ముందు నేను రాయపాటి సాంబశివరావు గాంధీ – నెహ్రు కుటుంబానికి సన్నిహితుడని ఎక్కడో చదివాను. ఒకప్పుడు అతడు 20 సూత్రాల పధకానికి ఛైర్మన్ గా క్యాబినేట్ హోదాలో పనిచేసినట్లు గుర్తు. ఈ ఙ్ఞాపకంతో పాటు అతడన్న “They [N. Janardhana Reddy and his supports] can corrupt even God” అన్న డైలాగ్ కూడా గుర్తుకొచ్చింది. అప్పటికే, జరిగిన, జరుగుతున్న అన్ని విషయాలు నాకు బాగా గందరగోళంగా ఉన్నాయి. ఏది ఏమైనా నాకెందుకో అతడిని కలవాలన్న ఆసక్తి కలగలేదు. దాంతో ఆ విషయం ప్రక్కన పెట్టేసాను.

అప్పటికే నాటి గృహమంత్రి ఎస్.బి.చవాన్ ‘కొందరు పత్రికాధిపతుల్లో సి.ఐ.ఏ. ఏజంట్లున్నారు’ అంటూ ప్రకటించాడు. దాంతో రామోజీరావు వెనుక సి.ఐ.ఏ. ఉందని నాకు రూఢిగా అన్పించింది. ఓ ప్రక్క కుట్రదారుల ఆరెస్ట్ వార్త తో సంచలన ప్రకటన వస్తుందన్న ఆశ. మరోప్రక్క జరుగుతున్నది అర్ధంకాని confusion తో మరికొన్ని రోజులు గడిచాయి.

ఓవైపు చూస్తే భారతదేశం, నాటి భారత ప్రధానమంత్రి అప్పటివరకూ తామెదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడుతున్నారు. కమ్ముకొచ్చిన సమస్యల కారుమబ్బులు దూదిపింజల్లా క్రమంగా తేలిపోతున్నాయి. మండల్ నివేదిక కారణంగా ఉవ్వెత్తున ఎగసిన కులప్రాతిపదికపై రిజర్వేషన్లని వ్యతిరేకిస్తూ, సమర్దిస్తూ రేగిన అలజడులు చప్పబడ్డాయి. సుప్రీంకోర్టు తీర్పు తాలూకూ లిటిగేషన్ దానికి కారణంగా చెప్పబడింది. భారత ప్రభుత్వ కస్టమ్స్ చేతికి భారీగా, టన్నులకొద్దీ బంగారు, వెండి స్మగ్లింగ్ చేయబడుతున్న రెండు మూడూ నౌకలు దొరికాయి. మాదకద్రవ్యాల, ఆయుధాల, విలువైన, లోహాల స్మగ్లింగ్ తరుచుగా దొరికిపోతున్న వార్తలు వచ్చేవి. బోడో సమస్య, ఉల్ఫా, నక్సల్స్ సమస్యలు ప్రధానమైనకారణం ఏదీ లేకుండానే, ఏ విధమైన సంచలనాలు స్పష్టించకుండా అప్పటికే చల్లబడ్డాయి. అప్పుడే ఒక కరుడు గట్టిన ఒక నక్సల్ నాయకుడు [అతడి పేరు మరచిపోయాను] సోమాజీ గూడ వెనుక పోలీసు ఎన్ కౌంటర్లో మరణించాడు. దున్నపోతుల బండిపై అతడి మృతదేహం తెలుగువార్తల్లో చూపించారు. దాదాపు 1992 చివర్లోనే అప్పటిదాకా అఙ్ఞాతంలో ఉన్న ప్రజాగాయకుడు గద్దర్ అఙ్ఞాతం నుండి బయటికొచ్చాడు. ఆ నేపధ్యంలో వరవరరావు, కణ్యాణ్ రావులతో పేపర్ మీడియాలో ఇంటర్యూలు వచ్చాయి. కొండపల్లి సీతారామయ్య కూడా ఆప్పుడే అఙ్ఞాతం నుండి వెలుగులోకి వచ్చాడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, 1992 డిసెంబర్ 6 న బి.జే.పి., ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు బాబ్రీ మసీదుని కూల్చడంతో ఆగిపోయింది. ఇందులో అంతర్జాతీయ మీడియా పాత్రనీ, ఆర్.ఎస్.ఎస్., బి.జే.పి.ల పాత్రని ముందే కొంత చర్చించాను. యు.పి.ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, కోర్టులకు, ప్రధానమంత్రికి వ్రాతపూర్వక హామీలిచ్చి, వ్యూహాత్మకంగా చివర్లో చేతులెత్తేసాడు. డిసెంబరు 6 కు ముందుగా నాటి ప్రధానమంత్రి పీ.వి.నరసింహారావు స్వయంగా చొరవ తీసుకొని ప్రత్యేకవిమానంలో హిందూ సాధువుల్ని ఆహ్వానించి చర్చలు జరిపాడు. ఈ విజువల్ టివీ న్యూస్ లో చూసాను. అవి కొంత ఫలించిన దశలో హఠాత్తుగా మళ్ళీ పరిస్థితులు ముంచుకొచ్చాయి. కరసేవకులు, అద్వానీ, అశోక్ సింఘాల్ ల గర్జనలతో డిసెంబరు 6, అయోధ్యలో జనవాహిని పొంగు కొచ్చింది. “నా శరీరం పులకాంకితమౌతుంది. మన చిరకాల వాంఛ తీరబోతుంది. మన కల సాకారమౌతుంది” అంటూ కూలుతున్న బాబ్రిమందిరాన్ని చూస్తూ అద్వానీ అన్నాడన్న వార్తల్ని తర్వాత న్యూస్ లో చూశాను, చదివాను. అప్పటి వార్తల ప్రకారం వాజ్ పేయి, అద్వానీ, ఉమాభారతి వంటి బి.జే.పి. నాయకులని, అశోక్ సింఘాల్, వినయ్ కతియార్, గోవిందాచార్య వంటి ఆర్.ఎస్.ఎస్. నాయకుల్ని అరెస్టు చేసారు. వాజ్ పేయి, అద్వానీని, ఇంకొందరినీ వారం రోజులపాటు గృహనిర్భంధంలో ఉంచారు. ఆ వారంలో ఏమయ్యిందో తెలియదు గానీ విడుదల నాడు అద్వానీ కళ్ళకింద నల్లని వలయాలతో, కృంగిన శరీరంతో, వాడిన ముఖంతో వార్తల్లో కనిపించాడు. పత్రికల్లోని ఫోటోల్లో కూడా అంతే. డిసెంబర్ 6, 1992 అరెస్టుల తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు గానీ అశోక్ సింఘాల్, వినయ్ కతియార్, గోవిందాచార్యుల మేరునగధీర ఉపన్యాసాలు, మేఘ గర్జనలూ మాయమయ్యాయి. క్రమంగా కొంత తెరమరుగు కూడా అయ్యారు. వీటన్నింటి నేపధ్యంలో అయోధ్య రామమందిరం ఇక సెగలూ పొగలూ గక్కటం మానేసింది.

అయితే కాశ్మీర్ రాష్ట్రంలో కూడా మిలిటెంట్ల లొంగుబాట్లు ఉన్నా, కొంతవరకే సమస్య సమసిపోయింది. కొంత రగులుతూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటిదాకా అంతే. స్థానికులైన కాశ్మీర్ పండితులు, ఇతరులు ఎప్పుడో స్థానభ్రంశం చెందించబడి, పాక్ ప్రేరిత ముష్కరులతో నిండి, పర్యాటక వ్యాపారపు కోణాలు కలిగిన కుట్ర అక్కడ కొనసాగుతూనే ఉంది.

పంజాబ్ టెర్రరిజం సమస్య తీరటం, కాశ్మీర్ సమస్య తీరకపోవటం నాకు చిత్రంగా తోచింది. అప్పటికి నాకు కొన్ని అర్ధం అయ్యాయి. కొన్ని అర్ధం కాలేదు. అర్ధమైన కాకపోయినా, అన్నిటినీ గుర్తు పెట్టుకోవటం అన్న ప్రక్రియని మాత్రం అనుశృతంగా చేసుకుంటూపోయాను. అప్పట్లో అంటే [1992 జూన్ నుండి ] వార్తలు తిని, వార్తలు తాగి, వార్తల్లోనే బ్రతికాను. టివీ రేడియో, పత్రికలు, ఏదీ వదిలి పెట్టేదాన్ని కాదు.

నేను జూన్ 1992 లో ప్రధానికి ఈనాడు రామోజీరావు మీద ఫిర్యాదు ఇవ్వడానికి ముందు, జ్వలిస్తున్న మరో సమస్య –హర్షద్ మెహతా సెక్యూరిటీ స్కాం. అది సి.బి.ఐ.కి అప్పగించబడింది. ఆ తర్వాత [నా ఫిర్యాదు తర్వాత] సి.బి.ఐ. ఈకేసు విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. నాకు తెలిసి సి.బి.ఐ. ఇంత బ్రహ్మండగా శోధించిన కేసు ఇంకొటి లేదేమో. మెహతాతో పాటు ఇతరుల, బ్యాంకు అధికారుల పాత్రని సి.బి.ఐ. నిరూపించగలిగింది. అందుకోసం సి.బి.ఐ. అధికారులు కొన్ని ఆసక్తికరమైన పద్దతులు అనుసరించారు. అంతకు ముందు అలాంటివే అనుసరించేవారేమో గాని అవేవి మీడియాలో కథనాలుగా వచ్చేవికావు.

అంతేకాదు, 1992 ముందు మీడియా ప్రచారం ఎలాంటిదంటే సి.బి.ఐ. ఏప్రియల్ 1 తారీఖున ఏర్పడిందని, అంటే అల్ పూల్స్ డే నాడు ఏర్పడిందని, దాని పనితీరు కూడా అలాగే ఉంటుందని సి.బి.ఐ. గురించి ప్రచారం చేసేవి. ఎప్పుడూ కూడా సి.బి.ఐ., సిట్ ల కంటే నేరగాళ్ళు, హంతకులు, శివరాసన్ వంటివారే సమర్ధులుగా, నైపుణ్యం కలవారిగా, తెలివిగా తప్పించుకోవటం, సి.బి.ఐ./ సిట్ లూ ఓడిపోవటమే వార్తల్లో చదివి ఉన్నాను.

అయితే హర్షద్ మెహతా కేసులో ఇండియా టుడే, ఇతర వార్తాపత్రికల కథనాల ప్రకారం – కుంభకోణంలో పాలుపంచుకున్న ఓ బ్యాంకు అధికారికి లిఫ్ట్ లో గాకుండా కాలినడకన మెట్లు ఎక్కిదిగడమంటే భయమట. [బహుశ స్థూల కాయమేమో, శారీరక శ్రమకి బేర్ మన్నాడేమో అనుకున్నాను] అతణ్ణి పలుమార్లు మెట్లెక్కించి, దింపారట సి.బి.ఐ. అధికారులు. ఆ దెబ్బకి అతడు మానసికంగా ’బ్రేక్’ అయ్యి కుంభకోణంలో తన పాత్రతో సహా తనకుతెలిసిన ఇతర వివరాలన్నీ చెప్పేసాడట.

అలాగే మరొకతనకి సాయిబాబా [షిరిడినో, పుట్టపర్తో] అంటే తగని భక్తి ప్రపత్తులూ, భయమూనట. సాయిబాబా మీద ఒట్టేసి చెప్పమన్న ఒత్తిడికి, సెంటిమెంటుకి, బ్రేక్ అయ్యి చాలా విషయాలు బయట పెట్టాడట. ఆవిధంగా సి.బి.ఐ. తన నైపుణ్యాన్ని, సామర్ధ్యాన్ని చాటుకుందని చదివినప్పుడు, అది నాకు కొత్తగా అన్పించింది. ఎంతో మజాగా కూడా అన్పించింది.

తర్వాత కాలంలో హర్షద్ మెహతా తాను నాటి ప్రధానమంత్రి పీ.వి.నరసింహారావుకి కోటిరూపాయలు లంచం ఇచ్చానని, ఫలాన తేదిన పీ.ఎం. ఇంటికి తానే కరెన్సీ నోట్లని సూట్ కేసులో పెట్టుకొని తీసికెళ్ళానని ప్రకటించాడు. [హర్షద్ మెహతా లాయర్ మనకి తెలిసిన మొహమే, ఇంకెవరూ రాంజెత్మలాని.]

దాన్ని సి.బి.ఐ. తప్పని నిరూపించింది. కోటి రూపాయలంటే దాన్ని వందరూపాయల నోట్ల కట్టలు [అప్పటికి వందనోటే పెద్దనోటు. ఇందిరాగాంధీ పెద్దనోట్లు రద్దుచేశాక, 1992 వరకూ 100/- రూ. నోటు కంటే పెద్దనోట్లు లేవు. మళ్ళీ 1996 తర్వాత 500/-రూ., 1000/- రూ.నోట్లు విడుదల చెయ్యబడ్డాయి.] ఎన్ని ఉంటాయి, అవి ఎంత బరువుతూగుతాయి, ఒక మనిషి మోయగలడా లేదా అన్న విశ్లేషణలతో లెక్కలు తేల్చింది. అలాగే కోటిరూపాయలంటే ఎన్ని 100/- రూ. కట్టలు కావాలో, అవి ఎంత ఘనపరిమాణం ఆక్రమిస్తాయో, ఒక సూట్ కేసులో పట్టాలంటే అది ఎంత పెద్ద సూట్ కేసు అయి ఉండాలో కూడా లెక్కతేల్చాయి.

ప్రధానమంత్రి నివాసంలో సెక్యూరిటి పోస్టు దగ్గర క్యాబినేట్ మంత్రులు సైతం తమకారు దిగి, భారికేడ్లు దాటి ప్రధాని నివాసం లోపలికి మరోకారులో వెళతారు. ప్రైవేట్ వ్యక్తులయితే బయటి సెక్యూరిటీ పోస్టు దగ్గరే తమ వాహనం వదిలి, సోదా తర్వాత లోపలికి కాలి నడకన వెళ్ళాల్సిందే. అటువంటప్పుడు హర్షద్ మెహతా ఒక్కడే అంత డబ్బు ఒక సూట్ కేసులో పెట్టుకొని స్వయంగా మోసుకుంటూ అంతదూరం [బయటి గేటు నుండి ప్రధాని నివాసమైన హైద్రాబాద్ హౌస్ లోపలిదాకా దూరం కొంచెం ఎక్కువే ఉంటుంది] నడుస్తూ వెళ్ళలేడని నిరూపించింది. దానితో హర్షద్ మెహతా గళం, పత్రికల కలం మూత పడ్డాయి. మెహతా లాయర్ రాం జెత్మలాని మాట్లాడుతూ ‘క్లయింట్ చెప్పింది నిజమని నమ్మాను. అంతే’ అన్నాడు. ఇదంతా చదివి నేనెంతో ఆనందించాను.

అయితే, 2000 సంవత్సరాల తర్వాత ఓసారి ఈనాడు లోనే చదివాను, హర్షద్ మెహతా రోదిస్తూ ఇచ్చిన ప్రకటనని [Statement]. ఈనాడు ఆ వార్తని “ఇలా హింసించే బదులు ఒకేసారి చంపెయ్యండి ప్లీజ్” అంటూ హెడ్డింగ్ పెట్టి వ్రాసింది. ఆ వార్తలో మెహతా ఆ విధంగా ఎవరిని అర్ధిస్తున్నాడో నాకుఅర్ధం కాలేదు. బహుశః సి.బి.ఐ. అధికారులని అలా అర్ధిస్తున్నాడేమో అనుకున్నాను. అందులో అతడు తన సమస్యల గురించి చెప్పుకుంటూ “నేను కోట్లు ఖరీదు చేసే విలాసవంతమైన అపార్టుమెంటులో నివసిస్తున్నాను. కానీ తినేందుకు బియ్యం గింజలు లేవు. 15 రూపాయలు పెట్టి కిలో బియ్యం కొనుక్కుంటే చాలు, సి.బి.ఐ. నన్ను ఆ 15 రూపాయలు నాకు ఎలా వచ్చాయో చెప్పమని వేధిస్తోంది. ఆ 15 రూపాయలు నేను ఎలా సంపాదించానో, లేక ఎవరు అప్పు ఇచ్చారో, వాళ్ళకీ నాకూ ఉన్న సంబంధం ఏమిటని నిలదీస్తూంది. ఇలా వేధించే బదులు ఒకేసారి నన్ను చంపేయండి” అంటూ వాపోయాడు.

తదుపరి సంవత్సరాల్లో హర్షద్ మెహతా చనిపోయినప్పుడు కూడా, ఈనాడు ‘శిక్ష పూర్తయ్యింది’ అంటూ వార్త వ్రాసింది. అందులో ‘రాజ్యాంగం ప్రకారం లేదా భారత శిక్షాస్మృతి హర్షద్ మెహతాకి ఏ శిక్ష అయినా విధించవచ్చు. ఇప్పటికి ఇంకా విచారణే సరిగా పూర్తిగాకపోవచ్చు. కానీ భగవంతుడు మాత్రం మెహతాని శిక్షించాడు. కుంభకోణం వెలుగులోకి వచ్చాక హర్షద్ మెహతా భయంకరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. చివరికి మృత్యువు ఒడికి చేరుకున్నాడు. ఆవిధంగా శిక్ష పూర్తయ్యింది” అని వ్రాసింది.

మెహతాకి దేవుడు వేసిన శిక్ష 2000 తర్వాత, అతడి మరణంతో పూర్తి అయి ఉండవచ్చు లేదా భాగవతంలో చెప్పినట్లు 28 నరకాల్లో ఇంకా అతడు యముడి శిక్షలు పొందుతూనే ఉండవచ్చు. 1992 నాటికి మాత్రం కుంభకోణం తాలూకూ సంచలనం ’క్రమబద్దీకరణ’ చెందింది. లేదా ’నియంత్రించ’బడింది. ఇన్సూరెన్స్ ఆఫీసులో చిన్న క్లర్కు స్థాయి నుండి కోట్లాది రూపాయల కుంభకోణం దాకా చేసి, చివరికి మోసగాడిగా నిరూపితమై, అతడి అంకం ముగిసింది.

ఈవిధంగా 1992 చివరి కొచ్చేసరికి, భారతదేశం, నాటి భారత ప్రధానమంత్రి 1991 చివరినాటికి, ఖచ్చితంగా చెప్పాలంటే 1992 జూన్ నాటికి తాను ఎదుర్కొంటున్న ఎన్నో తీవ్రమైన సమస్యల నుండి బయటపడి గణనీయమైన ప్రశాంతతని సాధించారు. మరోవైపు ప్రధానమంత్రి నరసింహారావు నోట కొన్ని ప్రత్యేకమైన, కొంత అసాధారణమైన ప్రకటనలు వెలువడ్డాయి. వాటిల్లో ఒకటి “I demand four years moratorium period from all opposition parties. Nobody should create any disturbance to the Govt. of India. The economical reforms are in right phase.” ఈ ప్రకటన చూసి నాకు చాలా నవ్వు వచ్చింది. నాలుగేళ్ళు తర్వాత ప్రధానిగా తన పదవి కాలం కూడా అయిపోతుంది. అంటే ‘తాను పదవిలో ఉన్నంతవరకూ ఎవరూ ప్రభుత్వానికి ఏ ఆటంకాలూ కలిగించరాదు, ఖబడ్డార్ అంటున్నాడా’ అనుకొని నవ్వుకున్నాను. ‘ఏ బలమూ లేకుండానే, ఊరికే ఖబడ్ధార్ అంటే ఎవరైనా ఊరుకుంటారా? సరే బాబూ, నువ్వు నాలుగేళ్ళు మోరిటోరియం అంటున్నావుగా! మేమూ కిక్కురమనంలే అంటారా?’ అనుకున్నాను.

అప్పుడే “చట్టం తనపని తను చేసుకుపోతుంది” అన్నాడు. దీన్ని తర్వాత బోలెడు సినిమాల్లో, రాజకీయనాయకుల మాటల్లో చూసి అందరం నవ్వుకున్నాం కదా!

అలాంటిదే మరో ప్రకటన – “ I’m not particular about the speed of the reforms. But I’m particular about its phase.” మరొకటి – “Do not under estimate the strength and wisdom of our people.”

ఇదంతా చూసి, ఈ విషయాలన్నీ టివీ వార్తల్లో, పత్రికల్లో చదివీ నేనెంతో సంతోషించాను. అయితే ఓవైపు దేశ పరిస్థితులు మెరుగుపడుతుంటే, మరో వైపు నావ్యక్తిగత జీవిత పరిస్థితులు దిగజార సాగాయి. దేశానికి సంబంధించిన విషయాలు మీద దృష్టి కేంద్రీకరించి నేను నా వ్యాపార విషయాలు విస్మరించాను. [ఈ అనుభవ పాఠంతో తర్వాత నేను చేపట్టిన బోధనావృత్తిలో, నేనెన్ని వత్తిళ్ళలో ఉన్నా లెక్చరర్ గా నా విద్యార్ధులకు పాఠాలు చెప్పటం లో మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యలేదు. పాఠశాల నడిపినప్పుడూ అంతే. ఒక్కరోజూ, ఒక్క క్లాసు కూడా నా సమస్యల కారణంగా పిల్లలకి ఎగనామం పెట్టలేదు.]

1992 లో, ఓ వైపు పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్ధన రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో సీట్లు Vs క్యాపిటేషన్ ఫీజుల వివాదంలో చిక్కుకొని పదవీ బ్రష్ఠుడయ్యాడు. అప్పటివరకూ కేంద్రమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డి, ముఖ్యమంత్రిగా హైదరాబాద్ పంపబడ్డాడు. 1992 అక్టోబర్ 9 వ తేదిన [నాకు గుర్తుండీ అదే తేదీ] టీవీలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం వస్తోంది. సరిగ్గా ఆ సమయంలో, AP SFC అధికారులు వచ్చి నా ఫ్యాక్టరీ ని సీజ్ చేశారు. ఒక పంచనామా లేదూ, సాక్షి సంతకాలూ లేవు. స్థానిక పోలీసు అధికారులనీ , గ్రామ పంచాయితీ వారినీ, బ్యాంకు వారినీ, స్థానిక MRO ని పిలిచి పంచనామా చేయకుండా, సాక్షి సంతకాలు లేకుండా ఫ్యాక్టరీ వర్కు షెడ్ కు తాళాలు వేసి సీల్ వేసారు. ముందుభాగన ఉన్న ఆఫీసు బిల్డింగ్ నీ, నా నివాస గదులనీ విడిచిపెట్టి ఫ్యాక్టరీని మాత్రం సీజ్ చేసారు. నాకు వర్కింగ్ కాపిటల్ ఇచ్చిన బ్యాంకు వారినీ పిలవకుండానే, ఏవిధమైన వ్రాతకోతలూ, పత్రాలూ లేకుండా ఇదంతా చేశారు. నిజానికి నేను ఖాయిలా పడిన ఐస్ ఫ్యాక్టరీని బహిరంగ వేలంలో కొని, బ్యాటరీ ఫ్యాక్టరీగా మలుచుకున్నాను. వేలంలో కొన్న తర్వాత ఐస్ ఫ్యాక్టరీ నాకు అప్పగించేటప్పుడు AP SFC పంచనామా Formalities అన్నీ ఆచరించింది.

సరిగ్గా దిగిపోయే ముందు, నేదురమల్లి జనార్ధన రెడ్డి APS RTC కి అప్పటి వరకూ ఎం.డిగా ఉన్న హెచ్.జె. దొర, ఐ.పి.ఎస్. ని బదిలీచేసాడు. APS RTC , MD గా దొర నన్ను, నా చిన్నతరహా పరిశ్రమని ఎంతో ప్రోత్సాహించేవాడు. హఠాత్తుగా వరుసగా జరిగిన ఈ ప్రక్రియలన్నీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసాయి. నా ఫ్యాక్టరీని సీజ్ చేసిన AP SFC వారు, నా ఫ్యాక్టరీకి సెక్యూరిటీ గార్డులని అపాయింట్ చేసారు. ఏంజరుగుతుందో అర్ధం కాలేదు. నా పరిశీలనకి భారతదేశానికి మంచి జరుగుతుందని తెలుస్తోంది. నా ఫిర్యాదు, నేనిచ్చిన సమాచారం నాటి ప్రధానమంత్రి పీ.వి.నరసింహారావుకి దేశానికి మంచి చేయటానికి పనికి వస్తోంది. నా రిపోర్ట్ ప్రధానికి అందిందని, PMO లో OSD ఖండేకర్ ని నేను కలిసినప్పుడు, ఐ.బి.అధికారులు నా ఇంటికి వచ్చినప్పుడు నాకు కలిగిన confirmation అది. మరి నా జీవితంలో ఈ అసహజ మార్పులేమిటి? ఇక్కడ నాకు చాలా అసాధారణలు, అసహజాలు కనిపించాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu