ఈ రోజు [ఫిబ్రవరి 21వ తేదీ] మాతృభాషాదినోత్సవమట. ఈ సందర్భంగా, సరదగా చదువుకునేందుకు మీ కోసం ఓ చిన్న కథ!

ఒకప్పుడు పూనా సంస్థానంలో నానా ఫడ్నవీస్ అనే మేధావి దివానుగా ఉండేవాడు. ఆయన జఠిలమైన సమస్యలని కూడా ఇట్టే పరిష్కరిస్తాడని ప్రతీతి. రాజుకు విశ్వాసపాత్రుడు. ’జబ్ తక్ నానా, తబ్ తక్ పూనా’ అనే నానుడి ఉండేదట. అంతగా... నానా ఫడ్నవీసు మేధస్సు, పూనా రాజ్యానికి రక్షగా భావించేవారు. ఆయన సునిశిత మేధస్సుకు సంబంధించి ప్రజలలో ప్రచారంలో ఉన్న కథలలో ఇదొకటి.

ఓ సారి... పూనా రాజాస్థానానికి ఓ పండితుడు వచ్చాడు. మహారాజును దర్శించి "మహారాజా! నా పేరు ఫణిశర్మ. నేను బహుభాషలు నేర్చిన వాణ్ణి. మీ సభలోని వారెవరైనా నాతో సంభాషించి నా మాతృభాష ఏదో కనిపెట్టగలిగితే ఓటమి ఒప్పుకుంటాను. లేనట్లయితే మీరు ఓటమి ఒప్పుకొని నన్ను సన్మానించాలి" అని సవినయంగా సవాలు చేశాడు.

రాజు మరునాడు పండిత సభ ఏర్పాటు చేశాడు. సభలో వివిధభాషలకు చెందిన ఉద్దండులు, కవులు, పండితులు ఉన్నారు. అందరూ తమ తమ భాషల్లో ఫణిశర్మని ప్రశ్నిస్తున్నారు. ఎవరే భాషలో మాట్లాడినా, ఏమాత్రం తడబాటు లేకుండా, అతడు అందరికీ సమాధానాలు చెబుతున్నాడు. ఒకేసారి నలుగురైదుగురు మాట్లాడినా, ఏ భాషలో మాట్లాడినా, ఏ మాండలికం వాడినా, అతడందరితో, ఏకబిగిన ఏమరుపాటు లేకుండా ఆయా భాషలలో, యాసలలో సంభాషిస్తున్నాడు.

క్రమంగా అక్కడున్న అందరికీ ఫణిశర్మ సాధారణ పండితుడు కాదని అర్ధమైంది. ఓటమి తప్పదనిపించింది. ’బహుభాషలలో అసాధారణ ప్రజ్ఞ కనబరుస్తున్నాడు. ఏంచెయ్యాలి?’ రాజు, రాజస్థానంలోని కవి పండితులు అలోచనలో పడ్డారు. కాస్సేపటికి నానా ఫడ్నవీస్ తన స్థానం నుండి లేచి ప్రక్కకి వెళ్ళిపోయాడు.

చర్చనడుస్తూనే ఉంది. ఇంతలో నానా ఫడ్నవీస్, ఒక ఉదుటున ఫణిశర్మ మీదికి లంఘించి, వీపు మీద ఒక్క చరుపు చరిచాడు.

"అమ్మా! చచ్చాన్రా బాబోయ్!" అని తెలుగులో గావుకేక పెట్టాడు ఫణిశర్మ![తెలంగాణా యాసలో కేక పెట్టాడా, రాయలసీమ యాసలో కేక పెట్టాడా, కోస్తా యాసలో కేక పెట్టాడా అని నన్ను అడగొద్దు సుమా!]

"క్షమించండి! తమ మాతృభాష తెలుగు" అన్నాడు నానా! అంతే! సభలో ఒక్క క్షణం ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు. మరుక్షణం అందరూ ఘోల్లున నవ్వారు. ఫణిశర్మ సైతం, నవ్వూ ఏడుపూ కలగలసిన కంఠంతో ’అవునంటూ’ తలూపాడు. సభ చప్పట్లతో మారుమోగి పోయింది.

అంతట నానా "మహారాజా! ఎన్ని భాషలు నేర్చినా, ఎంత పాండిత్యం సంపాదించినా, ఆకలేసిన వేళ అమ్మ గుర్తొచ్చినట్లు, అదాటున ఆపద పైబడ్డప్పుడు అమ్మ భాష గుర్తుకు వస్తుంది. అంతే!" అన్నాడు. మాతృదేశపు పరువు కాపాడినందుకు నానా ఫడ్నవీస్ ని రాజు, ప్రజలు ఎంతగానో మెచ్చుకున్నారు.

పరాయిదేశం నుండి పాండిత్యాన్ని ప్రదర్శించుకో వచ్చి, ఓటమి పాలైన ఫణిశర్మని, మహారాజు సాదరంగా గౌరవించి, ఘనంగా సన్మానించి పంపించాడు.

ఇదీ కథ!

కాబట్టి, మాతృభాషాభివృద్దికి మనం నానా తంటాలూ పడక్కర్లేదేమో! నాలుగు తగిలిస్తే సరి! ఒక్కదెబ్బకి డొక్కలోంచి అమ్మభాష ఉరుక్కుంటూ ఉబికి వస్తుందనుకుంటా!

అంటే ఏమిలేదు - ప్రభుత్వం బలవంతంగా రుద్దితే[తంతే] మాతృభాషాభివృద్ది దానంతట అదే అభివృద్ది అవుతుంది. అలాగాక పరభాషను రుద్దితూ ఉంటే ఏముంది, ప్రతిసంవత్సరం ఒకరోజు మన భాషను గుర్తుకు తెచ్చుకుని సంవత్సరీకం పెట్టుకోవాల్సిందే!

ఆదివారపు విరామం అందరికీ ఆనందాన్నివ్వాలని, ఈచిన్నికథ!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

14 comments:

"ఎన్ని భాషలు నేర్చినా, ఎంత పాండిత్యం సంపాదించినా, ఆకలేసిన వేళ అమ్మ గుర్తొచ్చినట్లు, అదాటున ఆపద పైబడ్డప్పుడు అమ్మ భాష గుర్తుకు వస్తుంది."
అక్షరాలా నిజం మీరు చెప్పింది.బావుంది. ధన్యవాదాలు

మీరింకా సత్తెకాలపు సత్తెమ్మలాగున్నారు, తొండ ముదిరి ఊసరవెల్లి అవుతుందన్నట్టు కొందరు మీరు చెప్పినటువంటి సంధర్భాలలో 'మమ్మీ' అని శవాలను పిలిచే వాళ్ళని నా కళ్ళతో చూసాను.
కాని ప్రస్థుతానికైతే సింహభాగం ఇంకా మాతృభాషలోనే అంటున్నారు.

బావుంది.

మిత్రమా
అత్యంత రసానుభూతిని కలిగిస్తూనే....ఆలోచింప జేసే మీ పోస్టుకు ధన్యవాదాలు.

ఇది పాతకాలంనాటిమాట,నేడలా కొడితే mommeeee అంటారేమోగదా! :)

అవునండీ....తెలుగు మాటాడటం రాదనే వాళ్ళని నాలుగు పీకైనా మాటాడించాలనిపిస్తుంది...ఈ కథ మన తెనాలి రామలింగడి కథల్లో కూడా చెప్తారు కదా..

nijame naalugupeekite amma bhaasha ade vastumdi

హబ్బే లాభం లేదండీ. ఈ కాలప్పిల్లలు ఆ శ్టేజీ కూడా దాటిపోయారు. నాలుగు తగిలించినా మమ్మీ అనే యేడుస్తారు :-)

SR Rao గారు, అజ్ఞాత గారు, Sumani's English గారు : నెనర్లండి.

కన్నగారు , చిలమకూరు విజయమోహన్ గారు, కౌటిల్య గారు, దుర్గేశ్వర రావు గారు, కొత్తపాళీ గారు : అయితే ఇంకేముందండి? ’మమ్మీ’ మరిచిపోయి, ’అమ్మా’ అనే దాకా ఆపకుండా తగిలించటమే!

విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
* కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
అంతరించిపోతున్నఅమ్మభాష
దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

మాత్రు భాష తెలుసు కోవాలంటే ఇంకొక ట్రిక్ కూడా ఉంది. చిన్న కూడికలు తీసివేతలు ఇచ్చి నోటితో చెయ్యమనండి. నాలుగు మూడు ఏడు అని తప్పకుండ అంటారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్ ఇవాళ తెలుగు డే అని తెలిసింది.
రామకృష్ణ

కథ బాగుందండి .
నాలుగు పీకితే , మాతృభాష గుర్తు రావటం మాట దేవుడెరుగు , ఈ కాలం అమెరికా పిల్ల లైతే కాఫ్ ని పిలుస్తామంటారు .

నాలుగు తగిలించవలసింది పిల్లలకి కాదండి.

వాళ్ళని కన్న తల్లితండ్రులకి తగిలించాలి.

పాపం పిల్లలు ఏం చేస్తారు?

పెద్దవాళ్ళు ఏలా చెప్తే అలా నడుచుకుంటారు.

Nrahamatulla garu,
వ్యాసం చాలాబాగుంటే, మీ వ్యాఖ్య దానికి కొసమెరుపులాగా బాగుందండీ!
పిల్లల్ని కాదండీ వాళ్ళ తల్లిదండ్రులకు నాలుగు తగిలించాలి

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu