ఒక రకంగా చెప్పాలంటే - 1992 నుండి 1995 వరకూ, మేము అవునన్నా కాదన్నా.... కొట్టి మరీ పిల్లాడికి అక్షరాలు నేర్పినట్లు.... పీవీజీ మాకు గూఢచర్య అవగాహన నేర్పాడు. అదే సమయంలో మరో మానసిక విన్యాసం కూడా మా మీద ప్రయోగించాడు. అదీ గయోపాఖ్యానం వంటిది!

మహా భారత కథలో ఉన్నదో, లేక ప్రక్షిప్తమో తెలియదు గానీ చిలకమర్తి వారు రచించిన ’గయోపాఖ్యానం’ నాటకం తెలుగునాట చాలా ప్రసిద్దం. శ్రీకృష్ణార్జున యుద్ధంగా సినిమా కూడా చిర పరిచితమే! కురుక్షేత్ర యుద్దానికి చాలా ముందుగా.... గయుడనే గంధర్వ రాజు కారణంగా శ్రీకృష్ణుడూ, అర్జునుడూ పరస్పరం యుద్దానికి తలపడతారు. తన పట్ల అపచారం చేసిన గయుణ్ణి సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు శ్రీకృష్ణుడు. అది తెలియక, ప్రాణభయంతో తనను శరణు వేడిన గయుడికి అభయమిస్తాడు అర్జునుడు. కాపాడతానని ఇచ్చిన మాట తప్పననీ, ప్రాణభీతిలో శరణుజొచ్చిన వారికి అభయదానం చేయటం క్షత్రియ ధర్మమనీ, అందుచేత గయుణ్ణి విడిచిపెట్టనంటాడు అర్జునుడు.

ఆ విధంగా తన గురువు, బంధువు, ప్రాణమిత్రుడూ, మార్గదర్శి.... అన్నీ అయిన శ్రీకృష్ణుడితోనే యుద్దానికి తలపడతాడు. అది ధర్మం కోసం! అదే అర్జునుడు.... కురుక్షేత్ర యుద్దరంగంలో, ఎదురుగా మోహరించిన బంధుమిత్రులని చూసి, అనుబంధాల తాలూకూ మోహంతో ధనుర్బాణాలు క్రింద పడవేసి యుద్దం చేయనంటాడు.

అదీ భారతీయుల రక్తం!
అనుబంధాలు కోసం ఏది వదులుకోవటానికైనా సిద్దపడే రక్తం!
ధర్మాచరణ కోసం ఎవరి తోనైనా తలపడే రక్తం!

అలాంటి నరుడికి.....నారాయణుడు, ఆచార్యుడూ శ్రీకృష్ణుడు! గయుడి కారణంగా జరిగే ఆయుధ సన్నివేశంలో, చిలకమర్తి వారి తీయ తెలుగు పద్యాలు పల్లీయులకి కంఠతా వచ్చేవి ఒకప్పుడు.

అల్లుడా రమ్మని ఆదరమున బిలువ
మామను బట్టి చంపగలమే

జలక్రీడ సవరించు జవరాండ్ర కోకలు
ఎత్తుకు పోయి చెట్లెక్కగలమే

ఇల్లుల్లు దిరిగి వ్రేపల్లెలో....
మిసిమి ముద్దలు దెచ్చిమ్రింగగలమే

తల్లిదండ్రులొరునకీ దలచు కన్య....
బలిమిమై నెత్తుక వచ్చి బెండ్లి యాడగలమే....

అంటూ అర్జునుడు కృష్ణుణ్ణి ఎత్తి పొడుస్తాడు. ఏది ఏమైనా కృష్ణుడంతటి వాడితో తలపడుతున్నాననే జంకూ గొంకూ అర్జునుడిలో ఉండదు.

ఆ విధంగా అర్జునుడి యుద్ద పాటవాన్ని, ధైర్యస్థైర్యాలనీ పరీక్షించుకుంటాడు శ్రీకృష్ణుడు, రాబోయే ధర్మ యుద్దంలో అర్జునుడు... అసుర లక్షణాలతో పేట్రేగి పోయిన కౌరవుల్ని, వారి సేనలనీ ఎంత వరకూ చెండాడ గలడో!

సరిగ్గా ఇదే పీవీజీకి, మాకూ మధ్య నడిచిన వైరం! 1992 నుండి 1995 వరకూ, ముఖ్యంగా శ్రీశైలంలో గుడిసెలో నివసిస్తోన్న రోజుల్లో.... "పీవీజీ దేశం పట్ల ధర్మం పాటిస్తుండవచ్చుగాక! మా పట్ల మాత్రం అధర్మం పాటిస్తున్నాడు. దేవుడు మా పక్షాన్నే ఉన్నాడు. ధర్మం మాపక్షానే ఉంది" అనుకునే టప్పుడూ... పీవీజీ పదవీ అధికారాలు చూసి మేం బెదర లేదు. దేవుడు మాతో ఉన్నాడు అన్న మా నమ్మకం అతి గట్టిది. కాబట్టి 1995 జనవరిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయి ఎన్టీఆర్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు ’దేవుడు పీవీజీకి తప్పు చేస్తున్నావ్ అనే చెప్పాడు’ అనుకున్నాము. అప్పటికి ఓటమి స్ట్రాటజీ మాకేం తెలుసు?

అలా.... క్రమక్రమంగా పీవీజీ పట్ల కూడా ఓ వ్యతిరేక భావన ఏర్పడింది. వద్దుమొర్రో అన్నా..... గూఢచర్య అవగాహన నేర్పుతున్నానంటూ పీవీజీ మమ్మల్ని వేధిస్తున్నాడా అనే అనుమానమూ వచ్చింది. అంతలోనే అది ’absurd' అనిపించేది. ఎందుకంటే అప్పటి సంఘటనలలో కొన్ని విచిత్రాలు ఉండేవి. ఎలాగంటే -

౧]. ఎప్పుడైనా ’ఇదంతా నిజమేనా?’ అని మాకు అనుమానం వచ్చిందంటే చాలు, ’ఇది నిజమే’ అని చెప్పబడుతున్నట్లుగా అసాధాణ సంఘటనలు జరిగేవి.

౨]. కసికొద్దీ, "ఛస్తాను. అప్పుడేం చెయ్యగలవు?" అన్నట్లు రెటమతంగా ప్రవర్తించినప్పుడు ’ఆత్మహత్యకు ప్రయత్నిస్తే అల్లరి పాలవుతావు’ అన్న హెచ్చరికలు కనిపించేవి.

౩]. ప్రతీ విషయంలోనూ మా పరిమితి ఎంతో పరీక్షింపబడినట్లుగా సంఘటనలు జరిగేవి. అంటే - నమ్మకద్రోహన్ని ఎంత వరకూ తట్టుకోగలం, చుట్టూ అందరూ ఒంటరిని చేసి వెలేసినట్లుగా ప్రవర్తిస్తే ఎంత వరకూ నిలబడగలం.... ఇలా!

౪]. మేము ఏ విషయానికైతే భయపడే వాళ్ళమో, బెంగ పడే వాళ్ళమో అది పులి మీద పుట్రలా వచ్చి మీద పడేది. అలా పడటం, ఆ విషయము పట్ల మా భయం పోయే వరకూ కొనసాగేది.

ఉదాహరణ చెప్పాలంటే - ’ఇదిగో చేతిలో వంద రూపాయలున్నాయి. పదిరోజుల వరకూ చింత లేదు. తర్వాత ఏం చెయ్యాలి?’ అని ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉంటే - గుడి కి వెళ్ళినప్పుడు చెప్పులు దొంగిలింపబడ్డాయి. ఇలా రెండుసార్లు జరిగింది. చేతిలో ఉన్న డబ్బుతో ముందు కాళ్ళకు చెప్పులు కొనుక్కోవలసి వచ్చేది. పదిరోజుల తర్వాత రావాల్సిన సమస్య అప్పుడే వచ్చి కూర్చునేది. ఏదో విధంగా సమస్య పరిష్కరించు కోవలసిందే కదా? ఇలా.... చివరికి దేవుడి మీద భారం వేయటం అన్నది అనివార్యంగా నేర్చుకోవలసి వచ్చింది. ఆ విధంగా భయాలన్నీ పోయి కేవలం ఆకలి మాత్రమే మిగిలింది. దాని మీదే రామోజీరావు ఆడుకోవలసి వచ్చింది.

౫]. ఎవరి మీదనైనా, దేని మీదనైనా ఆధారపడటం ప్రారంభిస్తే... కీలక దశలో ఆ ఆధారం మా కొంప ముంచేది. క్రమంగా ’భగవంతుడి మీద తప్ప మరెవ్వరి మీదా, మరే భావన మీదా ఆధారపడకూడదు’ అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చి సాధన గట్టి పడింది.

1992 నుండి 1995 లో శ్రీశైలంలో గుడిసె జీవనం వరకూ, మరో మాటలో చెప్పాలంటే మా పాప పుట్టే వరకూ మా మీద పడిన దెబ్బలకూ, మేము ఎదుర్కొన్న కఠోర పరిస్థితులకూ ఉన్న శృతీ లయా పైన చెప్పినట్లుగా ఉండేది. ఇప్పటికీ ఒకసారి చేతికొచ్చిన డబ్బు, చివరి రూపాయి ఖర్చు అయ్యేంత వరకూ, చివరి నిమిషం వరకూ తదుపరి రోజుల కోసం మా ప్రయత్నాలు ఫలించవు. మెడ మీద కత్తి అలాగే ఉంటుంది. వాటిని పట్టించుకోకుండానే పనులు చేయటం అలవాటయిపోయింది.

ఈ సందర్భంలో, ఈ బ్లాగులో గత టపాలలో చెప్పిన ఓ కథ గుర్తు చేయదగినది.

అనగా అనగా…..

ఓ గ్రామానికి దాపుల నున్న అడవిలో సదానందుడనీ గురువు, ఒక గురుకులాన్ని నడుపుతున్నాడు. ఆయన గురుకులం క్రమశిక్షణకి పెట్టింది పేరు. ఆయన యుద్దవిద్యలు కూడా బాగా నేర్పుతాడని ప్రసిద్ది. ఓరోజు కిరీటి అనే యువకుడు సదానందుడి ఆశ్రమానికి వెదుక్కుంటూ వచ్చాడు. సదానందుణ్ణి కలుసుకుని నమస్కరించి “అయ్యా! నాకు కత్తి సాము నేర్చుకోవాలని ఆశ. తమ శిష్యుడిగా స్వీకరించండి” అని ప్రార్ధించాడు. సదానందుడు ఆ యువకుడి జన్మస్థలం గురించి, తల్లిదండ్రులగురించి, పూర్వవిద్యల గురించి అడిగాడు. కిరీటి అన్నిటికీ వినయంగా జవాబిచ్చాడు. సదానందుడు ఏమాటా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు.

కిరీటికి ఏమీ అర్ధం కాలేదు. సరే ‘కాదు పొమ్మనలేదు కదా!’ అనుకుని ఆశ్రమంలో ఇతర విద్యార్ధులతో కలిసిపోయాడు. గురుకుల ఆశ్రమంలోని ఇతర విద్యార్ధుల లాగే రోజూ ఉదయాన్నే లేవటం, ఆశ్రమవిధులు నిర్వహించటం చేస్తున్నాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తేవటం, వంటశాలలో పనిచేయటం, ఏటి నుండి నీరు తేవటం, గురుకులంలోని తోటలోగల కూరగాయల మొక్కలకీ, పూలమొక్కలకీ, పళ్ళవృక్షాలకీ నీళ్ళుపోయటం….. ఇలా అన్ని పనులూ చేస్తున్నాడు. అయితే సదానందుడు కిరీటి కన్పిస్తే చాలు ఈడ్చి తంతుండేవాడు. కిరీటి మొక్కలకు నీళ్ళు పోస్తుంటే ఫెడేలున వీపు మీద గుద్దేవాడు. ప్రాంగణం ఊడుస్తుంటే డొక్కలో గుద్దేవాడు. ఏపని చేస్తున్నా, ఎటో ఒకవైపు నుండి సదానందుడు కిరీటిని తన్నటం మానలేదు.

కిరీటికి ఏమీ అర్ధం కాలేదు. దుఃఖం వచ్చింది. అవమానంగా అన్పించింది. ‘ఒకవేళ గురువుగారికి తనంటే ఇష్టం లేదా? తమ ఆశ్రమంలో ఉండటం ఇష్టం లేకపోతే తనని పిలిచి సూటిగానే అదేవిషయం చెబుతాడుగానీ ఇలా ఎందుకు తనని కొడతాడు?’ అనిపించింది. ఒకోసారి, గురుకులం నుండి వెళ్ళిపోదామా అన్పించేది. కానీ కత్తి యుద్ధం నేర్చుకోవాలన్నా సంకల్పం కొద్దీ గురుకులంలోనే ఉండిపోయాడు. కొన్ని నెలలు గడిచాయి. గురువు గారు మాత్రం కిరీటి కన్పిస్తే చాలు దెబ్బతీయకుండా ఉండేవాడు కాదు. కిరీటి ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వీపు పగలటం ఖాయం. దాంతో అనివార్యమై, కిరీటి అప్రమత్తంగా ఉండటం నేర్చుకున్నాడు. ఏపని చేస్తున్నా, చురుగ్గా అన్నిదిక్కులూ జాగ్రత్తగా పరిశీలించేవాడు. ఏమాత్రం అలికిడి అయినా మెరుపులా కదిలేవాడు. దాంతో సదానందుడు కిరీటిని తన్నలేకపోవటం తరుచుగా జరగసాగింది. ఇలా మరికొన్నిరోజులు గడిచాయి.

ఓరోజు సదానందుడు కిరీటిని పిలిచి “నాయనా! అదిగో ఆ కత్తి అందుకో. ఈ రోజు నుండీ నీకు కత్తిసాము నేర్పుతాను” అన్నాడు ప్రసన్నంగా.

కిరీటి ఆనందానికి అవధుల్లేవు. మరుక్షణం కత్తి అందుకుని అభ్యాసానికి దిగాడు. తొలిపాఠం అయ్యాక కిరీటి గురువుగారికి నమస్కరించి “అయ్యా! నేను వచ్చి, నన్ను శిష్యుడిగా అంగీకరించమని అడిగిన రోజు, మీరు ఔననలేదు. కాదనలేదు. కాదనలేదు కాబట్టి నేను గురుకులంలో ఉండిపోయాను. కానీ ప్రతిరోజూ మీరు నేను కనబడతే చాలు చితకబాదారు. ఆ బాధ పడలేక వెళ్ళిపోదామని కూడా అన్పించింది. ఈ రోజు నేను అడగకుండానే పిలిచి విద్యాబోధన ప్రారంభించారు. కారణం సెలవిస్తారా?" అని అడిగాడు.

సదానందుడు చిరునవ్వునవ్వి “నాయనా! కత్తి యుద్దానికి అప్రమత్తతా, చురుకుదనమూ పునాది వంటిది. నీవు వచ్చిన రోజు నుండీ నీకు అది నేర్పటం మొదలుపెట్టాను. నువ్వు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, అజాగ్రత్తగా ఉన్నా నాచేతి దెబ్బలు తిన్నావు. క్రమంగా నీ చురుకుదనం, జాగ్రత్త పెరిగాయి. ఇప్పుడు లాంఛనంగా విద్యాబోధన ప్రారంభించాను. ఏవిద్యకైనా ముందు దానికి తగిన దృక్పధాన్ని, ఆలోచనా సరళిని విద్యార్థికి నేర్పాలి. తర్వాత అసలు విద్య వారు అతి సులభంగా నేర్చుకోగలుగుతారు. విద్యా బోధనలో అసలు కిటుకు ఇదే” అన్నాడు.

కిరీటి సంతోషంగా గురువుగారికి పాదాభివందనం చేసి, ఇతర విధుల్లోకి వెళ్ళాడు. అనతికాలంలోనే సదానందుడి దగ్గర కత్తియుద్ధంలోని మెళకువలు నేర్చుకుని, నైపుణ్యంగల కత్తి యుద్ద వీరుడిగా కిరీటి పేరు తెచ్చుకున్నాడు.


ఆ విధంగా, అనివార్యంగా అప్రమత్తతో [Alertness] నేర్చుకున్నాము. మాలో ఉన్న బలాలు పెంచబడటం, బలహీనతలు తుంచబడటమూ జరిగింది. ఇదంతా మాకు అప్పుడు అవగాహన లేకుడింది. 2005 తర్వాతే స్పష్టంగా అర్ధమైంది.

అప్పట్లో అయితే పీవీజీ మమ్మల్ని ఎందుకు ఉతికి పారేస్తున్నాడో అర్ధమయ్యేది కాదు. అప్పటికే ఆయనతో పెంచుకున్న అనుబంధం, దేశానికి సంబంధించి ఆయనా మేము ఒకే జట్టు అనే భావమూ, మమ్మల్ని బాగా కుదిపి వేసేవి. అదీ గాక శతృవు అయితే చంపేస్తాడు గానీ ఓ పరిమితి వరకూ వేధించి అయినా సరే నడిపించి... తర్వాత మరో కోణం - మరో అంశం అందుకోవటం... అర్ధమయ్యీ కానట్లుండేది. ఏది ఏమైనా నమ్మిన వాడే నట్టేట ముంచటం అనిపించి విపరీతంగా బాధ కలిగేది.

ఖచ్చితంగా చెప్పాలంటే - తెలియని తనమే ఎక్కువగా బాధపెట్టింది. పీవీజీ ఇచ్చిన శిక్షణ కన్నా కూడా! తెలియని తనమే కదా భయమంటే! ఎందుకంటే - అదే 2005 తర్వాత పీవీజీ స్థానంలో నకిలీ కణిక వ్యవస్థ,నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీ రావు, సోనియాలు ఉన్నారని అర్ధమైనప్పుడు మాకు భయం వేయలేదు. ‘శతృవు ఇలాగ్గాక మరెలా ఉంటాడు? శతృవులు గనకే వేధిస్తున్నారు’ అన్నది బాగా అర్ధమయ్యింది. కాబట్టే ‘శతృవుని మనం మనకి చేతనైన దెబ్బతీసినప్పుడు, వాడూ తనకి చేతనైన దెబ్బ తను తీస్తాడు కదా’ అన్నది స్పురించింది. అదే మా బ్లాగులో గత టపాలలో వ్రాసాము.

ఇదంతా తెలియదు గనక 1992 నుండి 1995 నాటికి పీవీజీ పట్ల మా వ్యతిరేక భావన పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఓ పరిమితి దాటాక ’బ్రేక్’ అయ్యేంత స్థితి వచ్చేది. ఇక తట్టుకోలేక దిగులు పడటం, అనారోగ్యానికి గురవ్వటం జరిగేవి. ఒకోసారి బాగా దుఃఖ పడటం జరిగేది. ఇక దాంతో ఆ రకపు సంఘటనలు ఆగిపోయేవి.

తర్వాతి కాలంలో ఆ గోల మరిచిపొమ్మనటం జరిగింది. ఇక 1995 చివరి నుండి 2005 చివరి వరకూ అన్నీ మరిచిపోయాము. అయితే గీత సాధనా, దైవభక్తీ మాత్రం మరిచిపోలేదు.

ఇంతగా రాటుదేల్చబడ్డాం కాబట్టే 2005లో మాపై వేధింపులు చేస్తోంది రామోజీరావు బృందం అని అర్ధమైనప్పుడు మేము ఏమాత్రం భయపడలేదు. గతంలో [అంటే 1992 నుండి 1995 వరకూ] మాకు గూఢచర్య అవగాహన నేర్పుతున్నానంటూ పీవీజీ మమ్మల్ని వేధించాడనుకున్నా, దేవుణ్ణి తోడుగా భావించి ఎదిరించేటందుకు సిద్దపడ్డాం, అలవాటు పడ్డాం.

అప్పట్లో పీవీజీ ఉన్న స్థానంలో ఇప్పుడు నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, రామోజీరావు బృందం కూర్చున్నారు. అంతే! అప్పట్లోనే.... దేశం విషయంలో పీవీజీ ధర్మాన్నే ఆచరిస్తున్నాడు గాక! మా పట్ల అధర్మాన్ని ఆచరిస్తున్నాడు అనుకున్నాము. అలాంటి చోట ఆయనతో తలపడేటప్పుడే మల్లయ్య స్వామి మాకు తోడుగా ఉన్నాడనుకునేవాళ్ళం. కాబట్టి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాలతో తలపడటానికి మేమే మాత్రం వెనకడుగు వేయలేదు. అందునా వీళ్ళు దేశం విషయంలోనూ, మా విషయంలోనే కాదు.... సకల జీవ జగత్తు పట్లా అధర్మం పాటిస్తున్న వాళ్ళు. ధర్మగ్లాని చేసి, మానవత్వానికే శతృవులైన వాళ్ళు!

ఇక అప్పట్లో [అంటే 1992 to 1995].... ఎదురౌతున్న కష్టాలకి బెంబేలు పడుతున్నంత సేపూ అవి మరింత మరింత పెరిగేవి. ఎప్పుడైతే వాటికి ఎదురొడ్డి నిలుద్దామని ప్రయత్నించే వాళ్ళమో... చిత్రంగా అవి మెల్లిగా తొలిగిపోయేవి.

ఉదాహరణకి మాపాప పుట్టినప్పుడు ప్రసవ సమయంకు ముందు వరకూ.... మెల్లిగా అందరూ ముభావం పాటించారు. ముందు దిగులనిపించింది. తర్వాత తెగింపుకి వచ్చేసాము. Where there is no Doctor చదువుకొని, కొత్త బ్లేడు తెచ్చుకుని.... ఇక ఆ ఘటన ఎదుర్కునేందుకు సిద్దపడిపోయాము. తెల్లవారేసరికి పరిస్థితులన్నీ మారిపోయాయి. కాకపోతే ఇంత స్పష్టమైన అవగాహన అప్పుడుండేది కాదు.

కష్టాలు.... దాటటాలు... 2005 తర్వాత వాటిల్లోని శృతి మాకు అర్ధమైంది. అప్పటికైతే.... ఎప్పటికప్పుడు ముంచుకొస్తున్న ముప్పును తప్పించుకోవటం ఎలా అన్న ఆలోచనతోనే తెల్లారేది.

ఇంత కఠోర పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత.... 1995 లో ఫ్యాక్టరీ కోల్పోయి నంబూరుకు మకాం మార్చాము. అప్పటికి జీవితంలో తిన్న దెబ్బలకి అప్పుడప్పుడూ ’బ్రతకగలమా?’ అన్నంత బెంగ తోచేది. 1995 అక్టోబరు - నవంబరులో పల్లెటూరుకు మారాము. ఏం చేయాలో తోచలేదు. అతికష్టం మీద లెనిన్ చిన్నపాటి వాణిజ్య ప్రకటనల సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉదయపు బస్సులో గుంటూరు వెళ్తే రాత్రికి వచ్చేవాడు.

అప్పటికి వేసవి వచ్చింది. లెనిన్ కు తెలిసిన ఓ క్లయింట్ పాలిటెక్నిక్ మెటీరియల్ ఇచ్చి వీటితో పాటు, పిల్లలకి అర్ధమయ్యేటట్లు శిక్షణ ఇస్తే చాలు గ్యారంటీగా సీట్ వస్తుంది అని చెప్పాడు. పదవ తరగతి పిల్లలకి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ ఇచ్చాము. బాగా సక్సెస్ అయ్యింది. చేతిలోకి డబ్బు వచ్చింది. బ్రతకగలమనే ధైర్యం వచ్చింది. మెల్లిగా కూడదీసుకుని పూర్వపు స్థితికి వచ్చాను.

ఇదంతా ఎందుకు మళ్ళీ చెప్పానంటే - ఫ్యాక్టరీ కోల్పోయి గుడిసెలో ఉంటూ, కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నందున బెంబేలు పడిన మాకు, పీవీజీ పదవి దిగిపోయేలోపు, చిన్నపాటి ఎదురుదెబ్బలు ఉన్నా, మళ్ళీ మాలో ధైర్యమూ, ఆత్మవిశ్వాసమూ నిండేటట్లుగా చేసాడు. 1996 జూన్ - జూలైల్లో ఆయన పదవి దిగిపోయే నాటికి మేము CEEP - 96 విజయంతో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకున్నాము. అందునా అన్నీ మరచిపోయే ప్రయత్నంలో ఉన్న తొలిరోజులు! ఇంకాపైన ఆయన ఓడిపోయేసరికి మేం మరికొంత ఊపిరి పీల్చుకున్నాము. ఊరట చెందాము.

ఆ తదుపరి ఆరునెలలకు, 1997 వేసవిలో మావారి మీద భౌతిక దాడి జరగటం, మేం గుంటూరుకు మకాం మార్చటం జరిగింది. అప్పటి వివరాలు మా కథలో వ్రాసాను. ఆ సంవత్సరం సీప్ కి ఒక్క విద్యార్ధి మాత్రమే కోచింగ్ కు వచ్చింది. అదీ మా ఇంటి క్రింద వాటాలో అమ్మాయి.

ఇక 2000 లో ఎంసెట్ ర్యాంకుల అవకతవకలపై ఫిర్యాదు చేశాము. పర్యవసానంగా 2001 లో మా ఇంటి నుండి కట్టుబట్టలతో బయటికి వెళ్ళగొట్టబడ్డాము. అప్పట్లో ఓ రోజు రోడ్ మీద నడుస్తూ.... మా స్వభావం గురించి చర్చించుకుంటున్నాము.

"లోకంలో సవాలక్ష అవకతవకలు జరుగుతూ ఉంటాయి. మనమెందుకు చూస్తూ ఊరుకోలేము?"

"ఈ రోజు మన విద్యార్ధులు దగా పడ్డారు. రేపు మన పాపే దగా పడవచ్చు అనుకునే కదా ఫిర్యాదు చేశాము?"

"పోనీ, ఎవరెలా పోతే మనకేం? అనుకోవాల్సిందా?" - ఇలా తర్కవితర్కాలు చేసుకుంటూ వెళ్తున్నాము.

ఇంతలో మా ముందు రోడ్ ప్రక్క చిన్నచిన్న వంటపాత్రలు, అద్దాలూ, క్లిప్పులూ అమ్ముకుంటున్న బండి మీది నుండి, ఒకతను నెయిల్ కట్టర్ లాంటి వస్తువేదో తీసుకొని వెళ్ళిపోతున్నాడు. బండి అతను మరోకతనితో మాట్లాడుతూ ఇది గమనించినట్లు లేడు.

అనాలోచితంగా, అప్రయత్నంగా మేము "ఇదిగో నీ బండిలోంచి అతడెవరో వస్తువు తీసుకుని వెళ్ళిపోతున్నాడు, చూస్కో అన్నా" అనేసాను. అతడు నవ్వుతూ "మా వాడేలే అమ్మా! నన్ను ఆట పట్టించడానికి తీస్కబోతన్నడు" అన్నాడు. మేమూ నవ్వేసాము.

తర్వాత ఆలోచిస్తూ "అందుకే పెద్దలు పుర్రెతో వచ్చిన బుద్ది పుడకలతో గానీ పోదంటారు. కళ్ళముందు మోసమో, దొంగతనమో, అన్యాయమో జరుగుతుంటే చూస్తూ ఊర్కొవటం మన స్వభావం కాదు. దేవుడు స్పష్టంగా మనకి అదే నిరూపించి చూపించాడు కదా!" అనుకొని నవ్వుకున్నాము.

ఎంసెట్ ఫిర్యాదుల పరంపర, ఆపైన వ్యవస్థీకృత వేధింపు మీది ఫిర్యాదులతో... అప్పటికి కనబడే పైకారణాలని[over leaf reasons] చూస్తూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాము. మేము, 2005 లో మా జీవితాల్లో మొదట రామోజీరావు ప్రమేయాన్ని మాత్రమే గుర్తించాము. అప్పటికే పీవీజీ మరణించాడు గనక కూడా అంతకంటే ఆలోచన పోలేదు.

మళ్ళీ ఫిర్యాదులు ప్రారంభం! తర్వాతి పరిణామాలని పరిశీలించుకున్నాక రామోజీరావు బృందాన్ని కట్టడి చేసే బృందపు అస్థిత్వమూ, ప్రమేయమూ కూడా కనిపించాయి. దాంతో ఇద్దరు ఆటగాళ్ళు ఆడుతున్న గూఢచర్యం అనే చదరంగపు ఆటలో మేము పావులం అనిపించింది. ఎందుకంటే మా ప్రమేయం లేకుండానే, జీవితం గూఢచర్యపు ప్రవాహంలో వేగంగా వెళ్ళిపోతోంది గనక! దీన్నే నా గత టపాలలో వ్రాసాను.

ఇలా ’ఇద్దరు చదరంగపు ఆటగాళ్ళు ఆడుతున్న ఆటలో మేము పావులం’ అనుకున్నప్పుడు 1992 లో మాకు చెప్పబడిన ’రెండు బోర్డుల మీద ఒకేసారి ఆడే ఆటగాడి విన్యాసం’ గుర్తుకు వచ్చింది. ఓ ప్రక్క స్కూలు నడుపుతూ.... మరో ప్రక్క వేధింపు ఎదుర్కొంటూ... మరో వైపు ఫిర్యాదులు పెట్టుకుంటూ.... అర్ధరాత్రి దాకా ఆలోచించుకుంటూ.... రోజుల తరబడి - రోజూ గంటల తరబడి పనిచేశాము.

క్రమంగా శృతీ లయా అర్ధమయ్యాయి. గతించిన కాలంలోని సంఘటనలు, వార్తలు గుర్తుకు తెచ్చుకున్నాము. 1995 నుండి 2005 వరకూ మేము మిస్సయిన వార్తలూ, రాజకీయ సంఘటనలూ, ఈనాడులో మళ్ళీ ఉటంకింపబడటంతో మాకు అన్నీ ’ఫిట్’ అయ్యాయి.

ఆ క్రమంలో యుద్దపు రీతి అర్ధమైంది. అంతకు ముందు అది విధివ్రాత అనుకునే రోజుల్లో కూడా ’గీతా సాధన’ లక్ష్యంగా తీసుకున్నందు వల్ల జీవితంలో నిర్లిప్తతకీ, నిరాశా నిస్పృహలకి అంతగా లోను కాలేదు. ఫ్యాక్టరీ కోల్ఫోవటం తోనే అన్నీ వదిలేసి ’మా కెరీర్ - మా పాప - దేవుడు’ అనుకోవటంతో జీవితం పట్ల మా దృక్పధం వేరుగా ఉండేది. "దేశానికి మేలు చేయకపోతే పోయాం, కీడు చేయకపోతే చాలు" అనుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఇది యుద్దం అని అర్ధమైందో ఇక మా దృష్టి మారిపోయింది. పూసలోళ్ళ చేపల పులుసు తర్వాత మరింత ధృఢ పడింది.

ఎంతో ప్రయత్నం తర్వాత రెండు బోర్డుల మీద ఒకేసారి ఆడే ఆటగాడి విన్యాసం మాకు విశ్లేషణకు అందింది. దాంతో పూర్తిగా స్పష్టత వచ్చింది. ఇప్పుడు మీకు దాన్ని పూర్తిగా వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu