మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి పై పోరాటం చేస్తాడట అదీ బాపూఘాట్ సాక్షిగా ప్రతిన బూనాడట. తొలి పేజీ వార్తగా ‘ఈనాడు’ ప్రచురించింది. తద్వారా తమ లజ్జారాహిత్యాన్నే కాదు, జనాలు గొప్ప ‘గజనీ’లన్న తమ నిశ్చితాభిప్రాయాన్నీ వెళ్ళబుచ్చారు… ఈ రాజకీయ-మీడియా ముఖ్యులు!
అదేదో తన హయాంలో ధర్మం నాలుగు పాదాలా నడిచినట్లు, నీతిని తాను నేల నాలుగు చెరుగులా నడిపినట్లు చంద్రబాబు ప్రకటించటం, ‘ఈనాడు’ పెద్దచ్చరాల్లో ప్రచురించటం!
ఆరేళ్ళ క్రితం అయ్యవారి అవినీతి నానాటికి పెచ్చరిల్ల బట్టే…అది+ వ్యవసాయ స్థితిగతులు చూపెట్టి, పంచె ఎగ్గట్టి, వై.యస్సార్ పాదయాత్ర ప్రారంభించాడు. అతడి అవినీతి ఇతడికి కలిసి వచ్చిందన్నట్లు, చంద్రబాబు వ్యతిరేక ఓట్లు మూటగట్టుకొని ముఖ్యమంత్రై, ‘అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు, మరికొన్ని వేల కోట్లు మింగి, దారుణ మరణం పాలయ్యి, కొడుక్కి ‘మహానేత’ అయిపోయాడు.
‘పత్రికలు తమ చేతిలోది, ప్రజల జ్ఞాపక శక్తి తాత్కాలికమైనది’ అనుకొని, చంద్రబాబు అవినీతిపై పోరాడతాననటం, ఈనాడు ‘అదిగదిగో చూడండంటూ’ ప్రచురించటం గాకపోతే…
చంద్రబాబు అవినీతి మీడియాకి తెలియదా, గుర్తు లేనిదా?
ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. నా స్వానుభవం లోనిది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో 1997 ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అప్పటికి నేను నంబూరు పల్లెలో కమిటీ కాలేజీలో పని చేస్తున్నాను. ‘ఇక పరీక్షలై పోతాయి, ఎంచక్కా సెలవలొస్తాయి’ అనుకుంటూ ఉన్నాం. ఆ రోజు లెక్కల పరీక్ష జరిగింది. సాయంత్రం టీవీ స్క్రోలింగ్ లో ‘పేపర్ అవుట్ అయ్యిందనీ, పరీక్షలు తిరగ బెడతారనీ’ ప్రకటన వచ్చింది.
అదే రామబ్రహ్మం కేసు! కొన్ని రోజుల పాటు పేపర్లలో పతాక శీర్షికల్లో వార్తగా ఉండిన కేసు! కోల్ కతా (అప్పటికి కలకత్తానే) ప్రెస్ నుండి రామబ్రహ్మం ప్రశ్నాపత్రాలు పట్టుకొచ్చాడని…అదనీ ఇదనీ చాలానే వ్రాసారు.
ఆ దెబ్బతో… ప్రైవేట్ కాలేజీలని, చంద్రబాబు, అర్జంటుగా క్రమబద్దీకరించాడు.
అప్పటికి ప్రైవేటు జూనియర్ కాలేజీల పరిస్థితి ఏమిటంటే –
ఓ రెండంతస్థుల బిల్డింగ్ అద్దెకి తీసుకొని (గుంటూరు వికాస్ సోమయ్య బిల్డింగ్ లాంటిదన్నమాట) ఓ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాధ్స్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ లెక్చరర్లు నలుగురు కలిసి, ఓ ఇద్దరు భాషా అధ్యాపకుల్ని తోడుగా తీసుకొని, ప్రభుత్వానికి విద్యార్ధికి ఓ వెయ్యి రూపాయల ఫీజు కడితే చాలు… ఓ కాలేజీ నడిపేయవచ్చు.
కాలేజీలు నడుపుతున్న యజమాన్యాలకు కూడా… పాఠాలు బాగా చెప్పగల లెక్చరర్ పట్ల కొంత జాగ్రత్త ఉండేది. “ఎందుకొచ్చింది! బాగా చెబుతారన్న పేరున్న లెక్చరర్లు మనకి కావాలి. అదీగాక, చెప్పగల సత్తా ఉన్న లెక్చరర్ కి, మనం తగినంతగా జీతం ఇవ్వకపోతే… బయటకి పోయి స్వంత కాలేజీ పెట్టుకున్నాడంటే – మనం ఇచ్చే జీతం వారా ఫీజులు రాకపోవు. మనకే రిస్క్” అనుకుంటూ… కొంత గాకపోతే కొంతన్నా ‘మంచి పేమెంట్’ ఇచ్చేవాళ్ళు, మరికొంచెం ఎక్కువగానే ‘గుడ్ డీల్’ చేసేవాళ్ళు.
రామబ్రహ్మం పైకారణంతో, చంద్రబాబు, కాలేజీలని క్రమబద్దీకరించాక… శ్రీ చైతన్య లూ, నారాయణలూ తెగ బలపడి పోయి… శ్రీ చైతన్యలు సురేష్, విద్వాన్, విజ్ డమ్ లనీ మింగేసి తమలో విలీనం చేసుకున్నట్లూ,
‘కోరా’ లని రత్నంలు విలీనం చేసుకున్నట్లూ, రత్నం లాంటి కోచింగ్ సెంటర్లని మరో xyzలూ…వెరసి చిన్నా చితకా కాలేజీలు రాలిపోయి, కార్పోరేట్ కాలేజీలు మిగిలి పోయాయి.
కాలేజీల యజమాన్యాలు, లెక్చరర్లని… “తొక్కలోది మీరు చెప్పినందుకే, మాకు ర్యాంకులూ, మార్కులూ వొచ్చాయనుకుంటూన్నారా? మా లాబీయింగు మాకుందమ్మా!” అన్న డీల్ చేయటం మొదలై, తర్వాత్తర్వాత అదే నికరమై కూర్చొంది.
ఇంతా చేసి ‘రామబ్రహ్మం శిక్షించబడ్డాడా?’ అంటే – అదీ లేదు. ఆ కేసు నేపధ్యంలో అప్పటికి గుంటూరు ఎస్.పి.గా ఉన్న ఏ.కే.ఖాన్ (ఇప్పటి నగర పోలీసు కమీషనర్) కు, గుంటూరు వికాస్, సిద్దార్ధ గట్రా యాజమాన్యాలు, రాత్రికి రాత్రి కోట్లు గుమ్మరించాయని మా లెక్చరర్ల వర్గంలో ఓ ‘రూమర్’ పాకింది. నిప్పులేనిది పొగరాదన్నట్లు అందులో చాలానే నిజముంది.
విశేషమేమిటంటే – ఆ తర్వాత నాలుగైదేళ్ళకు కూడా ‘రామబ్రహ్మం’ ప్రభ తరగలేదు, సరికదా పెరిగి పోయింది. ఎంతగా అంటే – నాగార్జున విశ్వవిద్యాలయానికి రామబ్రహ్మం ఏవో పనుల నిమిత్తం [అంటే లాబీయింగ్ అన్నమాట] వచ్చాడంటే…ముందో రెండు, వెనకో రెండు కార్లతో, కాన్వాయ్ వేసుకుని వచ్చేవాడు. ఇది నాకు స్వయంగా తెలిసిన సమాచారం. మా మిత్రులు విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళీ విషయంతో బాటు మరికొన్ని వివరణలు కూడా ఇచ్చారు.
అదీ చంద్రబాబు గారి, తెర వెనక సహకారం అవినీతికి! అలాగ్గాక, తాను నీతికి నిలబడే వాడే అయితే, 1997 లోని రామబ్రహ్మాన్ని, పేపరు లీకుల కేసు వ్యవహారాన్ని, 2004లో దిగే వరకూ ఎందుకు తేల్చలేదంట?
‘రామబ్రహ్మం’ అనబడే ఓ వ్యక్తిని పైకారణం(over leaf reason) పెట్టుకుని, పేపర్ లీకు వ్యవహారాన్ని తెర మీదకు తీసి, ఆ నెపంతో ప్రైవేటు కాలేజీలని క్రమబద్దీకరిస్తున్నానంటూ… అవినీతిని(ఇంటర్ పేపర్ లీక్, ర్యాంకుల ఫిక్సింగ్) సెంట్రలైజ్ చేసుకుని, సొమ్ము పిండుకున్న వెన్నుపోటు చక్రవర్తి ఈ చంద్రబాబు. మామకే కాదు, ప్రజలకూ ఇతడు ప్రతి విషయంలో చేసింది వెన్నుపోటు పరిపాలనే!
అలాంటి వెన్నుపోటుల్లో రామబ్రహ్మం కేసు ఒకటి. ఆ దెబ్బతో… ప్రైవేటు జూనియర్ కాలేజీలు కాస్తా కార్పోరేట్ జూనియర్ కాలేజీలై పోయాయి. చంద్రబాబు నాయుడే అధికారంలో కొనసాగి ఉంటే ‘బి సెంటర్ల’లలో కూడా… చిన్న కాలేజీలు మాయమై, శ్రీ చైతన్య, నారాయణ వగైరా కార్పోరేట్ కాలేజీలే వెలిగి పోతుండేవి.
తమ జీతాలు పెంచమని, హక్కుల కోసం ఉద్యమించిన అంగన్ వాడీ కార్యకర్తలని, ఆడవాళ్ళని కూడా కనికరం లేకుండా విరగ బాధించిన చంద్రబాబు…
కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఉద్యమాలు చేసిన ప్రజల మీద పోలీసు కాల్పులు జరిపిన చంద్రబాబు…
ఈ రోజు బాపూఘాట్ దగ్గర, గాంధీజీ పేరు చెప్పుకుంటూ, ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాడు. వాటిని విరగ ప్రచారం కావిస్తున్నది రామోజీరావు పత్రిక ‘ఈనాడు’.
ఎటూ ఇదంతా ప్రజలకి గుర్తుండదనీ, జనాలు గొప్ప ‘గజనీ’లనీ చంద్రబాబు, రామోజీరావుల అభిప్రాయం! తమ ప్రచారంతో… ప్రజలకి ‘నిన్న జరిగింది ఈ రోజు మరిపించగలం’ అన్నది ఈనాడు నమ్మకం. వెరసి రాజకీయ నాయకులూ, మీడియా కింగులూ కలిసి నడిపిస్తున్న మహా నాటకమే నేటి రాజకీయం!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
13 years ago
4 comments:
hmm nice post.. but a small correction vidwan(guntur) mundu vikas lo kaliparu tarvata srichaitanya lo kaliparu anukunta.. nenakkade chadivanu
"వేల కోట్లు మింగి"...
లక్షల కోట్లు అని అనాలేమొ!.
http://24gantalu.blogspot.com/2011/01/blog-post_31.html
ప్రేమిక గారు: నాకు గుర్తుండి విద్వాన్ న్ని శ్రీచైతన్య టేక్ ఓవర్ చేసిందండి. ఒకవేళ నేనేమైనా పొరపాటు పడ్డానేమో! :)
అజ్ఞాత గారు: నిజమేనండి లక్షల కోట్లు అనాల్సిందే!
రెండవ అజ్ఞాత గారు: మంచిలింకు ఇచ్చారు. నెనర్లు!
Post a Comment