నిన్నటి నా టపా ‘ఈనాడు, వై.యస్.రాజశేఖర్ రెడ్డిపై కురిపిస్తున్న ప్రశంసల వర్షం - ఇదేదో తేడాగా ఉన్నట్లుందే!’ – లో వ్యాఖ్య.
>>> “నా కామెంట్ ఇక్కడ వారికి నచ్చక పోవచ్చు కాని మనది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఎప్పుడైనా ఎలా ఆయినా వాళ్ళ అభిప్రాయం చెప్ప వచ్చు. సరే ఇంక ఈనాడు కథనాల విషయానికి వద్దాం, ఎప్పుడు లేనిది ఎందుకు వై.ఎస్.ఆర్. జపం చేస్తుంది? ఈనాడు దిన పత్రిక నిన్నా మొన్న వచ్చిన కొత్త పత్రిక కాదు, చాలా సంవత్సరాల అనుభవంతో ఆచి తూచి అడుగు వేసే పత్రిక, ఇది వరకు కాలంలో అయితే తెలుగు దేశం కాక మరే ఇతర పార్టీకి జనాదరణ ఉందని ఆ పత్రిక పొరపాటున కూడా చెప్పేది కాదు, ఒక వేళ చెప్పినా కూడా ఏదో నెగటీవ్ అంశం కలగలిపి చెప్పేది, కాని ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా చాలా బలంగా ఉంది, జరుగుతున్న వాటిని ఏదో ఒక పార్టీకి నష్టం ఆయినా లేక లాభం ఆయినా వెంటనే చూపిస్తున్నాయి, మరి ఇటు వంటి పరిస్థితిలో "అబ్బే వై.ఎస్.ఆర్. మరణానికి ఏమీ స్పందన లేదు" అని ఎలా చెప్పగలదు? ఇంకో విషయం ఏమిటంటే ఏ పత్రికకు ఏ సొంత అజెండా ఉన్నా ప్రజల అభిప్రాయంకు విరుద్ధంగా వార్తలు ప్రచురిస్తే అది తిరస్కరించ బడుతుంది, అందులోను ప్రజలు ఇలాంటి భావోద్వేగ స్థితిలో ఉన్నప్పుడు అది పత్రికకు చెడు చేసే అవకాసం ఉంది, ఈ వ్యాపార సూత్రం అనుభవజ్ఞుడైన రామోజీరావు గారికి తెలీదని ఎలా అనుకుంటాం! ఈనాడు చేస్తున్న ఈ వై.ఎస్.ఆర్. జపం చాలా తాత్కాలికం, మన ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అని ఈనాడుకు బాగా తెలుసు, ఈ జనం కొన్ని రోజులు లేదా నెలకో రెండు నెలలకో వై.ఎస్.ఆర్.ను మర్చి పోతారు, అప్పుడు మళ్లీ మాములుగా తన చంద్ర బాబు జపం మొదలు పెడుతుంది, కాబట్టి ఈనాడు, తెలుగు దేశం లేదా చంద్ర బాబు అభిమానులు ఏమీ బెంగ పెట్టుకోనక్కర లేదు, అయితే ఒకటి మాత్రం నిజం ఈ రాష్ట్ర ప్రజలు పార్టీల పరంగా, కులాల పరంగా ఇంకా వారి వారి స్వలాభ అవసరాల పరంగా వివిధ వర్గాలుగా విడి పోయారు, ఇంకో విషయం ఏమిటంటే మీడియా ఇప్పుడు కేవలం రామోజీ రావు చేతిలోనో, రాధ కృష్ణ చేతిలోనో లేక జగన్ చేతిలో మాత్రమే లేదు, కాబట్టి ఇది వరకులా ఈనాడు లాంటి పత్రికలు తమ స్వంత అభిప్రాయాన్ని పదే పదే ప్రచురిస్తూ అదే జనాభిప్రాయంగా మార్చడం అంత సులభం కాదు, కాబట్టి పత్రికలలో తమ పాజీటీవ్‌లు బాగా చెప్పుకుంటూ నెగటీవ్‌లు దాచుకుంటూ ఇంకా ఇతర పార్టీల నెగటీవ్‌లను అదే పనిగా చూపించే పత్రికలకు, నాయకులకు కాలం చెల్లి పోయి నిజంగా నిరు పేదలకు సేవ చేసే మంచి నాయకులు రావాలని ఆశిద్దాం.”
నిన్నటి నా టపాలో, మీకంటే ముందు ఇద్దరు అజ్ఞాతలు ఇదే వ్యాఖ్యని అక్షరం తేడా లేకుండా వ్రాసారు. ’అజ్ఞాతలకి అంత సీన్ ఏముంది లెద్దూ’ అని మేం ప్రచురించలేదు. తిరిగీ అదే వ్యాఖ్య, తుచ తప్పకుండా మీరు వ్రాస్తే, ఇక దానికి జవాబివ్వడం భావ్యమని ఈ టపా రూపంలో స్పందన వ్రాస్తున్నాను.
మీరు రామోజీరావుని సమర్ధిస్తూ వ్రాసిన వ్యాఖ్య బాగుంది. అయితే అందులోని లొసుగుల్ని ఇప్పుడు మనం చర్చిద్దాం.
1]. మీరే అన్నారు, ప్రజల జ్ఞాపక శక్తి తాత్కాకమని. అది నిజమే! ముఖ్యమంత్రి దారుణ మరణం పొందింది సెప్టెంబరు 2 వ తేదిన, ఆ విషయం బయటికొచ్చింది 3 వ తేదీన. [ఈ ఆలస్యం వెనకనున్న నాటకీయత గురించిన పూర్వాపరాలు మరోసారి టపాలో వ్రాస్తాను.] ఇన్నిరోజులు గడిచినా ప్రజల భావోద్రేకాలు తగ్గలేదని ఈనాడు రామోజీరావు భావిస్తున్నాడా?
2]. నిన్నటికి నిన్న అంటే సెప్టెంబరు 14 వ తేదీన, ముందటిరోజున రాష్ట్రహోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అకాల మృత్యువాత పడిన పావురాల దిబ్బ[రుద్రకోడూరు]ని సందర్శించిన నేపధ్యంలో, ప్రధాన సంచిక, కర్నూలు జిల్లా సంచికలతో కలిపి 15 ఫోటోలూ, నాలుగైదు వార్తాంశాలతో ఈనాడు వ్రాసింది. ఇదీ ప్రజల భావోద్వేగమేనంటారా?
3]. ఆ ముందురోజు, సెప్టెంబరు 13న సి.ఎస్.రమాకాంత్ రెడ్డి, డీ.జి.పి.యాదవ్ సందర్శనకూ ఇదే విధంగా పదుల కొద్దీ ఫోటోలతో వార్తాంశాలు వ్రాసింది. ఇదీ ప్రజల భావోద్రేగమేనంటారా?
4]. బాపూజీ, నెహ్రు, ఇందిరాగాంధీ ఇంకా ఇతరనాయకులు పోయినప్పుడు ప్రజలు ఇంతే భావోద్రేగాలకు గురై ఉంటారు కదా? అప్పుడు పత్రికలు ఇదే సూత్రాన్ని అనుసరించాయా?
>>>‘ప్రజల భావోద్రేగాలకు వ్యతిరేకంగా వ్రాస్తే పత్రిక తిరస్కరింపబడుతుందనే వ్యాపార సూత్రం తెలియని వాడు కాదు రామోజీరావు’ అని మీరన్నారు. నిజమే?మరి ఇదే సూత్రం, ఈ వ్యాపారవేత్త, రాజీవ్ గాంధీ హత్య చేయబడినప్పుడు ఎందుకు అనుసరించలేదు? మే 21, 1991 తర్వాత దాదాపు నెలరోజుల పాటు, ఈనాడు, రాజీవ్ గాంధీపై ప్రశంసలు వ్రాయలేదు గానీ ఎల్.టి.టి.ఇ. గొప్పదనం గురించి, శివరాసన్, ధనూల సాహసం గురించి, హత్యాస్థలానికి హంతక బృందం ప్రయాణించిన తీరుతెన్నుల గురించి, సిట్ నుండి హంతక ముఠా ఎలా తప్పించుకున్నది వైనవైనాలుగా వ్రాసింది. రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు ప్రజలు భావోద్రేగాలకి గురికాలేదా?
5]. అప్పుడే కాదు, 1984 అక్టోబరు 31 న ఇందిరాగాంధీ హత్యగావింపబడినప్పుడు, ఈనాడు, సిక్కులపై జరిగిన హింసాకాండకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది. దానితోపాటుగా ఇందిరాగాంధీని ’ఆమె కళ్ళు బారెడు గాక పోయినా కనీసం చారెడ’ని మాటవరసకి కూడా అనలేదు. ఆ తర్వాత రెండునెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోయినంతగా ఇందిరాగాంధీ సానుభూతి ప్రభంజనాన్ని, అంతర్జాతీయంగా మీడియా నోరెళ్ళబెట్టి చూసిందే. అంతగా ప్రజలు భావోద్వేగాలకి గురయ్యారు కదా? ఆ తర్వాతే మరణించిన నాయకుల భార్యలూ లేదా కుమారులకి, ‘వారసత్వపు టిక్కెట్లు ఇవ్వడం’ అన్న ప్రక్రియ, అన్నిపార్టీలలో చోటు చేసుకుంది. మణెమ్మ అంజయ్య దగ్గర నుండి, సబితా ఇంద్రారెడ్డి, పరిటాల సునీతా రవి గట్రాల వరకూ ఈ కోవకి చెందిన వాళ్ళే.
ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో, కాంగ్రెస్ కు అత్యధిక మెజారిటి రావటం, ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకుపోవటం గురించి ఈనాడు రామోజీరావు ’ఇందిరాగాంధీ చచ్చి సాధించింద’ని తన సంపాదక, ఉప సంపాదకుల మీటింగ్ లో అన్నాడని, నా ఈనాడు ఉపసంపాదక మిత్రురాలు 1992 లో చెప్పిన సమాచారం.[First hand information] దీని గురించి పూర్తి వివరాలు ‘భారతరాజకీయ రంగంపై నకిలీ కణిక సుదీర్ఘ కుట్ర’ గురించిన నా గత టపాలలో వివరించాను.
అటువంటి నేపధ్యంలో సైతం, ఇందిరాగాంధీ హత్యానంతరం, ఈనాడు, ఇందిరాగాంధీని ప్రశంసల వర్షంలో ముంచెత్తక పోయినా కనీసం పొడిపొడి జల్లులు కూడా కురిపించలేదు. అప్పుడు ప్రజలు భావోద్వేగాలకి గురి కాలేదా?
6].ప్రజలు తమ నాయకులు చనిపోతేనే కాదు, తమ కుటుంబసభ్యులు చనిపోయినా రోజులు గడిచే కొద్దీ తేరుకుంటారు, మరిచిపోతారు. ’ఇవాళ పోతే రేపటికి రెండు. పోయిన వాళ్ళతో మనమూ పోతామా? ఏడవకండి! ఏదో రోజు అందరం పోయేవాళ్ళమే’ అంటూ మరణించిన వారి బంధువులని ఓదార్చటం తెలుగునాట పరిపాటి. సాక్షాత్తూ రాజశేఖర్ రెడ్డి కుటుంబసభ్యులూ, బంధుమిత్రులూ, అనుచరులే సర్దుకుని, మిగిలిన పనుల్లో నిమగ్నమయ్యారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ రోజువారీ పనుల దగ్గర నుండి రాజకీయపు పనులలో కూడా నిమగ్నమయ్యాడు. ‘శరీరాలు వేరేగానీ ఆత్మలు ఒకటే’ నన్పించుకున్న ఆప్తమిత్రుడు కె.వి.పి.రామచంద్రరావు, ఢిల్లీలో ఎడతెరపి లేకుండా లాబీయింగ్ చెయ్యగలుగుతున్నాడు. ప్రజలు మాత్రం రోజురోజుకీ దుఃఖాన్ని మరిచిపోవటం గాకుండా, క్రమక్రమంగా భావోద్రేగాలు పెరిగిపోతున్నాయన్న స్థాయిలో, ఈనాడు పత్రిక, పావురాల దిబ్బ[రుద్రకోడూరు]కు ప్రముఖల సందర్శనల దగ్గరి నుండి, అభిమానుల పాదయాత్రలూ, రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసలూ గురించిన కవరేజ్, రోజురోజుకీ పెంచుకుంటూ పోయింది గానీ తగ్గించేప్రయత్నం కూడా చెయ్యలేదు.
7].అయితే – రాజశేఖర్ రెడ్డి మరణం గురించి, ప్రజల భావోద్రేగాల గురించి, అతడి పార్టీయైన కాంగ్రెస్సే పట్టించుకోలేదు. ఈ భావోద్రేగాలు ‘సహజం’ అని కొట్టిపారేసింది. పరిస్థితిని చల్లార్చే ప్రయత్నం చేసింది. దాన్నే ఆంధ్రజ్యోతి మూడునాలుగు రోజుల్నుంచీ ప్రచురిస్తోంది. కాంగ్రెస్ స్పోక్స్ మన్ మనీష్ తివారి ’ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఉన్నారు. మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. పూర్తిప్రభుత్వం పనిచేస్తోంది’ అని 11 Sep, 2009న ప్రకటిస్తే, ఆ విషయాన్ని ఆంధ్రజ్యోతి 12 Sep. న ప్రధాన శీర్షికగా వ్రాసింది. ఈనాడు మాత్రం ‘మరింత సాగతీత’ అన్న శీర్షిక క్రింద ఏకవాక్యంగా రిఫర్ చేసి, రెండోపేజీలో సింగిల్ కాలమ్[‘ముఖ్యమంత్రంటే ముఖ్యమంత్రే’ అన్న ఉపశీర్షిక]తో సరిపెట్టేసింది.
చూడబోతే రాజశేఖర్ రెడ్డి స్వంత కుటుంబ సభ్యుల కంటే, స్వంత పార్టీసభ్యుల కంటే, కాంగ్రెస్ అధిష్టానం కంటే, ప్రజల కంటే కూడా, రాజశేఖర్ రెడ్డి మరణం గురించి రామోజీరావుకే భావోద్వేగాలు ఎక్కువుగా ఉన్నట్లున్నాయి.
8]. అదీగాక ప్రజల జ్ఞాపకశక్తి ఎటూ తాత్కాలికమే గనుక మీడియా నంది అంటే నంది, పంది అంటే పంది అన్నట్లు పరిస్థితులని సృష్టిస్తుందని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘటనాత్మకంగా నిరూపితమైంది. ఈ సత్యం గురించి నేను ఒక్కదాన్నే కాదు, బ్లాగ్లోకంలో, బ్లాగుమిత్రులు అనేకులు, వివిధ దేశాల్లోని సంఘటనల్ని ఉదహరించి మరీవ్రాసారు. ఈ నేపధ్యంలో, ఈనాడు పత్రికా, రామోజీరావు ప్రజల భావోద్వేగాలని ప్రతి బింబించారనుకుంటే అది హాస్యాస్పదమే!
9]. కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర్ రెడ్డి అకాలమరణంతో ఏర్పడిన ఉద్విగ్న పరిస్థితుల్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తోందని, జాతీయ మీడియా కూడా పట్టించుకోవటం మానేసిందని ఈరోజు[15 Sep.2009] ఈనాడు, రెండో పేజీలో ’క్రమంగా తెరమరుగు’ అన్న ఉపశీర్షిక పెట్టి, ఏదైనా విషయాన్ని ఎలా తెరమరుగు చేయవచ్చో వ్రాసింది. ఆంధ్రజ్యోతి ఈ పనిని 12 వతేదీ నుండే చేస్తోంది. ఎప్పుడైనా, ఎక్కడైనా కాలం గడిచేకొద్దీ భావోద్వేగాలు తగ్గుతాయి గానీ పెరగవు. అది సహజం. ఈనాడు వ్రాతల్లో ఈ సహజత్వానికి విపర్యయం ఉండడాన్నే నేను ఎత్తి చూపింది!
10]. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – నిన్నటి నా టపా, మీ వ్యాఖ్య… తర్వాత యాదృచ్చికమో, ప్రయత్నపూర్వకమో గానీ, ఈనాడు, ఈరోజు రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షానికి హఠాత్తుగా తెరిపి ఇచ్చింది. మూడు నాలుగు రోజుల క్రితం మనీష్ తివారీ నోట వచ్చిన ప్రకటన Repetition గాఅభిషేక్ సింఘ్వీ నోట ప్రచురించింది. ప్రజల భావోద్రేకాలు, భావోద్వేగాలు క్రమంగా చల్లబడతాయి గానీ, హఠాత్తుగా చల్లబడవు కదా!
11]. “అంటే మీ టపాకి, నా వ్యాఖ్యకి, ఈనాడు వ్రాతలకీ సంబంధం ఉందంటారా?" అంటారేమో! ఖచ్చితంగా ఉండి ఉండాలి. కావాలంటే మరో తార్కాణం చూడండి.
నిన్నటి వరకూ కూడా, పావురాల దిబ్బ[రుద్రకోడూరు] దగ్గర వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణించిన చోటుని పర్యాటన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డి మొదలు, కర్నూలు జిల్లాకు చెందిన గృహనిర్మాణశాఖామంత్రి శిల్పామోహన్ రెడ్డి దాకా, ప్రకటిస్తునే వచ్చారు.[ఇతడి ప్రకటన నిన్నటి ఈనాడు కర్నూలు జిల్లా ఎడిషన్ లో కూడా వచ్చింది] అయితే ఈరోజు చాలా జాగ్రత్తగా ’19న వై.యస్.స్మారక నిర్మాణాలపై సమావేశం’ పేరిట ‘పర్యాటక కేంద్రం’ స్థానే ’స్మారక కట్టడాలు’ అన్న పదాన్ని చేర్చి, ఈనాడు, పకడ్బందీగా వార్త వ్రాసింది.
12]. ఇక మీరన్న మరోమాట – >>> ఈనాడు పత్రిక ఎలక్ట్రానిక్ మీడియాతో పోటీని ఎదుర్కోలేక… ఇలా వ్రాస్తోంది.
నిజానికి ఈనాడు రామోజీరావుకూ ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు, వార్తా ఛానెళ్ళు, ఒక్కతెలుగులోనే కాదు పలుభాషల్లోనూ ఉన్నాయి కదా! ఇక అతడూ, అతడి పత్రిక పోటీపడలేనిదేముంది? అందునా విలువలకు ప్రాణం ఇస్తాడాయే రామోజీరావు? వ్యాపారంలో పోటీపడలేక విలువలు వదిలేసుకున్నాడంటారా?
మీరు రామోజీరావుని వెనకేసుకు రాకుండా, సత్యాసత్యాలని విశ్లేషిస్తూ, విషయ సమీక్ష చేసి ఉంటే బాగుండేదని మా అభిప్రాయం. ఎందుకంటే వ్యక్తుల కంటే సత్యం గొప్పదీ, బలమైనదీ గనుక!
ఏదేమైనా… నాబ్లాగులో వ్యాఖ్య వ్రాసి, మరింత అర్ధవంతమైన, వివరణాత్మకమైన చర్చకు దోహదపడినందుకు మీకు నెనర్లు. మిమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించగలరు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
3 comments:
amma,
I remember that during PJRs death (who was a true mass-leader) every telugu daily published editorials with messages on his popularity / his works for poor.
I specifically searched thru the archives of eenadu and it is surprising to note that it covered editorial news on NATIONAL / INTER-NATIONAL / GLOBAL WARMING etc topics, but NONE on PJR. Whereas every other telugu paper (which ever had an internet edition)wrote artcles on him under "EDITORIAL" column space!!!
నమస్కారం అమ్మ ఒడి గారూ,
నేనిప్పుడే వేరే ఊరి నుంచి హైదరాబాదుకు వచ్చాను. గడచిన మూడు రోజులుగా బ్లాగులే చూడటం లేదు. ఇక నేను కామెంటు ఎలా రాస్తాను? ఒక్కసారి సరిచూడండి, నేను మీ బ్లాగులో ఎప్పుడూ కామెంటు రాయలేదు. నాకు రాజకీయాల మీద పెద్ద అవగాహన లేదు కూడా. మీ బ్లాగులో నా కామెంటు నాకు కనిపించలేదు ఇప్పుడు చూస్తే. దయచేసి ఈ టపాలో నా ప్రస్తావన తొలగించమని అభ్యర్థిస్తున్నాను. ప్లీజమ్మా.
అరుణపప్పు గారు,
నన్ను మన్నించండి. నేను 14Sep.,2009 న వ్రాసిన టపా ’ఈనాడు, వై.యస్.రాజశేఖర రెడ్డిపై కురిపిస్తున్న ప్రశంసల వర్షం – ఇదేదో తేడాగా ఉన్నట్లుందే’లో ఇండియా ఇన్ ఫో పేరిట ఓ వ్యాఖ్య వచ్చింది. అదే వ్యాఖ్య తూచా తప్పుకుండా, అంతకు కొద్ది సమయం ముందు, రెండుసార్లు అజ్ఞాతల పేరుతో రాగా నేను ప్రచురించలేదు. తర్వాత ‘ఇండియా ఇన్ ఫో’ పేరిట, తిరిగి అదే వ్యాఖ్య వచ్చేసరికి ప్రచురించాను. దాని మీద క్లిక్ చేస్తే తెరుచుకున్న పేజీలో ‘అరుణమ్’ అన్న బ్లాగు మైబ్లాగ్ అని ఉంది. ఇప్పుడు చూస్తే అది బ్లాగ్స్ ఐ ఫాలో క్రింద ఉంది. నేనే పొరపాటు పడ్డానో, లేక ప్రోఫైల్ లో వ్యక్తిగత వివరాలు లేని ఇండియా ఇన్ ఫో బ్లాగులోనే తేడా వచ్చిందో గానీ, దాని వల్ల, నేను వ్యాఖ్య వ్రాసింది మీరే అనుకొని నా స్పందన వ్రాసాను. అందువల్ల మీకు బాధ కలిగినందుకు, నన్నుమనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను. నా దృష్టికి విషయం తెచ్చినందుకు, పొరపాటును సవరించుకునేందుకు వీలు కల్పించినందుకు కృతజ్ఞతలు. మీరు కోరినట్లుగా నా టపాలో మీ పేరు, ప్రస్తావన తొలగించాను. గమనించగలరు.
Post a Comment