1993 నుండి 1995 వరకూ మేము శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారిలో ఓ చిన్న గుడిసెలో నివసించాము. ఒక్కరికి తప్ప అక్కడెవరికీ కరెంటు ఉండేది కాదు, మాక్కుడా! 1994 చివరి మాసాల్లో... ఉన్నట్లుండి ఒక్కసారిగా గంగ మెట్ల దారిలో ఉన్న గుడిసెలన్నిటినీ దేవస్థానం మరియు అటవీ శాఖ వాళ్ళు పీకించబోతున్నారన్న వార్త దావానలంలాగా చుట్టుముట్టింది. దాదాపుగా 150 - 200 గుడిసెలుంటాయి. బుట్టి నడుపుతూ, చేపలు పడుతూ, మేకల్ని పెంచుతూ, యాత్రికులని నదిలో షికారు తీసుకెళుతూ బ్రతికే వాళ్ళే అక్కడందరూ. ఎవరికీ చదువు సంధ్యలు రావు. దాదాపుగా అంతా వేలిముద్రల వాళ్ళే!
ఆ వార్తతో ఒక్కసారిగా అక్కడ సంచలనం రేగింది. భయాందోళనలు పుట్టాయి. తాతల కాలం నుండి అక్కడే ఉన్నామని, డ్యాం కట్టటానికి ముందునుండే అక్కడే ఉంటున్నామనీ చాలామంది అక్రోశించారు. గుంపులుగా చేరి చర్చించుకున్నారు. మల్లగుల్లాలు పడ్డారు. ఇంతలో "హైదరాబాదులో సంధ్యక్క ఉందంట. అందరం హైదరాబాదు వెళ్ళి కలిసి మాట్లాడితే సంధ్యక్క ఎట్లనైనా మన గుడిసెలు పీకేయకుండా ఆపిద్ది" అన్న ప్రచారం బయటికొచ్చింది. ఓ వారం పదిరోజుల గడిచే సరికి కార్యక్రమం నిర్ధారించబడింది. శ్రీశైలం ప్రాజెక్ట్ లో కాంట్రాక్టరు దగ్గర నుండి ఓ ఎర్రపార్టీ కార్యకర్త లారీని తీసుకొచ్చాడు. పొలోమని, ఇంటికి ఒకరిద్దరు చొప్పున దాదాపు లారీకి నిండుగా హైదరాబాదు వెళ్ళారు.
ఈ గొడవంతా మాకెందుకని, మేం నేరుగా శ్రీశైలం ఈవో దగ్గరికెళ్ళి మా గుడిసె పీకేయించవద్దని విజ్ఞాపన పత్రం ఇచ్చాము. అతడు ఆశ్చర్యపోయి అసలు అలాంటి ప్రణాళికే తమ వద్ద లేదనీ, అటవీ శాఖకి ఆ స్థలంలో ఎలాంటి అధికారాలూ లేవని, కాబట్టి గంగ మెట్ల దారిలోని గుడిసెలకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పాడు. అంతేగాక కావాలంటే మాకు గుడి దగ్గర గది allot[అద్దె నెలకు60/- రూ.] చేస్తానన్నాడు. అప్పటి మా ఆర్ధికస్థితి పట్ల నమ్మకం లేక మేం ’మా గుడిసెలో మమ్మల్ని ఉండనిస్తే చాలు. అదే పదివేలు’ అనుకున్నాము. [అద్దె కట్టలేమన్న భయం కొద్దీ. పరిస్థితులు అలియాస్ రామోజీరావు ఏ స్థాయి లో మమ్మల్ని అప్పట్లో భయపెట్టాడో తెలుస్తుంది కదూ!] ఈవోకి కృతజ్ఞతలు చెప్పుకుని సెలవు తీసుకున్నాము.
ఆ మర్నాడు వార్తాపత్రికల్లో హైదరాబాదులో ఎర్రపార్టీ వాళ్ళ అధ్వర్యంలో భారీ సభ జరిగినట్లు వార్తలొచ్చాయి. మేం యధాలాపంగా చదివి వదిలేసాము. తర్వాత రోజు హైదరాబాదు వెళ్ళిన మాతోటి గుడిసె వాసులంతా తిరిగి వచ్చారు. వాళ్ళతో మాట్లాడాక మాకు అర్ధమయ్యిందేమిటంటే - వాళ్ళంతా కూడా ముందురోజు జరిగిన భారీ సభకి హాజరు పరచబడ్డారు. అయితే వీళ్ళు సంధ్యక్కని కలవ లేదు. వీళ్ళని తీసుకెళ్ళిన ఎర్రపార్టీ కార్యకర్తే సంధ్యక్కతో మాట్లాడాడట. ’సంధ్యక్క, అవసరమైతే ఈవో మీద అంతకంటే పైవారి మీదా కూడా వత్తిడి తెస్తామని’ చెప్పిందట. వాళ్ళంతా ఆమె పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో చెప్పారు.
సభ అయిపోయిన తరువాత, తిరుగుప్రయాణంలో ఆ ఎర్రపార్టీ అన్న వీళ్ళని వేరే లారీలో ఎక్కించాడు. ఆ లారీ వాడు వీళ్ళని మధ్యదారిలో వదిలేసి చక్కాపోయాడు. చచ్చీచెడీ బస్సుల్లో తిరిగివచ్చారు. హైదరాబాదు ప్రయాణంలో అగచాట్లు పడినా, సంధ్యక్క కారణంగానే తమ గుడిసెలు నిలబడ్డాయని వాళ్ళు సిన్సియర్ గా సుదీర్ఘకాలం[ఇప్పటికీ] నమ్మటం మాకు ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు అంతగా నమ్మటానికి కారణం తమని ఎక్కడా పైసా అడగలేదు. తమ కష్టానికి అన్నలే ఉచితంగా లారీని ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ దగ్గర అడిగి తీసుకొచ్చారు. డీజీల్ కూడా వాళ్ళ ఖర్చే. అలాంటి చోట ’తమని ఎందుకు అన్నలు మోసం చేస్తారు?’ అన్నది వాళ్ళ లాజిక్. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే - డీజీల్ ఖర్చు, లారీ ఖర్చు ప్రాజెక్ట్ కాంట్రాక్టరిది.
అసలు జరిగిందేమిటో తెలుసుకోవటానికి వాళ్ళకి చదువురాదు. అన్నల మీద వాళ్ళకున్న ’గురి’కి, ఇదీ విషయం అని చెప్పినా నమ్మరు. ఇప్పుడు వాళ్ళు గుడిసెలకి కరెంటు వచ్చింది. చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చాయి. కలర్ టీవీలు వచ్చాయి. చదువులు రాలేదు. ఆలోచనలూ మారలేదు. దగా పడటమూ పోలేదు. ఎర్రపార్టీ వాళ్ళు, తామే పుకారు పుట్టించి, తామే ఉద్దరించేసారు.[కష్టం తామే కలిగించి, తామే ఆపద్భాంధవులు కావటం... పది స్ట్రాటజీలలో ఇదీ ఒకటి!]
అదంతా గమనించాక, ’సభలకి జనాలని సమీకరించటానికి ఇలాంటి పద్దతులూ ఉన్నాయన్న మాట’ అనుకున్నాము. ఇంకా 2009 ఎన్నికల్లోనే రోజుకూలి 150 - 250 రూ. + సారా పాకెట్టు + బిరియానీ పాకెట్టు ఇస్తే గాని జనాలు రావటం లేదని చదివి ’ఫర్వాలేదు. 14 ఏళ్ళు గడిచే సరికి ఆపాటి గడుసుదనం జనాలకి వచ్చింది కాబోలు’ అనుకున్నాము. ఉద్యమాల కోసమో, ఊరేగింపుల కోసమో, సభల కోసమో, సమావేశాల కోసమో, జనాలు దండిగా కనబడాలంటే - డబ్బిచ్చి తెచ్చుకునే కూలీలతో పాటు, పుకార్లతో భయాలు సృష్టించి లేదా ఆశలు పుట్టించీ [స్థలాలకీ పట్టాలిస్తారు గట్రా] పల్లెల నుండి ప్రజలని తరలిస్తారన్న విషయం అర్ధమయ్యింది. ఎటూ మద్దతుదారులు కొందరు, స్వచ్చందంగా వచ్చేవారు మరి కొందరూ ఉంటారు కదా!
మొత్తానికీ అలా పుకార్లతో, ప్రచారాలతో భయాల్నో లేక ఆశల్నో రేపటం చాలా సులభం అన్న విషయం మాకు ప్రత్యక్షంగా, అనుభవ పూర్వకంగా అర్ధమయ్యింది.
విచిత్రమేమిటంటే ఇప్పటికీ అక్కడి గుడిసె వాసుల్లో భౌతికంగా చిన్నచిన్న మార్పులు [సెల్ ఫోన్లు, కలర్ టీవీలు, గుడిసెలకి కరెంటు వంటివి] తప్ప పెద్దగా అభివృద్దేం లేదు. ఇప్పటికీ ఆ గుడిసె వాసుల నుండి ఒక్కడూ చదువుకొని సాంఘీకంగా, ఆర్ధికంగా మంచి స్థాయికి వచ్చిందీ లేదు. గుడిసెలూ మారలేదు. వారి ఆలోచనలూ మారలేదు. ఇప్పటికీ ఏ రోజు సరుకులు [బియ్యం, పప్పు గట్రా] ఆరోజు కొనుక్కుంటారు. జీవన స్థాయిలోనూ, ఆలోచనా సరళిలోనూ కూడా వారిలో మార్పేం లేదు.
అంతే కాదు ఇప్పటికీ వాళ్ళు తమ గుడిసెలు నిలబడి ఉండటానికి అన్నలే కారణం అని నమ్ముతారు.
అలా నాయకులని గ్రుడ్డిగా నమ్మే ప్రజలున్నంత కాలమూ, దగా చేసే నాయకులూ ఉంటారు. ఇటలీ నుండి ఇండియాకి వచ్చిన నాయకులైనా, పాకిస్తాన్ నుండి వచ్చి పరిపాలిస్తున్న నాయకులైనా, ఎన్టీయే లైనా, యూపీఏ లైనా... ప్రజల పట్లా, దేశం పట్లా, నిబద్దతా నిజాయితీ లేని నాయకులు నిరంతరం ప్రజలని మోసగిస్తూనే ఉంటారు. అందుకు ప్రాంతీయ భేదాలేవీ ఉండవు. బీహార్ ని బీహారీ అయిన లాల్ ప్రసాద్ యాదవ్ విడిచి పెట్టాడా? ప్రజలని దోచుకోవటమే కాదు, పశువుల దాణాని సైతం విడిచిపెట్టలేదు. తమిళునాడైనా, ఆంధ్రప్రదేశ్ అయినా... ఏ రాష్ట్రమైనా అంతే! ఈ పాటి దానికి ఆంధ్రా పాలకులు తమను అణచి వేస్తున్నారనో, తెలంగాణా నాయకులు దగా చేస్తున్నారనో అనుకోవటం దేనికి? ఏ రాయి అయినా ఒకటే పళ్ళుడగొట్టు కోవటానికి అన్నట్లు, రాజకీయ నాయకులంతా ప్రాంతాలకూ, పార్టీలకూ అతీతంగా, అవకాశాన్ని బట్టి సామాన్య ప్రజలని దగా చేస్తూనే ఉన్నారు.
ఇలాంటి నాయకులని నమ్ముతున్నంత కాలం బలిపశువులకీ, బలిదానాలకీ వ్యత్యాసం లేదు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
చదువుసంధ్యలు లేకపోయినా చక్కగా బ్రతకవచ్చును అన్న కోణంలో ఆలోచించినా, జీవనవిధానంలో పెద్దగా మార్పు రాకపోవడం అన్నది కొంచెం ఆలోచించవలసిన విషయమేనండీ! అసలు కుట్ర అంతా వాళ్లు జాగ్రత్త పడకుండా, వాళ్లు నాలుగు విషయలూ గమనించకుండా చేయడంలోనే ఉంది. అంతే కదండీ?
రాఘవ గారు,
ఖచ్చితంగా అంతే నండి. అది 150 - 200 గుడిసెలున్న చిన్న ప్రాంతం అయినందున మనం వాళ్ళకంటే ఒక మెట్టు పైనున్నందున ఆ కుట్రని గుర్తించగలుగుతున్నాం. దీన్నే పెద్ద పరిమాణంలో దేశం, ప్రపంచస్థాయిల్లో అందరి మీద ప్రయోగిస్తున్నారు. కాకపోతే విభజించి - ప్రచారించటం, పదేపదే అదే ప్రచారం వంటి స్ట్రాటజీలతో ఆ కుట్రని ఎవరు గుర్తించకుండా, గుర్తించినా ఎదిరించలేనట్లుగా వ్యవహారం నడుస్తోంది. అంతే! నెనర్లు!
ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే భాగోతం. అమాయకులిని ఎల్లా బుట్టలో వేసుకోవాలి అని చూస్తూ ఉంటారు కొందరు. వాళ్ళ జీవనో పాథే అది. బాగు పరచాలంటే చదువు నేర్పాలి. తెలివితేటలు రావాలి. అవి లేనంత కాలం ఇలాగె ఉంటుంది.
మీరు వ్యాసం చక్కగా వ్రాసారు. థాంక్స్.
రామకృష్ణ
రామకృష్ణ గారు: మీ అవగాహనని మాతో పంచుకున్నందుకు చాలా సంతోషమండి. చదువు, తెలివితేటలే కాదండి అవగాహన కూడా కలగాలి. వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు!
Post a Comment