చిన్నప్పుడు చరిత్ర పాఠంలో చిలకల్లా వల్లించిన ’గుప్తుల కాలం స్వర్ణయుగం’ అని చదువుకొన్న పాఠమే తెలుసు, మనలో చాలామందికి. రొటీన్ గా బట్టీ వేసి అప్పగించి, వ్రాసి, పరీక్షలై పోయాక మామూలుగా మరిచి పోయిన పాఠం -

1]. గుప్తులు కాలాన్ని స్వర్ణయుగం అంటారు.

2]. కళ, వాఙ్ఞ్మయం ఉచ్ఛ స్థితిలో ఉన్నాయి.

3]. వర్తక వాణిజ్యాలు పరిఢవిల్లెను.

4]. సిరి సంపదలతో ప్రజలు తులతూగేవారు.

అయిపోయింది పాఠం.

నిజానికి కళలూ, వాఙ్ఞ్మయం ఉచ్ఛస్థితిలో ఉండటం – అంటే ఏమిటో ఏ విద్యార్ధికీ అప్పుడే కాదు, ఇప్పుడూ తెలీదు. ఏ టీచరూ చెప్పరు. ఏ పాఠ్యపుస్తకంలోనూ ఉండదు.

ఒక జాతి అలోచనా సరళి, మేధస్సు, వారి కళ, సాహిత్యాల్లో ప్రతిబింబిస్తుంది.

తాజా ఉదాహరణ కావాలంటే సినిమాలే! నలుపు తెలుపు చిత్రాల్లోని [నూటికి 70%] భాష పరికించండి. కళాత్మక స్థాయి, హాస్యపు స్థాయి నుండి అన్నిరసాల స్థాయి పరిశీలించండి. నలుపు తెలుపుల నుండి 1975 వరకూ ఒక తీరు. క్రమంగా ఎంతగా అంటే మాస్ చిత్రాల పేరిట ఎంత నీచమైన భాషో! సినిమా స్రిప్టులోనూ, పాటల్లోనూ కూడా.
‘పయనించే ఓ చిలుకా! ఎగిరిపో పాడయి పోయెను గూడు’ అన్న తాత్త్విక స్థాయి నుండి

1]. “పండయితే పనికి రాదు ఆవకాయకు
పంటి కింద కరకర లాడేందుకు”


2]. కీస్ కీస్ పిట్టా, నేలకేసి కొట్టా


3]. తాగుతా నీయవ్వ తాగుతా.
తాగుబోతు ..........తల్లో దూరెళ్ళుతా.

[ఆ ఖాళీలో మాట ఇంకా నీచంగా ఉంది. అందుకని వ్రాయ లేదు.]

మాస్ పేరిట ఎంత బూతు స్థాయికి దిగాయే. మనందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే మళ్ళీ మనం ’గమ్యం, ఆనంద్, ఆష్టాచెమ్మా’ లాంటి అణిముత్యాలని చూడగలుగుతున్నది. ఇప్పుడే, ఒకటిన్నర దశాబ్థంలోనే కొంచెం మంచి చిత్రాలు, స్ర్కిప్టు బలంతోనూ, కథాబలంతోనూ ఉన్న చిత్రాలని చూస్తున్నాం.

అంతకు ముందంతా శ్రీవారి ముచ్చట్లు, లేదా పగ ప్రతీకారం, లేదా పడకింటి ముచ్చట్లు. [మచ్చుకి ఒకటి రెండు చెప్పాను. పరిశీలిస్తే వందలూ, వేల ఉదాహరణలు ఉన్నాయి.]
ఇప్పటికీ గమనించండి, కొంతమంది ప్రేక్షకులకి డైలాగ్ కామెడీ అర్ధం కాదు.

ప్రజలకి భాషకి అర్థం చేసుకొనే స్థాయి ఎంత ఎక్కువ ఉంటే ఆ సమాజం అంత పరిపక్వ ఆలోచనా స్థాయిలో ఉన్నట్లు [మనం మన మాతృ భాషని బ్రతికించుకోవలసిన స్థితిలోకి నెట్టబడటం వెనుక కుట్ర ఇప్పుడు మరికొంచెం బాగా అర్థం చేసుకోవచ్చు అనుకొంటాను]

మళ్ళీ వెనక్కి వెళితే ............

ఆనాటి మన కవులు కాళిదాసు, గణిత శాస్త్రవేత్తలు ఆర్యబట్టు, ఖగోళ శాస్త్రవేత్తలు వరాహ మిహిరుడు, వైద్యశాస్త్రవేత్తలు చరకుడు, అర్ధశాస్త్రవేత్తలు ఆర్య చాణక్యులు ఎందరో మహానుభావులు మన ముందు తరాల్లో ఉన్నారు. అశోకుడు Vs అలెగ్జాండర్ వంటిదే కాళిదాసు Vs షేక్స్ పియర్ విషయం కూడా. స్వయంగా కవులైన రాజులెందరో శ్రీహర్షుడి నుండి భోజ శ్రీకృష్ణదేవ రాయల వరకూ, ఎందరో. చంద్రగుప్తుడు సముద్రగుప్తుడు లాంటి మహారాజులెందరున్న మీడియాకి మాత్రం మొగలాయీ చక్రవర్తులు మాత్రమే కన్పిస్తారు చూడండి, దాని వెనుక ఉన్నది కూడా ’ఆత్మన్యూనతా’ సూత్రమే.

కావాలంటే మరో ఉదాహరణ చూడండి. దక్షిణ భారతం లోని దేవాలయాలు మధురై, కంచి, తంజావూరు, రామేశ్వరం, దాక్షారామం, కాళహస్తి ఇలా లెక్కకి మిక్కిలి దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. శిల్ప సంపదలోనూ, ప్రాచీన ఖగోళ ఙ్ఞానాన్ని కూడా నిర్మాణంలో ఉపయోగించిన ఇంజనీరింగ్ నైపుణ్యంలోనూ ఆకాశంలోకి ఠీవిగా తలెత్తిచూస్తాయి. కానీ మీడియాకి మాత్రం ’తాజ్ మహల్’ మాత్రమే కన్పిస్తుంది. అలాగన్న మాట. ఇలా చూస్తే కుట్రకు తార్కాణాలు, ఎన్నో కన్పిస్తాయి. ఇలాంటివి చరిత్ర తెలిసిన వాళ్ళు ఇంకా ఎన్నో చెప్పగలరు.

భారతదేశ చరిత్రలోకి పరికిస్తే మాత్రం వేల సంవత్సరాలుగా ఎందరో రాజులు స్వార్ధాన్ని, అతిశయించిన స్వసుఖాల్ని వదలి, ప్రజల కోసం, ధార్మిక కార్యాల కోసం ఎన్నో గుడులు, సరస్సులు, కాలవలు, బావులు, రవాణా సౌకర్యాలు సమకూర్చి తమ జీవితాన్ని సార్ధకం చేసుకొన్నారు. ఇవి ఏవీ మీడియాకి కనిపించవు. కార్పోరేట్ సంస్థలు, వాళ్ళ లాభాల్లో కొద్ది మొత్తం విదిలించిన దానికి చాలా ప్రచారం మాత్రం ఈ మీడియా కల్పిస్తుంది.

నిజానికి ఒకప్పుడు దేవాలయాలంటే కేవలం దైవ దర్శన ప్రదేశాలు కాదు. అవి ఙ్ఞానానికి, విద్యకి, కళలకి, యుద్ధ వ్వాయామశాలలకి సంస్కృతికి నిలయాలు. మీడియా వీటి మొత్తాన్ని చెరిపెస్తూ ’రాజుల సొమ్ము రాళ్ళపాలు’ అని ఒక మాటతో గుడులకు రాజులు ధనమంతా వృధా చేశారన్న మాటను ప్రచారించాయి.

వ్యవసాయాన్ని జీవనాడిగా కాపాడుకున్న రాజరిక వంశాలు, వ్యవస్థలే చరిత్రలో ఎక్కువ కన్పిస్తాయి.

వెయ్యేళ్ళక్రితం వరకూ ఈ స్థితిలో పెద్దగా ఒడిదుడుగులు లేవు. ఎంతగా బౌద్ధం మహాయాన హీన యానాలుగా నీచస్థితికి జారిపోయినా, తిరిగి హిందూమతం ఆదిశంకరాచార్యుల ప్రబోధాలతో ప్రజ్వరిల్లి ప్రజలు కట్టుదప్పుకుండా కాపాడింది. దక్షిణా పధంలో శైవవైష్ణవులు తెగ కొట్టుకున్నా, మానవ జీవితం భయానక నీతిబాహ్యతకీ తలుపులు తెరవలేదు.

క్రీ.శ. 1000 ల్లో గజినీ మహమ్మద్ భారత దేశమ్మీదికి దండెత్తి వచ్చాడు. సోమనాధ దేవాలయాన్ని లెక్కకు మిక్కిలి సార్లు దోచుకున్నాడు, ధ్వంసం చేశాడు. మెల్లిగా మహమ్మదీయుల దాడులు భారత దేశమ్మీద పెరిగి పోయాయి. మొదటగా వాళ్ళగురి హిందూ దేవాలయాలు, స్త్రీల మీదే.

అప్పటికి పరిస్థితి ఎలా ఉండేదంటే – హిందూ మతంలో కొన్నివర్ణాల, వర్గాల్లో దుఃహకార వ్యక్తుల మూలంగానూ, ఆలోచనా రహితంగా గుడ్డిగా ఆచరింపబడుచున్న మూఢాచారాల మూలంగానూ – ఆర్ధికంగా, సామాజిక హోదా పరంగా హీన వర్ణాలుగా వర్గాలుగా కొందరు ప్రజలని గుర్తించడంతో ఆయా వర్గాల్లో అసంతృప్తి, లోలోపల ఓ కసి పేరుకుపోయింది. తిలాపాపం తలా పిడికెడన్నట్లు గుడ్డిగా ఆచరించే వారు కొందరు, మూర్ఖత్వంతో అసలే వివేచననీ స్వీకరించని వారు కొందరూ, స్వార్ధంతో అన్నీ తమకి అనుకూలంగా ఉండేలా సమాజాన్ని శాసించిన వారు కొందరూ, అహఃకారంతో చలాయించిన వారు కొందరూ, వెరసి పిల్లి గంపల వంశాలు తయారయ్యాయి.

ఈ పిల్లి గంపల వంశం పిట్టకథ ఏమిటంటే -

[ఈ పిట్టకథ నేను డి.వి. నరసరాజు గారు ఒక రాజకీయ వ్యాసంలో వ్రాయగా చదివాను]

ఒకవూరిలో ఓ పెద్ద మోతుబరి కుటుంబం ఉండేది. తరతరాలుగా ఉమ్మడి కుటుంబం. తాతలు తరం, తండ్రుల తరంతో వెరసి అప్పటికి ఆ కుటుంబంలో 30 మంది దాకా పెద్దవాళ్ళు, 50 మంది దాకా పిల్లవాళ్ళు, గొడ్డూ గోదా, పిల్లా మేకా, పాడిపంట! పెద్దలోగిలిలో అంతా కలిసే ఉంటారు. అత్తలూ, కోడళ్ళూ అంతా సఖ్యంగా, తోబుట్టువులూ, దాయాదులూ సమైక్యంగా పనులు చేసుకుంటూ సుఖంగా ఉండే వాళ్ళూ. పాడీపంట ఎక్కువే, పిల్ల సైన్యమూ ఎక్కువే కావటంతో వాళ్ళ ఇంట్లో ఎలుకల బాధ మెండుగా ఉండేది. దాంతో పదిపన్నెండు పిల్లుల్ని పెంచేవాళ్ళు. రోజూ పిల్లలతో పాటే ఉదయాన్నే పిల్లులకి కూడా పాలబువ్వా, పెరుగన్నమూ పెట్టేవాళ్ళు.

అయితే పండగ రోజున మాత్రం దైవ పూజ అయ్యేదాకా పిల్లలకి కూడా ఏమీ పెట్టరు గదా! అసలే ఆ రోజుల్లో ఆచారాలు గట్టిగా పాంటించే వాళ్ళయ్యె! పిల్లలు పెద్దలకి భయపడో, దేవుడి మీద భక్తితోనో ఓర్చుకొనేవాళ్ళు. కానీ పిల్లులు మాత్రం ఆడవాళ్ళ కాళ్ళకి చుట్టుకుంటూ పనులు చేసుకోనివ్వకుండా ’మియ్యాం’ అంటూ వెంటపడేవి. దాంతో పూజయ్యే దాకా పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టటం చేసేవాళ్ళు. రాను రాను అదో ఆచారం లాగా పండగ రోజు ఉదయాన్నే పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టి పూజ పూర్తయ్యాక విడిచిపెట్టటం చేసేవాళ్ళు. దాంతో వాళ్ళది పిల్లిగంపల వంశం అనే సార్ధక నామం ఏర్పడింది.

కాలం గడిచింది. రోజులు మారాయి. ఉమ్మడి కుటుంబం, చిన్న [న్యూక్లియర్] కుటుంబాలయ్యింది. తర్వాతి తరాల్లో ఓ కుటుంబం ముంబాయి అపార్ట్ మెంట్లులో కాపురముంటూ కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తుంది. కానీ తమ ఆచారం ప్రకారం పండగ నాడు పిల్లుల్ని వెదుక్కొచ్చి, గంపల తెచ్చి కప్పిపెట్టటం అంటే చచ్చే చావయ్యిందిట. గంపలు కొని, పండగలయ్యాక పదిలంగా అటకల మీద ఉంచటం, పిల్లుల్ని వెదకటం – ఓహ్! భీభత్సం! చివరకి తెలిసిన వాళ్ళ ’పెట్’ పిల్లుల్ని అరువు తెచ్చుకోవటం, పిల్లుల్ని పెంచే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం లాంటి నానా యాతనలూ పడ్డారట. పిల్లుల్ని పెంచుదామంటే భార్యభర్తలిద్దరు ఉద్యోగం చేసే చోట దాన్ని పదిలంగా పెంచనూ లేరు, పోనీ పెంచుదామన్నా అది ప్రక్క వారి అపార్ట్ మెంట్లో ఏదైనా గల్లంతు చేసిందంటే ఆ’న్యూసెన్సూ’ ’నాన్ సెన్సు’ భరించటం కష్టం.

ఇదంతా చెప్పుకొని సదరు గృహస్తూ నిట్టూర్చాడట.

ఇదీ కథ!

ఆనాడు అవసరం నుండి ఆచారం పుట్టింది. ఆలోచన లేని ఆచరణ ఈ రోజు ఆచారం పేరిట విచారం పుట్టిస్తోంది. లోపం ఎక్కడుంది? నిశ్చయంగా `అనాలోచన’ లోనే కదా? అనాలోచనకి తర్వాతి పరిణామం మూర్ఖత్వమే.

ఇలా కొందరిలోని అనాలోచన, మూర్ఖత్వం, స్వార్ధం, అహాం వెరసి హిందూ మతంలోనూ, బౌద్ధ మతంలోనూ ఎన్నో లోపభూయిష్ట పద్ధతులకు పెద్దపీట వేసాయి. ఇది ప్రజల్లో చాలామందికి విసుగూ, మతం పట్ల నిరాసక్తత కలిగించాయి.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

5 comments:

As you said there are more people in India they are served this society much better than Theresa but media can see only Theresa.

Mana matham lo vunnatte lopa booistalu anni mathallonu vunnayi kaani theda entante vere mathalla hindhusm organised kadhu. oka hindhu evariki report cheyyalsina avasaram ledhu. varanikokasari temple kelli attendence veinchukovalsona avasaram ledhu.
Hindhu mathamlo disadvantages kante advantagese ekkuva. kaani mana disadvantages ni vere mathalavaallu vaallaku anukulamga chesukontunnaru.
vere mathallo controlling stop chesthe avi konni years lone collapse ayyipothayi. kani hindhumatham is surviving since thousands of years without organization and controlling. That is the greatness of Hindhusm.

వెంకట్ గారూ,

చాలా చక్కగా విశదీకరించారు. కానీ తెలుగులో వ్రాస్తే మరింతగా చొచ్చుకుపోతుంది కదా! వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

వెంకట్ గారు బాగా చెప్పారు.

ఆదిలక్ష్మి గారు, మీరు చెప్పింది నిజమే నాకు మొఘల్ వంశస్తుల గురించి తెలిసినంతగా కాకతీయుల(ఒక ఓరుగల్లు వాసినయినప్పటికిని) గురించి పెద్దగా తెలియదు నా చదువు(పదవ తరగతి) అయిపోయే వరకు తర్వాత్తర్వాత నా చుట్టూ ఉన్న గొప్ప శిల్పకళా సంపద చూసి వారి గురించి తెలుసుకున్నాను. ఇది కుట్ర అవునా కాదా అని చెప్పటం లేదు ఇది నిజం అని చెబుతున్నా.

కథ చాలా బాగుంది :)
మన భారతీయ రాజుల గురించి తక్కువ ప్రస్తావన ఉండడం.. పుస్తకాల్లో భారత చరిత్రలో అక్బరు,బాబరు, ఔరంగజేబు ఇలాంటివాళ్ళవే ఎక్కువ ఉండడం ఖచ్చితంగా ఒక కుట్ర ప్రకారం జరిగినవని నేను కూడా నమ్ముతాను. ఇప్పటికయినా మన పాలకులు కళ్ళు తెరిచి సిలబస్‌లో మార్పులు చేయాలి.
ఇది చూడండి:
Rajaraja the Great. The great hindu king ever ruled. Historical Temples that he built.

http://video.google.com/videoplay?docid=-5096103596865842301

ఇటువంటి గొప్ప రాజుల గురించి, నిర్మాణాల గురించి మనకు తెలియకపోవడం శోచనీయం.

కన్నా గారు,

మీరు చెప్పిన మొఘలులు Vs ఓరుగల్లు రాజులు లాంటి నిజాలు మన చుట్టు నూటికి ఒకటో రెండో, పదో ఇరవయ్యో ఉంటే వాటిని ’నిజాలు’ అనవచ్చు. కానీ నూటికి నూరూ అలాంటి నిజాలే ఉంటే ఆ స్థితినే ’కుట్ర’ అనాలి. ఎందుకంటే theory of probability ప్రకారమైనా సంభావ్యత x/100 ఉంటే Random Event అంటాం, గానీ 100/100 ఉంటే – దాన్ని Definite Event అంటాం కదా!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu