మా జీవితాల్లో గూఢచర్యపు ప్రమేయాన్ని మేం అసలు వూహించని రోజుల్లో, మాకెదురైన కష్టనష్టాలని, మాపై వేధింపుగా మేం గుర్తించలేదు. విధి అనీ, నుదిటివ్రాత అనీ అనుకున్నాము. దాన్నుండి దాటటానికి ‘గీత’నే ఆధారంగా తీసుకున్నాము. అదీగాక, 1992 కు ముందర, బ్యాటరీ తయారీ సంస్థ నడుపుతున్న రోజుల్లో సైతం, నాకు ’గీత’ మీద ఆధారపడటం అలవాటే.
ఆ క్రమంలో గీత మాకు అర్ధమైన తీరు ఏమిటంటే –
గీతలో, భగవంతుడు, కర్తవ్యవిముఖుడై చతికిలబడిన అర్జునుణ్ణి, పలురకాలుగా కర్మోనుఖుణ్ణి చేస్తాడే గానీ ’నేను చెబుతున్నాను. ఇలా చెయ్యి’ అనడు. చెయ్యి పట్టుకు లేపి నిలబెట్టడు.
అర్జునుడు
శ్లోకం:
గురూ నహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్య మపీహలోకే
హత్వార్థ కామాంస్తు గురూ నిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్
భావం:
మహానుభావులూ, వృద్ధులూ అయిన భీష్మద్రోణాదులను చంపేకంటే భిక్షాటన చేయడం మేలు. కాగా, అర్ధకామముల కోసం, గురువులను చంపి, ఆ రక్తపు తిండినీ, హత్యాభోగాలనూ నేనెలా అనుభవించగలను?
అంటూ దుఃఖంతోనూ
శ్లోకం:
న చైతద్విద్మః కతరన్నో గరీయో యద్వాజయేమ యదివానో జయేయుః
యానేవ హత్వా న జిజీవిషామ స్తే౨ వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః
భావం:
యుద్దమే చేసినా, మనం గెలుస్తామో, వాళ్ళే గెలుస్తారో! ప్చ్….. ఎవరిని చంపుకోవడం వలన, మనకు జీవించాలనే కోరికే నశించిపోతుందో – అటువంటి ధార్తరాష్ట్రులే కదా యెదటి పక్షంలో ఉన్నది!
అంటూ సంశయంలోనూ, పడిపోయి సాక్షాత్తు తానే
శ్లోకం:
కార్పణ్య దోషోప హత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మ నమ్మూఢ చేతాః
యచ్ర్ఛెయ స్స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే౨హం శాధి మాం త్వాం ప్రపన్నమ్
భావం:
ఈ రాజ్యలోభ, బంధులోభాలతో, దెబ్బతినిన నా మనస్సు , ధర్మ నిర్ణయం చేయలేకపోతోంది. నిన్నడుగుతున్నాను. నేను నీ శిష్యుణ్ణి. నా కేది మంచిదో అది నువ్వే చెప్పు.
అని అడిగినా, శ్రీకృష్ణుడు…..అన్నీ చెప్పి
శ్లోకం:
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా
విమృశ్యైత దశేషేణ యథేచ్ఛసి తథా కురు
భావం:
అతి రహస్యమైన జ్ఞానాన్నంతటినీ నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీ యిష్టం వచ్చినట్లు చెయ్యి.
అని చెబుతాడు.
చివరగా నరుడు తన ’యధేచ్ఛ’ని ఉపయోగించి నిర్ణయించుకోవాలన్న మాట, మంచి చేయాలో, చెడు చేయాలో! అధర్మం వైపు ఉండాలో, స్వధర్మం నిర్వహించాలో కూడా, ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చన్న మాట!
ఇంతగా….. “మంచి వైపుంటావో, చెడువైపుంటావో [తటస్థం లేదు] నీవే నిర్ణయించుకో”, అనే శ్రీకృష్ణుడు, ’సకర్మ’ ఏదో, ఎంత నిర్భయంగా ప్రతీవ్యక్తి తన స్వధర్మమైన ఆ ’సకర్మ’ని ఆచరించ వచ్చో, విడమర్చి చెప్పాడు. అర్ణునుడికి చెప్పిన ప్రతిమాట…. ప్రతీవ్యక్తికీ చెప్పినట్లే! ప్రతీవ్యక్తీ తన జీవితానికి అర్జునుడే. ప్రతీవ్యక్తికీ తన జీవితకాలంలో, గీతలో అర్జునుడికి వచ్చిన ధర్మసందేహాలు వస్తాయి. కాకపోతే మనకి అవగాహన లేక పట్టించుకోం. అంతే!
తటస్థంగా ఉండటం అన్న కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే తటస్థంగా ఉండటం అంటే ఒకరకంగా చెడును ప్రోత్సాహించటమే.
ఇక, భయంకర విషాదంతో
శ్లోకం:
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ
కిం నో రాజ్యేన గోవింద కిం భోగై ర్జీవితేన వా
భావం:
నేను విజయాన్ని కోరటం లేదు. రాజ్యాన్ని గానీ, సుఖాన్ని గానీ కోరటం లేదు. [బంధువలందర్నీ చంపుకున్నాక] రాజ్యమెందుకు? భోగమెందుకు? అసలీ జీవితం యెందుకు?
అని కూలబడిన అర్జునుడికి…. శ్రీకృష్ణుడు
1]. యుద్ధం చేయకపోతే నిన్ను పిరికి వాడంటారు. అపకీర్తి కలుగుతుంది. పరిహాసం పాలు అవుతావు అంటూ ఉన్న పరిస్థితిని వివరిస్తాడు. చూడండి,
శ్లోకం:
అథచేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి
తత స్స్వధర్మం కీర్తించ హిత్వా పాప మవాప్స్యసి
భావం:
ధర్మబద్దమైన యీ యుద్ధాన్ని నువ్వు చేయనట్లయితే యశో ధర్మభ్రష్ఠుడవూ, పాపివీ, అవుతావు.
శ్లోకం:
ఆకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే2వ్యయాం
సంభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్యతే
భావం:
నీ అపకీర్తిని ప్రజలు కలకాలం చెప్పుకుంటారు. అభిమాన ధనులకి అపకీర్తి కంటే మరణమే శ్రేయస్కరం సుమా.
శ్లోకం:
భయాద్రణా దుపరతం మంస్యన్తే త్వాంమహారథాః
యేషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్
భావం:
ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనట్లయితే, ఇంతవరకూ నిన్ను గౌరవిస్తున్న సాటి క్షత్రియులంతా నిన్నో పిరికివాడిగానూ, చులకన గానూ చూస్తారు.
శ్లోకం:
అవాచ్య వాదాంశ్చ బహూ స్వదిష్యన్తి తవాహితాః
నిందంత స్తవ సామర్ధ్యం తతో దుఃఖతరం ను కిమ్
భావం:
నీ శత్రువులు నీ పరాక్రమాన్ని దూషిస్తూ అనరాని మాటలంటారు. అంతకన్న దుఃఖ భూయిష్టమైనది వేరే యింకేం ఉంటుంది?
2]. యుద్ధం చేస్తే గెలుపోటముల పట్ల సంశయపడిన అర్జునుడి లో రణోత్సాహాన్ని, రజోగుణాన్ని ఎలా ప్రేరేపించాడో చూడండి.
శ్లోకం:
హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం
తస్మా దుత్తిష్ఠ కౌన్తేయ యుద్దాయ కృతనిశ్చయః
భావం:
అర్జునా! యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. గెలిస్తే యీ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక, యుద్ధం చేయాలనే దృఢనిశ్చయం గలవాడవై, లే!
3]. అంతేకాదు. యుద్ధం చేస్తే వచ్చే ఫలితం గురించిన సంశయం నీకు అవసరం లేదు. సమబుద్ది కలిగిఉండు అని స్పష్టంగా చెప్పాడు.
శ్లోకం:
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగో స్త్వ కర్మణి
భావం:
నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగాని, ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు.
శ్లోకం:
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ
సిద్ధ్య సిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే
భావం:
లాభాలాభాల పట్ల మోహరహితుడవై, యోగబద్దుడవై, కార్యసిద్ధి కల్గినా, కలుగకున్నా సమబుద్ధి గల్గి నియతమైన కర్మలను ఆచరించు.
4]. “ఇక బంధుప్రీతితో దుఃఖిస్తున్నావు కదూ! ఈయుద్ధంలో నీవు చంపకున్నా బ్రతుక గలవారు ఇందెవ్వరూ లేరు” అని సత్యాన్ని కళ్ళ ముందు నిలబెడతాడు.
శ్లోకం:
కాలో౨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః
ఋతే౨పి త్వాం న భవిష్యంతి సర్వే యే౨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః
భావం:
ఈ సర్వస్వాన్నీ లయింప చేసే కాలస్వరూపుడిని నేను. ప్రస్తుతం సంహారానికి పూనుకొని ఉన్నాను. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయడం మానివేసినా సరే, నువ్వు తప్ప, మీ ఉభయపక్షాలలోనూ ప్రతిపక్షంలో ఎవడు కూడా మిగలడమనేది అసంభవం.
5]. నీవు నిమిత్తమాత్రుడివి. కాబట్టి నీ పని నువ్వు చెయ్యి అని చెబుతాడు.
శ్లోకం:
తస్మాత్త్వముతిష్ఠ యశో లభస్వజిత్వాశత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం
మయా హతాంస్త్వం జహి మావ్యథిష్ఠాః యుధ్యస్వ జేతా౨సి రణే సపత్నాన్
భావం:
కాబట్టి, అర్జునా! లే! యుద్ధానికి సిద్దంకా! శత్రుసంహారం చేసి ఆఖండ భూమండలాన్నీ అనుభవించు. వీళ్ళంతా నా చేత పూర్వమే చంపబడ్డట్టుగా భావించి – నీవు నిమిత్త మాత్రుడిగా యుద్ధం చేసి కీర్తినార్జించు.
శ్లోకం:
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథా న్యానపి యోధవీరాన్
మయా హతాంస్త్వం జహి మావ్యథిష్టాః
యుధ్యస్వ జేతా సి రణే సపత్నాన్
భావం:
ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాదివీరులందర్నీ నేను పూర్వమే చంపివేశాను. నాచేత చచ్చినవారినే నువ్విప్పుడు చంపబోతున్నావు. ఆధైర్యం మాని, యుద్ధం చెయ్యి. శత్రువులను జయిస్తావు.
6]. నీవు చూసేది శరీరాన్ని. అది ఛస్తూ మళ్ళీ పడుతూ ఉంటుంది. అశాశ్వతమైన దాన్ని గురించి దుఃఖించటం అనవసరం. నువ్వు ఏడ్చినా….. నవ్వినా…… దానితో నిమిత్తం లేకుండా, ఈ శరీరాలు, నశించే రోజున నశిస్తాయి. ఆత్మ శాశ్వతమైనది. దాన్ని గురించీ నువ్వు దుఃఖించనవసరం లేదు. నువ్వు ఏడ్చినా…. నవ్వినా, దానితో నిమిత్తం లేకుండా, ఆత్మ, నిత్యమూ శాశ్వతమూ అయి ఉంటుంది. ఏ విధంగా చూసినా నీ దుఃఖం అర్ధరహితం. కాబట్టి దుఃఖం విడిచి పెట్టి యుద్ధం చెయ్యి అంటాడు.
శ్లోకం:
అంత వంత ఇమే దేహానిత్యస్యోక్తా శ్శరీరిణః
అనాశినో౨ప్రయేయస్య తస్మా ద్యుధ్యస్వభారత
భావం:
అర్జునా! ధరింపబడిన దేహాలు నశిస్తాయేగాని, ధరించిన జీవుడు [ఆత్మ] మాత్రం నిత్యమైనదీ సత్యమైనదీననీ తెల్సుకుని, దుఃఖాన్ని మాని యుద్ధం చెయ్యి.
శ్లోకం:
న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః
అజో నిత్య శ్శాశ్వతో2యం పురాణో న హస్యతే హస్యమానే శరీరె
భావం:
ఆత్మపుట్టేది గాని, చనిపోయేది గానీ కాదు. అలాగని ఒక్కప్పుడు ఉండేదీ, మరొక్కప్పుడు ఉండనిదీ కూడా కాదు. ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒకలాగే ఉండేది. నాశనం లేనిది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. దేహం నశించినా – ఆత్మ నశించదు.
7]. అలాగ్గాక, ఆత్మకూడా శాశ్వతం కాదు అంటావేమో! అంటే ఈ జన్మ తప్ప, జన్మజన్మలున్నాయని నమ్మనంటావేమో! అలాంటప్పుడు కూడా నువ్వు దుఃఖించనవసరం లేదు. ఎందుకంటే ఆత్మ ఆశాశ్వతమైనదైనా పుట్టిన ప్రతీప్రాణీ గిట్టక తప్పదు కదా!
శ్లోకం:
అథ చైసం నిత్యజాతం నిత్య వా మన్యసే మృతం
తథాపి త్వం మహాబాహో నెపం శోచితు మర్హసి
భావం:
ఒకవేళ, నువ్వీ ఆత్మను శరీరం వలెనో యెప్పుడూ పుడుతూ పోతూ ఉండే దానిగా భావిస్తావేమో! అప్పుడు కూడా నువ్వు దీనిని గురించి దుఃఖపడవలసిందేమీ లేదు.
శ్లోకం:
జాతస్య హి ధ్రువో మృత్యు ర్ర్ధువం జన్మ మృతస్యచ
తస్మా దపరిహార్యే ర్ధే నత్వం శోచితు మర్హసి
భావం:
పుట్టినది గిట్టక తప్పదు. మరణించినది మరలా పుట్టకా తప్పదు. తప్పించ శక్యం గాని చావు పుట్టుకల విషయమై నువ్వు దుఃఖించడం అనవసరం.
8]. అంతేకాదు, ప్రతీవ్యక్తి తన ధర్మాన్ని తను ఆచరించాలి అంటాడు.
శ్లోకం:
శ్రేయా స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్
స్వధర్మే విధనం శ్రేయః పరధర్మో భయావహః
భావం:
ఎంతో నైపుణ్యంగా ఆచరించే పరధర్మం కన్న, గుణరహితంగా చేసినప్పటికీ స్వధర్మమే మేలు, స్వధర్మనిర్వహణార్ధం సమసి పోయినా మంచిదే గాని, ఆమరణాంత భయావహమైన పరధర్మానుష్ఠానం మాత్రం తగదు.
ఈ విధంగా…. ’అధర్మం వైపు నిలబడటం’ తాత్కాలికంగా సుఖవంతంగా కనపడటం, మన హ్రస్వదృష్టి కారణాంగానే తప్ప, నిజంగా అది సుఖవంతమైనది కాదు. అది ఆమరణాంత భయవహమైన పరధర్మం మాత్రమే! – అని స్పష్టంగా చెబుతాడు శ్రీకృష్ణుడు.
9]. ప్రతిమనిషికి ఏదో ఒక పని చేయక తప్పదు. [అలాంటప్పుడు ఆ చేసే పని ఏదో, మంచి పనే చేయటం మేలు గదా!]
శ్లోకం:
నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ద్యే దకర్మణః
భావం:
కాబట్టి, నువ్వు నీకు నియమితమైన కర్మలను ఆచరించు. ఎందుకంటే – యే పనీ చేయకపోవడం వల్ల – దేహయాత్ర కూడా అత్యంత దుర్భరంగా పరిణమిస్తుంది.
10]. అందువల్ల నీ పని నువ్వు చెయ్యి అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో.
శ్లోకం:
తస్మా దసక్త స్పతతం కార్యం కర్మ సమాచర
అసక్తో హ్యాచర కర్మ పరమాప్నోతి పూరుషః
భావం:
అందువలన అర్జునా! నువ్వు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మల నాచరించు. ఆపేక్షా రహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది.
11]. అంతేకాదు, అర్జునుడికి చెప్పిన ఈ ’మాట’ని, తాను ఆచరించాకే చెబుతున్నానని కూడా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు.
శ్లోకం:
న మే పార్ధాసి కర్తవ్యం త్రిషు లోకేషు కించన
నా నవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి
భావం:
పార్ధా! నాకు యీ మూడు లోకాలలోనూ కూడా ’చేయవలసినవి’ అనేది యేదీ లేదు. నాకు చెందనిదీ, నాచే ఆశించబడేదీ లేదు. అయినప్పటికీ నేను యెప్పుడూ కర్మలనాచరిస్తూనే ఉన్నాను.
ఎందుకంటే ఇతరులు తనని ఆదర్శంగా తీసుకుంటే లోకానికి మేలు కలగాలి గానీ కీడు కలగకూడదు కదా! అందుకు
శ్లోకం:
యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః
స యత్ర్పమాణం కురుతే లోక స్త దనువర్తతే
భావం:
[ఎందుకంటే] ఉత్తములు ఆచరించిన కర్మలనే యితరులు ప్రమాణంగా స్వీకరిస్తారు. లోకమంతా వాళ్ళని ఆనుసరించే కర్మలనాచరిస్తుంది.
శ్లోకం:
యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్య తంద్రితః
మమ వర్త్మాను వర్తం తే మనుష్యాః పార్ధ సర్వశః
భావం:
అర్జునా! నేనే గనక కర్మలు విడిచి పెడితే, లోకులందరూ కూడా నన్నే అనుసరిస్తారు.
శ్లోకం:
ఉత్సీదేయు రిమే లోకా న కుర్యాం కర్మ చేదహం
సంకరస్య చ కర్తా స్యా ముపహన్యా మిమాః ప్రజాః
భావం:
నేనే గనక కర్మలు జేయడం మానివేస్తే, లోక వ్యవహారాలన్నీ శిధిలమౌతాయి. తద్వారా సంకరము, కర్మభ్రష్ఠతా కల్గుతాయి. ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడనవుతాను.
తనకి ఏదీ పొందవలసిన అవసరం లేదు. తనకి దేనికీ లోటు లేదు. అయినా తన పనిని తాను చేస్తోంది ఇందుకే అంటాడు; శ్రీకృష్ణభగవానుడు. అందుకే ఆయన భగవంతుడు.
12]. కాబట్టి అజ్ఞానులు కర్మ ఫలాపేక్షక కర్మలు ఆచరిస్తున్నట్లే – నువ్వు ఫలాపేక్ష లేకుండా కర్మలాచరించు అని చెబుతాడు.
శ్లోకం:
సక్తాః కర్మ ణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత
కుర్యా ద్విద్వాం స్తథా౨సక్త శ్చికీర్షు ర్లోక సంగ్రహమ్
భావం:
కాబట్టి, ఓ భారతీయుడా! అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే, జ్ఞానులు కూడా ఫలాపేక్షరహితంగా లోకసంగ్రహణానికై – చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి.
శ్లోకం:
న బుద్ధి భేదం జనయే దజ్ఞానాం కర్మసంగినామ్
జోషయే త్సర్వకర్మాణి విద్వా యుక్త స్సమాచరన్
భావం:
జ్ఞానియైన వాడు కర్మాసక్తులయొక్క బుద్ధిని చలింపజేయకుండగా – తాను కర్మాచరణ చేస్తూ, వారి చేత చేయించాలి.
13]. కాబట్టి ఫలితాన్నీ, కర్తతృహంకారాన్ని వదిలి నీపనిని నీవు చెయ్యి! – అని స్పష్టంగా చెబుతాడు శ్రీకృష్ణుడు.
శ్లోకం:
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యా౨ ధ్యాత్మచేతసా
నిరాశీ ర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః
భావం:
సమస్తమైన కర్మలనూ నాకే సమర్పించు. కోరికలూ, అహంకారమూ వదిలెయ్. దుఃఖాన్ని మాను. వివేకవంతుడివై – యుద్ధం చెయ్యి.
శ్లోకం:
యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః
జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః
భావం:
ఎవడు ఫలాపేక్షారహితుడో, కర్త్వత్వాహంకారాన్ని జ్ఞానాగ్నిచే భస్మం చేస్తాడో, వాడే పండితుడు.
పండితుడవై, నీ స్వధర్మమైన కర్మని నువ్వు ఆచరించు.
ఏ మనిషికైనా తనదైన స్వధర్మం – తనకూ ఇతరులకీ కూడా మేలుచేసే ’మంచి’ అవుతుందే తప్ప, ప్రస్తుతానికి తనకి మేలు గానూ ఇతరులకి కీడు గానూ ఉండి, కాలం గడిచాక గమనిస్తే, తనకూ ఇతరులకీ కూడా కీడే కలిగించే ’చెడు’ అవ్వదు కదా!
ఇదీ గీత మనల్ని ప్రేరేపించే తీరు! స్పూర్తి పరిచే తీరు!
దీనిని మేము, జీవితంలో ఎదురైన సంఘటనల నుండి అనుభవపూర్వకంగా నేర్చుకున్నాము.
ప్రతీమనిషికి, జీవితంలో ప్రతి మలుపు దగ్గరా, దేవుడు రెండు దారులు పెడతాడు. ఒకటి మంచి, రెండు చెడు. లేదా ఒకటి ధర్మం, రెండోది అధర్మం. [ఒకో సారి ఈ అధర్మాన్నే లౌక్యం అని కూడా అంటారు] ఏ దారిలో వెళ్ళట మనేది ఎవరికి వారూ నిర్ణయించుకోవచ్చు.
శ్రీకృష్ణుడు పలురకాలుగా అర్జునుడికి జ్ఞానాన్ని, కర్తవ్యాన్ని బోధించాక యధేచ్ఛగా నిర్ణయం తీసుకోమంటాడు.
ఇలాంటి రెండు దారుల కూడలిలో అందరిలాగే మేమూ చాలా సార్లూ నిలబడ్డాము.
ఒక ఉదాహరణ చెబుతాను....
2000 లో ఎంసెట్ ర్యాంకుల కుంభకోణం పైన మేం చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు ఇచ్చాము. అప్పటికి మేం ప్రైవేటుగా ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నాము.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
6 comments:
ఇప్పుడే గీతా పారాయణం చేసి అంతర్జాలంలోకి వస్తూనే మళ్ళీ మీద్వారా .....ఎంత అదృష్టం.
awesum presentation of geeta in relation to real life..
Dear Madam,
I confused with your ID. The article is very good. I really enjoyed. I started reading geetha from 28th of NOV. but not able to put all my concentration.
మీరు ఇవన్నీ చెబుతూంటే, నాకు జిజాబాయి గుర్తొచ్చారండీ :)
ఆదిలక్ష్మి గారూ
గీతనుండి విస్తృతంగా కోట్ చేసారు. అర్థాలు కూడా విడమరచి వ్రాసారు. శ్లోకానికి అర్థానికీ మధ్య శ్రీ పూడిపెద్ది వారి పద్యానువాదాన్ని కూడా చేరిస్తే ఇంకా చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ పద్యానువాదాలు సుమారు 13 అధ్యాయాల వరకూ నా గీతామృత తరంగిణి బ్లాగులో ఉన్నవి. వీలయితే వాటిని ఆయా చోట్లలో కాపీ పేస్టు చేయండి. ధన్యవాదములతో
నరసింహా రావు.
రాఘవ గారూ, చిలమకూరి విజయ మోహన్ గారూ,
మీ అభిమానానికి కృతజ్ఞతలు.
~~~~~~~
సుబ్బా గారు, వేణు గారూ,
నెనర్లు!
~~~~
వేదుల బాలకృష్ణగారు,
మన్నించాలి. నేను గీత గురించిన వ్యాసం వ్రాయలేదండి. మా జీవితాల్లో ’గీత’ని ఎలా అనువర్తించుకున్నామో వ్రాయటం ప్రారంభించి, నిడివి ఎక్కువ కావటంతో టపాని అక్కడికి ఆపాను. నా ఆంగ్ల బ్లాగులో గీత గురించిన సుదీర్ఘమైన వ్యాసం వ్రాసాను. దాన్ని తెలుగులోకి అనువదించేటప్పుడు మీ సూచన పాటించేందుకు ప్రయత్నిస్తాను. చాలారోజుల తర్వాత వ్యాఖ్య వ్రాసారు. నెనర్లు!
Post a Comment