ప్రపంచంలో, దేశంలో, మన వూళ్ళో ఏం జరుగుతుందో తెలియాలంటే... ఒక్కమాటలో చెప్పాలంటే వార్తలు తెలియాలంటే.... ఇప్పుడంటే టీవీ ఛానెళ్ళూ, అంతర్జాజం వంటివి కూడా ఉన్నాయి గానీ ఒకప్పుడు వార్తా పత్రికలు, రేడియో తప్ప మార్గాంతరం ఉండేది కాదు. అప్పటికి FM రేడియోలు కూడా లేనందున, ఆకాశవాణి మాత్రమే అందుబాటులో ఉండేది. ఆకాశవాణి కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి, అప్పట్లో దేశంపట్ల నిబద్దత, నిజాయితీ గల వారు ప్రభుత్వ పదవుల్లోనూ, ఉన్నతాధికారుల్లోనూ, ఉద్యోగుల్లోనూ ఎక్కువమంది ఉండేవారు కాబట్టి, ఆకాశవాణి వార్తలు[ఇప్పటి ప్రైవేటు మీడియా సంస్థల వార్తలతో పోలిస్తే] చాలా వరకూ వాస్తవాలనే చెప్పేవి.

ఇక రెండోవి వార్తపత్రికలు! అప్పటి పత్రికల స్ఫూర్తిపూరిత దేశ సేవ, ప్రజా సేవల గురించి గతటపాలలో ప్రస్తావించాను. ఈ టపాలో నేటి పత్రికల నెట్ వర్క్ గురించి వివరిస్తాను.

వార్తా పత్రికలలో వార్తలు సేకరించే విలేఖర్లు, న్యూస్ కంట్రిబ్యూటర్లు, ఇన్ ఛార్జిలు, ఉపసంపాదకులు, సంపాదకులు... అందరూ, ఆది సోమ అని లేకుండా, పండగ పబ్బాల్లేకుండా నిరంతరం పనిచేస్తారు. పీటీఐ నుండి, ఇతర సంస్థల నుండి తమకి అందిన సమాచారాన్ని, వివిధ ప్రాంతాల నుండి తమకి అందిన సంక్షిప్త సమాచారాన్ని, విశ్లేషించి, విపులంగా తిరగ వ్రాసే ఉప సంపాదకులు, ఇతర ఉద్యోగులు, పత్రికా కార్యాలయాలలో ఆదివారపు సెలవులు లేకుండా పనిచేస్తారు. మొత్తం సిబ్బందిలో కొందరు సొమ, కొందరు మంగళ... ఇలా వారపు సెలవులు[Weekly off] పుచ్చుకుంటూ, మొత్తానికి పత్రికా కార్యాలయం, ముద్రణాలయం మాత్రం వారమంతా, నెలంతా, సంవత్సరమంతా పనిచేస్తుంది. ప్రధాన పండగల నాడు తప్ప పెన్ను దించని శ్రమ వారిది. నిజంగా అభినందించ వలసిన శ్రమ, ఓపిక!

ఇక వార్తలు సేకరించే విలేఖర్ల, న్యూస్ కంట్రిబ్యూటర్ల శ్రమ మరింత ఎక్కువ. సంక్షిప్త వార్తల్ని విపులీకరించే ఉపసంపాదకాది ఉద్యోగులు, డెస్క్ ముందు ఫ్యాన్ క్రింద [లేదా ఏసీ గదుల్లో] కూర్చొని పనిచేస్తే... విలేఖర్లు, న్యూస్ కంట్రిబ్యూటర్లు రోడ్ల మీదపడి ఎండనకా, వాననకా పని చేయాలి. అంటే ప్రత్యక్ష కార్యరంగంలో అన్నమాట. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెళ్ళి కవర్ చేయటం, వ్యక్తులతో ఇంటర్యూలు[ముఖాముఖి] నిర్వహించటం వంటివన్నీ నిర్వహించాల్సిందే!

ఉపసంపాదకాది ఉద్యోగులైనా, విలేకర్లయినా, న్యూస్ కంట్రిబ్యూటర్లయినా... జర్నలిస్టు కావాలన్న కాంక్షతో అందుకు తగిన అర్హతల సంపాదించేటప్పుడు... ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు... ఎన్నో ఆశయాలు, ఆవేశాలు, ఆశలతో వస్తారు. అందరూ కాకపోతే కొందరైనా... జర్నలిస్టు అయితే అవినీతిని తమవంతుగా ఎదుర్కోవచ్చని, ప్రజలకి, దేశానికి ఏదో చేయవచ్చనీ, కలలు కంటూ ఆ రంగంలోకి వస్తారు.

అచ్చంగా... జీవితం గురించి ఎన్నో కలలతో ఆశలతో అత్తవారింట అడుగుబెట్టిన కొత్త కోడలు, ఖర్మకాలి అత్తమామలూ, భర్తా కట్న పిశాచాలైతే ఎంతగా బిత్తర పోతుందో, బెంబేలు పడుతుందో... జర్నలిస్టు అవతారం ఎత్తిన తొలినాళ్ళలో చాలామంది యువతీ యువకులు ఎదుర్కోనే స్థితి అదే! వివరంగా చెబుతాను.

ఉదయాన్నే కాఫీ కప్పుతో బాటు చేతిలోకి తీసుకున్న వార్తా పత్రికలో... ఒకప్పుటి ఈనాడులా... ఎన్నో వార్తలు, ఎన్నో విశేషాలు! ఎక్కడెక్కడో జరిగిన వింతలూ విడ్డురాలతో పాటు, నేరాలు, ప్రమాదాలు, ప్రముఖుల ప్రకటనలు, విశ్లేషణలు! అవన్నీ ముద్రించటానికి ప్రచురణాలయంలో కొందరుంటే... ఆయా వార్తలు సేకరించి పంపటానికి మరి కొందరుంటారు. ఇలా వార్తల్ని సేకరించే వారిని జర్నలిస్టులు/విలేకర్లు/రిపోర్టర్లు అని పిలుస్తుంటారు. సామాన్య ప్రజానీకం, అందర్నీ ఒకే దృష్టితో చూస్తుంది. అయితే మామిడిపళ్ళల్లో నూజివీడు పళ్ళు వేరన్నట్లు, విలేఖర్లు[జర్నలిస్టుల్లో]లో న్యూస్ కంట్రిబ్యూటర్లు వేరు. స్వల్ప భేదం తప్పితే ఇద్దరూ చేసేపని దాదాపుగా ఒకటే! అయితే వేతనాలు, ప్రతిఫలాలు మాత్రం వేరుగా ఉంటాయి.

ఉదాహరణకి ఈనాడు నెట్ వర్కునే తీసుకుందాం.[దాదాపుగా అన్ని పత్రికల నెట్ వర్కు ఇలాగే ఉంటుంది.] ఈనాడు, తను అపాయింట్ చేసుకున్న జర్నలిస్టులకి నెలవారీ వేతనంగా [చెప్పుకోదగినంత మొత్తమే] చెల్లిస్తుంది. న్యూస్ కంట్రిబ్యూటర్లకి మాత్రం, వాళ్ళు నెలలో పంపించిన వార్తలని, కాలమ్ x సెంటీమీటరు ప్రమాణంలో చెల్లిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే న్యూస్ కంట్రిబ్యూటర్లు ఫ్రీ లాన్సర్ గా పని చేస్తున్నట్లు! ఇచ్ఛాపూర్వక లేదా ఔత్సాహిక పాత్రికేయులన్న మాట. వారికి, నెలలో తము వ్రాసిన వార్తలు ప్రచురింపబడేవి తక్కువే, దాంతో చెల్లింపబడే సొమ్ము కూడా తక్కువ గానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఊరిలో చాలామంది న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉంటారు కాబట్టి.

మీకు బాగా అర్ధం అయ్యేందుకు ఉదాహరణగా నంద్యాల [మునిసిపాలిటి] పట్టణాన్ని ఎంచుకుంటాను. నంద్యాలలో ఈనాడు పత్రిక కార్యాలయంలో ఇద్దరు[లేదా ముగ్గురు] జర్నలిస్టులు ఉంటారు. ఇక విద్య, సాంస్కృతిక విభాగం, క్రీడల విభాగం, నేర విభాగం, గ్రామీణ విభాగం, రాజకీయ విభాగం... ఇలా దాదాపు పది మంది దాకా న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉన్నారు. ఇక చుట్టుప్రక్కల గ్రామాలకి చిన్నవైతే రెండింటికి ఒకరు చొప్పున, పాణ్యం వంటి పెద్ద గ్రామాలలో ఒకొక్కరు చొప్పున న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉన్నారు.[శ్రీశైలంలోనూ అంతే! శ్రీశైలం ఆలయంగా పేర్కొంటూ ఒక న్యూస్ కంట్రిబ్యూటరు, ప్రక్కనే ఉన్న సున్నిపెంట గ్రామానికి శ్రీశైలం ప్రాజెక్టుగా పేర్కొంటు మరో న్యూస్ కంట్రిబ్యూటర్ ఉన్నారు. ఇతర పత్రిలన్నిటిది కూడా ఇదే తీరు.]

ఈ విధంగా చిన్న పట్టణమైన నంద్యాలకి దాదాపు పది మంది దాకా న్యూస్ కంట్రిబ్యూటర్లుంటే, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. ఇంత చిన్న ఊరిలో నెలంతా జరిగిన విశేషాలని, ప్రత్యేక సంఘటనలని, వార్తలుగా వ్రాసుకోవాలన్నా ఎన్నుంటాయని? అదీ దాదాపు పది విభాగాలుగా పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని వార్తలొస్తాయి? మహా అయితే రోజుకి రెండుమూడు వార్తలొస్తాయి. అదీ చిన్నచిన్న వార్తలొస్తాయి. ఎప్పుడో గానీ ప్రత్యేక కథనాలు[Special stories] వ్రాసే అవకాశం రాదు.

దాంతో న్యూస్ కంట్రిబ్యూటర్ల నెలసరి రాబడి రెండుమూడు వేల రూపాయలు కంటే ఎక్కువ ఉండదు. ఇవి రెండేళ్ళ క్రితపు లెక్కలు! ఇప్పుడేమైనా కాలమ్/సెంటీమీటరుకు వేతనం పెంచితే మరో వెయ్యి రూపాయలు వస్తూండవచ్చు. అందుచేత చాలామంది న్యూస్ కంట్రిబ్యూటర్ లు ఇతరత్రా వృత్తుల్లో ఉండి, పార్ట్ టైమ్ అన్నట్లు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా పనిచేస్తుంటారు. అంటే స్థానిక స్కూళ్ళు లేదా కళాశాలలో బోధన/ బోధనేతర సిబ్బందిగా, ఇతర ప్రైవేటు సంస్థలూ/ప్రభుత్వ సంస్థల్లోనూ... ఇలాగన్న మాట. కొందరు న్యాయవాద వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా న్యూస్ కంట్రిబ్యూటర్లుగా కొనసాగుతుంటారు.

నెలంతా తాము పంపిన వార్తాంశాలలో ఎన్ని ప్రచురింపబడ్డాయో లెక్కించుకొని వివరాలు పంపితే, వాటి తాలూకూ మూల వేతనానికి, ప్రయాణ ఖర్చుల వంటి ఇతర అలవెన్సులు కలిపి తదుపరి నెలలో చెల్లింపులు వస్తుంటాయి. బిల్లులు రావటంగా దానిని వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. అదే పత్రికల వారి స్వంత జర్నలిస్టులైతే మూల వేతనం బాగా ఉంటుంది. పదివేలు, ఆపైన... అన్నమాట. 2007లో లెక్క ఇది. అలాగే పని లక్ష్యం[work target] కూడా ఉంటుంది. నంద్యాలలో అలాంటి వారు ఇద్దరు లేదా ముగ్గురుంటే శ్రీశైలం, సున్నిపెంటలకు కలిపి ఒకే ఒక్కరున్నారు. దాదాపు అన్ని ఊళ్ళల్లోనూ ఇంతే. ఊరు పెద్దదైతే మరికొందరు జర్నలిస్టులు ఉంటారు. ఊరు పరిమాణాన్ని బట్టి ఈ జర్నలిస్టుల, న్యూస్ కంట్రిబ్యూటర్ల సంఖ్య ఉంటుంది. పత్రికల స్వంత జర్నలిస్టులకి ’తము పంపిన వార్తలు ఆ నెలలో ఎన్ని ప్రచురింపబడ్డాయి’ అన్న మీమాంసలతో నిమిత్తం లేకుండా మూలవేతనం అందుతుంది. ఇతర అలవెన్సులూ ఉంటాయి.

ఇక న్యూస్ కంట్రిబ్యూటర్ల విషయానికి వస్తే... ఈ ఫ్రీలాన్సింగ్ గా పనిచేసే న్యూస్ కంట్రిబ్యూటర్లకి, తము పంపిన అన్ని వార్తలూ తము పంపినప్పుడే ప్రచురింపబడవు. కొన్ని చెత్తకుండీ పాలవుతాయి. అంటే అసలు ప్రచురింపబడవన్న మాట. కొన్ని పెండింగ్ ఉంచబడతాయి. పత్రిక యాజమాన్యాలకి కావాలనుకున్నప్పుడు లేదా పత్రికలో స్థలాన్ని మేనేజ్ చెయ్యాల్సి వచ్చినప్పుడు ఫీలర్ గానూ ప్రచురింపబడతాయి. ఒకోసారి ఎంతొ శ్రమించి, ఆసక్తితో కవర్ చేసి వ్రాసి, పంపించిన ఐటమ్ మర్నాడు పత్రికలో ప్రచురణలో కనబడక పోవటంతో సదరు న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉసూరు మనటం కూడా జరుగుతుంటుంది. మొత్తానికి నెలంతా కలిపి సదరు పత్రిక రెండుమూడు వేల రూపాయలు వచ్చేటట్లు మాత్రమే చూస్తుంది. [2007 లెక్క ప్రకారం]

"మరి ఇంత తక్కువ రాబడి కోసం న్యూస్ కంట్రిబ్యూటర్లు ఎందుకు పని చేస్తుంటారు? పోనీ వృత్తి లేదా ప్రవృత్తి తాలూకూ సంతృప్తి ఉంటుందా అంటే అది ఉండదు కదా?" అనే సందేహం మనకి తప్పకుండా వస్తుంది. దానికి సమాధానం చెప్పే ముందు... న్యూస్ కంట్రిబ్యూటర్లు నుండి పత్రికల స్వంత విలేకర్లు, ఆపైన జిల్లా జోనల్ కార్యాలయాలు, ఆపైన ప్రధాన కార్యాలయాలలోని ఉపసంపాదక, సంపాదకాది పాత్రికేయులు, ఇతర ఉన్నతోద్యోగుల వరకూ పత్రికల నెట్ వర్క్ తాలూకూ పనితీరు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.

సాధారణంగా ఎవరికీ న్యూస్ కంట్రిబ్యూటర్లకీ, పత్రికల జర్నలిస్టులకి తేడా తెలియదు. అంతేగాక న్యూస్ కంట్రిబ్యూటర్లు కూడా తమని తాము జర్నలిస్టు/విలేకరులుగానే పరిచయం చేసుకుంటారు. లోతుగా తెలిస్తే తప్ప, ఇద్దరికీ వ్యత్యాసం ఏమిటో తెలియదన్నమాట. ఈ న్యూస్ కంట్రిబ్యూటర్లకి, జర్నలిస్టులకి జిల్లా కేంద్రాల్లో గానీ, జోనల్ కేంద్రాల్లో గానీ, పిరియాడికల్ గా సమీక్షా సమావేశాలు నిర్వహింపబడతాయి.

అప్పుడు ఎలాంటి వార్తలు సేకరించాలో, ఎలా సేకరించలో శిక్షణ ఇస్తారు. ఎలాంటి వ్యక్తులతో ఎలా టచ్ లో ఉండాలో వంటి కమ్యూనికేషన్ స్కిల్స్ , సమాచార మార్పిడి నైపుణ్యాలని ఎటూ ఉద్యోగంలో ప్రవేశించే ముందే శిక్షణ పొంది వస్తారు కదా! ఇక ఇలా పీరియాడికల్ గా నిర్వహించే సమీక్షా సమావేశాల్లో... న్యూస్ కంట్రిబ్యూటర్లలో ఎవరు ఎవరికి అనుసంధానంగా పని చేయాలో చెప్పబడుతుంది. అలాగే రాబోయే రోజులు/నెలల్లో ఏ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలో చెప్పబడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ మీద గురిపెట్టాలి లేదా ఆరోగ్యశ్రీ అవకతవకలు లేదా దేవాలయాల్లో అభివృద్ది/అవకతవకలు... ఇలాగన్న మాట.

గమనించండి. అందుచేతనే ఒకో సందర్భంలో... ఒక్కసారిగా అన్ని జిల్లాలలో ఒకే విషయంపైన రచ్చ జరుగుతుంది. అన్ని జిల్లా ఎడిషన్లలో, ప్రధాన వార్తా సంచికలో ఒకే విషయంపై ఫోకస్ చేయబడుతుంది.

ఒక్కోసారి ఆయా న్యూస్ కంట్రిబ్యూటర్లకి, తము ఎవరికి అనుసంధానంగా పని చేయాలని చెప్పబడిందో వారి ద్వారా, తదుపరి రోజుల్లో ఫోకస్ చేయాల్సిన అంశాలు తెలియజేయ బడతాయి. అలాగే... న్యూస్ కంట్రిబ్యూటర్లు, [ఒకోసారి విలేకర్లు కూడా] అప్పుడప్పుడు స్థానిక అధికారుల, రాజకీయ నాయకుల అవినీతి గురించి, ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ సంస్థల వ్యాపార అక్రమాలేవైనా ఉంటే వాటి గురించి, వార్తలు సేకరించి పంపిస్తారు. మరో మాటలో చెప్పాలంటే అలాంటివి పంపించవలసిందిగా పైనుండి ఆదేశాలూ రావటంతో అలాంటి వార్తాంశాలు సేకరించి పంపిస్తుంటారు. అయితే పత్రికా యాజమాన్యాలు మాత్రం ఆ అవినీతి వెలికితీత వార్తల్ని అప్పుడే ప్రచురించవు. తమకు ఎప్పుడు కావాలో అప్పుడు ప్రచురిస్తారు.

ఉదాహరణకి మరణించిన వై.యస్., ఇడుపుల పాయలో ప్రభుత్వ భూములు కలిగి ఉన్నాడన్న విషయం, 30 ఏళ్ళ తర్వాత ఈనాడు బయటపెట్టినట్లన్న మాట. అలాగే మరో ఉదాహరణ... తెలుగు పలకల విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. స్కూళ్ళల్లో అలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనో ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రం బయటకు వస్తాయన్న మాట. మరో తాజా ఉదాహరణ చెప్పాలంటే మొన్న ఈనాడు, ప్రధాన వార్తగా, "ఆడపడచులకు ఆ ’గర్భ’శోకం" శీర్షిక క్రింద ప్రచురించిన వార్తాంశం లాగన్న మాట. అందులో గుంటూరులోని కార్పోరేట్ ఆసుపత్రులలో, ఆరోగ్యశ్రీ క్రింద చేసిన ఆపరేషన్లలో జరిగిన అవకతవకల గురించి ఫోకస్ చేసారు.

దాన్ని సద్దుమణిగించుకునేందుకు సదరు కార్పోరేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మీడియా వారికీ, ఉన్నతాధికారులకీ, రాజకీయ నాయకులకి[అవసరాన్ని బట్టి స్థానికం నుండి మంత్రుల దాకా] డబ్బు పంపకం చేసుకోవాల్సి వస్తుంది. మీడియా సంస్థలు తమకి సొమ్ము అవసరం అయినప్పుడు ఇలా చేస్తుంటాయి. తమ వర్గపు మంత్రుల చేత తమకి కావలసిన పనులు చేయించుకునేందుకు, సదరు మంత్రులని సంతృప్తి పరచవలసినప్పుడు, ఇలా డబ్బు పంపిణీ [Money flow] చేయిస్తారన్న మాట. మామూలు పత్రికల యాజమాన్యాలు ఇదంతా చేయగలిగింది తక్కువ. గూఢచర్యం కూడా నిర్వహించే మీడియా సంస్థలు ఇదంతా తేలిగ్గా నిర్వహించగలవు. అలాంటి సంస్థల అధినేతలే ’కింగ్ మేకర్స్’ గా గుర్తించబడతారు.

దీన్ని మీకు చిన్న పరిమాణంలో చూపిస్తాను. అప్పుడు ఈ స్ట్రాటజీని స్పష్టంగా పరిశీలించడం సాధ్యమవుతుంది. అంతేకాదు, పైన నేను వివరించిన స్ట్రాటజీలని, మీడియా సంస్థల [గూఢచర్యం కూడా నెరిపే మీడియా సంస్థ] తాలూకూ దృష్టాంతపూరిత నిరూపణలని కూడా మీరు పరిశీలించవచ్చు.

శ్రీశైలం చిన్న ఊరు. దేవస్థానం ఉద్యోగులు, ప్రైవేటు వ్వాపారులు, యాత్రికుల సత్రాలూ, అందులో ఉద్యోగులు, వీరందరికి సేవలందించే పనివారు ఉండే చిన్న ఊరు. అయితే వచ్చిపోయే యాత్రికులతో నిత్యం కళకళ లాడే పుణ్యక్షేత్రం. అలాగే దేవాదాయ శాఖకు భారీగా ఆదాయం సమకూరే క్షేత్రం కూడా. శివరాత్రి, ఉగాది వంటి పండగల సందర్భాల్లో భారీగా ఆదాయ వ్యయ లావాదేవీలు నడుస్తాయి. ఇక శ్రీశైలం, సున్నిపెంటకి కలిపి ఈనాడుకి ఒక జర్నలిస్టు ఉన్నాడు. ఇద్దరేసి న్యూస్ కంట్రిబ్యూటర్లున్నారు. ఆంధ్రజ్యోతి, వార్త తదితర సంస్థలకి కూడా ఇలాగే న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉన్నారు. శ్రీశైలం చిన్న ఊరైనందున అక్కడి విషయాలు అందరికీ త్వరగా తెలుస్తాయి.

శ్రీశైల దేవస్థానంలో ప్రసాదాల తయారీ పంపిణీ దగ్గరి నుండి దర్శనం టిక్కెట్లు, అభిషేకాది పూజల టిక్కెట్లు, టెంకాయల కాంట్రాక్టుల వేలం, కళ్యాణ కట్ట కాంట్రాక్టు, శిరోజాల కాంట్రాక్టు, కొబ్బరిచిప్పల వేలం, షాపుల వేలం వంటి అనేక వ్యవహారాలు నడుస్తుంటాయి. అందులో కొన్ని కోట్లాది రూపాయల భారీ విలువ కలిగి ఉంటాయి. యధాశక్తి వాటిల్లో అవినీతి కూడా నడుస్తుంటుంది. దేవస్థానానికి పెట్రోలు బంకు కూడా ఉంది. మళ్ళీ శ్రీశైల పర్వతం దిగే వరకూ[ఇటు డోర్నాల దాటే వరకూ, అటు మన్ననూరు వరకూ, అంటే అటు ఇటు దాదాపు 50KM వరకూ] ఎక్కడా పెట్రోలు బంకు లేనందున అక్కడి బంకులో పెట్రోలు, డీజిలు అమ్మకాలు భారీగా ఉంటాయి, వాటితో పాటే అవకతవకలు భారీగా ఉంటాయి. వీటన్నిటిలో పత్రికా విలేఖర్లు అంటే న్యూస్ కంట్రిబ్యూటర్లకు వారి వాటాలు వారికి [అంతో ఇంతో] వస్తుంటాయి.

అంతేగాక, అన్ని పత్రికల న్యూస్ కంట్రిబ్యూటర్ల కంటే ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ కు ఎక్కువ పలుకుబడి ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే దేవస్థాన ఉద్యోగుల్లో ఈవో వంటి పై అధికారి దగ్గరి నుండి అటెండరు దాకా అన్నిస్థాయిల ఉద్యోగులూ, సదరు ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ కి అనుకూలంగా ఉండేంత! గతంలో శ్రీశైల దేవస్థానంలో చిరుద్యోగిగా పనిచేస్తూ, అవినీతిలో పట్టుబడి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, తర్వాత ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ గా రూపాంతరం చెందాడు. ఇతడు శ్రీశైలం గ్రామంలో ప్రముఖవ్యక్తి, పలుకుబడి శక్తి అయిపోయాడు. అతడికీ దేవస్థాన ఈవోకీ మరింత సన్నిహిత సంబంధాలుంటాయి. ఎవరు ఉన్నాసరే! పాత ఈవో బదిలీ అయి కొత్త ఈవో వచ్చినా ఈ బంధం మాత్రం ధృఢమైనది. పరస్పర సహాయ సహకారాలు అనుశృతంగా నడుస్తాయి.

తరచుగా మందుపార్టీలు దేవస్థాన ఈవో,తదితర ఉన్నతోద్యోగులు, ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ కు [ఇతర ప్రముఖ పత్రికల కంట్రిబ్యూటర్లకు కూడా] ఇస్తుండే వారు. మందుతోపాటు మనీ కూడా!అదే ప్రజాశక్తి లాంటి చిన్న పత్రికల న్యూస్ కంట్రిబ్యూటర్లకు అంత సీను ఉండదు. మరింకేవో ప్రయోజనాలు కూడా ఇస్తుంటారు. అంటే సదరు ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ సిఫార్సు చేసిన వారికి దుకాణాల కాంట్రాక్టు, పారిశుధ్య కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగాలు ఇవ్వటం, వేరే చోటినుండి దైవదర్శనానికి వచ్చిన న్యూస్ కంట్రిబ్యూటర్ల సంబంధీకులకి ప్రత్యేక దర్శనాలు... వంటివన్న మాట. ప్రతిఫలంగా ఈనాడు కంట్రిబ్యూటర్, సదరు ఈవో కృషి గురించి, దేవాలయ అభివృద్ధికి అతడు చేపడుతున్న పనుల గురించి పాజిటివ్ గా వార్తలు వ్రాస్తుంటాడు. చక్కని ఫోటోలతో కవర్ చేస్తుంటాడు. దేవాలయానికి దైవదర్శనార్ధం ప్రముఖులు వచ్చిన సందర్భాలలో కూడా చక్కని కవరేజి ఇస్తుంటాడు.

ఇవన్నీ, ఓ రకంగా, హైదరాబాదులోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం వారికి, మంత్రి గారి పేషీకి చక్కని సంకేతాలిస్తాయి. "ఓహో! మన వాడు[ఈవో] అక్కడ చాలా చక్కగా మానేజ్ చేస్తున్నాడు" అన్నది అర్ధమైపోతుంది. దాన్ని బట్టి అవకతవకలలోని డబ్బు పంపకాలు జరపబడతాయి. అలాగే ఆయా అధికారుల పదోన్నతలు, బదిలీలు ఉంటాయి. అయితే అప్పుడప్పుడూ కొన్ని అవకతవకలూ, అవినీతి వెలుగు చూస్తుంటాయి. పత్రికల్లో ప్రచురణ అవుతాయి.

అదెలా జరుగుతుందంటే - రాష్ట్ర స్థాయిలో పత్రికాధిపతులకి అవసరంమైనప్పుడు, అవినీతి వెలికితీత అవసరమైనప్పుడు బయటకి వస్తుంటాయి. లేదా భక్తులు పెద్ద ఎత్తున గొడవ చేసినప్పుడు అవినీతి బయటకు వస్తుందన్న మాట. మరి ప్రజలలో పత్రికలు పలచన కాకూడదు కదా? ఎప్పటికప్పుడు న్యూస్ కంట్రిబ్యూటర్లకి దేవాలయంలో జరిగే అవకతవకల గురించి సమాచారం ఉంటుంది. అది పైకీ పంపుతుంటారు. [ఈ న్యూస్ కంట్రిబ్యూటర్లు సమాచారం పైకి పంపక పోయినా, పత్రికా యాజమాన్యానికి తెలుస్తుంది. అప్పుడు సదరు స్థానిక న్యూస్ కంట్రిబ్యూటర్లకి ఉద్యోగ ఉద్వాసన ఏర్పడుతుంది. కాబట్టి బుద్దిగా పంపిస్తుంటారు.] అయితే ప్రచురణ కోసం కాదు. కేవలం సమాచారం కోసం మాత్రమే. ఒక్కోసారి పైకి పంపకుండా తమ వద్దే ఉంచుకొని, పై నుండి ఆదేశాలు వచ్చినప్పుడు పంపిస్తుంటారు. వెరసి యాజమాన్యం, ఎప్పుడు తాము సదరు అవినీతి అవకతవకల గురించి ప్రచురించ దలుచుకుందో, అప్పుడన్న మాట.

ఇందులో గమనించాల్సిన అంశం ఏమిటంటే, అలాంటి సందర్భాలలో సదరు వార్తాంశం స్థానిక న్యూస్ కంట్రిబ్యూటర్ పేరిట, అతడు పంపితే ప్రచురింపబడినట్లుగా ఉండదు. జిల్లా కేంద్రం నుండో, ప్రాంతీయ[జోనల్] కేంద్రం నుండో ప్రత్యేక కవరేజి అయినట్లుగా ప్రచురింపబడుతుంది. "ఇదేమిటయ్యా?" అని దేవాలయాధికారి అడిగాడను కొండి. "ఏం చేస్తాం సార్! ఈ వార్త నేను పంపలేదు. పైనుండి వాళ్ళే వేసుకున్నారు" అన్న జవాబు స్థానిక న్యూస్ కంట్రిబ్యూటర్ ఇస్తాడు. "వాళ్ళకెలా తెలుస్తాయి ఇక్కడి విషయాలు?" అంటే "భలే వాళ్ళు సార్! మేము మాత్రమేనా? వాళ్ళ సోర్సులు వాళ్ళకుంటాయి సార్!" అని చెప్తారు.

వెరసి ’కర్ర విరగ కూడదు పాము చావకూడదు’ అన్నట్లు వ్యవహారం నడుస్తుంది. స్థానిక న్యూస్ కంట్రిబ్యూటర్లకూ, అధికారులకూ మధ్య సంబంధాలు చెడకుండా, ఇదంతా నేర్పుగా చక్కగా నిర్వహించబడుతుంది. ఏ డిపార్డుమెంట్ కథ అయినా, ఏ ఊరిలో అయినా, ఏ పత్రికా విలేఖరి కథ/న్యూస్ కంట్రిబ్యూటర్ కథ అయినా ఇంతే!
ఇంకా...
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

ఎప్పటిలానే చాలా విషయాలను వేరే రకంగా ఆలోచింపచేసారు. కానీ నాకొక్క అనుమానం. విభేదిస్తున్నాని కాదుకానీ , అంటే నాకు నచ్చే వాటికి కామెంట్లు వ్రాయను :), అలా గాని కామెంట్లు వ్రాసినవన్నీ నచ్చలేదని కాదు. కన్ఫుజన్గా వుంది కదా, నాకు అలాగే వుంది.నిద్రలో ఏదో వ్రాస్తున్నాను :)

ఇక నాప్రశ్న సమాజంలో ఆశ్రిత పక్షపాతం లేకుండా మనిషి మనుగడ సాధ్యమేనా?

నిజమే ,

ఈ stinger లకి రౌడీ మాముల్లు ఇచ్చినట్లు నెలకు కొంత ఇవ్వాలి , వార్త వాళ్ళు అయితే విలేకరులకి ప్రకటించిన నెల జీతం కూడా ఇవ్వరు , వూరు మిద పడి తినాల్సిందే , మేము పల్లెలలో పనులు చేసేటప్పుడు స్తానిక contributors / stingers ఏంటి సిమెంట్ ఎంత కలుపుతున్నారు , పనివాళ్ళను పెట్టుకోకుండా యంత్రాలు వాడుతున్నరెంటి అని బెదిరించేవాళ్ళు , ఇవన్ని పెద్ద పట్టింపులు కాదు కాని , స్తానిక చిన్న పత్రికలూ వాటి యాజమాన్యాల అరాచకం , బెదిరింపులు బాగా ఎక్కువగా వుంటాయి , నేను స్వయంగా tv9 and local paper బాదితుడ్ని .

భాస్కర రామిరెడ్డి,

నిజంగానే నిద్రలో వ్యాఖ్య వ్రాసినట్లున్నావు:) అయినా నీ భావం నాకు అర్ధమైందిలే. నిజానికి నీ వ్యాఖ్యలో నిద్రమత్తుకంటే ఆలోచనల ఒత్తిడే ఎక్కువ కన్పించింది నాకు.

ఇక నీ సందేహం -
>>>ఇక నాప్రశ్న సమాజంలో ఆశ్రిత పక్షపాతం లేకుండా మనిషి మనుగడ సాధ్యమేనా?

ఎందుకు సాధ్యం కాదు? సృష్టిలో పగలు రాత్రి, వెలుగు చీకటి వంటి ద్వంద్వాలున్నట్లే సాధ్యసాధ్యాలనేవి కూడా ఉన్నాయి. ఏ కాలంలోలైనా, ఏ సమాజంలోనైనా ఆశ్రిత పక్షపాతమూ ఉంటుంది, నిష్పక్షపాతము ఉంటుంది. మంచీ చెడూ ఉన్నట్లు గానే. కాకపోతే ఏది ఎక్కువ ఉంటే ఆయా సమయాలని, సమాజాలని మంచిగా ఉందనో, చెడుగా ఉందనో గుర్తిస్తాం. ఆయా కాలమాన పరిస్థితులలో, మనిషి దృక్పధంలో స్వార్ధపు స్థాయి తక్కువ ఉంటే, ఆశ్రిత పక్షపాతం లేకుండా వ్యవహరించే వాళ్ళు ఎక్కువ మంది కన్పిస్తారు. లేదంటే vice versa అంతే! :)

ఒక ఉదాహరణ చెబుతాను. ఓ కుటుంబంలో తండ్రి తన పిల్లల్లో ఒకరిని ఎక్కువ ప్రేమగా చూస్తూ పక్షపాతం చూపాడనుకో. అప్పటికి పిల్లలు బలహీనులు, తండ్రి బలవంతుడు కాబట్టి... తండ్రి ప్రేమని ఎక్కువగా పొందిన వాడు మిగిలిన వాళ్ళ మీద ఆధిక్యత ప్రదర్శిస్తాడు. మిగిలిన పిల్లలు నిస్సహాయంగా సహిస్తూనో లేక సంఘర్షిస్తూనో బ్రతుకుతారు. కాలం గడిచాక తండ్రి వృద్దుడై బలహీనుడౌతాడు. పిల్లలు యువకులై బలవంతులౌతారు. అప్పుడు మిగిలిన పిల్లలు "నువ్వు ఫలనా వాణ్ణి నెత్తిన పెట్టుకున్నావుగా. ఇప్పుడు వాడి పంచనే బ్రతుకు" అంటారు. వెరసి ఆ కుటుంబం ఎప్పుడూ అశాంతి మయంగా, దుఖఃభాజనంగా ఉంటుంది.

మన పెద్దలు రాజునీ, తండ్రితో పోలుస్తారు. అందుకే ’ఫలానా రాజు ప్రజలని కన్నబిడ్డల్లా ఆదరిస్తాడు’ అనే జనవాక్యాలు పుట్టాయి. అలా చూసుకున్నాడు కాబట్టే, ’రామ’ రాజ్యం అనుకుంటాం. ఇప్పుడు రాజుల స్థానే రాజకీయ నాయకులున్నారు. ఆశ్రితపక్షపాతం చూపే తండ్రి ఉన్న కుటుంబపు పరిస్థితే ఇప్పుడు మన దేశపు, ప్రపంచపు పరిస్థితి. అదే...తండ్రి తన బిడ్డలందరినీ నిష్పక్షపాతంగా ప్రేమతో ఆదరిస్తే... పరిస్థితి మరోలా ఉంటుంది. ఆ పరిస్థితి కోసమే ఇప్పుడు అందరి పరితాపన!

శ్రీకాంత్,

నిజమే! కొన్ని వార్తా సంస్థలు అసలు జీతాలు కూడా ఇవ్వకుండా దండుకొమ్మంటాయని నేనూ విన్నాను. సమాజానికి తొలి విలన్ మీడియానే అయిపోయింది.

పత్రిక నడపడంలో ఇంత వ్యూహం ఉంటుందీ అని నేనెప్పుడూ ఆలోచించనేలేదండీ. ఇప్పుడు మీరు చెబుతూంటే ఒక్కొక్కటీ తెలుస్తోంది.

ఔనండీ, ఇప్పుడూ నడుస్తున్నాయో లేదో తెలియదు కానీ, ఆఱేడు సంవత్సరాల క్రితం, ఈనాడు చర్చా వేదికలు అని జఱిగేవి. ఇంత వ్యూహాత్మకంగా పత్రికలు నడిపించేవారు... ప్రజల నాడి తెలుసుకోవడానికి పన్నిన పన్నాగమా అది?!

రాఘవ గారు: అది కూడా ఒక పద్దతేనండి. అది తమకు అన్నివైపుల నుండి వచ్చిన సమాచారాన్ని నిర్ధారణ చేసుకునే తీరు. Trianglurate చేసుకోవటం అన్నమాట.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu