నలుపు తెలుపు సినిమాల రోజుల్లో, ‘సత్తెకాలపు సత్తెయ్య’ అనే సినిమా వచ్చింది. చలం, శోభన్ బాబు, రాజశ్రీ, యస్.వరలక్ష్మి, బాలనటిగా రోజారమణి నటించిన చిత్రం అది. అప్పుడప్పడే, నాగరికత పేరుతో ‘పరుగులు’ జీవితంలోకి ప్రవేశించడాన్ని విమర్శిస్తూ ఆ కథనం ఉంటుంది.
ఆ సినిమాలో చలంది అమాయకుడి పాత్ర. చుట్టూగోడల బదులుగా తడికలున్న ఓ చిన్నపూరి గుడిసెలో నివాసం ఉంటూ ఉంటాడు. ఓరోజు, వర్షానికి చూరు క్రింద నిలబడిన చిన్నపాపతో పరిచయమవుతుంది. ఆ పాపతో ఈ అమాయకుడికి చాలా అనుబంధం ఏర్పడుతుంది. ఆ సన్నివేశాల్లో ఓ సారి, ఆ చిన్నారి, అతడి ఇంటి తడికలో రెండు గుండ్రని కంతలు గమనిస్తుంది.
“ఇదెందుకు సత్తెయ్యా!” అంటూ పెద్ద కన్నాన్ని చూపించి అడుగుతుంది.
“మా ఇంట్లో చాలా ఎలుకలున్నాయమ్మా! రాత్రిపూట అసలు నిద్రపోనివ్వటం లేదు. పిల్లి వస్తే ఎలుకల బాధ పోతుంది కదా అని పిల్లి లోపలికి రావటం కోసం ఈ కంత పెట్టాను” అంటాడు సత్తెయ్య.
“మరి ఈ కంత ఎందుకూ?" అంటుంది ఆ అమ్మాయి చిన్నకంతని చూపిస్తూ!
సత్తెయ్య జాలిగా ముఖం పెట్టి “పాపం! పిల్లి వస్తే ఎలుకల్ని చంపేస్తుంది కదమ్మా! అందుకని, ఎలుకలు పారిపోవటానికి ఈ చిన్నకంత చేశా! పిల్లి పెద్దది కాబట్టి పెద్దకంత, ఎలుక చిన్నది కాబట్టి చిన్న కంత” అంటాడు.
ఆ పాప చిరుదరహాసంతో “పిల్లిదూరే కంతలో ఎలుక దూరదా సత్తెయ్యా!” అంటుంది.
"అవునమ్మా!” అంటూ, సత్తెయ్యగా…. చలం చూపిన భావప్రకటనని క్లోజప్ లో చూపిన మనకి నవ్వు, ఆ అమాయకుడి మంచితనం పట్ల అభిమానమూ కలుగుతాయి.
ఇదీ ’పిల్లిదూరే కంతలో ఎలుక దూరదా సత్తెయ్యా’ కధా కమామిషు!
ఇక దీని అనువర్తన చెప్పబోయే ముందు…. మరో అంశం వివరిస్తాను.
ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్ నవల ’రాజు – పేద’లో దెబ్బలబ్బాయిని గురించిన ప్రస్తావన ఉంటుంది. రాజప్రాసాదంలో యువరాజుకు చదువు చెప్పే గురువు ఉద్యోగంతో పాటు, యువరాజు వయస్సు ఉండే కుర్రాడికి ’దెబ్బలబ్బాయి’ ఉద్యోగం ఉంటుంది. యువరాజు పాఠం సరిగా చదవకపోయినా, సరిగ్గా చదువు నేర్చుకోకపోయినా గురువు, యువరాజుకి బదులు ఈ ‘దెబ్బలబ్బాయి’ని కొడతాడు. ఆ దెబ్బకి యువరాజుకి చదువు వచ్చేయాలన్న మాట.
ఏదేమైనా….ఒకరిని భయపెట్టాలంటే మరొకరిని కొట్టి చూపెట్టటం అనే మానసిక తంత్రానికి ’దెబ్బలబ్బాయిని చూపెట్టటం’ అన్న పేరు సార్ధకనామం అయ్యింది.
ఇక వీటి అనువర్తనని వివరిస్తాను.
ప్రస్తుతం దేశంలో దెబ్బలబ్బాయి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎం.పీ. మధుకోడా![2008 లో అవిశ్వాస తీర్మానాన్ని గట్టెక్కించినందుకు ప్రతిఫలంగా, శిబూ శోరెన్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు, కాంగ్రెస్ అధిష్టానం సోనియాగాంధీ, సీ.ఎం. కుర్చీ దింపిన అప్పటి ముఖ్యమంత్రి ఈ మధుకోడాయే!] ఇతడి ఆస్తుల మీదా, ఇతడి బంధువుల ఆస్థుల మీదా, ఏకకాలంలో, 400 మంది ఆదాయపన్ను శాఖ అధికారులు, 70 బృందాలుగా దాడులు చేశారు. అతడు హవాలా మార్గంలో అక్రమంగా ఆర్జించిన 2000 కోట్ల రూపాయల తాలూకూ ఆధారాలని పట్టుకున్నారు. ఇంకా ఎంత అక్రమార్జన ఉందో లెక్క తేలాల్సి ఉంది. [దీని గురించి నిన్న(Nov.2) ఈనాడు బ్రహ్మాండమైన, బహుపద కర్మధారయ సమాసాలతో కూడిన, సంపాదకీయం వ్రాసింది.]
ఈ విధంగా కాంగ్రెస్ అధిష్టానం [అంటే సోనియాగాంధీ నే అని డీ.ఎస్. దగ్గర నుండి అందరూ తేల్చేసారు సుమా!] తనని ధిక్కరిస్తున్న వారందరికీ మధుకోడాని ‘దెబ్బలబ్బాయి’గా చూపిస్తోంది. ముఖ్యంగా జగన్ కీ, అతడి శిబిరంలోని వ్యక్తులకీ, ప్రత్యక్షంగానో పరోక్షంగానో అతడికి మద్దతిస్తున్న, అండగా నిలబడుతున్న వారికీ కూడా! అందులో భాగమే ఓబుళాపురం ఘనుల గాలి సోదరులకి…. అనంతపురం అటవీ శాఖ నోటీసులు జారీ చేయటం, ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చిన లైసెన్సులు రద్దుచేయటం గట్రా.
ఇక జంటిల్ మేన్ నంటూ తనకి తాను ప్రకటించుకున్న ఈ జగన్, అతడి శిబిరంలోని వారూ, మధుకోడా వంటి దెబ్బలబ్బాయని చూసి దడుచుకున్నారో లేదో గానీ……సినిమా నటుడు చిరంజీవి, అతడి ప్రజారాజ్యం పెద్దలు అల్లు అరవింద్ లు మాత్రం బాగా దడుచుకున్నారు. మొన్నమొన్నటి దాకా ’జగన్ ని కలిస్తే తప్పేమిటి’ అన్నవారు కాస్తా, కాంగ్రెస్ అధిష్టానానికి దాసోహం అంటూ పరుగున వచ్చి పొత్తులంటూ పాదాల వ్రాలారు. కాంగ్రెస్సు సరేనందని స్వయంగా పీసీసీ అధ్యక్షుడు డీ.ఎస్. ప్రకటించాడు. అయితే అధిష్టానం నిర్ణయం మీదనే ఇదంతా జరిగిందనీ, జరుగుతుందనీ ప్రకటించాడు. అంతా సిద్దమయ్యాక, ఢిల్లీలో వీరప్ప మొయిలీ ’నిర్ణయాలన్నీ అధిష్టానం స్థాయిలోనే సుమా’ అన్నట్లు, ప్రరాపాతో పొత్తులేదని నిన్న[నవంబరు 2] ప్రకటించాడు.
ఏదేమైనా మధుకోడా వంటి ‘దెబ్బలబ్బాయి’ని చూడగానే హీరో చిరంజీవి కాస్తా జీరో అయిపోయాడు. అంతేమరి! తెరమీద హీరోలు గానీ, నిజజీవితంలోనూ నీతిమంతులూ, ధైర్యవంతులూ కావాలని రూలేం లేదు కదా! ఎందుకంటే మెరిసేదంతా బంగారమూ కాదు, పైకి కనిపించేదంతా నిజమూ కాదుమరి!
నిజానికి ఐటీ దాడులూ, సిబిఐ కేసులూ, EVM టాంపరింగులూ వంటి ఆయుధాలతో, కాంగ్రెస్ అధిష్టానం చాలామందినే మెడలు వంచి శరణం చెప్పించుకుంది. ఆ జాబితాలో పూర్వరైల్వే మంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఒకడు. మరో ఉదాహరణ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఇరుకున్న డి.ఎం.కే. మంత్రి కూడా! డిఎంకే కరుణానిధి ఈ మధ్యకాస్త కొఱ కొఱలాడుతూ తోక ఝాడిస్తున్నాడు. బయటి నుండి మద్దతు ఇస్తాం గట్రా! కాబట్టే రాజా వంటి దెబ్బలబ్బాయి బయటికొచ్చాడు.
లేకపోతే అసలా కుంభకోణాలు జరుగుతున్నప్పుడు, సదరు సోనియా గాంధీకి ఇవన్నీ తెలియదా? వాటాలు రాలేదా? కేంద్రంలో ప్రక్కనున్న వాళ్ళూ, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులూ, మంత్రులు బొక్కుతుంటే, తానుమాత్రం అమాయకంగా నోరు తెరుచుకు ఊర్కుండి పోయిందా? మరీ పిల్లిదూరే కంతలో ఎలుక దూరదు అనుకోవటం కాకపోతే?
నిజానికి ఇలాంటి దెబ్బలబ్బాయిల్ని చూపించి, మహారాష్ట్రంలో, ఎన్సీపిని కాంగ్రెస్ లో విలీనం చెయ్యాలని ఒత్తిడి చేస్తూందన్న వార్తలొస్తున్నాయి కూడాను. అయితే అన్నీ కుదిరాక ఇప్పుడు ఎన్సీపీ నాయకులు ముందటి షరుతులన్నిటినీ ’చల్’ అంటున్నారు. ఆ మతలబుల గురించి మరోసారి వ్రాస్తాను.
ఇక ఈ నేపధ్యంలో, జగన్ కి ఆప్తులూ, పరోక్షంగా ఇతడికీ, గతించిన ఇతడి తండ్రి వై.ఎస్. కీ లోతట్టు వ్యాపార భాగస్తులూ అయిన, గాలి సోదరలదీ ఇదే కథ! లేకపోతే ఓబుళాపురం గనుల్లో అవినీతి, అక్రమాల గురించి వై.యస్. బ్రతికి ఉండగా తెలియదా ఈ కాంగ్రెస్ అధిదేవత సోనియా గాంధీకీ, ప్రధానమంత్రికీ? మరి అప్పుడెందుకు ఊరుకున్నట్లు? వై.యస్. ని చూసి ఊరుకున్నారా? లేక అతడు పంపిన రోజువారీ/నెలవారీ వాటాలు తీసుకుని ఊరుకున్నారా? లేక వై.యస్. తో అప్పటికి ఉన్న అవసరాల రీత్యా ఊరుకున్నారా? వై.యస్. అంటే భయపడి ఊరుకోరు కదా?
మరెందుకు అప్పడంతా చూసీ చూడనట్లు ఊరుకుని ఇప్పుడు అనంతపురం అటవీ శాఖ చేత గాలిబ్రదర్స్ కు నోటీసులు ఇప్పించినట్లు? గాలిసోదరులు ఓబుళాపురం గనుల లైసెన్సులు ఇప్పుడెందుకు రద్దు చేసినట్లు? జగన్ శిబిరానికి చెక్ చెప్పటానికని కొన్ని పత్రికల ఉవాచ! చిరంజీవితో పొత్తు అందుకేనని పత్రికలలో పెద్దచ్చరాలతో పొద్దున్నే ప్రచురించారు. [సాయంత్రానికి అదంతా ’తూచ్’ అయిపోయిందనుకొండి!]
ఒక విషయం గమనించండి. మన సినిమాల్లో హీరో…. చచ్చీ చెడి, విలన్లని పట్టుకుని, అవినీతి పరులైన అధికారుల అడ్డంకులన్నీ దాటుకుని, న్యాయమూర్తుల దగ్గరికి పోతుంటాడు. అందరూ అవినీతి పరులే అయినా, న్యాయమూర్తులు మాత్రం, సాక్షాత్తూ ‘జస్టిస్ చౌదరి’లై, దేవుడి తీర్పులు ఇచ్చేస్తుంటారు. పిల్లి దూరే కంతలో ఎలుక దూరదనుకునే సత్తెకాలపు సత్తెయ్యల్లా, మనం అదంతా నిజమే ననుకున్నాం.
కర్ణాటక హైకోర్టు జస్టిస్ దినకరన్ లనీ, పి.ఫ్.ఖాత కుంభకోణంలో వాటాదారులుగా బయటపడిన 36 మంది జడ్జీలనీ[ఈ కేసులో నిందితుడు ఈమధ్యే జైలులో అనుమానాస్పద మృతి పొందాడు] చూసి ఇప్పుడు నోరెళ్ళబెడుతున్నాం.
కాంగ్రెస్ అధిష్టానం ఇటలీ గాంధీ గురించి పత్రికల హోరు కూడా అలాగే ఉంది. కేంద్రమంత్రులూ, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులూ, మంత్రులూ….. అందరూ అవినీతి పరులే గానీ ఈమె, ప్రధానమంత్రి మాత్రం నిజాయితీకి నిలువెత్తు రూపాలట. [అంత నిలువెత్తు నిజాయితీ రూపాలు ఇంత అవినీతి జరుగుతుంటే ఎలా చూస్తూ ఉన్నారో!?]
మరీ పిల్లిదూరే కంతలో ఎలుక దూరదనటం కాకపోతే!
ఇంతకీ ఇంతమంది దెబ్బలబ్బాయిలని జగన్ కీ, అతడి శిబిరానికీ కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ ఎందుకు చూపిస్తున్నట్లు? ఈ జంటిల్ మేన్ ఏ పాఠం నేర్చుకోలేదో మరి? జగన్ శిబిరానికి, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య నడుస్తున్న అంతర్లీన పోరునీ, సంకేత భాషనీ కేవలం క్లుప్తంగా చెప్పాను. సోదాహరణంగా, దృష్టాంతపూరితంగా తరువాత టపాలలో వివరిస్తాను.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
నాకు గుర్తుండి ఎన్ సీ పీ పార్టీ సోనియాకు వ్యతిరేకంగా "విదేశీ మహిళ మనకొద్దు" అన్న గొప్ప భావంతో పుట్టింది.
కొన్నాళ్ళ తరువాత ఇప్పుడు అదే పార్టీ ఆమె బూట్లు నాకుతున్నదంటే అర్ధం అవుతున్నది, అర్ధం కానట్లూ వున్నది.
Amma..
here is an interesting link:
http://naradalokam.blogspot.com/2009/11/blog-post_02.html
నాలోనేను గారు,
అది అర్ధంకానంత జటిలం కాదండి. జాగ్రత్తగా పరిశీలించి చూడండి, మీకే అర్ధం అవుతుంది. తదుపరి టపాలలో మరికొంత వివరిస్తాను.నెనర్లు!
****
అజ్ఞాత గారు,
ఆ టపా చదివానండి. అందులో డి.ఎస్. అని ఉన్నచోట అధిష్టానం అని చదువుకుంటే సరిపోతుంది. స్పష్టమైన చిత్రం కనబడుతుంది. నెనర్లు!
total media was diverted . some thing happened that day in AP .frequently media was diverted wantedly and knowingly.Heads of some media may know something.
Post a Comment