వినాయక చవితి పండుగ నాడు, మీ ఇంటిలోని చిన్నారులకో చిరు కానుక!
ఓసారి....
వినాయకుడు కైలాసంలో ఉండగా, సకల దేవతలూ తరలి వచ్చి "విఘ్ననాయకా! బ్రహ్మను గూర్చి తపస్సు చేసి, వరాలని పొందిన అనలాసురుడు, అందరినీ దహించి వేస్తూ, సర్వలోకాలనీ బాధిస్తున్నాడు. వర గర్వంతో సాధుజనులని హింసిస్తున్నాడు. మునుపిలాంటి ఆపదలు సంభవించినప్పుడు అందరినీ ఆదుకున్నవాడవు! ఇప్పుడూ నీవే లోకాల్ని రక్షించాలి!" అని వేడుకున్నాడు.
విఘ్నేశ్వరుడు దేవతలకు అభయమిస్తూ "నేనిప్పుడే ఆ అనలా సురుణ్ణి హతమార్చేందుకు బయలు దేరుతున్నాను. మీరిక నిశ్చితంగా ఉండండి" అన్నాడు.
దేవతలంతా స్థిమితపడి స్వస్థలాలకు మరలారు.
విఘ్నాధిపతి తన సేనలతో అనలాసురుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. వర గర్వంతో చెలరేగిపోతున్న అనలాసురుడు, గణపతి సేనలను కూడా దహించసాగాడు. తన కెదురైన ఎవరినైనా దహించగల వరాన్ని పొందిన వాడు మరి!
ఎంత సేపు యుద్ధం చేసినా అనలాసురుణ్ణి హతమార్చలేకపోవటంతో, గణనాధుడికి ఆగ్రహం అవధులు దాటింది. అమాంతం అనలాసురుణ్ణి తొండంతో చుట్టి గుటుక్కున మింగేసాడు.
ఏకదంతుని ఉదరంలోకి చేరిన అనలాసురుడు, కడుపులోనే ఆయన్ని దహించసాగాడు. బొజ్జలో బాధతో గణపయ్య చిందులు వేయటం ప్రారంభించాడు.
విషయం తెలిసి దేవతలంతా సమావేశమయ్యారు. లోకాలకు అనలాసురుడి పీడ విరగడయ్యింది కానీ, దేవగణనాధుని లోపల దహిస్తున్నాడే రాక్షసుడు? ఏం చెయ్యాలి?
గంగాజలం తెచ్చి విఘ్నేశ్వరుణ్ణి నిలువెల్లా అభిషేకిద్దామన్నారొకరు.
"భేష్! అప్పుడు కడుపులోని అగ్గి చల్లారి, శాంత పడతాడు వినాయకుడు" అన్నారు మరొకరు.
దేవతలంతా గంగాజలం తెచ్చి ధారపాతంగా గణపతి శిరస్సు పైపోసి అభిషేకించారు. బాధ తగ్గకపోగా తాపం పెరిగిపోయింది. మంచుకొండల్లో నివసించే వినాయకుడి తల మీద, మంచు ముద్దలను పెట్టారు. ఉహూ! మంట తగ్గితేనా?
చంద్రుణ్ణి, తన చల్లదనాన్నంతా శివపుత్రుడిపై గుమ్మరించ మన్నారు. ప్చ్! అదీ లాభం లేకపోయింది.
కడుపులో అగ్గి వంటి బాధకి విఘ్నేశ్వరుడు విసుక్కుంటూ "మీ ప్రయత్నాలతో నా బాధ తగ్గకపోగా, రెట్టింపవుతోంది" అన్నాడు.
ఇంతలో ఓ ముని... గుప్పెడు దూర్వాగ్రాసాన్ని తెచ్చి విఘ్నేశ్వర స్వామి తలమీద ఉంచాడు.
మరుక్షణం... ఉదరంలోని మంట ఉపశమించి, ఉపశాంతి కలిగింది ఉండ్రాళ్ళ ప్రియునికి!
ఆదరంగా చూస్తూ "ఆహా! ఎంత చల్లగా హాయిగా ఉంది" అన్నాడు. అందరూ ఎంతో ఆనందించారు.
వినాయకుడు "ఇక నుండీ నా అనుగ్రహం పొందాలనుకునే నా భక్తులంతా, నన్ను దూర్వాగ్రాసాంతో పూజింతురు గాక! రెండు దూర్వార పత్రాల్ని శిరస్సున ధరింతురు గాక!" అన్నాడు.
నాటి నుండి... గణేశ చతుర్ది నాడు పత్రిలో భాగంగా.... దూర్వార పత్రాలతో దేవుణ్ణి పూజించటం పరిపాటి అయ్యింది.
ఈ కథ ‘శ్రీరామకృష్ణ మిషన్’ వారి ‘బాలల కథామంజరి’ లోనిది. అందులో దూర్వార పత్రాలు శిరస్సున ధరించిన వినాయకుడి రూపం నాకు చాలా ఇష్టం. అందుకే అదీ ప్రచురించాను.
అసలు వినాయకుడి రూపమే అపురూపం!
‘అందం కాదు, గుణమే ప్రధానం’ అనడానికి... కైలాస పర్వతమంత ప్రతిరూపం విఘ్నేశ్వర స్వామి!
ఇక ఆయన వాహనం... ఎలుక, అనింద్యుడు. ఎంత చక్కని పేరు కదూ! ఎన్నడూ నిందింపబడని వాడు. ఏనుగు భారీ జంతువు. ఏనుగు శిరస్సు గల కొండొక గుజ్జ రూపునికి, ఎలుక వాహనం! అందులోనే ఎంత ద్వంద్వం నిండి నిబిడీ కృతమై ఉందో!
అలాంటి నవ్వుపుట్టించే రూపంతో ఉండి, ఎంత తెలివీ, సమయస్ఫూర్తి చూపుతాడో! ముల్లోకాలూ తిరిగి పుణ్యతీర్దాలన్నీ సేవించి రావటం కంటే కూడా, జన్మనిచ్చిన జననీ జనకులకు పూర్ణ ప్రదక్షిణలు గొప్పవనేంత!
భారతం రచించిన వ్యాస భగవానునికి లేఖనం చేసేటంత!
"ఘంటమాగకుండా చెబితేనే వ్రాస్తా"నన్నాడట... వ్యాసుడితో విఘ్నేశ్వరుడు.
"సరే కానివ్వు! కానీ నేను చెప్పింది అర్ధమయ్యాకే నీవు వ్రాయి" అన్నాడట వ్యాసుడు.
చమతార్కమే కాదు, పోటాపోటీగా.... మాటకి మాట!
ఆ విధంగా... బాహ్యరూపం కంటే గుణశీలాలు, ప్రతిభాపాటవాలు ఎక్కువని చెప్పే గణపయ్య!
ఆయన పూజలోనూ అదే సందేశం! ప్రకృతిలో ప్రతి మొక్కా మోడూ, చెట్టు చేమా... దేని గొప్పతనం దానిదే నన్నట్లు, పత్రిలో ఎన్నిరకాలో! పల్లేరు, జిల్లేడూ... మనమెప్పుడూ పట్టించుకోని, ఎన్నో మొక్కలూ, ఆకులూ, పూలూ!
అసలు హిందూ మతంలోనే ఆ విశిష్టత ఉంది. అందుకే అది ఒక మతం కాదు, ‘జీవన విధానం’ అనబడింది.
హిందువులు ప్రతి చెట్టు చేమకీ మొక్కుతారని ఒకప్పుడు చాలా ఈసడింపులు ఉండేవి. ఈ విషయమై విదేశీయులు మనల్ని చూసి నవ్వు తున్నారని మీడియా అనేది. రంగనాయకమ్మలూ, హేటు వాదులూ అవునవునంటూ సాక్ష్యం చెప్పేవాళ్ళు.
అయినా... ఏం, మొక్కితే తప్పేంటి? ప్రకృతిలో ప్రతీ ప్రాణీ గొప్పవే! మనిషి ఒక్కడే గొప్పవాడనటం అహంకారమే! దేని ప్రాశస్తం దానిదే!
"ప్రతీ ప్రాణిలో నన్నూ, నాలో సకల ప్రాణుల్నీ చూడు!" అంటాడు గీతాచార్యుడు. దాన్ని ఆచరణలో చూపుతుంది హిందూ జీవన విధానం. అది జీవ వైవిధ్యానికి రక్షా కవచం!
ఉదాహరణకి... తులసి విష్ణువుకి ప్రీతికరమైనది. మారేడు మల్లయ్యకి, స్వర్ణ గన్నేరు లక్ష్మీదేవికి, బిళ్ళగన్నేరు భ్రమరాంబ తల్లికి. దూర్వారం వినాయకుడికి. వేపచెట్టు లక్ష్మీపార్వతుల రూపం అన్నంతగా పూజిస్తాం.
ఇటీవల సంపుటి పక్షపత్రిక ( e-మేగజైన్ లో) వట సావిత్రీ వ్రతం గురించి చదివాను. నాకెంత నచ్చిందో! భర్త... తనకూ, తన కుటుంబానికీ వట వృక్షమై నీడనివ్వాలని ఇల్లాళ్ళు చేసే వ్రతం అది. పూర్వం సావిత్రి దేవి, ఆ వ్రతం ఆచరించాకే, యుముణ్ణి సంవాదంలో గెలిచి పతిప్రాణాలు దక్కించు కొందట!
‘భర్త కుటుంబానికి వటవృక్షం వంటివాడు.’ ఎంత బాగుందీ భావన? నిజమే! కుటుంబానికి తండ్రి వటవృక్షమైతే, తల్లి ఆ తరు మూలమే! తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేకపోయినా, పిల్లలు గూడు చెదిరిన పిట్టలే!
ఇలాంటి భావాలు బలపడ్డాక, చూస్తూ చూస్తూ మర్రిచెట్టునే కాదు, ఏ చెట్టునైనా కొట్టేయగలరా? ఒక్క మర్రిచెట్టు కొట్టేస్తే, వేల పక్షులు ఆశ్రయం కోల్పోతాయి. అలాంటి చోట... ఇలాంటి భావనలు, పర్యావరణ శ్రేయో కారకాలే కదా?
జంతువుల పట్ల హిందువుల విశ్వాసాలూ, ప్రాముఖ్యతలూ అలాంటివే! వినాయకుడి వాహనం ఎలుక. కుమార స్వామికి వాహనం నెమలి. మల్లయ్య స్వామికి నంది (ఎద్దు). అమ్మవారికి సింహం, లక్ష్మీదేవికి గజవాహనం, పూజితం. విష్ణువు గరుడ ధ్వజుడు. బ్రహ్మా సరస్వతులు హంస వాహనులు! వృషభం వెంకటేశ్వర స్వామి స్వరూపం. ఆవు లక్ష్మీ అవతారం. శునకాలలో సైతం... మగదాన్ని భైరవ స్వరూపం అంటూ శివుని గానూ, ఆడదానిని గౌరీ సమానంగా భావిస్తారు. ఇక నాగులు.... శివుడు నాగాభరణుడు, విష్ణువు నాగ శయనుడు. వినాయకుడికి నాగు నడుమున ధరించిన ఆభరణం.
పంది, చేప, తాబేలు దశవతారాల్లోనివి. శుకుడు చిలక ముఖంగల యోగి. ఇలా చెప్పుకుంటూ పోతే.... ఎన్నో! ప్రకృతిలో ప్రతి ప్రాణికీ ప్రాధాన్యత నిస్తూ... సహజీవన శైలిని ఇంకించే జీవన విధానం అది!
అలాంటప్పుడు... ప్రతిప్రాణిని, ప్రతి చెట్టు పుట్టనీ కొలిస్తే తప్పేమిటో? మనం ఉపయోగించుకునే ప్రతి వస్తువు పట్లా భక్తీ, గౌరవం, కలిగి ఉండటం తప్పెలా అవుతుంది?
మా చిన్నప్పుడు, మా అమ్మ, కొత్త తిరగలి కొనుక్కువచ్చినా, రోలు, చేట, ఏది తెచ్చినా... ఉండ్రాళ్ళు వండి నైవేద్యంగా పెట్టి మరీ పూజ చేసిన తర్వాతే వాడేది. "ఎందుకలా?" అనడిగితే... తిరగలి, రోలు ధాన్యలక్ష్మి స్వరూపాలని, కొత్తగా తెచ్చినప్పుడు పూజ చేయటమంటే, నిత్యం ధాన్యాన్ని పిండి చెయ్యమని అడగటమేననీ చెప్పింది.
అలా భక్తి శ్రద్దలతో వస్తు వినియోగం, మనిషిని క్రమ శిక్షణా పూరితుణ్ణి చేస్తుంది. నిరంహంకారిని చేస్తుంది. ఉపయోగించే ప్రతీసారి భక్తిశ్రద్దలు కలిగి ఉండటాన్ని వదిలేసి, సంవత్సరాని కోసారి ‘దినాలు’ (తల్లిదినం, తండ్రి దినాల్లాగా, plant Day లూ, గట్రాలు) చేస్తే పర్యావరణ ప్రయోజనం ఏం ఉంటుంది?
హిందూ జీవన విధానం ‘పండు కోసుకునే ముందు చెట్టుకి నమస్కరించి కోసుకొ’మ్మంటుంది. చివరికి, పొలంలో పంట కోసే ముందు కూడా, వ్యవసాయ క్షేత్రానికి పసుపు కుంకాలతో పూజ చేసి, ‘పొలి’ పేరుతో అన్నపు బలిని పొలమంతా చల్లాక, కోతలు నిర్వహించే సాంప్రదాయం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు కోత యంత్రాలతో రైతులవి మరిచిపోయారేమో తెలియదు గానీ, పరస్పర సహకారాన్ని ప్రబోధించిన మత విశ్వాసాలూ, జీవన విధానాలూ అవి!
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!
12 comments:
Good one.
once again excellent article from you!
Great Explanation about 'Ganesh Chathurdhi' , I ever read. Thanks for the info.
chaalaa baagumdamdee
చాలా చక్కగా చెప్పారు. మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయక చవితి శుభాకాంక్షలు.
excellent.Srusthilo prathi praninini,nitya jeevitamlo upayoginche prati vastuvini poojinchadam entha manchi samskaram.Manishi manishini gouravinchani ee prastutha samajamlo mee vyasam anagaripotunna viluvalanu gurthu chesindi.Prasthuta samajaniki kalvasindi dabbu madam tho balisina vallu kadu,samskara dhanamatho veligevallu.Thanks much fr the article.
Sasi.
AMMA ODI గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం
హారం
చాలా బాగా చెప్పేరండి. మీకు మీ కుటుంబానికివినాయకచవితి శుభాకాంక్షలు.
ఇన్నాళ్ళకి నాకు నచ్చిన పోస్టు ఒకటి మీ దగ్గర కనపడింది.మీకు మనుషుల పట్ల కూడా ఇటువంటి అభిప్రాయం ఉంటే బాగుంటుంది. చెట్టులనీ, పుట్టలనీ ప్రేమిస్తారు,కానీ కొందరు మనుషుల్నెందుకు ప్రేమించరు? ప్రతి మనిషి ఒక ప్రత్యేక కారణం తో ఈ భూమి మీదకి వచ్చారని భావిస్తే ఎంత బాగుంటుంది?
వినాయక చవితి శుభాకాంక్షలు.
@ నీహారిక గారు,
చెట్టులనీ, పుట్టలనీ ప్రేమిస్తారు,కానీ కొందరు మనుషుల్నెందుకు ప్రేమించరు? ప్రతి మనిషి ఒక ప్రత్యేక కారణం తో ఈ భూమి మీదకి వచ్చారని భావిస్తే ఎంత బాగుంటుంది? -- అని ప్రశ్నించారు....చాలా బాగుంది..
కానీ చిన్న సంగతి ఒకటి మరచిపోయారు ...
చెట్టులు , పుట్టలు ఏవీ ఇతరులకు కీడు చెయ్యవు, పైగా తమకు వీలైనంత సహాయం చేస్తాయి. కానీ ,మీరు చెప్పిన "ఒక ప్రత్యేక కారణం తో ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు"... ఏమి చేస్తున్నారో..."ప్రత్యేకంగా" చెప్పాలా ?
అజ్ఞాత గారు: నెనర్లండి!
లక్ష్మణ్ గారు: కృతజ్ఞతలండి.
శ్రీరాం గారు: నా టపా మీకు నచ్చినందుకు సంతోషమండి! మమ్మల్ని అర్ధం చేసుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. :)
రిషి గారు: నెనర్లండి!
చిలమకూరు విజయమోహన్ గారు: కృతజ్ఞతలండి.
సత్యేంద్ర గారు: నెనర్లండి!
శశి గారు: మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు నెనర్లండి!
భాస్కర్ రామిరెడ్డి : ఎన్నాళ్ళకు భాస్కరుడొచ్చాడు?
భావన గారు: మీ ఫ్రెండ్ రామిరెడ్డి చెబితేనే చెబుతారా? :)
నీహారిక గారు: నెనర్లండి!
Post a Comment