ఈ కథ మర్యాద రామన్న పేరిట ప్రచారమైంది. గ్రామ సీమల్లో.... ఒకప్పుడు [అంటే శతాబ్దాల క్రితం] ‘మర్యాద రామన్న’ అనే తెలివైన న్యాయాధికారి ఉండేవాడనీ, ప్రజల మధ్య ఏర్పడే వివాదాలని అతడు అద్భుత తార్కిక శక్తితో తీర్పు లిచ్చేవాడనీ, న్యాయం చెప్పడంలో అతడి విశ్లేషణ కడు సునిశితమైనదనీ ప్రచారాలుండేవి.

తీర్పులు చెప్పడంలో అతడి పేరు ప్రఖ్యాతులు విని, క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాల నుండే గాక, సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు అతడి తీర్పు కోసం వచ్చేవారని చెప్పుకుంటారు. మొదట్లో మౌఖిక ప్రచారంతో ఉన్న ఈ కథలు తర్వాత లిఖించబడ్డాయి. ఆపైన సినిమాలుగా వచ్చాయి. [సినిమా సొల్లుతో నిండి ఉంటుంది లెండి. మర్యాద రామన్నని Degrade చేసే విధంగా ఉంటాయి.]

పిల్లలని ఆకర్షించే ఈ నీతి కథలో మంచి పోలిక కూడా ఉంది. ఇక కథలోకి వస్తే....

అనగా అనగా....

ఓ గ్రామంలో మల్లయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతడు ఎంత ధనికుడో అంత లోభి కూడా! అందుచేత అతడి దగ్గర ఎవరూ నికరంగా పని చేసేవాళ్ళు కాదు.

ఒక రోజూ ఆ ఊరికి గంగయ్య అనే యువకుడు పని వెదుక్కుంటూ వచ్చాడు. గంగయ్య అమాయకుడు. దేహదారుఢ్యం కలవాడు. ఎద్దులా పని చేస్తాడు. అంతే మోతాదులో తిండి పుష్టి కలవాడు.

అతడి స్వగ్రామంలో అతడి గురించి తెలిసిన వాళ్ళు, గంగయ్యకి రోజూ కూలీ ఇస్తామనే వాళ్ళే గానీ, సంవత్సరమంతా జీతగాడిగా పెట్టుకొనేందుకు సిద్దపడలేదు. దాంతో మనవాడు పని వెదుక్కుంటూ దేశం మీద పడ్డాడు. రోజు కూలీతో వాడికి ఒకపూట కడుపు నిండుతుంది మరి!

ఇలాంటి గంగయ్య, మల్లయ్యని కలిసి పని ఇమ్మని అడిగాడు. మల్లయ్యకి గంగయ్యని చూడగా తమ ఊరి వాడు కాదని అర్ధమైంది. మరికొన్ని ప్రశ్నలతో గంగయ్య ఉత్త అమాయకుడనీ అర్ధమైంది.

దాంతో మల్లయ్య గంభీరంగా మొహం పెట్టి "చూడబ్బాయ్! నేన్నీకు మా ఇంట్లో పని ఇస్తాను. నేను చెప్పిన పనల్లా చెయ్యాలి. రోజుకి రెండు పూటలా నీకు కడుపు నిండా అన్నం పెడతాను. దానిపైన ఇక జీతమంటూ ఏదీ ఇవ్వను. ఒక వేళ నువ్వెప్పుడైనా పని మానేసి పోవాలనుకుంటే, నువ్వు నాకు కోడిగుడ్డంత బంగారం ఇవ్వాలి. అలాగ్గాక, ఒక వేళ నేనే నిన్ను పని మానెయ్యమంటే, నేనే నీకు కోడి గుడ్డంత బంగారం ఇచ్చుకుంటాను. ఇదీ షరతు! ఇది నీకు ఇష్టమైతే ఇప్పుడే పనిలో చేరు" అన్నాడు.

గంగయ్యకి ఉద్యోగం అత్యవసరం కావటంతో, మరో మాట లేకుండా తక్షణమే మల్లయ్య షరతుకు ఒప్పుకొని పనిలో చేరిపోయాడు.

ప్రతీ రోజూ గంగయ్య బావి నుండి నీళ్ళు తోడాల్సి వచ్చేది. ఇంటి ముందూ వెనకా ఉన్న జాగాలో గల పూల మొక్కలకీ, పండ్ల చెట్లకీ , కూర పాదులకీ నీళ్ళు పెట్టాలి. బట్టలుతకడం, గిన్నెలు కడగటం, ఇల్లూ, పెరడూ శుభ్రం చేయటం.... పశువుల పాకని శుభ్రం చేయటం, పశువుల్ని సాకటం... అబ్బో చాలా పనులు!

మల్లయ్య, గంగయ్యకి రోజుకి రెండు పూటలా కడుపునిండేలా అన్నం పెట్టాడు. మొదట్లో గంగయ్యకి మల్లయ్య ఇంట్లో పని సుఖంగా అన్పించింది. మొదటగా కడుపునిండా తిండి దొరికింది. ఎద్దులా పనిచేసే గంగయ్యకి పని కష్టమని పించదు.

అయితే మల్లయ్య, మెల్లిగా గంగయ్యకి అంతకంతకూ ఎక్కువ చెప్ప సాగాడు. గంగయ్య మారుమాట్లాడకుండా చేసుకు పోయేవాడు. రోజులు గడిచాయి. నెలలు మారాయి. ఇలా రెండేళ్ళు గడిచింది. రాను రాను గంగయ్యకి అలసటగా, పని భారంగా అన్పించసాగింది. తన ఊరు, తన వాళ్ళు గుర్తొచ్చారు. ఇంటి కెళ్ళి పోవాలన్పించింది.

మల్లయ్యని సమీపించి, ఇక పని మానేసి స్వంత ఊరు వెళ్ళిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. మల్లయ్య "అలాగైతే కోడి గుడ్డంత బంగారం నా ముఖాన కొట్టి, ఎంచక్కా మీ ఊరి కెళ్ళిపో!" అన్నాడు నింపాదిగా!

అదిరిపడ్డాడు గంగయ్య! అప్పటికి గానీ, అమాయకపు గంగయ్యకి మల్లయ్య పెట్టిన షరతులోని కిటుకేమిటో అర్దం కాలేదు. దీనంగా మల్లయ్యని బ్రతిమిలాడాడు. తానిన్నాళ్ళు చేసిన సేవలని గుర్తించి తనని వదిలెయ్యమన్నాడు. మల్లయ్య ససేమిరా అన్నాడు.

చేసేది లేక గంగయ్య పనిలో కొనసాగుతున్నాడు. పాపం! వాడి ముఖంలో ఎంతో దిగులు, నిరాశ! మల్లయ్య అమానుషత్వమూ, పిసినారి తనమూ తెలిసిన ఇరుగుపొరుగు వాళ్ళు, మల్లయ్య చూడకుండా, గంగయ్యతో "పోయి మర్యాద రామన్నకు మొరపెట్టుకో! ఆయన నీకు న్యాయం చేస్తాడు" అని చెప్పారు.

ఒకనాటి రాత్రి గంగయ్య, మర్యాద రామన్నని కలిసి, తన సమస్య చెప్పుకొని, న్యాయం చెయ్యమని అర్దించాడు. అతడు చెప్పిందంతా విన్న మర్యాద రామన్న, కొన్ని క్షణాలు ఆలోచించాడు. మల్లయ్య లోభత్వం గురించి మర్యాద రామన్నకి తెలుసు. నచ్చజెప్పడం ద్వారా మల్లయ్యలో మార్పు తేవటం అసాధ్యమనీ ఆయనకి తెలుసు. మల్లయ్య లోభి మాత్రమే కాదు, మోసకారి కూడా!

బాగా ఆలోచించి మర్యాద రామన్న, మల్లయ్యకి గుణపాఠం నేర్పేందుకూ, మల్లయ్య నుండి విముక్తి పొందేందుకూ ఏం చెయ్యాలో, గంగయ్యకి వివరించాడు. గంగయ్య గమ్మున ఇంటికి తిరిగి వచ్చాడు.

మర్నాటి ఉదయం, మల్లయ్య, గంగయ్యని బావిలోంచి నీళ్ళు తోడి గాబులూ, కుండలూ నింపమన్నప్పుడు, సగం పైగా కుండల్ని పగల గొట్టేసాడు. "క్షమించండయ్యా! చెయ్యి జారాయి" అన్నాడు. మల్లయ్య, నిజంగానే గంగయ్య కుండల్ని పొరపాటున పగలేసాడనుకొని ‘జాగ్రత్తగా పని చెయ్య’మని హెచ్చరించి ఊరుకున్నాడు.

తర్వాత మొక్కలకి నీళ్ళు పొయ్యమన్నాడు. గంగయ్య పూలమొక్కల మీదా, కూరపాదుల మీదా అడ్డదిడ్డంగా నడుస్తూ, నీళ్ళు పోసేలోగా సగం మొక్కల్ని పీకి పాకాన పెట్టినంత పనిచేసాడు. అలాగే బట్టలుతకమంటే సగం బట్టల్ని చింపి పాతరేసాడు. గిన్నెలు కడగమంటే సగం ఇత్తడి గిన్నెలకి నిండా సొట్టలే! మట్టిచట్లు ముక్కలూ చెక్కలై పోయాయి.

పశువులకి గడ్డీ కుడితీ పెట్టేటప్పుడు వాటిని చితక బాదాడు. పాల కోసం వెళితే అవి ఈడ్చి తన్నాయి. దాంతో చిర్రెత్తు కొచ్చిన మల్లయ్య గంగయ్యని నోటి కొచ్చినట్లు తిట్టాడు. గంగయ్య అదేం పట్టించుకోకుండా కడుపునిండా తిని గుర్రు కొట్టాడు.

మర్నాడూ అదే పని తీరు. ఆ మర్నాడు కూడా అంతే! మరుసటి రోజూ, ఆపై రోజూ కూడా!.... ఇలా వారం తిరిగే సరికి, మల్లయ్యకి నష్టం నషాళాని కంటింది. గంగయ్య చేత గతంలో లాగే పని చేయించుకునేందుకు నయానా భయానా ప్రయత్నించాడు. ఊహు! లాభం ఉంటేగా! దాంతో సహనం కోల్పోయిన మల్లయ్య.... "ఒరే పనికి మాలిన వెధవా! తక్షణం నా ఇంట్లోంచి బయటకు పో!ఈ క్షణమే నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను" అంటూ అరిచాడు.

మరుక్షణం గంగయ్య "అట్లా అయితే మీరే నాకు కోడి గుడ్డంత బంగారం ఇవ్వాలి. అది కాస్తా ఇచ్చారంటే చక్కా పోతాను" అన్నాడు. మల్లయ్య గతుక్కుమన్నాడు. అప్పటికి మాట్లాడకుండా, కోపం దిగమించుకొని లోపలికి వెళ్ళిపోయాడు.

అయితే గంగయ్య పనులన్నీ అడ్డదిడ్డంగా చేస్తూ, అన్నీ నష్టపరుస్తూనే ఉన్నాడు. చేసేది లేక, మల్లయ్య మర్యాద రామన్నకి గంగయ్య మీద ఫిర్యాదు చేసాడు.

మర్యాద రామన్న "మల్లయ్యా! షరతు విధించింది నువ్వు! గంగయ్య దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు అతణ్ణి పనిలోంచి పొమ్మంటున్నావు. షరతు ప్రకారం నువ్వు అతడికి కోడిగుడ్డంత బంగారం ఇవ్వటమే న్యాయం. కాబట్టి గంగయ్యకి బంగారం ఇచ్చెయ్యి. తప్పదు" అన్నాడు.

లోభి మల్లయ్య గొల్లుమని ఏడ్చుకుంటూ, గంగయ్యకి కోడిగుడ్డంత బంగారం ఇచ్చాడు. అమాయకపు పేద గంగయ్య ఆనందంగా, మర్యాద రామన్నకు కృతజ్ఞతలు చెప్పుకుని, తన గ్రామానికి తాను పోయాడు.

మర్యాద రామన్న "మల్లయ్యా! నీవు ధనికుడివి. పేదవాళ్ళు ధనికులకి సేవలు చేసేందుకు వస్తారు. బదులుగా ధనికులు పేదవాళ్ళ పట్ల దయ, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు, తమ యజమానుల పట్ల విధేయత తోనూ, నిజాయితీ తోనూ ఉండి, సేవలు అందిస్తారు. నీవు డబ్బిస్తావు. వాళ్ళు పని చేస్తారు. యజమానికీ, పనివాళ్ళకీ మధ్య ఆర్దిక సంబంధం అంతటితో అంతమౌతుంది.

అయితే మానవ సంబంధం దీనంతటికీ అతీతమైనది. ఆ సంబంధంలో దయ, సానుభూతి, ప్రేమ, విధేయత, గౌరవం, నిజాయితీ, వాత్సల్యం వంటి మానవీయ విలువలన్నీ మిళితమై ఉంటాయి.

ఈ మానవీయ విలువలని అమలు పరచటంలో.... ఏ చట్టాలూ, షరతులూ, ప్రభుత్వ నియమాలూ ఏమీ చేయలేవు. ఇవి కేవలం మనిషి హృదయానికి సంబంధించినవి.

గుర్రాన్ని నీటి దాకా తీసికెళ్ళగలం కానీ నీరు త్రాగించలేమని పెద్దలంటారు. అలాగే మానవీయ విలువల విషయం కూడా! ఎవరంతట వారు, హృదయానుభూతితో పాటించవలసినవే అవన్నీ! నీ అంతట నీవే గంగయ్య లాంటి వారి పట్ల సానుభూతితో ఉంటే బాగుంటుంది. పేదల పట్ల లోభగుణం చూపటం నీచం! ఇకనైనా పేదసాదల పట్ల, సాటి వారిపట్ల సానుభూతితో, దయా కరుణలతో ఉండటం నేర్చుకో!" అని చెప్పాడు.

మల్లయ్య సిగ్గుతో తలదించుకొన్నాడు. మర్యాద రామన్నకు క్షమాపణలు చెప్పుకొని, తన మనఃస్థితిని [mind set] మార్చుకున్నాడు.

ఈ కథలో మర్యాద రామన్న, మల్లయ్యకు నీతిని బోధించిన తీరు మనోహరంగా ఉంటుంది. నీతి నిర్మలంగా ఉంటుంది. పిల్లలకి ఎంతో ఉపకరించే ఈ కథలో నీతి విషయం ప్రక్కన బెడితే...

గంగయ్య మల్లయ్యకి, ప్రతి పనిలో Disadvantage చూపిస్తాడు.

అదే స్ట్రాటజీని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు ఒకప్పటి ప్రభుత్వాల మీదా, ప్రజల పట్ల దేశం పట్ల నిబద్దత గల నాయకుల మీదా ప్రయోగించారు. ఇప్పటికీ చట్టాలు మార్చదలుచుకున్నప్పుడు, ఇలాగే Disadvantages చూపిస్తారు. తమకు అనుకూలంగా కొత్తకొత్త చట్టాలు తెచ్చుకుంటారు.

ఉదాహరణకు రామబ్రహ్మం ఇంటర్ పేపర్ లీక్ తో, మొత్తం రెసిడెన్షియల్ కాలేజీలు, ప్రభుత్వం నుండి తప్పనిసరిగా గుర్తింపు తీసుకోవాలని చట్టాలు చేసారు. అలాగే ఏవో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు డబ్బులు తీసుకొని పారిపోయాయి. దాంతో పాఠశాలలకు తప్పని సరిగా గుర్తింపు తీసుకోవాలని రూల్స్ జారీ చేసారు. ఆ విధంగా తమ గ్రిప్ లోకి మొత్తం విద్యవ్యాపారాన్ని తెచ్చుకున్నారు.ఇలాంటివే మినరల్ వాటర్ లోకల్ బ్రాండ్స్ వ్యవహారం కూడా! అదే కూల్ డ్రింక్స్ నిల్వ కోసం ఎరువుల మందు కలుపుతారన్న విషయం బయటకు వచ్చినా,ఆ కార్పోరేట్ కంపెనీలకు ఏమీ అవ్వదు!

ఇక భారతీయత మీద ఆర్దిక, వాణిజ్య రంగాల ద్వారా జరిపిన కుట్రలో మరో ప్రధాన అంశం బ్యాంకులు!

ఇందిరా గాంధీ హయాంలో బ్యాంకులని జాతీయం చేయక ముందు అన్ని బ్యాంకులూ ప్రైవేటు రంగంలోనే ఉండేవి. అవన్నీ ధనికులకీ ప్రయోజనకరంగా ఉండేవి తప్ప సామాన్య ప్రజలకి కాదు. అందులో మాజీ సంస్థానాధీశులూ, మాజీ జమీందారులూ, రాజ వంశీయులూ ఎక్కువగా బ్యాంకు యజమాన్యాలలో భాగస్వామ్యులై ఉండేవాళ్ళు. ప్రభుత్వం నుండి వచ్చే భరణంగా వచ్చే ధనాన్నీ, వారసత్వంగా వచ్చిన ఆస్థులని నగదుగా మార్చుకున్న ధనాన్ని బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టారు.

ఈ నేపధ్యంలో బ్యాంకుల్ని జాతీయం చేసినప్పుడు సామాన్య ప్రజలే కాదు, పీవీతో సహా నిజాయితీ పరులైన నాటి రాజకీయ నాయకులందరూ కూడా, ఇక మెరుగైన సేవలు.... సామాన్యులకీ, పేద ప్రజానీకానికీ అందుతాయని ఆశించారు, ఆకాంక్షించారు. [పీవీజీ ‘లోపలి మనిషి’లో దీని గురించి విపులంగా ప్రస్తావించారు.]

అయితే వాస్తవంలో.... కనీసం బ్యాంకు సిబ్బందిలో[చాలామందిలో] కూడా సేవాదృక్పధం కనపడకుండా పోయింది. ఇప్పుడెలా ఉన్నారో నాకు తెలియదు. 1992 లో బ్యాటరీ తయారీ సంస్థని నష్టపోయాక, నాకంతగా బ్యాంకుల గురించి ప్రత్యక్ష అనుభవాలు లేవు. కానీ చిన్న తరహా పరిశ్రమలూ, కుటీర వస్తు తయారీ సంస్థలూ అదృశ్యమవ్వడాన్ని బట్టి చూస్తే, బ్యాంకుల పనితీరులో మార్పేమీ లేదని చెప్పవచ్చు. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న మాట.

1988లో APSFC లో, నా ఫ్యాక్టరీ పైలూ, ఆంధ్రప్రదేశ్ లో తొలి పబ్బు ఫైలూ ఒకేసారి టేబుళ్ళ ప్రయాణం ప్రారంభించాయి. నా ఫ్యాక్టరీ వంటి వస్తు తయారీ సంస్థలు మూతపడితే, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా విస్తరించడంలో తెలియటం లేదా, బ్యాంకుల ఋణ సహకారంలోనూ, ప్రభుత్వ పనితీరులోనూ, మిశ్రితమైన కుట్ర తీరు! ఇండియన్ బ్యాంకులోనూ నాది ఇదే అనుభవం!

ఈ అంశాలు వివరంగా చెప్పదగినవి!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~~~~~~

2 comments:

No 10 vargam ante meiti andi

నా బ్లాగుకు మీరు కొత్తగా వచ్చారనుకుంటా! అన్ని టపాలు ఒకేసారి 1&2 అనే లేబుల్స్ చూడగలరు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu