పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, శవాన్ని దించి భుజాన వేసికొని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు.
ఇది మనం చిన్నప్పటి నుండీ చందమామ భేతాళ కధా ప్రారంభంలో చదివి మురిసిపోయే వాక్యం.
అలాంటిదే ఈ అమ్మఒడి టపా తొలివాక్యం.
ఎప్పటిలాగే ముందుగా మీకో కథచెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధుల్ని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.
ఇది మనం చాలాసార్లు విన్న, చెప్పిన, చదివిన కథ. కాని మన జీవితాల్లో దాని అనువర్తనా ప్రభావం మాత్రం, మనం గమనించనిదీ, చాలా ముఖ్యమైనదీను.
ఓసారి సముద్రంలో తుఫాను రేగింది. ఎగసి పడే అలలకీ, సుడి గాలికీ ఓ కప్ప విధివశాత్తు చిక్కుకొని ఎగిరివచ్చి దాపులనున్న గ్రామంలోని బావిలో పడింది. సముద్రపు కప్పని చూచి ఆ బావిలోనే చాలాకాలం నుండీ నివసిస్తూన్న కప్ప గెంతుకుంటూ దగ్గరికొచ్చింది.
"ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు?" వింతగా చూస్తూ సముద్రపు కప్పని అడిగింది బావికప్ప.
"నేను సముద్రపుకప్పని. సముద్రం నుండి ఎగిరి వచ్చి, ఖర్మకాలి ఈ బావిలో పడ్డాను” అంది కొంచెం దర్పం, కొంచెం విచారం కలిపిన స్వరంతో సముద్రపు కప్ప.
"ఎందుకంత విచారం? ఈ బావి చాలా పెద్దది" అంది ఓదార్పుగా బావి కప్ప.
సముద్రపు కప్ప నిస్పృహగా బావి కప్పవైపో చూపు విసిరి "సముద్రం చాలా పెద్దది!" అంది.
"ఎంత పెద్దది?" అంది బావికప్ప కుతూహలంగా!
"చాలా చాలా పెద్దది." అంది సముద్రపు కప్ప.
పాపం! తన జీవితంలో సంభవించిన అంత పెను విషాదాన్ని ఇంకా అది జీర్ణించుకోలేదు. దాని నిర్వేదంలో అది ఉంది.
ఇదంతా పట్టించుకోని బావికప్ప "ఎంతపెద్దది సముద్రం? ఇంత ఉంటుందా?" అంటు బావిలో ఓ వృత్తం గీచి చూపెట్టింది.
సముద్రపు కప్పకి నవ్వొచ్చింది. ఆపైన బావి కప్పపై జాలేసింది. ఓపిగ్గా "కాదు. ఇంకా పెద్దది" అంది.
"అవునా? అయితే ఇంతపెద్దదా?" ఈసారి ఇంకొంచెం పెద్దవృత్తం గీచి అడిగింది బావికప్ప కళ్ళింత చేసి,
ఈసారి సముద్రపు కప్పకి ఏడుపొచ్చింది.
"కాదు. చాలా చాలా పెద్దది." అంది విసుగ్గా.
బావికప్ప ఇంకా పట్టుదలగా మరి కొంచెం పెద్దవృత్తం గీచి "ఇంత పెద్దదా?" అనడిగింది.
ఇక తట్టుకోలేక కెవ్వున కేకపెట్టి ఘొల్లుమంది సముద్రపు కప్ప. ఇక ఎంత చెప్పినా బావికప్ప సముద్రపు విస్తారతని అర్ధం చేసుకోలేదని అర్ధం చేసుకొంది.
బావికప్పపై జాలి పడింది.
ఇదీ కథ!
ఉన్నచోటు వదలి ఎక్కడికీ వెళ్ళని వ్యక్తి విషయపరిఙ్ఞానం చాలా పరిమితమైనదని చెప్పడానికి మన పెద్దలు చెప్పిన కథ ఇది. అందుకే దేశాటనం వ్యక్తి వికాసానికి అవసరమని పూర్వం నుండీ మన వాళ్ళ నమ్మకం. ఙ్ఞాన శూన్యుణ్ణి బావికప్పనీ, నూతిలో కప్పనీ విశ్లేషణలతో చెప్పడం మనందరికీ తెలుసు.
అలాగే పదిచోట్లు తిరిగినవాణ్ణి, "ఆయన దేశాలు తిరిగాడు. ఆయన కెన్నో తెలుసు!" అంటూ గౌరవించడం పరిపాటి. కాబట్టే ఆ రోజుల్లో కాశీకి వెళ్ళి వచ్చిన వాణ్ణి ఊరంతా కలిసి సన్మానించేవాళ్ళు. ఇప్పటికీ తమవాళ్ళు విదేశీ పర్యటనలకి వెళ్తోంటే వీడ్కోళ్ళూ, తిరిగి వస్తూంటే స్వాగతాలు పత్రికల్లో ప్రకటించి మరీ గౌరవించడం మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.
ఎందుకంటే ‘మనం చూడని ఎన్నో ప్రదేశాలు వాళ్ళు చూచి, ఎన్నో విషయాలు, సంస్కృతులూ పరిశీలించారు. కాబట్టి వాళ్ళు మనకంటే ఙ్ఞానం కల వారు’ అని మనం నమ్ముతాం. అలాంటి వాళ్ళు అభిప్రాయాల్ని గౌరవిస్తాం, సలహాలని ఆచరిస్తాం.
మనమేకాదు, పురాణకాలం నుండి ఈ మంచి లక్షణం మానవుల్లో ఉంది. కాబట్టే నారద మహర్షిని మిగిలిన మునులు “మహర్షీ! మీరు త్రిలోక సంచారులు” అంటూ గౌరవించడం మనకు తెలిసిందే.
మునులని, రాజులూ, ప్రజలూ గౌరవించడం మనం చదివిందే. “యోగులూ, ఋషూలూ, మునులూ దేశాలు తిరుగుతారు. వారికి స్వార్ధం ఉండదు. వాళ్ళేం చెప్పినా, ప్రజాహితం కోరి చెబుతారు” అని ప్రజలు నమ్ముతారు. అది ఆనాడు.
అయితే ఆనాడే కాదు, ఈనాడూ ప్రజలు అంతటి గౌరవాన్ని మీడియాకి ఇచ్చారు. కాబట్టే స్వాతంత్రసమరం కాలంలో బ్రిటీషు వారు రాజకీయపాలన నెపంతో చేస్తోన్న వ్వాపార దోపిడికి వ్యతిరేకంగా దేశభక్తులూ, మానవతా మూర్తులూ పోరాడుతూ అందుకు పత్రికారంగాన్ని ఆయుధంగా తీసికొన్నారు.
ప్రజలు కూడా ఆనాడు ఋషులని గౌరవించినంతగా పత్రికల్ని గౌరవించారు. “మనం తిరగని ప్రదేశాలకు పత్రికలు వెళ్ళగలవు. మనం తెలుసుకోలేని విషయాలు పత్రికలు తెలుసుకోగలవు. వాళ్ళకి స్వార్థం ఉండదు. వాళ్ళేం చెప్పినా ప్రజాహితం కోరి చెబుతారు” అని ప్రజలు నమ్మారు.
కాబట్టి ఆనాటి పత్రికలు ప్రజల్లో జాతీయతా భావాన్ని ప్రేరేపించి, వారిలో స్ఫూర్తి నింపగలిగాయి.
ఈనాటి కంటే ఆనాడు సమాచార రంగం చాలా వెనకబడి ఉంది. ప్రజల్లో పేదరికం, నిరక్షరాస్యత, అనవగాహన అపరిమితం. ఈ నాటి లాగే ఆనాడూ కంచే చేను మేస్తోంది. కాని ఆనాడు చేనులోని ఏ మొక్కకా మొక్కా, నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేదు. పత్రికలు నింపిన స్వాతంత్ర స్ఫూర్తితో, దేశభక్తి జ్వాలతో రగిలిపోయాయి. బక్కచిక్కిన ఒక సామాన్యుడు, మహాత్ముడై ఇచ్చిన సంయమన సందేశంతో సత్యాహింసల సాధనచేశాయి. గడ్డి పోచలు తాడై మదపుటేనుగును కట్టేసినట్లు, బ్రిటీషు వ్వాపార మదపుటేనుగుని బంధించి, అరేబియా సముద్రానికావల పారేసాయి. అంతటి అపూర్వ సంఘటనకి పత్రికలు చేసిన చేయూత ఇక్కడ ప్రధానాంశం.
స్వాతంత్ర సమరకాలంలోనే కాదు, ఇప్పడు కూడా పత్రికలకి ప్రజల్లో అంత పట్టు, ప్రభావం ఉన్నాయనడానికి 1992 లో ఈనాడు పత్రిక నిర్వహించిన దూబగుంట్ల సారవ్యతిరేక ఉద్యమం లాంటి ఉదాహరణలు కోకొల్లలు.
అందుకే పత్రికారంగం, టీవీ రంగం - మొత్తంగా మీడియా అంటే ప్రసారమాధ్యమం వ్వాపారుల్ని, కుట్రదారుల్ని, కుటీల సామ్రాజ్యవాదుల్ని ఆకర్షించింది.
క్రమంగా స్వార్ధవ్వాపారులూ, కుట్రదారులూ, కుటీలాత్ములూ పత్రికాధిపతులుగా, టీవీ సంస్థల యజమానులుగా అవతారం ఎత్తారు. ఆనాటి దేశభక్తులు తెల్లవాళ్ళని పత్రికలే ఆయుధంగా తీసుకొని వెళ్ళగొట్టారు. విలువలతో పత్రికలు నడిపారు. ఈనాటి స్వార్ధపరులు తెల్లవాళ్ళని మించిన ‘కారు నల్లవాళ్ళు’. బ్రిటీషు వాడి వ్వాపారదోపిడీ వీళ్ళ వ్వాపార దోపిడీ ముందు దిగదుడుపే! ఈ స్వార్ధమీడియా అధిపతులు విలువలు గల జర్నలిస్టుల్నీ, సంపాదకుల్నీ, పత్రికల యజమానుల్ని క్రమంగా దివాళా తీయించి రంగంలోనుండి తరిమేసారు. కాబట్టే కాలగతంలో కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలాంటివి సమాజం నుండి మాయమైపోయాయి. బ్రిటిషు వాళ్ళలాగా బహిరంగంగా గుర్తించబడేలాగా కాకుండా, మరింత నేర్పుగా, రహస్యంగా, గూఢంగా తమవ్వాపారదోపిడీ చేయడానికి పత్రికలే సరైన ఆయుధమనీ, దాన్ని మరింత పకడ్బందీగా ఈ స్వార్ధమీడియా అధిపతులు ఉపయోగించుకుంటున్నారు. పైకి ఎన్నో నీతులు చెబుతారు, వ్రాస్తారు. రాజుకంటే, రాజు తయారీదారుడు [అంటే కింగ్ కంటే కింగ్ మేకర్] మరింత బలవంతుడని వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టే సినిమారంగం, క్రీడారంగం లాంటి ఆకర్షక రంగాల్నుండి క్రొత్త బొమ్మల్ని తెచ్చి మంత్రుల్నీ, ముఖ్యమంత్రుల్నీ చేస్తుంటారు. ఎందుకంటే అన్నీ వ్వాపారాలకంటే రాజకీయ వ్వాపారం మరింత లాభదాయకం కదా!
ఎటూ ప్రజలు పత్రికలమీద, ప్రసారమాధ్యమాల మీద నమ్మకం కలిగిఉన్నారు. దాన్ని ఆధారం చేసుకొని పాలని నీళ్ళనీ, నీళ్ళని పాలనీ నమ్మించడం తేలిక. ప్రచారంతో దేన్నైనా నమ్మించవచ్చన్నది ఈ స్వార్ధమీడియా అధిపతుల ప్రగాఢ నమ్మిక.
దానితో మీడియా ప్రజలమీద ప్రయోగించిన తంత్రం అంటే స్ట్రాటజీ ఫలితాల్ని మనం చూస్తూన్నే ఉన్నాం గదా?
తమకు అనుకూలమైన నాయకులమీద పుష్పవర్షం, పొగడ్తలవాన. తమకు విరోధులైన వారిమీద తిట్లవర్షం, విమర్శలవాన. యుక్తులూ, ఎత్తులు, పైఎత్తులూ! ప్రజహితమన్నది పత్రికారంగం నుండి ఎప్పడో పారిపోయింది. ఇప్పడంతా పెట్టుబడిదారు లాభమే. ఈ పరిస్థితుల్లో సాక్షి మరింత పెద్ద అంగలు వేసింది.
ఈ మీడియా మాయాజాలం గురించి ఇంకాచాలా చెప్పాలి.
తదుపరి టపాలలో మరింత వివరంగా, దృష్టాంతాలతో సహా [అంటే సర్కంస్టాన్షియల్ గా అన్నమాట] వివరిస్తాను.
అందాకా … అమ్మకడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
7 comments:
మీరు వ్రాసిన బ్లాగ్ చదివాను. చాలా బాగుంది.
వైద్యో నారాయణో హరి అన్నారు, కాని నేటి వైద్యుల కక్కూర్తి చూశాక ఎవ్వరికి వైద్యుల మీద అలాంటి గౌరవభావం కలగడం లేదు. అలానే మీడియా కూడా.
తరువాయి భాగం కోసం ఎదురుచూస్తున్నాం.
AMMA గారు, సమాజాన్ని అధికంగా ప్రభావితం చెయ్యగలిగే మీడియా స్వార్థశక్తుల పాలినబడి పక్షపాతంతో వ్యవహరిస్తున్నప్పుడు జరిగే అనర్థాలు నిజంగానే రోజూ చూస్తున్నాం. మీ "మీడియా మాయాజాలం" ఆలోచింపజేసేదిగా ఉంది. దాదాపు ఇదే మాదిరి కాన్సెప్ట్ తో సీరియల్ పోస్టులు రాద్దామన్న ఆలోచన ఎప్పటి నుండో ఉంది. కానీ నాకన్నా మీరు చాలా బాగా రాయగలరు అన్నది మీ రచనాశైలిని బట్టి అర్థమవుతోంది. మీరు రాస్తున్న శైలిని బట్టి కొత్తగా నేను రాయడానికి ఏమీ లేదు అని కూడా అన్పిస్తోంది. మీ పోస్టుల కోసం ఎదురుచూస్తుంటాను. ధన్యవాదాలు మంచి అంశాన్ని చర్చిస్తున్నందుకు!
మీరన్నది నిజమే.
మీరిచ్చిన ప్రోత్సాహానికి చాలా సంతోషం కలిగింది. కృతఙ్ఞతలు.
అమ్మ గారూ,
మీడియా కావాలంటే, ఒకరికి ఆకాశానికి ఊరికే ఎత్తేయగలదూ, దానికి మొహం మొత్తిన్నాడు, అదే ఆకాశం నుంచి క్రిందకు తోసేసి, నొక్కేసి, కాలరాయగలదు.
మనమే కొంచెం జాగ్రత్తగా, వాదనకు రెందు వైపులా విషయ సేకరణ చేసి, ఒక అభిప్రాయానికి రావాలి. ఈ రోజుల్లో అది మన భాధ్యతే.
మంచి విషయం మీద రాస్తున్నందుకు అభినందనలు.
నల్లమోతు శ్రీధర్ గారూ,
మీరలా అంటే కుదరదండి..నేనొప్పుకోనంతే. మీ అనుభవాలు కూడా పంచుకుంటే, మాకు ఇంకొంచెం జ్ఙ్ఞానం వస్తుంది కదా..అందుకని దయచేసి మీరూ రాయండి. మీ రచనా శైలి కేంటి సార్. అమోఘంగా ఉంటేనూ..
కృతఙ్ఞతలు.
Post a Comment