ఒక చిన్న ఉదాహరణ పరిశీలించండి.
26, ఏప్రియల్, 2010 ఈనాడు కర్నూలు ఎడిషన్, 7వ పేజీ, ‘మండుతున్న బీరు’ శీర్షిక:
ఇక అందులో వార్తాంశం, యధాతధంగా:
>>>బడి దగ్గర బ్రాందీ దుకాణం:

పొట్టి శ్రీరాములు. ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన జాతీయ నేత ఆ పేరు వినగానే రెండు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఆ మహానుభావుడి జ్ఞాపకంగా ఆదోని పురపాలక సంఘం ప్రాధమికోన్నత పాఠశాలను ఎమ్మిగనూరు కూడలిలో ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలకు ఎదురుగానే బ్రాందీ దుకాణం తెరిచారు. ఆ పక్కనే ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. నిబంధనలకు విరుద్దంగా మద్యం దుకాణం ఉన్నా... ఆ దుకాణదారుడికి ఉన్న రాజకీయ అండదండలు దృష్ట్యా ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహారిస్తున్నారు. పాఠశాలకు, మద్యం దుకాణానికి మధ్య ఉన్న దూరం 40 నుండి 50 అడుగులు లోపే. ఈ బడి పక్కనే 5 వ తరగతి నుండి 10 వ తరగతి చదివే విద్యార్ధినుల వసతి గృహం ఉంది. ఈ దుకాణం తొలిగించాలని గతంలో ఎన్ని విన్నపాలు వచ్చినా ట్రాఫిక్ నిబంధనలు సాకుగా చూపి ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు స్పందించి బడికి, గుడికి ప్రక్కనే ఉన్న ఈ మద్యం దుకాణాన్ని తొలగించాలని పురవాసులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ సీఐ మల్లారెడ్డి దృష్టికి న్యూస్ టుడే తీసుకెళ్లగా బీరు ధర పెంపుపై ఫిర్యాదులు లేవన్నారు. అయినా తక్షణమే తనిఖీలు చేసి అధిక ధరలు అమ్మినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మిగనూరు కూడలిలో ఉన్న మద్యం దుకాణం బడి పక్కనే ఉందని ఫిర్యాదులు వచ్చిన మాట నిజమేనని, రహదారి మధ్యలో ఉండే డివైడర్, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం 130 అడుగుల దూరం వస్తోందని ఆయన పేర్కొనడం కొసమెరుపు.

రూల్స్ ప్రకారం, అంటే చట్టప్రకారం - బడికీ గుడికీ, అమ్మాయిల హాస్టలుకీ ఎదురుగా, 40 నుండి 50 అడుగుల దూరంలో ఉన్న మద్యం దుకాణం, రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ డివైడర్ కారణంగా 130 అడుగుల దూరంలో ఉన్నట్లన్న మాట. ఎందుకంటే ట్రాఫిక్ డివైడరు ఉన్నప్పుడు బైకు, కారు గట్రా వాహనాలేవైనా ‘యూ’ ఆకారపు టర్న్ తీసుకుని, బడి నుండి మద్యం దుకాణం చేరాలి. లేదా మద్యం దుకాణం నుండి బడి చేరాలి కాబట్టి. అయితే తాగుబోతూ లేదా పాదచారి.... యూటర్న్ తీసుకోకుండానే డివైడరు ఎక్కిదిగి, నేరుగా, రేడియల్ గా, బడీ గుడి దగ్గర నుండి మందు దుకాణానికీ, లేదా మందు దుకాణం నుండి బడికీ, గుడికీ, అమ్మాయిల హాస్టలు దగ్గరికీ వెళ్ళగలడు కదా!

అలాగే బడి కొచ్చే పిల్లల, గుడి కొచ్చే భక్తుల చూపులు కూడా, యూ టర్న్ తీసుకోకుండానే, డివైడర్ మీదుగా, నేరుగా, రెడియల్ గా, మందు దుకాణం దగ్గర మత్తుబాబుల చిందులు చూడగలవుగా! మత్తెక్కిన వారి స్పృహ లేని వాగుడూ, ఊగుడూ, వికారాలూ హాస్టల్ అమ్మాయిలనీ, బడి పిల్లలనీ, గుడి భక్తులనీ చేరగలవు కదా! డివైడర్ చుట్టూ తిరక్కుండానే... నేరుగా రేడియల్ గా!

కానీ చట్ట ప్రకారం అది 130 అడుగుల దూరం. కంటికి నేరుగా కన్పిస్తూ ఉన్నాసరే! చిత్త శుద్ది లేని ఉద్యోగులూ, అధికారులూ, రాజకీయ నాయకులూ, తమ స్వలాభం చూసుకుని, అదే దృష్టితో చట్టంలోని భాష మాత్రమే పట్టించుకున్నారు. దీన్నే ’రెడ్ టేపిజం’ అంటారు. చట్ట పరంగా, కేవలం భాషే చూస్తే.... అన్నీ సరిగ్గానే ఉన్నాయి. బడి, గుడి వసతి గృహంకి, 130 అడుగుల దూరంలో ఉంది మందుకొట్టు! చిత్త శుద్దితో చూస్తే.... ఆ చట్టంలోని భావం స్ఫురించి ఉండేది.

ఇది గల్లీ స్థాయి లోని రెడ్ టేపిజం.

ఇక కేంద్ర స్థాయిలో దీన్ని చూడాలంటే -

26 ఏప్రియల్, 2010 ఈనాడు, 1&2 వ పేజీలలోని వార్తాంశం. " అవినీతే ప్ర‘వృత్తి’! " శీర్షిక క్రింద....
>>>వైద్య విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, వైద్య విద్యార్హతల గుర్తింపు కోసం భారతీయ వైద్యమండలి[ఎంసీఐ] 1933లో ఏర్పాటైంది. వైద్య కళాశాలకు గుర్తింపు, కొత్త వాటికి అనుమతులు, వైద్యులకు శాశ్వత, తాత్కాలిక గుర్తింపు, ప్రజలకు వైద్య సేవలందేలా చూడటం మండలి ప్రధాన విధులు.

మండలిలో రాష్ట్రప్రభుత్వాలు సిఫార్సులపై కేంద్రం నామినేట్ చేసిన వారు 30 మంది, విశ్వవిద్యాలయాల ద్వారా ఎన్నికైన వారు 83 మంది, గుర్తింపు పొందిన వైద్యుల చేత ఎన్నికన వారు 22 మంది, లైసెన్సియేట్ గ్రూపు నుండి 7గురు, కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన వారు 8 మందితో కలిపి మొత్తం 150 మంది సభ్యులుంటారు. ఈ సభ్యులంతా కలిపి 10 మంది పాలకవర్గాన్ని, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. వీరు ఐదు సంవత్సరాలపాటు అధికారంలో ఉంటారు. ఎంసీఐ అధ్యక్షుడి నియామకం, తొలగింపు విషయంలో ప్రభుత్వపాత్ర ఏ మాత్రం లేక పోవడం కేతన్ దేశాయ్ కి వరంగా మారింది.

మెడికల్ కాలేజీ యాజమాన్యం, సీటును అధికారికంగా 4 లక్షల రూపాయలకు ఇవ్వాల్సి ఉన్నా యాజమాన్యాలు 40లక్షల నుండి 70 లక్షల దాకా విద్యార్ధుల నుండి గుంజూతున్నాయి. ఈ లెక్కన 12 కోట్ల నుండి 20 కోట్ల దాకా వారికి ఆదాయం వస్తోంది. దీంతో కళాశాలకు అనుమతికి ఏటా కోటి నుండి రెండు కోట్లు పెట్టడం వారికి కష్టంగా తోచడం లేదు.

సదరు ఎంసీఐ లో ప్రభుత్వాల సిఫార్సుల మేరకు, నామినేట్ డ్ గా, ఇతరత్రా, 150 మంది సభ్యుల నియమింపబడతారు. వారి నుండి అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నుకోబడతారు. అలాంటి అధ్యక్షుడే ఇప్పుడు వేల కోట్ల రూపాయల ఆస్థులు, వేల కేజీల బంగారం అక్రమార్జనగా కలిగి ఉన్న కేతన్ దేశాయ్! ఈ విధంగా సభ్యులైన వారి జీత భత్యాలు, గౌరవ వేతనాలు, ఇతర అలవెన్సులు ఏ మేరకు ఉంటాయో, ఎవరు చెల్లిస్తారో ఇంకా బయటకు రాలేదు గానీ, ప్రభుత్వ సిఫార్సుల మేరకు నియమింపబడిన వారికి ఆయా ఆర్ధిక ప్రయోజనాలన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుంది గదా!

ఇక వైద్య కళాశాలల మంజూరు, అజమాయిషీలపై పట్టుకలిగి, అపరిమిత ఆదాయ వనరులున్న ఈ పదవులకి, ప్రభుత్వ సిఫార్సులుకీ ఎన్ని అడ్డదారులుంటాయో అందరికీ తెలిసిందే.

వెరసి ఈ మండళ్ళు సర్వస్వతంత్రమైనవనీ, వాటిని ప్రభుత్వం ఏమీ చేయలేదనీ గౌరవనీయ అమాత్యశేఖరులు గులాం నబీ ఆజాద్ గారు సెలవిచ్చారు. కొసమెరుపు ఏమిటంటే ఆయన వ్యక్తిగత కార్యదర్శికి దీనితో సంబంధాలున్నట్లు ఆరోపణలొచ్చాయి.

ఇందులోనూ చట్టపరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్నీ ఒకే! చిత్తశుద్ది పరంగా అంతా కంతలే!

ఇదీ కేంద్రప్రభుత్వస్థాయిలో రెడ్ టేపిజం!

ఇదే రెడ్ టేపిజం అంతర్జాతీయ స్థాయిలో చూడండి.

పాక్ ఉగ్రవాదుల నిక్షేపం
ఉత్తర వజీరిస్థాన్‌కు పలాయనం
ఇస్లామాబాద్, ఏప్రిల్ 23 : దక్షిణ వజీరిస్థాన్‌లో ఉగ్రవాదులను తుడిచిపెట్టేశామని పాకిస్థాన్ జబ్బలు చరుచుకుంటోంది. వాస్తవానికి అక్కడి పరిస్థితులు ఇం దుకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే తాలిబన్, అల్‌కాయిదా ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లోనే నిక్షేపంగా ఉన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్టు.. వారు తమ స్థావరాలను మార్చి ప్రపంచాన్ని ఏమార్చారు.

పాకిస్థాన్‌లో అత్యంత ప్రమాదకర ప్రాంతం ఉత్తర వజీరిస్థాన్‌లో కొత్తగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్థాన్ సైన్యంతో గతంలో సంబంధాలు ఉన్న ఓ తిరుగుబాటు నేత రక్షణలో ఉగ్రవాదులు సురక్షిత ప్రాంతాల ను ఎంచుకున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించిన విలేఖరులు అందించిన సమాచారం మేరకు ఇది వెలుగులోకి వచ్చిం ది. స్థానికులు, మిలిటెంట్లు కూడా ఈ విషయాన్ని «ద్రువీకరిస్తున్నారు.

తమ కొత్త నెలవుల్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. వీరిలో అరబ్బులు ఉన్నారు. అదే విధంగా చెచెన్లు, ఉజ్బె క్ టెర్రరిస్టులు కూడా. మార్కెట్లు, రెస్టారెంట్లలో ఎటు చూసినా వారే! బల్లలపై ఆయుధాలు ఉంచి థిలాసాగా జిహాదీ సినిమాలు వీక్షిస్తారు. ఇంటర్నెట్ కేఫ్‌ల్లో వెబ్ సర్ఫింగ్‌లో మునిగిపోతారు. తనిఖీ ప్రాంతాలను దాటి ఇక్కడికి చేరుకోవడానికి వారు పెద్దగా కష్టపడిందేమీ లేదు.

పాక్ దళాలే వారిని స్వయంగా వదిలిపెడుతుండటంతో అసాల్ట్ రైఫిల్స్‌తోనూ, రాకెట్ లాంచర్లతోనూ కొత్త స్థావరాలకు చేరగలిగారు. దక్షిణ వజీరిస్థాన్‌లో టెర్రరిస్టులతో చె డుగుడు ఆడిన పాక్.. ఉత్తర ప్రాంతానికి వారిని అనుమతిస్తున్న విషయం ఎలా ఉన్నా, ఇక్కడ మాత్రం సైనిక చర్యలు తీసుకునే అవకాశం మాత్రం లేదు. గుల్‌బహదూర్, ఇతర తిరుగుబాటు నేతలతో చేసుకున్న ఒప్పందాలే దీనికి కారణం.

గత ఏడాది దక్షి ణ వజీరిస్థాన్‌లో పాక్ బలగాలు చెలరేగిపోయిన తరుణంలో.. తోటి టెర్రరిస్టులకు తాను ఎటువంటి సహాయమూ అందించబోనని బహదూర్ హామీ ఇచ్చాడు. ఇందుకు ప్రతిగా అతని రాజ్యం (ఉత్తర వజీరిస్థాన్)లో పాక్ సైన్యం వేలుపెట్టరాదు. స్థూ లంగా ఇదీ ఒప్పందం. ఇదే ఇప్పుడు పాక్‌కు ప్రతిబంధకమైంది.

తమ దేశ భద్రతకు టెర్రరిస్టులు ముప్పుగా పరిణమించారని భావిస్తున్న పాక్‌కు.. బహదూర్ సామ్రాజ్యంలో వారు పునరేకీకరణ కావడం మింగుడుపడటం లేదు. ఏదో ఒక రోజు తమ ప్రయోజనాలనూ నెరవేరుస్తారనే ఉద్దేశంతోనే పాక్ వారికి వత్తాసు పలుకుతోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

బహదూర్ నేతృత్వంలో పాకిస్థానీ తాలిబన్.. ఉత్తర ప్రాంతంలోని మీర్ అలీ పట్టణంలో ఏకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విశేషం. 'గిరిజన సంప్రదాయాలు, పద్ధతుల ప్రకారం దక్షిణ వజీరిస్థాన్ నుంచి వచ్చిన సోదరులకు మేం ఆతిథ్యం ఇచ్చి తీరాల్సిందే. ఒకరికి ఒకరు మద్ద తు ఇవ్వకతప్పదు' అని బహదూర్ సన్నిహిత సహచరుడొకరు చెప్పారు.సదరు దక్షిణ వజీరిస్తాన్ లో, పాకిస్తాన్ తాలిబాన్లను తుడిచి పెట్టేసింది కాబట్టి, నియమ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ కు అమెరికా సాయం చేయటానికి ఎలాంటి అడ్డంకులూ లేవు, పాకిస్తాన్ కు తాలిబాన్లతో లింకులూ లేవు. ఇక ఉత్తర వజీరిస్తాన్ బహదూర్ తో పాకిస్తాన్ చేసుకున్న ఒప్పందం ప్రకారం, అతడి రాజ్యంలో తనిఖీలు చేయరాదు కాబట్టి, తాలిబాన్లకు అక్కడ సమస్య లేనట్లే! హోటళ్ళ టేబుళ్ళ మీద నిర్బయంగా ఆయుధాలు పెట్టి, జీహాద్ సినిమాలు చూస్తూ బాహాటంగా ఆనందిస్తున్న తాలిబాన్లు కళ్ళకు కనబడుతున్నా, కాగితాలకు కనబడదు. చిత్త శుద్ది లేని చట్టాలకు అన్నీ కరెక్టు గానే ఉన్నాయి మరి! పాకిస్తాన్ కు అర్జంటుగా చట్టపరంగా ఆర్దిక సాయం చేయటం కోసమే, పాకిస్తాన్ లో ఇప్పుడు ప్రజాస్వామ్యం వెల్లి విరుస్తుంది మరి! తీవ్రవాదమంతా డేవిడ్ కోల్మన్ హెడ్లీనే చేసాడు.

ఇదీ రెడ్ టేపిజమే! కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో!

గల్లీ నుండి ఢిల్లీ దాకా, అంతర్జాతీయ స్థాయి దాకా, ఒకటే శృతి. ఒకే రకపు పనితీరు! ఎలా సాధ్యం?అన్నిటా ఒకేతీరు ఉండాలంటే అన్నిటికీ అంతరాంతర సంబంధం ఉండాలి. అన్నిటినీ ఒకే వ్యవస్థ నడుపుతుండాలి. అవేవీ గుర్తుంచకుండా.....

అడ్మినిస్ట్రేషన్ లోని ఈ రెడ్ టేపిజాన్ని గ్రహించకుండా.... గుడ్డివాళ్ళు ఏనుగును తడిమినట్లుగా, రాజకీయ విశ్లేషణలూ, వ్యాఖ్యాలూ చేస్తూ, పాక్షిక సత్యాలని చూస్తూ, పాక్షిక అసత్యాలని మాట్లాడుతూ.... గడిపినంత కాలం, ఈ రెడ్ టేపిజం ఇలా నడుస్తూనే ఉంటుంది; మానవత్వాన్ని నలిపేస్తూనే ఉంటుంది. సూక్ష్మం నుండి స్థూలం దాకా ఒకే శృతిలో, ఒకే ఆకృతిలో!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

http://apmediakaburlu.blogspot.com/2010/04/blog-post_27.html

అజ్ఞాత గారు: మీరు పంపిన లింక్, ‘రామోజీరావు అలాంటి వాడు కాదు’ అనే వారికి సమాధానం లాంటిది. అలాగే ఈ టపాలో వివరించినట్లు రెడ్ టేపిజానికి మంచి ఉదాహరణ కూడా! గ్రహించటం, గ్రహించక పోవటం అన్నది వాళ్ళ విజ్ఞత!లింక్ పంపినందుకు నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu