తరాల తరబడి, శతాబ్దాలుగా, నకిలీ కణిక అనువంశీయులూ, వాళ్ళ అనుచరులూ సహచరులూ.... తమ గూఢచర్య వ్యూహాలతో, మంచి కోసం ప్రయత్నించే వారి జీవితాలని విఫలం చేసి మరీ, తమ ప్రచారాన్ని మరింత పెంచి, పదే పదే అదే ప్రచారంతో ‘నల్లమేక నలుగురు దొంగలు’ కథలో లాగా.... ప్రజల్ని ‘భావవాదం చేతగాని వాళ్ళు చెప్పే మాటలు. అవి వినటానికే బాగుంటాయి. ఆచరించటానికి కాదు’ అంటూ నమ్మించారు, నమ్మించ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో మంచితనం అంటేనే మానసిక రుగ్మత మరి!


దీనికి దృష్టాంతాన్ని పరిశీలించండి. భారత దేశానికి తొలి ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రు, దేశ శ్రేయస్సు గురించి, అభివృద్ది గురించి కలలు కన్నాడని అందరూ అంటారు. స్వాప్నికుడిగా అతడి పేరు ప్రస్తావిస్తారు. ఆసియా ఖండంలో శాంతిని కాంక్షించాడనీ, స్వప్నించాడనీ అంటారు. ఇక్కడ నేను అతడి వైఫల్యాల గురించి గానీ, బలహీనతల గురించి గానీ చర్చించటం లేదు.

కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తిని సమర్దించడాన్ని గురించీ గానీ, లేడీ బాటన్ తో స్నేహం గురించి గానీ.... మీడియా విమర్శలని, ప్రతిపక్ష నేతల విమర్శలని ప్రస్తావించటం లేదు.

ఈ టపాలో నేను, కేవలం, నెహ్రులోని ‘భారత దేశాభివృద్దిని కాంక్షించిన, స్వప్నించిన నేత’ కోణాన్ని మాత్రమే ఉటంకిస్తున్నాను. బహుళార్ద సార్దక ప్రాజెక్టులతో, పంచవర్ష ప్రణాళికలతో అతడు తన కలలని సాకారం చెయ్యటానికి చేసిన కృషిని ఉటంకిస్తున్నాను.

దేశాభివృద్దికై తొలితరం నాయకుడిగా నెహ్రు కష్టపడి పనిచేశాడు, ఇతరుల చేత చేయించాడు. ఆనాటి తొలితరం నేతలు.... నెహ్రు, శాస్త్రీజీ, పటేల్ ల దగ్గరి నుండి ఇందిరాగాంధీ, పీవీజీల దాకా.... నిబద్దతో, నిజాయితీతో పనిచెయ్యకుండా.... ఈనాటి రాజకీయ నాయకుల మాదిరిగా [ఏ పార్టీ అయినా ఒకటే] ప్రజాధనం దోచుకు తిని ఉంటే.... ఈపాటికి ఇండియా, ప్రపంచపటంలో నుండి ఎప్పుడో అదృశ్యమై ఉండేది.

కాబట్టి ఏ విధంగా చూసినా... ఆనాటి రాజకీయ నేతలతో, ఈనాటి రాజకీయుల్ని పోల్చలేం. కాబట్టి నిశ్చయంగా జవహర్ లాల్ దేశాభివృద్దికి కృషి చేశారని చెప్పవచ్చు.

ఎంత నిశ్చయంగా అంటే... ఆనాటి నాయకులు, ఈనాటి నాయకుల లాగా, ప్రభుత్వ పధకాల అమలుని, తమ దగ్గరి నుండి ప్రారంభించి మరీ తూట్లు కొట్టలేదు. ప్రాజెక్టుల పేరుతో మొత్తం సొమ్ము అడ్డగోలుగా మింగెయ్యలేదు. [అదే జరిగి ఉంటే ఇప్పటికీ నాగార్జున సాగర్, శ్రీశైలం, భాక్రా నంగల్ గట్రా ప్రాజెక్టులు పేపర్ల మీదే ఉండేవి.]

అంతేకాదు, ఆనాటి నాయకులు, ఈనాటి నాయకులూ నాయకురాళ్ళలా, తమ ఆశ్రిత జనాలకి, బంధుమిత్రులకీ కాంట్రాక్టులు కట్టబెట్టి కాసుల కట్టలు తాము తీసుకోలేదు. ఎకరా రూపాయికి, వేల ఎకరాలని, సెజ్ ల పేరుతో బడాబాబులకి కట్టబెట్టి, తమ వాటాలు బొక్కలేదు.

ఆనాటి నాయకులు, ఈనాటి నాయకులూ నాయకురాళ్ళలా, చిన్న, కుటీర పరిశ్రమలని, తమ రెడ్ టేపిజం, అవినీతిలతో చంపి పాతర వెయ్యలేదు. [అప్పట్లో జిల్లా పరిశ్రమ కేంద్రాలూ, పారిశ్రామిక వాడలూ కొంత చైతన్యంతో ఉండేవి. ఇప్పట్లా, ఖాయిలా పడ్డ సంస్థలతో జీవరాహిత్యంతో కునారిల్లుతూ ఉండేవి కావు.]

ఇందిరాగాంధీ హయాంలో మనదేశం అధిక ఆహారోత్పత్తినీ, పాల ఉత్పత్తినీ సాధించింది. ఇప్పట్లా ఆహార కొరత భయం లేనంతగా! అదీ ఆనాటి ప్రభుత్వాలకు ప్రజల పట్ల ఉన్న నిబద్దతా, బాధ్యతా! అదీ నాటి ప్రభుత్వాలకీ [జవహర్ లాల్ నుండి ఇందిరాగాంధీ దాకా] నేటి ప్రభుత్వాలకీ [ఎన్డీయే నుండి యూపీఏ ల దాకా] మధ్య నున్న వ్యత్యాసం! నేతల సంకల్పాలని బట్టి వారి ప్రభుత్వాల పనితీరు ఉంటుంది. ఇక పీవీజీ హయాం గురించి నేను వివరించను. పైన చెప్పిన ప్రామాణికాలతో పీవీజీ సంకల్పాన్ని మీరే బేరీజు వేసుకోవచ్చు.

2008 లో, మార్చి 31వ తేదీన, ప్రముఖ కాలమిస్టు నీరజా చౌదరి వ్రాసిన వ్యాసం ఒకటి, ఈనాడు లో చదివాను. తార్కికంగా, దృష్టాంత పూరిత నిరూపణలతో, ఆమె.... భారత దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటు, కేవలం దేశ జనాభాలో 3% ఉన్న ధనికుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ, జనాభాలో 97% ఉన్న సామాన్య ప్రజల ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నాయని విశ్లేషించింది.

ఇది నిజమా కాదా అని సంకోచించాల్సిన అవసరం లేనంతగా.... దాదాపు రాజకీయ నేతలందరూ, అధికసంఖ్యలో, కార్పోరేట్ విద్యాసంస్థలు [ఇంజనీరింగ్ కళాశాలతో సహా] పరిశ్రమలు, హోటళ్ళు, గనుల కాంట్రాక్టులు, ఇతర వ్యాపారాలు కలిగి ఉన్నారు. చంద్రబాబు నాయుడికి హెరిటేజ్ సంస్థలుంటే, వై.యస్.కుమారుడు జగన్ కి మీడియా సంస్థలూ, పవర్ ప్రాజెక్టులూ ఉన్నాయి. హోంమంత్రితో సహా చాలామందికి విద్యావ్యాపారాలున్నాయి.

సోనియా కుమారుడు రాహుల్ కూడా ముంబైలో ఏదో వ్యాపార సంస్థ నెలకొల్పి కొన్నాళ్ళు నడిపాడని చదివాను. ప్రస్తుత స్థితి గురించి ఏ వార్తాలేదు. గాలి సోదరుల గనుల గురించి అందరికీ తెలిసిందే! సుబ్బిరామి రెడ్డి వంటి రాజ్యసభ సభ్యులూ ఇందుకు మంచి ఉదాహరణలే! వాళ్ళూ వీళ్ళూ అనేదేముంది? దాదాపు అన్నిపార్టీలలోనూ, రాజకీయ నాయకులందరికీ ఇతరత్రా వ్యాపార సంస్థలున్నాయి.

కొందరు లోకసభ సభ్యులూ, రాజ్యసభ సభ్యులూ కొన్ని కార్పోరేట్ సంస్థలకు ప్రతినిధుల్లా పనిచేయటం గురించీ విని ఉన్నాము, చూస్తున్నాము. అంబానీ సోదరులతో సహా ఈ రకపు వ్యక్తులు, కేవలం ప్రజలకు సేవ చేయటానికే ఎంపీలయ్యారా? లేక, తమ సేవ తాము, తమ వ్యాపారాభివృద్ది తామూ చేసుకునేందుకు ఎంపీలయ్యారా?

ఇక ఇలాంటి చట్ట సభల్లో.... కేవలం 3% మంది ధనికుల ప్రయోజనాలని కాపాడెందుకే చట్టాలు చేయబడటంలో విడ్డూరం ఏముంది? 97% మంది సామాన్య ప్రజల ప్రయోజనాలని తుంగలో తొక్కడంలో వింతేముంది?

ఈ నేపధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.... ఒకనాటి పార్లమెంట్ హౌజ్ నీ, అందులోని సభ్యుల్నీ, నాటి నేతలైన నెహ్రు, అతడి మంత్రివర్గాన్ని పరిశీలిస్తే.... వాళ్ళు ప్రజలకేదో మేలు చేయాలని ప్రయత్నంచటంలో నిజాయితీ ఉందన్నది అర్దమౌతుంది.

ప్రపంచ రాజకీయ అవనిక మీద కూడా, జవహర్ లాల్ నెహ్రు తన స్వంత కీర్తి పెంపొందించుకునే ప్రయత్నం చేసాడని, మీడియా ప్రచార హోరు ఓ ప్రక్క ఉన్నా, మరోప్రక్క... పంచశీల, అలీన విధానం గట్రాలతో భారతదేశానికి ఒక హోదాని, వ్యక్తిత్వాన్ని తెచ్చాడు. తెచ్చేందుకు కలలు కన్నాడు.

అయితే ఆ కలలన్నీ 1964 లో చైనా దురాక్రమణకు దిగినప్పుడు, ఒక్కసారిగా చెల్లా చెదురవ్వటమే కాదు, నెహ్రుని నేల మీదికి తెచ్చాయి కూడా! తాము గురిపెట్టుకున్న వ్యక్తుల మీద నకిలీ కణిక వ్యవస్థ ఎంతగా మాయ జలతారు తెరని [Iron curtain] ని కప్పుతుందో, ఎంతగా పరోక్ష సామదాన భేద దండాలని ప్రయోగిస్తుందో ఆనాటికి ఎవరికీ తెలియదు. తాము ప్రభావపరచదలుచుకున్న వారిపై ‘ఆడది-ఆకలి’తో సహా, అహం రెచ్చగొట్టటం, ఆహాన్ని దెబ్బకొట్టటం వంటి తంత్రాలు ప్రయోగిస్తుందనీ తెలీదు. సిఐఏ, కెజిబీల గూఢచర్య కార్యకలాపాల గురించి బాహాటంగా కొన్ని, లోతట్టులో మరికొన్ని తెలిసినా... అవీ ప్రణాళికా బద్దంగా నకిలీ కణిక వ్యవస్థ ప్రచారించినవే!

అందుచేత, ఆనాటికి బాగానే బలపడిన నకిలీ కణిక వ్యవస్థ, చైనా దురాక్రమణ పైకారణంగా[over leaf reason]గా, చాలా స్ట్రాటజీలనే ప్రయోగించింది. చైనా యుద్దపు నేపధ్యంలో, సైనికులకి పంపిన చలి దుస్తులూ, బూట్లూ ఆహార పదార్దాలూ కలకత్తా మార్కెట్లలో ప్రత్యక్షం కావడం గురించిన ప్రచారం, పెద్ద ఎత్తున బయటికొచ్చింది. ఆ అపజయం తొలిసారిగా భారత్ నీ, నాటి భారత ప్రధానిని హెచ్చరించింది. కలలని కరిగించింది.

అలాగే జవహర్ లాల్ మరో కల, మిశ్రమ ఆర్దిక వ్యవస్థ! మిశ్రమ ఆర్దిక వ్యవస్థతో నెహ్రు.... ప్రభుత్వ పరిశ్రమలూ, ప్రైవేటు పరిశ్రమలూ పోటాపోటిగా అభివృద్ది చెందుతాయనీ, చెందాలనీ, ఆ విధంగా సమతుల్యతతో సమగ్రాభివృద్ది దిశలో దేశం ముందుకెళ్ళగలదని కలలు కన్నాడు.

వాస్తవానికి మిశ్రమ ఆర్దిక వ్యవస్థలో అమలు లోపమే గానీ, విధానంలో అది సమర్దవంతమైనదీ, ఫలవంతమైనది కూడా!

వివరంగా చెబుతాను. ఒక xyz ఉత్పత్తిని తీసుకుందాం. కేవలం ప్రభుత్వ రంగంలో మాత్రమే, ఆ వస్తువు ఉత్పత్తి చేయబడిందనుకొండి. దేశప్రజల అవసరాలని అది తీర్చలేదు. అదీగాక, కేవలం ప్రభుత్వం మాత్రమే అన్ని వస్తూత్పత్తులనూ చేపడితే, అది మిశ్రమ ఆర్దిక వ్యవస్థ కాబోదు. అప్పడది ఒకప్పటి USSR లో అమలైన సోషలిజం అవుతుంది. [అందులో ఉన్న కష్టనష్టాలేమిటో, USSR ముక్కచెక్కలై రష్యా ఏర్పడ్డాక అందరికీ తెలిసిందే కదా! ఆ విధంగా సామ్యవాదపు వైఫల్యం ప్రకటింపబడింది. నిజానికి ‘ఇజాలలో నిజాలే’ ఉన్నప్పటికీ అమలులో, అమలు పరిచేవారిలో సకల వైరుధ్యాలూ, వైఫల్యాలూ ఉన్నాయి.]

అలాగే కేవలం ప్రైవేటు సంస్థలే అన్ని వస్తూత్పత్తులూ చేస్తే, చేయనిస్తే, కృత్రిమ కొరతలు సృష్టించటం దగ్గరి నుండి, మోనోపలీలు సృష్టించటం, వినియోగదారులని పూర్తిగా వ్యాపారపరంగా దోచుకోవటం వంటి పరిస్థితులు ఏర్పడతాయి.

అదీగాక, అన్ని వస్తువుల ఉత్పత్తీ కేవలం ప్రైవేటు రంగంలోనే ఉంటే, అది మిశ్రమ ఆర్దిక వ్యవస్థ కాబోదు. అప్పుడది అమెరికాలో లాగా స్వేచ్ఛాయుత వాణిజ్యశైలి అవుతుంది.

2008, సెప్టెంబరులో బాహాటంగా వినబడి, లేమాన్ బ్రదర్స్ దివాళాతో ప్రకటింపబడి, నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్దిక మాంద్యం నేపధ్యంలో.... 2009మార్చిలలో వినబడిన మాట ‘USSR సోషలిజం ఫెయిల్ అయినట్లే, అమెరికా ఫ్రీ ఎకానమీ ఫెయిలయ్యింది’ అని! ఈ మాట కొంచెం ఊపందుకోగానే... ‘సిద్దాంత వైఫల్యం ప్రకటింపబడటం’ అనే అపాయం అర్దమై, నకిలీ కణిక వ్యవస్థ జాగ్రత్త పడింది. [ఇండియా మాంద్యం బారిన పడకపోవటానికి కారణం, మిశ్రమ ఆర్దిక వ్యవస్థే అన్నమాట అందరూ ఘంటాపదంగా అంగీకరించారు. తరువాత ఆ విషయం పెద్దగా ఫోకస్ చేయబడలేదు.]

అప్పటి దాకా "లేదు. లేదు. ఆర్దిక మాంద్యం అయిపోయింది" అనీ...

"ఇదిగో! రేపో ఎల్లుండో ఆర్దిక మాంద్యం తొలిగిపోనుంది. తొలగిపోతోంది. తొలిగిపోయిందీ" అనీ,

‘రానున్న x ఏళ్ళల్లో, y లక్షల ఉద్యోగాలు. ఆర్దిక మాంద్యం ముగిసిందనటానికి ఇదే నిదర్శనం’ అనీ నకిలీ కణిక వ్యవస్థ తెగ గింజుకుని ప్రచారిస్తోంది.

నిజానికి ఈ ఆర్దిక మాంద్యం ఇప్పుడంటే కీలక దశకి చేరి, మరింత తీవ్రదశకు ప్రయాణిస్తోంది కానీ, ఇది ప్రారంభమై దాదాపు తొమ్మిదేళ్ళు కావస్తోంది. కాకపోతే "అలాంటిదేమీ లేదని, ఇది మామూలు ఒడిదుడుకు మాత్రమేననీ" తిమ్మిని బమ్మి చేయ ప్రయత్నించారు. 2008వరకూ ప్రచార వ్యవస్థ, ప్రభుత్వాలు ప్రపంచాన్ని నమ్మించాయి. ఈ అసత్య ప్రచారానికి, ఆర్దిక మాంద్యానికి, ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ల ఉత్ధాన పతనాలకీ మధ్య ఉన్న ముప్పేట బంధం గురించీ, కార్యకారణ సంబంధాల గురించీ, తర్వాత ముచ్చటిద్దాం. ప్రస్తుతానికి మిశ్రమ ఆర్దిక వ్యవస్థ దగ్గరికి తిరిగి వద్దాం.

స్వేచ్ఛా వాణిజ్యం, సామ్యవాదం... రెండింటిలోని సాఫల్యాలని, వైరుధ్యాలనీ అధ్యయనం చేసి, రెండింటిలోని మంచి అంశాలనీ, ప్రయోజనాలని గ్రహించి, రెండింటిలోని వైఫల్యాలని అంచనా వేసి... వివిధ దేశాల గతాలని, వర్తమానాలని, భవిష్యత్తులని పరిశీలించి, ఊహించి, అన్నిటి మేలు కలయికగా, ఆధునిక కాలానికి పరిస్థితులకి తగినదిగా భావించి, మిశ్రమ ఆర్దిక వ్యవస్థని అమలు చేయ తలపెట్టారు.

కేవలం ప్రభుత్వ వస్తు తయారీ సంస్థలే ఉండటం[socialism] గాకుండా, అదే విధంగా కేవలం ప్రైవేటు వస్తు తయారీ సంస్థలే ఉండటం [capitalism] గాకుండా, మార్కెట్టులో ప్రభుత్వ ప్రైవేటు రంగాలు రెండూ ఉండటం, ఒక దానితో ఒకటి పోటీ పడటం... అనే ప్రక్రియ ఏ విధంగా చూసినా ‘దేశాభివృద్దికి తగిన సోపానం’ అనటంలో సందేహం లేదు. అది ఇప్పటికే దృష్టాంతపూరితంగా రష్యా అమెరికాల చరిత్ర సాక్షిగా నిరూపితమైనదే!

ఎలాగో పరిశీలించండి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

బాగా వ్రాసారండి.
ఇదే విషయం మీద మరో కోణంలో కాళీపట్నం రామారావు గారు "కుట్ర" అనే కథ వ్రాశారు.

bonagiri గారు: గతంలో కూడా ఒకసారి మీరు చెప్పారండి. దురదృష్ట వశాత్తూ నేనింకా చదవలేదండి.

నెహ్రూ, పటేల్, శాస్త్రి ల దాకా కరెక్టుగా వ్రాశారు.

నెహ్రూ చేసిన తెలివితక్కువ పనులెలాగున్నా, ఆయన మన దేశానికి చేసిన 'మంచి ' ని గుర్తించే, 'బిల్డర్ ఆఫ్ ది నేషన్ ' అన్నారు.

శాస్త్రీజీ ని 'సేవియర్ ఆఫ్ ది నేషన్ ' అన్నారు!

ఇక ఇందిర దగ్గరనించీ యెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది!

అసలు ఈ అన్ని 'ఇజాల 'కన్నా, 'ఫ్యూడలిజం' ఓ విధం గా మంచిదనిపించడం లేదూ?

కృష్ణశ్రీ గారు: ఇందిరా గాంధీ గురించి గత టపాలలో వివరించానండి. ఆవిడ విషయంలో నా అభిప్రాయం కుట్ర కోణంలోనే ఉంటుందండి. పైకారణాలతో[over leaf reasons]తో చూస్తే మీ అభిప్రాయాన్ని ఒప్పుకోవాలి.
>>>అసలు ఈ అన్ని 'ఇజాల 'కన్నా, 'ఫ్యూడలిజం' ఓ విధం గా మంచిదనిపించడం లేదూ?

ఒకోసారి అది ఒక నిప్పులోంచి మరో నిప్పులోకి పోయినట్లు కాగలదు. :)

"2008 లో, మార్చి 31వ తేదీన, ప్రముఖ కాలమిస్టు నీరజా చౌదరి వ్రాసిన వ్యాసం ఒకటి, ఈనాడు లో చదివాను. తార్కికంగా, దృష్టాంత పూరిత నిరూపణలతో, ఆమె.... భారత దేశంలోని రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటు, కేవలం దేశ జనాభాలో 3% ఉన్న ధనికుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ, జనాభాలో 97% ఉన్న సామాన్య ప్రజల ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్నాయని విశ్లేషించింది."

Why ramoji published such an article...??

లక్కావఝుల భమిడిరామ శాస్త్రి said... July 4, 2010 at 3:40 PM  

బాగుంది మంచి వ్యాసాన్ని అందించారు.

'బ్రాహ్మిన్స్'లేని భారతం -భరత్ ఝన్‌ఝన్‌వాలా
http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/may/11/edit/11edit2&more=2010/may/11/edit/editpagemain&date=11/5/2010

ప్రభుత్వోద్యోగులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధు లు- వీరిలో ఎవరు ఎక్కువ అవినీతిపరులు? తమ కంటే ప్రభుత్వోద్యోగులు, న్యాయమూర్తులే అవినీతిలో రెండాకులు ఎక్కువ చదివినవారని పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఎంపీలు 100 మందితో సిఎమ్ ఎస్ ట్రాన్స్‌పరెన్సీ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది. పెత్తందారులైన రాజకీయవేత్తలకు లొంగకుం డా విధి నిర్వహణకు చిత్తశుద్ధితో కట్టుబడిన ప్రభుత్వోద్యోగులను బదిలీ చేయడం గురించి మనం తరచు వింటుంటాం కదా.

నిజానికి ఎవరు ఎక్కువ అవినీతిపరులనే చర్చ నిష్ప్రయోజనం. అవినీతి రాజకీయవేత్త నిజాయితీపరుడైన ప్రభుత్వోద్యోగిని అక్రమమార్గం పట్టిస్తున్నాడు. అలాగే స్వార్థ ప్రయోజనాలకు నిబంధనలను అతిక్రమించే ప్రభుత్వోద్యోగి శుద్ధవర్తనుడైన రాజకీయవేత్తనూ అవినీతి కూపంలోకి లాగుతున్నాడు. అవినీతిపరులైన రాజకీయవేత్తలు, ప్రభుత్వోద్యోగులు కలసికట్టుగా మన పాలనావ్యవస్థను నియంత్రించడాన్ని మనం ఎలా అనుమతించాము? ఎవరు ఎక్కువ అవినీతిపరులనే విషయమై శుష్క చర్చల కంటే ఆ ప్రశ్నకు మనం నిష్పాక్షికంగా సమాధానం చెప్పుకోవల్సిన అవసరం ఉంది.
-----------------------
క్షీణిస్తున్న భారతీయ నాగరికత -భరత్ ఝన్‌ఝన్‌వాలా
http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/apr/20/edit/20edit5&more=2010/apr/20/edit/editpagemain

----------------------------------------

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu