ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధుల్ని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా ...

రామాపురం అనే ఊర్లో రాజశేఖరం అనే యువకుడుండే వాడు. ఇతడు కొంచెం అమాయకుడు. దానికి తోడు ఙ్ఞాపకశక్తి పెద్దగా ఉండేది కాదు. అతడికి పెళ్ళై భార్య విశాలాక్షి కాపురానికొచ్చింది. విశాలాక్షి అణకువ గల పిల్ల. పనీ పాటలు తెలిసిన అమ్మాయి.

ఓసారి రాజశేఖరుడు ఏదో పని ఉండి ప్రక్కఊరు రాఘవాపురం వెళ్ళాడు. పని పూర్తయ్యాక ఆ ఊళ్ళోనే ఉన్న మేనత్తని చుట్టపు చూపు చూడబోయాడు. రాక రాక వచ్చిన మేనల్లుణ్ణి అతడి మేనత్త ఎంతో సంతోషంగా ఆహ్వానించి ఆదరించింది. పిండి వంటలతో భోజనం పెట్టింది. భోజనంలో వడ్డించిన బూరెలు రాజశేఖరానికి తెగనచ్చేసాయి. ఒకటికి రెండు అడిగి పెట్టించుకొని తిన్నాడు.

“అత్తా! వీటి పేరేంటి?” మొహమాట పడుతూ అడిగాడు రాజశేఖరుడు. ఆవిడ అభిమానంగా నవ్వుతూ “బూరెలంటారు నాయనా? మరి నాలుగు కట్టివ్వనా?”అంది.

"వద్దులే అత్తా! విశాలాక్షికి అన్నీ వచ్చు. వండించుకు తింటాలే!” అంటూ ఇంటికి బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణం అంటే కాలినడక లేదా ఎద్దుల బళ్ళే శరణ్యం కదా! మనవాడు నడుచుకుంటూ బయలుదేరాడు. ఎక్కడ పిండి వంట పేరు మరిచిపోతానో అనుకుంటూ “బూరెలు, బూరెలు” అని వల్లిస్తూ అడవిదారి వెంట నడవ సాగాడు.

దారిలో చిన్న నీటి పాయ వచ్చింది. ఎగిరి దాని మీదుగా దూకూతూ వూపు కోసం “హైసర బజ్జ” అన్నాడు.

అంతే!

బూరెల పేరు మరిచిపోయి, ’హైసరబజ్జా’ అని జపం చేస్తూ ఇల్లు చేరాడు. ఇంటికి రాగానే భార్యని పిలిచి తన మేనత్త వడ్డించిన పిండివంట రుచిని తెగ వర్ణించి, తనకు వండి పెట్టమన్నాడు.

"వాటినే మంటారని చెప్పారు, మీ మేనత్త గారు?" అనడిగింది విశాలాక్షి.

"హైసరబజ్జ!” టక్కున చెప్పాడు రాజశేఖరం.

అదేం పిండి వంటో విశాలాక్షి కి అర్ధం కాలేదు.

"ఎలా ఉన్నాయి? తియ్యగానా, కారంగానా?" అంది.

"తియ్యగా ఉన్నాయి. గుండ్రంగా అరచేతి మందాన ఉన్నాయి?" అన్నాడు.

“దేనితో చేస్తారో?” మెల్లిగా గొణిగినట్లు అడిగింది.

“వరిపిండి తో నట” కొంచెం కరుగ్గా చెప్పాడు రాజశేఖరం.

ఇంకా ఏమంటే భర్తకి ఎంత కోపం వస్తుందోనని విశాలాక్షి లోపలికెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా భర్తకంత నచ్చిన ఆ ‘హైసర బజ్జ’ ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు.

చివరకి కుడుములై ఉంటాయను కొని, బియ్యప్పిండి, బెల్లం కలిపి, అరచేతి మందాన ఆవిరిలో ఉడికించి గుండ్రని కుడుములు చేసింది. చిన్నపళ్ళెంలో తెచ్చి భర్త ముందు పెట్టింది.

ఎంత నచ్చినా, మేనత్త ఇంట్లో తనివి తీరా బూరెలు తినడానికి మొహమాట పడ్డ రాజశేఖరం, ఇప్పడు భార్య వండి పెడితే తెగ లాగించెయ్యాలని ఆశగా ఎదురుచూస్తూన్నాడు. భార్య తెచ్చిన కుడుములు చూసేసరికి అతనికి కోపం నషాళానికంటింది. [కోరిక లేదా కామం తీరక పోతే క్రోధం పర్యవసానమని భగవద్గీత చెబుతుంది]

భార్య అలుసుగా కనబడి ఒక్క పెట్టున ఆ పిల్ల చెంప ఛెళ్ళుమనిపించాడు. విశాలాక్షి ఘోల్లుమంది.

ఈ గొడవుకి ప్రక్కింటి పిన్నిగారు పరుగెత్తుకొచ్చింది. అప్పటికే విశాలాక్షి చెంప వాచి పోయింది.

అది చూసి ప్రక్కింటి పిన్నిగారు “అయ్యో! అదేమిటి నాయనా, అమ్మాయిని అలా కొట్టావు? పిల్లబుగ్గ బూరెలా పొంగి పోయింది చూడు” అంది మందలింపుగా.

"ఆ అదే పిన్నిగారు, అదే! బూరె బూరె!” అన్ని మరిచి పోయి ఆనందంగా గావుకేక పెట్టాడు రాజశేఖరం.

నొప్పి, అవమానం మరిచిపోయి ఫక్కున నవ్వింది విశాలాక్షి.

విషయం తెలిసాక విరగబడి నవ్వారు ప్రక్కింటి పిన్నిగారు.

రాజశేఖరం భార్యకి క్షమాపణ చెప్పుకొన్నాడు.

బియ్యం నానపోసి దంచి విశాలాక్షి తియ్యటి బూరెలు చేసి పెట్టింది.

ప్రక్కింటి పిన్నిగారితో సహా అందరూ ఆనందంగా ఆరగించారు.

ఇదీ కథ!

ఈ కథలోని రాజశేఖరం కి లాగా ప్రజలక్కూడా అమాయకత్వం ఎక్కువనీ, దీర్ఘకాల ఙ్ఞాపక శక్తి తక్కువనీ ఈ స్వార్ధ మీడియా అధిపతుల ప్రగాఢ నమ్మకం. అది పాక్షిక సత్యం కూడా!

అందుకే ప్రజల దృష్టి ఒక విషయం మీదనుండి మరో వైపుకి మరల్చాలను కొన్నప్పడు సంచలన వార్తలు వ్రాస్తారు. ఏ సంచలనాలూ లేకపోతే సంచలనాలు తామే సృష్టిస్తారు లేదా తాము నిలబెట్టిన బొమ్మలు చేత సృష్టింపచేస్తారు. ఇది నిజానికి మనం ఇర్వింగ్ వాలెస్ వ్రాసిన ప్రఖ్యాత ఇంగ్లీషు నవల ‘ఆల్ మైటీ’ల్లాంటి వాటిల్లో చదివిందే, కృష్ణంరాజు నటించిన ‘అంతిమ తీర్పు’ ల్లాంటి సినిమాల్లో చూసిందే. అయితే నవలల్లో చదివీ, సినిమాల్లో చూచీ “ఔరా!” అని అబ్బురపడతాము గానీ అది మన కళ్ళ ముందే జరుగుతున్నా గుర్తించలేం.

ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఈ స్వార్ధమీడియా అధిపతులు చేస్తోన్న ప్రజాదృక్పధపు హైజాక్! మనం విమానాన్ని, షిప్పుల్నీ హైజాక్ చేయటం గురించి వార్తల్లో చదువుతుంటాం, చూస్తుంటాం, వింటుంటాం. కానీ నిజానికి మీడియా, ప్రజాభిప్రాయాన్ని హైజాక్ ప్రతిరోజూ చేస్తోంది. అది స్లో పాయిజన్ లాంటింది. ******

ఇక, వార్తా ప్రపంచంలో ఓ సామెత ఉంది.

‘మధ్యాహ్నమైతే వార్తా పత్రిక వృధా పత్రిక’ అని. [ఆఫ్టర్ నూన్, ది న్యూస్ పేపర్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్] పత్రిక వేస్ట్ కావచ్చేమో గానీ, అది మన బుర్రలో నాటిన అభిప్రాయాలూ, ఆలోచనలూ, బీజాలు మాత్రం వృధాకావు.

ఉదయాన్నే కాఫీ కప్పతో పాటు మనం అలవోకగా అవలోకించే పేపరు మనలో మనవి కాని ఆలోచనల్ని, భావాల్నీ నాటుతోందనీ, మన వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తోందని మనమే తెలుసుకోలేనంత నేర్పుగా ఈప్రక్రియ అంతా సాగుతోంది.

ఒకవేళ ఎవరి అంతరాత్మ అయినా బలమైనదై, ఈ మీడియా మాయాజాలానికి అంటే అప్రకటిత బ్రెయిన్ వాష్ కి లొంగలేదనుకోండి.

ఇక ఇక్కడ ’పదే పదే అదే ప్రచారం అనే నల్లమేక - నలుగురు దొంగలు’ స్ట్రాటజీ రంగప్రవేశం చేస్తూంది “అందరు అదే అభిప్రాయం [ఏ అభిప్రాయమైతే మీడియా ప్రచారం చేసిందో, అది] తో ఉన్నారు. అది అభివృద్ది చిహ్నం. నువ్వే వేరు అభిప్రాయంతో ఉన్నావు. ఇది నలుగురికీ తెలిస్తే నామోషీ. నువ్వు నాగరికం [ఫ్యాషన్ లేదా మోడ్రన్ లేదా అడ్వాన్స్ డ్] కాదని అందరూ అనుకొంటారు”. ఈ స్లోపాయిజన్ మనమీద ప్రమోగింప బడుతుంది. ఎప్పడైనా వ్యక్తి, వ్యవస్థ కంటే బలహీనుడు కదా! కాబట్టే ఈస్వార్ధ మీడియా అధిపతులు ప్రమోగించిన ‘విభజించి పాలించు’ అన్న తంత్రం [దీని గురించి మరో టపాలో వివరణ వ్రాస్తాను.]తో వ్యక్తిగతంగా ఎవరైనా ఈస్వార్ధమీడియా చేసే బ్రెయిన్ వాష్ కు లొంగిపోవలసినదే. అప్పటికీ మన వెన్నెముక గట్టిదై, ఆత్మశక్తి బలమైనదై, మనం వారి బ్రెయిన్ వాష్ కి లొంగలేదను కోండి. ఇక అప్పడు ఈ కింగ్ మేకర్స్ యొక్క మరో అనుచరగణమైన మనస్తత్త్వ శాస్త్రనిపుణులు రంగప్రవేశం చేసి మనకి స్ర్కిజోఫినియా లేకపోతే స్ల్పిట్ సైకాలజీ అదీ కాకపోతే పలక లేని పేర్లున్న మాయరోగాలేవో అంట గట్టేస్తారు. దెబ్బతో మన ఆత్మశక్తి కాస్తా అపరిచితుడు సినిమాలోని విక్రమ్ ల్లాగా అయిపోవాలన్న మాట.

ఇంత మాయాబలానికి ఇక లొంగకపోవడం సామాన్యజనానికి దాదాపు అసాధ్యమై కూర్చొంటుంది. దాంతో ఇక నిరాఘాటంగా ఈ మీడియా బలం నడుస్తూంటుంది.

కాబట్టే జనందృష్టి మరల్చడానికి సంచలన వార్తలు పుడుతాయి. మీడియా ప్రపంచంలోని నానుడి ఒకటి ఇక్కడ మనం చెప్పకోవాలి. అదేమిటంటే

’కుక్క మనిషిని కరిస్తే అది వార్తకాదు, మనిషి కుక్కని కరిస్తే అదీ వార్త!’

కాబట్టి సంచలనాల కోసం సంఘటనలు సృష్టిస్తారు. లేదా జరిగిన సంఘటనల్నే సంచలనాత్మకంగా వ్రాస్తారు.

’దృష్టాంతరాలు’ పరికించండి. అంటే కొన్ని ’హైసర బజ్జ’లన్న మాట.

1. రాత్రికి రాత్రి ఎవరో సెంటర్లో ఉన్న అంబేద్కర్ బొమ్మమెళ్ళో చెప్పలు దండ వేస్తారు. మర్నాటి కల్లా రగడ మొదలు. ప్రతీకారంగా గాంధీ బొమ్మ మెళ్ళో చెప్పలు దండలు పడతాయి. ఇక కీర్తీశేఘలైన దేశనాయకులకి మతమో, కులమో అంటగట్టి కులసంఘాలన్నీ రోడ్లపైకొచ్చి, వైశ్యులు పొట్టిశ్రీరాములు పక్షనా, రాజులు అల్లూరి సీతారామరాజు పక్షాన, ఇలా ఓ ఘర్షణ మొదలౌతుంది. ప్రతికల్నిండా పతాక శీర్షికలూ, విలేఖర్లకి చేతినిండా పని. అప్పటి దాకా ప్రజలు తలమునకలుగా ఉన్న సమస్య మరుగునపడి పోతుంది.

2. హఠాత్తుగా నోరు చేసుకొన్న మంత్రి మరిడప్పలూ, తెలంగాణా నాయక విసిఆర్ లూ ఏవో దురుసు వ్యాఖ్యలు చేస్తారు. అంతే ఏమంద రామం కో లేక గుంపు గోంగూర గాడికో మనోభావాలు దెబ్బతింటాయి.

3. ఎవరో, ఎందుకో, హఠాత్తుగా, ఏ జూపార్కులోనో, ఏ పెద్దపులికో [సాకీ, నెహ్రూ జూపార్కు] బ్రతికి ఉండగానే తోలువలిచేస్తారు.

4. ఏ గౌతమీ ఎక్స్ ప్రెస్ కో నిప్పంటుకుంటుంది. లేదా ఏ ఘటకేసర్ దగ్గరో రైలు భోగీల్ని తలుపులు మూసి కిరోసిన్ పోసి ప్రయాణికుల్ని తగలేస్తారు. లేదా ఏ నరసరావు పేట దగ్గరో ఆర్.టి.సి. బస్సుని తలుపులు మూసి ప్రయాణకుల్తో సహా తగలబెట్టేస్తారు.

5. గోద్రాల్లాంటి సంఘటనలూ ఇందుకు అతీతం కాదు. విమాన హైజాకులూ, బాంబు దాడులు కూడా ఒక్కోసారి ఈ హైసర బజ్జ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కాకపోతే టెర్రరిస్టు కార్యకలాపాలకి గల అనేకానేక ప్రయోజనాల్లో ఈ హైసర బజ్జ ఒకానొక ప్రయోజనం మాత్రమే.

6. అంతేకాదు జులై22, 2008 లో పార్లమెంట్ లో ప్రభుత్వ విశ్వాసపరీక్షలో వెలుగు చూసిన ఓటుకు నోటు కుంభకోణం - ఆ తర్వాత వరుసగా జులై 25న బెంగుళూరులో వరుసబాంబులు పేలాయి. జులై26 న అహ్మదాబాద్ లో, జులై 27,28 న సూరత్ లో బాంబులు పడ్డాయి. దెబ్బకి దృష్టంతా అటుపోయింది. నిజానికి నిండుప్రాణాలు బలై ఉన్న సందర్భంలో ఎవరూ మరో గొడవ గురించి ఆలోచించేంత లేదా చర్చించేంత అమానుషంగా ఉండరు కదా! ఇది చాలదూ విజయవంతంగా ప్రజాదృష్టిని హైజక్ చేయటానికి?

7. కొద్ది నెలలు క్రితం, అంటే సెప్టెంబర్ 13కు ముందు భారత్ - అమెరికా అణు ఒప్పందం నేపధ్యంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా అబద్దాలాడిందనీ, పార్లమెంట్ నే తప్పదోవ పట్టించిందనీ ఓ ప్రక్క గొడవ జరుగుతుంది. మరోప్రక్క అమెరికాలో జార్జిబుష్ సెనెట్ కి రోజుకో పత్రం చొప్పన సమర్పిస్తున్నాడనీ, వాటిల్లో భారతప్రభుత్వం ప్రజలకి, పార్లమెంట్ కు అబద్దాలు చెప్పిందనీ నిరూపితమవుతునే ఉంది. ఆనేపధ్యంలో వరుసగా ఢిల్లీలో బాంబుపేలుళ్ళు జరిగాయి. అంతే. ఈ బాంబు గొడవుల్లో అణు ఒప్పందం ప్రక్కకు పోయింది. చాలా మామూలుగా జరిగిపోయింది. దీనివలన ఎవరు లబ్ధి పొందారు?

8. 2001 లో బషీర్ బాగ్ కాల్పుల తర్వాత, హఠాత్తుగా హైదరాబాద్ లో విపరీతంగా వర్షం కురిసి, నాలలు మూసుకున్నాయి. హైదరాబాద్ నగరం వరదలు పాలయ్యింది. మొత్తం దృష్టి వరదలు మీదుగా కొట్టుకుపోయింది. ఆనాడు తెలియక పోయినా ఈనాడైతే కృత్రిమ వర్షాలు కురిపించవచ్చనీ, కాంట్రాక్టుకి ఆపని చేసి పేట్టే బెంగూళూరు సంస్ధలున్నాయనీ ఈనాడు అందరికీ తెలుసు కదా!

9. ఒక్కోసారి ఏ రాష్ట్రప్రాంతీయ నాయకుడికో హఠాత్తుగా మిగిలిన రాష్ట్రాల వాళ్ళు తమ రాష్ట్రాన్ని దోచుకుపోతున్నారని ఙ్ఞానోదయం అవుతుంది. అంతే! ప్రక్క రాష్ట్రాలవాళ్ళని వెంటబడి కొడతారు. [మొన్న మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే చేసినట్లన్న మాట.] వెంటనే మిగిలిన రాష్ట్రాలకూ ఈ నిప్ప అంటుకుంటుంది. దానితో ఇక రాజీనామాల డ్రామాలు, బెదిరింపు రాజకీయాలు, ఇలా ఎన్నో పద్దతులు. ఇవి అన్నిప్రజలలో ఉత్కంఠం రేపేటట్లు మీడియా చూపుకొని వాటి ఆదాయం పెంచుకొంటాయి, ఇది మరో విషయం.

10. హఠాత్తుగా ప్రభుత్వమే ఏవో రూల్స్, చట్టాలు తెస్తుంది. అంటే కొన్ని నెలలు క్రితం కేంద్ర గ్యాస్ సంస్ధలు వంటగ్యాస్ సిలిండర్ల మీద, వ్వాపార దుర్వినియోగం నివారణ కోసమై రకరకాల విన్యాసాలూ చేసినట్లన్నమాట. అది జనాలందరినీ నానా ఇబ్బందులకి గురి చేస్తూంది గనుక దృష్టి దాని మీదకి మరల్చక ఛస్తారా?

11. ఏ పత్రిక వారికో, వారి వ్యతిరేక రాజకీయ నాయకుల అవినీతి భాగోతాలు[దశాబ్ధాల క్రితం నాటివి అంటే ఇడుపులపాయ భూముల వంటివన్నమాట] హఠాత్తుగా తెలుస్తాయి లేదా గుర్తుకొస్తాయి. అంతే! ఇక అవి కొన్నాళ్ళు పతాక శీర్షికవుతాయి. నిజంగా ఆ అవినీతి నిరోధంపైనా, ప్రజసమస్యలపైనా పత్రికలకి చిత్తశుద్ది ఉంటే, ఆ సమస్యలు పరిష్కరింపబడే దాకా పత్రికలు పోరాడాలి కదా? కొన్నాళ్ళు మాత్రం వ్రాసి మరో క్రొత్త సమస్య, మరో క్రొత్త సంచలనం చేసుకొంటాయి. అదేమంటే ప్రజల సమస్యల్ని అందరి దృష్టికి తేవడం మాత్రమే తమ బాధ్యత అంటాయి.

ఇంట్లో నాన్న “బియ్యం అయిపోయాయి. తేవాలి” అంటేనో, అమ్మ “అన్నం వండాలి. లేకపోతే ఆకలి తీరదు” అంటూ సమస్యల్ని పిల్లల దృష్టికి తెస్తే సరిపోతుందా? బియ్యం వాటంతట అవే వచ్చి అన్నమైపోయి పిల్లల ఆకలి తీరుస్తాయా? లేక పిల్లలే బియ్యం తెచ్చుకొని, అన్నం వండుకొని అమ్మానాన్నల ఆకలి కూడా తీర్చాలా?

ఇలాగయితే స్వాతంత్రం కూడా అప్పటి పత్రికలు ప్రజల దృష్టికి తెచ్చి తమ బాధ్యత అయిపోయింది అంటే మనకు స్వాతంత్రం వచ్చేదా?

ఏది పత్రికల బాధ్యత?

ఈపాటి దానికి మళ్ళీ పత్రికల్ని పల్లెత్తు మాట అన్న, పత్రికా స్వేచ్ఛ అంటూ తమ హక్కుల్ని ఎలుగెత్తి చాటుతారు. [ఇందిరాగాంధీ హయంలో జరిగిన ఈ పత్రికా స్వేచ్ఛ పోరాటం, దాని వెనక నున్న కుట్ర గురించి మరో టపాలో వివరంగా వ్రాస్తాను]
వీరప్పన్ లనీ, మొద్దు శీనుల్ని ఇంటర్యూ చేసేంతగా నేరగాళ్ళ ఆనుపానులు నక్కీరన్ గోపాలన్ దగ్గరనుండి అన్ని పత్రికలు, టీవీల విలేఖర్లకీ, సంపాదకీయులకీ తెలుసు. కానీ పోలిసులకి మాత్రం చెప్పరు. సామాన్య ప్రజలకి నేరాల గురించి, నేరస్తులగురించి పోలిసులకి చెప్పాల్సిన బాధ్యత ఉంది గాని పత్రికల వారికి, అంటే మీడియా వారికి అలాంటి బాధ్యతలుండవు.

ఇక ఈస్వార్ధ మీడియా అధిపతులు అంటే కింగ్ మేకర్లకి, రాజకీయ పార్టీలు, పార్టీలనాయకులు అంటే కింగ్ లూ ఇచ్చే సహకారం గురించి చెప్పాలంటే, అది మరో పెద్ధకథే అవుతుంది.

చివరగా ప్రజాదృష్టి హైజాక్ గురించి మరికొంత వివరంగా....

ఇటివలి సినిమా ’ఇడియట్’ [రవితేజ] లో ఆచిత్ర దర్శకుడు ఈ విషయాన్ని మరింత హాస్యంగా, రసవత్తరంగా చిత్రించాడు.

ఆచిత్రంలో, రాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్ట్ దగ్గర పోలిస్ ఆఫీసర్ పాత్ర జీవా వేసాడు. హాస్యనటుడు ఆలీ ఒక్కోసారి ఒకో ద్విచక్ర వాహనం మీద వస్తాడు. ప్రతీసారి బస్తాలో ఇసుక తెస్తాడు. “ఎందుకురా?” అంటే ‘బీదర్ లో ఇసుక చల్లటం తన హాబీ’ అంటాడు.

ప్రతీసారి జీవాకి, అతడి అంతశ్చేతన చెబుతునే ఉంటుంది. "ఎక్కడో ఏదో జరుగుతోంది" అని. కానీ పాపం! ఎక్కడ ఏం జరుగుతుందో గుర్తించలేకపోతాడు.

ఈ ఒత్తిడి తట్టుకోలేక డబ్బులొచ్చే పోస్ట్ నుండి సిటీకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాడు జీవా. ఓ రోజు ఆలీ కన్పిస్తే కుతూహలం కొద్దీ, కేసులేమీ పెట్టనని హామి ఇచ్చి మరీ అప్పడు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు.

ఆలీ విశాలంగా నవ్వుతూ "ఏమండీ! రకరకాల బండ్లమీద వచ్చా. ఎంత సేపూ బస్తా ఏమిటి? ఇసుక ఏమిటి? ఎందుకు అన్నారే గానీ ‘బండి ఏమిటి? సీ బుక్ ఏది’ అనడిగారా? ఎవరండి మీకు ఉద్యోగం ఇచ్చింది? రికమెండేషన్ కేసా?" అంటాడు. జీవా " రెయ్" అంటే, మళ్ళీ ఆలీ “నమస్కారం ఎస్.పి.గారు!” అంటూ మరోసారి జీవాదృష్టిని హైజాక్ చేసి పారిపోతాడు.

జీవాలాగే పత్రికాపాఠకులు, టివీ పేక్షకులయిన ప్రజలకీ అంతశ్చేతన చెబుతునే ఉంటుంది ’ఎక్కడో ఏదో జరుగుతుంది’అని. ప్రపంచ విస్తారత రీత్యా, మనిషి పంచేంద్రియలకున్న పరిమితులరీత్యా, మనకున్న జీవితంలోని వేగానికి ఎక్కడ ఏం జరుగుతుందో అంతశ్చేతనకి తెలుస్తున్నది కాని నిరూపించలేని స్ధితి ఉంది అంతే! కానీ ఎంతోకాలం నిజాన్ని ఎవరూ దాచలేరు!

నిజాములైనా నిజం ముందు ఓడిపోయారు కదా?

గమనించి చూస్తే ఇలాంటి దృష్టాంతాలు మీకు ఇంకా చాలానే కన్పిస్తాయి.

గమనిక: వీటన్నింటికీ సాంకేతికంగా నిరూపణలేమిటి, బుజువు పత్రాలున్నాయా, విడియో టేపులు ఉన్నాయా, లేదా ఫోను సంభాషణ రికార్డులు ఉన్నాయా అని కాదు మనం అలోచించాల్సింది.

ఈ హైసరబజ్జ ల్లాంటి వాటితో ప్రజాదృష్టి హైజాక్ లతో ’తుది లబ్ధి ఎవరు పొందారు?’ అన్న విషయం పరిశీలిస్తే చిక్కుముడులన్ని మంచువిడిపోయినట్లు విడిపోతాయి.

తరువాత టపాల్లో మరికొన్ని మాయలు.

అందాకా … అమ్మకడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు.

4 comments:

nice article. at then end of day media want fame and money.

Nice series of writeups

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

great observation

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu