ఇక మళ్ళీ ఇందిరాగాంధీ విషయానికి వద్దాం. ఆవిడ హత్యానంతరం సిక్కు సెక్యూరిటి గార్డుల కేసుని రాం జెత్మాలానీ తీసుకున్నాడు. ఈయన ఓ ప్రముఖ న్యాయవాదే కాదు, స్వాతంత్ర సమర యోధుడు కూడానట. రాత్రికి రాత్రి గాంధీ టోపి పెట్టి సర్టిఫికేట్ సంపాదించిన కుహనా స్వాతంత్ర సమర యోధుడో, నిజమైన పోరాట యోధుడో తెలియదు గానీ, ఎప్పుడైనా సరే, భారత్ కు వ్యతిరేకమైన కేసులే ఈయన వాదించేందుకు తీసుకుంటాడు. సిక్కు సెక్యూరిటి గార్డుల కారణం ఏదైనా కానివ్వండి, మతమో, రాజకీయమో ఏదైనా భావంతో కానివ్వండి, ఓవ్యక్తిని చంపడం న్యాయం కాదుకదా? అందునా ఓ రాజకీయనాయకురాలిని! మరి ఈ న్యాయవాది, నేరస్తుల తరుపున ఎందుకు వాదించ పూనుకున్నాడో అతడికే తెలియాలి.

"ఈదేశంలో ఎందరో న్యాయవాదులు హంతకుల తరపున వాదిస్తుంటారు. అలాంటప్పుడు రామ్ జెత్మాలానీనే ఎందుకు తప్పుపడుతున్నారు?" అన వచ్చు. ఈ దేశంలో ఎందరో న్యాయవాదులు హంతకుల తరపునా, నేరగాళ్ళ తరుపునా కేసులు తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఎన్నో కేసుల్లో వాది ప్రతివాదుల నడుమ వ్యక్తిగత సంబంధాలూ, భావోద్రేకాలూ ఉంటాయి. నేరం చోటు చేసుకునేలోపల ఇరువర్గాల తప్పొప్పులూ అందులో మిళితమౌతాయి. అదే ఇలాంటి రాజకీయనాయకుల హత్య కేసుల్లో హంతకులు కిరాయి వ్యక్తులు మాత్రమే. వారి తరుపున కేసు తీసుకోవటం అంటే అది హంతకుల మీద దయతో మాత్రమే కాదు, విచారణలో లొసుగులు బయటికి రాకుండా జాగ్రత్త పడేందుకూ, ఆవిధంగా కుట్రదారులకి సహకరించేందుకు. అంతేకాదు ఇలాంటి ఎన్నో చర్యలతో రాం జెత్మలానీ భారతదేశ వ్యతిరేకతని నిరూపించుకున్నాడు. అలాగే ఇందిరాగాంధీ మీద తనకున్న విద్వేషాన్ని కూడా వెళ్ళగక్కాడు. అయితే, అసలు వింత ఇక్కడ లేదు.

ఇలాంటి ఈ రాంజెత్మాలానీ భా.జ.పా. అధ్వర్యంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వాన్ని, 2007 లో తనని రాష్ట్రపతిగా చేయమని డిమాండ్ చేశాడు. తను ఇంతకాలంగా చేసిన సేవలకు ప్రతిఫలంగా రాష్ట్రపతి పదవిని ఇమ్మని కుట్రదారులకు పరోక్ష సంకేతం అలా పంపాడన్న మాట.

ఇందిరాగాంధీ గురించి ముగించే ముందు మరికొన్ని అంశాలు మీదృష్టికి తెస్తాను. ఆవిడ హయాంలో విద్య, వైద్యం ప్రైవేటీకరించటానికి విశ్వప్రయత్నాలు జరిగాయి. ఆవిడ ససేమిరా అన్నది. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేయడం అప్పట్లో నిషేధం. కాన్వెంటు స్కూళ్ళు ఇప్పుడున్నట్లు భారీఎత్తున కనబడేవి కావు. సందుగొందుల్లో నిరుద్యోగ యువతీయువకుల నడిపే వీధి బడులుండేవి. అత్యధికంగా విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ చదువుకునే వాళ్ళు. అప్పట్లో విద్యాబోధనా, క్రమశిక్షణా, నాణ్యత ప్రమాణాలతో ఉండేవి. అప్పట్లోనే 2000 మంది విద్యార్దినులు, 200 మంది ఉపాధ్యాయునీలూ ఉన్న స్టాల్ గళ్స్ హైస్కూల్లో సంవత్సరానికి 11/- రూపాయల ఫీజుతో చదువుకున్నాం మేము. కళాశాల చదువులూ ఇప్పటిలా వేలూ, లక్షలతో ముడిపడి ఉండేవి కావు. ఇక వైద్యం మాటయితే ప్రభుత్వ ఆసుపత్రులు నరకానికి నకళ్ళు అన్న మాట ఎలా ఉన్నా, పేదలకి వైద్యం మాత్రం బాగానే అందేది. అదీ ఇప్పడయితే ఆరోగ్యశ్రీ పేరిట కోట్లాది రూపాయలు కార్పోరేట్ ఆసుపత్రులకు చెల్లించడం చూస్తునే ఉన్నాం. ఆ సొమ్ముతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందిస్తే తెల్లకార్డు కాదు, అసలేకార్డు లేకపోయినా పేదలందరికీ అనారోగ్య సమస్యలు తీరతాయి కదా! అందరికీ ఆపరేషన్లు అవసరమౌతాయా? మామూలు అనారోగ్యాల మాటేమిటి? అసలు ఆరోగ్యశ్రీ పేరిట ప్రచారం ఎంత? కార్పోరేట్ ఆసుపత్రిలకి చెల్లింపులెంత? ప్రక్కదారి పట్టే నిధులెంత? సామాన్యుడి కందే ప్రయోజనం ఎంత? ఈ మాయని భేతాళుడు ఛేదించాలి. ఇక వ్యవసాయం గురించి అయితే మాట్లాడనేకూడదు. సెజ్ లే మాట్లాడుతున్నాయి కదా! రైతు దగ్గర పావలాకి కొనే టమోటా మనకి 10/-రూ., 2/-రూ. కిలో మిరపకాయలు మనకి 12 రూపాయలు. రైతు కృశిస్తున్నాడు. వినియోగదారుడు దుఃఖిస్తున్నాడు. ప్రభుత్వ అధికార ప్రచార ప్రకటనలతో పత్రికలూ, పబ్బం గడుపుకొనే మాటలతో రాజకీయ నాయకులూ మాత్రమే నవ్వుతున్నారు లేదా భావోద్వేగాలతో తొడలు గొట్టి, మీసాలు మెలేసి ’చూస్కోండి మా తడాఖా’ అంటున్నారు.

ఇందిరాగాంధీ నాటి రోజుల్లోని మరో అంశం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాలి. 1977 ఎన్నికల్లో ఓడిపోయిన ఆవిడ చాలా చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. తదుపరి రోజుల్లో ఓసారి ఆవిడ ఎన్నిక చెల్లనేరదని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దానితో ఆవిడ ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేసింది. 1977 ఓటమి కారణం కానివ్వండి, మరో కారణం కానివ్వండి ఆవిడ ఒకేసారి రెండు నియోజక వర్గాల్లో పోటీ చేయటం అన్న ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. అదిప్పుడు ఎంత దుష్ట సాంప్రదాయానికి దారి తీసిందో మనమంతా చూస్తున్నదే కదా! గతంలో ఎన్.టి.ఆర్. తన ప్రాభవాన్ని చూపించుకొనేందుకో [ఓటమి భయం వల్లనైతే కాదనుకుంటా] మరెందుకో గానీ ఒకేసారి 3 నియోజకవర్గాల్లో పోటీచేసి గెలిచాడు. కె.సి.ఆర్. కూడా అదే దారి తొక్కాడు. ఇప్పుడు రాబోయే రాజకీయనటుడు చిరంజీవి కూడా 3 చోట్ల పోటీ చేస్తానంటున్నాడు. ఖర్మకాలి అన్నింటిలో గెలిస్తే మిగిలిన రెండు నియోజక వర్గాల్లో మళ్ళీ ఎన్నికల ఖర్చు ఎవరు భరిస్తారో? ఈ సాంప్రదాయలన్నిటికీ తెరతీసిన దుష్కీర్తి ఇందిరాగాంధీ నెత్తిన ఉండగా, దాని వెనుక కారణమైతే ఇదీ……. సి.బి.ఐ.లూ, కోర్టులూ ప్రభావ ప్రలోభాలకి లొంగవు అనుకుంటే అది అమాయకత్వమే. నిజానికి సినిమాల్లో జడ్జీలందరూ జస్టిస్ చౌదరిలైనట్లు “ఇది ఆదైవమే ఇచ్చిన తీర్పు. తప్పా తప్పా” అంటూ తీర్పునిచ్చినట్లు, హీరోలు నానా అగచాట్లు పడి అప్రూవర్లుగా మారిన విలన్ చెంచాల్ని క్లైమాక్స్ లో కోర్టుకి తీసికెళ్ళినట్లూ చూపిస్తుంటారు గానీ న్యాయవాదుల్లో కొన్నేళ్ళు సర్వీసు ఉన్న వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, తర్వాత జడ్జీలుగా ‘పరీక్షలు’ ‘ఇంటార్యూ’లలో ఎంపికై నియమితులౌతుంటారు. న్యాయవాదుల్లో న్యాయం, నిజాయితీ ఎంతుందో ఇప్పడందరికీ తెలిసిందే. అంటే అసలు న్యాయవాదుల్లో నిజాయితీ ఉన్నవారే లేరని నేను అనటం లేదు. న్యాయవాదుల్లో నిజాయితీ ఉన్న వాళ్ళ శాతం తక్కువా, అవినీతి పరుల శాతం ఎక్కువా అంటున్నాను. వాది తరుపున కేసు తీసుకొని ప్రతివాది నుండి లంచం పుచ్చుకొని కేసుని ఓడగొట్టె న్యాయవాదులు బోలెడు మంది గురించి గుంటూర్లో కథనాలు చెప్పుకోవటం నాకు తెలుసు. అంతేకాదు న్యాయవాదులకీ జడ్జీలకి మ్యాచ్ ఫిక్సింగ్ తీర్పులు నడవటం కూడా కద్దు. నాకు తెలిసిన ఓ న్యాయవాద దంపతులు తమ పుత్రుణ్ణి, తమ సన్నిహిత న్యాయమూర్తి సంరక్షణలో ఉంచి చదివించేంత ’దగ్గరితనం’ ఉండటం చూశాను. అక్కడి ’దగ్గరితనం’ స్నేహం అభిమానం అనే పునాదుల మీద లేదని, ధనపు మూలాల మీద ఉందనీ ఖచ్చితంగా చెప్పగలను. ప్రపంచమంతా ఇలాగే ఉందనను గానీ ప్రపంచంలో ఇలా కూడా చాలా మంది ఉన్నారని అంటాను. ఇక ఇప్పుడైతే న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన గురించి పార్లమెంటులో అయిన రచ్చ, న్యాయమూర్తులు రాజ్యాంగశక్తికి అతీతులు కాదు కనుక ఆస్తులు ప్రకటించాలిందే నన్న స్పీకరు సోమనాధ ఛటర్జీ వ్యాఖ్య మనకి స్పష్టంగా చెప్పుతూనే ఉందిగదా న్యాయమూర్తులు నిజాయితీకి ప్రతి రూపాలేం కాదని? అడపాదడపా బయటపడుతున్న చిన్న కోర్టుల న్యాయమూర్తుల ఉదంతాలూ మనకి కొత్తకాదు.

ఏతా వాతా చెప్పేదేంటంటే జడ్జీలను ప్రలోభ లేదా ప్రభావ పరిచినా, లేక రిటర్నింగ్ అధికారులని లోబరుకున్నా ఎన్నికల్లో మతలబులు చేయటం, ఎన్నిక చెల్లనేరదని అనిపించటం అసాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో, విదేశీ కుట్రని [అప్పటికి అలాగే అనుకునేవారు] ఒంటరిగా ఎదుర్కొంటున్న ఇందిరాగాంధీకి ఒక్క నియోజక వర్గం నుండి మాత్రమే పోటీ చేయటం ప్రమాదకరంగా అన్పించింది. అందుచేత ఒకేసారి రెండునియోజకవర్గాల్లో పోటిచేసింది. ఆ ప్రక్రియ ఈ రోజు నేతలు మూడు నియోజకవర్గాల్లో ఒకేసారి పోటీ చేసే సాంప్రదాయానికి తెరలేపింది. ఆ రోజు ఆవిషయమై ఇందిరాగాంధీ ప్రవర్తనని చీల్చి చెండాడిన మీడియా, ’ఈనాడు’, ఈరోజు కె.సి.ఆర్.నీ, చిరంజీవిలనీ, ‘X’ల్నీ, ‘Y’ల్నీ కూడా ఏమీ అనటం లేదు. ఇందిరాగాంధీ చేస్తే తప్పు, వీళ్ళంతా చేస్తే ఒప్పు ఎలా అయిపోయిందో మరి? అలాగని నేను ఆవిడ చర్యని సమర్ధించటం లేదు. అలాగని విమర్శించడం కూడా లేదు. అందులోని అంతర్గతంగా ఉన్న కుట్రకోణాన్ని మాత్రమే విశదీకరిస్తున్నాను. ఇలాగే దేశభక్తుల చేత అనివార్యంగా ఇలాంటి చర్యలు తీసుకొనేటట్లు చేసి వాటిని వీలయినంత విమర్శించి, తరువాత కుట్రదారులు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. ఎవరైన విమర్శిస్తే దీనికి ఫలానా దేశభక్తులే కారణం అని విమర్శించటం అన్నది మీడియా చేస్తుంది. దీనికి మరో ఉదాహరణ ఏమిటంటే రాజీవ్ గాంధీ చేత బాబ్రీమసీదు తాళాలు తీయించడం. ఇదీ మీడియా మాయాజలం.

ఇక 1984 లో ఇందిరాగాంధీ హత్యతో భారత రాజకీయ రంగం మరో అంకంలోకి ప్రవేశించింది. రాజకీయానుభవం లేని రాజీవ్ గాంధీ ప్రయాణం ప్రారంభమైంది. ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ భారత దేశానికి తాత్కాలిక ప్రధాని అయ్యాడు. తదుపరి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్.టి.ఆర్., నాదెండ్ల వ్యవహారంతో అయోమయం నెలకొందనీ, తానూ మనస్తాపం చెందానని, తాజాగా ప్రజల తీర్పు కోరుతానని ప్రకటిస్తూ రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు సిఫార్సు చేస్తూ అసెంబ్లీని రద్దు చేశాడు.

ఆ ఎన్నికల్లో చూపిన తెలుగు ఓటర్ల విఙ్ఞత ఎంతటి దంటే అసెంబ్లీకి తెలుగుదేశం అభ్యర్ధుల్నీ, పార్లమెంటుకి కాంగ్రెస్ అభ్యర్దుల్నీ గెలిపించారు. అయితే ఈ సంఘటన తర్వాత ఎన్నికల్లో రిగ్గింగూ, హింస, పోలింగ్ బూతుల్ని ఆక్రమించుకోవటం వగైరా వగైరా పెరిగిపోవటం ఇక్కడ గమనార్హం. అంతేగాక ‘ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులైవరైనా మరణిస్తే పోలింగ్ వాయిదా పడుతుంది’ అన్న నియమాన్ని ఆధారం చేసుకొని, పోలింగ్ వాయిదా వేయించేందుకు స్వతంత్ర బలహీన అనామక అభ్యర్ధుల్నీ హత్య చేయటం, డమ్మీ అభ్యర్ధుల్నీ నిలబెట్టి మతలబులు చేయటం లాంటి ’శతకోటి దరిద్రలకి అనంత కోటి ఉపాయాల్లాంటి’ పన్నాగాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక కేంద్రంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటయ్యింది. ప్రభుత్వ ప్రచార సాధనాలైన ఆలిండియా రేడియో, దూర్ దర్శన్ లు [అప్పటికి ప్రైవేట్ టి.వీ. ఛానెల్స్ లేవు] ప్రభుత్వ పధకాల్ని గానీ, ప్రభుత్వం గురించి పాజిటివ్ గా గానీ ఏ చిన్న మాట ప్రసారం చేసినా ప్రైవేట్ పత్రికా మీడియా AIR, DD లు ప్రభుత్వ బాకాలుగా మారిపోయాయని దుమ్మెత్తి పోశాయి. 1985 నుండి 1989 లోపునైతే ప్రభుత్వ దూరదర్శన్ ని ’రాజీవ్ దర్శన్’గా పేర్కొంటూ ఈనాడు కార్టూన్లు, వ్యంగ్య ఫీచర్లు వ్రాసింది. ఇంకా AIR, DD లకి నెలవారీ రుసుములు కట్టక్కర్లేదు. ఏంటీన్నా ఉంటేచాలు. అదేఇప్పటీ ఈటీవీ, జెమినీ టివీ, టివీ.9 లాంటి ఛానెల్స్ కైతే నెలవారీ రుసుముకట్టాలి. అలా డబ్బుకట్టి మరీ మే 20,2008 వరకూ ఈటివీ లో రామోజీరావు కుమారుడు సుమన్ విశ్వరూప సందర్శనాన్ని భరించిన తెలుగుప్రేక్షక లోకాన్ని గురించి మరి రామోజీ రావు ఏమనుకున్నాడో గానీ అప్పట్లో మాత్రం అలాంటి అంశం మీద పిడుగులు కురిపించేవాడు.

ఇక 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ మెజారిటీ వచ్చింది. దాదాపు ప్రతిపక్ష పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. నాకు గుర్తున్నంత వరకూ దాదాపు 532 సీట్లున్న పార్లమెంటులో 502 లేదా 504 సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. అప్పుడు భా.జ.పా.కి పార్లమెంటులో ఉన్న సీట్ల సంఖ్య 2. ఇందిరాగాంధీ సానుభూతి ప్రభంజనంలో ప్రతిపక్షాలన్నీ కొట్టుకుపోయాయని అప్పటి రాజకీయ విశ్లేషకులూ, మీడియా పాత్రికేయులు సమీక్షలు గుప్పించారు. ఏమైనా అశేష భారత ఓటర్లూ ఇందిరాగాంధీ హత్యపట్ల సానుభూతినే కాదు, ఆవిడ పట్ల తమకున్న గౌరవాన్ని, అభిమానాన్ని, ప్రేమని కూడా అలా ప్రకటించారు. ’ఇందిరాగాంధీ చచ్చి సాధించిందని’ రామోజీరావు స్యయంగా వ్యాఖ్యానించాడని ’ఈనాడు’లో సబ్ ఎడిటర్ గా పనిచేసే నా మిత్రురాలు చెప్పగా విని ఆశ్చర్యపోయాను. బహుశః అది ఆవిడ ఆత్మకి ఉన్న సంకల్పశక్తి కావచ్చు లేదా ఆ స్ఫూర్తి కారణం కావచ్చు.

ఇక్కడ ఒక చిన్న విషయం చర్చిద్దాం. ఇప్పటి సినిమాల్లో చెడ్డవాడి ఆత్మకి శక్తి ఉన్నట్లు చూపిస్తుంటారు కదా. అక్స్ సినిమాలో రాఘవ పాత్ర [మనోజ్ బాజ్ పాయ్ పోషించాడు] ఆత్మ పోలీసు అఫీసర్లకి ఆవహించి చెడు చేస్తుంటుంది. వాడు బ్రతికుండగా వాడి చేతిలో చనిపోయిన పోలీసు ఇన్స్ పెక్టర్ల ఆత్మలకి ఏబలమూ ఉండదు. [ఆత్మలకి బలం ఉండే పక్షంలో, ఆవి చనిపోయాక కూడా తమ ఆరిషడ్వర్గాలని కొనసాగించగలిగే పక్షంలో]. అంతేకాదు హీరో అమితాబ్ పాత్రకూడా రాఘవ ఆత్మకి ఉన్న శక్తికి లోబడి చెడు చేస్తుంటుంది. ఆలాంటిదే అరుంధతి సినిమా కూడా. చెడ్డవాడి ఆత్మకే అంత శక్తి ఉండేపక్షంలో మంచికోసం పోరాడిన మంచివాడి ఆత్మకి ఎందుకు శక్తి ఉండ కూడదు? ఇక్కడ కూడా చెడ్డవాడికి చాలా బలం అన్న ఫీలింగ్ కలగజేయటమే మీడియా చేస్తున్న కుట్ర.

ఏమైనా రాజీవ్ గాంధీకి విపరీతమైన సీట్ల బలాన్ని ఇచ్చాయి ఆ ఎన్నికలు. ఆ ఉత్సాహంతో రాజీవ్ గాంధీ కొంత ప్రజల్ని motivate చేయగలిగాడు. ఫ్రీడం రన్ కి ప్రజల నుండి స్పందన వచ్చింది. సాంకేతిక రంగంలో ఇండియా అభివృద్ధిని గురించి కలగంటున్నానంటూ రాజీవ్ ప్రకటనకు, అతడి ఉపన్యాసాలకు కొంత ప్రేరణ తోడయ్యింది. అది యువతని కొంత ఉత్సాహపరిచింది. ఈ నేపధ్యంలో రాజీవ్ గాంధీ పంజాబ్ ఉగ్రవాద నేతలు, లోంగోవాలా వంటి వారితో చర్చకు చర్యలు చేపట్టాడు. తాను సౌత్ బ్లాక్ లోకి ప్రవేశించిన వెంటనే పంజాబ్ లో బుల్లెట్ ప్రూఫ్ కారులో పర్యటించాడు. శాంతిచర్చలు కొంత ఫలించి రాజీవ్ – లోంగో వాలా ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం కుదిరిన మూడు నెలల్లోపలే లోంగోవాలా హత్యకు గురయ్యాడు. శాంతి ఒప్పందం నచ్చని, భారత్ నుండి పంజాబ్ విడిపోయి ఖలిస్తాన్ ఏర్పడేవరకూ పట్టువదలమని కంకణ కట్టుకున్నా పంజాబ్ టెర్రరిస్టులు లోంగోవాలాని హత్య చేశారని హత్యకారణం వెలుగులోకి వచ్చింది. కుట్రదారులైన సి.ఐ.ఏ.,ఐ.ఎస్.ఐ.,బ్రిటిషు, అనువంశిక కణికుడూ over leaf reason గా దీన్ని బాగా ప్రచారించారు.

ఈ సంచలనాల మధ్య రాజీవ్ గాంధీ ప్రధాని పదవీ కాలంలోని తొలి సంవత్సరాలు గడిచాయి. కుట్రదారులు, భవిష్యత్తులో నడవబోయే బోఫోర్సు డ్రామాకి ప్రాతిపదికగా రాజీవ్ గాంధీకి మీడియా ’మిస్టర్ క్లీన్’ అనే టాగ్ తగిలించింది. బోఫోర్స్ కుంభకోణాం వెలుగుచూశాక రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ నుండి మిస్టర్ చీట్ గా పరిణమించాడని మీడియా ఎలుగెత్తి అరిచింది. ఇందుకోసమే ముందుగా ’మిస్టర్ క్లీన్’ అన్న బిరుదుని వీలయినంతగా ప్రచారించింది.

ఎన్.టి.ఆర్. ’తుప్పుపట్టిన తుపాకులు’ అంటూ ఎడతెగకుండా విమర్శించిన, ఈనాడు క్రమం తప్పుకుండా ప్రచారించిన బోఫోర్సు కుంభకోనం వెనుక అసలు కుట్ర ……….

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

1 comments:

బోఫోర్స్ కుంభకోణాం వెలుగుచూశాక రాజీవ్ గాంధీకి మిస్టర్ క్లీన్ నుండి మిస్టర్ చీట్ గా పరిణమించాడని మీడియా ఎలుగెత్తి అరిచింది. ఇందుకోసమే ముందుగా ’మిస్టర్ క్లీన్’ అన్న బిరుదుని వీలయినంతగా ప్రచారించింది.

కరెక్ట్ గా చెప్పారు

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu