మనిషి చేసే ప్రతి కర్మనీ, ప్రతి ఆలోచనని సత్త్వరజోస్తమో గుణాల దృష్ట్యా ఎలా అర్ధం చేసుకోవచ్చునో భగవద్గీత స్పష్టంగా చెబుతుంది.

శ్లోకం:
యజన్తే సాత్త్వికా దేవా స్వక్షరాక్షాంసి రాజసాః
ప్రేతా న్భూత గణాం శ్చన్యే యజన్తే తామసా జనాః

భావం:
సాత్త్వికులు దేవతలనీ, రాజసులు యక్ష రాక్షసాదులనీ, తామసులు భూతప్రేతాలనీ పూజిస్తుంటారు.

[దేవతలు అంటే మంచిలక్షణాలు గలవారని అర్ధం. అంతే తప్ప స్వర్గలోకంలో నివసించే ఇంద్రాది దేవతలని కాదు. వరుణ, అగ్ని దేవాదులు ప్రకృతి శక్తులు. దైవాసుర సంపద్విభాగ యోగంలో, ఏ లక్షణాలు దైవ లక్షణాలో స్పష్టంగా చెప్పబడింది. అలాగే రాక్షస లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. భూతప్రేతాలంటే అధునిక కాలంలో మాఫియా, రౌడీలు అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి నకిలీ కణిక వ్యవస్థ ప్రజలని తామసం వైపుకు కాదా తరుము కెళ్ళింది? సత్త్వగుణం నుండి వ్యతిరేక దిశలోకి కాదా ఈడ్చుకెళ్ళింది?]

శ్లోకం:
ఆయు స్సత్త్వ బలారోగ్య సుఖప్ర్తీతి వివర్ధనాః
రస్యా స్స్నాగ్ధాః స్థిరా హృద్యా ఆహారా స్వాత్త్విక ప్రియాః

భావం:
ఆయువునీ, వుత్సాహాన్నీ, బలాన్నీ, ఆరోగ్యాన్నీ, సుఖాన్నీ, ప్రీతినీ వృద్ది చేస్తూ - రుచికల్గి, చమురుతో గూడి, పుష్టిని కల్గించే ఆహారమే సాత్త్వికాహారం.

శ్లోకం:
కట్వామ్లలవణాత్యుష్ణ తీక్షరూక్ష విదాహినః
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః

భావం:
చేదు, పులుపు, ఉప్పులు, అతివేడి, కారం, యెండిపోయినవీ, దాహం కలిగించేవీ - ఇవి రాజసాహారాలు. ఇవి రాజసులకు ప్రియమై, పరిణామావస్థలో దుఃఖాన్నీ, వ్యాకులతనీ, రోగాలనీ కలిగిస్తాయి.

శ్లోకం:
యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్

భావం:
ఒక జాము క్రితం వండినదీ, సారహీనమూ, దుర్వాసన గలదీ, పాచిపోయినదీ, వెనుకటి రోజున వండినదీ యితరులు తినగా మిగిలినదీ, అపవిత్రమైనదీ అయిన ఆహారం - తామసులకు ప్రీతి నిస్తుంది.


ప్యాక్డ్ ఫుడ్డ్, డ్రైపుడ్డ్, రెడీ టూ ఈట్ మొదలైన రకాలన్నీ రజోగుణాన్ని, ఎక్కువగా తామసాన్ని రేకేత్తించేవే! జంక్ పుడ్డు అందులో మరింత ముఖ్యమైనది. బద్దకాన్ని పెంచే ఊబకాయం[obesity] జంక్ పుడ్డ్ ప్రసాదించేదే! ఇక సద్దిపెట్టే[ఫ్రిజ్] మన జీవితాల్లో ప్రధాన భాగం. పరుగులెత్తే బ్రతుకులో తాజాగా వండుకోలేం. ఫ్రిజ్ లేకుండా గడపనూ లేం.

ఇలా చూసినా నకిలీ కణిక వ్యవస్థ ప్రోత్సాహస్తోంది, వృద్ధి చేస్తోంది తామసాన్నే! ఎందుకంటే తామసులు ఎదురు తిరగరు. ఎంత బానిసత్వాకికైనా సిద్దపడతారు.

శ్లోకం:
అఫలాకాంక్షి భిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే
యష్టవ్య మేనేతి మన స్సమాధాయ స సాత్త్వికః

భావం:
శాస్త్రాన్ననుసరించి, సమాహిత చిత్తంతో ఫలాపేక్ష లేకుండా చేసే యజ్ఞం - సాత్విక యజ్ఞం.

శ్లోకం:
అభిసంధాయ తు ఫలం దమ్భార్ధమపి చైవ యత్
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్

భావం:
అర్జునా! ఫలాపేక్షతోగాని, డాంబికానికి గాని చేయబడే యజ్ఞం రాజసయజ్ఞమని గ్రహించు.

శ్లోకం:
విధిహీనమసృష్టాన్నం మస్త్రహీనమదక్షిణమ్
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే

భావం:
శాస్త్రవిధి, అన్నదానం, మంత్రం, దక్షిణ, శ్రద్దా లేకుండా చేసేది - తామస యజ్ఞం.


యజ్ఞం అంటే కర్మ అని ఒక అర్ధం. పూజాకార్యం, దైవకార్యం అని మరో అర్ధం. ఇక్కడ శాస్త్రం అంటే కేవలం మంత్రాలతో కూడిన, ఆగమాది శాస్త్రాలని కాదు. అంకిత భావం లేని మంత్రోచ్ఛారణ, శబ్ధాండంబరమే తప్ప మరొకటి కాదు.

ఇప్పుడు, భగవంతుడికి, ముఖ్యంగా తిరుపతి శ్రీవేంకటేశ్వరునికి, ధనిక భక్తులు చేస్తున్న పూజలు, సమర్పిస్తున్న కానుకలు సాత్త్విక యజ్ఞం కానేకాదు. అసలు నకిలీ కణిక వ్యవస్థ ’భగవంతుడిపై భక్తి’ అన్న concept లో ప్రచారించిందే భయంకరమైన మిద్యావాదాన్ని , పదార్ధ వాదాన్ని.

"పైసామే పరమాత్మ హై"
"పైసా లేనిది పరమాత్ముడైనా పలకరించడు"
"కోట్లుంటే కొండమీది దేవుడైనా దిగొస్తాడు"
"దరిద్రుడు దండం పెడితే దేవుడు కూడా తలతిప్పుకుంటాడు"
"దరిద్రుడు స్నానికికెళితే గంగమ్మ కూడా వెనక్కెళ్ళిందట"
ఇలాంటి సామెతలన్ని ప్రతిపాదించేది ఆ మిధ్యావాదాన్నే!
మనకి డబ్బు, బంగారం ఎక్కువ విలువైనవైతే భగవంతుడి కీ అవి విలువైనవా? మనకి డబ్బంటే కౌపీనం ఉంటే, ఇష్టం ఉంటే భగవంతుడికీ ఉంటాయా? ఎంత అజ్ఞానం ఇది?

పావన గంగ! విష్ణు పాదాల నుండి ఉద్భవించిందనీ, శివుడి శిరస్సుపై నుండి భూమి పైకి దూకిందనీ, సగరపుత్రుల చితాభస్మాలని నిమజ్జనం గావించి ఉత్తమగతులు ప్రాప్తింపజేయటానికి భగీరధుడు తపస్సు చేసి మరీ కోరితే భూమికి వచ్చిందనీ హిందువులు నమ్మే గంగ! ధనిక పేద, పండిత పామర, వర్ణభేదాలు మనుషులకే గాని గంగమ్మ తల్లికి కాదని సూరదాసు నిజ జీవిత కథ చెబుతుంది. అటువంటి గంగమ్మ, పేదవాడు స్నానానికి వస్తే, వాడి దరిద్రం తనకి అంటుకుంటుందని దూరం జరిగిందట. ఎంత దొంగ, అబద్దపు ప్రచారంలో భాగంగా ఇలాంటి ’నానుడు’లు ప్రజాబాహుళ్యంలోకి ప్రవేశపెట్టబడ్డాయో! అందునా కనీసం రెండుమూడు శతాబ్ధాల పర్యంతం ప్రచారింపబడ్డాయి.

వెరసి ’డబ్బుంటే గాని దేవుడు కరుణించడు’ అన్న దృక్పధం ప్రజల్లోకి పంపిణీ చేయబడింది. అచ్చంగా యూరపులో పాపపరిహారపు పన్ను మాదిరిగా దేవాలయ హుండీ ఆదాయాలూ, ఆర్జిత సేవలూ తయారయ్యాయి.

ఒక పోలిక చెప్పాలి. ఈనాడు ఆ మధ్య వ్రాసిన ఒక ఆర్టికల్ లో నల్గొండ జిల్లాలో ఒక సామాన్యుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. దానికి ’ఒక సామాన్యుడి విఫల కథ’ అని హెడ్డింగ్ తో వ్రాసింది. నిజానికి అక్కడ విఫలమయ్యింది సామాన్యుడు కాదు పత్రికలు, ప్రభుత్వం, మానవహక్కుల సంఘం, కోర్టులు. సామాన్యుడు మాత్రం అలుపెరగకుండా పోరాడాడు. కాని హెడ్డింగ్ మాత్రం సామాన్యుడి విఫల కథ అని పెట్టబడింది. నిజానికి విఫలమయిన రాజ్యాంగం అని కదా హెడ్డింగ్ పెట్టాలి?

అలాగే, దేవాలయాలలో ప్రతి పూజకి, ప్రతి కార్యక్రమానికి డబ్బులతో లంకెపెట్టి, సామాన్యుడికి ఏ కార్యక్రమం అందనీయకుండా చేస్తున్నది దేవాలయ శాఖ. కాని ప్రచారంలో మాత్రం ’డబ్బు, పలుకుబడి ఉంటేనే దేవుడయినా మోహం చూసేది’ అన్న నానుడి నడుస్తుంది. వీళ్ళ అవినీతికి దేవుడి పేరుపెట్టడం విషప్రచారం కాక మరేమిటి?

ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తాను.

ఒకప్పుడు ’నిలువు దోపిడి’ అనే మొక్కు ఉండేది. కుటుంబసభ్యుల ప్రాణాలు మీదికీ వచ్చినప్పుడు, దాటశక్యంగాని సమస్యలు ఎదురైనప్పుడు, సాధారణంగా ఈ మొక్కు మొక్కేవారు. నిలువుదోపిడి అంటే ఆ సమయానికి దంపతులకు ఎన్ని నగలున్నాయో అన్నిటినీ భగవంతుడికి అర్పిస్తామని, తమ ఇంటి సభ్యుని ప్రాణం నిలపమనీ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ మొక్కేవాళ్ళు. శుచిగా స్నానం చేసి, తమ నగలన్ని ధరించుకుని దైవపూజ చేసి మరీ మొక్కేవాళ్ళు. తాము ఎవరి కోసమైతే మొక్కారో, వాళ్ళు ప్రాణాపాయం నుండి బయటపడితే, తదుపరి రోజుల్లో తిరుపతి వెళ్ళి తమ మొక్కు ప్రకారం, ఆయా నగలన్నిటినీ హుండీలో వేసేవాళ్ళు. ’తమ ఆత్మీయుల ప్రాణం కంటే నగలు ఎక్కువ కాదు’ అన్న భావం ఆ మొక్కులో ఉండేది. ’ధనం కంటే బంధం విలువైనది’ అన్న భావన అది. నగలమీద, ధనం మీద వ్యామోహం తగ్గించే ప్రక్రియ అది. నా చిన్నప్పుడు ఇలాంటి మొక్కుల వ్యవహారాలు ప్రత్యక్షంగా తెలుసు నాకు.

తర్వాత్తర్వాత భక్తులు తెలివి మీరి పోయి, తమ నగలన్ని ప్రక్కన పెట్టి, మంగళ సూత్రం గొలుసు బదులు పసుపు తాడు వేసుకుని లేదా నామమాత్రపు నగలు ధరించి మొక్కటం మొదలెట్టారు. నా చిన్నప్పుడు మా బంధువులలో ఒకామె ఇలా చేసింది. అప్పటికి జబ్బు తగ్గిన ఆమె కుమారుడు తర్వాత రోడ్డుప్రమాదంలో మరణించాడు. అప్పుడది సంచలనం కలిగించింది. మా బంధువర్గంలో ఇది బహుళ చర్చనీయాంశం అవ్వటం నాకు గుర్తుంది. అప్పట్లో ఇలాంటివి ప్రజల్లో దేవుడి పట్ల భయభక్తుల్ని కలిగించేవి. నోటి వార్తల్ని మీడియా వార్తాలు డామినేట్ చేసే స్థితి, ఇప్పుడున్నంతగా అప్పుడుండేది కాదు.

ఆ తదుపరి రోజుల్లో... వరుసకు మాకు పిన్ని అయ్యే ఒకావిడ నిలువుదోపిడి మొక్కుకుంది. ఆపద తీరాక, తన నగలన్నిటినీ తన తోడి కోడలికి వందరూపాయలకి అమ్మేసింది. [అప్పట్లో సవరు బంగారం వెయ్యో రెండు వేలో ఉండేది.] తిరుపతి వెళ్ళి ఆ వందా దేవుడి హుండీలో వేసి వచ్చింది. తర్వాత నూటపది రూపాయలు ఇచ్చి , మళ్ళీ తన నగలు తను తోడి కోడలి నుండి కొనుక్కుంది. ఇది జరిగిన కొన్నినెలల తర్వాత, వాళ్ల లారీ ప్రమాదానికి గురైంది. ఇన్సూరెన్సు సొమ్ము కూడా ఎందుకో గాని ముట్టలేదు. దెబ్బతో లాభం కాస్తా గూబల్లోకి వచ్చింది. అవిడ ఏడుస్తుంటే అప్పటికి ఓదార్చినా, తర్వాత మా నాన్న అమ్మ, ఇంట్లో చర్చిస్తున్నప్పుడు నాకు వివరాలు తెలిసాయి. "ఈమెకే ఇన్ని పిల్లిబిత్తర తెలివి తేటలుంటే దేవుడి కేనా లేనిది?" అని మా నాన్న వ్యాఖ్యానిస్తే అందరూ నవ్వుకున్నారు.

ఈ విధంగా, కాలం గడిచే సరికి మనిషి ’తాను దేవుణ్ణి కూడా బురిడీ కొట్టించగలను’ అనుకునేంతగా అతి తెలివి మీరి పోయాడు. అహంకారి అయిపోయాడు. ’తానెన్ని మోసాలు చేసినా సరే! దేవుడికి వాటా ఇచ్చేస్తే దేవుడేం అనడు, అంతా మంచే చేస్తాడు. లాభాలే ఇస్తాడు’ అనుకోవటం అంటే దేవుడికే ఎంతగా ధన వ్యామోహం అంటగట్టటమో కదా!?

అంతేకాదు, ప్రదర్శించుకోవటానికి పూజలూ, దేవుడికి కానుకలూ ఇవ్వటం కూడా రాజస యజ్ఞం అవుతుందే గాని భక్తి పూర్వకం అవ్వదు. చిన్న కథ చదవండి. ఇది బాలల కథామంజరిలోని కథ. నాకు తెలిసీ ప్రక్షిప్తం మాత్రమే!

ఓసారి నారద మహర్షి కైలాసానికి వెళ్లాడట. అప్పటికి ఆ జగన్మాత దివ్యదేహమ్మీద బొబ్బలున్నాయి. అమ్మవారికి శైత్యపచారాలు జరుగుతున్నాయట. అది చూసి నారదమహర్షి "ఏమిటిది తల్లీ!" అంటే ఆ తల్లి చల్లగా నవ్వుతూ,"ఏమీలేదు నారదా! నిన్న దేవేంద్రుడు అమరావతిలో నాకు బంగారుపుష్పార్చన నిర్వహించాడు. తన కలిమిని ప్రదర్శించుకుంటూ అతడు నా విగ్రహంపై విసిరిన ఒక్కొక్క పువ్వు నా శరీరం మీద ఒక్కొక్క బొబ్బని రేపింది" అన్నదట. నారదుడు ఆశ్చర్యంతో వెళ్ళిపోయాడు.

మరునాడు మళ్ళీ కైలాసానికి వచ్చేసరికి జగన్మాత పరమశివుడితో ఆనందతాండవం చేస్తున్నదట. ఆమె దేహం దివ్య కాంతులీనుతూండటం చూచి నారదుడు "తల్లీ! క్రితం నేను నీ దర్శనం చేసుకున్నప్పుడు బొబ్బలతో, మచ్చలతో ఉన్నావు. ఇప్పుడు నృత్యకేళిలో ఉన్నావు. ఇప్పుడెందుకిలా జరిగింది?" అన్నాడట. ఆ తల్లి నవ్వుతూ "నారదా! దేవేంద్రుడి పటాటోప పూజ నన్ను బాధిస్తే, నిన్న భూలోకంలో ఓ పేద భక్తుడు తన నిర్మల భక్తితో దోసెడు బంతిపూలతో నాకు పూజ నిర్వహించాడు. భక్తితో అతడు సమర్పించిన పూలకి నా బొబ్బలు పరిహరింపబడ్డాయి" అందట. దీనినే గీత ’పత్రం, ఫలం, పుష్పం, తోయం[నీరు]లతో, నిర్మలమైన భక్తితో పూజిస్తే చాలు’ అని చెప్తుంది.

దైవం నిర్మల భక్తికే తప్ప, ధనకనక వస్తు వాహనాది కానుకలకి, షడ్రపోపేత నైవేద్యాలకి సంప్రీతుడౌడనుకుంటే అది మన అమాయకత్వమే! సాధనతో భక్తినీ, నైర్మల్యాన్ని, మంచితనాన్ని పెంచుకుంటూ పోవలసిందే గానీ, దైవాన్ని చేరటానికి మరింకే దగ్గరి దారులూ ఉండవు.

మరోసారి త్రిగుణాలని గురించి గీత ఏం చెప్పిందో పరిశీలించండి.

శ్లోకం:
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవమ్
బ్రహ్మ చర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే

భావం:
దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను పూజించడం, శౌచం, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస, ఆర్జవములు - శరీరంతో చేసే తపస్సు.

శ్లోకం:
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉ చ్యతే

భావం:
ఇతరులకు బాధ కలిగించని సత్యప్రియమైన మాటలు, వేదాభ్యాసం ఇవి వాక్కులతో చేసే తపస్సు.

శ్లోకం:
మనః ప్రసాదస్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః
భావసంశుద్ది రిత్యేత త్తపో మానసముచ్యతే

భావం:
నిశ్చలమనస్సు, మృదుత్వం, మౌనం, అంతఃకరణ శుద్ది కలిగి వుండటం, మనస్సుతో చేసే తపస్సు.

శ్లోకం:
శ్రద్దయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః
అఫలాకాంక్షిభిర్యుక్తై స్సాత్త్వికం పరిచక్షతే

భావం:
ఫలాపేక్ష లేకుండా, నిశ్చల మనస్సుతో శ్రద్ధాసక్తుడై చేసే ఈ మూడు విధాల తపస్సూ సాత్త్విక మంటారు.

శ్లోకం:
సత్కారమానపూజార్ధం తపో దంభేన చైవ యత్
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్

భావం:
పరుల నుండి గౌరవ సత్కారాల నాశించుతూ డంబంతో చేసే తపస్సు - రాజస మనబడుతుంది. దీని ఫలితం కూడా అల్పంగానే ఉంటుంది.

శ్లోకం:
మూఢగ్రాహేణాత్మనో య త్పీడయా క్రియతే తపః
పరస్యోత్సాదనార్ధం వా తత్తామస ముదాహృతమ్

భావం:
పరులకు హాని కలిగించే దురుద్దేశ్యంతో, తనను తానే హింసించుకుంటూ, మూర్ఖపు పట్టుదలతో చేసే తపస్సు తామసిక మనబడుతుంది.

ఈ మొత్తాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే ఆనాడు బాపూ, స్వాతంత్ర సమరయోధుల దీక్ష సాత్త్విక తపస్సయితే, ఈనాడు కేసీఆర్ లు చేసింది తామస తపస్సున్న మాట.

ఇక దానం గురించి పరిశీలిస్తే... పూర్వపు రోజుల్లో ధనికులు పేదసాదలకు దానం చేయటం పుణ్యం అని భావించి చేసేవారు. ఓ రకంగా చెప్పాలంటే ధనికుల మీద పేదలకి, పేదల మీద ధనికులకీ ద్వేషం రగలకుండా, వైషమ్యాలు రేగకుండా ఈ ’concept’ ఉపయోగపడేది. సామ్యవాదపు ఆచరణ ఆ విధంగా ఉండేదనుకోవచ్చు. ఎందుకంటే గీత... పుణ్యకార్యాలు చేసేవాడు కూడా ఆ పుణ్యఫలం క్షీణించగానే తిరిగి జన్మనెత్తాల్సి వస్తుందంటుంది.

శ్లోకం:
త్రెవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్ధయంతే
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్

భావం:
ఎవరైతే వేదవిదిత యజ్ఞ కర్మల చేత నన్ను పూజించి, సోమపానం చేత పాపాలను పోగొట్టుకొని స్వర్గం కోరుతున్నారో, వాళ్ళు ఆ స్వర్గంలోనే దేవభోగాల ననుభవిసున్నారు.

శ్లోకం:
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలంక్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి
ఏవం త్రయీధర్మం మనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే

భావం:
పుణ్యఫలం క్షీణించగానే వాళ్ళు మళ్ళీ మానవ లోకంలో జన్మిస్తున్నారు. వేద ధర్మానుష్ఠానపరులై కామ్యకర్మలు చేసే వారికి స్వర్గమర్త్య లోకాలలో జనన మరణాలు తప్పవు.

ఇది ఎటువంటిదంటే - ఈ లోకంలో సుఖంగా బ్రతకడం కోసం డబ్బు కావాలి. ఆ పరుగులో ’అతి’ని నిరోధించడానికి పాపపుణ్యాల concept ఉపయోగపడుతుంది. అయితే పుణ్యమూ డబ్బులాంటిదే! ఇహలోకంలో డబ్బుతో సుఖంగా బ్రతకవచ్చన్నట్లే, పుణ్యంతో పరలోకంలో సుఖంగా ఉండొచ్చు. అయితే అదీ అశాశ్వతమే. కాకపోతే ఇహలోక జీవనం కంటే పరలోక జీవనం సాపేక్షంగా సుదీర్ఘమూ, జరావ్యాధి భయ రహితము అయి ఉంటుంది. అంతే! [కొంతమంది స్వర్గం ఉంటుంది అన్న నమ్మకంతోనయినా డబ్బును దానధర్మాలకి వినియోగింపజేయటానికి ఈ కాన్సెప్ట్ ఉండి ఉండవచ్చు.]

అందుచేత, భగవద్గీత, కర్తత్వాహంకారమూ, కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలాచరించటం అంటే బుద్ధి యోగాన్ని అవలంబించటంతో జన్మరాహిత్యాన్ని, భగవంతుణ్ణి , పొందవచ్చు అని చెబుతుంది. దీనినే గీత

శ్లోకం:
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః
కర్మ ణ్యభిప్రవృత్తో2పి నైవ కించి త్కరోతి సః

భావం:
ఫలాపేక్ష లేకుండా, నిత్యతృప్తుడూ, నిరాశ్రయుడూ అయిన వాడు కర్మలు చేసినా, చేయనట్లే సుమా!

శ్లోకం:
నిరాశీ ర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహః
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్

భావం:
తృష్ణలేనివాడు, చిత్తాన్నీ ఇంద్రియాలనీ జయించిన వాడు, బ్రతుకు నిలిచేందుకు మాత్రమే వస్తు సామాగ్రిని సేకరించుకునేవాడు - పాపకూపంలో చిక్కుకోడు.

శ్లోకం:
యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః
సమ సిద్ధావ సిద్ధౌచ కృత్వాపి న నిబధ్యతే

భావం:
తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు, శంకారహితుడు, మాత్సర్యం లేనివాడు, కార్యం సిద్దించినా సిద్ధించకపోయినా సమాన బుద్ది గలవాడు - ఏ కర్మలను చేసినా బంధనాలలో చిక్కుకోడు.

కర్మలు చేసినా చేయనట్లే అంటే, మంచిచెడు కర్మల ఫలితాలు బుద్దియోగికి అంటదని అర్ధం. బుద్దియోగి, జన్మరాహిత్యం అంటే మోక్షాన్ని పొందుతాడని భావం.

ఈ దృక్పధాన్ని పెంచడానికి, ధనిక పేదల మధ్య సమన్వయాన్ని, వైషమ్యరాహిత్యాన్ని సృష్టించేందుకు దానం అనే ప్రక్రియ ఏర్పాటు చేయబడింది. క్రింది శ్లోకాలని గమనించండి.

శ్లోకం:
దాతవ్య మితి యద్దానం దీయతే2నుపకారిణే
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్

భావం:
పుణ్యస్థలాలలో "దానం చేయుట కర్తవ్య" మని భావించి, దేశకాల పాత్రలను గుర్తించి, తమకు యే రకంగానూ వుపకరించలేని వారికి చేసే దానం సాత్త్వికం.

శ్లోకం:
యత్తు ప్రత్యుపకారార్ధం ఫలముద్దిశ్య వా పునః
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్

భావం:
ప్రత్యుపకారంగా గాని, ప్రతిఫలంకోరిగాని, కష్టపడుతూనైనా సరే, చేసే దానాన్ని రాజస దానమంటారు.

శ్లోకం:
అ దేశకాలే యద్దాన మపాత్రేభ్యశ్చ దీయతే
అసత్కృత మవజ్ఞాతం తత్తామస ముదాహృతమ్

భావం:
దేశకాల పాత్రలను గుర్తించకుండా అగౌరవ భావంతో చేసే దానమే తామసదానం.

ఈ దృష్ట్యా చూస్తే ఈ రోజుల్లో తమ ’పనులు జరగటం’ కోసం జనాలు అధికారులకీ, రాజకీయ నాయకులకీ ఇస్తోన్న ’లంచం’ రాజస దానం అన్నమాట. దౌర్భాగ్యం ఏమిటంటే, భగవంతుడికి కూడా ఇదే రకమైన దాన్ని ’కానుకల’ రూపంలో సమర్పించటం. ఒకప్పటి ఆపదమొక్కులు కాదు నేటి భక్తుల కానుకలైన బంగారూ, వజ్రాల నగలూ, కోట్లాది నోట్ల కట్టలూ. ఇవి తమకు వ్యాపారాల్లో ’ఇంత లాభాలు వస్తే ఇంత శాతం ఇస్తామని ’ లేదా ’ఉద్యోగాల్లో ఇంత పైసంపాదన వస్తే ఇంత ఇస్తామని ’ మొక్కుకునో మొక్కుకోకుండానో దేవుడికి సమర్పించటం.

ఆపద మొక్కు అంటే కష్ట కాలాలలో కాపాడమని కోరుతూ తమకు ఉన్నదానిలో ముడుపు కట్టుకోవటం. ఇంత ఆదాయం వస్తే అందులో ఇంత శాతంతో భగవంతుడికి ఆర్జిత సేవలో, అందమైన నగలో లేక భవననిర్మాణాది కానుకలో ఇవ్వటం, అచ్చంగా పోప్ నుండి పాప పరిహారపు పన్ను టోకెన్లు కొనుక్కోవటం వంటిదే. యూరప్ సాంప్రదాయం తిరుమల చేరటమే ఇక్కడి విచిత్రం! అదీ నకిలీ కణిక వ్యవస్థ పనితీరు.

ఇక మరో రకపు దానాలున్నాయి. బాబాలు, ఇతర ఛారిటీ సంస్థలూ, ఇస్కాన్ వంటి సంస్థలూ చేసే అన్నదానాదుల వంటివి. కొన్ని కార్పోరేట్ సంస్థలు కూడా సంవత్సరానికి ఇన్నికోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇవి తమ మోసాలు దోపిడిల నుండి ప్రజాదృష్టిని మరల్చి, తమపై సదభిప్రాయం ఏర్పాటు చేసుకునేందుకు చేసే పనులు. నిజంగా అంత ధార్మికత ఉంటే అసలు మోసాలు, దోపిడులే చేయరు కదా! తమ స్వార్ధపూరిత దగాలు, దోపిడులు బహిర్గతం కాకుండా [high light], ’పాప పరిహారపు పన్ను’ మాదిరిగా కొంత ధనం ఖర్చు పెట్టటం. ఇది కూడా తామసదానం అనే చెప్పుకోవచ్చు.

ఇవేవీ పరిశీలించకుండా, ఫలానా సంస్థ రోజుకింత మంది పేదలకు అన్నదానం చేస్తుంది గనుక ఆ సంస్థ వాళ్ళు మంచివాళ్ళే అని వాదిస్తుంటారు కొందరు.
ఇదీ తామస లక్షణమే. ఎందుకంటే

శ్లోకం:
అ ధర్మం ధర్మమితి యా మన్యతే తమసా22వృతా
సర్వార్ధాన్ విపరీతాంశ్చ బుద్ది స్సా పార్ధ! తామసీ

భావం:
అధర్మాన్ని ధర్మంగాను, అన్ని విషయాలనూ అపసవ్యంగాను గ్రహించేది తామస బుద్ది.
అంటుంది గీత.

నిజానికి అవసరానికి మించిన ఆర్జన చేయటం, అందుకోసం దగాలు, దోపిడులు చేయటం మానేస్తే ఆసలంత మంది పేదలే తయారవ్వరు కదా? వేలకోట్ల రూపాయలతో 26 అంతస్థుల విలాస నివాస భవనాలు, తమ భవంతి పైనుండి తమ వ్యాపార కేంద్రానికి నేరుగా హెలికాప్టర్లు గల మహాత్మలు ముఖేష్ అంబానీలు, ప్రపంచమంతటా బహుళ సంఖ్యలో ఉండటం తెలిసిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

మీరు నిజంగా మా అమ్మే, ఇంత మంచి టపాలు వ్రాస్తున్నందుకు దేవుడు మీకు ప్రపంచంలోని ఆనందమంతా ఇవ్వాలి. ఇవి చదివి ఒక కరడుకట్టిన మనస్సన్నా మారకుండా ఉంటుందా!! మీ బ్లాగు ఒక అపురూప నిధి.

భగవంతుడు మిమ్మల్ని చల్లగా దీవించుగాక.

:-)

జింతాకు గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ అభినందలని మనసారా ఆనందిస్తున్నాను. :)

Clipped.in - Explore Indian blogs gaaru: Thank U.

లక్ష్మిగారూ, భలే సంతోషమనిపించిందండీ ఈ వ్యాసం చదివాక. మీకూ మీ సద్బుద్ధికీ విజ్ఞతకూ దక్షతకూ నమస్సులు. నిత్యమూ మీ వ్యాసాల ద్వారా మమ్మల్ని సమ్మానిస్తున్నందుకుగానూ మీకు ఇదే నా వాక్సన్మానం.

తిరుమల దేవుని సొమ్ము దోచుకున్న౦దుకు కరుణాకరరెడ్డి(మజీ చైర్మెన్) కుటు౦బ సభ్య్లులు అలవికాని ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని విన్నాను. నిజమె౦తో తెలియదు.

అమ్మా, ఎప్పటిలానే మీ ఙాన సముద్రం నుంచి ఎనలేని వెల కట్టలేని రత్నాలు దొరికాయి. మీ ఆశిస్సులతో మేము అమ్మ కడుపు చల్లగా ఉంటామమ్మా.

రాఘవ గారు, స్వర్ణమల్లిక గారు:మీ అభిమానానికి, వ్యాఖ్యకూ కృతజ్ఞతలు!

అజ్ఞాత గారు: నిజమా, నాకైతే తెలియదండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu