ఇది వరకే ఆంగ్లంలో ప్రచురించిన ‘విద్యారంగంపై కుట్ర’ని అనువదించి ప్రచురిస్తున్న ఈ టపాల మాలికకి అంతరాయం కలిగినా సరే, ..... ఇటీవల సంచలనం కలిగించిన, తెలుగు మాట్లాడిన పిల్లల మెడలో వేలాడిన పలకల సంఘటననీ, ఆ సంచలనపు హోరులో మెల్లిగా దాటుకుపోయిన 10 వ తరగతిలో గ్రేడింగ్ విధానం గురించిన ప్రభుత్వ ఉత్తర్వునీ వివరించాలని ఈ టపా వ్రాస్తున్నాను.

గతనెల 27 వ తేదీన ప్రముఖ దినపత్రికలో – తెలుగులో మాట్లాడిన పాపానికి పిల్లల మెడలో ’ఇక నేనెప్పుడూ తెలుగులో మాట్లాడను’ అన్న పలకలు వేలాడదీసిన ఫోటోతో వార్త వచ్చింది. అంతే! మహా గగ్గోలు చెలరేగింది. నిజానికి ఇలాంటి సంఘటనలు, ఆంధ్రరాష్ట్రంలో, చాలా బడులలో ప్రతీరోజూ జరిగేవే! తల్లిదండ్రులకూ తెలిసినవే! మాకు ప్రక్కనున్న[మూడు కిలో మీటర్ల దూరం] గ్రామంలో క్రైస్తవ కన్యలు నడుపుతున్న ఉదయపు చుక్క ఆంగ్ల మాధ్యమపు బడిలో, తెలుగులో మాట్లాడితే రూపాయి ఫైను.

దీని గురించి చెబుతూ ఓ బుడ్డిగాడు “రోజంతా మాట్లాడినా రూపాయే ఆంటీ!” అన్నాడు. వాడి ముఖంలో ’రూపాయి కట్టేస్తే సరి! రోజంతా తెలుగులో మాట్లాడుకోవచ్చు!’ అన్న హుషారుతో బాటు, ’తెలుగులో మాట్లాడినప్పుడల్లా రూపాయి కట్టమంటే చచ్చేవాళ్ళం’ అన్న బేజారు ఉన్నాయి.

అది చూసి మేము ’తెలుగు వాళ్ళమై పుట్టి తెలుగులో మాట్లేడందుకు పైసలు కట్టటం అంటే ఇదే మరి’ అనుకున్నాము. ’తల్లిదండ్రులకి తెలిసే, ఇష్టపూర్వకంగా, తమ పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడితేనే పైకి వస్తారనుకొని, సదరు బడులకు పంపుతున్నప్పుడు ఎవర్ననుకొని ఏం లాభం?’ అనుకున్నాము. ‘బడికి వెళ్ళే పిల్లాడి చేతిలో చాకిలెట్లో, పిప్పరమెంట్లో [జీళ్ళు, పప్పుండలూ ఇప్పుడు బడి కెదురుగా అమ్మటం లేదుగా మరి!] కొనుక్కునేందుకు ఇచ్చే రెండురూపాయల్లో, ఓ రూపాయి తీసేసుకుని ’ఇక తెలుగులో మాట్లాడుకొమ్మని యధేచ్ఛగా స్వేచ్ఛనిచ్చిన’ ఆ కన్యల మనస్సు ఎంత సువిశాలమైనది! డబ్బులు లెక్కపెట్టుకుని తెలుగుని వదిలేసారు. ఖచ్చితంగా ఆంగ్లమే మాట్లాడితీరాలన్న పట్టుదల ఉంటే, ఈపాటి కూడా ఊర్కునే వారు కాదు గదా!’ అని కూడా అనుకున్నాము.

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, తెలుగు రాష్ట్రంలో చాలామంది తెలుగు తల్లులూ, తండ్రులూ, తమ పిల్లలకి ఏ దండన విధించి అయినా సరే, చదువు + ఆంగ్లం వచ్చేలా చేయమని పంతుళ్ళనీ, బడులనీ అర్ధిస్తుండగా…… ప్రతీరోజూ, తెలుగు రాష్ట్రమంతటా, చాలా బడుల్లో జరిగే తతంగమే…… ఆక్టోబరు 27 వ తేదీన ‘పిల్లల మెడలో వేలాడ దీసిన పలకల’ వంటి సంఘటనలు.

అయితే, అది వార్తా పత్రికలో అచ్చయ్యేసరికి పెద్ద దుమారమే రేగింది. ప్రభుత్వమూ స్పందించింది.

పిల్లల మెడలో పలకలు వేసిన పంతులయ్య ఉద్యోగం పీకి పారేయాలన్నారు. సదరు బడి గుర్తింపు రద్దు చేయాలన్నారు. వీటన్నింటికి పరిష్కారంగా, చివరికి ప్రభుత్వం తెగించి, ప్రతీరోజూ అన్ని బడుల్లో ’మా తెలుగుతల్లికి’ గీతం పాడి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. ’ఠాఠ్ కుదరదు’ అని ఓ ప్రాంతీయ పార్టీ గుడ్లురిమింది. మా ఉళ్ళో అయితే శ్రీనివాస్ సెంటర్ తల్లి, సంజీవ నగర్ తల్లి, బొమ్మల సత్రం తల్లి…. గట్రా గట్రా బొమ్మలూ, గీతాలూ సిద్దం చేసుకోవాలని తీర్మానాలు కూడా భవిష్యత్తులో రావొచ్చేమో అనుకున్నాము.

ఈ గోలంతటిలో ఓ విషయం మరుగున పడిపోయింది. చాలాచోట్ల నిత్యమూ జరిగే ఇలాంటి సంఘటనలని, ఫలానా బడిలో, ఫలానా సమయంలో, అంటే ఇది జరుగుతుండగా, [పిల్లల మెడలో ‘I never speak in Telugu’ అని వ్రాయబడ్డ పలక వేలాడ దీయటం] ఎవరు పత్రిక విలేఖరికి కబురందించారు? విలేఖరి రెక్కలు కట్టుకు వచ్చి వార్త కవర్ చేయగానే, అవసరాన్ని బట్టి ఇలాంటి ’ఫీలర్’ని ఉపయోగించుకునే వార్తసంస్థ, వెంటనే ఎందుకు ప్రచురించింది? మీడియా ప్రపంచం మొత్తం హడావుడిగా దానిని ఎందుకు ‘హైలెట్’ చేసినాయి?[వై.ఎస్. చనిపోయినప్పుడు, అర్జంటుగా ‘దేవుడి’ ని చేసినట్లు?]

దీనికి కొంచెం వెనక్కి అంటే మూడురోజులు వెనక్కి వెళ్ళి…… అక్టోబరు 24 వ తేదీ వార్తలు గుర్తు తెచ్చుకుంటే ’పదవ తరగతిలో గ్రేడింగ్ విధానం! CBSE తరహాలో! 2010 మార్చికల్లా అమలు!’ – వార్త కనబడుతుంది. రాబోయే పదవ తరగతి పరీక్షల్లో, విద్యార్ధుల సాఫల్యాన్ని గ్రేడుల్లో లెక్కిస్తారట. అదీ నూటికి 85 నుండి 90 శాతం మార్కులు వచ్చిన వారికి A1 గ్రేడూ, 70 నుండి 75 వచ్చిన వారికి A2 గ్రేడూ……. ఇలా కాదు.

సాపేక్ష ప్రతిభను [relative performance] అనుసరించి గ్రేడింగు ఇస్తారట! ప్రైవేటు విద్యాసంస్థల్లో అనారోగ్యకర పోటీని నివారించి, విద్యార్ధుల మీద ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పద్దతి అనుసరిస్తారట. నిజానికి ఇప్పటికి ఉన్న విధానంలో తొలి 10 ర్యాంకులే ప్రకటిస్తారు. దాని కోసమే ప్రైవేటు చిన్న విద్యాసంస్థలూ, కార్పోరేటు విద్యాసంస్థలూ పోటీ పడతాయి; లాబీయింగు చేస్తాయి. గుత్తగా ర్యాంకుల్నీ, మార్కుల్నీ కొంటాయి. మిగిలిన విద్యార్ధుల పరిస్థితి, ఈ ర్యాంకర్ల పరిస్థితితో పోల్చుకుంటే కొంత ప్రశాంతమే, ఒత్తిడికి తగినంత దూరమే. [చూశారా కొత్త విధానం చూపి, పాత విధానమే మంచిది అని మనచేతే చెప్పిస్తున్నారు. ‘పొయ్యిలో పడటంతో పోల్చుకుంటే పెనం పైన ఉండటమే మేలు అన్నట్లు!’ అదీ కార్పోరేట్ స్ట్రాటజీ !]

అయితే ఈ కొత్త విధానం చూడండి. విద్యార్ధికి తనకి వచ్చిన మార్కులని బట్టి అతడి గ్రేడ్ ఉండదు. ఉదాహరణకి 1000 మంది విద్యార్ధులు పరీక్ష వ్రాసారనుకొండి. అందరి కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధి[ని] కి 600 కి 596 మార్కులు వచ్చాయనుకొండి. ఆ గరిష్ట మార్కు దగ్గరి నుండి తొలి 125 మందికి A1 గ్రేడ్ ఇస్తారట. అప్పడయినా గరిష్టమార్కులు [అంటే మొదటి ర్యాంకు వంటిదే గదా?] పరిగణించినట్లే గదా? ప్రభుత్వం ప్రకటించినా, ప్రకటించకపోయినా, కార్పోరేట్ సంస్థలు, ఏదో విధంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటించుకోకుండా ఉండవు కదా!

అదీగాక 596 మార్కులు ఓ 25 మందికీ, 594 మార్కులు మరో పాతిక మందికీ….. ఇలా వచ్చి ఏ 585 మార్కుల దగ్గరికో వచ్చేసరికి 125 మంది జాబితా పూర్తయ్యిందనుకొండి. ఇంకా 585 మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి A2 గ్రేడ్ ఇస్తారట? మరి వీళ్ళని ఎలా విడదీసి, ఎవరు ముందు, ఎవరు వెనుక, ఎలా లెక్కిస్తారు?
మరింత వివరిస్తాను. 1000 మందిలో మొదటి 12.5% శాతం అంటే 125 మందిని A1 గ్రేడ్ కు ఎంపిక చేయాలి. మొదటి ర్యాంకు మార్కులు 596 వచ్చాయి అనుకుందాం.
596 మార్కులు వచ్చిన వాళ్ళు = 25
594 మార్కులు వచ్చిన వాళ్ళు = 25
592 మార్కులు వచ్చిన వాళ్ళు = 25
590 మార్కులు వచ్చిన వాళ్ళు = 25
మొత్తం 100 అయ్యారు. మిగతా 25 మందిని ఎంపిక చేయాలి?
585 మార్కులు వచ్చిన వాళ్ళు = 50 మంది ఉంటే…. ఏ ప్రాతిపదికన, వీరిలో 25 మందిని ఎంపిక చేస్తారు?

అలాంటప్పుడు అసలు ఏ విద్యార్ధి అయినా తనని తాను ఎలా[asses] లెక్కగట్టుకుంటాడు? తన మార్కులతోబాటు తనకంటే ముందున్న 125+ మంది మార్కుల్నీ పరిశీలించుకోవాల్సిందేనా? ఈ విధంగా విద్యార్ధుల్లో పోటీనీ, ఒత్తిడినీ ఎలా నివారిస్తారు?

అదీగాక ఈ సంవత్సరం 596 మార్కులు గరిష్టం అయ్యి, 585 వరకూ A1 గ్రేడ్ అయ్యిందనుకొండి. తరువాతి సంవత్సరం పిల్లలు ఇంకా బాగా చదివేసి 598 మార్కులు గరిష్టం తెచ్చుకున్నారనుకొండి. అదీ పాతికమంది గాక ఏకంగా 50 మంది తెచ్చుకున్నారనుకొండి. అప్పుడు ఏ 590 మార్కులో, A1 గ్రేడ్ కు cut off మార్కులు అవుతాయి. అంటే…. ఈ సంవత్సరం 585 మార్కులు వచ్చిన వాడు A1 గ్రేడ్ పొందగా, మరు సంవత్సరం 585 మార్కులు వచ్చిన వాడు A2 గ్రేడ్ పొందుతాడన్న మాట.

ఇవన్నీ పక్కన బెడితే, తమ పాఠశాలలో ఇన్ని వందలమందిని లేదా వేల మందికి A1 గ్రేడులు వచ్చాయని ప్రచారించుకునే కార్పోరేటు పాఠశాలలకి ప్రభుత్వం ఎలా అడ్డుకట్ట వేయగలదు? అసలు ఆ ఫలితాలలో పారదర్శకత ఎంత వరకూ?

పిల్లలు తమ శక్తి సామర్ధ్యాలను బట్టి, తమ కృషీ, తెలివి తేటలను బట్టి గాకుండా….. మరెవరి శక్తి సామర్ధ్యాలను బట్టో, కృషీ, తెలివి తేటలను బట్టో ఫలితాలు పొందటం ఏమిటి?

ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే…..

ప్రతీమనిషీ తనదైన వ్యక్తిత్వాన్నీ, తనదైన శక్తి సామర్ధ్యాలనీ, ప్రతిభ పాటవాలనీ వేసుకుని పుడతాడు. పుట్టుకతో వచ్చే నైపుణ్యాలు కొన్నయితే, ప్రయత్నించి పెంపొందించుకునే నైపుణ్యాలు కొన్ని. అయితే ప్రయత్నించి పెంపొందించుకోవటం అనే లక్షణమూ పుట్టుకతో వచ్చేదే! ఇవన్నీ ఏ వ్యక్తికి ఆ వ్యక్తికే ప్రత్యేకమైనవి. అసలు సృష్టిలోనే ఈ మహత్తు ఉంది. ప్రతీ ప్రాణికీ, ఊపిరి పోసుకునేందుకు ఓ ’అమ్మ కడుపు’ని చోటుగా చూపించే భగవంతుడు, బ్రతికేందుకు కూడా ప్రతీప్రాణికీ, ప్రతి మనిషికీ ఓ చోటు చూపిస్తాడు. అందుకే మన పెద్దలు “నారు పోసిన వాడు నీరుపోయాడా! నింపాదిగా ఉండు” అంటారు.

అలా అందరూ నింపాదిగా ఉంటే తమ కార్పోరేట్ వ్యాపారాలేం కానూ? అందుకే కుట్రదారులంతా కలిసి ’పరుగు’ సృష్టించారు. “పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు!” అని పెద్దలంటే – “నిలబడి నీళ్ళు తాగాలనుకుంటే చివరికి ఆ నీళ్ళు కూడా మిగలవు. రోజులు మారిపోయాయి. అందరూ పరుగెత్తుతున్నారు. నువ్వే ఉలిపికట్టెలా ఉన్నావు. పరుగెత్తు! ప్రక్కింటివాడు కారు కొనేసాడు. ఫలానా బ్రాండు XYZ కొన్నాడు. నువ్వు డొక్కు మోడల్ వాడుతున్నావు. అందరు నిన్ను వెనకబడిన వెంగళప్ప అనుకొంటున్నారు!”

ఇలా ఊదర పెట్టటం….. జనం పరుగులు పెట్టటం…..చివరికి పరుగెత్తి పరుగెత్తి పాలు కాదు గానీ ఆయాసం తెచ్చుకోవటం…… ఆపైన కార్పోరెట్ ఆసుపత్రిల్లో చికిత్సలకి ఖర్చుపెట్టటం……ఇదంతా జీవితంలో భాగమై పోయింది.

అసలు పదార్దవాదం లోనే ఈ లొసుగు ఉంది. ఆనందం మనస్సులో గాక, వస్తు వినిమయంలో ఉంది అన్న భ్రమ, ’పరుగు’ని సృష్టించింది. రుచి, శుచి, పోషకాలు కలిగిన తిండి కరుపారా తినగలిగితే….. గాలి ఎండ వాన చలి నుండి రక్షిస్తూ సౌకర్యవంతమైన ఇల్లు ఉంటే [బంగళాలూ, విల్లాలు అవసరం కానంత]…..శరీరాన్ని కప్పుతూ గౌరవాన్ని కాపాడే యుక్తమైన దుస్తులూ, నలుగురితో నవ్వేంత వినోదం, అందరితో పంచుకునేంత ఆనందం. యుక్తాహార విహరస్య…. అనేటట్లుగా అన్నీ తగినంత ఉంటే…. ఇక మిగిలిన ఆనందమంతా మానసికమే! అనుభూతి వాదమే! ఆత్మోన్నతి కోసం ప్రయత్నమే!

మనతో పాటు మన ప్రక్క వాడూ బాగుండాలని కోరుకునేంత ఆత్మోన్నతి.
ప్రక్కవాడు బాగుపడితే ఏడ్చి, కుళ్ళు కోనంత ఆత్మోన్నతి,
ప్రక్కవాడి బాగుని, నష్టపరచాలని కోరుకోనంత ఆత్మోన్నతి….
వెరసి అరిషడ్వర్గాలని పారదోలేంత ఆత్మోన్నతి…..అప్పుడంతా ఆనందమే!
అందుకోసం ప్రయత్నించమని చెబుతోంది సనాతన ధర్మం, హిందూధర్మం. అందుకే పొట్టకూటి విద్యకి, హిందూమతం ఇచ్చే ప్రాధాన్యత కొంత వరకే! ఆత్మోన్నతిని ప్రసాదించే ఈశ విద్యకే పెద్ద పీట వేస్తుంది.

ఆ స్థితిలో పోటీ లేదు. ఒత్తిడీ లేదు. ఎందుకంటే ఎవరి మనస్సులో వారు సాధించగలిగిన ఆనందం అది. ఫస్ట్ ర్యాంకు వస్తే కలిగే ఆనందం కాదు. జ్ఞానాన్ని అనుభూతిస్తే, జ్ఞానాన్ని తెలుసుకుంటే కలిగే ఆనందం! ఇదే ఆనందం, ఒక వస్తువుని పొందితే వచ్చేటట్లయితే….. ప్రపంచంలో తప్పనిసరిగా వస్తువులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే, ’వనరులు పరిమితమూ, కోరికలు ఆనంతమూ’ గనుక! అయితే మనుష్యుల సంఖ్యను బట్టి వస్తువులు సంఖ్య పెరగక పోవచ్చుగాక గానీ, ప్రతీ మనిషికీ తనదైన మనస్సు, తనదైన ఆత్మ ఉంటాయి గదా!

అటువంటప్పుడు, వస్తువుని లేదా ఓ చోటుని పొందటాన్ని బట్టిగాక, జ్ఞానాన్ని పొందటం లేదా ఆత్మోన్నతిని పొందటం తో ఆనందించటం అలవరచుకుంటే, ఇక పోటీ ఎక్కడుంటుంది? ఒత్తిడి ఎక్కడుంటుంది? నిజానికి విద్యార్ధులని, వాళ్ళతో వాళ్ళని పోల్చి……”తొలిపరీక్షలో ఇన్ని మార్కులు తెచ్చుకున్నావు. మలి పరీక్షలో ఇన్ని తెచ్చుకున్నావు. ఇలా చదువు. ఇలా నీ జ్ఞానాన్ని వృద్ధిచేసుకో! ఇంక ఇన్ని నేర్చుకో!” అంటూ ప్రోత్సాహిస్తూ, వాళ్ళు తెచ్చుకున్న మార్కుల్ని [అవే ప్రామాణికాలు అనుకుంటే] బట్టి, వాళ్ళకు గ్రేడింగు ఇస్తే నష్టమేమిటి? మరెవరి స్థానాలను బట్టో వాళ్ళ స్థానాలు లెక్కింపబడటం ఏమిటి? తొలి 12.5% మందికి గ్రేడ్ A1 అంటే పోటీ ఉన్నట్లే కదా! స్థానాలు [వస్తువులు] పరిమితం అయినప్పుడు పోటీ ఉండి తీరుతుంది కదా!

అప్పుడు కార్పోరేటు పాఠశాలల అనారోగ్య కర వ్యాపార పోటీకి, ప్రభుత్వం ఎలా కళ్ళెం వేయగలదు? ఆ వంకతో ఇంకా ఇంకా పరుగులు సృష్టించమనీ, వ్యాపార దందా నడుపుకోమనీ ప్రభుత్వం, కార్పోరేటు రంగానికి మరిన్ని దారులు తెరుస్తోంది తప్ప మరోకటి కాదు. పైగా పాజిటివ్ కాప్షన్ పెట్టుకోవటం ఇది.

నిజానికి ఈ విధమైన గ్రేడింగ్ విధానం, కార్పోరేట్ పాఠశాలలకు ఇబ్బడిముబ్బడిగా వ్యాపారాన్ని సమకూర్చుతుంది. ఇందులో నష్టపోయేది ప్రైవేటు చిన్న పాఠశాలలే! అందుచేత, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ, చిన్న ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు, యాజమాన్య సంఘాలు, నోరెత్తకుండా ఉండటానికి కూడా, ’తెలుగు తల్లి మెడలో పలకల’ వంటి వ్యవహారాలు వెలుగు చూసాయి. గ్రేడింగ్ విధానానికి వ్యతిరేకంగా, వాళ్ళు గొంతులు సవరించుకుంటున్నంతలోనే, ప్రభుత్వం, మీడియా, కార్పోరేటు పాఠశాలలు కలిసి, మ్రోగించిన బెదిరింపు భేరీ ఇది!

“ఈరోజు, దాదాపు ప్రతి బడిలోనూ, చిన్నవో చితకవో, పిల్లల్ని దండించే సంఘటనలు, బోధనలో ఏవో తప్పల తడకలూ, ప్రభుత్వ నిబంధనలు పాటించటంలో ఏవో అవకతవకలూ జరగకుండా ఉండవు. ఇలాంటివి నాలుగు తీసి, ఉతికి పారేసామంటే, దెబ్బతో గుర్తింపులు రద్దవుతాయి. నోర్ముసుకు పడుండండి!” అన్న హుకుం ఈ బెదిరింపు[పలకల] వార్తల వెనుక ఉంది.

మరి ఎల్.కె.జి. నుండే టెక్నో స్కూల్స్ లోకి శ్రీచైతన్య వంటి కార్పోరేట్ సంస్థలు ప్రవేశించాక, పరిస్థితి ఇలా గాక మరోలా ఉంటుందా? బి.ఎస్.రావా మజాకా?
[ఇంకా ఇవి చాలవన్నట్లు, నిన్ననే, కేంద్రమంత్రి పురంధరేశ్వరి ’భారతదేశంలోకి త్వరలో విదేశీ విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయనీ, ప్రైవేటు భాగస్వామ్యంతో 6000 మోడల్ స్కూళ్ళు ప్రారంభించబోతున్నామని’ చిరునవ్వులు ఒలక పోస్తూ మరీ, ఔదార్యంతో ప్రకటించింది. భవిష్యత్తులో……చదువుల ఖర్చు భరించలేక జనం చేతులెత్తేసాక….. ‘నీ అర్హతలు తక్కువ కాబట్టి ఇంత వేతనానికే పనిచెయ్యవలసి ఉంటుంది’ అంటూ మరింత శ్రమ దోపిడి చేయటానికి ఇప్పుడు వేస్తున్న బాటలు ఇవి! ఆ విధంగా బ్రతక లేమనుకుంటే, ఎల్.కె.జి. నుండే బ్యాంకులు రుణాలిస్తాయి కాబట్టి, ఆ సొమ్ముతో పిల్లలని బాగాగాగాగా……. చదివించవచ్చంటారా?]

ఈ గ్రేడింగ్ వ్యవహారం మీద నుండి ప్రజల దృష్టిని మళ్ళించటానికి, వార్తాపత్రిక తీసిన తెర ’తెలుగు తల్లి మెడలో పలక’. ఆ సంచలనపు వరదలో, ఆ తర్వాత ప్రభుత్వ పరిష్కారం ’మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాలాపన, దానిని మరింత హైజాక్ చేస్తూ, ప్రజల దృష్టిని మరల్చటానికి కేసిఆర్ తెలంగణా తల్లి గీతాలాపనతో మొదలైన రాజకీయ వివాదాల బురదలో, కొట్టుకుపోయిన మన పిల్లల భవిష్యత్తు ఇది……

ఎన్నిసార్లు మీడియా ‘హైసరబజ్జా’ చూపించినా, మళ్ళీ మళ్ళీ ఆ సుడిలో కొట్టుకుపోతూనే ఉన్న అమాయకత్వం ప్రజలలో ఉన్నంతకాలం, కార్పోరేటు వ్యాపారానికి వచ్చిన ఢోకా ఏం లేదు. కార్పోరేటు సంస్థలు, ప్రభుత్వమూ, మీడియా కలిసి చేసే ఈ దోపిడికీ అంతమూ లేదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

"అందుకోసం ప్రయత్నించమని చెబుతోంది సనాతన ధర్మం, హిందూధర్మం. అందుకే పొట్టకూటి విద్యకి, హిందూమతం ఇచ్చే ప్రాధాన్యత కొంత వరకే! ఆత్మోన్నతిని ప్రసాదించే ఈశ విద్యకే పెద్ద పీట వేస్తుంది."

అమ్మో. అసలు హిందూ మతం, దాని వెనుక భావన అన్న మాటలు వింటేనే పూనకమొచ్చినట్టు ఎగిరిపోయి, ఛాందస భావ శృంఖలాలని తెంపేయాలనే వ్యక్తివాదులకు పట్టం కట్టే రోజులివి. అలాంటప్పుడు ఇలాంటివి మాట్లాడ్డమే తప్పు.

ఉష్ణం ఉష్ణేణ శీతలం అన్నట్టుగా, ఈ దరిద్రాలు పెరుగుతూ వెళ్ళి, ఓ రోజు ఒక్కటిగా కుప్పకూలుతాయనే ఆశతో ఉందాం.

Amma, here are some links that should interest you..

http://www.eenadu.net/homelink.asp?qry=Editorial

http://www.eenadu.net/story.asp?qry1=9&reccount=21

బాగా విశ్లేషించారు. ఫ్లాష్ న్యూస్ ల ప్రభావంలో పడి అసలు సమస్యను పక్కన పెట్టెయడం మనకు అలవాటుగా మారింది. విద్యా విధానం పట్ల, దేశ భవిష్యత్ పట్ల ఏమాత్రం శ్రద్ధ లేని పాలకులే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతా వ్యాపారమయం చేసేసి బలమున్న(ధనము) వాడిదే రాజ్యంగా మారుస్తున్నారు. చాలా ఓపికతో మంచి విషయాలు చెప్పారు.సార్థకనామధేయులు. ధన్యవాదాలు.

రవి గారు,

పెరుగుట విరుగుట కొఱకే! నెనర్లండి.

~~
అజ్ఞాత గారు,

ఆ లింకులు చూశానండి. నెనర్లు!

~~
కెక్యూబ్ వర్మ గారు,

నెనర్లండి.

౧ శ్రీనివాస్ సెంటర్ తల్లి, సంజీవ నగర్ తల్లి, బొమ్మల సత్రం తల్లి… హహ్హహ్హ.


అసలు పదార్థవాదం లోనే ఈ లొసుగు ఉంది. ఆనందం మనస్సులో గాక, వస్తు వినిమయంలో ఉంది అన్న భ్రమ, ’పరుగు’ని సృష్టించింది.

వస్తువుని లేదా ఓ చోటుని పొందటాన్ని బట్టిగాక, జ్ఞానాన్ని పొందటం లేదా ఆత్మోన్నతిని పొందటం తో ఆనందించటం అలవరచుకుంటే, ఇక పోటీ ఎక్కడుంటుంది? ఒత్తిడి ఎక్కడుంటుంది? నిజానికి విద్యార్ధులని, వాళ్ళతో వాళ్ళని పోల్చి...

రెండూ అక్షరసత్యాలండీ!

౩ అసలు "మార్కులు" అన్న వ్యవస్థే పెద్ద దగాకోరు వ్యవస్థ అనిపిస్తుంది. విద్యార్థి ఎంత నేర్చుకున్నాడో నిక్కచ్చిగా చూపించలేని వ్యవస్థ అది. విద్యార్థి నేర్వవలసినది సరిగ్గా నేర్చుకున్నాడు అని అధ్యాపకుడు తీర్మానించుకున్నాక ఆ తరగతినుండి ఉత్తీర్ణుణ్ణి చేసే విధానం ఏమైనా ఉత్తమం. నాకు రోజురోజుకీ మన గురుకులవిద్యమీద గౌరవం పెరిగిపోతోందండీ. :)

రాఘవ గారు,

ఏ వ్యవస్థ అయినా మనుష్యులలో నిజాయితి ఉంటేనే సత్ఫలితాలను ఇస్తుందండి! నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu