వారం పదిరోజుల్లో మహారాజు బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకున్నాడు. రాణిగా ఆమెకూ ఓ రాజప్రాసదం, పరిచారికలూ, ఇతర రాణులకి లాగానే సకల సౌకర్యాలూ అమర్చబడ్డాయి. ఇదంతా ఇతర రాణులకి, పట్టమహిషికీ మరింత ఈర్ష్యసూయలు రేపింది. రాణులూ, వారి మద్దతుతో ఇతర పరిచారికలూ, బ్రాహ్మణ యువతిని గురించి విమర్శలూ, హేళనలూ, ఎత్తిపొడుపులూ పరోక్షంగానూ, ఆమెకు వినబడి, వినబడనట్లు అంటుండే వాళ్ళు. ఎంతో సహనంతో ఇవన్నీ భరిస్తూ ఆమె మౌనంగా ఉండిపోయేది.

కొంతకాలం గడిచింది. బ్రాహ్మణ రాణికి ఓ బాలుడు జన్మించాడు. ముద్దులు మూటగట్టినట్లున్న బిడ్డడ్ని చూసుకొని ఆమె చాలా మురిసిపోయింది. కొడుకుని ముద్దులాడుతూ “నా శోకాన్ని తీర్చడానికే పుట్టావు తండ్రీ! నా చిన్నారి అశోకుడివి నీవు. శోకం లేని అశోకుడవు నీవు” అనేది. ఆ పేరే ఆబాలుడికి స్థిరపడింది.

శోకమయమైన ఆమె జీవితంలో కుమారుడు అశోకుడే వెలుగురేఖ. ఆమె ప్రపంచమంతా అతడే. ఆ బిడ్డకి పురాణీతిహాసాలూ, నీతికథలూ చెపుతూ మంచిప్రవర్తన నేర్పుతూ పెంచింది. అశోకుడు బలమైన వాడిగా, గాఢమైన భావనలూ, ధైర్యసాహసాలూ, సునిశిత ఆలోచనా గల యువకుడిగా ఎదిగాడు. ఇతర రాణులూ, వారి సంతానం, వారి పరిచారికలూ తల్లి గురించి హేళనగా మాట్లడటం అశోకుడిలో క్రోధాన్ని, పౌరుషాన్ని రెచ్చగొట్టేవి.

ఓరోజు రాజోద్యానవన మార్గంలో అశోకుడికి ఎదురుగా పట్టమహిషి మొదటి కుమారుడు ’సుశేణుడు’ తారసపడ్డాడు. అశోకుడి వైపు ఎగతాళిగా చూస్తూ “దాసి పుత్రుడా! నా దారికి ఎదురుగా వచ్చే అర్హత నీకు లేదు. తప్పుకో” అన్నాడు.

అశోకుడికి వల్లమాలిన కోపం వచ్చింది. క్రోధపూరితమైన గొంతుతో “నాతల్లి గురించి అవమాన కరంగా మాట్లాడకు. ఆమె కూడా నీ తల్లి లాగే రాణి. మహారాజు బిందుసారుడామెను వివాహం చేసుకొన్నాడు. నీకూ నాకూ కూడా ఆయన తండ్రి. నా తల్లిని అవమానించడం ద్వారా నీవు మన తండ్రి, మహారాజు బిందుసారుణ్ణి కూడా అవమానిస్తున్నావు” అన్నాడు.

సుశేణుడు జవాబివ్వకుండా అశోకుడితో కలబడ్డాడు. కానీ అశోకుడు ధృడగాత్రుడవటం చేత సుశేణుణ్ణి అశోకుడు చేతులు వెనక్కి విరిచి కదలకుండా నిలబెట్టాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మహామంత్రి ఇదంతా పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆయన ఇద్దర్నీ నిరోధించి అక్కణ్ణుంచి వెళ్ళిపోవలసిందిగా మహారాజు బిందుసారుడి పేరిట ఆఙ్ఞాపించాడు. ఇద్దరూ ఒకరి నొకరు ద్వేషదృక్కులు చూసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.

మహామంత్రి ఈ విషయాన్నంతా మహారాజుకు వివరించాడు. అప్పటికి బిందుసారుడు అనారోగ్యంతోనూ, రాజకీయ ఒత్తిళ్ళతోనూ బాధపడుతున్నాడు. రాజు మంత్రులతో అంతఃపుర పరిస్థితుల గురించీ, రాజపుత్రుల సామర్ధ్యాల గురించి, తమ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించీ చర్చలు జరిపాడు. చివరికి వారంతా కలిసి తమ సామ్రాజ్యంలో రాజధానికి సుదూరంగా ఉన్న ప్రాంతంలో చెలరేగిన అలజడిని నివారించడానికి అశోకుణ్ణి గానీ, సుశేణుణ్ణి గానీ పంపాలని నిర్ణయించారు. బిందుసారుడు తన పుత్రులే ఏ నిర్ణయం తీసుకొంటారో పరీక్షించాలనుకున్నాడు. రాకుమారులందర్నీ పిలిపించి, పరిస్థితి వివరించాడు. “సైన్యంతో వెళ్ళి ఆ రాజకీయ తిరుగుబాటుని అణచేందుకు ఎవరు వెళతారు?" అనడిగాడు.

సుశేణుడు యుద్దానికి పోవాలంటే వెనకడుగు వేసాడు. అశోకుడు ముందడుగు వేసాడు. యుద్దానికి వెళ్ళి పరిస్థితి చక్కదిద్దడానికి తన సన్నద్ధతని చెప్పాడు. బిందుసారుడు అశోకుణ్ణి మెచ్చుకొన్నాడు. సుశేణుడితో “పిరికిపందా! వెళ్ళి అంతఃపురంలో ఎలుకలాగా ఆడుకో!” అన్నాడు.

ఈ సంఘటన రాజధానిలోనూ, అంతఃపురంలోనూ సంచలనం రేపింది. అశోకుడు రాజకీయ అలజడిని నిరోధించేందుకు యుద్దసన్నద్ధుడై వెళ్ళాడు. ఆ యుద్ధంలో అశోకుడి నైపుణ్యం, సామర్ధ్యం అందరికీ వెల్లడి అయ్యింది. జయప్రదంగా అలజడిని అణిచేసాడు. తన రాజకీయ నీతిఙ్ఞతతో అక్కడ శాంతి పూర్వస్థితిని కలిగించాడు. అతడి ఈ విజయం ’బిందుసారుడి వారసుడెవరు’ అన్న ప్రశ్నను తెరపైకి తెచ్చింది.

బిందుసారుడు రాజగురువు, చాణక్యుడి సలహా కోసం ఆశ్రయించాడు. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆచార్యుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయమంతా సావధానంగా విన్నాక ఆయన “నాయనా! రేపు ఉదయమే నీ పుత్రులందర్నీ దేవీ అలయానికి రమ్మని ఆఙ్ఞాపించు. వచ్చేముందు బలవర్థకమైన ఆహారాన్ని భుజించి, మంచి వాహనాన్ని అధిరోహించి రమ్మని చెప్పు. దేవాలయంలో కూర్చునేటందుకు విలువైన ఆసనాన్ని వెంట తెచ్చుకొమ్మని చెప్పు” అన్నాడు.

బిందుసారుడలాగే తన కుమారులందరికీ ఆఙ్ఞాపించాడు. మహారాజు, మంత్రులూ, విషయం తెలిసిన ఇతర ప్రజలూ – అందరూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత చెందారు.

నిర్ధేశింపబడిన సమయానికి రాకుమారులంతా దేవాలయం చేరారు. తమ ఆసనాలనీ వెంట తెచ్చుకున్నారు. ఒకరు బంగారు కుర్చీని తెచ్చుకున్నారు. ఒకరు దారుశిల్పంతో నిండిన ఆసనాన్ని తెచ్చుకొన్నారు. పట్టువస్త్రాలతోనూ, పరుపులతోనూ అలంకరించి ఆసనాన్ని మరోకరూ, ముత్యాలూ, రతనాలూ పొదగబడిన పీటను ఇంకొకరు తెచ్చుకున్నారు. ఒకొక్కరూ ఒకో వాహనం పైన వచ్చారు. ఒక రాకుమారుడు పల్లకిలో వచ్చాడు. ఒకరు గుర్రమీద, ఒకరు ఏనుగు అంబారీ పైనా, మరొకరు రధంలోనూ .... ఇలా ఎవరికి మంచిదనిపించిన వాహనం మీద వారు వచ్చారు.

దేవాలయ ప్రాంగణంలో మహారాజు, మంత్రులు, ఆచార్యుడు అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చోన్నారు. వారికి ఎదురుగా రాకుమారులంతా తమ తమ వెంట తెచ్చుకున్న ఆసనాలపై కూర్చొన్నారు. వారిలో అశోకుడు ఒక్కడే కటిక నేలపై కూర్చొని ఉన్నాడు. అది చూసి ఇతర రాకుమారుల ముఖమ్మీద ముసిముసినవ్వు కదలాడింది. అందులో హేళన మిళితమై ఉంది. దాసీ పుత్రుడికి అంతకంటే ఏం ఉంటుందన్న ఎగతాళి ఉంది.

ఆచార్యుడు అడిగాడు “మీరంతా ఒకరి తర్వాత ఒకరు, ఇక్కడికి వచ్చేముందు ఏ ఆహారం స్వీకరించారో చెప్పండి”.

రాకుమారులంతా తామేం తినివచ్చారో ఒకింత గర్వంగా చెప్పారు. అశోకుడి వంతు వచ్చింది. స్థిరమైన గొంతుతో అశోకుడు “గిన్నెడు పెరుగు” అన్నాడు. రాకుమారులంతా ఫక్కున నవ్వారు.

ఆచార్యుడు “బలవర్థమైన ఆహారం స్వీకరించి రమ్మని నీకిచ్చిన ఆఙ్ఞ. మరి పెరుగెందుకు తిన్నావు?" అని అడిగాడు.అశోకుడు తడబాటు పడకుండా “ఆచార్య! మీరిచ్చిన ఆఙ్ఞని నా తల్లికి యధాతధంగా చెప్పాను. ఆవిడ నాకు ఉదయమే పెద్దగిన్నెడు పెరుగు ఇచ్చింది. తల్లిగా ఆమెకు – బిడ్డకు మంచి ఆహారమేదో, సందర్భానికి తగిన ఆహారం ఏదో తెలుసు. కాబట్టి మారు మాట్లాడక ఆమె పెట్టింది తిని వచ్చాను” అన్నాడు.

చాణక్యుడు తలాడించి, "ఒకరి తర్వాత ఒకరు, మీరు ఇక్కడకు ఏయే వాహనాల మీద వచ్చారో చెప్పండి” అన్నాడు.

రాకుమారులంతా తాము ఏ వాహనాల మీద వచ్చిందీ చెప్పారు. అశోకుడి వంతు వచ్చినప్పుడు అతడు “నేను నడిచి వచ్చాను” అన్నాడు. ఈ సారి రాకుమారులు నవ్వే ధైర్యం చెయ్యలేదు. ఆచార్యుడు, తండ్రి, ఇతర పెద్దల ముఖాల్లోని గాంభీర్యం వాళ్ళని నవ్వే ధైర్యం చెయ్యనివ్వలేదు.

ఆచార్యుడు “ఆశోకా! నీకు నచ్చిన మంచి వాహనం మీద రమ్మని కదా నా ఆఙ్ఞ. మరి నడిచి వచ్చే నిర్ణయం ఎందుకు తీసికొన్నావు?"

అశోకుడు వినయంగా “ఆచార్య! నా దృష్టిలో నా కాళ్ళ కంటే గొప్ప వాహనం నాకు మరొకటి కన్పించలేదు. భగవంతుడు నాకు ఇంత బలమైన మంచి కాళ్ళను ఇవ్వకపోయి ఉంటే నేను రధం, అశ్వం, గజం వంటి ఏ ఇతర వాహనాన్ని ఉపయోగించలేను కదా” అన్నాడు.

ఆచార్యుడు చిరునవ్వు నవ్వాడు. “అశోకా! అందరూ బంగారం, ఇంకా విలువైన ఆసనాలు మీద కూర్చున్నారు. నీవు నేల పై ఎందుకు కూర్చున్నావు?” అన్నాడు.

అశోకుడు “ఆచార్య! నా దృష్టిలో భూమి – బంగారం లాంటి లోహాల కంటే, మణిమాణిక్యాల కంటే విలువైనది. ఎందుకంటే అవన్నీ మనకు భూమి నుండే లభిస్తాయి. భూమి కంటే మరేదీ విలువైనది లేదని నా అభిప్రాయం. అందుకే భూమినే ఆసనంగా చేసుకున్నాను!” అన్నాడు.

ఒక్కసారిగా చప్పట్లతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందరూ అశోకుడి సునిశిత అలోచనా సరళినీ, దృక్పధాన్ని మెచ్చుకున్నారు. అశోకుడే బిందుసారుని వారసుడన్నది పరోక్షంగా ముద్రపడిపోయింది. బిందుసారుడు అశోకుడి తల్లీ, తన భార్య ఐన బ్రాహ్మణ రాణిని, కొడుకు నలా పెంచినందుకు ఎంతగానో అభినందించాడు. తానెంతో ఆనందించాడు.

తదుపరి కథని చిన్నతరగతుల్లో చరిత్ర పాఠ్యాంశంగా చాలా మంది చదివాము.

బిందుసారుని మరణానంతరం సింహాసనం కోసం వారసుల మధ్య అంతఃకలహాలూ, యుద్దాలూ జరిగాయి. అశోకుడు తన తోడబుట్టిన వారిని కొందరిని చంపీ, మరికొందరిని పారద్రోలి సింహాసనాన్ని అధిష్టించాడు. చిన్నప్పటి నుండీ తల్లీ, తాను పడ్డ అవమానాలతో, అణచుకున్న క్రోధం అతడిలో కసినీ, కౄరత్వాన్ని ప్రకోపింపచేసింది. సింహాసనం అధిష్టించాక రాజ్యవిస్తరణకై ఎన్నో యుద్దాలు చేశాడు. అతణ్ణి ప్రజలు ’చండాశోకుడు’ అన్నారు.

అశోకుడి తల్లి జాతకం గురించిన జ్యోతిష్యమే నిజమైందో లేక జ్యోతిషశాస్త్రం మీద ఆమెకున్న నమ్మకమే నిజమైందో గానీ అశోకుడు చక్రవర్తి అయ్యాడు. అయితే రాజ్యకాంక్ష అశోకుడిలో అవధులు దాటి, క్రౌర్యం, కాఠిన్యం అతడిలో పెరిగిపోయాయి.

ఒకసారి అశోకుడు కళింగ దేశాని [ఈనాటి మన ఒరిస్సా] జయించేందుకు యుద్ధం చేస్తున్నాడు. చారిత్రకంగా లక్షమంది సైనికులు దాకా మరణించారనీ, 60,000 పైబడి క్షత గాత్రులయ్యారనీ అంటారు. ఒకరాత్రి రణ రంగంలోని తన గుడారం నుండి అశోకుడు బయటకొచ్చాడు. రణభూమి మరుభూమిలా ఉంది. మసక వెన్నెల్లో నక్కలు పీక్కుతింటున్న సైనికులు మృతకళేబరాలను చూశాడు. క్షతగాత్రుల బాధాతప్త మూలుగుల్నీ, కన్నీటినీ, మృత్యువు కోసం ఎదురుచుస్తున్న వారి మరణ యాతననీ చూశాడు. విశాలమైన ఆ రణభూమిలో ఆకాశం సాక్షిగా, జీవన భృతి కోసమో, మాతృభూమి పరిరక్షణ కోసమో ప్రాణాలర్పిస్తోన్న వారి వెతని చూశాడు.

తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోయాడు.

ఎవరికోసం ఇప్పడీ సైనికులంతా మరణించారు? ఎవరి శ్రేయస్సు కోసం వీళ్ళు, వీళ్ళ కుటుంబసభ్యుల జీవితాలు ఇలా వెతలు పాలయ్యాయి? యుద్ధం, రాజ్యవిస్తరణ – ఏం ప్రయోజనం కలిగిస్తుంది? జీవితానికి అర్ధం సంపద సమీకరణేనా?

అశోకుడి హృదయం అగ్నిగుండమయ్యింది. మనస్సులో శాంతి కరువయ్యింది. సత్యం కోసం అన్వేషణ ప్రారంభించాడు. బౌద్ధ భిక్షువులతో చర్చించాడు. అప్పుడాయనకి జీవితానికి అర్ధం ఏమిటో అర్ధమయ్యింది.

ఈ సందర్భంలో ఓ చిన్ని సంఘటన వివరిస్తాను. బుద్ధుడి గురించి, అశోకుడి గురించి ఓ సారి నా విద్యార్థులకి [పదేళ్ళ బుడ్డోళ్ళు] వివరిస్తున్నాను. పాఠమంతా అయ్యాక నా విద్యార్ధుల్లో ఓ పిడుగు “మామ్! నాకు వ్రాసుకునేందుకు ’పెన్సిల్’ కావాలి. అది కోరికేనా?" అంది. మరో గడుగ్గాయి “ఆకలేసినప్పుడు అన్నం తినాలనిపిస్తుంది. అది కోరికేనా మామ్” అంది. వాళ్ళు లాజికల్ గానే అడిగారనిపించింది.

నేను “వ్రాసుకునేందుకు పెన్సిల్ కావాలి నాన్నా! అది కోరిక కాదు. అవసరం. అమ్మని అడుగుతాం. ఇంట్లో ఉన్న ఓ హాఫ్ పెన్సిల్ అమ్మ ఇస్తూంది. కానీ మనకి మన ప్రక్కవాడికి కొత్త పెన్సిల్ పొడవాటి పెన్సిల్ ఉందని తెలుసు. మనకీ కొత్తదీ పొడవాటిదీ కావాలనిపిస్తుంది. ఈ పాత పెన్సిల్ నాకు వద్దు. కొత్తది కావాలంటాం. అది కోరిక. అప్పుడేమవుతుంది?" అన్నాను.

"అమ్మ రెండు తంతుంది” అంది ఆ బుడ్డిది.

"అంటే మన కోరిక మనకి కష్టాలు తెచ్చిపెట్టిందనే కదా!” అన్నాను నవ్వుతూ.

మరో గడుగ్గాయి ఉందిగదా! అది ఊరుకుంటుందా? " మరి ఆకలేసినప్పుడు మామ్?" అంది.

"అవునురా! ఆకలేస్తుంది. అన్నం తినాలన్పిస్తుంది. అది అవసరం. అమ్మని అడుగుతాం. అమ్మ అన్నం పప్పు వేసి పెడుతుంది. మనకీ చికెన్ కూర, బిర్యానీ కావాలనిపిస్తుంది. అది కోరిక. అవసరం లిమిట్ ఎక్కడ దాటి, అది కోరికగా మారుతుందో గమనించుకోగలిగితే సుఖంగా ఉంటాం. అలాగని అన్నిసార్లు ఉన్నవాటితో సర్ధుకోలేం. అప్పుడు జీవితంలో ఎదుగుదల ఉండదు. అక్కడా లిమిట్ పాటించాల్సిందే” అన్నాను.

వాళ్ళకెంత అర్ధమయ్యిందో గానీ నవ్వులు చిందిస్తూ వూరుకున్నారు. వాళ్ళకి బోధిస్తున్నప్పుడు మాత్రం నాకు తెలిసినవే మరింత కొత్తగా కన్పిస్తూ చాలా నేర్చుకొన్నాను.

సరే! ఈ కబుర్ల నుండి మళ్ళీ మనం అశోకుడి దగ్గరి కొచ్చేద్దాం.

ఎప్పుడైతే కసీ, క్రౌర్యం నుండి మంచీ చెడు వివేచన వైపుకి మళ్ళాడో, అప్పుడే చండాశోకుడు ధర్మశోకుడిగా పరివర్తన చెందాడు. బాల్యంలోనే ఆయన తల్లి, అశోకుడిలో ఈ పరిపక్వత, పరిణత ఆలోచనా సరళి, మానవీయత, భావవాద సరళి తాలుకు బీజాలు నాటిన ఫలితమే ఈ పరివర్తన. పిల్లల పెంపకంలో తల్లితండ్రుల, ముఖ్యంగా తల్లిపాత్ర ప్రాముఖ్యత ఇది. తల్లి తాను స్వయంగా ధీరురాలు కానిదే, యోధురాలు కానిదే [యుద్ధంలో పోరాడే వారినే యోధులని అనం. జీవితమూ యుద్ధరంగమే. అందులోనూ ఉండేదీ పోరాటమే] తన బిడ్డల్ని ధీరులుగానూ, యోధులుగానూ మలచలేదు కదా! [నేను చూసిన చాలా మంది, పిల్లలకి పిరికితనాన్ని పోస్తూ వాళ్ళు డైనమిక్ గా లేరని బాధపడటం చూసాను.]

ధర్మాశోకుడు ఎన్నో మంచి పనులని [ ఇప్పటి మన ప్రభుత్వాలు చెప్పే కాకిలెక్కల అభివృద్ధి మంచి పనులు కావు ] ప్రజల కోసం చేశాడు. ఆయన రాజ్యపరిపాలనా విధానం సమగ్రంగా, సమర్ధంగా ఉండేది. దారి కిరుప్రక్కలా నీడనిచ్చే చెట్లతో రహదారులు నిర్మించాడు. ఒక్కసారి క్రీ.పూ. 272 కాలాన్ని ఊహిస్తే – దుర్గమారణ్యాలు నడుమ, కౄర మృగాలుండే అడవుల లోనుండి మనుష్యులు కాలినడకనో, జంతువుల మీదో, లేక జంతువులులాగే బండ్ల మీదో ప్రయాణించే కాలంలో, దారి కిరుప్రక్కలా నీడనిచ్చే చెట్లతో, విశాలమైన బాట, అక్కడక్కడా మంచినీటి సౌకర్యం కోసం బావులూ, విశ్రాంతి కోసం మండపాలతో, ఎంతగా ప్రజలకు అవసరాన్ని తీర్చేవో కదా! నిజానికి ఈ రోజు కూడా రోడ్లన్నవి చాలా ముఖ్యమైన మౌలిక సదుపాయాలు. ఏప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ముందు కావలసింది రవాణా సౌకర్యమే. అశోకుడు తన పుత్రికనీ, పుత్రుణ్ణి సుమిత్రా దీవులకి, ఇండోనేషియా లాంటి దేశాలకి పంపించి బౌద్ధమత ప్రచారం చేశాడు. [అందుకోసం మిషనరీలు పెట్టి ఆశపెట్టో, ప్రలోభపెట్టో మతమార్పిడిలు చేయించే ఈనాటి మత ప్రచారం లాంటివి కాదు ఆనాడు జరిగింది. స్వదేశంలోనే రాజ్యకాంక్ష విడిచిపెట్టిన అశోకుడు పరదేశాల్లో ఏదో ఆశించనూ లేదు. అందుకోసం మతప్రచారం చేయలేదు] ప్రజలు నీతిని, విలువల్నీ, ధర్మాన్ని పాటించేలా చేశాడు. అందుకే ఆయన రాజ చిహ్నం నాలుగు సింహాలను ’సత్యమేవ జయతే’ అన్న నినాదంతో మన జాతీయ చిహ్నంగా తీసుకొన్నారు. [దాని మీద ఎన్ని కుళ్ళు జోకులు మీడియా ప్రచారించినా సత్యం జయించకుండా పోదు గదా] ధర్మ చక్రం మన జాతీయ జండా మధ్యలో ఉంటుంది.

అదీ ప్రాచీన భారతీయ రాజుల రాజకీయం, పరిపాలనా విధానం.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************
ఓ చిన్న గమనిక: చారిత్రకాంశాల మీద [స్థల కాలాల మీద] నాకంతగా సాధికారత లేదు. అవసరమైన చోట నాకు అందుబాటులో ఉన్న పుస్తకాల మీద ఆధారపడ్డాను. ఆయా గొప్పవారి జన్మస్థలాల గురించో, కాలాల గురించో, ఏదైనా సంఘటనల గురించో ఏవైనా పొరబాట్లుంటే మన్నించగలరు.

ఈ టపాల్లో నా ఉద్దేశం రాజకీయ రంగం మీద కుట్ర కోణాన్ని వివరించడం. అందులో క్రమ పరిణామాన్ని చెప్పేముందు, చారిత్రక స్ఫూర్తిని చెప్పే ప్రయత్నం చేశాను.]
***********

6 comments:

చాలా మంచి పోస్టు. అశోకుడి గొప్పదనం గురించి తెలుసుకానీ అంతకు ముందు కథ తెలియదు. చక్కని భాషలో విపులంగా చెప్పారు. మీ ఓపికకు జోహార్లు.

అశోకుడి గురించి కొంత తెలుసు ఇంకొంత ఏ టపా ద్వార తెలుసుకున్నాను, చాలా సంతోషం.
"తల్లి తాను స్వయంగా ధీరురాలు కానిదే, యోధురాలు కానిదే తన బిడ్డల్ని ధీరులుగానూ, యోధులుగానూ మలచలేదు కదా" ఇది ముమ్మాటికి నిజం, గ్రీకుల అశోకుడైన అలెగ్జాండర్ ఇతివృత్తం కూడా ఇలాంటిదే, అలెగ్జాండర్ తల్లి కూడా అతనికి చిన్నప్పటి నుండి ధైద్యసాహసాలు నూరిపోసింది.

chala baga rasarandi.

-Karthik

chala manchi post.

ashokudu is not great as u think he was defeated in the war of kalinga in the hand of the princess in a single combat,..that failure lead him to depression and got in the buddhism .. at that moment buddists monks are in kalinga....

Anonymous garu,

మీకు సమయం అనుమతిస్తే క్రింది లింక్ లోని నా టపా చూడగలరు.
http://ammaodi.blogspot.com/2009/01/8.html

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu