ఇక మున్నుడిలో రచయితగా పీవీజీ....
>>>ఈ సందర్భంలో కొన్ని ముఖ్యాంశాలు మనవి చేయాలనుకున్నాను. ఈ రచన ఆత్మ చరిత్ర కాదు. కాల్పనిక రచన వలె రచయిత స్వచ్ఛంద ఊహలను అనుసరించేదీ కాదు. ఇది కల్పనాయదార్ధాల సమ్మిశ్రణ సమన్వయాలతో రూపొందింది. భాగస్వామి, సాక్షి, కథాకారుడు, విమర్శకుడు - రచయిత ఈ నాలుగు పాత్రలను ఒకే సమయంలో పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విశిష్ట నేపధ్యంలో ఇదా, ఆదా, అనే మీమాంస రచనను పుట్టుకతోనే వెన్నాడుతూ ఉంది. దేశస్వాతంత్ర్యోద్యమంలో తుది ఘట్టం నుండి నేటి వరకు లోపలి మనిషిగా రాజకీయ సాంఘిక వికాసక్రమాన్ని సాధ్యమైనంత వ్యక్తి నిరపేక్షంగా పరిశీలించిన వాణ్ణి కనక ఈ రచనా సౌధం గట్టి నేలపై నిలుచుని ఉందనగలను. రాబోయే కాలంలో ఆఘాత విస్మయాలు కలిగించే అనేక సమస్యలను దేశం, ప్రపంచం, ఎదుర్కొనబోతున్నాయి. అందుకని ఈ రచనా వస్తువు అనంతంగా ఉంటుంది; అనంతమైన నూతన రచనల సృష్టికి అవకాశాలు కల్పిస్తుంది. ఇది నిస్సందేహం. ఈ ఒరవడిలో ప్రారంభ ప్రయత్నాలలో ఆవిర్భవించినందుకు లోపలి మనిషి తన భాగ్యానికి సంతోషిస్తున్నాడు.

2005, అక్టోబరులో ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ ఫిర్యాదుని ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇచ్చాక, ఈ పుస్తకాన్ని తొలిసారిగా చదివాను. ఈ పేరాలో పీవీజీ వ్రాసిన తొలి వాక్యాలు అప్పుడెక్కువగా అర్ధమయ్యాయి. అయితే తొలి వాక్యాలతో పాటు ఈ పేరాలోని చివరి వాక్యాలు కూడా, అప్పటి కంటే ఇప్పుడు, ఇంకా బాగా అర్ధమయ్యాయి.

రాబోయే కాలం గా ఆయన చెప్పిన భవిష్యత్తు, ఇప్పటికి మనకు వర్తమానంతో ప్రారంభమై భవిష్యత్తులోనికి కొనసాగనుంది. ఆ ఆఘాత విస్మయాల రంగు రుచి వాసనా కొందరికి ఆశ్చర్యం, నమ్మకం కలిగిస్తే, కొందరికి నవ్వు కలిగిస్తోంది. ఎవరి విజ్జత వారిది కదా!

లోపలి మనిషి రచనా వస్తువు అనంతంగా ఉంటుందనీ,అనంతమైన నూతన రచనల సృష్టికి అవకాశాలు కల్పిస్తుందనీ పీవీజీ అన్నాడు. అది నిస్సందేహమని కూడా అన్నాడు.

అవును, అది నిశ్చయంగా నిస్సందేహం!

ఎవరు ఎంతగా పెనుగులాడినా ఆపలేని సత్యావిష్కరణం!

>>>కావునా ఫలానా పాత్ర ఎవరు? రచయిత ఫలానా పాత్రలో తన ఆత్మచరిత్రను చొప్పించాడా? లాంటి ప్రశ్నలకు నేరుగా ప్రత్యుత్తరాలు ఈ రచనలో లభించవని రచయిత మనవి. పాత్రల పరికల్పనకు ఆధారభూతమైన అంశాలను ఉల్లేఖించి, అసలు చెప్పదలచిన విషయంపైకి పాఠకుల దృష్టిని మళ్ళించే ఉద్దేశంతోనే ఈ వివరణ వాక్యాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

లోపలి మనిషిలో పీవీజీ .... భారత దేశంలో.... "1960, 70లలో కేంద్రంలో అధికార పార్టీ[కాంగ్రెస్] సామాజిక మార్పు కోసం అనేక రంగాలలో అవలంబించనున్న విధానాలను, అమలు ప్రణాళికలను రూపొందించింది. అమలు చేసే బాధ్యత రాష్ట్రాలపై ఉండింది. ఏ రాష్ట్రమైనా ఒకటే అనే ఉద్దేశంతో భారత దేశంలోని రాష్ట్రాలకు ప్రతీకగా అఫ్రోజాబాద్ ను ప్రస్తావించటం జరిగిందని" చెప్పాడు.

అలాగే రాష్ట్రంలో పదవుల కోసం కుమ్ములాడుకునే రాజకీయ నాయకులని, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మహేంద్రనాధ్, చౌదరి పాత్రలకు అలియాస్ చేసేసాడు. సీట్ ఎక్కేందుకు చేసే రాజకీయాలనీ, ఎక్కాక చేసే అక్రమాలనీ దృష్టితో ఉంచుకుంటే - ఎవరైనా ఒకటే! కాబట్టే..... ’ఎవరైనా ఒకటే - చౌదరి!’ అన్నట్లన్నమాట. అందుచేతే పాత్రల గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపనన్నాడు.

ముఖ్యంగా లోపలి మనిషిలో నన్నాకర్షించిన పేజీలూ, పేరాలూ ఇవి....
675 వ పేజీలో:
>>>కామ్రేడ్ బెనర్జీ అలా మాట్లాడుతూనే ఉన్నాడు. అతడి గొంతు బిగ్గరగా, మరింత బిగ్గరగా వినిపిస్తోంది. అతడి స్వరం మరీమరీ నిందాపూరితంగా మారుతోంది. అతడి మాటలకు చెవియొగ్గడమే తను చేసిన తప్పు అనుకున్నాడు ఆనంద్. ఒకసారి వాళ్ళకు నిర్బంధ శ్రోతలుగా చిక్కిపోయామంటే, ఈ యువతీవ్రవాదులు ఓ పద్దతిలో మనమీద దాడి ప్రారంభిస్తారు. ఎంత సేపూ వ్యతిరేక ధోరణితోనూ, విధ్వంసదృష్టితోనూ ఉంటారు తప్ప ఇదీ ప్రత్యామ్నాయమంటూ ఒక్క సూచన కూడా చేయరు.... అయితే బెనర్జీని తప్పుపడుతున్నాడే కానీ, తనది ఒప్పని తనూ రుజువు చేసుకోలేకపోయాడని ఆనంద్ గ్రహించాడు. బెనర్జీ నిరంతరాయంగా, నిర్ధాక్షిణ్యంగా తన దాడిని కొనసాగించాడు.

676 వ పేజీలో:
>>>అయితే దేశమంత జల్లెడలోని కంతలను పూడ్చడానికి ప్రయత్నిస్తూ మీరు మీ జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారని నాకనిపిస్తోంది. ఇలా అంటున్నందుకు బాధగానే ఉంది, కానీ మీరు తప్పకుండా విఫలులౌతారు. తమ భూముల్ని.... తమ హోదాను గుంజుకునే ప్రయత్నం చేసినందుకు వాళ్ళు మిమ్మల్ని కచ్చితంగా శిక్షిస్తారు.... మీ నిజాయితీకి శాస్తిగా ఉరికంబమెక్కిస్తారు. తొందరపడండి ఆనంద్ జీ, మీ జీవితాన్ని కాపాడుకోవడానికి తొందరపడండి; అర్ధవంతమైనదేమైనా చేయండి. ఈ భూసంస్కరణల ప్రహసనంలా విఫలమయ్యేదైనా సరే, ఒక ద్రష్టకు తలతూగే పని ఏదైనా చేయండి. మీ బుద్ది కౌశల్యాన్ని ఎవరూ లెక్క చేసే వారుండరు. వాళ్ళు మిమ్మల్ని పక్కకి విసిరి కొట్టే లోపల, మీలోని నిజమైన మూర్తిని ధ్వంసం చేసి, మీరు మరెప్పటికీ లేవకుండా మీ మీదికి తప్పుడు ప్రజాభిప్రాయమనే వేట కుక్కల్ని ఉసిగొలిపే లోపల తప్పించుకోండి. మీ స్వప్నాలనూ, మీ స్వాప్నికతనూ రక్షించుకోండి! కదలండి, కదలండి! మూర్ఖులు కాకండి!’

కామ్రేడ్ బెనర్జీ ముఖతః తనకు వినిపించినట్లుగా ఆనంద్ [లోపలి మనిషి] ఇదంతా చెప్పాడు. ‘దేశమంత జల్లెడలోని కంతలను పూడ్చడానికి ప్రయత్నిస్తూ మీరు మీ జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారని నాకనిపిస్తోంది’.... ఇప్పటికీ రామోజీరావు, మా మీద, చాలాసార్లు, ‘కామ్రేడ్ బెనర్జీ వాదన’లనే ప్రయోగించాడు, ప్రయోగిస్తూనే ఉన్నాడు.

>>>చెవుల్ని హోరెత్తించే ఉద్బోధలకూ, ఆరోపణల జడివానకూ ఆనంద్ వణికిపోయాడు. తల బద్దలైపోతుందా అనిపించిందతనికి. మరుక్షణమే అంతా నిశ్శబ్ధం. తుపాను వెలసిన తరువాత అలముకున్న ప్రశాంత స్థితి.... సముద్రం, ముందెన్నడూ ఎటువంటి కల్లోలమూ ఎరుగదా అన్నంత నిశ్చలంగా మారిపోయింది. ఉదయభానుడి కిరణాలు సోకి తీరం ధగధగా మెరిసిపోతుంది. ఓ అందమైన బాలిక తన వైపు పరుగు పరుగున వస్తూ కనిపించింది. అతడు ముందుకు వంగి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన చేతుల్లో ఆమె అతివేగంగా, నమ్మశక్యం కానట్టుగా, ఎంతో రమణీయంగా విప్పారుతున్నట్టనిపించింది. తన కళ్ళు భరించలేనంత దేదీప్యమానంగా వెలిగిపోతోంది.... హఠాత్తుగా అతడికి స్ఫురించింది.... ఆమె తన మరోసగం, తనకెంతో బాగా తెలిసిన, తన జీవిత పర్యంతము తెలిసిన, ఒక జన్మలో కాదు, ఎన్ని జన్మలో తనకే తెలియని అనేక జన్మల నుండి తన జీవనానుభూతికి మాత్రమే తెలిసిన తన మరోసగం!


అనంద్ రెప్పలు కిందికి వాల్చాడు. ఆ ప్రకాశాన్ని సూటిగా చూడగలగడం తనకు అసాధ్యమనిపించింది... అది ఒక భౌతిక రూపమో, రూపరహిత ఆకారమో అతడే తేల్చుకోలేకపోయాడు. దాని ఉనికి మాత్రం అతడి అనుభూతికి అందుతోంది. తన దేహాత్మలతోనే కాదు, వాటి కతీతమైన స్థితిలో కూడా అతడికది అనుభవంలోకి వస్తోంది.

తనెన్నడూ విని ఎరుగని మృదుమధురమైన ఓ దివ్యవాణి అతడికి వినిపించింది... దేవ లోకం నుండి తేలివస్తున్న హాయి గొలిపే ఒక జోల పాటలా, నిర్భయాన్నీ నిబ్బరాన్నీ కలిగించే అమ్మ నోటి పాటలా అది వినిపించింది. ’కలవరపడుతున్నావా?’ తేనే లొలికే స్వరంతో ప్రశ్నిస్తున్నట్లు వినిపించింది. ఏం చెప్పాలో అతడికి అర్ధం కాలేదు.

ఆ తర్వాత ఆమె తన చెవిలో గుసగుసలాడుతున్నట్టనిపించింది. ’మరీ అంత కలత పడి పోతావేం! అది చాలా చిన్నవిషయం.... ’ఎవరో స్పృశించిన అనుభూతి కలిగిందతనికి.... మళ్ళా అదే గొంతు వినిపించింది. ఎంతో క్లుప్తమైన, బిగువైన పరిష్కార సూత్రం తక్షణమే అతడి స్ఫురణలోకి వచ్చేసింది. ’అర్ధమైందా?’ కొండంత ధైర్యాన్ని ప్రసాదిస్తూ అడిగింది ఆ స్వరం. అవునవును, అర్ధమైంది.... ఎంత సరళమైన పరిష్కారం! భగవంతుడా! నిజంగా ఎంత సరళమైన తరుణోపాయం! కృతజ్ఞుణ్ణి, కృతజ్ఞుణ్ణి! కృతజ్ఞుణి!’ ప్రతీసారీ బిగ్గరగా మరింత బిగ్గరగా తన మరోసగంతో అన్నాడు. అంతలో హఠాత్తుగా కళ్లు తెరుచుకున్నాయి.

~~~~~

1992 జూన్ లో, నేను పీవీజీకి రామోజీరావు కార్యకలాపాల గురించి ఫిర్యాదు ఇచ్చేనాటికి పీవీజీ చుట్టూ.... పరిస్థితులూ, పీవీజీ సహచరులూ.... ప్రతీ ఒక్కటీ, ప్రతీ ఒక్కరూ, ఒక్కొక్క కామ్రేడ్ బెనర్జీ లాగే ఉన్నారు. చుట్టూ కమ్ముతున్న సమస్యలలో.... సమస్యల మూలకర్తా, సృష్టికర్తా ఎవరో తెలియకుండానే పోరాడుతున్న పీవీజీకి, రామోజీరావు గూఢచర్య అస్తిత్వం అర్ధం కాగానే, తన సుదీర్ఘ అనుభవానికీ, అన్వేషణకీ అది తిరుగులేని విధంగా ’ఫిట్’ అయ్యింది. ఇందిరాగాంధీతో సహా తాము, దశాబ్దాల పాటు పోరాడిన అనుభవానికీ, అవగాహనకీ, నూరు శాతం ‘confirm’ అయ్యింది.

అప్పటికి అచ్చం కామ్రేడ్ బెనర్జీ లాగే పరిస్థితులూ, వ్యక్తులూ కూడా, సర్వవైఫల్యాలకీ తనని బాధ్యుణ్ణి చేయ ప్రయత్నిస్తున్నదీ, దేశాన్ని అన్నివిధాలా కుప్పకూల్చి ఆ దుష్కర్తిని తన భుజాన ఉంచడానికి గూఢచర్యం ఎంతో బలంగా పనిచేస్తున్నదీ కూడా, పూర్తిగా స్పష్టపడింది. మరుక్షణం ఆ యోధుడు రెట్టించిన పటిమతో పోరాటాన్ని కొనసాగించేందుకు సిద్దపడ్డాడు. అప్పటికి నేను సీల్డ్ కవర్ లో పెట్టి ఇచ్చిన ఫిర్యాదు, ఆయనకి తిరుగులేని పరిష్కారాన్ని చూపించినట్లయ్యింది.

1992 నాటికి పీవీజీకి 72 ఏళ్ళు. ఆయన మనుమరాలి వయస్సు నాది. అందుకే ’తాతా’ అని పిలుచుకునేదాన్ని, ఉటంకించుకునేదాన్ని. అంతగా ఆత్మీయత పెంచుకున్న పీవీజీ... నాకు సిరిసంపదలో, బిరుదు సత్కారాలో తవ్వి తలకెత్తకపోతే పోయే... కనీసం నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వటం లేదని, 1993 నుండి 1995 వరకూ ఆక్రోశించాను. నమ్మి ’తాతా’ అని ఆప్యాయంగా అనుకుంటే, నట్టేట ముంచుతున్నాడని తిట్టుకున్నాను. వ్యతిరేక భావనలతో ఊగిపోయాను.

అయితే 2005లో పీవీజీ ’లోపలి మనిషి’ చదివాక నాకు చాలా స్పష్టత వచ్చింది. ఆయన నన్ను ఎంత గౌరవించాడో, నాకు ఎంతగా కృతజ్ఞత చెప్పాడో అర్ధమైంది.

తన చేతులతో, తన శిక్షణలో విప్పారిన బాలికగా ఆ లోపలి మనిషి, నన్ను తన సగభాగంగా గుర్తించి గౌరవించాడని భావించాను. ఇంతకంటే మరింకేదీ నాకు గొప్ప గౌరవం అని నేను అనుకోను. ఈ దేశపు సామాన్యరాలిగా ’ఇచ్చట బుట్టిన జిగురు కొమ్మైనా చేవ’ అంటూ.... ఆ రోజున నేనిచ్చిన ఫిర్యాదు చాలా చిన్న సమాచారం మాత్రమే! సదరు రామోజీరావు తాలూకూ గూఢచర్యంగానీ, నకిలీ కణిక అనువంశీయుల గూఢచర్యం గానీ ఎంత విస్తారమైనదో, లోతైనదో నాకేమీ తెలియదు.

ఏది ఏమైనా అతడు చేస్తోన్నది ‘ధర్మగ్లాని, దేశద్రోహం, పసిబిడ్డల పట్ల సైతం అమానుషం’ అనుకున్నానే తప్ప, అది గూఢచర్యంతో కూడుకున్నదని నాకు తెలియదు! [తెలిస్తే ఫిర్యాదు ఇచ్చి ఉండేదాన్ని కాదా?" అని కూడా అప్పుడప్పుడూ తర్కించుకుంటాము. ‘తెలిసినా వెనక్కి తగ్గి ఉండేదాన్ని కాదు’ అని ఖచ్చితంగా చెప్పగలను.]

అలాంటిది, చిన్న సమాచారాన్ని ఇచ్చినందుకు, ఆ లోపలి మనిషి.... సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ఈ అమ్మాయిని ’తన కెంతో బాగా తెలిసిన, తన జీవిత పర్యంతమూ తెలిసిన, ఒక జన్మలో కాదు, ఎన్ని జన్మలో తనకే తెలియని అనేక జన్మల నుండి తన జీవానానుభూతికి మాత్రమే తెలిసిన తన మరోసగం’గా గుర్తించటం! ఇంతకంటే సఫలత, గౌరవం ఇంకేదీ లేదనుకుంటాను.

అందుకే, 1992లో ’రక్త సంబంధం కంటే భావ సంబంధం గొప్పది’అని మాకు చెప్పబడిందన్నది అర్ధమైంది. ఇంత గౌరవాన్నిచ్చిన ఆ ’లోపలి మనిషి’, కేవలం గౌరవంతో సరిపెట్టలేదు, తన కృతజ్ఞతగా.... జీవితకాలం పాటు తాను చేసిన సాధనని, సాధించిన జ్ఞానాన్ని మాకు బహుమతిగా ఇచ్చాడు. ఇంతకంటే విలువైన బహుమతి, కృతజ్ఞత మరింకేవీ ఉండవని నేను అనుకుంటాను. ఎందుకంటే జ్ఞానం అంత పవిత్ర వస్తువు ఈ లోకంలో మరేదీ లేదంటుంది గీత. జ్ఞాని అంటే తానేననీ, జ్ఞానికీ తానూ, తనకి జ్ఞానీ కనబడక పోడనీ అంటుంది.
అంతే కాదు,

శ్లోకం:
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః
భావం:
తాత్వికులైన వారిని వినయంతో సేవించీ,ప్రార్దించీ - జ్ఞానాన్ని తెలుసుకోవాలి.

శ్లోకం:
న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే
తత్స్వయం యోగ సంసిద్దః కాలేనాత్మని విందతి
భావం:
జ్ఞానాన్ని మించింది ఏదీ లేదు. కర్మయోగి సిద్దిని పొందిన వాడు, కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తన యందే తెలుసుకుంటున్నాడు.

తత్త్వజ్ఞానం కలవారిని వినయంతో సేవించి, ప్రార్దించి తెలుసుకోవలసిన జ్ఞానాన్ని, కర్మయోగ సిద్దిని పొంది కాలక్రమాన తమయందే తెలుసుకోవలసిన జ్ఞానాన్ని, అనివార్య పోరాట మార్గాన నడిపించి, కర్మ యోగ సాధనతో... తన జీవిత పర్యంతపు సాధనతో, తానూ పొందిన జ్ఞానాని, అవగాహనని మాకు సంక్రమింప చేసాడు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది మాకు అయాచిత సంపద.

నేను చేసిన గోరంత మేలుకి, కొండంత కృతజ్ఞతగా.... గూఢచర్య జ్ఞానాన్ని, ఇతిహాసాలని జీవితానికి అనువర్తించుకోగల విజ్ఞతనీ, గీతని సాధన చేయగల మార్గాన్ని మాకు ధారాదత్తం చేసాడు. విశ్లేషణా శక్తిని పెంచాడు. కొత్త కొత్త కాన్సెప్ట్స్ ని పరిచయం చేసాడు. జీవితాన్ని ఎలా చూడాలో తెలియ చెప్పాడు. మేం చేసింది తక్కువ. పొందింది ఎక్కువే!

నిజానికి పీవీజీకి తరువాతి తరంగా, ఆయన ప్రారంభించిన మెదళ్ళతో యుద్దం తాలూకూ ఆయన భావ వారసత్వాన్ని కొనసాగించటాన్ని అదృష్టంగా భావిస్తాను. పీవీజీ మాపట్ల గౌరవం, కృతజ్ఞతలే కాదు, నమ్మకాన్ని కూడా చూపించాడు. ఎంత నమ్మకం లేకపోతే.... మమ్మల్ని తమ out let గా రామోజీరావుకి చూపుతాడు? ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎంత వేధింపుకి గురైనా ’అవినీతిలో పొర్లాడం, అవినీతిపై పోరాటం ఆపం’ అనే నమ్మకం అది! యుద్దంలో సైన్యాధిపతి తన సైనికుడి మీద పెట్టుకునే నమ్మకం అది!

ఇది అర్ధమయ్యాకే, మెదళ్ళతో యుద్దాన్ని మేం ఆస్వాదించటం నేర్చుకున్నాం. పరిస్థితులు విషమించి, దారీ తెన్నూ కనబడనప్పుడూ, నిరాశా నిస్పృహలు ఆవరించినపుడూ, ఇది గుర్తు తెచ్చుకుని తిరిగి స్ఫూర్తి పొందుతుంటాము. ఆ నేపధ్యంలోనే "Do not under-estimate the strength and wisdom of our people" అన్న పీవీజీ డైలాగ్, మా చెవుల్లో నిశ్శబ్దంగా మార్మోగుతుంటుంది.

నిజానికి ఈ భావసంబంధం, దృక్పధ వారసత్వం, వారసత్వపు కొనసాగింపుపై నమ్మకం, ఆత్మీయ అనుబంధమూ.... కేవలం పీవీజీకీ మాకూ మధ్య మాత్రమే లేదు. తరతరాలుగా ఈ గడ్డమీద జన్మించిన మహానుభావులు, బాపూజీ, వివేకానందుడూ, చైతన్యుడూ, శంకరుడూ, గౌతమ బుద్దుడూ.... ఎందరి పేర్లని చెప్పగలను? ఆ మహాత్ములకీ, ‘ఈ దేశం, హిందూ మతం, సనాతన ధర్మం, ఈ భారతీయ సంస్కృతి నాది’ అనుకునే ప్రతీ వ్యక్తికీ, మధ్య ఉన్నదీ ఆ నమ్మకమూ, అనుబంధమే!

ఈ గడ్డపై పుట్టి, ‘ఈ సంస్కృతి, ఈ మతం నాది’ అనుకునే ప్రతీ హిందువూ.... శ్రీరాముడికీ, శ్రీకృష్ణుడికీ వారసుడే! కాబట్టే ఒకప్పుడు భారతీయులు వంశ గౌరవానికీ, కుటుంబ పరువు మర్యాదలకీ ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాళ్ళు. కళారూపాలన్నీ ఇతిహాసాల మీద ఆధారాపడి ఉన్నంత కాలమూ ఆ ప్రాముఖ్యానికీ, ఆ భావసంపదకీ నష్టం వాటిల్లలేదు. క్రీడలన్నిటికీ క్రికెట్ ఏకైక రూపాంతరమైనట్లుగా, ఎప్పుడైతే కళారూపాలన్నిటికీ సినిమా ఏకైక ప్రత్యమ్నాయామయ్యిందో.... ఆ తర్వాత మెల్లిగా... ‘యువతీ యువకుల మధ్య ప్రేమ, తల్లిదండ్రులతో ఘర్షణ’ ల మీద ఆధారపడిన కధాంశాలతో... తరాల అంతరం పేరుతో... వంశ, కుటుంబ పరువు మర్యాదలకి తిలోదకాలు వదలటం ప్రారంభమయ్యింది.

తల్లిదండ్రులకీ, సోదరీ సోదరులకీ మధ్య ఉండేది ప్రేమకాదు, కేవలం యువతీ యువకుల మధ్య ఉండేదీ, పెళ్ళికి [లేదా శారీరక సంబంధానికి] దారి తీసేది మాత్రమే ప్రేమ అని చెప్పబడింది. నిష్టూరమైనా నిజమే చెప్పాల్సి వస్తే... కామమే ప్రేమగా వర్ణించబడింది. ఎంతగా అంటే - ప్రేమించలేదని యువతిపై యాసిడ్ చల్లిన ప్రేమోన్మాది అనేంతగా! అలాంటి వాడిని ప్రేమోన్మాది అనాలా, కామోన్మాది అనాలా? సరే, ఈ విషయాంతరం వదిలి, శ్రీరాముడు మనకి చూపిన వారసత్వపు బాట దగ్గరికి వస్తాను.

ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

I am reading this blog from yesterday..
I found it very interesting.. and thanks for showing the real man in Pamulaparti Venkata narasimha rao gaaru.. I am one of the admirer's for him.

hacking EVMs
http://www.youtube.com/watch?v=K1yJy7SxU5A

అంకుర్ గారు: కృతజ్ఞతలండి. నా బ్లాగులో అన్ని టపాలు ఒకేచోట సూచికగా ఉన్నాయి. చదవగలరు.

అజ్ఞాత గారు: లింక్ ఇచ్చినందుకు నెనర్లండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu