మళ్ళీమనం బుద్ధభగవానుడి దగ్గరికి తిరిగివద్దాం. సిద్ధార్ధుడు ఙ్ఞాన సిద్ధి పొందాక ’బుద్ధుడు’ అని పిలవబడ్డాడు.
బుద్ధుడు ప్రజలకి “దుఃఖాలకి మూలం కోరికలు. వాటిని తొలగ దోయండి” అని బోధించాడు. ఆయన బోధనలను త్రిపీఠికాలంటారు. దేశంలో నలుమూలలు తిరిగి ప్రజలకి తాను శోధించి తెలుసుకొన్నా ఙ్ఞానాన్ని బోధించాడాయన. ఎందరో ఆయన శిష్యులైనారు. రాజులు, సామాన్యులూ, ధనికులూ, పేదలూ, ఆయన తల్లితండ్రులూ, భార్య [ ఇందులో యశోధర ఉదంతం ఎంతో ఆత్మగౌరవ పూరితంగా ఉంటుంది ] కూడా ఆయన శిష్యులై పరివ్రాజక జీవితాన్ని ఆశ్రయించారు.
బుద్ధుని చరిత్ర గురించి, బౌద్దం గురించి ఎన్నో రమ్యమైన, సమగ్రమైన గ్రంధాలున్నాయి. [కరుణశ్రీ గారి రచనలైతే మరింత మధురంగా ఉంటాయి] 2600 సంవత్సరాలుగా, ప్రపంచవ్యాప్తంగా, సత్యాన్ని, శాంతినీ, ప్రేమించే, ప్రజలని అవి ఆకర్షిస్తూనే ఉన్నాయి.
ఎందరో రాజులు, ధర్మాశోకుని వంటి వారు బౌద్దమతానికి ఆకర్షితులై తమ జీవితాలని సత్యానికి అంకితం చేసి, బౌద్దమతాన్ని చైనా, టిబెట్, ఇండోనేషియా వంటి దేశాలకు వ్యాప్తి చేసారు.
ఇక్కడ మనమో విషయం గమనించాలి. శ్రీరాముడు తండ్రి ఇచ్చిన మాటను నిజం చేయటం కోసం తన రాజ్యాన్ని, స్వసుఖాన్ని విడిచిపెట్టి అడవికి పోయాడు. సిద్దార్ధుడు ప్రజల దుఃఖాలకు కారణాన్ని అన్వేషించటానికి తన రాజ్యాన్ని స్వసుఖాన్ని విడిచిపెట్టి అడవికి పోయాడు. కాబట్టే భారతీయులు శ్రీరాముణ్ణి, బుద్ధుణ్ణి భగవంతుడిగా తలచికొలుస్తారు.
అదీ ఐడియలిస్టిక్ రక్తం
అదీ భారతీయుల రక్తం.
భారతీయులు భావ ప్రేమికులు.
భారతీయులు సత్యాన్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు.
భారతీయులు త్యాగాన్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు.
భారతీయులు నిజాయితీని నమ్ముతారు.
కాబట్టే, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ తన స్వసుఖాన్ని విడిచిపెట్టి, కొల్లాయి కట్టి, వేరుశనగపప్పు, మేక పాలతో కడుపునింపుకొని, బుషిలా జీవిస్తున్నప్పుడు యావద్భారత జాతి ఆయన్ని అనుసరించి, మోహన గాంధీని మహాత్ముడని గౌరవించారు.
[ఐడియలిజం అంటే భావవాదం. ఇక్కడ నేను తాత్త్విక అంటే ఫిలాసఫీలోని నిర్వచనాల జోలికి పోవటం లేదు. సామాన్య అర్ధాన్ని మాత్రమే ఉటంకిస్తున్నాను.]
[భాష కన్నా అందులోని అంతరార్ధం, సంపద కన్నా అనుభూతి, సుఖం కన్నా సంతోషం ....... వాటిని ప్రేమిస్తారు భావవాదులు. ఇది చెప్పడానికే చరిత్రలోకి కొంత వెనక్కి వెళ్ళాల్సి వస్తోంది. క్రమపరిణామాల్ని అర్థం చేసుకోవాలన్నా ఇది తప్పనిసరి. తన కథ చెబుతానంటూ ఇదంతా చెబుతోందేంటబ్బా అనుకోవద్దని మనవి.]
ఒకవేళ జీసస్ క్రీస్తు గనుక భారత్ లో పుట్టి ఉంటే భారతీయులాయనకి పల్లెపల్లెలో వాడవాడలో గుడులు కట్టి ఉండేవాళ్ళు. [పాశ్చాత్యులు చర్చిలు కట్టలేదని నా ఉద్దేశం కాదు.] ఏదేమైనా, భారతీయులు ఆయన్ని చెక్క శిలువ మీద వేసి చంపి ఉండేవాళ్ళు కాదు. భారతీయులు అలాంటి కౄరత్వాన్ని నేరస్తుల పట్ల సైతం ఊహించను కూడా లేరు. భారతదేశ చరిత్రలో ఏ రాజు గానీ, ఏ సామాన్యుడు గానీ, ఏ నేరస్తుడు గానీ ఇంతటి కౄర శిక్షని పొందలేదు. ఇలాంటి భారతదేశంలోనే గనుక జీసస్ క్రీస్తే పుట్టి ఉంటే, లేదా భారతీయులే గనుక క్రీస్తు కాలంలోని రోమనులో, యూదులో, ఈజిప్షియనులో అయిఉంటే చరిత్ర మరోలా ఉండి ఉండేది.
భారతదేశంలో పుట్టిన మనం – ఆనాటి రోమనుల, యూదుల, ఈజిప్షియనుల కౄరత్వాన్ని అర్ధం చేసుకోవటం కూడా కొంచెం కష్టమే. నిజంగా క్రీస్తు అంతటి కరుణామూర్తిని వాళ్ళేలా హింసించగలిగారో అలా! అంత ప్రేమమయుని కోమలమైన, గులాబీరంగు అరచేతుల్లో మేకులెలా కొట్టగలిగారో? ఎంతటి కరుణ క్రీస్తుది! ఎంత ప్రేమ ఆ హృదయంలో బాధితుల పట్లా, వ్యధా భరితుల పట్లా? జనాల మీద ఆయన కున్న ప్రేమ, ఆప్యాయత ఎంత గొప్పవి? అలాంటి యోగి పట్ల, అలాంటి దివ్యమూర్తి పట్ల, అంత మృదు భాషి, దయామూర్తి పట్ల ఆనాటి రోమన్లూ, ఈజిప్షియనులూ దొంగలతో కలిపి, నేరస్తుణ్ణి విచారించినట్లు ఎలా విచారించగలిగారు? అంతగా ఎలా అవమానించి, హింసించి, చంపగలిగారు? యూదుల్లో కొందరు, ఆయన శిష్యులై ఉండి ఎలా ఇదంతా సహించారు? యూదుల్లో కొందరు, ఆయనకి వ్యతిరేకంగా సాక్ష్యాలూ, [పేతురు లాంటి శిష్యులతో సహా కొందరు] ఎలా ఆయన తమకి తెలియదని మాట తిప్పగలిగారు? అసత్యం చెప్పటానికి బదులుగా ఆయనతో పాటే ప్రాణత్యాగం చేయటం మేలు కదా? అలాగ్గాక, అప్పటికి ప్రాణాలు కాపాడుకున్నా, ఉట్టిగట్టుకు కలకాలం బ్రతికారా? లేదే! సమయం వచ్చినప్పుడు చావు తప్పలేదు కదా?
ఆనాటి ఆదేశ పాలకులు క్రీస్తును శిలువవేసి చంపారు. చేతుల్లో కాళ్ళల్లో మేకులు గుచ్చారు. శూలంతో డొక్కల్లో పొడిచారు. ముళ్ళకీరిటంతో తలనుండి రుధిరధారలు కట్టించారు. అదేరోజు వాళ్ళు మరిద్దరు దొంగల్ని కూడా శిక్షించారు. క్రీస్తుతో పోలిస్తే ఆ దొంగల్నే వాళ్ళు మరికొంత గౌరవంగానూ, తక్కువ కౄరంగానూ ట్రీట్ చేశారు. ప్రజలకి మంచి బోధించడం, మంచి చేయప్రయత్నించడం అంత నేరమా? ఇంత చిత్రవధ అనంతరం కూడా క్రీస్తు వాళ్ళందరినీ పాపం నుండీ, నరకం నుండీ కాపాడమని దేవుణ్ణి ప్రార్ధిస్తాడు. ఆయన భగవంతుణ్ణి “ఓ దేవా! నా తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరేరుగరు. క్షమించుము” అంటూ ప్రార్ధిస్తాడు.
ఇంతటి దివ్యప్రేమని గురించి, అంత ప్రేమ చిందించిన ఆ కరుణామూర్తి క్రీస్తుని గురించి వివరించడానికి ఏమాటలైనా సరిపోవు.
అదీ మెటీరియలిస్టిక్ రక్తం. [మెటీరియలిజం అంటే పదార్థవాదం.]యూరోపియన్లలో చాలామంది తరతరాల నుండి మెటీరియలిస్టులే.
కాబట్టే ఒక ’క్రిమినల్’ తో సమంగా క్రీస్తంతటి యోగిని, ప్రవక్తని, దివ్యమూర్తిని చంపగలిగారు.
ఏ స్థితిలోనూ, ఏ కారణంగానూ, ఏ కాలంలోనూ భావవాదులు చేయలేనంతటి కౄరకృత్యం అది. భారత చరిత్రలో శిరశ్భేదం దగ్గర నుండి ఏ శూలాయుధ శిక్ష కూడా ఇంత కౄరమైనది కాదు.
[ఇది నేను ’ఇండియన్’ ని అన్న గర్వంతోనో, అహంకారంతోనో అనటం లేదు. నిజం మీద, పరమాత్ముడి మీద ఉన్న విశ్వాసంతో మనిషినన్న అత్మవిశ్వాసంతో అంటున్నాను.]
ఇలాంటి జీన్స్ తో, నిత్య చరిత్రతో ఎలా ఇప్పటి యూరపు మరియు పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు ఇతర దేశాల్లో మానవహక్కుల గురించి గావు కేకలు వేస్తున్నాయో, ఎందుకు వేస్తున్నాయో వారికే తెలియాలి.
శాంతిని రక్షించడానికి వాళ్ళు మరింత మారణ హోమాల సృష్టించగలరు. ఇరాక్ పై యుద్దాలు చేసి సద్దాం హుసేన్ లని శిక్షించగలరు. ఆ వంకతో మరెన్నో ’రాచ’కార్యాలు చక్కబెట్టగలరు.
ఇదే శాంతి కాముకులు మరి పాకిస్తాన్ మీద ఎందుకు ప్రత్యేక ప్రేమ చూపిస్తారు? ఏం స్ట్రాటజీ! [దాన్నే మనం 26/11 ముంబైదాడుల తర్వాత మరింత స్పష్టంగా చూస్తున్నాం. నిన్నటి దాకా అంతర్జాతీయంగా ఒత్తిడి పాక్ మీద ఉందంటూ ఊదరబెట్టిన కేంద్ర యూ.పి.ఏ. మంత్రివర్యులు [ప్రధాని, విదేశాంగ మంత్రి] ఈరోజు ’పాక్ పారదర్శకంగా విచారించేటట్లయితే నేరస్తుల్ని వాళ్ళ దేశంలోనే విచారించవచ్చు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘పాక్ – పారదర్శక విచారణ’! ఏం జోక్ ఇది? ఇక్కడ తేలియంటం లేదా ఇస్లామాబాద్ కి ఎంత బలమో?]
చరిత్రే చెబుతుంది యూరపు దేశాల్లోని రాజవంశీయుల, భూస్వాముల స్వార్ధపూరిత, మోసపూరిత స్వభావాల గురించి. ఇది ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే విషయమే. కాంగ్రెస్ ఆఫ్ వియన్నా, ఫ్రెంచి విప్లవం లాంటి ఎన్నో సంఘటనలు ఇందుకు సజీవ నిదర్శనాలు. ప్రజలు తిరగబడినప్పుడల్లా, తాత్కాలికంగా ఓటమి ఒప్పుకొని సంధి చేసుకొనటం తర్వాత అంతకంతా ప్రజల్ని అణగకొట్టటం [ముంబైదాడుల నేపధ్యంలో తప్పని సరై నానా హడావుడి చేసిన ప్రస్తుత యూ.పి.ఏ.ప్రభుత్వం ఇప్పుడు మెల్లిగా అణగార్చేసినట్లన్నమాట] యూరపు, ముఖ్యంగా ఇంగ్లాండు రాజవంశీయులకి కొట్టినపిండి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనటం వాళ్ళకి వెన్నతో బెట్టిన విద్య. రాజ్యాధికారం కోసం ఎన్ని కుట్రలు పన్నారో, ప్రజా దోపిడికి ఎన్ని మోసపూరిత పధకాలు వేస్తారో,
ఎన్ని యుద్దాలూ, కుతంత్రాలూ చేసి రాజ్యవిస్తరణలు చేశారో చారిత్రక నిరూపితాలు.
ఇలాంటి చరిత్ర భారతదేశానికి లేనందుకు నిజంగా మనమెంతో సంతోషించవచ్చు, ఒకింత గర్వంగానూ, సంతృప్తిగానూ అనుభూతించవచ్చు. రాజ్యం కోసం త్యాగాలు చేసికొనే రామభరతుల గాధలు వంటి పురాణాలే కాదు, చరిత్రలో కూడా కనీసం 5000 సంవత్సరాల నుండి ఇండియా ఇతరుల భూభాగాన్ని హరించేందుకు, దురాక్రమణలూ, యుద్దాలు చేయలేదు. ఇది భారతీయుల శాంతి కాముకత్వం, [ జైత్రయాత్రలు పురాణాల్లోనూ, చరిత్రలోనూ లేవా అనే వారు ఆ జైత్ర యాత్రలకీ, యూరపు వారి రాజ్యకాంక్ష యుద్దాలకీ ఉన్న అంతరం పరిశీలించాలి.]
ఈ సందర్భంలో మొదట చండాశోకుడూ పిదప ధర్మాశోకుడూ అయిన గొప్ప భారతీయ చక్రవర్తి గురించి చెబుతాను. [నా కథ చెబుతానంటూ ఇదంతా చెబుతున్నానేమిటా అనుకోవద్దు. ఎందుకిదంతా చెప్పాల్సి ఉందో తరువాత వివరిస్తాను.]
అశోకుని కథ నేను ’చందమామ’లో చదివాను. దీనికున్న చారిత్రక అధారం నాకు అంతగా తెలియదు.
కౌటిల్యుడు గానూ, చాణక్యుడిగానూ ప్రసిద్ది పొందిన విష్ణుగుప్తుడు నందవంశ వినాశనం జరిపించిన తరువాత తన శిష్యుడు, ముర పుత్రుడూ అయిన చంద్రగుప్తుని రాజ్యాభిషిక్తుని చేశాడు. మౌర్యసామ్రాజ్యంగా చరిత్ర ప్రఖ్యాతి పొందినది వీరే. చాణక్యుని గూఢచార, ఆర్ధిక శాస్త్రఙ్ఞానంతో అత్యంత బలమైన, విశాలమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు చంద్రగుప్తుడు.
చంద్రగుప్తుని వారసుడు [పుత్రుడో పౌత్రుడో] బిందుసారుడు. ఈయన క్రీ.పూ. 313 తరువాతి వాడు. [క్రీ.శ. 4వ శతాబ్ధానికి చెందిన మగధ పాలకుల్లోని బింబిసారుడు లేదా బిందుసారుడు ఇతడు కాదు. ] బిందుసారుని పాలనా సమయానికి చాణక్యుడు పూర్తి వార్ధక్యంలో ఉన్నాడు. విశ్రాంతి తీసుకొంటూ ఆశ్రమంలో ఉన్నాడు. రాజగురువుగా ఎప్పుడూ ఆయనది మునుల వంటి ఆశ్రమ జీవనమే.
బిందుసారుని ఆస్థానానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన ముఖంలో పాండిత్యమూ, వైరాగ్యమూ కన్పిస్తున్నాయి. ఆయన వెంట ఒక అందమైన యువతి ఉంది. ఆమెలో సౌందర్యమూ, వినయం వంటి సౌశీల్యమూ ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి.
ఆ బ్రాహ్మణుడు “మహారాజా! ఈమె నా పుత్రిక. ఈమె జాతకం ప్రకారం ఈమె బిడ్డ గొప్ప చక్రవర్తి అవుతాడు. ఈమెను మీరు భార్యగా గ్రహించవలసిందిగా నా అభ్యర్ధన. ఈమెను మీకు ధారపోసి నేను కాశీకి తపస్సు నిమిత్తం వెళ్ళాలని కోరుకుంటున్నాను” అన్నాడు. [ఇక్కడ ’ఆ యువతి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేదా?’ అనే ఫెమినిస్టుల వాదన గురించి నేను తర్కించడం లేదు. ఆనాటి కాలమానపరిస్థితులు ఆనాటివి. ఎప్పుడైనా, ఎక్కడైనా, మంచీ చెడూ రెండూ ఉంటాయి. మంచి ఎక్కువగా ఉంటే ఆ కాలాన్ని మంచిదనీ, చెడు ఎక్కువుగా ఉంటే చెడుకాలమనీ అంటాం. ఏదైనా అంతే. గతమంతా మంచీ కాదు, అలాగే వర్తమానమంతా చెడూ కాదు అని నా ఉద్దేశం.]
బిందుసారుడు ఆ బ్రాహ్మణుని గౌరవించి, "మంచిది స్వామీ! ఆమెను మా అంతఃపురానికి పంపుతాను. మా ఆస్థాన పురోహితులు మంచి ముహుర్తం నిర్ణయించాక, ఆమెకు నేను వివాహం చేసుకుంటాను” అన్నాడు.
బ్రాహ్మణుడా యువతిని అక్కడ వదలి వెళ్ళిపోయాడు. మహారాజు బిందుసారుడు ఆయువతికి సపర్యలు చేయటానికి ఓ పరిచారికని నియమించాడు. రాజ సౌధానికి పంపాడు. అప్పటికే రాజుకు ఇతర రాణులున్నారు. పట్టమహిషితో సహా అందరికీ ఆ బ్రాహ్మణ యువతి సౌందర్యం పట్లా ఈర్ష్య, రాజసభలో జరిగిన సంఘటనల పట్ల అభద్రతా భావం కలిగాయి. రాచకార్యాల వత్తిడిలో పడి బిందుసారుడు ఈ వ్యవహారమంతా మరిచిపోయాడు. రెండేళ్ళు గడిచిపోయాయి.
ఈ సమయంలో – మొదటి రోజుల్లో ఇతర రాణులు, వారి పరిచారికలూ బ్రాహ్మణ యువతి పట్ల, ఈమెను రాజు త్వరలో వివాహమాడబోతున్నాడన్న జాగ్రత్తతో కొంత మర్యాదగా ప్రవర్తించారు. కాలం గడిచే కొద్దీ మెల్లిగా ఆమెను గేలి చేయటం అవమానించటం ప్రారంభించారు. ’ఇలా బ్రాహ్మణ స్త్రీలు కూడా రాచరికానికి పోటి కొస్తే ఇక క్షత్రియకాంతల గతేం కాను?’ అంటూ ఎద్దేవా చేయసాగారు. క్రమంగా ఆమె కూడా ఇతర సేవికలతో కలిసి రాణూలకూ, అంతఃపురం లోనూ పనులు చేయవలసి వచ్చింది. దీన్నంతా మౌనంగా భరిస్తూ ఆమె కాలం గడవసాగింది.
ఇలా ఉండగా ఓ సాయంత్రం – రాజు బిందుసారుడు రాజోద్యోనవనంలో వ్యాహ్యాళిగా నడుస్తూ ఉన్నాడు. ఆయన అరికాలిలో ముల్లు దిగింది. ఆ సమయానికి బ్రాహ్మణ యువతి అక్కడికి దగ్గరలోనే ఉంది. వెంటనే ఆమె బింబిసారుని దగ్గర కొచ్చి ఆయన పాదంలో దిగిన ముల్లుని మెల్లిగా తీసేసింది. తలదించుకొని, తన సుకుమారమైన చేతులతో ముల్లుని ఆమె తీస్తున్నంత సేపూ ఆమెనే దీక్షగా పరిశీలించిన రాజుకి ఆమె నెక్కడో చూసినట్లనిపించింది. ఆమె అందం, మృదు ప్రవర్తనా ఆయనకి ఆశ్చర్యం కలిగించాయి.
"ఎవరు నీవు? చూస్తే పరిచారికలా లేవు. నీ ముఖ వర్చస్సే చెబుతుంది ఆ విషయం. కానీ పరిచారికలు చేసే పనులు చేస్తున్నావు” అని అడిగాడు.
ఆమె జవాబివ్వలేదు. తల ఎత్తనూ లేదు. ఆలిచిప్పల్లాంటి ఆమె నేత్రాల నుండి ముత్యల్లా కన్నీరు చిందింది. ప్రక్కనే ఉన్న ఆమె దాసి “ప్రభూ! ఒకరోజు ఈమె తండ్రియైన ఓ బ్రాహ్మణ పండితుడు మీదగ్గర కొచ్చి, చక్రవర్తి కాగల పుత్రుడు ఈమెకు పుడతాడని ఈమె జాతకం చెబుతోందని, ఈమెకు భార్యగా స్వీకరించమని మీకు అప్పగించి వెళ్ళాడు. మీరాయనకు ఈమెను వివాహం
చేసుకుంటామని మాట ఇచ్చి, నన్ను ఈమెకు పరిచారికగా నియమించారు” అని విన్నవించింది.
అది విని మహారాజు బిందుసారునికి బాధ కలిగింది. పశ్చాత్తాపంగానూ అన్పించింది. వెంటనే మంత్రి, పురోహితులని రావించి, బ్రాహ్మణ యువతితో తన వివాహనికి పురమాయించాడు.
తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు
అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినోభవంతు!
**************
ఓ చిన్న గమనిక: చారిత్రకాంశాల మీద [స్థల కాలాల మీద] నాకంతగా సాధికారత లేదు. అవసరమైన చోట నాకు అందుబాటులో ఉన్న పుస్తకాల మీద ఆధారపడ్డాను. ఆయా గొప్పవారి జన్మస్థలాల గురించో, కాలాల గురించో, ఏదైనా సంఘటనల గురించో ఏవైనా పొరబాట్లుంటే మన్నించగలరు.
ఈ టపాల్లో నా ఉద్దేశం రాజకీయ రంగం మీద కుట్ర కోణాన్ని వివరించడం. అందులో క్రమ పరిణామాన్ని చెప్పేముందు, చారిత్రక స్ఫూర్తిని చెప్పే ప్రయత్నం చేశాను.]
***********
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
2 comments:
Adi Lakshmi గారు,
When you get a chance please read the following book to understand some of the Western historical events.
"The Christ Conspiracy: The Greatest Story Ever Sold" by D.M. Murdock
http://truthbeknown.com/
and christianity by sam , scribd lono, archive.org lono dorukuthundi. chala manchi pustakam
Post a Comment