ముందుగా ఓ చిన్న కథ వ్రాసి, కథా విశ్లేషణ, మన జీవితాల్లో దాని అనువర్తనల వివరణతో నా బ్లాగ్ చుట్టాలని అలరించాలని ఇది వ్రాస్తున్నానండి.
అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే ఊరు.
ఆ ఊళ్ళోని ఓ కట్టెలు కొట్టుకునే వాడు దాపులనే ఉన్న అడవికి కట్టెల కోసం వెళ్ళాడు. కష్టపడి ఓ పెద్దమోపు కట్టెలు కొట్టాడు. ఎత్తి నెత్తిన పెట్టుకొనేందుకు సాయం అవసరమై చుట్టూ చూశాడు.
దారిన పోతున్న ఓ బాటసారి కనబడ్డాడు.
"అయ్యా! కాస్త ఈ మోపు ఎత్తి నానెత్తిన పెట్టుకొనేందుకు సాయం పడతారా?" అర్ధించాడు కట్టెలు వాడు.
"అలాగే! దానికేం భాగ్యం! కానీ సాయం చేస్తే నాకేమిస్తావు?" కళ్ళెగరేస్తూ అడిగాడు బాటసారి.
"ఏమి లేదు బాబయ్య!” యధాలాపంగా జవాబిచ్చాడు కట్టెల వాడు.
"మాట తప్పకూడదు సుమా!” అంటూ కట్టెల మోపు ఎత్తుకోడానికి సాయపడ్డాడు బాటసారి.
మోపు నెత్తికెత్తుకొని ఇంటిదారిపట్టాడు కట్టెల వాడు.
"ఏమయ్యోయ్! నాకిస్తానన్నది ఇవ్వకుండా పోతున్నావు. ఇదేం న్యాయం?" అంటూ వెంటపడ్డాడు బాటసారి.
"నేనేమిస్తానన్నాను బాబయ్య! ఏమీ లేదనే చెప్పానే?" అయోమయంగా అడిగాడు కట్టెల వాడు.
"ఆ. అదే! అ ’ఏమిలేదు’ అన్నదాన్నే నా మొహాన పారేస్తే నా దారిన నేపోతా” విసుగ్గా అన్నాడు బాటసారి.
"ఏమీ లేని దాన్ని ఎక్కడి నుండి తెచ్చివ్వను బాబయ్య!” ఘోల్లుమన్నాడు కట్టెల వాడు.
"అదంతా నాకు తెలియదు. ’ఏమీ లేదు’ అన్నదాన్ని ఇస్తానన్నావు. మాట తప్పకూడదని ముందే హెచ్చరించాను కూడా. ఏమైనా సరే! నువ్వు నాకు ’ఏమీ లేదు’ అన్న దాన్ని బాకీ పడ్డావు. నా ’ఏమీ లేదు’ నాకిచ్చేస్తే సరి, లేకపోతే మర్యాద దక్కదు” పెడసరంగా హెచ్చరించాడు బాటసారి.
కట్టెల వాడు లబోదిబో మన్నాడు. బాటసారి అతడి వెంటపడి వేధించసాగాడు.
అలా గొడవపడు తూనే ఇద్దరు ఊళ్ళోకి వచ్చారు.
వారికి నసీరుద్దీన్ తారస పడ్డాడు.
"ఏమిటి గొడవ?" అడిగాడాయన.
విషయమంతా చెప్పుకొని బావురుమన్నాడు కట్టెల వాడు.
గట్టిగా తన వాదన వినిపించాడు బాటసారి.
చిరునవ్వు నవ్వాడు నసీరుద్దీన్.
"కట్టెల మోపు నెత్తికెత్తుకోవడానికి సాయం పడితే ఏమిస్తానన్నాడు ఇతడూ?" నిర్ధారణ కోసం అన్నట్లుగా బాటసారిని అడిగాడు.
గొంతు సవరించుకొని “ఏమిస్తావని నేను అడిగినప్పుడు ఈ మనిషి, ’ఏమీ లేదు’ అన్నాడు. ఆ ’ఏమీ లేదు’ అన్నదే ఇచ్చేయమనండి. నాదారిన నేను పోతాను” మరింత రచ్చచేస్తూ అన్నాడు బాటసారి.
"తప్పకుండా నీ దారిన నువ్వు పోదూగాని! ఇంతకీ ఇప్పటికి ఏమిచ్చాడు ఈ కట్టెల వాడు నీకు?" ఆరాగా అడిగాడు నసీరుద్దీన్.
"ఏమీ లేదూ. అందుకేగా ఈ గొడవంతా” చిరాగ్గా చెప్పాడు బాటసారి.
"మరింకెందుకు గొడవ? నీ ’ఏమీ లేదు’ అన్నదాన్ని నీకిచ్చేశాడుగా!” అన్నాడు నసీరుద్దీన్.
అప్పటికే చుట్టుమూగిన జనం ఘోల్లున నవ్వుతూ చప్పట్లు చరిచారు.
సిగ్గుతో తలదించుకొన్నాడు బాటసారి.
"రక్షించారు బాబయ్య!” అంటూ కట్టెలు వాడు నసీరుద్దీన్ కి దండం పెట్టెశాడు.
ఇదీ కథ!
ఈ కథలో ఏమీ లేని దానికి ఎంతో రగడ జరిగింది. అంతే కాదు, ఈ కథలో ఏమీ లేని రచ్చలోనుండి, అసలు నిజాన్ని వెదికి తీసిన నసీరుద్దీన్ ఉన్నాడు, ఆ నిజాన్ని గుర్తించి బాటసారిని సిగ్గుపడేలా చేసిన జనం ఉన్నారు.
అదే మన పార్లమెంట్ లో అయితే?
సెప్టెంబరు 26, 2008 లో ముంబై ముట్టడి సమయంలో, ముగ్గురు పోలీస్ అధికారులు హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్ లు ఒకే వాహనంలో ఎందుకు వెళ్ళారు, ఏ వైర్ లెస్ మేసేజ్ లు లేదా ఎవరి ఆదేశం వారినలా ఒకే వాహనంలో ప్రయాణించేలా చేసిందీ, వాళ్ళు ముగ్గురు అంతపెద్ద ముంబై మహా నగరంలో నేరుగా కేవలం ఇద్దరు టెర్రరిస్టులు ఎక్కడైతే మాటు వేసారో అక్కడికే నేరుగా వెళ్ళి ఎలా మృత్యువు నోట చిక్కారు?
ఈ ప్రశ్నలు తొలిగా వేసానంటున్నాడు ఏ.ఆర్.అంతూలే. ఆ తర్వాత పార్లమెంట్ లో రచ్చ స్వరూపం ఎలా ఉంది?
పార్లమెంట్ లో అధికార యు.పి.ఏ., ప్రతిపక్ష ఎన్.డిఏ. లేదా బి.జె.పి.లు హేమంత్ కర్కరేకి మలెగావ్ కు ముడిపెట్టారు.
కానీ ఆ వాహనంలో కర్కరే ఒక్కరే లేరు, ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా, నేరగాళ్ళ పాలిట కఠినుడిగా పేర్కొన్న విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టే లాంటి ఇతర అధికారులూ ఉన్నారు. మరి వీళ్ళకి ఏ మాలెగావ్ తోనూ సంబంధం లేదే?.
అసలు వీరంతా నేరుగా కసబ్, మరో ఉగ్రవాది [కేవలం ఇద్దరు] ఓ మహానగరంలో ఒక స్ధానంలో ఉంటే అక్కడికే నేరుగా పంపబడి ఎలా చంపబడ్డారు?
ఇది కదా అసలు ప్రశ్న?
ఇది కదా అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ పరిశీలించాల్సింది?
దాన్ని వదిలేసి – ఇందులో దాగున్న నిజాన్ని చంపడానికి, కుట్రని కాపాడ్డానికి ’అంతులే’ని హైసరబజ్జా లేదా రచ్చా లేదా హైజాక్ చేసి, విజయవంతంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్ని పూర్తి చేసుకున్నారు.
ఆ పైన ’నా కాళ్ళు పట్టుకొని రాజీనామా చెయ్యమని అడగండి లేదా నన్ను తొలిగించమని ప్రధాన మంత్రి కాళ్ళు పట్టుకొని అడగండి’ అంటూ శ్రీమాన్ కేంద్రమంత్రి అహ్మాద్ రజాక్ అంతూలే మరో రచ్చకి నాందీ ప్రస్తావన పలికాడు. [బాబోయ్! అది నోరా, డ్రైయినేజ్ గొయ్యా! అసలు కాళ్ళూ ఏమిటో, పట్టుకోవడాలేమిటో నాకు ఛస్తే అర్ధం కాలేదు. మీకేమైనా అర్ధమయ్యిందా?]
మొత్తానికి ఈ రచ్చలో జయప్రదంగా హైజాక్ చెయ్యబడ్డ అసలు విషయాలు……
1]. పైన చెప్పినట్లుగా హేమంత్ కర్కరే ఒక్కరే ఆ వాహనంలో లేరు. మరో ఐ.పి.యస్. ఆఫీసర్ అశోక్ కామ్టే, సి.ఐ. విజయ సలాస్కర్ [ఈయన గుట్కా–మాఫియా సంబంధాలను వెలుగులోకి తీసుకురావడంతో గత రెండేళ్లలో ఆయనను అప్రాధాన్య పోస్టుల్లో నియమించారు. ఇటీవలే క్రైమ్ బ్రాంచికి తిరిగొచ్చారు. ముఖ్యంగా మాజీ డాన్, తరువాత రాజకీయాలలో చేరి ఎం.ఎల్.ఏ. అయిన అరుణ్ గావ్లికి సలాస్కర్ అంటే గుండెదడ.] కూడా ఉన్నారు. ముట్టడి జరుగుతున్న తాజ్ హోటల్ దగ్గర వీరు విధులు నిర్వహించడం టీ.వి.లో ప్రత్యక్షప్రసారం అయ్యింది. అంతలోనే ముగ్గురు ఒకే వాహనంలో నేరుగా కసబ్+ మరో తీవ్రవాది మాటువేసిన చోటికి పంపబడి మరీ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే వాహనంలో ఉన్న మిగిలిన పోలీసుల్ని కూడా కసబ్, మరో తీవ్రవాది తుపాకీతో కాల్చి చంపారు. చనిపోయాడని వదిలేసిన అరుణ్ జాదవ్, తర్వాత స్పృహలోకి వచ్చి ఈ పాటి వివరాలు చెప్పాడు. కసబ్ తుపాకికి శరీరాన్ని అప్పగించి, తూటాలకు శరీరం జల్లెడలా తూట్లు పడినా విడిచిపెట్టకుండా అనిల్ ఓంబ్లే కసబ్ ని పట్టిచ్చాడు. ఇవన్నీ మనం పత్రికల్లో చదివాం.
2]. నారిమన్ పాయింట్ దగ్గరి టెర్రరిస్టులు శవాలపైన కూడా మళ్ళీ మళ్ళీ తుపాకితో గుళ్ళు కురిపించారని వార్తలు వచ్చాయి. చనిపోయారనుకొని వదిలేసిన పోలీసుల్లో ఒకరు [అరుణ్ జాదవ్] చనిపోలేదని, కేవలం స్పృహ తప్పాడనీ, దాంతో కొన్ని నిజాలు బయటికొచ్చాయని తెలిసింది కాబోలు. అందుకేనేమో, మొత్తం ఆపరేషన్ సెల్లుఫోనుల్తో[నెట్ వర్క్ టచ్] అనుసంధానించి మరీ నిర్వహించారు టెర్రరిస్టులు. అందుకేనేమో పరుగులు పెడుతూ విలేఖర్లు [బర్హాదత్ లూ మొదలయిన విలేఖర్లు] తాజ్ నుండో ట్రిడెంట్ నుండో బయటకొచ్చిన అతిధిల్ని ‘టెర్రరిస్టులు మిమ్మల్ని గిల్లారా, కొరికారా, ఎలా చంపారో’ అంటూ ఉరుకులు పెట్టి మరీ వివరాలు కనుక్కున్నారు. [బహుశ ఈ విలేఖరులకి నెట్ వర్క్ గురించి తెలీక పోవచ్చు. యాజమాన్యం ఇచ్చే రివార్డులు, ర్యాంకింగ్ లు, కానుకలూ ఆశించి ఉరుకులు పెట్టి వార్తలు సేకరించి ఉండవచ్చు. ఆ వార్తలే టెర్రరిస్టులకి ఉపకరించి ఉండొచ్చు.]
ఈ సజీవ నెట్ వర్కుకి మరో ఉదాహరణ - హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్ లతో సహా పోలీసుల్ని చంపాక కసబ్, అతడి సహతీవ్రవాది పారిపోవడానికి ఉపయోగించిన వాహనం ఆగిపోవడంతో దారినపోతున్న స్కోడా కారు ఆపి యజమానిని బెదిరించి అందులో పారిపోయారు. స్కోడా కారు యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు, తరువాత చెక్ పోస్ట్ దగ్గర తీవ్రవాదుల్ని ఆపారు. ఆ ప్రయత్నం లోనే ప్రాణాలు పోగోట్టుకున్నాడు అనిల్ ఓంబ్లే. అయినా గానీ కసబ్ ని మాత్రం ప్రాణాలతో మనకి పట్టిచ్చాడు. ఈ సమాచారమంతా చేరవేయబడిందేమో – ఆ తదుపరి టెర్రరిస్టులు దాహం అడిగి తాగేందుకు నీరిచ్చిన వ్యక్తిని కూడా [దాహం తీర్చుకున్న తర్వాత] చంపేశారు. అదీ ’నెట్ వర్కు’ పనిచేసిన తీరు.
అందుకేనేమో ఇదంతా బయటకి రాకుండా పార్లమెంట్ లో అంతూలే ఓ రచ్చ లేపాడు. అది ‘ఏమీ లేదు’ అని బాధ్యత గల కొత్త గృహ మంత్రి తేల్చిచెప్పాడు.
౩]. ఈ మొత్తం గొడవలో ‘అసలు అన్ని ఆయుధాలని తాజ్ లోకి టెర్రరిస్టులు ఎలా చేర్చగలిగారు?’ అన్న మామూలు ప్రశ్న అసలు పత్తాలేకుండా పోయింది. టెర్రరిస్టుల లక్ష్యం ప్రజల ప్రాణాలే. కాబట్టి తుపాకులు మాత్రం వాడి, బాంబులేయకుండా తాజ్ హోటల్ ఆస్ధుల్ని కాపాడారు. అదే లుంబినీ పార్కు, గోకుల్ ఛాట్, బెంగుళూరో, ఢిల్లీ కరోల్ బాగో, అహ్మదాబాదో అయితే బాంబులే వేసారు. అక్కడ ఆస్తుల్ని కాపాడాల్సిన అవసరం ఈ టెర్రరిజాన్నంతా వ్యవస్ధీకృతంగా నడుపుతున్న వ్యవస్థకి లేదు కదా! [“అయ్యో! టెర్రరిస్టులు బాంబు లేసి ఎందుకు తాజ్ హోటల్ ని నాశనం చేయలేదూ” అని నేను బాధపడటం లేదని మనవి. ఎన్నో ఏళ్ళ చరిత్ర,, భారతీయులతో అనుబంధమూ, ముంబై నగరానికి ఒక అలంకారమూ అయిన తాజ్ హోటల్ నిర్మాణం చెక్కుచెదరక పోవడాన్ని నేనూ ఎంతో ఆనందిస్తున్నాను. అంతేగాని రతన్ టాటా ఆస్తికి ఎందుకు నష్టం కలగ లేదా అని ఏడవటం లేదు. కాకపోతే ఈ పార్శీ వ్వాపార కుటుంబీకుల పట్ల కుట్రదారులకున్న కన్ సర్న్ గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.]
తాజ్ లోనే ఏకంగా టెర్రరిస్టులు కంట్రోలు రూములు ఏర్పరుచుకొనేంతగా, టెర్రరిస్టులకి తాజ్ లోపల రూములూ, కారిడార్లో ఎలా ఉంటాయో చూపించిన వీడియోలు ఎలా లభ్యమయ్యాయో, తాజ్ యాజమాన్యమో, ఇతర ఉద్యోగులో – ఎవరు సహకరించారో ఎవరికీ తెలీదు. మనకీ తెలీదు. ప్రభుత్వానికి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షానికీ అవసరం లేదు. మీడియాకీ అంతకంటే అవసరం లేదు. అదే భారతదేశంలోని ఓ సామాన్య డాక్టర్ రాజేష్ తల్వార్ కూతురు ఆరుషి హత్య కేసు [ఢీల్లీ] లో అయితే మీడియా అత్యుత్యాహంగా ’లేని నేరాన్ని’ బయటపెట్టింది.
ఇది చూపడం లేదూ వ్యవస్ధాగతమైన మీడియా కుట్రని?
పార్లమెంట్ సాక్షిగా ’అంతూలే’ని గొడవ చూపడం లేదూ వ్యవస్థాగతమైన రాజకీయ కుట్రని?
అందుకే విజయవంతంగా ’ఏమీ లేని’ అంతూలే ’అంతులేని’ రచ్చతో మొత్తం సంఘటనల్నీ, అందులోని వాస్తవాల్నీ హైజాక్ చేసారు.
దీన్నంతా శతకోటి భారతీయులు చూస్తూనే ఉన్నారు. పరిశీలిస్తూనే ఉన్నారు.
సామాన్య ప్రజల్లోంచి ఎంతమంది నసీరుద్దీన్ లు ఇలాంటి హైసర బజ్జాల్లోంచి, రచ్చల్లోంచి అసలు నిజాల్ని వెలికి తీసినా, చప్పట్లు చరిచీ, గేలిచేసి సిగ్గిల్ల చేసినా ఈ రాజకీయ నటీ నటులకీ, మీడియా దర్శకులకీ లజ్జారాహిత్యం వదలటం లేదు కదా! [మరి వాళ్ళు బాటసారులు కాదు కదా సిగ్గుపడటానికి?]
వ్యూహత్మకంగా వాళ్ళు అభినయిస్తున్న మూగ, చెవిటి, గుడ్డి తనాలకు మూలమైన సిగ్గులేని తనం ఎలా వదులుతుందంటారు?
మరో టపాలో మరికొన్ని విశేషాలు.
అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినోభవంతు!
**************
7 comments:
ఓలమ్మో!!!!
ఇంత ఇసయముడాదా అన్నా? బలేగా జెప్పినావుపో. నిజం, నిజాన్ని దాచనీకి ఎంత కుట్ర జేసినారు. ఆల్లు కాదు ఈల్లే మనోల్లే పెద్ద సనిగాల్లైనారు గదే మనకు.
ఇంగో మాట అన్నో. జర ఆలోచించుండ్రి గీ టపా జదివినోల్లంతా. ఆల్ల గాదు నూకేది, ఇంత రచ్చ జేసిన ఈల్లను జల్ది జంపి మనల్ని మనం రచ్చించుకుందామె.
థాంక్స్ అన్నా మంచి సుద్ది జెప్పినావ్
బాగుందండీ మీ కోణం... కానీ "పార్శీ వ్యాపార కుటుంబీకుల పట్ల కుట్రదారులకున్న concern"మాటతో నేను ఏకీభవించను. తీవ్రవాదులకు అలాంటి concern తాజ్ మీదా,గోకుల్ చాట్ మీదా ఉండనే ఉండవు. తప్పుగా interpret చేసారు.
P.S: Is it a must to have an account to comment on this TapA? I dont have one, but I am a regular reader of telugu blogs and comments occassionally as 'yuva'... If you can't keep my comment with Anonymous name, ignore it.
బాగుందండీ మీ కోణం... కానీ, ఇంకా "పార్శీ వ్యాపార కుటుంబీకుల పట్ల కుట్రదారులకున్న concern"మాటతో నేను ఏకీభవించను. తీవ్రవాదులకు అలాంటి concern తాజ్ మీదా,గోకుల్ చాట్ మీదా ఉండనే ఉండవు.
తప్పుగా interpret చేసారు.
Hmmm...
Happy new year Madam.
బాగుంది
simply superb article
Lakshmi Gaaru: Excellent Analysis. Keep up the good work. Indians are the most foolish people. they only need roti, purani kapada and cinema (entertainment).
Post a Comment