రేపు (సెప్టెంబరు 25వ తేదీ) ఉండ్రాళ్ళ తద్దె! చిన్నప్పుడు ఈ పండుగ కోసం ఎంత ఎదురు చూసే వాళ్ళమో!

ఎందుకంటే....

ముందురోజే అమ్మ, మా అక్కచెల్లెళ్ళందరికీ గోరింటాకు పెట్టేది. పండుగ రోజు తెల్లవారు ఝామునే మమ్మల్ని లేపి తలంటి స్నానం చేయించేది. అప్పటికే తాను ఇల్లు శుభ్రంచేసి వంట చేసేది. కొంచెం పెద్దయ్యాక మేమూ సాయం చేసేవాళ్ళం. తర్వాత సూర్యోదయం అయ్యేలోపునే విస్తరి వేసి అన్నం పెట్టేది.

గోంగూర పప్పు తప్పనిసరి. ఎందుకో తెలీదు. అడిగితే ఆచారమంది. గోంగూర పప్పుతో బాటు వేపుడు కూర, ఆవకాయ, వడియాలు, గడ్డపెరుగు! విస్తట్లో తినటం మహామజాగా ఉండేది. చింపేసుకుంటారు అంటూ పిల్లలకు ఎక్కువగా కంచాల్లోనే అన్నం వడ్డేంచేవాళ్ళు. పెళ్ళిళ్ళలో విస్తరి భోజనం అంతా హడావుడే!

అంచేత తీరిగ్గా విస్తట్లో భోజనం మరీ నచ్చేది. ఆపైన అమ్మ, మా అందరికీ తాంబూలం ఇచ్చేది. నాకు ఎర్రగా పండిందంటే నాకు పండిందంటూ వాదులాడుకుంటూ ఆనందించేవాళ్ళం. అందునా పిల్లలకి తమలపాకులు తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు. "నాలుక మందపడి పోతుంది, చదువు రాదు, ఆకులు వక్కా చిన్నపిల్లలు వేసుకోకూడదు" అనేవాళ్ళు.

ఎప్పుడన్నా... ఆజీర్తితో ఏ కడుపు నొప్పో వచ్చినప్పుడు తప్ప, తమల పాకులు పిల్లల కివ్వరు. దాంతో ఉండ్రాళ్ళ తద్దె రోజున అవన్నీ స్పెషల్ అన్నమాట.

ఇక అప్పటి నుండి సాయంత్రం చంద్రోదయమయ్యే వరకూ పచ్చిగంగ ముట్టకూడదు అనేది అమ్మ. తస్సాచెక్కా! సరిగ్గా ఆ రోజే చీటికి మాటికి దాహం వేసేది. మామూలుగా ఆటల్లో, చదువుల్లో పడితే, మంచినీళ్ళు తాగటం కూడా మరిచిపోయే వాళ్ళం. ఆ రోజు మాత్రం ఒకటే దాహమేస్తుంది. వంటింటి చుట్టే తిరిగే వాళ్ళం. అమ్మ కాళ్ళిరగ్గొడతాననేది.

వద్దని చెప్పే వాళ్ళెవరూ లేకపోతే టాంసాయర్‌కి ఈత కూడా బోరు కొడుతుంది కదా! బహుశః అలాంటి టాంసాయర్... ప్రతి మనిషిలోనూ కొంచెంగానో, ఎక్కువగానో ఉంటాడనుకుంటా!

సరే... ఎట్లాగో సాయంత్రం దాకా గడిపేస్తే, చంద్రోదయమయ్యాక అమ్మ మమ్మల్నందర్నీ పూజకి కూర్చోబెట్టేది. పసుపుతో గౌరీదేవి బొమ్మ చేసి, తమలపాకులో పెట్టి పూజ చేయించేది. గారెలు, బూరెలు, కుడుములు, ఉండ్రాళ్ళు చేసేది. ఉండ్రాళ్ళ పిండితో గురుగులు చేసి ఆవిరిలో ఉడికించేది. అందులో ఆవునెయ్యి వేసి దీపాలు వెలిగించేది.

ఓ ప్రక్క అప్పాల వాసన నోరూరిస్తుంటే పూజమీద మనస్సు నిలిచేది కాదు. వ్రతం (అంటే పూజ) అయిపోయి, చేతికి పసుపు దారంతో కంకణం కట్టుకునే వరకూ ఆగక తప్పదు. పూజ చివరిలో... అమ్మ, ఒక్కొక్కరికి ఒక్కో వెలుగుతున్న దీపం ఇచ్చి, దీపం ఊది ఆర్పకుండా, నోట్లో బెట్టేసుకుని తినాలని ఆర్డరు వేసేది.

గురుగునిండా నేతితో తియ్యటి దీపం నోరూరించేది. తినాలంటే అంగిలి కాలుతోందని భయం వేసేది. అమ్మ చూడదులే అనుకొని నోటితో దీపం ఊది ఆర్పేసి నోట బెట్టుకున్నామో, వీపు పగలడం ఖాయం! కనీసం తిట్లయినా పడతాయి.

అందుకని దీపాన్ని కళ్ళకద్దుకున్నట్లుగా నటిస్తూ, ముక్కుదగ్గర పెట్టుకుని, ఊపిరి కది కొండెక్కుతుండగా, గుటుక్కున నోట్లో పెట్టేసుకునేవాళ్ళం.

ఆ తర్వాత మళ్ళీ విస్తట్లో భోజనం! ఇక అర్ధరాత్రి అయ్యే వరకూ వీధిలో ఆటలే ఆటలు! ఆ రోజు అధికారికంగా ఆటలకి అనుమతి వచ్చేసేది. తదియ వెన్నెలే అయినా, పౌర్ణమి తర్వాత కాబట్టి బాగానే ఉండేది. వెన్నెల్లో... వెన్నెల కుప్పలు, దాగుడుమూతలు, ఒప్పుల కుప్పలు... ఎన్ని ఆటలు ఆడేవాళ్ళమో! అన్నిట్లోకి వెన్నెల కుప్పులు నాకు బాగా ఇష్టంగా ఉండేది.

పంటలేసుకుని, దొంగ అయిన వాళ్ళ దోసిట్లో ఇసుకపోసి, ఓ పుల్ల గుచ్చేవాళ్ళం! ఆ తర్వాత ఒకరు (వీళ్ళని తల్లి అంటారు.)దొంగ కళ్ళు మూసి, నడిపించేవాళ్ళు. ముందు హద్దులు నిర్ణయించబడిన వీధిలోనే నడిపించాలి. అయితే వంకర టింకరగా నడిపిస్తూ, ఎటు తీసుకెళ్తున్నారో అర్ధం కానిచ్చే వాళ్ళు కాదు. అడ్డదిడ్డంగా తిప్పి, ఎక్కడో ఓచోట, ఇసుక కుప్పగా పారబోయించేవాళ్ళు.

మళ్ళీ తిప్పితిప్పి, ముందటి చోటుకి తెచ్చి వదిలేస్తారు. మనం, మనకుప్ప ఎక్కడ పారబోయించారో వెదికి పట్టుకుని, ఆ పుల్లని తెచ్చి చూపాలన్న మాట. ఇదీ ఆట! పుల్లతెస్తే మరోసారి పంటలేసి మరో దొంగని ఎన్నుకుంటారు. లేకపోతే మళ్ళీ మనమే దొంగ!

ఎవరి పుల్ల వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తుండేటట్లు... ఒక్కొక్కరు ఒక్కో రకంవి తెచ్చేవాళ్ళం. కొబ్బరి చీపురుపుల్ల, కుంచె చీపురు పుల్ల, ఐస్‌క్రీం పుల్ల, అగ్గిపుల్ల... ఇలా! ఒక్కోసారి, మన పుల్లలకి మనకిష్టమైన రంగుదారాన్ని ఓ ప్రక్క చుట్టుకోవచ్చు.

ఈ ఆటలో గెలవటానికి, చిన్న చిన్న ట్రిక్కులు పాటించేవాళ్ళం. ‘ఎవరింటి ప్రహరి దగ్గర సన్నజాజి చెట్టుంది?, ఎక్కడ ఏ వాసనలొస్తాయి?’ అని. అది ఆటలో తల్లికీ తెలుసు కాబట్టి, అలా వాసనలేవీ రాని చోటికి తీసికెళ్ళి, ఇసుక పారబోయించేది. దారిలో ఎగుడుదిగుళ్ళు గుర్తు పెట్టుకోవటం ఒకోసారి గెలుపునిచ్చేది.

ఏమైనా... ఆటలో తల్లి, మనల్ని గజిబిజిగా తిప్పేయటంతో, కళ్ళు మూసుకుని కూడా... స్థలాన్ని అంచనా వేయటానికి నానా తంటాలు పడే వాళ్ళం. మన దోస్తులు మనకి సాయం చేయటానికి కళ్ళతో సైగలు చేయటం, ఆ పరిసరాల్లో వెదుకుతున్నప్పుడు ముక్కూమూతీ గీరుకుంటూ సంకేతాలివ్వటం చేసేవాళ్ళు. (ఇవన్నీ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ భాషలాగా చెప్పి పెట్టుకునే వాళ్ళం లెండి.)

ఒకోసారి, మనకి దోస్తుల్లాగా సైగలు చేస్తున్నట్లు నటిస్తూ, మన ప్రత్యర్ధి (అంటే ఆటలో తల్లి)కి సాయం చేసేవాళ్ళు. అంటే మనల్ని తప్పు దారి పట్టించడం అన్నమాట. ఆ మీదట మన స్నేహితులతో సమీకరణాలన్నీ మారిపోయేవి.

మరువారంలో కొత్తకొత్త దెబ్బలాటలు పుట్టుకొచ్చేవి. మళ్ళీ మామూలుగానే చల్లారేవి లెండి. ముక్కుల గిల్లి ఆటలో కూడా ఇంతే! మన ముక్కు గిల్లటానికి వచ్చేవాళ్ల కాలి పట్టీల చప్పుడు గుర్తించటం, ఎవరు ఏ పౌడరు వేసుకున్నారో దాని పరిమళం గుర్తు పట్టటం, తల్లో పువ్వుల వాసనని గుర్తు పెట్టుకోవటం గట్రా చిట్కాలతో ఆటల్లో గెలిచేవాళ్ళం.

హోరాహోరీ గెలుపుకోసం తంటాలు పడేవాళ్ళం. అర్ధరాత్రి దాకా హాయిగా ఆడుకునే వాళ్ళం. ఆ రోజు అమ్మానాన్న ఎవ్వరు ఏమీ అనరు. మామూలు రోజుల్లో అయితే... "ఇక చాలు ఆటలు వచ్చి పండుకోండి!" అని ఆర్డరు వేసేస్తారు కదా!

ఇన్ని ప్రత్యేకతలున్న ఉండ్రాళ్ళ తద్దె మజా వచ్చే పండుగే కాదా మరి!? మరునాడు గౌరీదేవి (పసుపు ముద్ద)ని తులసి మొక్క దగ్గర ఉంచి, నీళ్ళు పోసి కరిగించేయటంతో పండుగ వ్రతం పూర్తవుతుంది.

ఇంతకీ ఎందుకీ వ్రతం అంటే అమ్మ చెప్పిన జవాబు "మనసెరిగిన మంచివాడు భర్తగా రావాలని పెళ్ళికాని ఆడపిల్లలు, భర్త శ్రేయస్సు కోరుతూ పెళ్ళయిన వాళ్ళు, ఈ నోము నోచుకుంటారు" అని చెప్పింది. ఈ పండుగ నమ్మకం నా విషయంలో అయితే నిజమే అయ్యింది మరి! :)

ఇలాంటి పండుగల నేపధ్యాన్ని ‘ఆడవాళ్ళని వంటింటికి పరిమితం చెయ్యటం’ అనే స్త్రీవాదుల సిద్ధాంతాలతో గాకుండా, జీవితపు వైవిధ్యం దృష్టితో చూస్తే, మేం చాలా ఆనందించాం. ఇప్పుడు మా అమ్మాయికీ ఈ సాంప్రదాయన్నంతా అందిస్తున్నాననుకొండి. కాకపోతే వెన్నెల కుప్పల ఆటలు మాత్రం లేవు. వీధిలోని దోస్తులెవరూ రాదు కదా! మేమే కాసేపు బయట వెన్నెలని ఆనందించి ఊరుకుంటాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

13 comments:

చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చారండి.
:)

చాల బగుంది అండి.అలా వెన్నెల లొ
ఆడుకుంటుంటె ఎంత హాయిగ ఉంటుందొ. ఇలాంటివి లేక పోవటం వల్లనె ఇప్పుడు మానసిక సమస్యలు వస్తున్నాయి.

నా చిన్ననాటి మధురానుభూతుల్ని ఒక్కసారే ముక్కుగిల్లుడాట్లా గిల్లారు. మళ్ళీ చిన్నపిల్లలు అవ్వాలని ఉంది

wow.. Bhale chupinchaarandi anta..

Oka doubt.. vatti kuda tinestara?

ఎప్పుడో ఎన్నేళ్ళ క్రితమో ఆడుకొన్న ఆటలను, పాటించన ఆచారాలను ఎంత గుర్తు పెట్టుకొని మళ్ళీ కళ్ళముందు చూయించారు. టపా అదిరింది.

బాగుందండి. చిన్నప్పుడు ఇవేమి చేసే దానిని కాదు కాని అప్పుడెప్పుడో ఆడూకోవటానికి వెళ్ళినట్ళు గుర్తు. బలే రాసేరు మొత్తం అంతా కళ్ళకు కట్టినట్లు. పెళ్ళెయ్యాక చేయించే తద్దులలో తినే వాళ్ళం కదా ఇంత పొద్దుటే అన్నం. ఇప్పుడు నా కొడుకు కు చెపితే అంటాడేమో అంత పొద్దుటే లంచ్ ఆ అమ్మా, అన్నీ కార్బోస్ అని :-( , వాళ్ళకు అంత వరకే తెలుసు కదా.

సత్యేంద్ర గారు: టపా మీకు నచ్చినందుకు నెనర్లు!

జీవన్ సాధన గారు: నిజమేనండి!అవన్నీ ఇప్పటి పిల్లలు మిస్ అవుతున్నారు. మొత్తం టీవీనే వాళ్ళ జీవితాన్ని ఆక్రమించింది.

రహ్మానుద్దీన్ షేక్ గారు: బాల్యం ఎవరయికైనా మధురం కదండి!

జాబిలి గారు: ఆహాఁ! సలక్షణంగా వత్తికూడా తినాల్సిందేనండి!

అజ్ఞాత గారు: జ్ఞాపకాలు తియ్యటివి కదండీ!అంచేత గుర్తుండిపోతాయ్!

భావన గారు: సాయంత్రం వరకూ ఉపవాసం చేస్తే అన్నీ హాంఫట్! ఆపైన ఆటలతో సరి!:)

చందమామ గారు,

మీ ఆత్మీయతని ఎంతగానో ఆనందించానండి. మీరు కోరినట్లు వ్యాఖ్య ప్రచురించలేదు. మీరిచ్చిన సమాచారం ఆసాంతం చదివాక చెబుతాను. ప్రేమతో కూడిన కృతజ్ఞ్రతలు!

interesting link:

http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/sep/29/edit/29edit3&more=2010/sep/29/edit/editpagemain1&date=9/29/2010

చందమామ గారు: మీరిచ్చిన లింక్ చదివానండి. మంచి సమాచారం ఇచ్చినందుకు నెనర్లు!

(Gunturu) Chelleku, (Karimnagar) Annanunchi hrudayapoorvaka aasheessulu!

here is an interesting link:

http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/sep/26/edit/26edit5&more=2010/sep/26/edit/editpagemain1&date=9/26/2010

చందమామ గారు మీ అభిమానానికి....!(ఏం చెప్పమంటారు?) మంచి లింక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఒక సందేహం, నిన్న మీరు ఇచ్చిన లింక్ ఆంధ్రజ్యోతిలోనిది కదా! అక్కడి ఎడిటోరియల్‌కి, అదే పేపరు నాబ్లాగు నుండి ఉన్న లింక్ ద్వారా వెళ్ళితే, అక్కడ ఉన్న ఎడిటోరియల్ వేరేగా ఉన్నాయి. తేడా వివరించగలరా?

jadakuppela tho baru baru jadalu...jadaninda chamanthulu...vanthula vari vuyyala vugatalu..badiki latega velli panthulugaritho akshintalu...wow!enni aanandapu jnapakalo!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu