‘పోకిరి’ సినిమాలోని ఓ డైలాగ్ తో నా విశ్లేషణని ప్రారంభిస్తాను.
సంచలనం సృష్టించిన ‘పోకిరి’ చిత్రంలో, హీరోయిన్ ని వేధించిన పోలీసు ఇన్స్ స్పెక్టర్ పశుపతిని, హీరో చితక్కొట్టేస్తాడు.
తర్వాత రైల్వే స్టేషన్ లో కలిసిన హీరోయిన్, హీరో తో
"ఆ ఇన్స్ స్పెక్టర్ ని కొట్టావట, ఎందుకు?" అంటుంది.
"డౌటొచ్చి" అంటాడు నిర్లక్ష్యంగా.
"డౌటొస్తే కొట్టేస్తావా?"
"చంపలేదు. సంతోషించు!"
"ఏం" అంటుంది రెట్టిస్తూ.
"ఎందుకంటే.. లవ్ చేస్తున్నామమ్మా మేం?" అంటాడు హీరో.
"ఓ ప్రక్క మనుషుల్ని చంపుకుంటూ, మరో ప్రక్క మనుష్యుల్ని ఎలా లవ్ చేయగలుగుతున్నావ్?" అంటుంది ఎంతో ఆవేదనతో!
"అలా చేయొచ్చని నాకూ ఈ మధ్యే తెలిసింది" అంటాడు హీరో!
ఎంతో నిర్లక్ష్యంగా అతడు పలికిన తీరుకీ, ఆ సన్నివేశాన్ని ఎంతో వినోదిస్తాం మనం.
కానీ, హీరో చివరిలో చెప్పిన మాట... పచ్చి నిజం!
ఉదాహరణకి పరిశీలించండి!
గత నెలలో, ఒకటి రెండు రోజులు సంచలనం సృష్టించిన ‘పార్క్ ఉడ్’ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టరు, అహ్మదుద్దీన్ అయూబ్, ఆ బడిలో 11వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద అత్యాచారం చేసిన ఉదంతం... అందరికీ గుర్తుండే ఉంటుంది.
సభ్య సమాజం జుగుప్సతో, బాధతో రగిలి పోయే ఆ సంఘటనలో... తన కుమార్తెల వయస్సులో ఉన్న పదహారేళ్ళ చిన్నపిల్ల మీదపడి... యాభై ఏళ్ళ వాడు... దున్నుపోతులా, మదంపట్టిన ఆబోతులాగా... అత్యాచారం చేసి, పసిబిడ్డ మనశ్శరీరాలని నలిపి వేసిన వైనం గురించి తెలిసినప్పుడు, అయూబ్ అనబడే ఆ మానవ మృగం పురుషాంగాన్ని ఉత్తరించినా, అతడి కది తక్కువ శిక్షే అన్పించేంత క్రోధం కలుగుతుంది.
అంత క్రోధం మనకి కలగటానికి మరో కారణం... అతడి చేతుల్లో వ్యధననుభవించిన చిన్నపిల్ల పట్ల మనకి గల ప్రేమే!
ఒకే సమయంలో... ఆ మదాంధుడి మీద క్రోధాగ్ని, ఆ పిల్లపట్ల కరుణాత్మక ప్రేమ కలగడమంటే... ‘పోకిరి’ హీరో అన్నట్లు... ఓవైపు మనుష్యుల్ని చంపేంతగా,శిక్షిస్తూ, ద్వేషిస్తూ... మరో వైపు మనుష్యుల్ని ప్రేమిస్తూ... ఉండటమే! [నిజం చెప్పాలంటే నేరగాళ్ళని చంపేస్తూ, మనుష్యుల్ని ప్రేమించడం అనాలేమో దాన్ని!]
నిజానికి అది మనిషి సహజ లక్షణం! మంచిని ప్రేమించడం, చెడుని ద్వేషించడం - మనిషి ప్రాకృతిక లక్షణం!
పిల్లల్ని, తల్లిదండ్రులు కలుష పరచక పోతే....
అనుచరులని, నాయకులు కలుష పరచకపోతే...
సామాన్యులని, శ్రేష్ఠులుగా ముద్రపడ్డవాళ్ళు కలుష పరచకపోతే...
ప్రజలని, మీడియా కలుష పరచకపోతే...
సజీవంగా ప్రతిఫలించే మానవ సహజ లక్షణం!
అంతేకాని ‘చెడ్డవాణ్ణి దండించాలి’ అనే వ్యక్తికి ‘ప్రేమ రాహిత్యం ఉందని’ అనటం... మంచికి, చెడుకి మధ్యనున్న సన్నని గీత తెలియక పోవటమే! లేదా... తప్పు ‘తప్పు’గా కనిపించకపోవటం కావాలి.
ఇక... కేంబ్రిడ్జి తో అఫిలియేట్ అయిన, కేంద్ర [సిబిఎస్ఇ] సిలబస్ ని అనుసరించే ప్రతిష్ఠాత్మక[?], ఖరీదైన, పార్క్ ఉడ్ పాఠశాల ఉదంతం దగ్గరి కొస్తే...
నేరాన్ని ఒప్పుకుంటూనే, పాఠశాల డైరెక్టర్ అహ్మదుద్దీన్ అయూబ్, ఎంత కొవ్వుపట్టిన వాదన వినిపించాడో చూడండి -
౧. తనకు, భార్యతో విభేధాలున్నాయట. అందుకే ఇలా ప్రవర్తించాడట.
తనకి, తన భార్యతో విభేదాలుంటే - తన పాఠశాలలో చదివే చిన్నపిల్లల మీద లైంగిక అత్యాచారాలు చేస్తాడా? ఒక భార్య ఉండగానే, మరో ముగ్గురిని చేసుకోవడానికి అనుమతించే మత సాంప్రదాయానికి చెందిన వాడతడు. ఒక పెళ్ళాంతో పడకపోతే, విడాకులిచ్చి, సజావుగా మరో స్త్రీని, తనకి తగిన దాన్ని పెళ్ళి చేసుకోవచ్చు.
అంతేగానీ, చదువు చెబుతారని నమ్మి, తమకు అప్పచెప్పిన పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తాడా?
౨. "పశ్చాత్తాప పడ్డాను గానీ, అయినా కొనసాగించాను" అని చెప్పాడు. పైగా రక్తపు మరకలు అంటిన దుస్తుల్ని ఆ అమ్మాయి చేతే ఉతికించానని చెప్పాడు. పశువాంఛా పూరితుడైన ఈ మదాంధుడు, అశ్లీల వెబ్ సైట్లు చూసేవాడట. ‘ఎంతటి విశృంఖలంగా బిడ్డని వేధించి ఉంటాడో!’ తలుచుకుంటేనే రక్తం మరిగి పోతుంది.
ఎవరితో చెప్పుకోలేక, అలాంటి పిల్లలు ఎంత వెతని అనుభవించి ఉంటారో? తుపాకి చూపించి బెదిరించాడట కూడా! ఉత్తినే చూపించి బెదిరించగలడే గానీ, నిజంగా చంపలేడని పిల్లలు అనుకోలేరు. అదీగాక... అతడి కున్న పరపతి చూసినప్పుడు, ఇప్పుడు ఇంతగా అతడి కౄరత్వం బయటపడినా ఏమీ కానట్లే... చంపి కూడా కేసులు గాకుండా బైటపడగలడేమో ననే భయం, ఆ పిల్లలకి ఖచ్చితంగా వేస్తుంది కదా!
తల్లిదండ్రులు... ‘మంచి స్కూల్లో చేర్పిస్తే... తమ పిల్లల కేదో మంచి భవిష్యత్తు ఉంటుంది’ అనుకుని, నమ్మకంగా తమ చేతుల్లో పెడితే... అలాంటి పసిమొగ్గల్ని ఇలా నలిపి నాశనం చేసేటప్పుడు... అతడికి గానీ, అతడికి సహకరించిన వార్డెన్ కి గానీ, ప్రిన్స్ పాల్ మరియు అయూబ్ సోదరీ అయిన అయేషా తన్వీర్ లకి గానీ... ఏ భయమూ వేయలేదంటే ఏమనుకోవాలి?
"పిల్లలు ఇదంతా చెబుతుంటే, వింటుంటే నాకే కన్నీళ్ళొచ్చాయి" అన్నాడు ఓ పోలీసు ఇన్ స్పెక్టర్. బహుశః అతడి కింకా హృదయం మిగిలి ఉన్నట్లుంది. ఎందుకంటే... మీడియాలో సంచలనం కొంచెం చల్లారగానే, పోలీసులు, ఉన్నతాధికారుల ముందరే, పాఠశాల యజమాన్యం ‘తనకి రెండు కోట్ల రూపాయలు ఆశ చూపి, బేరం పెట్టారని’ బాధితురాలి తండ్రి వాపోయాడు.
ఇక ఇప్పుడైతే... "మీడియా విషయాన్ని మూలన పడేసింది. న్యాయం జరిగే వరకూ ఫాలో అప్ చేయటం, అదెప్పుడో మానేసింది. మీడియాలో విషయం లైవ్ గా ఉన్నప్పుడే జనం దృష్టి దానిమీద ఉంటుంది. ఎటూ ప్రభుత్వంలో, పైసలిస్తే పనులు బాగానే జరుగుతాయి. రెండు కోట్ల రూపాయలిస్తానంటే తెగ నీలిగావు. అందులో సగం పెడితే అధికారులూ, ప్రభుత్వమూ, అన్నీ నావైపే ఉంటాయి. ఇప్పుడు ముష్టి ముప్పై వేలిస్తాను. నోర్మొసుకొని కేసు విత్ డ్రా చేసుకొని ఫో! లేకుంటే రుచికా Vs రాధోడ్ కేసే నీది కూడా!" అన్నా కూడా దిక్కుండదు.
సదరు అధికారులు, బాధితురాలి తండ్రికి, ఆ విధమైన ఆఫర్లు పెట్టడంతో సమాజంలోనికి ఏ విధమైన సంకేతాలు పంపుతున్నట్లు? ఒక్కక్షణం - ఆ తండ్రి స్థానంలో తామే ఉండి ఆలోచిస్తే....? క్షణంలో సగం సేపు, ఆ బిడ్డ స్థానంలో ‘తమ కూతురే నలిపివేయబడితే’ అని ఊహిస్తే... చేయగలరా అలాంటి బేరాలు?
ఎంత అలవోకగా.... అధికారులు, పాఠశాల యాజమాన్యం ఇచ్చిన లంచాలు మేసి, బేరాలకు దిగారంటే - వాళ్ళు చేసే వాదనల్లో ఓ దారుణ వాదన... "ఏం చేసినా, మీ పిల్ల పడిన బాధలు తీరనివే! ఇప్పుడు ఇతణ్ణి శిక్షిస్తే మాత్రం మీకేం వొస్తుంది? కనీసం డబ్బు తీసుకుని రాజీ పడితే... జరిగిందేదో జరిగిపోయిందని మరిచిపోవచ్చు" అని!
నిజానికి డబ్బులు తీసుకుని [అవి రెండు కోట్లు కావచ్చు, మరిన్ని కోట్లు కావచ్చు] ఊరుకోవటానికి... అతడేమీ తన కుమార్తెని వ్యభిచరించేందుకు పంపించలేదు. చదివించు కునేందుకు పంపించాడు. ఆ అధికారులే ఆ పిల్ల తండ్రి స్థానంలో ఉంటే... తమ కూతుళ్ళకి అలాగే మూల్యం కడతారా? తమ కూతుళ్ళ మానసిక శారీరక హింసకీ, ఖరీదు కడతారా?
రోడ్డు మీద వెళ్తుంటే యాసిడ్ దాడులు జరుగుతున్న నేపధ్యంలో... అంతలేసి డబ్బు ఖర్చుపెట్టి, హాస్టళ్ళల్లో తమ కూతుళ్ళని చేర్పిస్తే... చివరికి అక్కడా కామాంధుల బాధ తప్పక పోతే.... ఇక ఏ నిశ్చింతతో తల్లిదండ్రులు తమ కుమార్తెలని చదివించుకోగలరు? బడికి పంపి కూడా మనశ్శాంతిగా ఉండలేరంటే... ఇది సమాజమా, కౄరమృగాలు సంచరించే అరణ్యమా?
ముంభైలో స్థిరపడిన బాధితురాలి కుటుంబం! ఆ తండ్రి ఇటలీలో ఉద్యోగం చేసుకుంటూ, తమ ఇంటి నుండి నలుగురు పిల్లల్ని మూడేళ్ళుగా పార్క్ ఉడ్ లో చదివిస్తున్నాడట. దరిదాపు 50 లక్షల రూపాయలు ఫీజుల క్రింద, కట్టాడట. [అందునా పుస్తకాల దగ్గరి నుండి మిస్ లీనియెన్స్ ల దాకా హాస్టల్ స్టోర్ లోనే కొనాలి కదా!]
అంటే... సగటున ఒక్క విద్యార్దికి, సంవత్సరానికి నాలుగు లక్షల పైచిలుకు దాకా ఖర్చు పెట్టారన్న మాట! కేంబ్రిడ్జికి అఫిలియేటెడ్ మరి!!
నిజానికి 2002 లో ప్రారంభించినా, ఎప్పుడూ పత్రికా ప్రకటనలో గానీ, టీవీ యాడ్స్ లో గానీ, పార్క్ ఉడ్ పేరు వినలేదు. అయినా 350 మంది విద్యార్దులని, అదీ భారీ ఫీజులు [సంవత్సరానికి లక్షల్లో] కట్టగలిగిన విద్యార్దులనీ సమీకరించిదంటే - అంతగా మౌఖిక ప్రచారం [oral palm plate] కలిగినదై ఉండాలి. పాఠశాల యాజమాన్యం మైనారిటీ వర్గానికి చెందింది. విద్యార్దులూ అధికంగా వాళ్ళే ఉండటాన్ని బట్టి చూస్తే, సదరు వర్గపు నెట్ వర్క్ లోనే మౌఖిక ప్రచారం ఉండి ఉంటుంది.
నిబంధనలని ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా, విద్యార్దినుల వసతి గృహం పైనే పెంట్ హౌస్ నిర్మించుకొని డైరెక్టరు నివసించడాన్ని చూసినా, అంతటి కౄర నేరానికి పాల్పడడాన్ని చూసినా, భరోసా బాగా కలిగి ఉన్నారనిపిస్తుంది. డబ్బు భరోసానే గాక, వెనక మైనారిటీ రాజకీయ నాయకులెవరి వో అండదండలు ఉండి ఉండాలి!
అసలే... ఏ దేశంలోనో, ఏదో పత్రికలో అల్లా గురించి కార్టూన్ ప్రచురిస్తే, ఇక్కడ పాతబస్తీలో గొడవలు ప్రారంభమౌతాయి. మరి ఆ మైనారీటీ నాయకులకి ఈ ఘోరం కనిపించలేదా? లేక ఆడదాని శీలానికేం విలువ అన్పించిందా? లేక ఆ వంకతో ఆ స్కూల్ డైరెక్టర్ దగ్గర డబ్బులు బాగా గుంజవచ్చు అని ఊరుకున్నారా? లేక ఆ పార్క్ ఉడ్ స్కూలు అసలు యాజమాన్యం పాతబస్తీ నాయకులేనా?
నేరం గురించి బయటికి వార్తలు పొక్కాక కూడా, విలేఖరులని అనుమతించకపోవటం, నిలువరించ గలగటం, పోలీసులని "ఇది సిబిఎస్ఇ తో నడిచే కేంద్ర ప్రభుత్వ ఆధీన పాఠశాల. రాష్ట్రపోలీసులు మీరు. ఏ రూల్ ప్రకారం లోపలికి వస్తారు?" అంటూ పాఠశాల యాజమాన్యం వారించటాన్ని చూసినా, వాళ్ళ నరనరాన ’చట్టం తమ చుట్టం’ అన్న భావన నిండి ఉంది. [స్కూలు కేంద్ర ప్రభుత్వ అధీనంలోది కావచ్చు గాక, నేరం జరిగింది మాత్రం రాష్ట్రపరిధిలోనే కదా?]
తమలాంటి నేరగాళ్ళని కాపాడేందుకే... చట్టమూ, రాజకీయ నాయకులూ, ప్రభుత్వాలూ ఉన్నాయనే స్థిరాభిప్రాయం ఉన్నట్లుంది. ఇలా చూసినా, ‘చట్టాలున్నది నేర గాళ్ళ రక్షణకే’ నన్నది మరో మారు ఋజువవుతోంది. [అంతే కాదు, ఒకే మతంలో, ఇద్దరి వ్యక్తులలో, ఒకరికి అన్యాయం జరిగితే... డబ్బున్న వాడి వైపే ఆ మత పెద్దలూ, ఆ మత రాజకీయ నాయకులూ, చట్టమూ, ప్రభుత్వమూ, అధికారులూ ఉన్నారన్న విషయం, మరోసారి దృష్టాంతపూరితమైంది. ఇంకేం మాట్లాడగలం ప్రజాస్వామ్యం గురించి, సమానత్వాల గురించి!]
మరి ఏ రూల్సు చెప్పాయని, హాస్టల్ భవనం పైన పెంట్ హౌస్ లు నిర్మించుకొమ్మనీ, జుగుస్సాకరమైన కౄర నేరాలు చెయ్యమని?
చదువు చెప్పమని పంపిన పిల్లలని భయపెట్టి, బెదిరించి, లైంగిక చర్యలు జరపమని ఏ రూల్సు అనుమతించాయట?
‘ఒక్క సంఘటన జరిగిందని, స్కూల్ మూసివేయ కూడదట. పిల్లల విద్యాసంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొమ్మని’ ప్రిన్స్ పాలూ, అయూబ్ సోదరీ అయిన అయేషా తన్వీర్ ప్రభుత్వాన్ని కోరింది.
అలాంటి బడిలో చదివి జీవితాలనే కోల్పోయారు ఆ పిల్లలు! బాధితురాలు ఒక్కతే కాదు, గడిచిన సంవత్సరాలలో మరి కొందరు పిల్లలున్నారట. ఇప్పుడు మిగిలిన వాళ్ళైనా, అలాంటి బడిలో చదివి ఏం నేర్చుకుని ఉంటారు?
ఈ నేపధ్యంలో వినబడిన మరో దారుణమైన వాదన ఏమిటంటే - ‘ఇలాంటి సంఘటనల గురించి బహుళ ప్రచారం రాగూడదట. వస్తే... మొత్తం విద్యా వ్యవస్థ మీద నమ్మకం కోల్పోతారట. మొత్తం వ్యవస్థే కుప్పకూలి పోతుందట!’ ఇలాంటి దుష్ట వ్యవస్థ ఉండటం కంటే కూలి పోవటమే మేలు!
ఎందుకంటే - లోలోన కుళ్ళుతున్న ఓ వృక్షం ఉందనుకొండి. ఆ కుళ్ళును మనం గుర్తించకున్నా, గుర్తించేందుకు ఇష్టపడకపోయినా, కుళ్ళుకు ఎన్ని అందమైన భాష్యాలు చెప్పుకున్నా... మొత్తం కుళ్ళిపోయాకనైనా, ఆ చెట్టు కుప్పకూలక మానదు.
మరో ఉదాహరణ చెప్పాలంటే - పరిశుభ్రమైన నీరు పారాల్సిన సెలయేటిలో మురుగు నీరు చేరితే, దుర్గంధాన్ని ముక్కుమూసుకు భరిస్తూ, మురుగు చూడకుండా కళ్ళు మూసుకుని, మాలిన్యం లేదని ఆత్మవంచన చేసుకున్నా... ఏదో నాటికి, సెలయేరు కాస్తా మూసీ కంపై కూర్చొంటుంది.
అంతకంటే ‘చెట్టులో కుళ్ళు’ ‘నీటిలో మురుగు’ అనే సత్యాన్ని అంగీకరిస్తే... కనీసం ప్రక్షాళన చేసుకునేందుకైనా వీలుంటుంది.
అయితే... ప్రక్షాళన చెయ్యాల్సిన ప్రభుత్వమూ, ప్రభుత్వం అలాంటి పనులు చేపట్టే దాకా ప్రజల తరుపున పోరాడవలసిన మీడియా.... రెండూ, ఈ విషయం లో, అవినీతి పరులకీ, అధర్మపరులకీ, నేరగాళ్ళకీ రక్షణ కవచాలై పోవటమే ఇప్పుడు మనం చూస్తున్న నీచం!
ప్రభుత్వం, ఓ రెండు షోకాజ్ నోటీసులని, సదరు పార్క్ ఉడ్ పాఠశాలకు పంపి చేతులు దులుపుకుంది. మీ NOC ఎందుకు రద్దు చేయకూడదు... అంటూ! కేంద్రప్రభుత్వమైతే కిమ్మన లేదు. కొన్ని పత్రికలలో ఈ వార్త తొలిసారి వ్రాసినప్పుడే సరైన ప్రజంటేషన్ లేదు. వార్తాంశం కవర్ చేసిన కలం నుండే కరెప్షన్ కంపు కనబడింది.
విచారించాల్సిన అంశం ఏమిటంటే.... ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూసినప్పుడు, విమర్శలు వెల్లువెత్తినప్పుడు... కొందరు వ్యక్తులు, కొన్ని పత్రికలు... తెలిసో తెలియకో.. నేరగాళ్ళను రక్షించటానికో... నేరగాళ్ళ తరుపున వత్తాసు వాదనలు వినిపిస్తారు. ‘బాధిత ఆడవాళ్ళు కూడా ఏం పత్తిత్తులు అయి ఉండరంటూ...’
ఇక్కడ ఓ విషయం స్పష్టం చేస్తాను. సమాజంలో ఆడవాళ్ళలో చెడ్డవాళ్లు లేరని ఎవరూ అనలేం. మంచి చెడుగు... మనిషి లక్షణాల్లో ఉంటాయి. లింగ, ప్రాంతీయ బేధాలకి అతీతంగా, ధనిక పేద తారతమ్యం లేకుండా... మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు... అన్ని వర్గాలలో ఉంటారు. యజమానులను వలలో వేసుకుని, తరువాత బెదిరించి ఆస్థులు వ్రాయించుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు.
ఆర్దిక లాభాల కోసం అక్రమ సంబంధాలు నడిపి, పరిస్థితులు తిరగబడితే మగవాడి మీద నేరం బనాయించే అవినీతి పరులైన ఆడవాళ్ళు లేకపోలేదు. అయితే బయటకొచ్చిన అన్ని వ్యవహారాలు ఇలాగే ఉంటాయనటం మాత్రం, పనికి మాలిన వాదన. ఎవరో ఒకడు గుడ్డి వాణ్ణంటూ మనల్ని మోసం చేసినంత మాత్రాన, ప్రపంచంలో గుడ్డివాళ్ళే లేరనీ, గుడ్డి వాళ్ళాంతా మోసగాళ్ళేననీ వాదిస్తే ఎలా ఉంటుందో... ఇదీ అంతే!
తీవ్రవాదులంతా ముస్లింలైనంత మాత్రాన... ముస్లింలంతా తీవ్రవాదులేలనటం లాంటిదే ఇదేనూ!
అందునా పార్క్ ఉడ్ వ్యవహారానికొస్తే, అయూబ్ అనబడే పశువు చేతిలో హింసకు గురైన పసిదాని సంఘటన వంటి వాటిల్లో యుక్తాయుక్త విచక్షణతో విమర్శలూ, విశ్లేషణలూ ఉంటే, సత్యాన్ని గుర్తించగలుగుతాం; కనీసం కొంతలో కొంతగానైనా...!
ఇప్పటికే పితృసమానులైన బంధుమిత్రులతో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. ఆ స్థితి గురువులతో కూడా రావడం శోచనీయం! ఏమైనా - ‘ఆచార్య దేవోభవ!’ అనుకునే సనాతన ధర్మాన్ని మరిచిపోయినందునే, ఇంతటి నీచ స్థితికి మన సమాజం పరిణమించింది - అన్నది మాత్రం మరవ తగని నిజం!
శిష్యురాండ్రు తమకు పుత్రికా సములు అనుకునే గురువులుంటే... ఈ స్థితి సంభవించేదీ కాదు. గురువు కి ‘ఆ విషయంలో’ సహకరిస్తే... ఆర్దికంగానూ లాభమూ, మార్కులూ కెరీర్ పరంగానూ లాభం అనుకునే శిష్యురాళ్ళు తయారౌతున్న తరుణంలో... పెడదారిపట్టే పిల్లల్ని తల్లిదండ్రులు సరిదిద్దినట్లు గురువులు సరిదిద్దాలి గానీ, స్వసుఖం కోసం ప్రోత్సహించటం, ప్రోద్బవించటం, బెదిరించి లొంగ దీసుకోవటం... ఎంత హేయం?
వర్తమానంలో సభ్యత, సంస్కారాలు మరిచి పోవటానికి కారణం... గతంలో మన సంస్కృతిని మరిచి పోవటమే! వాటిని మరిచినందుకు ఇదే కదా పర్యవసానం!? అయినా ఇప్పుడు సంస్కారం గురించి చెప్పే తల్లిదండ్రులూ, పాఠశాలలూ, ఉపాధ్యాయులకు స్థానం ఎక్కడ? అభిప్రాయ వ్యక్తీకరణ, స్వేచ్ఛావాదం... పేరిట, అవి కనుమరుగైపోయాయి కదా!? సభ్యతా, సంస్కారాలు లేకుండా మాట్లాడటానికి అభిప్రాయ వ్యక్తీకరణకి, వ్యత్యాసం లేకుండా పోయింది కదా!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
9 comments:
అమ్మా,
వరి కుప్ప తగలబడుతున్నాది అనుకోండి తెలివిగల రైతు ఎమీ చేస్తాడు? కుప్పను నీళ్లు పోసి ఆర్పటానికి ప్రయత్నించడు.అపోలం లో అది వృధా ప్రయత్నం. ఆ సమ్యానికి కుప్పని ఆర్పెటన్ని నీళ్లు చిక్కాలి కదా. కనుక నలుగురి సహాయం తో సాధ్యమైనంత వరకు తగలబడని ధాన్యం ఉన్న గడ్డిని వేరు చేసి ఇంకొక చోట కుప్ప వేస్తాడు. అలాగే మీరు రాసే ఈ డబ్బున్న పిల్లలు మంచు వారేమో కాని వాళ్ళ తల్లిదండృలకి డబ్బు పొగరు సాధారణం గా ఉంట్టుంది. ఈ రోజుల్లో మన చుట్టుపక్కల 20సం|| కలసి ఉండె, డబ్బులు పెద్దగా లేని మధ్యతరగతి వారికే ఉన్న తలపొగరు చూసి ఎమైనా చెప్దాము, అంటే మన మాట ఎమీ వింటారు అని గమ్ముగా ఉండె పరిస్థితులు వచ్చాయి. ఇక డబ్బున్న వారి సంగతి చెప్పేది ఏముంది? చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా. కోట్ల డబ్బు పేట్టుకొని ఉన్న ఒకరిద్దరు పిల్లలను కంటికి ముందు పెరుగుతూ ఉంటె చూసి ఆనందించకుండా చిన్న పుట్టి నుంచి ఈ స్కుల్స్ తోసి వారు భావుకునేదేమిలేదని ఈ సంఘటన చూసి ప్రజలు నేర్చుకుంటె బాగుంట్టుంది. మనమేలాగు వారిని మారచలేము కనుక అటువంటి వరు తగల బడేవరి కుప్ప లాంటి వారు ఎవరైనా ఈ సంగటన నుంచి గుణపాఠం నేర్చుకొనే వారు మొదట వారి పిల్లలని ఇంటి దగ్గర పెట్టుకొని చదివించాలి అంతె కాని చిన్నపటినుంచి హాస్టల్స్ లో, రెసిడెన్షియల్ స్కుల్స్ లో చదివించటం మానుకోవాలి.
ఇప్పుడు అర్థమైఉంట్టుంది ఆ డబ్బున్న తల్లిదండౄలకి మన దేశం లో వారికి న్యాయం జరగాలి అంటె ఎన్ని కష్టాలు పడాలో, మొన్నటి వరకు డబ్బుంటె అన్ని పనులు నిముషం లో జరుగతాయి అనే భ్రమలో ఉండిఉంటారు, ఇప్పుడు వారి దగ్గర డబ్బులు ఉన్నా, తప్పు అవతలి వారిదైన న్యాయం జరగటానికి ఎంత పోరాటం చేయాలో తెలిసివస్తుంది. ఎలాగు వీరి గురించి పేపర్ వాళ్ళు ఇకనుంచి అంతగా పట్టించు కోక పోవచ్చు. ఇటువంటి వారు ఒక బ్లాగు పేట్టుకొని తమ అనుభవాలు రాస్తే ప్రజలకి కూడా కొంచెం పరిస్థి అర్థమౌతుంది.
చాలా బాగా రాశారు. చాలా మంచి ప్రశ్నలు లేవనెత్తారు. I agree with most of the feelings and opinions in the post. only different line I would take is towards the end of the post...
"వర్తమానంలో సభ్యత, సంస్కారాలు మరిచి పోవటానికి కారణం... గతంలో మన సంస్కృతిని మరిచి పోవటమే! వాటిని మరిచినందుకు ఇదే కదా పర్యవసానం!?"
హ్మ్ .. సంస్కృతి ఒక నిరంతర ప్రవాహం. మెజారిటీ ప్రజలు మీలాగే ఆలోచిస్తున్నారు, బాధ పడుతున్నారు. కాబట్టి సమస్య సంస్కృతిది కాదు. వ్యవస్థా పరమైన లోపాలదీ, మనలోని అలసత్వానిదీ అనిపిస్తుంది.
Man is both the creator and product of culture. So it is dangerous to forget that we are the product of our culture and it is equally dangerous to stop creating and contributing to the culture.
I agree with your views, it is a quite disgusting incident. He should have been killed on the spot. Maoists can do that as they claim to be working for people to gain lost sympathy of the people. :(
keep running away from the mad dogs - that has become major part of daily life - for girls it is worse
కేంబ్రిడ్జి వారికి ఈ విషయం తెలియజేసి వారు ఆ స్కూలుతో తమ సంబంధాన్ని రద్దు చేసుకుంటే---- అప్పుడైనా దారికి వస్తాడేమో---- ఆర్ధిక మూలాల్ని దెబ్బతీస్తేగానీ ఇటువంటి వారికి సరియైన బుద్దిరాదు.
mee posts chala interesting ga unayi, kani naku oka nijam chepandi ,ysr di accident or murder ?
మొదటి అజ్ఞాత గారు:
>>>ఎవరైనా ఈ సంగటన నుంచి గుణపాఠం నేర్చుకొనే వారు మొదట వారి పిల్లలని ఇంటి దగ్గర పెట్టుకొని చదివించాలి అంతె కాని చిన్నపటినుంచి హాస్టల్స్ లో, రెసిడెన్షియల్ స్కుల్స్ లో చదివించటం మానుకోవాలి.
విత్తు ముందా, చెట్టు ముందా అనే పరిస్థితి ఉందండి.
రెండవ అజ్ఞాత గారు: నిజం చెప్పారు. నెనర్లు!
వీకెండ్ పొలిటీషియన్: నెనర్లండి!
snkr గారు: మావోయిస్టులా!:))
లలిత.పి గారు: బాగా చెప్పారు. నెనర్లు!
నరసింహ[వేదుల బాలకృష్ణమూర్తి]గారు: అవునండి. ఆర్దికమూలాలు దెబ్బతీస్తేనే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. నెనర్లు!
నారాయణ గారు: వై.యస్.ది హత్యేనని క్రితం టపాలలో చెప్పానండి. పాత టపాలు తిరగేస్తే మీకే తెలుస్తుంది. ప్రక్కనున్న లేబుల్స్ లో ‘అన్ని టపాలు ఒకేసారి చూడాలంటే’ అనే లేబుల్ లో గానీ, ‘అన్నిలేబుల్స్ ఒకే టపాలో’ అనే లేబుల్ లో గానీ చూడగలరు.
"వర్తమానంలో సభ్యత, సంస్కారాలు మరిచి పోవటానికి కారణం... గతంలో మన సంస్కృతిని మరిచి పోవటమే! వాటిని మరిచినందుకు ఇదే కదా పర్యవసానం"
_________________________________________________
మెజారిటీ ప్రజలు మంచిని చూడాలి అనుకుంటున్నారు కానీ మంచిగా ఉండాలి అనుకోవడం లేదు. సంస్కృతిని కాపాడాలి అనుకుంటున్నారు కానీ ప్రయత్నం చేయడం లేదు :)
Post a Comment