మేము 1993 నుండి 1995 వరకూ, శ్రీశైలం పాతాళ గంగ మెట్ల దారిలో నివసిస్తున్నప్పుడు....

అక్కడందరూ బెస్తలూ, గిరిజనులూ! చేపలు పట్టుకునీ, యాత్రికులని బుట్టీ మీద నదిలో షికారుకు తీసుకెళ్ళి, అడవిలో కట్టెలు కొట్టుకుని తెచ్చి అమ్ముకునీ జీవించే వాళ్ళు. వాళ్ళలో చాలామందికి అప్పటికి రైలు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళకీ కేబుల్ టీవీలూ, డీవీడీలు, సెల్ ఫోన్లూ చేతి కొఛ్చాయి లెండి. అప్పటికైతే శ్రీశైలం - సున్నిపెంట తప్ప, చాలామంది మరే ఊరూ పోలేదు.

ఓ సారి ‘గుడిసెలు పీకేయిస్తారట!’ అన్న పుకారు వదలి, హైదరాబాద్ లో జరిగే ఎర్రపార్టీ ర్యాలీకి అక్కడి జనాలని లారీలో తీసుకెళ్ళారు. అప్పుడు నగర రద్దీని చూసి చాలామంది భయపడ్డారనీ, బస్సులకి అడ్డదిడ్డంగా పరుగులెత్తి బెంబేలు పడ్డారనీ, తిరిగి వచ్చాక వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు ఎకసెక్కాలాడుకున్నారు. అంతగా వాళ్ళకి తమ బ్రతుకు, తమ చుట్టూ ఉన్న పాతాళ గంగ మెట్లు, శ్రీశైలం గుడితో మూడిపడిన తమ లోకం తప్ప, బయటి ప్రపంచం తెలీదు.

యాత్రికుల రద్దీ ఉండే పండుగలూ, కార్తీక మాసం వంటి రోజులలో వాళ్ళంతా ఉదయం నుండీ రాత్రి వరకూ బిజీగా ఉంటారు. యాత్రికులంతగా రాని ’అన్ సీజన్’ లో తీరిగ్గా, జీవితాన్ని ఆనందిస్తారు.

అలాంటి సమయంలో ఓ రోజు.... మేము అయ్యవారి[మల్లయ్య స్వామి] ఏకాంత సేవ దర్శనం చేసుకుని, రాత్రి పదిగంటలకు మా గుడిసె చేరాము. అప్పటికి గంగ మెట్ల మొదటిలో పాతాళీశ్వరాలయం ముందు చాలామంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అడవి నుండి వచ్చే చల్లని గాలి! మెట్ల మీది గుడిసెల్లో ఒకామె ఉండేది. దాదాపు 26 ఏళ్ళు వయస్సుంటుంది. ముగ్గురు పిల్లలు! వరుసగా అయిదేళ్ళ అమ్మాయిల నుండి ఏడాది వయస్సు పిల్లవాడు దాకా! భర్తా, చెల్లి కుటుంబంలోని మగవాళ్ళందరూ నిర్భాధ్యులు. ఈమె మెట్ల మీద బెస్తలకి సారా అమ్మేది.

శ్రీశైలంలో మద్యపానం నిషేధం. అధికారులూ, డబ్బులున్న ఉద్యోగులూ, వ్యాపారులూ సున్నిపెంట నుండి గానీ, బయటి నుంది గానీ రహస్యంగా ఖరీదైన మద్యం సేకరించి తాగేవాళ్ళు. మెట్ల మీది బెస్తలు దొంగసారా, నాటు సారా తాగేవాళ్ళు. ఈమె ఓసారి తుమ్మలబైలు నుండి రెండు చేతులా పదేసి లీటర్ల సారా క్యాన్లు మోస్తూ.... అర్ధరాత్రి అడవికి అడ్డం పడి వచ్చింది. తర్వాతి రెండు రోజులు ధూం ధాం గా వ్యాపారం చేసింది. ఎప్పుడైనా సరే..... వాసన పసిగట్టినట్లే వచ్చి, పోలీసులు మామూళ్ళ పట్టుకెళ్ళేవాళ్ళూ. మద్యమూ తాగిపోయే వాళ్ళు. మొదట్లో ఆమెని చూచి నాకు చాలా ఏహ్యత కలిగేది.

ఓ రోజు పిల్లల్ని వదిలేసి రెండురోజులు ఎక్కడికో పోయింది. ఓ రోజుటికి అన్నం వండి పెట్టి పోయిందట. రెండో రోజుకీ తల్లిరాక పోయేసరికి పిల్లలు ఆకలికి ఏడుస్తూ, పాతాళీశ్వరాలయంలో పడి ఉన్నారు. చిన్నమ్మ ఉన్నా కూడా ఉపయోగం లేదు. ఆవిడ తింగరిది. ఏడాది పిల్లాడు తల్లిపాలు తాగుతున్న వాడే! ఆకలికి జ్వరం వచ్చి పడున్నాడు. మా ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే ఆ పిల్లలకి పెట్టాను. పెద్దపిల్ల మా దగ్గర అక్షరాలు నేర్చుకున్న బుడ్డీనే! ఆ పిల్ల చెప్పిన వివరాలతో ఆ తల్లి మీద నాకు మరింత కోపం వచ్చింది. ఏం చేస్తాం? ఆ తల్లినీ, పిల్లల్నీ పరిశీలించే వాళ్ళం.

తరచి చూస్తే.... ముగ్గురు పిల్లలు, తింగరి చెల్లీ, తాగుబోతు భర్త, ఇతర కుటుంబసభ్యుల్ని పోషించడానికి ఆమె ఎంత రిస్కు తీసుకుంటుందో అర్ధమైంది. అర్ధరాత్రి, అడవికి అడ్డం పడి, రెండు చేతులా 20 లీటర్ల బరువు మోస్తూ, దాదాపు 12 కిలో మీటర్ల దూరం నడిచి సారా తెచ్చి అమ్మే వ్యాపారిణి! ఆమె లో మరో కోణం చూస్తే మాకు ఆశ్చర్యం వేసేది.

ఎందుకంటే సారా అమ్మిన తరువాత వారం రోజుల పాటు, ఆమె పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో! స్నానాలు చేయించి, బుగ్గన చుక్కలు పెట్టి.... ముస్తాబు చేస్తుంది. మెట్ల మీద అమ్మకానికి వచ్చే అరటి పళ్ళ దగ్గరి నుండి చిరుతిళ్ళన్నీ కొనిస్తుంది. చేతిలో డబ్బులై పోగానే మళ్ళీ బయలు దేరుతుంది.

అదే మనిషిని, ఓ వైపు చూస్తే - బూతులు మాట్లాడుతూ, సారా అమ్ముతూ, పిల్లల్ని గాలి కొదిలేసి.... మరోవైపు చూస్తే - ఆమెలోనూ అమ్మతనం ఉంది. ప్రేమా ఉంది, కన్నీళ్ళున్నాయి. కుటుంబం పట్ల బాధ్యత ఉంది. గొడవల్లో పడి, అన్న కాళ్ళు విరగ కొట్టించుకుంటే, సేవలు చేసేంత, తింగరి చెల్లెలిని సాకేంత రక్తసంబంధం ఉంది. అట్టడుగు పేదరికంలో.... కుటుంబ బాధ్యతల విషయంలో, శ్రమించడంలో, మహిళలే ఎక్కువగా exploit అవుతున్నారన్న విషయాన్ని అక్కడ తొలిసారిగా గమనించాము. హైదరాబాదు నానల్ నగర్ లో మరో సారి దాన్నే చూసాము.

ఈ సారా వ్యాపారిణి భర్త పరమ తాగుబోతు. సంవత్సరంలో పదినెలలు దేశం మీద పడి పోతాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. బుద్దిపుట్టినప్పుడు ఇంటి కొస్తాడు.

ఆ రోజు అయ్యవారి[మల్లయ్య స్వామి] ఏకాంత సేవ దర్శనం చేసుకుని మేము గుడిసె చేరేటప్పటికి - పాతాళీశ్వరాలయం దగ్గరున్న గుంపులో అతడూ ఉన్నాడు. బాగా తాగి వూగుతూ, వాగుతూ ఉన్నాడు. ఉన్నట్లుండి అతడు గబుక్కున లేచి నిలుచున్నాడు. "ఏయ్! ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? సబల్ పూర్, జబల్ పూర్, గోరఖ్ పూర్, నాగ పూర్,ఖరగ్ పూర్, కాగజ్ పూర్, సిరిపూర్.... ఏం తెలుసు మీకు? హైదరాబాద్, సికిందరా బాద్, ఔరంగా బాద్, అహ్మాదాబాద్...." అంటూ ముందు పూర్ ల జాబితా చదివి, ఇక బాద్ ల జాబితా అందుకున్నాడు.

మత్తులో ఊగుతూ చెబుతున్న అతడి తీరూ, అతడు ఆపకుండా ఊళ్ళ పేర్లు వరుసగా చెబుతున్న వేగమూ చూస్తే.... అతడు ఆయా ఊళ్ళన్నీ చూసి ఉండాలనిపించింది మాకు. నమ్మశక్యం కానంత ఆశ్చర్యం వేసింది.

అయితే అతడు ఆ జాబితా చెబుతున్నంత సేపూ.... గంగ మెట్ల మీది ఆ బెస్తవాళ్ళు పగల బడి నవ్వుతున్నారు. వాళ్ళకి తాగుడు కొత్తకాదు, తాగిన వాడి వాగుడూ కొత్త కాదు. అది వాళ్ళకి నవ్వు కలిగించదు. అలాంటి వాటిని క్యాజువల్ గా తీసుకొని తమ పని తాము చేసుకుపోవడాన్ని వాళ్ళల్లో చాలాసార్లు చూసాము. అదీగాక "నాగపూర్, నారాయణ పూరు... అంట" అంటూ పగలబడి నవ్వుతున్నారు.

వాళ్ళ వైఖరి చూస్తే, ‘ఆ ఊళ్ళ పేర్లు కూడా ఎప్పుడూ విని ఉండలేదు. వాటి ఉనికి గురించి వాళ్ళకేమీ తెలియదు’ అన్నది స్పష్టపడుతూనే ఉంది. ఆ తాగిన వాడు దేశాల మీద పడి తిరుగుతాడని తెలిసినా సరే, అతడు ఈ ఊర్లు చూసి ఉండవచ్చు అన్న స్పృహ కూడా లేదు వాళ్ళకి!

మేము ఈ సంఘటనని విశ్లేషించుకుంటూ "మనిషికి ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు.... అందులో.... ఏ కొంచెమైనా తమకి తెలిసింది ఉంటేనే.... ఆ కొత్త విషయం పట్ల ఆశ్చర్యమో, నమ్మశక్యంగాని తనమో లేక నమ్మకమో కలుగుతుందను కుంటా! అంబమ్మ భర్త అన్ని ఊళ్ళ పేర్లు చెబుతుంటే మనకి ఆశ్చర్యం వేసింది. ఆ గిరిజనులకి నవ్వు వచ్చింది. అసలు మన ఊహకైనా రాని విషయాన్ని, అది నిజమే అయినా సరే, ఎవరైనా చెబితే మనమైనా ఇలాగే నవ్వుతాం! బహుశః కోపర్నికస్ భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినప్పుడు ఇతరులూ ఇలాగే నవ్వి ఉంటారు" అనుకున్నాము.

ఏమైనా "ఏ విషయం పట్లేనా - వ్యక్తులు స్పందించే తీరు వాళ్ళ విజ్ఞాతని బట్టి, భావ స్వేచ్ఛనూ బట్టి ఉంటుంది" అని తీర్మానించుకున్నాము.

ఇప్పటికీ - "గంగ మెట్ల మీద ’నాగపూర్’ అంటే నవ్వారు" అని, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

http://dharmasthalam.blogspot.com/2010/04/blog-post_25.html

http://mapsofwar.com/images/Religion.swf

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu