అంతా మన మంచికేఅన్నది పెద్దలు మనకి కట్టిచ్చిన చద్దిమూట.


ఏదైనా జరగనీయండి, ’మంచిలా కన్పిస్తూ కాలక్రమాన చెడుగా పరిణమించినా, ’చెడులా కన్పిస్తూ కాలగతిలో మంచిని కలిగించినా, ఏది జరిగినా అది మన మంచికే అనుకోవడం సానుకూల దృక్పధం.


ఇది చాలాసార్లు మనకే అనుభవంలోకి వచ్చే నిజం.


ఇలా ఆలోచిస్తే, పాజిటివ్ ఆలోచనా సరళి లేదా ఆశావహ దృక్పధం మనల్ని చాలా స్వాంతన పరుస్తుంది. మన వత్తిళ్ళని దూరం చేస్తుంది. ప్రశాంతతని అవ్యాజంగా అందిస్తుంది.


అందుకే ఎంతో సరళంగా రామకృష్ణా మిషన్ వారు చెప్పే గీతా సారం నాకు చాలా ఇష్టం. మీకూ నచ్చుతుందని వ్రాస్తున్నాను.


ఏమి జరిగిందో అది బాగానే జరిగింది.

ఏమి జరుగుతుందో అది బాగానే జరుగుతోంది.

ఏమి జరగబోతోందో అది కూడా బాగానే జరగబోతోంది.

ఏది నీదని, ఏది పోయిందనీ దుఃఖిస్తున్నావు?

నీవు ఏమి తెచ్చావని, అది పోయిందనడానికి?

నీవు ఏది పొందావో అది ఇక్కడే పొందావు.

ఈరోజు ఏది నీదో, అది నిన్న ఎవరిదో మరెవరిదో.

రేపు ఇంకెవరిదో.

పరివర్తన సంసారం యొక్క సహజ లక్షణం.


***********************************************


సంసారం అంటే ఈ జగత్తు. పైన చెప్పిన గీతాసారం ఎంతో నిజం.


చివరికి ఈ రోజు నాది అనుకొనే మన శరీరం కూడా రేపు మన మరణానంతరం సేంద్రియ పదార్ధంగా మారిపోతుంది. పుడుతూ తెచ్చుకొనే శరీరమే మనది కానప్పడు, పుట్టాక వచ్చే ఆస్తులు మాత్రం శాశ్వతంగా మనవి అవుతాయా?


అందుకే అనుభవాలే ఆస్తులంటారు కాబోలు పెద్దలు. గీత చెబుతుంది జీవుడు ఇంద్రియ వాసనలు మోసుకొస్తాడని.


అందుకే అందరం మంచి చేయాలని, అందరికీ మంచి జరగాలనీ కోరుకుందాం.


సంతోషాలే తెచ్చిందో, కష్టాలే తెచ్చిందో 2008 వెళ్ళిపోయింది.


సుఖలే తెస్తుందో, కష్టాలే తెస్తుందో 2009 వచ్చేసింది.


రెండింటిలోనూ మన ప్రమేయమూ లేదు, నిమిత్తమూ లేదు.


కాని మంచిని ఆశించే మన ఉత్సాహానికి మాత్రం కొరతే లేదు.


సంతోషాలు మనస్సుకి, శరీరాన్ని ఆహ్లాదపరుస్తాయి. కష్టాలు బుద్దికి, మనస్సుకి అనుభవాలు తెచ్చిపెడతాయి.


పూలరేకుల మీది తుషార బిందువుల్నీ

వాటిపై మెరిసే నీరెండ కిరణాల్నీ

తెల్లారింది లెగండోచ్చ్ అంటూ కువకువలాడే పిట్టల్నీ

సేదతీరుస్తూ అమ్మ ప్రేమలా మనల్ని చుట్టేసే పిల్లగాలుల్నీ

అలిసిన మనసుల్ని అలరించే పసిపాపల నవ్వుల్నీ

ఆకలేసినప్పడు తిన్న అన్నపు రుచినీ

ఆదమరిచినప్పడు పెట్టే నిదుర గురకనీ

తలచుకొంటూ, జీవితంలో ప్రతీ క్షణాన్నీ ఆస్వాదిస్తూ

జరిగే మంచికి ఆనందిస్తూ

చెడు జరిగినప్పడు మరింతగా ఎదుర్కొనే ఆత్మబలాన్ని పెంచుకొంటూ,

మరోసారి చెడు జరక్కుండా ఎలా నివారించాలా అని అలోచిస్తూ,

అందరికీ ఆనందం పంచాలని ఆశిస్తూ

క్రొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం


అందరికీ,


ఇంగ్లీషు వాడి నూతన సంవత్సరానికి


తెలుగు వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.


తదుపరి టపాలలో మరికొన్ని విషయాలు.


అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.


సర్వేజనా సుఖినోభవంతు!

**************

7 comments:

అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి అని ఎళ్ళవేళలా కోరుకునే మీకు నా హృదయపూర్వక హార్థిక నూతన సంవత్సర తెలుగు శుభాకాంక్షలు.

naakaite deenini nootana samvatsaram gaa jarupukune alavaatu ledu. kaakumte padimamdiki samtoshaannichchedi manamu gouravimchaali ane drukpatham to pamdugagaa chesukunevaari kosam subhaakaamkshalu teluputaanu.meeku koodaa english nootanasamvatsara samdarbham gaa teluguvaadi subhaakaamkshalu.

“ఏమి జరిగిందో అది బాగానే జరిగింది.

ఏమి జరుగుతుందో అది బాగానే జరుగుతోంది.

ఏమి జరగబోతోందో అది కూడా బాగానే జరగబోతోంది.

ఏది నీదని, ఏది పోయిందనీ దుఃఖిస్తున్నావు?

......
బాగానే చెప్పారు. మరి మీరు 16 YEARS ఈ విషయాని ఎలా విస్మరించారు??

మీకు కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు

కృష్ణారావు జల్లిపల్లి గారూ,
మీ వ్యాఖ్యలోని భావం నాకు సరిగ్గా అర్ధం కాలేదు. అయినా నా వివరణ ఇది - భగవద్గీత మనల్ని మన కర్తవ్యాన్ని విస్మరించమని చెప్పదండీ! పోరాడమని చెబుతుంది. నాలాంటే సామాన్యులకే కాదు, తిలక్, బాపూ లాంటి మహాత్ములకి కూడా పోరాట కర్తవ్యాన్ని బోధించింది భగవద్గీతే. అంటే నేను వారంత గొప్పదాన్నని అనటం లేదు. అసామాన్యుల దగ్గరి నుండి మనలాంటి సామాన్యుల దాకా, అందరికీ గీత మార్గదర్శనం చేస్తుందని అంటున్నాను. భగవద్గీత - అర్జునుడు తన బంధుమిత్రులని పోగోట్టుకుంటానేమోనని భయపడి, ఏడుస్తూ [అర్జున విషాద యోగం] యుద్దం చేయనని చతికిల బడినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధోన్ముఖుడిని చేస్తూ, ఆయనలో పోరాట స్ఫూర్తిని, పౌరుషాన్ని రగులుస్తూ చేసిన కర్తవ్యబోధ.
అందుచేత మీరు ఓసారి భగవద్గీత చదివితే మీకు ఇదింకా బాగా అర్ధం అవ్వచ్చని నేను అనుకొంటున్నాను.
ఏదేమైనా, మీ వ్యాఖ్య, నాకు భగవద్గీత - మన జీవితాల్లో గీతాసారపు అనువర్తన గురించి కొన్ని టపాలు వ్రాయాలన్న స్ఫూర్తినిచ్చింది. కృతఙ్ఞతలు.

మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.....

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu