ఈ ఆదివారంనాడు, హోలీ పండుగ సందర్భంగా ఓ కథనీ, మన జీవితాల్లో దాని అనువర్తననీ వ్రాసి నా బ్లాగు మిత్రులని అలరించాలని ఇది వ్రాస్తున్నాను. ఇది నేను డిగ్రీ చదువుతుండగా మా జేకేసీ కళాశాల గ్రంధాలయం నుండి తెచ్చుకున్న పుస్తకంలో చదివాను. ఏ ఉపనిషత్తులోదో తెలియదు గానీ ఉపనిషత్కథ గానే చదివినట్లు గుర్తు.

ఇక నేరుగా కథలోకి!

అనగా అనగా....

ఓ అడవిలో ఒక మహర్షి ఉండేవాడు. ఆయన అఖండ తపశ్శక్తి సంపన్నుడు, జ్ఞానపూర్ణుడు, శాంతమూర్తి. భవిష్యద్వర్తమానాలని తిలకించగల ద్రష్ఠ. ఆయన దగ్గర ఓ శిష్యుడుండేవాడు. ఎంతో శ్రద్ధాభక్తులతో గురువుని సేవించేవాడు. గురువు సైతం శిష్యుణ్ణి వాత్సల్యంతో ఆదరిస్తూ జ్ఞాన బోధ చేస్తుండేవాడు. ఆశ్రమంలో ఇంకా ఇతర శిష్యులున్నా గురువుగారికి ఇతడంటే ఆదరణ ఎక్కువ. అందుకు తగ్గట్టే శిష్యుడు కూడా వినయశీలి, జ్ఞాన తృష్ణ, గురుభక్తి కలవాడు.

ఇలా ఉండగా... గురువుగారికి మరణ సమయం ఆసన్నమైంది. అశ్రునయనాలతో శిష్యుడు గురువుకి శుశ్రూష చేస్తున్నాడు. గురువు శిష్యుణ్ణి చేరబిలిచి "నాయనా! జన్మంతా తపమాచరించినా, గత జన్మ పాపఫలం ఇంకా అనుభవింప వలసే ఉంది. మరుజన్మలో నేను పందినై పుడతాను. పుట్టిన రెండు ఘడియల లోపల తనువు చాలిస్తే శాశ్వతమైన బ్రహ్మపదాన్ని పొందుతాను. లేనట్లయితే మరికొన్ని కర్మల నాచరింపక తప్పదు. పంది జన్మ అయినందున, పాపమే చేస్తానో పుణ్యమే చేస్తానో? ఆయా చర్యల ఫలితంగా మరికొన్ని జన్మలెత్తక తప్పదు. కాబట్టి, నాయనా! గురుదక్షిణగా నువ్వు నాకోసం ఓ పని నిర్వహించాలి. నేను ఫలానా ప్రదేశంలో, ఫలానా సమయంలో ఫలానా చోట ఓ పందికి పుట్టిన పదిపిల్లల్లో ఒకటిగా పుడతాను. నా నుదుట ఓ తెల్లని మచ్చ ఉంటుంది. ఇదే గుర్తు! నువ్వు నేను చెప్పిన చోటుకు, ముందుగా చేరుకొని, నేను పంది పిల్లగా జన్మించిన వెంటనే నన్ను చంపివేయి. ఇదే నేను నిన్ను కోరే గురుదక్షిణ!" అన్నాడు.

శిష్యుడు విభ్రాంతి చెందాడు. తేరుకొని వినయంగా గురువు పాదాలు తాకి "మీ ఆజ్ఞ శిరసావహిస్తాను,. గురువర్యా!" అన్నాడు. గురువు మరుజన్మ వివరాలు చెప్పి చిరునవ్వుతో ప్రాణాలు విడిచాడు. ఈ శిష్యుడు, ఇతర శిష్యులతో కలిసి గురువుగారికి దహన సంస్కారాది ఉత్తర క్రియలన్నీ నిర్వహించాడు.

తర్వాత గురువు గారు చెప్పిన చోటుకి వెళ్ళాడు. అక్కడ నిండు చూలుతో ఓ పంది కన్పించింది. శిష్యుడు తనతో తెచ్చుకున్న కత్తితో సిద్దంగా ఉన్నాడు. గురువు గారు చెప్పినట్లే, ఆ పంది నిర్ధిష్ట సమయంలో పది పిల్లల్ని కన్నది. అందులో ఒక పిల్ల నుదుట తెల్లని మచ్చ ఉంది. అది మిగిలిన పంది పిల్లల కంటే భిన్నంగా ఉంది. శిష్యుడు దాన్ని గుర్తించాడు. వెంటనే తన చేత నున్న కత్తితో దాన్ని చంప నుద్యుక్తు డయ్యాడు.

ఆ చిన్న పందిపిల్ల ఒక్కసారిగా మానవ భాషలో మాట్లాడసాగింది. పూర్వ జన్మలో తన గురువైనందున ఆ పందిపిల్ల మానవ భాషలో మాట్లాడ గలుగుతోందో, గురువు ఆశీస్సుల వల్ల తానే దాని భావనలని భాషగా విన గలుగుతున్నాడో, అర్ధం కాని అయోమయంలో శిష్యుడుండగానే.... ఆ పందిపిల్ల.... "ఏమయ్యా! మనిషివి. అందునా చూడబోతే విద్యాబుద్దులు నేర్చిన వాడిలా ఉన్నావు. నేను చిన్న ప్రాణిననే కదా చంపే పాపానికి ఒడిగట్టావు? నేను నీకేం ద్రోహం చేసానయ్యా?" అంది.

శిష్యుడు నివ్వెర పడ్డాడు. అతడేదో అనబోయేంతలోనే అది "ఏం మనుషులయ్యా మీరు? మళ్ళీ చెప్పడానికి ఇన్ని నీతులు చెబుతారు? చిన్నపిల్లని. పుట్టి అరఘడియ కాదు గదా, కొన్ని క్షణాలైనా కాలేదు. ఇంకా తల్లి పాల తీయదనాన్నైనా చవి చూడలేదు. తల్లి కడుపు మీద వాలి, పొదుగులోకి తలదూర్చి, తనివితీరా తల్లి ప్రేమని ఆనందించనైనా లేదు. ముక్కు పచ్చలారని పసిదాన్ని. లేత ఒంటితో గునగునలాడుతున్న నన్ను చంపేందుకు, నీకు చేతులెలా వచ్చాయి? దుర్మార్గుడా! నీకు పాప పుణ్యాల చింతనైనా లేదా?" అంది.

అప్పటికి శిష్యుడు కొంత తమాయించుకున్నాడు. "అయ్యో! ఇదేమిటి స్వామీ!? పూర్వజన్మలో మీరు నాకు గురుదేవులు. మీ ఆజ్ఞ ప్రకారమే, ఈ జన్మలో పందిగా పుట్టిన మిమ్మల్ని సంహరించ వచ్చాను. మీకు గుర్తులేనట్లుంది" అన్నాడు.

పందిపిల్ల కోపంగా "చాలు చాల్లేవయ్యా! మహా చెబుతున్నావు. నీకు నచ్చిన కథలన్నీ చెబుతున్నావా ఏం? ఎవరు నువ్వు, ఎవరు నేను? పోయిన జన్మలో నేను నీ గురువునా? నువ్వు నా శిష్యుడివా? ఎవరు చూసొచ్చారు? ఇలాంటి కథలు, అభూతకల్పనలు చెప్పి, బలహీనులైన మాలాంటి అల్పప్రాణుల మీద అధిక్యత చూపాలని, అణచి వెయ్యాలని చూస్తున్నట్లున్నావు. అదేం కుదరదు" అంది.

శిష్యుడు సహనంగా "ఇప్పుడు పందిపిల్లగా ఉన్నారు గనుక మీరు గ్రహించలేకుండా ఉన్నారు గానీ, పంది జన్మలో ఏమున్నది గురువర్యా? సమయం దాటితే మోక్షసిద్ది పొందే అర్హత కోల్పోతారు. కాబట్టి మిమ్మల్ని కడతేరుస్తాను. అదే నాకు గురువాజ్ఞ" అన్నాడు.

పందిపిల్ల ఖస్సుమంటూ "మోక్షమా మరేమన్నానా? ఏం చెబుతున్నావు? అయినా ఈ బురదలో ఎంత సుఖముందో నీకేం తెలుసు? మెత్తటి ఈ బురదలో దొర్లుతూ, తోటి పందులతో తోసుకుని ఘర్ణిల్లుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది! నీకు నీ ఆశ్రమంలో, గున్నమామిడి చెట్టు క్రింద, ధ్యాన సమాధిలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో, నాకు ఈ బురద గుంటలో పొర్లాడుతుంటే అంత ఆనందంగానే ఉంటుంది. నీ ఆనందం నీది, నా ఆనందం నాది. నీ జన్మ, నీ ఆనందం, నీకు గొప్ప. నాకు నా జీవితం గొప్ప. తీయని తాజా పళ్ళు తింటూ నీ వెంత తృప్తి పొందుతావో, కుళ్ళి కంపెత్తుతున్న వ్యర్థాలని తింటూ నేనూ అంతే తృప్తి పొందుతాను. అయినా మోక్షసిద్ది అంటూ ఏదేదో చెబుతున్నావే! తల్లి ఒడిలోని చిన్నిపిల్లని, నీకు ఏ కీడూ చేయని దాన్ని , నన్ను చంపేందుకు నీకు ’పాపం’ అన్న భయంగానీ లేదా? ఇంత ముద్దుగా ఉన్నానే! నన్ను చూసి జాలి కూడా కలగటం లేదా? ఎంత కఠినాత్ముడివయ్యా నువ్వు?" అంది.

శిష్యుడికి ఓ క్షణం పాపభీతి తోచింది. వంద సందేహాలు వచ్చాయి. నిజమే! ఈ పందిపిల్ల తనకి ఏ కీడూ చెయ్యలేదు. అది తనకి ఆహారం కూడా కాదు. దాన్ని చంపి పాపం మూటగట్టుకుంటానా? అనిపించింది. తన ప్రాణం కోసం అది చేస్తున్న వాదన, ప్రతిఘటన సరియైనవనిపించింది. కత్తి వెనక్కి తీసుకున్నాడు.

అంతలో గురువు గారు చెప్పిన సమయం మించి పోతున్నదని గుర్తుకు వచ్చింది. "ఈ జన్మలోని ఈ పందిపిల్ల తన గురువు కాదు. గత జన్మ లో తన గురువు కావచ్చు, కాకపోవచ్చు. పందిపిల్ల అన్నట్లు జన్మలుండనీ, ఉండక పోనీ! ఆ మీమాంస తనకి అనవసరం. తాను తన గురువుకి మరణ సమయంలో మాట ఇచ్చాడు. ఆ ప్రకారమే ఇక్కడికి వచ్చాడు. ఈ సమయంలో ఇక్కడ పుట్టిన ఈ పందిపిల్లని చంపుతానన్నాడు. ఇచ్చిన మాట తప్పటం సరికాదు. అదీ గురు దక్షిణంగా సమర్పిస్తానన్నాడు. ఈ పందిపిల్లని చంపడం వల్ల తనకి పాపమే రానీ గాక! పాప పరిహారం కోసం, మరింత కష్ట పడి సాధన చేస్తాను. అంతే తప్ప, గురువు గారికి ఇస్తానన్న గురు దక్షిణ ప్రమాణం తప్పను.

అంతే కాదు. తనకు గురువు ఇచ్చిన ఆజ్ఞతోనే నిమిత్తం కానీ, ఈ పందిపిల్ల సంవాదంతో ఏ నిమిత్తమూ లేదు. గురువు తనకి చెప్పిన పని ’ఈ పందిపిల్లని చంపడం’. దాంతో తనకి పాపమే రానీ, పుణ్యమే రానీ! అది ఫలితం. తనకి ఫలితంతో పనేమిటి? చెప్పిన పని చేయటం వరకే తన ధర్మం. శిష్యునిగా గురువాజ్ఞ పాటించడం తన కర్తవ్యం. ఫలితం ఏమైనా గానీ!" - ఈ విధమైన స్థిర నిశ్చయానికి రాగానే శిష్యుడు మరిక ఆలస్యం చేయలేదు. నిర్ణీత సమయం ముగియక ముందే పందిపిల్లని హతమార్చాడు.

మరుక్షణం, కళ్ళ ఎదుట దేదీప్యమాన తేజస్సుతో, దివ్య శరీర ధారియై గురువు సాక్షాత్కరించాడు. శిష్యుడు వినమ్రంగా నమస్కరించగానే "నాయనా! నన్ను ముక్తుణ్ణి చేశావు. నీకివే నా ఆశీస్సులు!" అంటూ గురువు చేయెత్తి దీవించాడు.

శిష్యుడు ఆతృతగా "గురువర్యా! దివ్య జ్ఞాన సంపన్నులు మీరు! భవిష్యత్తు ను దర్శించగల ప్రభావశీలి! అలాంటి మీరు, పంది జన్మ మీద అంత పెనుగులాడారేమి స్వామి? ఇది నాకు అర్ధం కాలేదు. దయచేసి నా సందేహ నివృత్తి చేయండి" అని అడిగాడు.

గురువు చిరునవ్వు నవ్వి "నాయనా! అదే మాయా మోహం! ఎంతటి వాడైనా ఆ మాయ అనే బురద [రొచ్చు]లో పడితే అంతే! అదే పరమ సుఖమనీ, శాశ్వతమనీ అనుకుంటారు. నాయనా, మాయ దాట సాధ్యం కానిది. దైవకృప ఉంటేనే దాటగలం. ఇప్పుడు నువ్వు, పందిపిల్ల చేసిన సంవాద ప్రభావంతో నా ఆజ్ఞ మీరి ఉంటే, నీకు అప్పగించిబడిన పనిని సందేహరహితంగా, ఫలాపేక్షరహితంగా చేయనట్లయితే, నాకు ముక్తి లభించి ఉండేది కాదు. ఆ విధంగా నిన్నూ నన్నూ కూడా దైవమే రక్షించింది. ఆ దైవకృప మనమీద ఉండాలంటే మనం సాధన చేయాలి. ఇది ఎవరికైనా తప్పదు" అన్నాడు.

శిష్యుడు సంతోషాంతరంగంతో గురువుకి ప్రణామాలర్పించాడు. గురువు శిష్యుణ్ణి, ధర్మార్ధ కామమోక్ష సాధనలో సాగమని దీవించి అంతర్హితుడైనాడు.

ఇదండీ కథ!

నిజానికి ఈ కథ.... శిష్య, సూకర సంవాదంగా, సుదీర్ఘంగా సాగిన గ్రంధం! అప్పటికి నాకు అవగాహన లేని రీత్యా నాకు అర్ధమైంది తక్కువ. అందులో గుర్తున్నంత వరకూ ఇప్పుడు వ్రాసాను. జన్మాంతర స్థితిగతుల గురించి, జన్మ రహితాలని, జన్మ రాహిత్యాలని తర్కిస్తూ, ఆత్మ శరీర సంబంధాలని కూడా ఆ గ్రంధంలో చర్చించారు. అప్పటికే జేగురు రంగుకు తిరిగిన కాగితాలతో ఉన్న పాతగ్రంధం అది. బహుశః ఇప్పుడు లభ్యం కూడా కాదేమో! ఎవరికైనా, ఇది ఏ ఉపనిషత్తు లేదా ఇతర గ్రంధంలోదో తెలిస్తే చెప్ప వలసిందిగా నా విన్నపం.

ఇక మన జీవితాల్లో ఈ కథ అనువర్తన ఏమిటంటే - మనం కూడా మాయామోహంలో పడి, పెద్దలని తూలనాడుతూ ఉంటాము. మంచి చెప్పవచ్చిన వారిని, హితవు కోరిన వారినీ, చాలు పొమ్మంటాము. స్వానుభవం తర్వాత గాని మనకదంతా తెలిసి రాదు. ఎందుకంటే మాయా ప్రభావం తత్కాల సుఖమై ఉంటుంది. అబద్దం తీయగా, నిజం చేదుగా ఉండటం సహజం కదా!

ఉదాహరణకి ధూమపానమో, మద్యపానమో వ్యసనమై ఉందనుకొండి. ’వద్దురా బాబూ, ఒళ్ళూ ఇల్లూ గుల్లవుతుంది!’ అంటే, సదరు వ్యసన పరులు ఏమంటారు? నీతులు చెప్పింది చాల్లే పొమ్మంటారు. ’ఇది కాదు నాయనా జీవితం! దీనికి భిన్నమైన దృక్పధం ఒకటుంది’ అంటే, నచ్చని వాళ్ళు ఏమంటారు? ’నీకు నీ అభిప్రాయం ఎంత గొప్పో, మాకు మా అభిప్రాయమూ అంతే గొప్ప’ పొమ్మంటారు. అనుభవం తర్వాత నిజం తెలుసుకునేటప్పటికి జీవితం కాస్తా ముగింపుకి వచ్చేస్తుంది. జీవిత చరమ దశలో జీవిత సత్యాలు తెలుసుకుని లాభమేముంటుంది? అప్పటికి ఆచరించేందుకు సమయమూ, ఓపిక ఉండవు కదా!

కాబట్టే మాయ దాట శక్యం కానిది. దైవకృప ఉంటేనే అది దాటగలం. దీన్నే గీతాశ్లోకాలు

శ్లోకం:
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే

భావం:
దివ్యము, త్రిగుణాన్వితమూయైన నా మాయ దాట శక్యం గానిది. నన్ను శరణు వేడే వాళ్ళు మాత్రమే ఈ మాయను తరించగలుగుతారు.

శ్లోకం:
న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః
మాయ యా2పహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః

భావం:
రాక్షసభావ యుతులూ, మాయావృతమేధావులూ, దుష్కృతులూ, మూర్ఖులూ, నీచులూ నన్ను ఆశ్రయించలేరు.

శ్లోకం:
చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినో2ర్జున
ఆర్తో జిజ్ఞాసు రర్థార్దీ జ్ఞానీ చ భరతర్షభ

భావం:
భరతశ్రేష్ఠా! ఆపదల్లోపడిన వాడు, జిజ్ఞాసువు, సంపదల్ని కోరేవాడు, జ్ఞానీ - యీ నాలుగు విధాల పుణ్యాత్ములే నన్ను సేవిస్తారు.

అందరికీ హోలీ శుభాకాంక్షలతో.....

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

ఆదిలక్ష్మి గారూ !
మంచి కథ...మంచి నీతి....మంచి వ్యాఖ్యానం......కృతజ్ఞతలు. మీకు,మీ కుటుంబానికి కూడా హోలీ శుభాకాంక్షలు.

There’s a Trojan in the EVM!
- by shailesh 27 Feb 2010

http://content.msn.co.in/msncontribute/story.aspx?PageID=e24923de-6008-428d-abca-8b87ede64142

మీకు,మీ కుటుంబానికి కూడా హోలీ శుభాకాంక్షలు.

subha dinaana subhakaramaina charitam vivarimchaaru

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu