ఇటీవల మా మిత్రులొకరి ఇంటికి వెళ్ళాము. అతడు మా శిష్య సముడు. వాళ్ళింట్లో, అతడి మేనకోడలు, నాలుగున్నరేళ్ల బుడ్డిది ఉంది. అది మహా గడుగ్గాయి.

ఆ చిన్నిది చేపల కూర ఇష్టంగా తింటుంది, మటన్ పట్లా అభ్యంతరం లేదు, కోడి కూర తినమంటే మాత్రం వద్దని అరచి గీ పెడుతుంది. "అదేమిటి?" అనడిగితే....

ఓ సారి ఆ చిన్నిదాన్ని, వాళ్ళ మామయ్య [అతడు శాఖాహారి] చికెన్ షాపుకి తీసికెళ్ళి ‘కొక్కొరొకో’ అంటూ, గున గున తిరుగుతున్న కోళ్ళని చూపెట్టాడట. వాటిని చూసి మొదట అది కేరింతలు కొట్టింది. తర్వాత, దుకాణంలోకి తీసికెళ్ళి "అదిగో, చూడు! తెల్లగా ‘కొక్కొరోకో’ అంటూ అంత చక్కగా తిరుగుతున్నాయే, ఆ కోళ్ళని తీసుకొచ్చి, ఇలా మెడకాయ విరగ్గోస్తారు" అంటూ కత్తినీ, కోడి మాంసాన్ని ముక్కలు చేసే వ్యక్తినీ చూపించాడట.

అది నమ్మలేనట్లు చూస్తుండగా.... కొన సాగిస్తూ "ఆ కోడినీ మెడ విరిచేస్తే చనిపోతుంది. అప్పుడు దాన్నీ వేడి వేడి నీళ్ళల్లో అట్లా ముంచేస్తారు. ఆ తర్వాత, అదిగో అక్కడున్న మిషన్లో వేసి గిరిగిరా తిప్పుతారు. దాని ఈకలన్ని ఊడిపోయి, ఇదిగో ఇలా తయారౌతుంది. అప్పుడు దాని తోలు వలిచి, ఇట్లా ముక్కలు చేసి, పాలిధిన్ పాకెట్లో వేసి మనకి ఇస్తారు. మనం దాన్ని తెచ్చుకొని ఉప్పుకారం మసాలా వేసి, స్టౌమీద పెట్టి వండుతాం. ఇట్లా చేసిన కోడిని మనం తినటం అవసరమా?" అంటూ, దానికి చికెన్ దుకాణంలో జరిగే ప్రక్రియని 70MM లో చూపెట్టి, డిజిటల్ సౌండ్ లెవెల్ లో వినిపించే సరికి... దెబ్బకి ఆ చిన్నారి కాస్తా ‘బేర్’ మందిట. మేన మామ అదంతా చెప్పింతర్వాత నుండి, ఇక ఆ చిన్నది ‘చికెన్’ అంటే ఒట్టు... తిందామంటే వద్దంటుంది.

ఎందుకిదంతా చెప్పానంటే.... నాలుగేళ్ల చిన్న పాపకైనా... చెప్పే విధంగా చెబితే అది మనస్సు కెక్కింది.

అలాగే మన ఇతిహాసాలు, మత విశ్వాసాలు, మనిషికి చిన్నతనం నుండి... కొన్ని దుష్కర్మలు చేయవద్దని... చెప్పే విధంగా చెబుతాయి.

ఉదాహరణకి భాగవతంలో చెప్పబడే 28 నరకాల గురించి ఓసారి పరిశీలించండి. ఉషశ్రీ భాగవతం నుండి యధాతధంగా ప్రచురిస్తున్నాను.

మరణాన్ని ఆహ్వానించబోతున్న పరీక్షిత్తు మహారాజుకి మనోశుద్దికై శుకయోగి బోధించిన శ్రీమద్భాగవతం లోనిది ఈ సన్నివేశం!

>>>క్రూరకర్మలు, అధర్మపరులు, అయిన వారిని శిక్షించే నరక విశేషాలు చెపుతాను.

ఈ లోకాలన్నిటికి దక్షిణంగా ఉన్నాయి నరకాలు. అక్కడే పితృదేవతలు నిరంతరం తమతమ వంశాల శ్రేయస్సు కోసం ఆశీర్వాదాలు పలుకుతూంటారు.

యముడు నరకాధిపతి. ప్రాణుల కర్మలను చూసి తగిన శిక్షలు అందిస్తాడాయన. మొత్తం ఇరవై ఎనిమిది నరకాలున్నాయి.

తామిస్ర, అంధతామిస్ర, రౌరవ, మహారౌరవ, కుంభీపాక, కాలసూత్ర, అసిపత్రవన, నూకరముఖ, అంధకూప, క్రిమిభోజన, నందంశ, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయ్రోధ, ప్రాణారోధ, విశనన, లాలాదీక్షణ, సారమేయాదన, అవీచిరయ, రేతఃపాన, యివి మహానరకాలు.

క్షారకర్ధమ, రక్షోగణభోజన, శూలప్రోత, దందశూక, అవటనిరోధన, అపర్యావర్తన, సూచీముఖాలు నరకాలు.

ఇతరుల భార్యలను, బిడ్డలను అపహసించి, అవమానించే వారందరూ... తామిస్ర నరకంలో తిండిలేకుండా, పర్వతశిఖరాల మీద నుండి దొర్లించబడుతూ, యమకింకరుల ఉక్కు పాదాలతో తన్నులు తింటూ ఉంటారు.

పరస్త్రీ సంగమం చేసిన వానిని... అంధతామిస్రంలో పడవేసి హింసిస్తారు.

సంసార పోషణ కోసం యితరులను వంచించి ధనం సంపాదించేవాడు... రౌరవ నరకంలో యాతనలు పడతాడు.

తమతిండి తాము తింటూ ఎవరినీ హింసించకుండా బ్రతికే పశువులనూ, పక్షులనూ, హింసించే వారు... మహారౌరవం అనుభవిస్తారు.

తన పొట్టనింపుకుందు కోసం ఎలుకలుండే కన్నాలు మూసి వాటిని చంపుతారే, అటువంటి క్రూరులందరూ... కుంభీపాక నరకంలో మరుగుతూన్న నూనెమూకుళ్ళలో వేగుతారు.

తల్లిదండ్రులను, వేదవిదులను అవమానించి హింసించే వారికి... కాలసూత్ర నరకంలో మంటల మధ్య మాడేయోగం పడుతుంది. విపరీతంగా ఆకలి, దాహం కలుగుతాయి. నీరివ్వరు, తిండిపెట్టరు. కాలసూత్ర నరకంలో, చిక్కిపోయిన పశువులను బాధించి, బరువు పనులు చేయించే మూర్ఖులు కూడా ఈ నరకంలోనే పడతారు.

సనాతన ధర్మం బోధించే వేదమార్గాన్ని విడిచి, పాషండులై స్వేచ్ఛావిహారాన్ని ప్రచారం చేసి ఆచరించే వారిని... అసిపత్రవనంలో పారేసి, యమకింకరుల కొరడాలతో కొడుతూ పరుగులు పెట్టిస్తారు. ఈ అరణ్యం నిండా చురుకత్తులే ఆకులుగా, దట్టంగా పెరిగిన చెట్లుంటాయి. ఆ కత్తులు చీరుతూంటే దుర్బర యాతన పడుతూ ఈ నరకంలో గడపాలి.

దోషం చేశాడో లేదో తెలుసుకోకుండా, నిష్కారణంగా దండించే వారితో పాటు, వేదవిదులను హింసించేవారు... కాలసూత్ర నరకంలో పడతారు. వీరిని యమభటులు చెరకుగడలు విరిచినట్లు విరుస్తూ హింసిస్తారు.

జంతుహింస చేసేవారు... అంధకూప నరకంలో పడి, వివిధ జంతువుల చేత, సర్పాల చేత, దోమల, నల్లులూ, ఆదిగా గల క్రిమికీటకాల చేత బాధలు పడుతుంటారు.

ధన సంపదలతో తులతూగే వాడు, బంధు మిత్రులకు పెట్టకుండా తన తిండి తాను చూసుకుంటూ బ్రతుకుతాడు. వాడిని.... క్రిమి భోజన నరకంలో త్రోసి అందులోని క్రిములే ఆహారంగా పెడుతూంటారు.

ఏ పని చెయ్యడానికి నడ్డి వంగక, దొంగతనంతో జీవించే వారిని... తప్తోర్మిలో పడవేసి కాలుతూన్న ఇనుపగుళ్ళతో బాదుతారు.

వావి వరుసలు లేకుండా సంగమం చేసే స్త్రీ పురుషులను.... ఉక్కు కొరడాలతో కొడుతూ, మండుతున్న ఉక్కు విగ్రహాలను కౌగిలింపజేస్తారు.

కొందరు కాముకులు పశువులతో సంగమం చేస్తారు. వారిని... వజ్రకంటక సదృశంగా ఉండే ఆకులు గల జువ్వి చెట్టుకి కట్టి పొడుస్తారు.

పాషండులతో సహవాసం చేసి ధర్మపధం తప్పిన వారిని... వైతరణీ నదిలో ముంచుతారు. ఈ నది మలమూత్ర రక్తమాంసపూరితమై ఉంటుంది.

వేదవేదాంగాలు అధ్యయనం చేసిన వారు, తీవ్రపశు ప్రవృత్తితో పరస్త్రీ సంగమం చేస్తే, వారిని... మలమూత్ర లాలాజల శ్లేష్మభరితమయిన కూపంలో ముంచుతూ, అతిహేయ మయిన పదార్థాలు ఆహారంగా యిస్తారు.

జాగిలాలను పెంచి వానితో వేట సాగించే వారిని... వాడి శూలాలతో పొడుస్తూ బాధిస్తారు.

ఆడంబరం కోసం పశువులను చంపి క్రతువులు చేసేవారిని.... పదునుగల రంపాలతో కోస్తూంటారు.

కొందరు రాజవంశీయులు, చోరులు కలిసి, సంపన్నులను హింసించి దోపిడీలు చేస్తారు. ఇళ్ళు తగల బెడతారు, కౄరుల నియోగించి సాధువులను చంపిస్తారు. వీరందరినీ.... యమలోకంలోని జాగిలాలు వాడి కోరలతో చీల్చుకు తింటాయి.

లంచాలు పట్టి దొంగ సాక్ష్యాలు చెపుతారే, అటువంటి వారిని... వీచీ నరకంలో ఎత్తైన పర్వత శిఖరం ఎక్కించి కాళ్ళు పైకి ఎత్తిపట్టి తలక్రిందకి పెట్టి వదులుతూంటే, ఆ జీవి బండరాళ్ళ మీద పడి ముక్కలు ముక్కలై మళ్ళీ అతుక్కుంటుంది. ఆ ప్రాణిని అలా పడవేస్తూనే హింసిస్తారు.

పతివత్రలను కామించే వారిని, విలాసంగా మద్యపాన, సోమపానాలు చేసేవారిని... గుండెల మీద త్రొక్కుతూ, నిప్పుల మీద ఎర్రగా కాలుస్తూ, మరుగుతున్న ఉక్కును నోట్లో పోస్తారు.

ధూర్తులు కొందరు వేడుకగా జంతుహింస చేస్తారు. వీరిని.... దందశూక నరకంలో అయిదుపడగల పాములు కాటువేసి బాధలు పెడతాయి.

అతిధి అభ్యాగతులను క్రూరంగా చూసేవారిని... గ్రద్దలూ, కాకులూ వాడిముక్కులతో పొడిచి హింసిస్తాయి.

సిరిసంపదలున్న వాడు దానధర్మాలు చేయకుండా లోభంతో బ్రతికితే.... సూచీముఖ నరకంలో వేసి గట్టి తాళ్ళతో బంధించి పీడిస్తారు.

ధర్మమార్గాన సత్యవ్రతంతో సాధుశీలంతో పరోపకారపరాయణులై జీవించే వారు స్వర్గభోగాలనుభవిస్తారు.

జలజ భవాదిదేవ మునినన్నుత తీర్ధ పదాంబుజాత! ని
ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభ భూషణాంగ! ఉ
జ్జ్యల తులసీమరందమద వానసవాసిత దివ్యదేహ! శ్రీ
నిలయశరీరకృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా!
~~~~~~~

ఒకసారి చచ్చాకే నరకాన్ని చేరినందున, నరక బాధలు అనుభవించాల్సిందే తప్ప, చావు కూడా రాదు. చచ్చిన వాడికి మరో చావు ఉండదు కదా!

పాపం చేస్తే ‘నరకానికి పోతారనే’ భయం, మనిషిని కొంత కట్టడి చేస్తూంది. సాధారణంగా మన పల్లెల్లో, ఇప్పటికీ పెద్దవాళ్ళు, కుక్కలని రాళ్ళువిసరి హింసించే పిల్లల్ని మందలిస్తూ, "తప్పు! అలా చేస్తే కళ్ళుపోతాయి" అంటూ ఉంటారు. అది పిల్లలకి అర్ధమయ్యే భాష! "ఒక్కసారి కళ్ళు మూసుకుంటే.... ఏదీ కనిపించదు. అలాంటిది, కళ్ళు పోతే? అమ్మో! ఇంకేమైనా ఉందా?" - అనే ఊహ, పిల్లల్ని పోకిరి పనుల నుండి దూరంగా ఉంచుతుంది.

అలాంటి చోట ‘సోకాల్డ్ హేటు వాదులు’ తాము అలాంటిదే ఏదో ఒక దుష్కర్మ డెమోగా చేసి, "ఏదీ, నా కళ్ళు పోయాయా? అవన్నీ దొంగబద్దాలు. పుక్కిటి పురాణాలు. శతాబ్దాలుగా జనాలని అణిచి వేయటానికి చెప్పిన మాటలు!" - అంటూ... వ్యతిరేక భావనలు నూరిపోస్తే ఏమవుతుంది? ఇలాంటివి ‘మేధావులు’ అని ముద్రపడ్డవాళ్ళు చెబితే ఎలా ఉంటుంది?

ఇప్పటి సమాజమే పరిణామమై కూర్చుంటుంది. అప్పటి కప్పుడు భౌతిక నేత్రాలు పోకపోవచ్చు! కానీ నైతిక నేత్రాలు నష్టమైతే సమాజం చేరేది ఈ భ్రష్ట స్థితికే!

అప్పుడు... "సమాజంలోని మానవ విలువలు పూర్తిగా పతనమవుతున్నాయని, విలువలు లేని సమాజంలో మనుగడ సాగించే మనుషులు మరమనుషులతో సమానమని..." అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ ల వంటి గురివిందగింజలే ఎటు చూసినా దర్శనమిస్తాయి.

అప్పుడు... తన కూతుళ్ళ కంటే చిన్న వయస్సున్న శిష్యరాళ్ళని చెరిచే పార్క్ ఉడ్ అహ్మదుద్దిన్ ఆయూబ్ లూ తయారౌతారు. గురువుకైనా... శిష్యురాలిగా కంటే ప్రియురాలిగా ఉంటే.... ‘కూల్ డ్రింక్ లూ, లిప్ స్టిక్కులూ ఇప్పిస్తాడు, రెస్టారెంట్లకు తీస్కెళ్ళి నూడుల్సూ పిజ్జాలు తినిపిస్తాడు, పరీక్షల్లో కాపీలు కొట్టనిస్తాడు, మార్కులెక్కువ వేస్తాడు’ అనుకునే సంక్షేమ హాస్టళ్ళ విద్యార్దినిలూ, విశ్వవిద్యాలయ విద్యార్దినులూ, తయారౌతారు. ఇలాంటి వాళ్ళని కూడా నేను స్వయంగా పరిశీలించాను. సంక్షేమ హాస్టళ్ళల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ అందరూ ఇలాగున్నారని కాదు, ఎక్కువ మందే తారసిల్లటం యదార్దం.

నిజానికి, సమాజంలో అన్నివర్గాల ప్రజలు... పరస్పర సహకారంతో, పరస్పర గౌరవంతో, అవగాహన తో జీవించేందుకు తగిన విధంగా... మన పెద్దలు కొన్ని నమ్మకాలను, వ్యవహార సరళిని ఏర్పరిచారు. మతంతో దాన్ని మేళవించారు. అందులో... ఋతువులలో పాటు మారే వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా తీసుకోవాల్సిన ఆహార, ఆరోగ్య జాగ్రత్తల దగ్గరి నుండి, శారీరక మానసిక అసౌకర్యాలని తొలగించుకునేందుకు పాటించవలసిన పద్దతుల దాకా...!

ఇన్ని చెబితే పామరులకు, పనిపాటలలో మునిగి తేలే వారికీ... అర్దం చేసుకునే స్థిమితం ఉండవన్నట్లుగా, సాంప్రదాయాల పేరిట, ఆచరణా సరళి లోనికి చొప్పించారు.

మచ్చుకి ఒకటి రెండు విషయాలు చెబుతాను.

ఉదయాన్నే ‘వాకిలి ఊడ్చి, ముగ్గుపెట్టని గుమ్మం దాటి మగవాళ్ళు బయటికి వెళ్తే దరిద్రం’ అని ఓ నమ్మకం, నా చిన్నతనంలో ఆచరణలో ఉండేది. ఇప్పుడు పట్నాల్లో అపార్ట్ మెంట్లలో ఇది చెల్లక పోవచ్చు గానీ, ఒకప్పటి పల్లెల్లో అయితే... ఇంటి ముందర నాలుగు మొక్కలు, రెండు చెట్లు ఉండటం కద్దు. ఏ పామో తేలో మరుగున ఉండొచ్చు. అసలే వేకువ ఝామునే పొలం బయలుదేరే రైతులు!

ఉదయమే వాకిలి ఊడ్చేందుకు ఇల్లాలు ముందుగా లేస్తే... కాళ్ళకున్న మువ్వలపట్టీలు, చేతి గాజులూ సవ్వడి చేస్తుండగా వచ్చి, చీపురు దులిపి ఊడ్చటం మొదలు పెడితే... అలికిడికి, పాము తేళ్ళ వంటి విషప్రాణులు ప్రక్కకు పోతాయి. ఆపైన కల్లాపి చల్లి ముగ్గు పెడితే... పూర్తి భద్రత! అప్పుడు గడప దాటే మగవాళ్లు, పిల్లలకు సమస్య ఉండదు.

అలాగ్గాక... అప్పటికి ఇంటి ఇల్లాలు పక్క దిగదు. అయ్యవారు మాత్రం పనికి పోయేందుకు బయటికొచ్చి... పాము కాటుకో, తేలు వేటుకో గురయ్యాడనుకొండి. ప్రాణాలు పోయినా, రోగ గ్రస్తుడైనా, ఇంటికి సంపాదించి పెట్టే వాడు పోతే పట్టుకునేది దరిద్రమే కదా?

అలా, కొన్ని నమ్మకాల వెనుక ఉండేది... సంభావ్యతకు ఆస్కారాలే!

"తినేవేళ దీపమారిపోతే... మళ్ళీ దీపం వెలిగించే దాక, ముద్దనోట బెట్ట వద్దు. అలా పెడితే అరిష్టం!" అంటారు.

ఎందుకంటే... పూర్వం పూరిళ్ళు ఎక్కువగా ఉండేవి. నూనె దీపాలు వెలిగించుకునేవాళ్ళు. తింటున్న వేళ దీపం కొండిక్కెతే... అసలే అప్పటి రోజుల్లో విషక్రిములు ఎక్కువయ్యె! ఏ సాలె పురుగో, విష క్రిమి కీటకమో అన్నంలో పడితే... తిన్నారనుకొండి. వచ్చేది అనారోగ్యం, పట్టేది అరిష్టమే!

ఈ విధంగా కొన్ని అర్దవంతమైన ప్రయోజనాలకి.... వివరణలు, విశ్లేషణలు మరుగున పడి... నమ్మకాలు, మూఢనమ్మకాలుగా మారి, చివరికి పిల్లిగంపల వంశాలు తయారయితే... ఆ లోపం ఆచరణది కాని, నమ్మకాలది కాదు; లోపం ఖచ్చితంగా ఆలోచనా రాహిత్యానిదే!

అలాంటి చోట... మూడు నాలుగు దశాబ్దాల క్రితం, హేటు[హేతు]వాదులు... హిందూ మత విశ్వాసాలని, మతాచరణలని ఎంతగా హేళన చేసారంటే... భారతీయ సమాజం అభివృద్ది చెందకపోవటానికి అవే కారణ మన్నారు. వేల సంవత్సరాలుగా, మతం పేరు చెప్పి, కొన్ని వర్గాల ప్రజలు, మరికొన్ని వర్గాల వారిని అణగద్రొక్కారన్నారు. స్త్రీలని పురుషులు, పులుసులో ముక్కల్లాగా వంటింటికి పరిమితం చేశారన్నారు. స్త్రీ విముక్తి కోసం పరితపనలు, పలు రచనలు చేశారు. [వాటి గురించి మరెప్పుడైనా...]

వేదవేదాంగ జ్ఞానాన్ని కొంతమందికే పరిమితం చేసి, ప్రజలని అంధకారం లోకి నెట్టి వేసారని గగ్గోలు కూడా చేసారు. వేద వేదాంగ జ్ఞానాన్ని దాచిపెట్టి, కొన్ని వర్గాల వాళ్ళే అధిపత్యం చలాయించారని హేతు వాదులూ, విప్లవవాదులూ ఎంత వాదించినా... అందులో నిజం కన్నా ప్రచారమే ఎక్కువగా ఉంది. యూరప్ లో బైబిల్ ని దాచిపెట్టి, అంధకారంలో జనాలని ముంచిన పోప్ ల మాదిరి, భారతదేశంలో వేద వేదాంగ జ్ఞానం దాచిపెట్టబడలేదు.

[అసలొక వాదన ప్రకారం... వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్నది జ్ఞానమే కాదు, మూఢనమ్మకం! అలాంటప్పుడు ఆ జ్ఞానాన్ని అందనీయకుండా చేస్తే, మిగిలిన వాళ్ళకి జరిగిన అన్యాయం ఏముంటుంది? ఇంకా మేలే కదా? - మళ్ళీ అక్కడి కొచ్చేసరికి, ఈ వర్గాహంకార విప్లవవాదులు, ఇతర వర్గాల వాళ్ళు తమని అణగ దొక్కారంటారు.]

సరే, వేదాల, ఉపనిషత్తులలోని జ్ఞానాన్ని క్రింది వారికి అందనివ్వకుండా, కొన్ని వర్గాల ప్రజలు, సమాజంలో కొందరిని అణగదొక్కారనే అనుకుందాం.

ఇతిహాసాలైతే... అందరికీ అందుబాటులోనే ఉన్నాయిగా! మనిషి అరిషడ్వర్గాలని నియంత్రించగలిగే ‘పాపభీతి, పుణ్యప్రీతి’ వంటి నమ్మకాలన్నీ ఇతిహాసాల్లో ఎక్కువగా పొందుపరిచి ఉన్నాయి.

ఆ నమ్మకాలనే... దశాబ్దాలుగా, ప్రణాళిక బద్దంగా... గోరాశాస్త్రిలూ, రంగనాయకమ్మలూ, హేతు వాద సంఘాలూ.... సర్వనాశనం చేసాయి. ఫలితాన్ని ఇప్పటి తరాలు అనుభవిస్తున్నాయి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

14 comments:

""ఆడంబరం కోసం పశువులను చంపి క్రతువులు చేసేవారిని ""
చిన్న డవుటు ... "క్రతువులు" అంటే ఎమిటండి ??

మంచు పల్లకీ గారు: క్రతువులు అంటే యజ్ఞాలు అని ఒక అర్దం ఉందండి. బలులతో కూడిన యజ్ఞాలను ఆడంబరం కోసం చేసేవారిని.... అని పైవాక్యంలో అర్దం కావచ్చు అని నేననుకుంటున్నాను.

>> దానికి చికెన్ దుకాణంలో జరిగే ప్రక్రియని 70MM లో చూపెట్టి, డిజిటల్ సౌండ్ లెవెల్ లో వినిపించే సరికి... >>
వేద వేదాంగాల విషయంలో ఇది నిజమేనా?
మీరు చెప్పేది ఎలా వుందంటే , ఈ కాలం పిల్లలు చికెన్ దుకాణం కి తీసుకెళ్లి 70 ఎం.ఎం సినిమా చూపిస్తుంటే కళ్లు మూసుకున్నట్టు! అసలు మన పెద్దల తప్పు ఏమి లేనట్టు!
అసలు కారణాలు చెప్పకుండా మంచి విషయాలు చెప్పినా , చెప్పినదంతా సర్వకాల సర్వావస్థలకి సర్వులకి మంచిదని చెప్పి , దానిని ప్రశ్నించొద్దు అంటే అవి మూడ నమ్మకాలే!
కళ్లు చెవులు మూసుకుని ఆచరించడం మూఢం..అంధమూ!
ఈ సంప్రదాయాలు వెనక అసలు కారణం చెప్పకపోవడం మీకు అసలు తప్పే కాదు అనిపిస్తుంటే .. అపనమ్మకంగా వుంది! ఈ పద్ధతి మనిషి విచక్షణకే ఒక అవహేళన! అర్ధం చేసుకోలేడని అపహాస్యం!
ఎక్కడ ఈ సంప్రదాయాల విషయంలో 70 ఎం.ఎం. సినిమా?
ఎక్కడ డిజిటల్ సౌండ్ లెవల్?
అంత కళ్లు గప్పి జెల్ల కొట్టడమే! అర్ధం చేసుకునేటట్టు చెప్పకపోవడమే కాక మళ్లీ అర్ధం చేసుకోరు అని అపహాస్యం!

చక్కగా అర్థవంతంగా చెప్పారు. కొంతమంది మూర్ఖ హేటువాదుల గురించి చక్కగా చెప్పారు. మీ బ్లాగు ఓ ఎన్సైక్లో పీడియా, నాకు చాలామటుకు నచ్చింది.

దయచేసి జ్యోతిష్యం మీద మీ అభిప్రాయన్ని తెలియజేయండి.

*వేద వేదాంగ జ్ఞానాన్ని దాచిపెట్టి, కొన్ని వర్గాల వాళ్ళే అధిపత్యం చలాయించారని హేతు వాదులూ, విప్లవవాదులూ ఎంత వాదించినా...*
అమ్మా, సరిగ్గా చేప్పారు. కొంతమంది దేవాలయాలో కుచొని సుఖాలు అనుభవించి నట్లు మిగతావారు పోలాలో కష్టపడి పని చేసినట్లు రాస్తుంటారు. ఇదొక తప్పుడు ఆరోపణ. వాస్తవం గా చూస్తే ఇప్పుడున్నని దేవాలయాలు ఒకప్పుడు లేవు. శ్రీరంగం, కంచి,తిరుపతి శ్రీశైలం లాంటి పెద్ద దేవాలాయాలు ఉండేవి మిగతా ఎవో ఊరికి రెండో మూడో చిన్న దేవాలయలు అందులో పని చేసే వారు మహా ఐతె ఎంత మంది ఉంటారు, ఆ వర్గానికి చెందిన మిగతావారు ఏ పనులు చేసుకొని బతికారు? అని ఎవరు ఒక్కసారి ప్రశ్న వేసుకోరు.

well said

అదే సందేహం ... "బలులతో కూడిన యజ్ఞాలను" లొక కళ్యాణం కొసం చేస్తే తప్పుకాదు కానీ ఆడంబరం కొసం చెయ్యకూడదు అని.
ఇది కొత్త విషయం .. ఈ నిబంధన వుందని నాకు తెలీదు ....

** కొంతమంది మూర్ఖ హేటువాదుల గురించి చక్కగా చెప్పారు ** అవును.
[]లొ మీరు రాసిన లాజిక్ కి ఈ పనికిమాలిన హేటువాదుల దగ్గర సమాధానం వుంటుందా :-)) హ హ హ ..
మన దేశంలోని హేటువాదులను ఎక్కడొ నిర్వచించాను.. లింక్ దొరుకుతుందేమో చూస్తానుండండి..

మన దేశం లొ నాస్తికవాదులు అంటే..
హిందు మతం అంటే ద్వేషం
క్రైస్తవ మతం అంటే ప్రేమ
ముస్లిం మతం అంటే భయం
మిగతా మాతాలు అంటే అలసత్వం
ఈ లక్షణాలు వుంటే మన దేశం లొ హేతువాదులు/నాస్తికులుగా అర్హత వస్తుంది.. మిగతావన్ని ట్రాష్..

http://sarath-kaalam.blogspot.com/2010/06/blog-post_04.html?showComment=1276010318956#c6281600619387979485

నాటు నాస్థికవాదులకు మంచు చెప్పిన నిర్వచనం కరెక్ట్ గా సరిపోయింది.

అమ్మ చెప్పింది ఒకటైతే డౌటు వచ్చింది, వేద వేదాంగాలు 70ఎం.ఎం లో వుండేవా కాదా అని! హ్హ్వా .. హ్వా.. హా.. కృష్ణగారి జోకు నన్ను కడుపుబ్బ నవ్వించింది.

కృష్ణ గారు: మనం ఏ విషయాన్నైనా మన విజ్ఞతని బట్టి అర్దం చేసుకోగలం. అలాగే మీరు నా టపానైనా...!

snkr గారు: ఎన్సైక్లోపిడియా అంత సీన్ లేదండి! మీ అభిమానానికైతే మనసారా కృతజ్ఞతలు!

అజ్ఞాత గారు: గాఢత నిండిన మీ భావం అర్ధమైందండి. కృతజ్ఞతలు.

Amar గారు: నెనర్లండి!

మంచుపల్లకీ గారు: హేతు వాదుల గురించి బాగా చెప్పారండి.
ఇక క్రతువుల గురించి.... ఇది కొత్త విషయమేమీ కాదండి. ఏ పనినైనా, భగవంతుడి పూజనైనా, క్రతువు నైనా సత్పంకల్పంతో చేయాలి. భక్తీ, సంకల్పాలే ముఖ్యంగానీ, భగవంతుడి కర్పించే నైవేద్యం కాదని... గీత స్పష్టంగా చెబుతుంది. భక్తితో తనకి, ఫలంగానీ, పుష్పంగానీ, పత్రంగానీ, చివరికి నీటి ని సమర్పించినా తాను దాన్ని ప్రీతితో స్వీకరిస్తానంటాడు శ్రీకృష్ణుడు గీతలో! అంతే గానీ, గొప్పగా నేతితో చేసిన చక్రపొంగలి పెడితేనే తనకిష్టం అనడు. :) దీని గురించిన చక్కని కథ, శ్రీరామకృష్ణ మఠం ప్రచురణ - బాలల కథా మంజరిలో ఉంది. ఎప్పుడైనా వ్రాస్తాను.

@ ఆది లక్ష్మి గారు,
కృతజ్ఞతలు మీ అబినందనలకి!
ఒక మాష్టారు చదువు చేప్పేటప్పుడు, అసలు ఫార్ములా చెప్పకుండా 2X2 = 4 అని చెబితే నా లాంటి పిల్లకాకులు 3X3 = 6 అనే అనుకుంటారు మూఢంగా! అందరు అంత తెలివి గలవారు కాదు కదండీ! అసలు లొసుగులు పట్టుకోవడానికి! మా పిల్లకాకులదే తప్పు!
1) శకునం చూసి బయలు దేరాలి, విధవ, బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు!
2) సుమంగళీ పసుపు రాసుకొవాలి, బాల్య వితంతువులకి మటుకు పసుపు కుంకుమలు పని కి రావు!
3) పొద్దునే ముగ్గు వేయకుండా ఇంటి మగాళ్లు బయటికి వెళితే అరిష్టం! ఎందుకంటే పాము పుట్రా కరుస్తాయేమొ కదా! మరి గాజులు పట్టీలు లేని విధవ సోదరి అన్న కోసం ముగ్గు వేయ్డానికి వెళ్లి పాము చేత కరిపించుకుంటే అది ఆ పిల్ల ( కాకి) తప్పు కదండీ! పొద్దునే ముగ్గు ఎందుకు వేయాలో సరిగా చెప్పని పెద్దలది ఏమి తప్పు వుంది!

"ఉదయమే వాకిలి ఊడ్చేందుకు ఇల్లాలు ముందుగా లేస్తే... కాళ్ళకున్న మువ్వలపట్టీలు, చేతి గాజులూ సవ్వడి చేస్తుండగా వచ్చి, చీపురు దులిపి ఊడ్చటం మొదలు పెడితే... అలికిడికి, పాము తేళ్ళ వంటి విషప్రాణులు ప్రక్కకు పోతాయి. ఆపైన కల్లాపి చల్లి ముగ్గు పెడితే... పూర్తి భద్రత! అప్పుడు గడప దాటే మగవాళ్లు, పిల్లలకు సమస్య ఉండదు."

మీరు చెప్పే "హేటు" వాదులకీ, ఈ టపాకీ పెద్ద తేడా వుందనిపించట్లేదు. కాకపోతే వాళ్ళు ఆ వైపు నుండి చేసే వితండవాదం మీరు ఈ వైపు నుండి చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే...

మంచుగారు,
పూర్వం యజ్ఞయాగాదులలో బలులు సర్వసాధారణం, చాలా పెద్ద యెత్తున జరుగుటుండెవట, ఆ తంతును శ్రీ ఆదిశంకరాచార్యులువారు ఆపి బియ్యంతో చేసిన జంతు బలులు ప్రవేశపెట్టారు. కాబట్టి లోకరక్షణార్ధమే బలి అర్పించాలి తప్ప, స్వలాభం కోసం వద్దు అనెమో దాని భావన..

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu