ముందుగా చిన్న పోలికతో నా విశ్లేషణ ప్రారంభిస్తాను.

పిల్లలకి తల్లిదండ్రులు జన్మనివ్వడమే కాకుండా, జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ప్రేమని పంచుతారు. కంటికి రెప్పలా కాపాడుతారు. శిశువుగా ఉన్నప్పటి నుండీ పెద్దయ్యే వరకు, అన్నపానాలు సమకూరుస్తారు, విద్యా బుద్దులు నేర్పుతారు. జబ్బు చేస్తే పక్కనే ఉండి సేవలు చేసి, వైద్యం చేయించి, కళ్ళల్లో వత్తులు వేసుకుని కాపాడతారు. పిల్లల కంటే వాళ్ళే ఎక్కువగా ‘ఆ జబ్బు పిల్లలకి కాక తమకే వచ్చిందా?’ అన్నట్టు విలవిల్లాడతారు. పిల్లలకు దెబ్బ తగిలితే తాము ’అబ్బా’ అంటారు. కష్టంలో వెన్నంటి ఉంటారు, అభివృద్దిని చూసి ఆనందిస్తారు.

కాబట్టే పిల్లలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం, ఆరాధనా చూపుతారు. తల్లిదండ్రులు వెంట ఉంటే రక్షణగా భావిస్తారు. తల్లిదండ్రుల పట్ల మమకారం కలిగి ఉంటారు. మాతృభూమి మాతాపితల వంటిదే.

అయితే, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పచ్చి స్వార్ధపరులు, వట్టి వ్యసనపరులు అనుకోండి? తమ సుఖం తాము చూసుకొంటూ, పిల్లల బాగోగులు పట్టించుకోని నిర్భాద్యులైతే, ఆ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఏ పాటి ప్రేమాభిమానాలుంటాయి? రక్త సంబంధంతో వచ్చిన నామ మాత్రపు యాంత్రిక బంధం తప్ప, మమత పంచుకున్న మానసిక బంధం ధృఢపడదు.

కుటుంబంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యత, పాత్ర ఎలాంటిదో.... దేశపౌరుల పట్ల ప్రభుత్వ బాధ్యతా, పాత్రా అలాంటివే?

ఇదే పోలికని మరో కోణంలోంచి చూస్తే - తల్లిదండ్రులు తమ స్వసుఖాన్ని త్యాగం చేసి, పిల్లల కోసం అహరహం శ్రమించి, వాళ్ళ అభివృద్ది కోసం పాటు పడితే.... పిల్లలు అదేమీ గుర్తించకుండా, చెప్పుడు మాటలు విని, తల్లిదండ్రులను తప్పుబడుతూ, ఎండమావుల వెంట పరుగులు పెడుతున్నారనుకోండి! అప్పుడా తల్లిదండ్రులకి ఆవేదన, పిల్లలకి ఆయాసం మిగులుతాయి. మొత్తంగా అసత్యాల సుడిగుండంలో కుటుంబం కొట్టుమిట్టాడుతుంది.

దేశ స్వాతంత్ర్యానంతరం, దేశం పట్ల నిబద్దత గల ప్రభుత్వాలకీ, పౌరులకీ మధ్య ఈ స్థితి కొనసాగింది. 1996 నుండి ఇప్పటి వరకు ఉన్న స్థితి.... నిర్భాధ్యులైన, స్వార్ధపరులైన తల్లిదండ్రులకీ, ప్రేమరాహిత్యంతోనూ, అభద్రతతోనూ పెనుగులాడుతూ పెరుగుతున్న పిల్లలకీ మధ్య ఉన్న స్థితి!

గతంలో అంటే వెయ్యి ఏళ్ళకి పూర్వం, ఈ గడ్డమీదికి ఆఫ్ఘన్ ఇసుక పర్రల నుండి ముస్లింలనబడే ఎడారి దొంగలూ, యూరోపియన్లనబడే సముద్రపు దొంగలూ రాకముందూ, పురాణ కాలంలోనూ, ధర్మాశోకుడు, శ్రీకృష్ణ దేవరాయలు, చత్రపతి శివాజి, గుప్తులు, చాణిక్యులు, చోళుల వంటి.. ఒక్కమాటలో చెప్పాలంటే - ప్రజల పట్ల నిబద్దత గల, ప్రభుధర్మం పాటించాలనే ధృక్పధం గల ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ప్రభుత్వాలకీ ప్రజలకీ మధ్య ఉన్న సంబంధం.... ప్రేమ, బాధ్యతలు గల తల్లిదండ్రులకీ, గౌరవాభిమానాలు గల పిల్లలకీ మధ్యగల సంబంధం వంటిది.

ఇక ఇప్పుడు మన దేశంలో ప్రజల స్థితి.... తల్లిదండ్రులు గాలికి వదిలేస్తే అల్లాడుతున్న పిల్లల వంటిదే!

ఈ నేపధ్యంలో ఒక్కసారి "మాతృభూమిపై మమకారం ఎప్పుడు ఉంటుంది?" అన్న ప్రశ్న వేసుకుంటే......?

నా చిన్నప్పుడు - విద్యా, వైద్యం ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి. ప్రైవేటీకరించబడానికి ఎవరెన్ని ఎత్తులు వేసినా ఇందిరాగాంధీ అపర కాళిక అయి వాటన్నిటినీ చిత్తు చేసింది. ఆమె కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు విద్యా వైద్యాలు ప్రైవేటీకరించనియ్యలేదు. ఎందుకంటే ఒకటి జ్ఞానం! రెండోది ప్రాణం!

నా చిన్నప్పుడు, విశాలమైన ప్రాంగణంలో, పెద్దపెద్ద చెట్లు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మా పంతులమ్మలు ‘ఇంటికి వెళ్ళి ట్యూషన్లు చెప్పుకోవాలీ, ప్రైవేటు బడుళ్ళో క్లాసులు తీసుకోవాలీ’ అనే తొందర లేకుండా.... మా మీదే దృష్టి కేంద్రికరించి, మాకు విద్య నేర్పారు. ఆటల పోటీల దగ్గర నుండీ వ్యాస రచన వక్తృత్వ పోటీల దాకా.... పాటలు, నాటకాలు, ఏ కళారూపంలో పాల్గొనేందుకయినా ప్రభుత్వ ఖర్చే! సొంత ఖర్చులు పెట్టుకోవాలంటే ’వద్దు లేమ్మా!’ అనే ఆర్ధిక స్థితే మాది. అయిదో తరగతిలో ఉండగా, గుంటూరు నుండి విజయవాడకి పది రూపాయలతో ఎక్స్ కర్షన్ తీసుకువెళితే, అదో గొప్ప ఎగ్జైయిట్ మెంటు! బస్సు దిగి క్యూలో వెళ్ళి ప్రకాశం బ్యారేజీనీ, ఆకాశవాణినీ కళ్ళింతలు చేసుకుని చూసాము. గాంధీ కొండపైన గంతులు వేసాము.

అలాంటి చోట, వ్యాస రచన పోటీలో మొదటి స్థానంలో వచ్చినందుకు, నయా పైసా ఖర్చు లేకుండా, 45 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో, అప్పటికి చూడదగ్గ ప్రదేశాలుగా ప్రసిద్ది చెందిన అన్ని ప్రాంతాలనీ దర్శించాను. చివరికి క్షేమ సమాచారాలు తెలుపుతూ అమ్మానాన్నలకు వ్రాసే ఉత్తరం కోసం, పోస్ట్ కార్డు కూడా ప్రభుత్వమే ఇచ్చింది. ఒకో జిల్లానీ దాటుతూ.... పరిశ్రమలను, పర్యాటక స్థలాలనీ, పుణ్యక్షేత్రాలనీ.... అన్నిటినీ చూస్తూ బస్సులో వెళ్తుంటే, వెనక్కి పరిగెట్టే భూమిని చూస్తూ ‘ఈ రాష్ట్రం నాది, ఈ దేశం నాది, ఈ ధరిత్రి నాది’ అనుకుంటే గుండెలు పొంగేవి.

చిన్ని చిన్ని కథలతో కబుర్లు చెబుతూ, రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవ రావు గారు, మా చేత దేశభక్తి గీతాలు పాడించినప్పుడు, రోమాంచిత భావోద్వేగాలతో ఒళ్ళు పులకలెత్తేది. ఐస్ క్రీం కొనిచ్చిన అమ్మ మీద పాపాయికి ప్రేమ పుట్టి, బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది. అలాంటిదే అప్పటి నా అనుభూతి కూడా! "ఈ దేశం నాది, ఈ ప్రభుత్వం నా బాగోగులు చూస్తుంది" అనుకుంటే - ఎంత రక్షణగా [Secured] అన్పిస్తుంది!?

పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు గాను, నాకు జాతీయ ఉపకార వేతనం వచ్చింది. ఆ డబ్బు అప్పట్లో మంచి మొత్తమే! మా నాన్న "నీ డబ్బూ, నీ ఇష్టం" అన్నాడు. మంచి పుస్తకాలు, ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కున్నాను. అప్పటికి మా ఇంట్లో రేడియో చిన్నపాటి ట్రంకుపెట్టె అంత ఉండేది. నా ట్రాన్సిస్టర్ నేను ఎక్కడుంటే అక్కడ పెట్టుకునేదాన్ని! మేడపైనా, వంటగదిలో! ఎంత పిచ్చిగా వినే దాన్నంటే కార్మికుల కార్యక్రమాలతో సహా! ఆ చట్టాల సంఖ్యలన్నీ తెలిసిపోయాయి. ఆ జనరల్ నాలెడ్జితో వక్తృత్వ పోటీలకి గానీ, క్విజ్ పోటీలకి గానీ వెళ్తే, బహుమతి పొందిగానీ తిరిగి వచ్చే దాన్ని కాదు.

అలా ప్రభుత్వ సొత్తుతో చదువుకున్నప్పుడు కృతజ్ఞత ఉండటం సహజం కదా!

నేను డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుండగా మా నాన్నకి తొలిసారిగా గుండెపోటు వచ్చింది. సంక్రాంతికి అరిసెల పిండి కొడుతున్నాము. నొప్పితో వాలిపోతున్న నాన్నని, అమ్మ రిక్షా కట్టించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. మూడు రోజులు ఐసీయు లో ఉంచాక, నాన్న మాకు దక్కాడు. అప్పటికి ప్రైవేటు ఆసుపత్రులు ఇన్ని లేవు. ఉన్న వాటిల్లో వైద్యపు ఖరీదుని అందుకోగల ఆర్ధికస్థితి అప్పుడు మాకు లేదు. నాన్న వ్యాపారం అప్పుడు కొంత ఒడిదుడుకుల్లో ఉంది. అలాంటి స్థితిలో.... ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులూ, సిబ్బంది, మమ్మల్లేమీ లంచాలకై పీడించనూ లేదు, సేవలో అలక్ష్యమూ చూపలేదు.

ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి ముందునుండి ఎప్పుడు వెళ్తున్నా, ఆ భవనాలను చూసినా కృతజ్ఞతగా అన్పించేది. [అదే ఆసుపత్రిలో ఇప్పుడు మురికి, నాలుగో తరగతి ఉద్యోగుల దుర్భాషలూ, వైద్య వైద్యేతర సిబ్బంది లంచాల పీడింపు, ముక్కుకీ మనస్సుకీ కూడా దుర్గంధం వెదజల్లుతోంది.]

ఇది ఒక్క మా కుటుంబపు అనుభవమే కాదు. మా చిన్నమ్మ కూతురికి గుండెలో చిల్లు ఉండింది. నాకు ఏడెనిమిదేళ్ళప్పుడు ఆ బిడ్డ నెలల వయస్సుది. హఠాత్తుగా ఊపిరి సమస్యలు ఏర్పడి కళ్ళు తేలేసేది. మా చిన్నమ్మ అప్పటికప్పుడు బిడ్డని భుజన వేసుకుని రిక్షా ఎక్కేది. అప్పటికి ఆటోలింతగా లేవు.

ఆమె కేసుని చిన్నపిల్లల వార్డులో డాక్టరు ప్రత్యేకంగా చూసేవాడు. ఆపరేషన్ అవసరం లేకుండా, మందులతో తగ్గించేందుకు ప్రయోగపూర్వకంగా, వైద్య విద్యార్ధులకు డెమో గానూ కూడా పరిగణించేవాడు. అంత పసిబిడ్డకు ఆపరేషన్ క్లిష్టమైనది అన్నది మరో కారణం. అర్ధరాత్రి అపరాత్రి అయినా, ఏ స్థితిలో అయినా, ఆమెకు ప్రత్యేక పాసు వ్రాసి ఇచ్చారు. బిడ్దకు సమస్య తలెత్తగానే, తనకు ఫోన్ చేసి ఆసుపత్రికి రమ్మనే వాడు. మా చిన్నమ్మ బిడ్దను తీసుకొని ఆసుపత్రి చేరేలోగా ఆయన అక్కడ సిద్దంగా ఉండేవాడు. మొత్తానికీ జబ్బు నయమైంది.

ఇలాంటి ఎన్నో సంఘటనలు! అప్పటి డాక్టర్లలో చాలామంది, ‘తమని ప్రభుత్వం చదివించింది’ అన్నట్లుగానే సేవాభావంతో ఉండేవాళ్ళు. ఒక్క విద్యార్ది డాక్టరుగా బయటికి రావాలంటే తలకు ఐదులక్షలు ఖర్చువుతుందని అప్పటి లెక్కలు ఉండేవి. అంత ఖర్చు చేసి ప్రభుత్వం చదివిస్తుంటే, పట్టభద్రులయ్యాక డాక్టర్లూ, ఇంజనీర్లు విదేశాలకు వెళ్ళిపోతున్నారనీ, మేధో వలసలపై చర్చలూ నడిచేవి. కొందరు వలసలు పోయినా, మరికొందరు ప్రభుత్వ సర్వీసుల్లో చేరి, ఎంతోకొంత నిజాయితీగానే ఉండేవాళ్ళు; సేవాభావంతోనే పనిచేసేవాళ్ళు. ఇంతగా లంచాల మారితనం, అట్టడుగు పేదవాణ్ణి పీడించే దశ దాకా రాలేదు.

అదే ఇప్పుడైతే.... విద్యా, వైద్యమూ రెండూ కాసులుపోసి కొనుక్కోవలసిందే! వైద్య విద్య అభ్యసించడానికి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం డొనేషన్ 4 లక్షలు తీసుకోవాల్సిన చోట, 40 నుండి 70 లక్షల దాకా డొనేషన్ కట్టి చదవాల్సి రావటం, ఆ వ్యాపారం మీదే ప్రైవేట్ వైద్య కళాశాలలు యాజమాన్య కోటాలో సీట్లమ్ముకునేందుకు ముందుకు రావటం, అందుకు అనుమతులిచ్చేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా [MCI] ల అధినేతలు కేతన్ దేశాయ్ లు 2 కోట్లు రూపాయలు లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం.... నిన్న మొన్ననే సంచలన వార్తాగా చూశాం. సదరు కేతన్ దేశాయ్ ఇలా పట్టుబడటం తొలి అనుభవం కూడా కాదు. పట్టుకుంటే వేలకోట్లు అస్థులూ, కేజీల కొద్దీ బంగారమూ దొరికింది. ఆనక సిబిఐ వాళ్ళు అదంతా వదంతులే, అంత సొమ్ము దొరకలేదు, కొంత సొమ్ము దొరికింది అని కూడా అన్నారు లెండి!

అంత భారీగా వైద్య విద్యని అమ్మినప్పుడు, కొనుక్కున విద్యార్ధి వైద్యుడయ్యాక ఏం చేస్తాడు? రోగులంతా వాడికి నడుస్తున్న ఏటీఎంల్లా కన్పిస్తారు. అలాంటి వైద్యుడి స్కానింగ్ కళ్ళకి, రోగి ఒంట్లోని కిడ్నీలూ, ఇతర అవయవాలు డబ్బు కట్టల్లా కన్పిస్తాయి. అవసరం ఉన్నా లేకపోయినా పొట్ట కోసి ఆపరేషన్ చేస్తే తప్ప, పెట్టిన పెట్టుబడికి వడ్డీ కూడా గిట్టదనిపిస్తుంది. "ఎన్ని ఆపరేషన్లు చేస్తే, ఎన్నిఅనవసర పరీక్షలు చేస్తే, ఎన్ని ఖరీదైన మందులు కొనిపిస్తే.... తాము లక్షల్లక్షలూ, కొండకచో కోటీ, కోటిన్నర పెట్టి చదివిన చదువుకు తగిన నిష్పత్తిలో లాభం సంపాదించగలం?" అన్పిస్తుంది.

మనిషి ప్రాణం, శరీరం, రోగం... అన్నీ డబ్బులోకి తర్జమా అయిపోతాయి. ఇదే పరిస్థితి మరింతగా కొనసాగితే....! ‘ఇందరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారేం ఖర్మ! ఏ బర్డ్స్ ప్లూనో, చికెన్ గునియానో, మరో అంటు రోగమో ప్రబలితే బాగుణ్ణు’ అన్పిస్తుంది. సమాజ హితవు కోరాల్సిన వైద్యుడూ, ’వైద్యో నారాయణో హరీ!’ అంటూ భగవంతుడి ప్రతిరూపంగా గౌరవింపబడిన మేధావి, చివరికి ప్రజాహితవు గాక విపర్యయాన్ని కోరుకునే స్థితికి పోతుంది. ఎవరిని ఏమనాలి? విద్య, వైద్యం, వైద్యవిద్య, అన్నింటినీ అమ్ముతున్న ప్రభుత్వాన్నా?

"ఇంత డబ్బు ఖర్చు పెట్టాం. ఎప్పటికి తిరిగి రాబట్టుకోవాలి?" అనుకునే వారినా?

ఒకప్పుడు విశాలమైన ప్రాంగణంలో, చెట్లతో నిండిన పరిసరాల్లో, జిల్లా పరిషత్ పాఠశాలల్లో[అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కాకపోతే చదువులు చెప్పే పంతుళ్ళల్లోనే చాలామందిలో నిబద్దత లేదు.] చదువుకుని పైకి వచ్చిన వారిలో, ఇప్పటికీ తాము చదువుకున్న పాఠశాల ప్రాంగణం మీద సైతం ప్రేమ ఉంది. ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థల విద్యార్ధుల్లో, చదువుతున్న సమయాల్లో సైతం, ‘ఆ భావన ఉందా?’ అంటే సందేహమే! విద్యాసంవత్సరం చివరి రోజున పిల్లలు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు ధ్వంసం చేయటం, చేస్తారని యజమాన్యాలు ముందే జాగ్రత్త పడటం, చాలా ప్రైవేటు విద్యాసంస్థల్లో స్వయంగా చూసాను.

ఒక దుకాణంలో వస్తువులు నచ్చకపోతే మరో దుకాణానికి వెళ్తారు. సదరు కొనుగోలు దారునికి దుకాణం పట్ల, అవసరమే తప్ప అనుబంధం ఉండదు. వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఫీజులు కట్టి చదివిన విద్యార్ధులకీ, తమ విద్యా సంస్థలతో ఉండేవి అలాంటి అవసరమే, అనుబంధం కాదు! కళాశాలలో చివరి రోజు స్నేహితులతో వీడ్కొలు బాధ కలిగిస్తుందేమో గానీ, విద్యా సంస్థతో అనుబంధం అంకెల మధ్య కరిగిపోతుంది.

ఇక అలాంటి రూపాయిల వాసనలు వెదజల్లే వైద్య కళాశాలల్లో ఏపాటి మానవీయత మిగిలి ఉంటుంది చెప్పండి! అక్కడి నుండి బయటి కొచ్చే వైద్యులు కట్టే సూపర్ స్పెషాలిటి ఆసుపత్రుల్లో, అడుగుపెట్టిన క్షణం నుండి ’ఎంత ఖర్చువుతుందో’ అన్న భయమే మనస్సుని పీకుతుంది గానీ, భద్రతా భావం ఎక్కడి నుండి వస్తుంది?

కాబట్టే ’ఆరోగ్యశ్రీ’ పధకం అంతగా ప్రజలని ఆకర్షించింది. ప్రభుత్వ ఆసుపత్రులని భ్రష్టుపట్టించి, కార్పోరేట్ ఆసుపత్రుల వారికి ప్రజాధనం దోచి పెట్టటం అందులో మరో కోణం కావచ్చు గాక! జబ్బుతో, బెంగపడ్డ పేదవాడికి మాత్రం అ పధకం ధైర్యాన్నిచ్చింది. అమలులో ఎంత సఫలత ఉందో దైవానికెరుక! పధకం ప్రజలనాకర్షించటంలో ఉన్నది మాత్రం, అది మనిషి ‘ప్రాణం’ కావటమే!

ఖచ్చితంగా చెప్పాలంటే - ఇప్పటి ప్రభుత్వం, తాగి తందనాలాడుతూ, పిల్లల్ని పట్టించుకోని తల్లిదండ్రుల్లానే ఉంది. తమ స్వసుఖం, తమ స్వార్ధం తాము చూసుకుంటూ, బాధ్యత లొదిలేసి, నిరంతరం పరస్పరం నిందారోపణలు చేసుకుంటూ, వివాదాలు పడుతూ తల్లిదండ్రులుంటే - బిక్కముఖం వేసుకొని, బేలగా, బెంగగా బ్రతుకుతున్న పిల్లలాగే ఉన్నారు ప్రజలు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు.

ఇలాంటి కుటుంబాల నుండి వచ్చే పిల్లలు కసబ్ లూ, డేవిడ్ కోల్మన్ హెడ్డీలే అవుతారు. నిన్న - పాక్ కసబ్, భారత్ పై ముట్టడి చేసి ఉండొచ్చు గానీ, ఈ రోజు పాక్ కసబ్ లు పాక్ లోనే బాంబులు పేలుస్తున్నారు. అది ఏ దేశానికైనా వర్తిస్తుంది, భారత్ తో సహా! [అసలుకే సినిమాల్లో హీరో దొంగతనం, దోపిడిలు చేయటం కూడా ఒక ఫ్యాషన్ గా చూపిస్తున్నారు మరి!]

ప్రేమ పంచని, బాధ్యతలు నెరవేర్చని తల్లిదండ్రులు పట్ల పిల్లలకీ, ప్రేమ ఉండదు. దేశమైనా, కుటుంబమైనా అంతే! ప్రభుత్వమంటేనే ఒక వ్యవస్థ! పిల్లలకి తల్లిదండ్రులంటే ఎంత నమ్మకం, గౌరవం ఉంటాయో.... ప్రభుత్వం పట్ల ప్రజలకీ అంత గౌరవం నమ్మకం ఉండాలి. అది ఉండాలంటే తల్లిదండ్రుల్లానే ప్రభుత్వమూ, ప్రజల పట్ల తన బాధ్యత నెరవేర్చాలి.

అది లేనప్పుడు ’మాతృభూమిపై మమకారం ఎందుకు ఉంటుంది?’ స్వామీ వివేకానంద మతం గురించి చెబుతూ, "మతం మనిషి మానసిక అవసరాలని తీర్చాలి. ముక్కుపచ్చలారని చిన్నారి దగ్గరికి వెళ్ళి, కంఠ శోష వచ్చే దాకా మతం గురించి ఉపన్యాసం చెబితే ’మతం నాకు అల్లం మురబ్బా తెచ్చి పెడుతుందా?’ అంటాడు. ముందుగా ఆకలితో అలమటించే వాడికి అన్నం పెట్టు. తర్వాతే సిద్దాంతాలు చెప్పు" అంటారు. దేశభక్తి అయినా అంతే!

ఇంకా, ఇప్పటికీ.... ప్రపంచవ్యాప్తంగా

మనుష్యుల రక్తంలో ప్రేమాను బంధాలు ప్రవహిస్తున్నాయి గనుకా....

నరనరాలలో మంచిచెడుల విచక్షణ జ్ఞానం ఉన్నది గనుకా.....

కండరాలలో కట్టుబాట్లని తెంచుకోలేనితనం గట్టిపడి ఉన్నది గనుకా....

ప్రభుత్వాలు ఇంకా మనగలుగుతున్నాయి. ఇంతగా దోపిడి చేస్తున్నా, ఎక్కడి ప్రజలైనా ఇంకా సహిస్తూ, మంచికాలం వస్తుందని ఆశిస్తూ, వేచి చూస్తున్నారు.

ఎందుకంటే - ప్రభుత్వం అనే ముసుగుల మాటున కొనసాగుతున్న మోసాలు గురించిన సత్యం, ప్రజలకింకా పూర్తిగా అర్ధం కాలేదు గనుక! అది పూర్తిగా బహిర్గతమైతే ప్రభుత్వాధినేతలకి పతనం తప్పదు. సర్కోజీలకైనా, సోనియాలకైనా!

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పరిపాలన పేరుతో చేస్తోంది ప్రజాదోపిడినే అయినా, ఓర్చుకుంటూ వేచి చూస్తున్న సామాన్యుల మీద పీవీజీకీ, నెం.5 వర్గానికీ ఎంతో నమ్మకం!

సరిగ్గా ఈ అంశం మీదే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులకీ.... నెం.5 వర్గానికీ మధ్య మేధో యుద్దం నడుస్తోంది.

ఎలాగో వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

చాలా బాగా చెప్పారండీ!!
ప్రైవేటు పాఠశాలల్లో ఇవన్నీ గమనించేదెవ్వరూ?? పట్టించుకునేదెవ్వరూ??

చాలా చక్కగా వ్రాశారు.. మన మెథో వలస ఎందుకంటే విద్యార్థులలో సరైన నిర్వహనా సామర్థ్యాలు లేకపోవటం... అన్ని రంగాలలో మేనేజ్మెంట్ నాలుగేళ్ళు చదివించాలి... అప్పుడే వారు స్వంత కాళ్ళ పై నిలబడటానికి ప్రయత్నించేది

చాలా చాలా బాగా వ్రాశారు.

*చదువుకుని పైకి వచ్చిన వారిలో, ఇప్పటికీ తాము చదువుకున్న పాఠశాల ప్రాంగణం మీద సైతం ప్రేమ ఉంది.*
నేను నా చిన్ననాటి స్కూల్ కి ధన సహాయం చేద్దామనుకొని వేళితె అక్కడ పిల్లలే లేరు. అంటె ఒకప్పుడు 600 మంది ఉంటే ఇప్పుడు 60 మంది ఉన్నారంతే

నాకు కూడా నేషనల్ మెరిట్ స్కాలర్షిప్పు వచ్చింది. 11 వతరగతి మార్కులమీద ఆధారపడి ఇంజనీరింగ్ కోర్సు 5 సంవత్సరాలూ నాకు స్కాలర్షిప్ వచ్చింది. మొదటి సంవత్సరం Rs. 1050, తరువాతి సంవత్సరాల్లో Rs. 1320 చొప్పున వచ్చింది.
ఇప్పటికీ ఊరికెళ్ళినపుడు మేము చదువుకున్న ఎలిమెంటరీ స్కూలు ( ఇప్పుడు మూత పడి వున్నది ) బిల్డింగ్ ప్రక్కనుంచి వెళుతున్నా , మేము మా శ్రమదానంతో స్లాబు వేసికున్న మిడిల్ స్కూల్ ప్రక్కనుండి వెళ్తున్నా ఆ రోజుల్లోని విషయాలు జ్ఞాపకం వస్తుంటాయి. అప్పటి మాష్టార్లు అందరూ గుర్తుకొస్తుంటారు. చాలా బాగా వ్రాస్తున్నారు. మీకు మేము అభిమాన పాఠకులం. చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా గూఢచర్యం గుఱించి. కొనసాగించండి.

భాస్కర రామరాజు గారు:అవునండి. విద్య, వైద్యం ప్రైవేటీకరించబడకూడదు. నెనర్లు!

రాజు గారు:కావలసింది నిబద్దతా,నిజాయితీలండి. కొత్త నిర్ణయాలు కాదు. నెనర్లు!

అన్వర్ గారు:నెనర్లండి.

అజ్ఞాత గారు:నిజంగా బాధనిపిస్తుందండి అలాంటివి చూసినప్పుడు.నెనర్లు!

నరసింహ[వేదుల బాలకృష్ణమూర్తి] గారు: మనం చదువుకున్న బడి మనకి అమ్మఒడి లాంటిదేనండి. అలాంటి బడి మూతబడి ఉంటే చాలా బాధేస్తుంది. మీ అభిమానానికి కృతజ్ఞతలండి.

వ్యాసం చాలా బాగుంది సందేహం లేదు కానీ ప్రభుత్వానికీ ప్రజలకీ మధ్య సంబంధం పరస్పరాధారితాలు.నీతిగా బతకడానికి అవకాశం ఇవ్వని ప్రభుత్వాలు గురించి మీరు చెప్తుంటే నీతిగా ఉండేందుకు కష్టపడలేని ప్రజలు నాకు గుర్తుకొస్తున్నారు(నేనైనా ఆ తానులో ముక్కనే లెండి).ఇలాంటి ప్రజలకు నిస్స్వార్ధమైన నాయకులని కోరుకునే హక్కు లేదు,అంత గొప్ప నాయకుణ్ణీ వాడి నిజాయితీని భరించే దమ్ము కూడా లేదు.అంతెందుకు కులం ప్రాతిపదికను వదిలి డబ్బు తీసుకోకుండా ఓటెయ్యమనండి చూద్దాం.
--సంతోష్ సూరంపూడి

సంతోష్ గారు: పచ్చి నిజం చెప్పారండి. నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu