అది మొదలు…. అంటే 2005 నుండి 2008 లో మేము ’అమ్మఒడి’ అనే ఈ బ్లాగు తెరిచే వరకూ మాకు ఏదో విధంగా వినబడ్డ మాట ఏమిటంటే – “మిమ్మల్ని పావుగా ఉపయోగించుకుంటున్నారు?" అని! చివరికి, ఈ వేధింపు విషయంలో మేం పెట్టిన అర్జీకి స్పందనగా, హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ’సింఘ్వీ’ నుండి వచ్చిన లేఖ తీసుకుని, మా మిత్రుడి ద్వారా ఓ న్యాయవాదిని కలిసి, న్యాయసలహా పొందేందుకు ప్రయత్నించినప్పుడు….. సదరు న్యాయవాది కూడా మాతో “మిమ్మల్ని ఎవరో పావుగా ఉపయోగించుకుంటున్నట్లుంది” అన్నాడు. ఎంతో పరిశోధనాత్మకమైన, గంభీరమైన భావప్రకటనతో మరీ చెప్పాడు. ఇంతకీ ఆ లేఖలో ఉన్న న్యాయపరమైన పదాల అర్ధం మాత్రం చెప్పలేదు. ‘హైదరాబాద్ ఉచితన్యాయసేవా సదన్ కే వెళ్ళి విషయం కనుక్కోండి’ అని సమాధానం చెప్పాడు.

మమ్మల్ని పావులుగా వాడుకోవటం ఏమిటి? ఉంటే నా శతృవు ఉండాలి. అంతేకాని ఇంకా ఎవరో ఎలా ఉంటారు? నిజానికి ఇలాంటి సంఘటనలతోనే మాకు నెం.5 వర్గం యొక్క ఉనికి గురించి అర్ధమయ్యింది. ఆ తర్వాతే దానిపైన మా అవగాహన పెరిగింది. ఇక దాని గురించిన సునిశిత పరిశీలన, మాతో రామోజీరావు సంభాషణ తీరు….. మాకు నకిలీ కణిక వ్యవస్థ గురించి, నెం.10 వర్గం గురించీ, నెం.5 వర్గం గురించీ, మా జీవితాల్లో ఈ రెండు వర్గాల ప్రమేయం గురించీ అవగాహన కలిగించింది.

ఇక, తనకి లొంగిపొమ్మని మమ్మల్ని రామోజీరావు మా మీద ఒత్తిడి చేసినప్పుడూ, అందుకోసం సామదాన భేద దండోపాయాలు మామీద ప్రయోగింపబడినప్పుడు, మేము రామాయణం నుండే స్ఫూర్తి, ధైర్యమూ పొందేవాళ్ళం. రామాయణంలో సీతాపహరణం ముందు, రావణుడు తాటకీ తనయుడైన మారీచుడి దగ్గరికి వెళ్ళి ’బంగారు లేడి’గా సీతారామలక్ష్మణులని గికురించమని అడుగుతాడు.

మారీచుడు “రాక్షస చక్రవర్తీ! శ్రీరాముడు అమిత పరాక్రమవంతుడు. నూనూగు మీసాల చిరుతప్రాయంలోనే, విశ్వామిత్ర యాగాన్ని కాపాడేటప్పుడు, అతడి బాణపు దెబ్బ రుచి చూశాను. నా తల్లీ సోదరులైన తాటకీ సుబాహులు అసువులు బాయగా, నేను పారిపోయి వచ్చి, ఈ అరణ్యంలో ఆశ్రమవాసం చేస్తున్నాను. అటువంటి శ్రీరాముడితో వైరం పెట్టుకోకు. ఆయన ఇల్లాలి జోలికి పోకు. వారి జోలికి వెళ్తే మృత్యువు జోలికి పోయినట్లే!” అంటాడు.

అందుకు రావణుడు ఉగ్రుడై “మారీచా! ఇప్పుడు నా ఆజ్ఞ పాటించి సీతాపహరణానికి సహకరించలేదో, ఇప్పుడు నా చేతుల్లోనే నీకు మృత్యువు దాపురిస్తుంది” అంటాడు.

దానికి మారీచుడు “బంగారు లేడిగా సీతారాములని మోసగించకపోతే నువ్వు చంపుతావు. మోసం బయటిపడితే శ్రీరాముడు చంపుతాడు. ఎటూ చావు తప్పనప్పుడు…. రాక్షసుడవూ, పరస్త్రీని మోహించి అపహరించ బూనుతున్న అధర్మపరుడవూ అయిన నీ చేతిలో చావటం కంటే, ధర్మమూర్తి, ఆడితప్పని వాడైన శ్రీరాముడి చేతిలో చావటం మేలు” అనీ, అనుకునీ….. బంగారు లేడి రూపం ధరిస్తాడు. తర్వాతి కథ మనకి తెలిసిందే!

’రాక్షసుడైన మారీచుడే అంత గొప్పగా, ధర్మబద్దంగా ఆలోచించినపుడు, గీత ఆచరించాలనుకునే మనం మాత్రం ఎందుకు అధర్మంతో రాజీపడాలి? వేధింపులకి భయపడి ఎందుకు వెనకడుగు వేయాలి? ఎవరైతే మనల్ని వేధిస్తున్నారో ఆ వర్గానికి ఎందుకు లొంగిపోవాలి? వేధింపులకి తట్టుకోలేక లొంగి పోయినా….. తర్వాత జరిగేది ఉపయోగించుకుని వదిలేయటమే! అంటే పావులుగా వాడుకోవటమే. ఎవరికైనా పావులుగా ఉపయోగపడటమే అయినప్పుడు, అది ధర్మం చేతిలో పావులుగా ఉండటం మేలు! తద్వారా భగవంతుడి చేతిలో పావులం అవుతాము. ధర్మపుబాటలోనే ఉంటాం. అది చాలు’ అనుకున్నాము.

అప్పటి నుండీ ’ఏదీ జరిగినా మనం నిమిత్తమాత్రులం. జరిగేదంతా మన మంచికే అనుకుందాం’ అన్న గీతాసారాన్ని మరింత వంటపట్టించుకునే సాధన చేశాము.

ఎప్పుడైనా కష్టాలు, మరీ కష్టంగా ఉన్నప్పుడూ, నిరుత్సాహం మమ్మల్ని బాగా ఆవరించినప్పుడూ ఇదే చెప్పుకుని ఒకరినొకరం ఉత్సాహపరుచుకుంటాం. 2001 లో, సూర్యాపేటలోని మా ఇంటి నుండి మేం వెళ్ళగొట్టబడినప్పుడు మా పాపకి ఆరేళ్ళు. 2003 లో శ్రీశైలంలో స్కూలు పెట్టేవరకూ మాది కాందిశీకుల వంటి జీవితమే! అందునా ఎందుకు ఇలా బ్రతుకు దుర్భరం అయ్యిందో కూడా అవగాహన లేని జీవితం! 2005 లో దాని గురించి అవగాహన కలిగాక మా పాపకి….. ఏదైనా పెద్దసమస్య వచ్చినప్పుడూ, తామసం డామినేట్ చేసి నిస్సత్తువా, నిద్రా ముంచుకు వచ్చినప్పుడూ, తిరిగి రజో గుణాన్ని ప్రేరేపించుకోవటానికి అంటే పోరాటస్ఫూర్తి తెచ్చుకోవటానికి…. ఒకటే చెప్పాము.

"చూడరా తల్లీ! ముగ్గురు సైనికులు యుద్ధం చేస్తూ కొండ ఎక్కుతున్నారనుకో! ముగ్గురి దగ్గరా ఎంతో కొంత లగేజీ ఉంటుంది. ముగ్గురూ పోరాడుతూనే ఉన్నారనుకో! గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఒకరు పోరాడ లేక సొమ్మసిల్లారనుకో! ఆ సైనికుణ్ణీ, అతడి లగేజిని కూడా, మిగిలిన ఇద్దరూ మోసుకుంటూ యుద్ధం చేయాల్సిందే. అప్పుడు ఉప్పుమూట వేసుకుని కొండ ఎక్కినట్లే! దాంతో ఓటమి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి యుద్ధంలో పోరాడే సైనికుడిలా ఉండు. ఉప్పుమూటలా ఉండకు” అని.

ఇక మా జీవితాల్లో నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుల ప్రమేయం, వాళ్ళతో మెదళ్ళతో యుద్ధం చేస్తున్న నెం.5 వర్గపు ప్రమేయమూ మాకు ఎలా అర్ధమయ్యిందంటే – 2005 తర్వాత కాలంలో, వెనక్కి తిరిగి చూసుకుంటే మా జీవితంలో అప్పటి వరకూ మేం అంతగా దృష్టి పెట్టని అసాధారణ సంఘటనలు చాలా కనబడ్డాయి. మాపై వేధింపూ కనపడింది. మాకు తెలియకుండానే, ఆ వేధింపులో, మాకు ఎంతో ప్రాణాంతకంగా పరిణమించిన సంఘటనలు అంతే అసాధారణంగా తప్పించబడటమూ కనిపించింది.

ఉదాహరణకి చెప్పాలంటే….. గతటపాల్లో వ్రాసినట్లు…. 2002 చివరి రోజుల్లో, మేం రెండోసారి శ్రీశైలం చేరేటప్పటికి మా చేతుల్లో పైసలు లేవు. బండిలో పెట్రోలు లేదు. ఇంకొంచెం వేధింపు కొనసాగి ఉంటే…. అంటే అప్పటికి పరిచయం ఉన్న ఖాసీం[భయ్యా] కుటుంబం మమ్మల్ని ఆదుకోకపోతే మా పని ఆగమ్య గోచరమే! [వాళ్ళ దగ్గర అప్పుడు, ఎప్పుడు ఒక్క పైసా అప్పుకూడా తీసుకోలేదు సుమండి!]

సరే, అది….. తామే కష్టం కలిగించి, అందులో నుండి ఆదుకునే ’ఒక ఆప్తుణ్ణి’ మనకి దగ్గర చేసి, సమాచారం తెలుసుకోవటం లేదా ఆధారపడేటట్లు చేసుకోవటం అన్న స్ట్రాటజీ అయి ఉండవచ్చు. లేదా అప్పటికి అతడిని స్వచ్చందంగా వదిలేసి, తరువాత కాలంలో సామదాన భేద దండోపాయాలతో లొంగ దీసుకొని ఉండొచ్చు. ఒకోసారి ఒకవ్యక్తిని, మొత్తంగా స్వేచ్ఛగా వదిలేసి మమ్మల్ని తికమక పెట్టటం జరుగుతుంది. ఏది జరిగినా అవతలి వ్యక్తి యొక్క మనఃస్థితిని బట్టే ఉంటుంది. లోభపడినా, భయపడినా, ధైర్యపడినా! దాన్నే మేం ‘మతిలో ఏది ఉంటే అదే గతిలో కనిపిస్తుంది’ అని అనుకుంటాము. కాబట్టి కూడా, ఒకవ్యక్తితో మా స్నేహం కాలగతిలో అతడి ప్రవర్తన బట్టే ఉంటుంది. ఎందుకంటే చల్లకొచ్చి ముంత దాచలేరు కదా! కొంతమంది మా నుండి ఏం ఆశించకుండా స్నేహం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా చాలా తక్కువమంది మాత్రమే!

ఓ సారి…. 2002, సెప్టెంబరు, అక్టోబరులలో….. అప్పటికి హైదరాబాద్ నానల్ నగర్ లో రేకుల గదిలో అద్దెకి ఉండేవాళ్ళం. అప్పటికే, దిల్ సుఖ్ నగర్ లోని సాయి స్టడీ సర్కిల్ లో ఇంటర్ విద్యార్ధులకి చదువు చెప్పడం, జీతం తాలుకూ చెక్కు బౌన్స్ కావటమూ, దానిపైన ఆ సంస్థ యజమాని ఇచ్చిన ’ఝలక్’ తీసుకోవటమూ…. అన్నీ అయిపోయాయి. ఆ ’ఎరా’లో హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క కాలేజీ గానీ, స్కూలు గానీ ఉద్యోగ ప్రకటన ఇస్తే ఒట్టు. మేముగా చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు దరిచేరి ఉన్న మా పెద్ద తమ్ముడు, మాకోసం చేసిన ఉద్యోగప్రయత్నాలు కూడా ఆశ్చర్యకరంగా ఫలించలేదు. మా చిన్నతమ్ముడు దారుణ అవమానం చేసి మరీ, మరోసారి తమ ఇంటికి రావద్దని చెప్పేసాడు.

నిస్సహాయస్థితిలో నిజామాబాద్ జిల్లా ’నిర్మల్’లో ఉన్న బాల్య స్నేహితుడి సాయం కోసం హైదరాబాదు నుండి నిర్మల్ కు స్కూటర్ మీద బయలు దేరాము. [బస్ ఛార్జి కన్న ఇదే చౌక!] అప్పటికి మాకున్న ఆస్థి అది ఒక్కటే! వెళ్ళే ముందు, మరో స్నేహితుడిని ’నిర్మల్’ మిత్రుడి వివరాల గురించి అడిగాను. అంతకు రెండు నెలల క్రితం ఆనారోగ్య కారణాల రీత్యా సిటీకి వచ్చాడని, శస్త్రచిక్సిత కూడా జరిగిందనీ, నాకు ఫోన్ లేనందున సమాచారం ఇవ్వలేక పోయామనీ….. అన్నీ చెప్పాడు గానీ, సదరు మిత్రుడికి నిర్మల్ నుండి బదిలీ అయ్యిందని చెప్పలేదు. అంతకు 1 ½ సంవత్సరం క్రితం, నిర్మల్ స్నేహితుడు నాకు కొద్దిపాటి సాయం చేసాడు. అదీ దాదాపు పది సంవత్సరాల తర్వాత అతణ్ణి పలకరించాను. పదేళ్ళకు పైగా బదిలీ లేకుండా నిర్మల్ లోనే ఉండటంతోనూ, బదిలీ గురించి నాతో మరే మిత్రులూ చెప్పకపోవటంతోనూ భరోసాగానే వెళ్ళాం.

మేము అక్కడికి చేరేసరికి రాత్రి ఏడు గంటలు దాటింది. తిరిగి వచ్చేందుకు మా దగ్గర బండిలో పెట్రోలు పోయించుకోవటానికి మాత్రమే డబ్బు ఉంది. తీరా అక్కడికి వెళ్ళాక తెల్సిందేమిటంటే నా మిత్రుడికి బదిలీ అయి, వరంగల్ జిల్లాకు వెళ్ళిపోయాడని! ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. మారిన ఫోన్ నెంబరు కావాలంటే, ‘ప్రధాన వీధిలో నామిత్రుడి భార్యకు బంధువు ఉన్నారు కలవమని’ నా మిత్రుడి గతపు పొరుగు వారు చెప్పారు. అక్కడికి వెళ్ళి, అతణ్ణి కలిసి నెంబరు అడిగాము. నెంబరు తీసుకుని ఫోన్ చేస్తే నా మిత్రుడు దొరకలేదు. అతడి భార్య ముభావంగా సమాధానం చెప్పింది. ఏమనాలో తోచక మామూలు క్షేమ సమాచారం మాట్లాడి పెట్టేసాం.

ఇక దైవం మీద భారం వేసి తిరుగు ప్రయాణానికి సిద్దపడ్డాము. అప్పటికి రాత్రి దగ్గర దగ్గరగా తొమ్మిది గంటలై ఉంటుంది. మా దగ్గరున్న డబ్బులతో హైదరాబాద్ కు తిరుగుప్రయాణం చేయగలం గానీ, రాత్రికి మాత్రం అక్కడే బస చేయలేము. హైదరాబాద్ చేరుకుని ’రేపటి సంగతి రేపు చూద్దాం!’ అనుకుని బయలు దేరబోతున్నాము.

మా మిత్రుడి బంధువూ, మరొకతనూ వచ్చి “ఇంత రాత్రి వద్దండి. రేపుదయం వెళ్ధురు గానీ” అన్నారు. మేం నవ్వేసి బండి తీసాము. వాళ్ళకి మా పరిస్థితి అర్ధమయినట్లుంది. మేమయితే మా పరిస్థితి గురించి ఏం చెప్పలేదు. గుంభనంగానే ఉన్నాం. వద్దంటే వద్దని వాళ్ళు మమ్మల్ని ఆపేసారు. వాళ్ళే హోటల్ లో గది తీసుకుని, రాత్రికి భోజనం ప్యాక్ తీసుకుని మా గదికి వచ్చారు. నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మర్నాడు ఉదయం బయలుదేరి హైదరాబాద్ కు వచ్చాము. హైదరాబాద్ వచ్చాక, నిర్మల్ మిత్రుడి గురించి సమాచారం ఇచ్చిన మిత్రుణ్ణి, బదిలీ గురించి అడిగితే “నీకు తెలుసు అనుకున్నా” అంటూ సమాధానం చెప్పాడు.

ఆ తర్వాత రెండునెలలూ అష్టకష్టాలూ పడ్డాక శ్రీశైలం చేరాం. తర్వాత ఆరునెలలకి శ్రీశైలంలో చిన్న స్కూలు పెట్టాము. ఆ తర్వాత నిర్మల్ లోని ఆ సహృదయుడికి డీడీ తీసి, హోటల్ గదికి ఖర్చు అయిన డబ్బు పంపిస్తూ, “ఆ రోజు మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు మాటలతో చెప్పలేను. ఎందుకంటే – ఎంత సహాయం చేశారు అన్న దానికంటే ఏ పరిస్థితిల్లో ఎలాంటి సహాయం చేశారు అన్నది ముఖ్యం. ఈ డబ్బు మీకు ఎందుకు పంపిస్తున్నామంటే, భవిష్యత్తులో మీరు ఇంకెవరికైనా సాయం చేసేటప్పుడు ఈ స్ఫూర్తి మిగిలి ఉండాలని” అని వ్రాసాను.

ఇలాంటి సంఘటనలు మా జీవితంలో చాలా ఉన్నాయి. ఆరోజు, అక్కడ, మాకు ఇంకెవ్వరూ సాయం చేయకపోతే మా స్థితి దారుణమే! అలా ’Extreem Situations’ లో ఆశ్చర్యకరంగా అనండీ, అద్భుతరీతిలో అనండి, మొత్తానికి మేమైతే రక్షింపబడేవాళ్ళం. ఆ విధంగా భగవంతుడి పట్ల, ధర్మం పట్ల మా నమ్మకం చెక్కుచెదరకుండా రక్షింపబడేది.

ఇలాంటి వన్నీ పునఃసమీక్షించుకున్నాకే….. 2005 లోనూ, 2006 లోనూ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కీ, యూపిఏ ప్రభుత్వ కుర్చీవ్యక్తి సోనియాకీ, అప్పటి రాష్ట్రపతి కలాం గారికీ ఫిర్యాదులు వ్రాసినప్పుడు ‘మమ్మల్ని వేధించి మరీ తెలుసుకోవలసిన గండికోట రహస్యాలేవీ మా దగ్గరలేవని, మా జీవితం తెరచిన పుస్తకం వంటిదనీ’ వ్రాసాము. ఆయా ఫిర్యాదుల కాపీలు మా ఆంగ్ల బ్లాగు Coups On World లోనూ, Fire Pot లోనూ మీరు పరిశీలించి ఉన్నారు.

నిజం చెప్పాలంటే – జీవితంలో మమ్మల్ని వేధించిన వాళ్ళు ఎక్కువమందే ఉండవచ్చు గాక, నమ్మించి మోసగించిన వాళ్ళు ఎక్కువమందే ఉండవచ్చుగాక, అదే సమయంలో మంచితనం మీద, మానవత్వం మీదా, భగవంతుడి మీదా, మాకున్న నమ్మకాన్ని నిలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వేధించిన వాళ్ళ సంఖ్యాబలం ఎక్కువ, ఆదుకున్న వారి సంఖ్యాబలం తక్కువ ఉండింది.

ఎవరైనా….. వారివారి మనస్తత్వాలని బట్టే స్పందిస్తారు. ఎవరైనా మాపట్ల అభిమానం, గౌరవం వంటి పాజిటివ్ భావాలతో స్పందించి మాతో స్నేహం చేసినా, మాకు సాయం చేసినా…. మొదట బాగానే ఉంటుంది. క్రమంగా గూఢచర్యం వచ్చి వాలుతుంది. నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుల తాలూకూ ఒత్తిడి, మాతోపాటు మా పైన గౌరవాభిమానాలు చూపిన వారి మీదకీ, మాకు సాయం చేసిన వారి మీదికీ వచ్చి చేరుతుంది. అది ఒకోసారి డైరెక్ట్ కావచ్చు, లేదా ఇన్ డైరెక్ట్ కావచ్చు! ఆయా వ్యక్తుల సంకల్పాన్ని బట్టే తదుపరి వ్యవహారం ఉంటుంది. అంటే భయపడితే భయపెట్టటం, ప్రలోభపడితే ప్రలోభపెట్టటం, ధైర్యంతో వ్యవహరిస్తే ఎవరు ఏమీ చేయలేకపోవటం అన్నది జరుగుతుంది. మా ఈ పరిశీలన సుదీర్ఘమైనది.

మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా వేధించిన వారిని వదిలేస్తే, మాకెదురైన వారెవరైనా…. మొదట మానవసహజమైన మంచితనమే చూపించారు. ఆపైన నకిలీ కణికుడి సామదాన భేద దండాలని దాటి మాకు సాయంగా నిలబడిన వారు అరుదు.

మాకు ఎప్పుడూ కూడా ఒకటే చెప్పబడింది. ’ప్రపంచంలో అందరూ స్వార్ధపరులే! ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకుంటున్నారు. రోజులే అలా మారిపోయాయి. దేశం, ధర్మం, గీత, నీతి, తొక్కా….. అంటూ మీరే, మీ జీవితాలని వృధా చేసుకుంటున్నారు. కావాలంటే మీ చుట్టూ చూడండి. డబ్బుకోసం ఏం చెయ్యాటానికైనా సిద్దపడుతున్న వాళ్ళే కదా ఉన్నారు? నిక్కచ్చిగా వేధిస్తున్న వాళ్ళైనా డబ్బుకోసమే చేస్తున్నారు. స్నేహం పేరుతో నమ్మించి మోసం చేస్తున్న వాళ్ళైనా డబ్బు కోసమే చేస్తున్నారు. ఇప్పటికైనా మీ గురించి మీరు ఆలోచించుకోండి!’ – ఇదే బ్రెయిన్ వాష్!

సంవత్సరం క్రితం ఈ బ్లాగు ప్రపంచంలోని వచ్చే వరకూ కూడా ఇదే! అందుకే మా బ్లాగులోని గతటపాలలో “మా చుట్టూ ఉన్న ఈ ఎడారి కృత్రిమమైనది. దీనికి ఆవల మానవత్వం అనే ఒయసిస్సు ఉంది” అని వ్రాసాను. బ్లాగులోకంలోకి వచ్చాకే, మనలా ఆలోచిస్తున్న వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు అన్న నమ్మకం కలిగింది. ఏ వ్యక్తి అయినా మీడియానే నమ్ముకుని ఉంటే, ఆ మీడియా పెట్టిన కళ్ళజోడు నుండే చూస్తుంటే, ప్రపంచం మొత్తం వాళ్ళు చూపించినట్లే ఉంటుంది.

మొదట జాలంలో పెట్టాలని ఆంగ్లంలో వ్రాయటం ప్రారంభించాను. అప్పటికే మాకు నెట్ కనెక్షన్ ఉంది. దానిని మొదట పత్రికలు చూడటానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళం. బ్లాగుల గురించి తెలిసినా, అవి ఎలా చూడాలో కూడా తెలియదు. ఒకరోజు మా పాప కూడలిలో జోక్స్ చూసి, "మమ్మీ, మమ్మీ! ఇక్కడ జోక్స్ చూడు చాలా బాగున్నాయి” అంటూ చెప్పింది. ఒకమాటలో చెప్పాలంటే కూడలిని మా పాపే పరిచయం చేసింది అనవచ్చు. మొదటగా బ్లాగులంటే అవగాహన కలిగింది. వాదప్రతివాదనలు చదివేవాళ్ళం. దాదాపు 6 నెలలు గమనించి ఉంటాము. కామెంట్ అయితే ఇచ్చేవాళ్ళం కాదు. ఎలా కామెంట్ ఇవ్వాలో కూడా తెలియదు మరి! తరువాత ’అమ్మఒడి’తో మా బ్లాగు వ్రాతలు ప్రారంభమైనాయి.

ఈ బ్లాగు ప్రారంభించి నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు స్ట్రాటజీలని వెల్లడించటం ప్రారంభించిన తరువాత, బ్లాగు డిలీట్ చేయమన్న మాట సామదాన భేద దండోపాయాలతో చెప్పబడేది. రకరకాల విన్యాసాలతో చెప్పబడేది. కార్యకారణ సంబంధాలు మాకింకా స్పష్టపడలేదు గానీ, గమనిస్తే…. ఈ స్ట్రాటజీలు వెల్లడించటం ప్రారంభించాకే మాకు వేధింపుల నుండి వెసులుబాటు కలిగింది. ఉన్నదేదో ఆర్ధిక ఒత్తిడే! అదికూడా దాటగలమన్న నమ్మకం ఉంది.

అయితే ఇలాంటి ఒత్తిడుల సాగరాన్ని దాటటానికి కూడా గీతే మా నౌక. సమస్యల చీకట్లు చుట్టుముట్టునప్పుడు గీత తెరిస్తే,

శ్లోకం:
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్

భావం:
వేరే ఆలోచనలు లేకుండా నిత్యమూ నన్నేనమ్ముకొని, నా ధ్యానంలోనే ఉంటూ, నన్నే సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను.

పై భావం వచ్చేది. దాంతో భగవంతుడి మీద భారం వేసి, మా ప్రయత్నం మేం చేస్తూ పోయేవాళ్ళం. అలాగే ఈ 17 ఏళ్ళు నడుచుకుంటూ వచ్చాం. ఇలాంటి స్థితులలోనే…. ఎప్పుడైతే నమ్మకం సన్నగిల్లిన స్థితిలోకి జారతానో, ఆ క్షణమే భయమూ ఆందోళనా నన్ను ఆక్రమించటం ప్రారంభించేవి. మళ్ళీ నమ్మకం ధృఢ పరుచుకున్న క్షణంలో, అప్పటిదాకా ఉన్న దుఃఖం తామసం స్థానే, పోరాట స్ఫూర్తి రజోగుణం ద్విగుణీకృతమయ్యేవి.

ఆ విధంగానే ఈశావాస్యోపనిషత్తుకూ, కేనోపనిషత్తుకూ కూడా శాంతిమంత్రమైన శ్లోకం

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే

ఓం శాంతిః శాంతిః శాంతిః

యొక్క సారాంశం నాకు నాదైన పద్దతిలో అవగతమైంది. అందుకే విద్యారంగంపై నకిలీ కణికుడి కుట్రని వివరిస్తూ వ్రాసిన నా గతటపాలో, పై శ్లోకంలోని పూర్ణం నాకు భగవద్భావనగా కనబడిందని వ్రాసాను. ఎందుకంటే ఎప్పుడు నేను భగవంతుడి మీద నమ్మకం సన్నగిల్లిన స్థితిలో ఉంటానో అప్పుడు భగవంతుడు నాకు శూన్యుడు. ఎప్పుడు నమ్మకం ధృఢ పరుచుకుంటానో అప్పుడు భగవంతుడు నాకు పరిపూర్ణుడు.

అనుభవాల పాఠాలలో, తొలిరోజుల్లో తరచుగా నమ్మకం కోల్పోతుండేదాన్ని. రానురాను అటుపోట్లకు రాటు దేలతాం కదా! క్రమంగా నమ్మకం ధృఢ పడింది. అందుకే వివేకానందస్వామి “గీత జీవితకాలపు సాధన” అన్నాడనిపిస్తుంది. కాబట్టే, మాపై రామోజీరావు వేధింపు, మాకు ’గీత’ని మరింతగా సాధన చేసే అవకాశాన్ని ఇచ్చిందని గతటపాల్లో వ్రాసాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

మీరు చెప్పిన అన్నిమాటలతోనూ ఏకీభవిస్తానండీ!

రాఘవ గారు,

కృతజ్ఞతలండి!

మాపై రామోజీరావు వేధింపు, మాకు ’గీత’ని మరింతగా సాధన చేసే అవకాశాన్ని ఇచ్చిందని--
ఆ విధంగా మీరు రామోజీరావుకి ఋణపడి ఉన్నారన్నమాట . ఇలా అనుకుంటే ఎంత ఊరటగానూ , హాయిగాను ఉంటుందో చూడండి.

వేదుల బాలకృష్ణ[నరసింహ] గారు,

మేము ’ఏది జరిగినా మన మంచికే’ అన్న స్థితికి వచ్చి చాలాకాలమే అయ్యిందండి. అందుచేత ఊరట, శాంతి, సంతోషం వంటి విషయాల్లో మాకు ఢోకా లేదు. అయితే ఈ విషయంలో మీరన్నట్లు రామోజీరావుకి ఋణపడి ఉండటం లేదా కృతజ్ఞత కలిగి ఉండటం గట్రా గట్రాలు మాత్రం ఉండదు. ఎందుకంటే, మమ్మల్ని వేధించటంలో అతడి సంకల్పం, మాకు గీత సాధన చేసే అవకాశం కల్పించాలని కాదు. మమ్మల్ని వేధించటంతో అతడి ప్రయోజనాలు అతడివి. కాబట్టి, మేం గీతని సాధన చేయటానికి అతడి వేధింపు మాకు అవకాశం ఇచ్చి ఉండవచ్చుగాక, కానీ అందుకు అతడి నిమిత్తం ఏమీ లేదు. అది మాపై భగవంతుడి కృప మాత్రమే – అన్నది మా అభిప్రాయము. వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లండి!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu