’ధర్మో రక్షతిః రక్షితః’ అంటారు పెద్దలు. అదంతా చాదస్తం అనీ, క్లాసు పీకటం అనీ అనిపించడం కద్దు. నారదనీతికీ, విదురనీతికీ విపర్యయాన్ని అమలు చేస్తూ... నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, ప్రజలలో కూడా, వ్యతిరేక ఆలోచనా విధానాన్ని నసాళం దాకా ఇంకించేసింది. కాబట్టి మనం కూడా పైన చెప్పిన ఆర్యోక్తికి విపర్యాయాన్ని పరిశీలిద్దాం!
’ధర్మాన్ని రక్షించకపోతే అది మనల్ని రక్షించదు’.
ప్రతీ మనిషికీ... ప్రతీ స్థాయిలో... ప్రతీ సందర్బంలో... ప్రతీ అంశంలో.. తనదైన ధర్మం ఉంటుంది. ఏది చేయదగినదో అది ధర్మం. ఏది చేయదగనిదో అది అధర్మం. ’ఏది ఇతరులు మనకి చేస్తే మనకి బాధ కలుగుతుందో, అది ఇతరులకి మనం చేయకపోవటం ధర్మం’ అని పెద్దలు చెబుతారు. అలాగే ప్రతీ దానికీ పరిమితులుంటాయానీ చెబుతారు. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్న సామెత అర్ధం అదే!
ఎందుకంటే - శతృవు లేదా చెడ్డవాడు మనకు బాధ కలగించాడనుకొండి. వాణ్ణి శిక్షించకుండా, వాడిపైన ఫిర్యాదు చేయకుండా శతృవు/చెడ్డవాడి మీద దయ, జాలి, క్షమాగుణం చూపాలనడం నకిలీ భావవాదం చెప్పే కుయుక్తి![దీన్నే మానవహక్కుల సంఘం చేస్తూంటుంది] ఇది ఎంత కుతర్కం అంటే - "ఏది ఇతరులు మనకి చేస్తే మనకి బాధ కలుగుతుందో అది ఇతరులకి మనం చేయకపోవటం ధర్మం! అలాంటప్పుడు శతృవు/చెడ్డవాడు మీకు బాధ కలిగించాడు. మరి మీరూ అతణ్ణి శిక్షకు గురయ్యేటట్లు చేసి బాధ కలిగిస్తున్నారు కదా? అదెలా ’ధర్మం’ అవుతుంది?" అనటం కుతర్కం గాక మరేమిటి? చెడ్డవాడు మనకు ఏ కీడు కలిగించి మనల్ని బాధించాడో, అదే మనం వాడికి చేయటం లేదు. కీడు చేయటం వేరు. దండన వేరు. దండన విధించగల వారికి ఫిర్యాదు చేయటం ధర్మమే అవుతుంది. అందునా చెడ్డవాణ్ణి వదిలేస్తే, వాడు మరింత మంది అమాయకులని బాధిస్తాడు. కాబట్టి అలాంటి చెడ్డవాడికి శిక్షపడేటట్లు పాలకుల దృష్టికి తీసుకు వెళ్ళటం పౌరధర్మం. చెడ్డవాణ్ణి శిక్షించటం పాలకుల ధర్మం. ఇప్పుడు పాలకులే అధర్మపరులవుతున్నారు. అదే వేరే సంగతి.
కుటుంబంలో ప్రతీ పురుషుడికీ... భర్తగా, తండ్రిగా, గృహస్తుగా, వ్యక్తిగా తనదైన ధర్మం [Duty] ఉంటుంది. పెద్దవారైన తల్లిదండ్రులపట్ల బాధ్య్తతతో కూడిన ధర్మం ఉంటుంది. అలాగే ప్రతీ స్త్రీకి కూడా! భార్య/భర్త పట్ల మన ధర్మం ఏమిటో... ఆచరించినా ఆచరించకపోయినా అందరికీ తెలుసు. అలాగే తల్లిదండ్రులుగా పిల్లలపట్ల, సంతానంగా పెద్దల పట్ల కూడా!
ఇదే అభివృద్ధి మంత్రం అనుకుంటునో, కాలం మారిపోయిందని అమాయకంగా నమ్మేస్తూనో, అనివార్యపరిస్థితులలోనో... దశాబ్ధాలుగా, ప్రపంచవ్యాప్తంగా, ప్రజలు, కుటుంబం పట్ల తమ బాధ్యతలని క్రమంగా విస్మరించుకుంటూ వచ్చారు. ఫలితంగా కుటుంబ వ్యవస్థ పునాదులు కదిలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ విషయంలో భారతీయులం వెనకబడి పోయాం గనుక కొంతలో కొంత నయంగా ఉన్నాం. దమ్మిడీల పరుగు మరింత ఎక్కువగా ఉన్న పాశ్చాత్య దేశాల్లో... ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా... కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోంది!
మొత్తానికీ, మనం కుటుంబాన్ని మరిచిపోతే కుటుంబం మనల్ని మరిచిపోతుంది. ’నలుగురి కోసం ఒక్కడూ, ఒక్కడి కోసం నలుగురూ ’ అన్నది సమాజం. సమాజంలో సభ్యుడిగా మన ధర్మాన్ని మనం మరిచిపోయాం.మనం సమాజాన్ని మరిచిపోయాం, సమాజం మనల్ని మరిచిపోయింది. మనం దేశాన్ని మరిచిపోయాం, దేశం మనల్ని మరిచిపోయింది. పౌరధర్మాన్ని మరిచిపోయాం, ప్రభుత్వం మనల్ని మరిచిపోయింది. ఒకప్పుడు... దేశం పట్ల, ప్రజలపట్ల నిబద్దత గల ప్రభుత్వాలు, అధినేతలు మీడియా చేతుల్లో నానా వెతల పాలవుతున్నా, నిందలపాలు అవుతున్నా... మన కేం పట్టలేదు. అంతేగాక ’I hate bloody Politics’ అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చిన ఫలితంగా, కుట్రదారులూ, అవినీతి పరులూ, ఏకంగా నేరచరితులూ గద్దెనెక్కి ప్రభుత్వాధినేతలు అయ్యే పరిస్థితి వచ్చింది.
ఈ పరిస్థితుల్లో... నిజంగా ఆలోచిచాల్సిన విషయం ఏమిటంటే... ఏది ధర్మమో మనకి ఎలా తెలుస్తుంది?
ఈ నేపధ్యంలో ఛాందోగ్యోపనిషత్తులోని కథ చెప్పుకోదగింది.
ఒకసారి ప్రజాపతి ఇలా ప్రకటించాడు. "పాపం ఎరగనిది, జరామృత్యువులు లేనిది, దుఃఖం ఆకలి దప్పిక లేనిది, సత్యమే కోర్కెగా సత్యమే సంకల్పంగా కలిగినది ఆత్మ. ఆత్మ జ్ఞానం పొందిన వాడు అన్ని లోకాలను, అన్ని కోర్కెలను పొందుతాడు."
ఈ విషయం సురులు, అసురులు విన్నారు. ’అదేదో ఆత్మట. అది చాలా గొప్పదట. దాన్ని తెలుసుకుంటే అన్ని కోర్కెలు నెరవేరుతాయట’ అనుకుని, దాని గురించి తెలుసుకోవాలని ఆశపడ్డారు. దేవతల పక్షాన ఇంద్రుడు, రాక్షసుల తరుపున వారి రాజు విరోచనుడు, ’ఆత్మరహస్యం’ తెలుసుకోవాలనే కోర్కెతో ప్రజాపతి వద్దకు వెళ్ళారు. [ఈ ఇంద్రుడు మునులు తపస్సును భగ్నం చేయ రంభాది అప్సరసలని పంపించేవాడు కాదు. ఇంద్రుడు అన్నది ఓ పదవి. దేవతలకి అప్పటికి ఉన్న రాజుని ఇంద్రుడు అంటారు. నహుషుడు సైతం ఇంద్రుడైన కథ తెలిసిందే!] అక్కడ 32 సంవత్సరాల బ్రహ్మచర్యం అవలంబించి, గురు శుశ్రూష చేస్తూ గడిపారు. అప్పుడు ప్రజాపతి "నాయనా? మీరిక్కడ ఏం ఆశించి ఉంటున్నారు?" అని అడిగాడు. "అత్మతత్త్వం తెలుసుకున్న వారు అన్నిలోకాలను, అన్ని కోర్కెలను పొందుతారు అన్నారు కదా మీరు? అది తెలుసుకోవడానికి వచ్చాము" అని వారు జవాబు చెప్పారు.
ప్రజాపతి వారితో "నాయనా! నా కంటి పాపలో మీకు ఏ పురుషుడు కనిపిస్తున్నాడో అతడే ఆత్మ! అదే మృత్యువు లేనిది. భయం ఎరగనిది. అదే బ్రహ్మ! తత్త్వమసి" అన్నాడు. వారు "తండ్రీ! మీ కంటి పాపలో నాకు నేనే కన్పిస్తున్నాను. అయితే స్పష్టత లేదు. దయచేసి మాకు మరింత విశదంగా చెప్పండి" అని అడిగారు.
ప్రజాపతి "నాయనా ఈ నీటిలో, చూడండి. ఏం కనబడుతోంది?" అని అడిగాడు. ఇద్దరూ కూడా నీటిలో తాము ఎలా ఉంటే అలా కనిపిస్తోందనీ, తమ పూర్తి రూపం దానిలో కనిపిస్తోందనీ చెప్పారు. ప్రజాపతి "ఇప్పుడు మీరు అభరణాలు, మంచి వస్త్రాలు ధరించి అలంకరించుకుని చూడండి" అన్నాడు. వారు అలాగే చేసి, తాము ఎలా అలంకరించుకుంటే అలా అలంకృతమైన తమ రూపం నీటిలో కనబడుతోందని చెప్పారు.
"అదే ఆత్మ! అదే మృత్యువు లేనిది, భయం లేనిది. అదే బ్రహ్మ. తత్త్వమసి" అన్నాడు ప్రజాపతి.
అప్పుడు ఇంద్రుడు, విరోచనుడు ’తమ దేహమే ఆత్మ, బ్రహ్మ’ అని భావించి, సంతృప్తి పొంది ప్రజాపతి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ప్రజాపతి "పాపం! వీళ్ళు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు" అనుకుని జాలిపడ్డాడు. రాక్షసుల రాజు విరోచనుడు, తన నివాసానికి వెళ్ళి, తనకై నీరీక్షిస్తున్న రాక్షసులతో "నేను ఆత్మ గురించి తెలుసుకున్నాను. ఈ శరీరమే ఆత్మ. కాబట్టి తింటూ, తాగుతూ, సుఖభోగాలనుభవిస్తూ జీవించటమే ఆత్మజ్ఞానం" అని చెప్పాడు. వారంతా సంతోషంతో దాన్నే ఆచరించ ప్రారంభించారు. శరీరమే ఆత్మ, అదే శాశ్వతం అనుకున్నందున జరామరణ భయ దుఃఖాలు అనుభవిస్తున్నా కూడా, ఆ స్పృహ లేక అసురులు ఆ స్థాయిలోనే ఉండిపోయారు. [ఇప్పుడు దాదాపుగా ప్రపంచం మొత్తం ఈ స్థాయిలోనే ఆగిపోయింది.]
అయితే ఇంద్రుడు దేవతల వద్దకు తిరిగి వెళ్ళ్దడానికి ముందే, కొంతదూరం వెళ్ళి ఆగి ఆలోచించి అశాంత మనస్కుడయ్యాడు. అతడికి తాను తెలుసుకున్నది తృప్తి ఇవ్వలేదు. ’తన దేహాన్ని ఎలా అలంకరించుకుంటే ప్రతిబింబం కూడా అలాగే కనబడుతోంది. మరి ఈ దేహం గుడ్డిదీ, కుంటిదీ అయితే ప్రతిబింబం కూడా గుడ్డిదీ, కుంటిదీ అవుతుంది కదా! దేహానికి అంగవైకల్యం కలిగితే ప్రతిబింబమూ అంతే అవుతుంది కదా! దేహం నశిస్తే అదీ నశిస్తుంది కదా? దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఇటువంటి ప్రతిబింబమూ లేదా శరీరమేనా ఆత్మ అంటే? ఆత్మ నాశనం లేనిదనీ జరామృత్యువులు లేనిదనీ కదా గురువు గారు అన్నారు? అత్మజ్ఞానం పొందిన వాడు అన్నిలోకాలనూ, అన్ని కోర్కెలనూ పొందుతాడు అన్నారు. అలాగైతే ఈ శరీరం ఆత్మ కాజాలదు’ అనుకున్నాడు.
దాంతో ఇంద్రుడు ప్రజాపతి వద్దకు తిరిగి వెళ్ళాడు. తన సంశయం వెలిబుచ్చి , తనకు అసలైన ఆత్మగురించిన జ్ఞానాన్ని ఉపదేశించవలసిందిగా ప్రార్ధించాడు. మరి 32 ఏళ్ళ శుశ్రూష తర్వాత ప్రజాపతి అతడికి "స్వప్నంలో ఎవరైతే సుఖానుభవం పొందుతూ ఉంటాడో అతడే ఆత్మ. అతడికి జరామరణ భయం లేదు. అతడే బ్రహ్మ!" అని ఉపదేశించాడు.
ఇంద్రుడు సంతృప్తుడై తిరిగి వెళ్ళాడు. కానీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ సందేహం వచ్చింది. "నిజమే! స్వప్నంలోని ఆత్మ , దేహం గుడ్డిదైనప్పుడు గుడ్డిది కాదు. కంటికో కాలికో దెబ్బతగిలితే దానికి తగలదు. దేహ దోషాలేవీ దాన్ని అంటడం లేదు. కానీ, స్వప్నంలోనే అదీ బాధపడుతోంది. దుఃఖ పడుతోంది. దీని వల్ల ఏం ప్రయోజనం? తానే నానా బాధలు పడుతున్నది, అన్నిలోకాలనూ, అన్నికోరికలనూ ఎలా సిద్ధింప చేయగలదు? అది ఆత్మ కాజాలదు" అనుకున్నాడు.
మళ్ళీ గురువు నాశ్రయించాడు. మరో 32 ఏళ్ళ శుశ్రూష తర్వాత ప్రజాపతి అతడితో "స్వప్న రహితమైన గాఢ నిద్రావస్థలో ఉండగా, ఎవరు ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటారో అతడే ఆత్మ. అతడికి జరామరణ భయం లేదు. అతడే బ్రహ్మ!" అన్నాడు. ఇంద్రుడు సరేనని బయలుదేరాడు. కొంచెం దూరం పోగానే మళ్ళీ సందేహం! ’గాఢ సుషుప్తిలో నున్నప్పుడు ఏ బాహ్య విషయాలూ వ్యక్తిని బంధించవు. నిజమే గానీ, ఆ స్థితిలో ఏమీ తెలియదు కదా! ’నేను’ అనే స్పృహ కూడా ఉండదు కదా? దానివల్ల ప్రయోజనం ఏమిటి? తననే తెలుసుకోలేనిది... ’దానిని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఏదీ లేనిది’ ఎలా అవుతుంది? కాబట్టి అది ఆత్మ కాజాలదు! ’ అనుకున్నాడు.
తక్షణం గురువు వద్దకు తిరిగి వచ్చాడు. ఈసారి గురువు అతడిని మరో అయిదేళ్ళు నిష్టాగరిమతో ఉండమన్నాడు. అప్పుడు ఇంద్రుడు తననుండి ఉపదేశం పొందడానికి తగిన అర్హత సాధించినట్లు భావించి అతడికి ఆత్మతత్త్వం బోధించాడు.
"ఈ శరీరం అశాశ్వతమైనది. అవసానం అసన్నమైనప్పుడు మృత్యువు దాన్ని కబళిస్తుంది. పుట్టుక నుండి మరణం దాకా పరిణామక్రమం కలిగినట్టిది. స్థిరత్వం లేనిది. వయస్సును బట్టీ, శీతోష్ణ సుఖదుఃఖాలను బట్టీ రూపురేఖలు మారిపోయేది. స్వప్నావస్థలోనూ, జాగృదావస్థలోనూ, శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండే ప్రాణమూ శాశ్వతం కాదు. శరీరం నశించగానే అదీ నశిస్తుంది. శరీరంలో భాగమైన కన్ను, ముక్కూ, చెవీ, నాలుకా చర్మం వంటి ఇంద్రియాలూ, మనస్సూ కూడా శాశ్వతం కావు. శరీరాన్ని అశ్రయించుకుని ఉన్న ప్రాణం, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, ప్రపంచాన్ని తెలుసుకుంటోంది. అంతే! శరీరం నశించగానే ఇంద్రియాలూ, మనస్సూ, ప్రాణం కూడా నశిస్తాయి.
శాశ్వతమైన ఆత్మకు, ఈ శరీరం ఒక ఉపాధి వంటిది. ఆత్మ ఎంతకాలమైతే ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుందో, ఈ శరీరంలో నివసిస్తుందో, అంతకాలం సుఖదుఃఖానుభవాలు పొందుతుంటుంది. నిజానికి ఆయా అనుభవాలు శరీరానికి సంబంధించినవే గానీ, ఆత్మకు సంబంధించినవి కావు. ఆశరీరమైన ఆత్మను, సుఖదుఃఖాది ద్వంద్వాలేవీ బాధించలేవు.
రూపం, ఆకారం లేని ఆకాశంలో వాయువు, మేఘం, మెరుపులూ, కొద్దిసేపు ఏవో రూపాలలో, ఆకారాలతో సంచరిస్తాయి. ఆయా ఆకారాలే ఆకాశంగా భ్రమింపచేస్తాయి. తమ అవసరం తీరిపోగానే నశిస్తాయి. శరీరం కూడా వాటివంటిదే! శరీరాలను అంటిపెట్టుకున్నంత కాలం, ఆత్మ కూడా శరీరంలాగే భ్రమిస్తాము. అయితే శరీరం నశించగానే, ఆత్మ పరమాత్మలో విలీనమై పోతుంది. ఆత్మ అన్నిటికీ మూలం. అదే సత్యం. చావు పుట్టుకలూ, జరామరణాది భయాలూ లేనిది ఆత్మ. అదేనీవు. తత్త్వమసి" అని చెప్పాడు ప్రజాపతి.
ఇదే విషయాన్ని మరో పోలికతో ఉపనిషత్తులలో ’ఘటాకాశం’గా చెబుతారు. "ఘటం అంటే కుండ. రంగుల కుండలలో నింపిన నీళ్ళు ఆయా రంగుల్లో ఉన్నప్పుడు, పైన ఉన్న ఆకాశపు ప్రతిబింబాన్ని ఆ కుండలలోని నీళ్ళల్లో పరికించామనుకోండి! నల్ల కుండలోని నీళ్ళల్లో ఆకాశం నల్లగా, ఎర్రకుండల్లోని నీళ్ళల్లో ఆకాశం ఎర్రగా... ఇలా కన్పిస్తుంది. అంతేగానీ, నిజంగా ఆకాశం ఆ కుండ కాదు, కుండలో లేదు. ఆయా రంగుల్లోనూ లేదు. అదే విధంగా ఆత్మ ఈ శరీరం కాదు" అని చెబుతారు!
ఇది నిజమో కాదో?... ఆత్మ శరీరానికి అతీతమో కాదో?... మరణానంతరం ఆత్మ మరో శరీరాన్ని ధరిస్తుందో లేదో?... మోక్షపాప్తి అని చెప్పిబడినట్లుగా ఆత్మ పరమాత్మలో కలిసి పోవటమనే సిద్దాంతం నిజమో కాదో?
ఈ సందేహాలన్నిటినీ ప్రక్కన బెట్టినా... ప్రపంచానికి, సర్వజనావళికి ఇది శ్రేయస్కరమైన సిద్దాంతమే!
ఎలాగంటే.... ఏమనిషికైనా ఏ పోరాటంలోనైనా వెనక్కిలాగేది భయం! ఏ ప్రయత్నంలోనైనా వెనకడుగు వేయించేది భయం! భయాలన్నిటిలో ఉతృష్ట భయం ఏది? ప్రాణ భయం! ’ఛస్తానేమో’ అనే భయం! దాన్ని తొలిగిస్తే... ప్రతి మనిషీ ఒక యోధుడే! ధైర్యశాలి ధర్మశాలి అవుతాడు. అన్ని భయాల్లోకీ పెద్దదైన చావు భయాన్ని వదిలేస్తే... ఏ మనిషీ సత్యాన్ని అన్వేషించటానికి భయపడడు. సత్యాన్ని పలకడానికి, ధర్మాన్ని ఆచరించటానికి భయపడడు. డబ్బునీ, అధికారాన్నీ చూసి భయపడడు. ఎవరికో బానిస అయిపోడు. కాబట్టే గీత ’జాతస్య హి ధ్రువో మృత్యుః ..... ’ అన్నది. ’నైనం ఛిందంతి శస్త్రాణి .... ’ అన్నది.
’మరణించేది శరీరమే గానీ నేను కాదు. శరీరంతో పాటుగా, ఇక్కడ సంపాదించిన ఇహలోకపుటాస్థులన్నీ ఇక్కడే ఉండిపోతాయి. వెంట వచ్చేది చేసుకున్న కర్మ మాత్రమే’ అన్న సిద్దాంతం, మనిషిని ఉదాత్త కర్మాచరణ వైపు నడుపుతుంది. భగవద్గీత ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది.
శ్లోకం:
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్ర్కా మతీశ్వరః
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్
భావం:
గాలి సువాసనను తీసికొని పోయేటట్లుగా - దేహాధికారియైన జీవుడు క్రొత్తశరీరం పొందేటప్పుడు - వెనుకటి శరీరం నుంచి భావపరంపరను తీసుకు పోతున్నాడు.
జీవుడు/ఆత్మ పాత శరీరాన్ని గాని, అది సంపాదించిన ధనకనక వస్తు వాహనాలని గానీ, తనతో తీసుకుపోలేడు. శరీరంతో పాటు అతడి సంపాదనని కూడా అతడితో పాటే సమాధి చేసినా సరే! ఆ సమాధి తాజ్ మహల్ కానివ్వండి, పిరమిడులు కానివ్వండి. పాతిపెట్టిన మణిమాణిక్యాలూ, బంగారమూ కూడా, శరీరంతో పాటూ సమాధిలో ఉండిపోవలసిందే. శరీరం శిధిలమై పోవలసిందే! చేసిన కర్మ, ఆ కర్మ సాధనతో పొందిన భావపరంపర మాత్రమే జీవుడు తనతో తీసుకుపోగలడని గీత చెబుతుంది. ఆ భావపరంపరే మరు జన్మలో మన స్థానాన్ని నిర్దేశించేది.
’ఏది ధర్మమో ఎలా తెలుసుకోవాలి?’ అన్న విషయం చెబుతానంటూ... ఛాందోగ్యోపనిషత్తులోని కథ చెప్పి, ఇంకెక్కడెక్కడికో తీసుకుపోతున్నారేమిటీ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను.
ఏది ధర్మమో ఎలా తెలుసుకోవటం? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటందుకే, ప్రజాపతి - ఇంద్రుడి కథ చెప్పాను. ఈ కథలోని ఒక కోణాన్ని చూడండి. మొదటగా... సురాసురుల ప్రతినిధులు ఇంద్రుడూ, విలోచనుడూ కూడా ప్రజాపతిని ఆత్మజ్ఞానం బోధించమనే అడిగారు. ఎందుకంటే ఆత్మ గురించి తెలుసుకుంటే అన్నీ పొందవచ్చు, అంతటా ఆనందమే గనుక!
ప్రజాపతి నీటిలో, అద్దంలో, కనబడే మీ ప్రతిరూపమే ఆత్మ అనగానే రాక్షసుడు చక్కా పోయాడు. శరీరమే ఆత్మ అనుకున్నాడు. ’తినటం, తాగటం, సుఖించటం’ - ఇవే పరమార్ధం అనుకున్నాడు. నిజానికి అది స్వార్ధం. రాక్షసుడు అక్కడే... అంటే స్వార్ధం దగ్గరే ఆగిపోయాడు. శరీరమే ఆత్మ! జీవించి ఉన్నంత వరకూ శరీరం శాశ్వతం. చచ్చాక స్వర్గ నరకాలు ఉన్నాయో, లేవో? మరణానంతర జీవితం ఉందో లేదో? ఎవరు చూసొచ్చారు? నా కళ్ళకు కనబడేదాన్నే నమ్ముతాను. ’చచ్చాక దొరికే రంభ[స్వర్గాధిసుఖాల]కన్నా ఇప్పుడు నచ్చినట్టి పిల్లే చల్లన్నుల మిన్న’ - తినటం, తాగటం, సుఖించటం - ఇదే సిద్దాంతం! ప్రజాపతి ఉపదేశాన్ని విరోచనుడు అర్ధం చేసుకున్నతీరు ఇదే.
ఇది స్వార్ధమే కాదు, పదార్ధ వాదం కూడా! ఒక్కమాటలో చెప్పాలంటే - ప్రపంచంలో పలుదేశాలు, ముఖ్యంగా పశ్చిమదేశాలు నమ్మిందీ, నమ్మించిందీ, ప్రచారించిందీ ఈ పదార్ధ వాదాన్నే. ప్రచారిస్తోంది కూడ దాన్నే! దానికి హేతువాదం, తార్కికవాదం, గతి తార్కిక వాదం... గట్రా ఏ పేరైనా పెట్టనివ్వండి. భావవాదానికి మెట్ట వేదాంతం అన్న పేరు పెట్టింది కూడా పదార్ధవాదాన్ని ప్రచారించిన, ప్రచారిస్తోన్న నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమే! మితిలేని ’తినటం - తాగటం - సుఖించటం!’ - ఇదే నిజం అనుకుంటే... అల్సర్లూ, క్యాన్సర్లూ, ఎయిడ్సూ వంటి దారుణరోగాలు సంక్రమిస్తున్నాయి.
నిజానికి ’గీత’ స్వర్గాది ఉత్తమలోకాలు కూడా శాశ్వతం కాదంటుంది. రూపాయల సంపాదనా పరుగుకీ, పుణ్యసంపాదనా పరుగుకీ, తేడా లేదంటుంది. అందుకే నిష్కామ కర్మ యోగం ఆచరించమంటుంది. మరోమాటలో చెప్పాలంటే - హిందూమతంలోని వివిధరకాల concepts, 1వ తరగతి, 2వతరగతి... 10 వ తరగతి ల్లాగా స్థాయీ భేదాలతో అలరారుతుంటాయి. 1 వ తరగతి చదవకుండా, 2 వ తరగతి ఆపై తరగతుల చదువు ఎలా అర్ధం కాదో, ఇదీ అంతే! సద్గుణోపాసన దాటకుండా నిర్గుణోపాసన చేరలేరు. మోక్షసిద్దాంతము అంతే!
ఇక ఇటు చూస్తే... ఈ పదార్ధ వాదం లేదా స్వార్ధం, పశ్చిమదేశాల్లో మరింత బలంగా వ్యాపించగా, ప్రాచ్య [అంటే తూర్పు]దేశాల్లో కొంత బలహీనంగా వ్యాపించింది. ఎంతగా చైనా జపానుల్లో కూడా పదార్ధ వాదమే ప్రబలినా, కోరికలని తృజించమన్న బౌద్దమతమూ, అంతకు ముందే ప్రాచుర్యంలో ఉన్న హిందూమతం కారణంగా, [కొంతైనా] భావవాదమూ, ఆయా దేశాల్లో నిలబడింది.
ఆ విధంగా యూరపు, అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో పదార్ధవాదం నిండగా, ఆసియా దేశాల్లో భావవాదం కొనఊపిరితో కొనసాగుతోంది. కావాలంటే ఓ ఉదాహరణ పరిశీలించండి. కొత్తగా సినిమాల్లో అందుబాటులోకి వచ్చిన శాస్త్ర సాంకేతిక నైపుణ్యం గ్రాఫిక్స్! దాని సాయంతో హాలీవుడ్ వాళ్ళు, రాక్షస సరీసృపాలతోనూ[జురాసిక్ పార్క్], ప్రకృతి భీభత్సాలతోనూ[2012], డ్రాక్యులా రక్తపిశాచాలతోనూ, భీభత్సాన్ని భయాందోళనలని కలిగించే సినిమాలు నిర్మించారు. అదే గ్రాఫిక్స్ ని తెలుగువాళ్ళు అమ్మోరు, అంజి, నాగమ్మ, శ్రీరామదాసు గట్రా సినిమాలలో భక్తి సన్నివేశాలలో ప్రయోగించారు.
ఇక ఛాందోగ్యోపనిషత్తులోని కథలో, మరో కోణం - ఇంద్రుడి ఆలోచనా విధానం. ఇంద్రుడు దేవతలకి ప్రతీక! అతడు తాను విన్నదానితో సంతృప్తి చెందలేదు. సత్యమేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. ఆత్మ ఏమిటో పరిశోధించాలనుకున్నాడు. అందుకోసం, తాను విన్నదానిని, తనలో తాను తర్కించుకున్నాడు. ప్రశ్నించుకున్నాడు. అందులోని లొసుగులేమిటో అతడికెవరూ చెప్పలేదు. తనలోనే తాను తెలుసుకున్నాడు. ఆలోచించి తెలుసుకున్నాడు.
కాబట్టే ’జ్ఞానం ఎక్కడో లేదు. అది మన అంతరాత్మలోనే ఉంది. శోధించి తెలుసుకోవాలి!’ అంటారు పెద్దలు.
దీన్నే భాగవతంలోనూ చెప్పారు. సృష్ట్యాదిలో... విష్ణునాభి నుండి పద్మం, పద్మంలో బ్రహ్మ ఉద్భవించాడు. తానెవ్వరో తెలీదు. ఎలా పుట్టాడో తెలీదు. ఏదేమిటో... ఏదీ తెలీదు. తెలుసుకోవాలనుకున్నాడు. తను పుట్టిన పద్మపు తూడులో నుండి ప్రయాణించటం మొదలు పెట్టాడు. దాని మొదలు కనుక్కుంటే తన మొదలు తెలుసుకోవచ్చుకదా? అందుకే ఆ ప్రయాణం! ఎంత కాలం, ఎంత దూరం పోయినా అంతూ దరీ తెలియలేదు. ఏంచెయ్యటం? ఆ కారుచీకటిలో, సన్నని తామర తూడులో, ఇక ప్రయాణించలేక వెనుదిరిగి వచ్చాడు. తిరిగి తన పద్మాసనం చేరి ధ్యానమగ్నుడైనాడు. తనను కన్నవాడెవరో తెలుసుకోవాలని ఆలోచిస్తూ, ధ్యాన మగ్నుడైన చతుర్ముఖ బ్రహ్మ , తనలోనే ఆ జ్ఞానాన్ని పొందాడు. ఈ సందర్భంలో పోతన మహాకవి వ్రాసిన పద్యం నిజంగా అమృత మధురం. [ఈ పద్యం నాకు పూర్తిగా గుర్తులేనందునా, దొరకనందున ప్రచురించలేదు.]
పైన చెప్పిన ఛాందోగ్యోపనిషత్తులోనూ, ఇంద్రుడు తనలో తను తర్కించుకున్నాడు. కాబట్టే జ్ఞానార్జనార్హతని పొందాడు, జ్ఞానాన్నీ పొందాడు. చతుర్ముఖ బ్రహ్మ కూడా తనలోనే జ్ఞానాన్ని పొందాడు.
ఇప్పుడు మరోసారి ’ఏది ధర్మమో ఎలా తెలుసుకోవటం?’ అన్న ప్రశ్న దగ్గరికి వద్దాం.
ఏది ధర్మమో, పౌరధర్మం ఏమిటో, పాలక ధర్మం ఏమిటో, వ్యక్తి ధర్మం, వృత్తి ధర్మం, పుత్ర/పుత్రీ ధర్మం, పతి/పత్నీధర్మం, మాతృ/పితృధర్మం ఏమిటో, మనకి భారతీయ ఇతిహాసాలు చెప్పాయి. రామాయణ భారత భాగవతాలేగాక ఉపనిషత్తులూ చెప్పాయి. తల్లిదండ్రులు గురువులూ చెప్పారు. ఇప్పటికీ తల్లిదండ్రులూ, గురువులూ, రాజకీయ నేతలూ, పత్రికలూ, వార్తా సంస్థలూ చెబుతున్నాయి. ఏది మనం చేయాలో, ఏది సరైనదో, ఏది కాదో,... ఎన్నెన్నో వ్యాఖ్యలూ, చర్చలూ, వ్యాసాలూ, కరపత్రాలూ చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఎవరి స్వార్ధం కోసం వారు చెబుతున్నారు. తమ మేలు, తమ స్వార్ధం కోరి, ఎవరికి వాళ్ళు ఇతరుల్ని ప్రభావపరచాలనుకుంటున్నారు.
సామాన్యప్రజలుగా అవన్నీ మన నెత్తినబడుతున్నాయి. మన ముందు నిలబడుతున్నాయి. అన్నీ వినీ, అన్నీ పరిశీలించి... కాస్సేపు వాటన్నిటినీ ప్రక్కన బెట్టి , అంతఃశ్చేతనకు పని చెప్పి, ’నేను’ అన్నదానిని వదిలి, అంతరాత్మతో ఆలోచిస్తే... సత్యం ఏమిటో, ధర్మం ఏమిటో మనకై మనకి తెలియదా? ఖచ్చితంగా తెలుస్తుంది! కాస్సేపు... మన స్వార్ధం, ’మనకి ఏది ఉపయోగం?’ అన్న ఆలోచన, మన అరిషడ్వర్గాలూ... అన్నిటినీ వదిలేసి... ’ఏది నిజం? ఏది నిజంగా చేయదగ్గది? ఏది మన ధర్మం?’ అని ఆలోచిస్తే తప్పకుండా మనలో మనకే తెలుస్తుంది. ఎందుకంటే అంతరాత్మలో భగవంతుడుంటాడు. ఏ మనిషికైనా ఉంటాడు.
ఒక్కసారి ప్రయత్నించి, అంతరాత్మలో ఆ సత్యాన్ని తెలుసుకుంటే...
ఏది ధర్మమో, దాన్ని నిజాయితీగా తెలుసుకోవాలను కుంటే...
ఏది ధర్మమో, దాన్ని నిబద్దతతో ఆచరించాలనుకుంటే...
ఏది ధర్మమో, దాన్ని ఆచరించాలన్న సంకల్పమూ ధృఢచిత్తమూ ఉంటే...
మొదట తప్పటడుగులు పడ్డా, భగవంతుడు తప్పకుండా దారి చూపిస్తాడు.
ఎందుకంటే - భగవంతుడు లాబీయింగ్ లకి లొంగే పార్టీ అధిష్టానాల వంటి వాడు కాదు.
ఎందుకంటే - భగవంతుడు లంచమిచ్చిన వాళ్ళవైపు మాట్లాడే అవినీతి అధికారి వంటి వాడు కాదు.
మనుష్యులు వ్రాసుకున్న చట్టాలు, రాజ్యాంగాలలో ఇష్టపూర్వకంగా కుట్రపూర్వకంగా తెచ్చుకున్న లొసుగులూ ఆయన పాటించడు.
భగవంతుడి దగ్గర లంచాలు, రెడ్ టేపిజంల వంటి మాయలు ఫలించవు.
కేవలం ధర్మాచరణ, కర్మాచరణ తప్ప భగవంతుడు దేన్నీ అంగీకరించడు.
[ధర్మాచరణ, కర్మాచరణ గురించిన పుస్తకజ్ఞానం తెలుసుకుని, వల్లించటం ద్వారా ధర్మాన్ని ఆచరించినట్లు కాదు. పుస్తకజ్ఞానం దారి చూపెడుతుంది. ఆచరణ ఆ దారిలో నడవటం వంటిది. దారి తెలిసినంత మాత్రానా, ఆ దారిలో ప్రయాణించకుండా గమ్యం చేరలేం కదా!]
కాబట్టి.... ధర్మాన్ని రక్షించక పోతే అది మనల్ని రక్షించదు.
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
2 comments:
ఎన్నో మంచి మంచి విషయాలను సులువుగా అర్థం అయ్యేలా ఎంతో ఓపికతో వివరిస్తున్న మీకు అనేకానేక ధన్యవాదాలు.
మీ అభిమానానికి కృతజ్ఞతలండి!
Post a Comment